top of page

పెన్నిధి


'Pennidhi' written by Kiran Vibhavari

రచన : కిరణ్ విభావరి


కేవలం డబ్బు లేకపోవడమే పేదరికమా?

జాలి, దయ, మానవత్వం లేనివాడు డబ్బున్నా పేదవాడు కదా?

ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈతరం డైనమిక్ రచయిత్రి కిరణ్ విభావరి గారి 'పెన్నిధి కథలో తెలుస్తుంది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్


" పేదవాడు గడ్డి మొక్క లాంటోడు. పీకి పారేసినా మళ్లీ పెరుగుతాడు. వాడికి కావల్సిన నేల, నీరు, తిండి లాక్కుని బలం అందివ్వకపోతే చాలు వాడే పోతాడు. అసలు పేదోడికి ఎదిగే అవకాశం లేకుంటే, యెట్లా పేదరికం పెరుగుతుంది?! ఆకలికి వాడే చావడూ! వాడితో పాటూ వాడి పేదరికం కూడా!" నాకు ఎదురుగా ఉన్న టేబుల్ మీద వంకరగా కూర్చుని, కాఫీ తాగుతూ చెబుతున్న కార్తీక్ మీద, నా చేతిలోని పేపర్ వెయిట్ విసిరి కొడదాం అన్న ఆలోచనని, వాడి మాటలకు నాలో రేగుతున్న కోపాన్ని బలవంతంగా అదుపుచేసుకున్నాను.


అతను నా సూపర్వైజర్. నాకన్నా పై స్థాయిలో ఉన్నా, ఆలోచనలు మాత్రం నేలబారువి. సిల్వర్ స్పూన్ తో పుట్టాడు కదా. ఆమాత్రం గర్వం ఉంటుందని సరిపెట్టుకున్నాను. కానీ కెమెరా మెన్ గిరి మాత్రం ఎదురు చెప్పకుండా ఉండలేక పోయాడు. " గడ్డి మొక్కలే కదా అని పీకి పారేయడం వల్లనే, భూక్షయం ఎక్కువై కేరళాలో వరదలు ముంచెత్తాయి. గడ్డి పరక కూడా విలువైనదే సర్." సూటిగా సమాధానం ఇవ్వాలని ఉన్నా, పామూ చావకూడదు కట్టే విరగ కూడదు అన్నట్టు పరోక్షంగా సమాధానం ఇచ్చాడు. అందరం ఉద్యోగ అభద్రతా భావంతో ఉన్నాం కదా, ఎంత ముక్కుసూటి మనుషులమైనా, మునుపటిలా సూటిగా సమాధానం ఇవ్వలేక పోతున్నామని అర్ధం అయ్యింది.


గిరి చెప్పిన మాటలోని సందేశం అర్ధం అయ్యిందో లేదో కానీ కార్తీక్ ఇక ఈ విషయాన్ని పొడిగించలేదు.


కానీ కార్తీక్ లాంటి ఉన్నత చదువులు చదువుకున్న వారే ఇలా ఆలోచిస్తుంటే, ఇక అట్టే చదువుకోని రాజకీయ నాయకుల నుంచి ఎక్కువగా ఆశించకూడదేమో! పేద వాడి బతుకు అందరికీ చులకనే. వాడెప్పుడూ కింది స్థాయి వాడే. అందుకే యెటువంటి వైపరీత్యాలు దాపురించినా ముందుగా చితికి పోయేది ఈ కష్ట జీవుల అంటుడు కడుపులే.


అందుకనే కరోనా రక్కసి కోరల్లో చిక్కి పేదవాడు నలుగుతుంటే, ప్రభుత్వాలు కూడా ధృతరాష్ట్రుడిలా మారిపోయి, వాడి చావుకి వాడిని వదిలేసింది. పేదోడు కదా వాడి బతుకుకు విలువేదీ?! కలుపు మొక్కలగా జతకట్టేసిన వాడి ఊపిరికి బరువేది!? వేలాది కిలోమీటర్లు కాలిబాటన పయనించిన ఆ బక్క కాళ్ళల్లో వొణుకు వీళ్లకు అర్ధం కాదని మిన్నకుండి పోయాను.


