పెళ్లి సంబంధం
- Vemparala Durga Prasad
- Jun 27
- 4 min read
#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #PelliSambandham, #పెళ్లిసంబంధం, #తెలుగుకథలు

Pelli Sambandham - New Telugu Story Written By Vemparala Durga Prasad
Published In manatelugukathalu.com On 27/06/2025
పెళ్లిసంబంధం - తెలుగు కథ
రచన: వెంపరాల దుర్గాప్రసాద్
ఫ్రెండ్ తమ్ముడి పెళ్లి కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది గోపాల్ కి. గోపాల్ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, విజయవాడ లో పని చేస్తున్నాడు. హైదరాబాద్ రైల్వే స్టేషన్ కి అతని బావమరిది శేఖర్ వచ్చేడు.
ఎదురు వచ్చి, చేతిలో సూటుకేసు అందుకుంటూ.. “రా బావా ప్రయాణం బాగా జరిగిందా?” అని పలకరించేడు.
“బాగానే జరిగింది” అని నవ్వుతూ జవాబు ఇచ్చేడు గోపాల్.
శేఖర్ స్కూటర్ మీద ఇంటికి వెళ్ళేరు.
ఆ రోజు శని వారం. శేఖర్ కి కూడా ఆఫీసు సెలవు.
హైదరాబాద్ బయలుదేరేటప్పుడే, అతని భార్య కమల క్లియర్ గా చెప్పింది, “మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సౌమ్య మ్యారేజ్ బ్యూరో ఉంటుంది. ఆ ఓనర్ స్వప్న గారు చాలా మంచి ఆవిడ. మా తమ్ముడిని తీసుకుని వెళ్ళండి. వాడికి మంచి సంబంధం వెతికి పెట్టండి” అంది.
కమలకి తమ్ముడి పెళ్ళికి ఏదో విధంగా తన భర్త సహాయం గా ఉండాలి అని ఆలోచన. గత ఏడాది తండ్రి చనిపోవడం తో, తల్లి శేషమ్మ కూతురు, అల్లుడి మీద ఆ బాధ్యత పెట్టేసింది. పెళ్లి కావాల్సిన తన తమ్ముడికి మంచి సంబంధం వెతక గలిగేది తన భర్త మాత్రమే అని కమల ఉద్దేశ్యం. అలాగే గోపాల్ మంచి కలుపుగోరు మనిషి. చుట్టాలలో కూడా అతన్ని మాట సహాయానికి, పెళ్లి సంబంధాలు చూడడానికి, మధ్యవర్తి గా పిలుస్తూ వుంటారు.
గోపాల్ వెళ్ళవలసిన పెళ్లి రాత్రికి మూసాపేట లో. పగలంతా ఖాళీయే.
భార్య మాటలు గుర్తుకు వచ్చిన గోపాల్, టిఫిన్, కాఫీ అయిన వెంటనే, బయలు దేరి సౌమ్య మ్యారేజ్ బ్యూరో కి, బావమరిది ని తీసుకుని వెళ్ళేడు.
ఆఫీస్ గదిలో రిసెప్షనిస్ట్ ఎదురుగా కూర్చున్నారు వాళ్ళు.
విషయం చెప్పిన తర్వాత, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకుని, రసీదు ఇచ్చింది ఆమె.
“స్వప్న మేడం గారు లోపల వున్నారు. ఒక్క నిముషం ఆగండి, లోపల వేరే పార్టీ వున్నారు”. అంది.
“సరే” అని కూర్చున్నారు ఇద్దరూ.
మరో 5 నిమిషాలలో, లోపల నుండి ఒక భార్య, భర్త బయటకి వచ్చేరు.
“ఇప్పుడు మీరు లోపలకి వెళ్ళండి” అని సైగ చేసింది ఆమె.
ఇద్దరూ లోపలకి వెళ్ళేరు. స్వప్న గారు నవ్వుతూ రమ్మని ఆహ్వానించేరు.
“కమల చెప్పిన ట్లు ఈవిడ పలకరింపు బావుంది, మనిషి కూడా చాలా పద్దతి గా వున్నారు” మనసులో అనుకున్నాడు గోపాల్.
వాళ్లకి కావలసిన వివరాలు అన్నీ అడిగేక, ఒక రెండు పెద్ద బౌండ్ ఆల్బమ్స్ ఇచ్చింది ఆవిడ.
“మీ రిక్వైర్మెంట్స్ కి తగిన సంబంధాలు ఈ ఆల్బమ్స్ లో ఉంటాయి, చూసుకోండి” అంది ఆవిడ నవ్వుతూ.
“మీకు నచ్చిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తే, వాళ్ళ షార్ట్ వీడియో లు సిస్టం లో చూపిస్తాను. వాళ్ళ అభిరుచులు, హాబీలు, వాళ్ళ నడక, తదితర వివరాలు తెలిపే చిన్న A. V కూడా ఉంటుంది.. మీకు మరింత బాగా అవగాహన కోసం” మళ్ళీ ఆవిడే అంది.
ఈ మ్యారేజి బ్యూరో చాలా ఆధునికంగా, బావుంది అనుకున్నాడు గోపాల్. ఆ గదిలో పక్క గా ఒక టేబుల్ దగ్గర కూర్చుని బావ, బావమరిది, ఆ ఆల్బమ్స్ చూస్తున్నారు. నచ్చిన అమ్మాయిల వివరాలు, చిన్న డైరీ లో ఆ సీరియల్ నెంబర్, పేరు రాసుకుంటున్నారు.
