top of page
Writer's pictureYasoda Pulugurtha

పెళ్లిచూపులు


'Pelli Chupulu' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

చైత్ర ఆ రోజు ఆఫీసుకని బయలుదేరుతుంటే, వసంత వెనుకనుండి, గుర్తుచేస్తోంది.. “చైత్రా! నిన్న రాత్రి మీ నాన్న చెప్పిన విషయం గుర్తుందిగా! ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారని !”

ఈ మాట వినగానే రుసరుసలాడుతూ.. “అబ్బబ్బ.. అమ్మా! ఎన్నిసార్లు ఇలాగ ? నెలలో రెండుసార్లు పెళ్లి చూపులు, తొందరగా వచ్చేయమంటే ఎలా అమ్మా ? నాకు పర్మిషన్ దొరకద్దా?”

“అలా అంటే ఎలా చైతూ? వచ్చిన సంబంధాలు ఏమీ నచ్చడం లేదంటావు. ఏదో ఒక వంక పెడుతూనే ఉంటావు కదా !”

“అమ్మా! ఊరికే కావాలని వంకలు పెడుతున్నట్లు మాట్లాడతావే ? కిందటి వారం వచ్చిన పెళ్లి సంబంధంలో అతని తల్లి ఏమందో విన్నావా? పెళ్లైనాక ఉద్యోగం చేయకూడదంది. అతను ఆవిడ మాట్లాడిన మాటలకి బుద్దిగా తలవంచుకుని కూర్చున్నాడు. నాలుగు సంవత్సరాల నుండి మంచి కంపెనీలో పనిచేస్తున్న నన్ను ఉద్యోగం చేయొద్దనడానికి ఆవిడ ఎవరమ్మా? కష్టపడి చదువుకుని, ఎంతో కాంపిటీషన్ లో సంపాదించుకున్న ఉద్యోగాన్ని, అతి మామూలుగా ఉద్యోగం మానేయమనగానే ఆవిడ చెప్పిన ప్రకారం పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం మానేయలా ? ఇటువంటి సంబంధాన్ని నేను ఏదో చేతులారా వదిలేసుకున్నట్లు మాట్లాడతావేమిటీ !

అంతకు ముందు నన్ను చూసుకోడానికి వచ్చిన అబ్బాయికి అతని కంటే నాకు శాలరీ ఎక్కువ అని, ‘ఏమైనా బేధాభిప్రాయాలు వస్తే ఇద్దరి మధ్యా?’ అని మాట్లాడాడు ఆ అబ్బాయి తండ్రి.. ఆ అబ్బాయి బదులు అతని తండ్రే అలా అనేసుకుంటే ఎలాగమ్మా ? పోనీ ‘ మీరిద్దరూ కలసి ఆలోచించుకుని నిర్ణయించుకోండి’ అనైనా మాకు చెప్పాలి.. మా అభిప్రాయాలతో సంబంధం లేనట్లు ఆయన నిర్ణయించేస్తే ఎలాగ ? ఇటువంటి సంబంధాలని నేను ఓకే అనాలా?” అంటూ రుస రుస లాడింది చైత్ర !

“సరేలే చైతూ! ఏదో ఒక లోపం లేకుండా అన్నీ కరెక్ట్ గా మనం అనుకున్నట్లు దొరుకుతాయా ? ఎక్కడో ఒకచోట కాంప్రమైజ్ అయిపోవాలి. రెండు సంవత్సరాల నుండి చూస్తున్నా ఏదీ కుదరడంలేదు. తల్లితండ్రులుగా మేము కంగారు పడటం సహజం. సరేగానీ ఆఫీస్ బస్ వెళ్లిపోతుంది. ఈ మాటలన్నీ ఎప్పుడూ ఉండేవేలే” అనగానే,

“ఆ.. అమ్మా! అతను సాయంత్రం వస్తాడని చెప్పావే, ఏ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడుట?” అనగానే వసంత ‘ఏమో చైతూ! సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ట. ఐఐటి లో ఎమ్ టెక్ చేసాడుట. అయిదు సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నట్లు చెప్పారు నాన్న. ఏ కంపెనీనో ఏమో నాకు తెలియదు మరి ! నాన్న ఆఫీస్ కు ఫోన్ చేసి కనుక్కో !”అంది.