రైలు బండి కింద నలిగిపోయిన బడుగు జీవుల దౌర్భాగ్యం కళ్లకు ఆనకున్నట్టు ఇన్ని రోజులు గడిపేసినా, వలస కార్మికుల అగచాట్లు చూసి, ఇప్పటికి కళ్ళు తెరుచుకున్న ప్రభుత్వం వారికోసం, ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది అన్న వార్త అందింది. వెంటనే

ఆ కూలీలు పడుతున్న వేదనలు రికార్డ్ చెయ్యమని మా ఎడిటర్ గారు నన్ను పురమాయించారు. ఎప్పుడూ చల్లని ఏసి గదుల్లో కూర్చుని, న్యూస్ చదివే నాకు మండుటెండలో వార్తలు సేకరించమని ఆయన అడుగుతుంటే పెద్దగా ఆశ్చర్యంగా అనిపించలేదు. ఎందుకంటే కరోనా దెబ్బకి, మా ఛానెల్ కూడా ఆర్థికంగా కుదేలయింది. నా సహోద్యోగులు కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. వారికిదే ఆఖరి రోజూ అని తెలిసినప్పుడు, వారి కళ్ళల్లోని బెంగను, అభద్రతను చూసి తట్టుకోలేక పోయాను. ఈ శాపం ఎప్పుడు వీడుతుందో అని ప్రశ్నించడం తప్పా ఇంకేం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను.


నా సీనియారిటీ మూలంగా నా ఉద్యోగం పదిలంగా ఉన్నా, సంస్థను కాపాడే బాధ్యత మా అందరి మీదా పడింది. పని ఒత్తిడి పెరిగింది. ఇక రిపోర్టర్, యాంకర్, ఎడిటర్ ఇలా తారతమ్యాలు లేకుండా పని చేస్తూ పోతున్నాం. అందుకే ఈ ఫీల్డ్ పని అప్పజెప్పినా, అదే పరమార్థం అంటూ ఒప్పుకుని, కెమెరామెన్ గిరితో రైల్వే స్టేషన్ కు వెళ్లాను.


ఏదో జాతరకు కొలువైనట్టే జనాలు గుంపులు గుంపులుగా , సోషల్ డిస్తన్స్ లేకుండా, అరిగిపోయిన కాళ్ళను, నీరసించిన మొహాలనూ వేలాడదీసుకుని, రైలెప్పు దోస్తుందా, సొంత గూటికి ఎప్పుడు పోతామా అన్నట్టు, కళ్ళల్లో చిన్నగా చిగురించిన ఆశలతో చూస్తూ ఉన్నారు. కనీసం మొహలకు మాస్కులు కూడా కొనుక్కునే అవకాశం లేనివారు, పాత గుడ్డలతో మొహల్ని ముసుగులతో కప్పేసి నిల్చుంటే, ఇంకొందరు దేనికీ భయపడని సాదుపుంగవుల్లా , నిర్వేదంగా నిల్చుని ఉన్నారు. వారి కళ్ళల్లో యెటువంటి కోరిక, ఆశా లేదు. నిలువ నీడ లేకున్నా బతికి ఉండాలనే పట్టుదల తప్పా, వారి కళ్ళల్లో నాకేం భావాలూ కనిపించడం లేదు. చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులకే బలవన్మరణాలకు పాలడుతున్న ఎందరికో వీరు ఆదర్శంగా కాదూ! చరిత్ర చెప్పని విజయ గాథలు వీరివి కావూ! అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ , వారిని ఇంటర్వ్యూ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం.


ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుండి, ఆకలి మంటలు తరుముతుంటే, ఉపాధి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన వారి ఇతి బాధలు తెలుసుకుంటూ, కెమెరాలో బందిస్తున్నాం.