ఇంతలో ఒక ఫోటో దగ్గర గోపాల్ ఆగిపోయాడు.
ఇంతలో సీటులోంచి, ఏదో పని మీద బయటికి వచ్చిన స్వప్న గారు, అతను చూస్తున్న ఆల్బమ్ అప్పుడే చూడడం జరిగింది. ఆమె మొహం లో రంగులు మారిపోయాయి.
అదే సమయం లో “ఈ అమ్మాయి పేరు..” గోపాల్ అంటున్న మాట పూర్తి అవకుండానే, స్వప్న గారు కలుగ జేసుకుంది.
“వద్దండీ, ఆ అమ్మాయి ఫోటో అసలు తీసెయ్యాలి మా ఆల్బమ్ లోంచి. మా వాళ్లకి చెప్పేను, మర్చి పోయినట్లున్నారు. మీరు సందేహిస్తున్నది కరక్టే.. ఆ అమ్మాయి పేరు నీరజ, ఆమె విషయం తెలంగాణ లో V6 టీవీ లో కూడా వచ్చింది.” అంది గోపాల్ మనసులో భావాలను చదివేసినట్లు.
ఆశ్చర్యంగా ఆమె కేసి చూస్తున్నాడు గోపాల్.
"అదేమిటి మేడం, అంత మాట అన్నారు, ఆ అమ్మాయి మంచిది కాదా? " అని అమాయకంగా ప్రశ్నించాడు.
ఇప్పుడు ఆశ్చర్య పోవడం స్వప్న వంతు అయింది.
"అయితే, మీకు ఆ అమ్మాయి విషయం నిజంగా తెలియదా?" అంది.
"తెలియదు మేడం. నేను ఇంకా, ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఇక్కడ ఫోటో పక్కన రాసేస్తారని చెబుదామని అనుకుంటున్నాను ”.. అంటూ నసిగాడు.
శేఖర్ కి ఆ సంభాషణ ఏమీ అర్ధం కావడం లేదు. విచిత్రం గా బావకేసి చూస్తున్నాడు.
అప్పుడు స్వప్న కల్పించుకుంది.
"సార్, ఆ మాయలేడి వివరాలు తెలిస్తే చెప్పండి. మేము కూడా ఆ మహా తల్లి వాళ్ళ బాధితులమే. స్వయంగా మా అక్క కొడుకుతో 2 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయికి పెళ్లి జరిగింది.
6 నెలలు కాపురం చేసిందో లేదో, 498A కేసు పెట్టి వాడిని వేధించింది. ఆ కోర్టు కేసు పడలేక, మా పిన్ని గారు 15 లక్షలు ఇచ్చి, సెటిల్ చేసుకున్నారు. ఇప్పుడు మీ ఆంధ్రా వాళ్ళ మీద పడిందేమో.. జాగ్రత్త. " అంది ఆవిడ.
గోపాల్ కి కళ్ళు బైర్లు కమ్మినట్లు అయింది. పాపం మొహం పాలిపోయింది.
వెంటనే, ఆవిడ తో ఇలా అన్నాడు:
"మా చిన్నాన్న కొడుకు కి తుని లో ఈ అమ్మాయి సంబంధం చూసేము. అమ్మాయి, అబ్బాయి ఒకళ్ళకి ఒకళ్ళు నచ్చడం, పెళ్లి సెటిల్ చేసుకోవడం జరిగింది. నేనే మధ్యవర్తి గా వెళ్ళేను. మళ్ళీ వారం, 15 వ తారీఖు అన్నవరం లో పెళ్లి." అన్నాడు.
"పోనీ లెండి, ఇంకా పెళ్లి అవలేదు. ఇప్పటికయినా జాగ్రత్త పడండి. వీలయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇక్కడ కేసు వివరాలు, టీవీ లో వచ్చిన వార్తా క్లిప్పింగ్స్ లాంటివి మీకు షేర్ చేస్తాను " అంది స్వప్న.
గోపాల్ కి మనస్తిమితం గా అనిపించలేదు. బావమరిది కి సంబంధాలు ఇంక అప్పుడు చూడాలని అనిపించలేదు.
“మళ్ళీ వారం లో జరగ బోయే పెళ్లి ఎలా ఆపించాలా, చిన్నాన్న కి ఈ విషయాలు ఎలా చెప్పాలా”, అని ఆలోచిస్తున్నాడు. కుర్చీ లోంచి లేచి పోయాడు.
“ధన్య వాదాలు మేడం, మా తమ్ముడి కి చాలా పెద్ద ప్రమాదం తప్పిస్తున్నారు. మా బావమరిది కోసం మళ్ళీ వస్తాము. ఈ నీరజ విషయాలు, ప్రూఫులు, పేపర్ క్లిప్పింగ్స్ ఏవి ఉంటే అవి, కొద్దిగా నా నెంబర్ కి షేర్ చేయండి.. ఇప్పుడు నేను ఆ పెళ్లి ఆపించే పని మీద ఉండాలి " అన్నాడు.
“తప్ప కుండానండీ “ అంటూ, ప్రతి నమస్కారం చేసింది స్వప్న.
శేఖర్ బావని అనుసరించి బయటకి వచ్చేసేడు. గోపాల్ మొహం జేవురించింది జరిగిన పరిణామాలకి.
సమాప్తం
వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్
నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో
అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.
రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.
ధోనీ, రోహిత్ శర్మ అంటే క్రికెట్ లో చాలా ఇష్టం.
సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.
ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.
వుండేది విశాఖపట్నం.
ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.
Comments