“ఆ.. ఏమీ లేదులే, ఒకే ఆఫీస్ అయితే పర్మిషన్ పెట్టుకోకుండా అక్కడే ఈ చూపులూ అవీ కానిచ్చేయచ్చు కదా అని ! “

“మరీ చోద్యంగా మాట్లాడతావే చైతూ.. మీ ఇద్దరూ చూసుకుంటే సరిపోతుందా, పెద్దవాళ్లం.. ఆ అబ్బాయి వైపు వాళ్లూ, మేమూ చూడద్దూ” అనగానే..”ఆ అవునమ్మా! చేసుకునేది మీరేగా మరి” అంటూ రుసరుసలాడుతూ వెళ్ళిపోతున్న చైతూ వైపు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ చూస్తూ ఉండిపోయింది వసంత !

ఏమిటో చైత్రకు టైమ్ కలసి రావడం లేదేమో అన్నట్లుగా ఉద్యోగం వచ్చినప్పటి నుండీ పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నా ఏదీ కలసిరావడం లేదు. పోనీ చైత్ర బాగుండదా అనడానికి లేదు. చైత్ర అందంగా, చూడగానే మరోసారి చూడాలన్నట్లు గా ఉంటుంది. చదువులో టాపర్ ! ఇంటర్ లో స్టేట్ రాంక్. అలాగే ఎన్..ఐ..టి వరంగల్ లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి కేంపస్ లో డెలాయిట్ లో సెలెక్ట్ అయి నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తోంది. చైత్ర చాలా ఎఫిషియంట్ లేడీ అని కంపెనీ లో మంచి పేరు ఉంది. ఒక చక్కని టీమ్ లో ఉంటూ, ఎప్పటి పని అప్పుడు పూర్తి చేస్తూ, ప్రాజక్ట్స్ ను సకాలంలో పూర్తి చేసే చైత్ర ఆ టీమ్ కే ఒక ఎస్సెట్ ! అటువంటి చైత్రకు వచ్చే సబంధాలన్నీ నిజానికి చైత్ర కంటే తక్కువ ప్రొఫైల్ ఉన్నవి ! అమెరికా సంబంధాలు చాలా వస్తున్నాయి, కాని చైత్రకు ఇష్టంలేదు అమెరికా సంబంధాలంటే!

'పెళ్లి చేసుకున్నాక అమెరికా వెళ్తాం కానీ, అమెరికాలో సంబంధం చూసి, పెళ్లి చేసేసుకుని అతనితో వెళ్లలేను' అంటుంది. ఏమిటో చైత్ర స్వభావం అర్ధం కాదు !

నిజానికి ఆఫీస్ లో చైత్రకు పని బాగా ఉంది. రెండురోజుల్లో అమెరికాలోని క్లైంట్ కు ప్రాజెక్టు పూర్తి చేసి సబ్మిట్ చేసేయాలి. టీమ్ అంతా హడావుడిగా పని చేస్తున్నారు. ఎవరూ కూడా ఒక నెలరోజుల నుండీ సెలవు పెట్టకుండా వస్తున్నారు ఆఫీస్ కు ! ఇంత హడావుడిగా పనితో సతమతమౌతున్నపుడు పర్మిషన్ పెట్టి ఇంటికి ఎలా వెళ్లాలి అన్న ఆలోచనలో పడింది చైత్ర !

ఈలోగా చైత్ర మేనేజర్ చైత్రను పిలిచాడు తన కేబిన్ లోనికి ! తను వెళ్లేసరికి ఆదిత్య కూడా అక్కడే ఉన్నాడు. ఆదిత్య కూడా తన టీమే ! ఆదిత్య తమ కంపెనీలో ఈ మధ్యనే చేరాడు. అంతకుమునుపు వెరిజాన్ లో చేసి ఈ కంపెనీకి అప్లై చేసుకుని వచ్చాడని తన కొలీగ్ ఆనంద్ చెపితే తెలిసింది. బాస్ ను విష్ చేసింది చైత్ర. అలాగే ఆదిత్యను చూస్తూ పలకరింపుగా నవ్వింది.