బ్రతుకు గోడ శిధిలాల నుండి

గుండె పగుళ్ళ చీలికల నుండి

మానవ జీవన రహస్యం నైరాశ్యం కాదని ధైర్యం ఇచ్చే ఇతి వృత్తాలు వీరి వేదనా భరిత గాథలు అంటూ ఎక్కడో చదివిన మాటల్ని వీరికి ఆపాదించి, ప్రోగ్రాం రికార్డ్ స్టార్ట్ చేసాను. నా మాటల్ని గిరి కెమెరాలో బందిస్తుంటే, అతని వెనుక దూరంగా ఉన్న ప్లాట్ ఫాం బెంచి మీద ఒంటరిగా కూర్చున్న ఓ ముసలి శరీరం అస్పష్టంగా కనిపించింది. గిరి కి ఆమెను చూడమని కళ్ళతో సైగ చేసాను. నడి నెత్తిన ఉన్న సూరీడు కళ్ళల్లోకి వస్తుంటే, నుదిటి మీద చేయి పెట్టుకుని, కళ్ళు చిట్లించి చూసాడు గిరి.


" ఎవరో ముసలమ్మ మేడం. ఈ వయసులో కూలికి చేసుకోడానికి వచ్చిందా!? కనుక్కుందాం రండి" అంటూ కెమెరాతో పాటు ఆ ముసలమ్మ దగ్గరకు వెళ్ళాడు. నేనూ అతన్ని అనుసరించాను.


ముతక చీర, ముడతలు పడిన మొహం, బోసి నోరు, చెదిరిన తెల్లని జుట్టు, చెప్పులు లేని మురికి పాదాలు, లోతైన కన్నుల్లో చెమ్మతో, రెండు సంచులను బలంగా పట్టుకుని భయం భయంగా కూర్చుని ఉందామే. ఏ గాలికో రాలిపోయే పిచ్చి పువ్వులా , అస్థి పంజరానికి చీరా జాకెట్ తోడిగినట్టున్న ఆ అవ్వ బిత్తరి చూపులు చూస్తూ కూర్చుంది.


గిరికి ఆవిడ మీద కెమెరా ఫోకస్ చెయ్యమని చెప్పి, ఆమెను పలకరించాను. నవ్వలేక నవ్వుతూ తన పక్కన కూర్చోడానికి చిన్న జాగా ఇచ్చింది. తన పేరు మువ్వమ్మ అని చెప్పింది.


"మీరూ వలస కార్మికురాలా ?" నేను అడిగాను. ఆవిడ కాదన్నట్టు తల అడ్డంగా ఊపింది. ఆవిడ మొహానికి మాస్కు లేదు . కనీసం చీరతో కూడా మొహం దాచుకోవాలని లేదామెకు. శూన్యంలోకి కళ్ళు నిలిపేసి కూర్చుంది.


"మరి ఊరికి ఎందుకు వెళదాం అనుకుంటున్నారు?" సూటిగా ప్రశ్నించాను. గతంలో ఎప్పుడూ రిపోర్టింగ్ అనుభవం లేకపోవడంతో, ఎలా ప్రశ్నిస్తున్నానో అనే చిన్న దడ ఉన్నా, నాకొచ్చిన రీతిలోనే కొనసాగించాను. ఆవిడకి నా ప్రశ్నా రీతి పట్టనట్టే ఉంది. కాసేపు మౌనంగా ఉండిపోయింది. నేను ఆమెనే చూస్తూ, మరోసారి అదే ప్రశ్న వేసాను.


"ఇక్కడ ఉండి తన్నులు తినే కన్నా...అక్కడకు పోయి అడుక్కు తిని బతుకాలని బిడ్డ " ఆకలి జబ్బుతో ఎండిపోయిన ఆమె కళ్ళలో ఒక్కసారిగా నీళ్ళు నిండుకున్నాయి.


నాకు నోట మాట రాలేదు. "తన్నులు తినడం ఏంటి? ఎవరు కొడుతున్నారు ?" అని ప్రేమగా ఆమె భుజం మీద చెయ్యేసి అడుగుతుంటే ఒక్కసారిగా ఆమెలోని దుఃఖ సాగరం బద్దలై పోయింది. అరచేతుల్లో మొహాన్ని దాచుకుని, వెక్కి వెక్కి ఏడుస్తుంటే, నేనూ గిరి అయోమయంగా మొఖాలు చూసుకున్నాం. ఆమె వీపును పాముతూ దగ్గరకు లాక్కున్నాను.


"ఇంకెవరు నా కొడుకు బిడ్డా.. కన్నూ మిన్నూ ఎరుగక కొడుతున్నాడు. తట్లు తెలేలా బెల్తుతో కొడుతున్నాడు." అంటూ జాకెట్టు పైకెత్తి తన నిస్సహాయతను చూపించింది. తెల్లని ముసలి శరీరం మీద ఎర్రని చారలు, ఆ చారల మీదుగా పాకిన రక్తపు గడ్డలు, కొన్ని చీము పట్టిన కురుపులు స్పష్టంగా కనిపించాయి. నేను చూడలేక పోయాను. అప్రయత్నంగా అరచేతితో నా కళ్ళు మూసుకున్నాను.


"నా మొగుడు లేడు కదా బిడ్డ.. నాకివి తప్పవు" దెబ్బలు కప్పుకుంటూ, చెంగుతో కళ్ళు ఒత్తుకుని చెప్పింది.


"మొగుడు లేకున్నా ఆడది ఒంటరిగా, గౌరవంగా బతకగలదు. " నేను గద్గద స్వరంతో చెప్పాను. అంతకన్నా చెప్పడానికి నాకు గొంతు పెగలట్లేదు.


"లేదు బిడ్డా.."అంటున్న ఆమె గొంతు కూడా బొంగురు పోయింది.


"మోగోడు బతికున్నప్పుడే ఆడదానికి విలువ. ఆడు సంపాదించి పెట్టేవాడు. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. నేను సంపాదించను కదా బిడ్డ. అందుకే నా కొడుకులకు నా అవసరం లేదు." ఏడుస్తూ చెప్పింది. ఆమె ఏడుపుకు ఎండుటాకుల ఉన్న ఆమె శరీరం కూడా కంపిస్తుంటే,


"అసలు మీదేవూరు? ఇక్కడకి ఎందుకు వచ్చారు? ఎవరు తీసుకు వచ్చారు? చెప్పమ్మా.." అనునయంగా అడిగాను. నా మనసు బరువెక్కింది.


"చెబుతా తల్లీ... చెబుతా.. మాది ఓరుగల్లు. నాకిప్పుడు 78 యేళ్లు. పదేళ్ల కిందట నా మొగుడు పోయాడు. బతికినంత కాలం ఇనుము కరగదీసే పని చేస్తూ అంతో ఇంతో సంపాదించి నా బిడ్డలను సాకాడు. ఆళ్లకిప్పుడు రెక్కలు వచ్చేశాయి బిడ్డ. ఈ తల్లి కానిదై పోయింది. " అంటూ మళ్లీ వెక్కి వెక్కి ఏడ్చింది. నీళ్ళ బాటిల్ అందించాను. కొద్దిగా నోరు తడుపుకుని చెప్పడం కొనసాగించింది.


" నా పెద్దోడు వోరుగల్లో ఉంటాడు బిడ్డ. మేస్త్రి పని చేస్తాడు. ఆడు ఉండేది నా ఇంటిలోనే. నా మొగుడు కట్టించిన ఇంటిలోనే. అయినా రోజూ నరకం చూపిస్తాడు బిడ్డా. రోజూ తాగొచ్చి మక్కెల్లో పొడుస్తాడు. నా పానానికి శనిలా తగలడ్డావే ముసలి ముండా అని తిడుతా, ఒక్కోసారి ఇంటి బయటకు ఈడ్చి పడేస్తాడు బిడ్డ. పక్కటెముకల్లో ఒకటే నొప్పి. నాకా వయసు అయిపోయింది. లేచే ఓపిక లేక ఆడి గుమ్మం ముందే అలా ఏడుస్తూ కూర్చున్నా. నా కోడలు చూస్తూ ఉందే కానీ ఒక్క మాట..ఒక్క మాట కూడా నావైపు మాటాడలేదు. నా ముసలి ప్రాణానికి ఇంత ముద్ద వెయ్యడం ఆడికి నొప్పా బిడ్డా. నేను కేకలు వేస్తే నాకు పిచ్చి పట్టింది అని నోట్లో గుడ్డలు కుక్కుతారు. లాక్కు పోయి కాళ్ళు కట్టేసి ఓ గదిలో పడేస్తాడు. ఇరుగు పొరుగు వాళ్ళు అడిగితే మా అమ్మకు పిచ్చి పట్టింది. మా అందరి మీదా పడి రక్కుతోంది అని కథలు చెబుతారు బిడ్డ. ఆళ్లది నమ్మి నన్ను దూరంగా ఉంచేస్తుర్రు. ఒక్కో రోజు అస్సలు అన్నం పెట్టరు. ఆకలి తట్టుకోలేక ఏడుస్తుంటే అప్పుడూ తిడతారు. కంచం మొహం మీద విసిరికొట్టాడు బిడ్డా నా కొడుకు. తొలిచూలు బిడ్డని నేనాడిని ఎంత అపురూపంగా చూసుకున్నాను. ఇప్పుడు ఈ ముసలి వయసులో ఆడికి భారం అయిపోయాను." పెద్దగా ఏడ్చింది మువ్వమ్మ. కాసేపటికి దుఖం దిగమింగుతూ చెబుతూపోయింది మువ్వమ్మ.