మేనేజర్ చైత్రతో “ప్రాజక్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉందనుకుంటాను. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ? క్లైంట్ కోరిన విధంగా సబ్ మిట్ చేయగలుగుతున్నందుకు సంతోషంగా ఉందం”టూ.. “హా చైత్రా! ఆదిత్య కు సాయంత్రం పర్సనల్ పని ఉందని తొందరగా వెళ్లడానికి పర్మిషన్ కావాలన్నాడు. ప్రాజెక్ట్ టెస్టింగ్ అంతా అయిపోయింది, క్లైంట్ యాక్సెప్టెన్స్ కోసం చూస్తున్నానంటున్నాడు. మీరు అతని పనిని అటెండ్ అవగలరా ? జస్ట్, క్లైంట్ ఓకే చెప్పేవరకే! తరువాత వెళ్లిపోవచ్చు” అనగానే చైత్ర గొంతుకలో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. మామూలు రోజుల్లో తను ఎంతసేపైనా వర్క్ చేస్తుంది. ఈ రోజు తొందరగా రమ్మంది అమ్మ. ఇటువంటి ముఖ్యమైన పనులుంటాయనే తను చిరాకు పడ్తుంది. అమ్మా నాన్నకు తన సమస్య అర్ధం కాదని గింజుకుంది మనస్సులో. పైకి ఒక జీవం లేని నవ్వు నవ్వుతూ “సారీ సర్! నేను కూడా తొందరగా వెళ్లాలి ఈరోజు! ఒక అర్జెంట్ పని. ఆదిత్య గారి పని, నా పనీ కూడా వర్క్ ప్రమ్ హోమ్ నుండి కేరీ చేస్తాను సర్!” అనగానే మేనేజర్ క్షణం ఆలోచించి “ఓకే” అన్నాడు.

అప్పుడు ఆదిత్య అన్నాడు “చైత్రగారూ,! నా పనిని మీరు హేండిల్ చేస్తానన్నందుకు చాలా ధాంక్స్. మీకు నేను మెసేజ్ కానీ, ఫోన్ కానీ చేస్తాను. క్లైంట్ అప్రూవల్ గురించి” అనగానే చైత్ర “నేనే మీకు తెలియచేస్తాను ఆదిత్యా! నో ప్రాబ్లమ్” అంటూ బాస్ కు ధాంక్స్ చెప్పి బయటకు వచ్చింది !

చైత్ర సాయంత్రం ఆఫీస్ నుండి పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్లేసరికి చైత్ర తల్లీ, తండ్రీ చైత్ర కోసం ఎదురు చూస్తున్నారు. చైత్రను చూడగానే ‘హమ్మయ్య!’ అనుకున్నారు. ఆఖరి క్షణంలో నేను రాలేనని ఫోన్ చేస్తే ! అలా కూడా చేస్తుంది చైత్ర. పని విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుంది.

చైత్ర లోపలికి వెళ్లి ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని, లాప్టాప్ పట్టుకుని తన గదిలో కూర్చుంది. ఇక్కడ బయట హాల్లో తల్లి, తండ్రి పెళ్లి వారి కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడే ఒక కారు వీరింటి ముందు ఆగింది. పెళ్లివారు లోపలకు వచ్చారు. పెళ్లి కొడుకు తల్లి, తండ్రి, పెళ్లి కొడుకు అక్కా, బావగారు వచ్చారు. కుశల ప్రశ్నలు, అవీ అయిన తరువాత, అందరూ ఆసీనులయ్యారు. మెల్లిగా వసంత చైత్ర గదిలోకి వచ్చి చైత్రను హాల్లోకి రమ్మంది. చైత్ర చాలా క్యాజువల్ గా వస్తూ తల ఎత్తి చూసింది వచ్చిన వారివైపు. అందరికీ నమస్కరిస్తూ ఉండగా లిప్తపాటు ఆమె కళ్లు ఆదిత్య మీద నుండి తప్పించుకోలేక సంభ్రమంగా ‘హాయ్ ఆదిత్యగారూ! మీరేమిటీ ఇక్కడ?” అని ప్రశ్నించగానే అందరూ తెల్లబోయారు. చైత్ర తండ్రి “అదేమిటమ్మా చైత్రా! అతను నీకు తెలుసా?” అనగానే “హా.. నాన్నగారూ! మా కొలీగ్ అండ్ టీమ్ మేట్” అనగానే “భలే బాగుందే! అతనే నిన్ను చూసుకోవడానికి వచ్చాడమ్మా. అతని అమ్మ, నాన్న గారు, అక్క బావ” అనగానే అందరికీ తిరిగి నమస్కరించింది. “అరె! నాకు తెలియదే, ఇద్దరిదీ ఒకే ఆఫీసని. మీరు వర్క్ చేసేది 'వెరిజాన్’ కదా” అని చైత్ర నాన్నగారు అడుగుతుంటే, “సారీ అంకుల్! నేను నా ప్రొఫైల్ ను అప్ డేట్ చేయలేదనుకుంటా. వెరిజాన్ లో అదివరకు పనిచేస్తూ, ఈ మధ్యనే ' డెలాయిట్ ' కు మారాన"ని చెప్పగానే అందరి ముఖాల్లో ఆశ్చర్యం.