" ఇక నా చిన్నోడు. ఇక్కడే హైదరాబాద్లో ఉంటాడు. ఏదో కూలీ పని చేస్తూ కాలం ఎళ్లదీస్తుండు. ఆడికి జబ్బు చేసిందని చూసిపోడానికి హైదరాబాద్ రైలెక్కాను. తల్లి పానం కదా బిడ్డ ఆగలేకున్న. ఆడిప్పుడు మంచిగా అయ్యిండు. కానీ ఏదో రోగం అందరికీ అంటుతోంది అంట కదా.." అంటూ ఆగింది.


"కరోనా.. కరోనా.."అంటూ పేరు అందించాను.


"హా..ఆ రోగం వస్తోంది అని అందరినీ పనుల్లేవని తోలేసారు. పైసలు బంద్ అయిపోయినాయి. ఇక ఆడికి నేను భారం అయిపోయాను. నా చంకల్లో ఆడిని ఎత్తుకుని ఈ చేతులతో గోరుముద్దలు తినిపించిన బిడ్డ. ఆడిప్పుడు అదే చంకల్లో కాలితో తంతున్నాడు. నా చేతుల్ని వెనక్కి మెలివేసి , నడుం విరిగేటట్టు కొడుతున్నాడు. ఆడు తాగితే అంతే బిడ్డ. కోడలు కొంత డబ్బిచ్చి ఆడ నుండి వెళ్ళిపోమని బయటకు తోసేసింది. అలానే నడుచుకుంటూ , దారిన కనిపించే బిడ్డల్ని అడుగుతా ఈ టేశనుకు వచ్చినా.. ఒళ్లంతా ఒకటే నొప్పులు బిడ్డ. కాళ్ళకు చెప్పులు కూడా లేవు" అంటూ కాళ్ళను చూపించింది మువ్వామ్మ. అరికాళ్ళు పగిలిపోయాయి. కాళ్ళు ఉబ్బి, నరాలు బయటకు కనిపిస్తూ తెగిపోయేలా ఉన్నాయి.


ఆమె కాళ్ళను చూస్తూనే ఏడుపు తన్నుకు వచ్చింది.


అమ్మ విలువేంటో అమ్మ లేని నాకు తెలుసు. అనాధగా పెరిగిన నేను అమ్మ లాలింపుకు, ప్రేమకు ఎంతలా వాచి పోయానో, ఎన్ని నిద్రలేని రాత్రుల్లో మా అమ్మొస్తుందని, నన్ను తన బిడ్డగా గుర్తించి తీసుకువెళుతుందని వేచి చూసానో నాకు తెలుసు. చెత్త కుప్పలో నన్ను వదిలేసి వెళ్ళిన మా అమ్మ , ఇంతవరకూ రాలేదు. అమ్మ ప్రేమను చవిచూసిన ఆ కొడుకులు అమ్మకు నరకం చూపిస్తున్నారు. ఏడుపు ఆపుకోలేక పోయాను. కెమెరా ముందు ఉన్నానని మరచి కన్నీళ్లు పెట్టుకున్నాను.


"వద్దు బిడ్డ...నాకోసం నువు ఏడవమాకు." అంటూ మువ్వమ్మ నా చేతులు పట్టుకుని, మాస్కు వెనుక దాగి ఉన్న నా కళ్ళను తుడిచింది. నేనామెను బలంగా కౌగలించుకున్నాను. ఆమె కౌగిలి ఎంతో విషాదంగా తోచింది.