ఈ లోపు చైత్ర ఫోన్ మోగింది. అర్జంట్ గా క్లైంట్ అమెరికా నుండి వీడియో కాల్ చేస్తూ, ‘ఒక పది నిమిషాలు మీతో డిస్కస్ చేయాలంటూ’.

‘ఓకే’ అంటూ, అక్కడ ఉన్న అందరికీ క్షమార్పణలు చెప్పి “ఆదిత్యగారూ! బహుశా, క్లెంట్ యాక్సెప్టెన్స్ గురించి డిస్కషన్ అవ్వచ్చు. మీరు కూడా రావాలం"టూ అతన్ని కూడా తన రూమ్ లోనికి ఆహ్వానించింది ! చైత్ర, ఆదిత్య ఒక పదిహేను నిమిషాలు వీడియో కాల్ లో మాట్లాడారు. క్లైంట్ సరియైన సమయంలో స్పందించినందుకు సంతోష పడుతూ, ప్రాజెక్ట్ టెస్టింగ్ లో ఏ అవకతవకలూ లేవని, పారామీటర్స్ అన్నీ క్వాలిటీ స్టేండర్డ్స్ కు అనుగుణంగా ఉన్నాయన్న అప్రూవల్ లెటర్ వీడియోలో చూపిస్తూ, ఈ కాపీ మెయిల్ చేస్తున్నామని, రేపు ఉదయం పదిన్నరకు తమకు ప్రాజెక్ట్ రిలీజ్ చేయమంటూ ఆదేశాన్ని జారీ చేసారు ! అది విన్న చైత్ర, ఆదిత్యలు సంతోషంతో ఒకరినొకరు అభినందించుకున్నారు. నిజానికి ఆ ప్రాజెక్ట్ ఇద్దరిదీనూ. వారిద్దరే కాకుండా మొత్తం టీమ్ ది.. ఆఖరి క్షణంలో అప్రూవల్ రాకపోతే ఎంతో నష్టమే కాకుండా చెడ్డ పేరు కూడా వస్తుంది. అలాగే ప్రాజెక్ట్ ఆఖరి దశలో ఇద్దరికీ పెళ్లిచూపులు! ఇలా అవుతుందని ఊహించని పెళ్లి చూపులు! ఏమాటలూ అవసరం లేని పెళ్లి చూపులు, ఏ చూపులూ అవసరం లేని పెళ్లిచూపులు !

ప్రాజెక్టు విజయవంతం అయినట్లుగా వారి పెళ్లిచూపులు కూడా విజయవంతమైనాయి !

ఆదిత్య ఆ గది నుండి బైటకు వస్తూ చైత్రతో 'మరి నేను నీ పరీక్షలో పాస్ అయ్యానా చైత్రా?” అంటూ “అప్రూవల్ లెటర్ దొరుకుతుందా చైత్రా మేడమ్ నుండి?!" అనగానే, చైత్ర సిగ్గుల మొగ్గ అయింది ! ఆమె బుగ్గల్లో ఎర్ర మందారాలు విరిసాయి!

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాకా పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ మా శ్రీ వారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.





198 views0 comments

Comments


bottom of page