గిరి కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు.

మా చుట్టూ గుమిగూడిన వాళ్ళూ మువ్వమ్మ కథ విని బాధగా ఏటో చూస్తూ కూర్చున్నారు. బహుశా వాళ్ళూ తమ అమ్మల్ని గుర్తుచేసుకుంటున్నారేమో.


"మరి తినడానికి ఏమైనా తెచ్చుకున్నావా అమ్మా?" మొదటిసారి నా నోటి నుండి అమ్మా అనే పిలుపు వచ్చి నా మీద నాకే ఆశ్చర్యం వేసింది. ఇంతవరకూ ఆ పదం అంటే నాకెంతో అసహ్యం .అలాంటిది మువ్వమ్మను ఒక్క కౌగలింతకే అమ్మా అని పిలిచేసాను.


"ఇదిగో ఎవరో దర్మప్రభువులు ఇది ఇచ్చారు బిడ్డ. రైల్లో కూడా ప్రభుత్వం వాళ్ళు తిండి పెట్టీ, పళ్ళు అవీ ఇస్తారటగా . " అంటూ తన దగ్గర ఉన్న అన్నం పొట్లం, బిస్కెట్ పాకెట్టు చూపించింది. ఆ దాతలకు మనసులోనే దండం పెట్టుకున్నాను.


"ఇప్పుడు ట్రైన్ రాకుంటే ఏం చేస్తావు అమ్మ?" ఆరా తీశాను.


"ఈడనే పండుకుంటా బిడ్డ " వెంటనే ఆమె జవాబిచ్చింది.


"మరి వరంగల్ వెళ్ళినా కొడుకు కొడతాడు కదా. మరెందుకు అమ్మా వెళుతున్నావు?" ఆమె ఏం చెబుతుందా అని చూసాను.



కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆమె ఏం చెబుతుందా అని చూస్తూ ఉంటే, గట్టిగా నిట్టూర్పులు విడుస్తూ " నా మొగుడు పోయిన చోటే సచ్చిపోతాను బిడ్డ. నా చేతుల్లో పని చేసే శక్తి లేదు. కాళ్లూ చేతులూ ఎక్కువ ఆడించలేను. ప్రాణం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తూ , అడుక్కు తిని బతుకుతా బిడ్డ. "అని చెబుతున్నప్పుడు ఆమె గొంతులో లోతైన బాధ కనిపించింది.


లాక్ డౌన్ కష్టాలు అంటే వలస కూలీల గాధలే వినిపిస్తున్నాయి. కానీ ఇలా ఒంటరి బతుకుల వేదనలు కూడా ఉన్నాయని ఆరోజే తెలిసింది. ఇక ఇంటర్వ్యు చెయ్యలేక గిరిని కెమెరా ఆఫ్ చెయ్యమన్నాను.


నేను వెళ్లిపోతుంటే మువ్వమ్మ జాలిగా చూసింది. ఆమె కళ్ళలో చిన్న తడి. చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ, ఓపికగా ఆమె గాథ విన్నందుకు కృతజ్ఞతగా చూసింది. ఆ చూపు చూసి ఇక ఆగలేకపోయాను. ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని, "అమ్మా...నాకు అమ్మవవుతావా?" ఆమె ఒడిలో తల పెట్టుకుని అడిగాను.


ఆమె నా తలను ప్రేమగా నిమిరింది. మా మధ్య ఎన్నో మాటలు జరిగాయి. వాటిల్లో ఎన్నో భయాలు, మొహమాటాలు, సందేహాలు, కృతజ్ఞతలు, దీవెనలు..ఇంకెన్నో.. అవన్నీ ముగిశాక అమ్మ నవ్వింది. చాలా ఏళ్ళ తర్వాత నవ్వినట్టు బలవంతంగా నవ్వింది.


నేను కార్తీక్ లాంటి వారిని ఎదురించలేక పోవచ్చు. ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో నా అసహనాన్ని వెళ్లగట్ట లేక పోవచ్చు.. కానీ నినాదించే పెదవుల కన్నా, ఉద్యమాలకు బిగించే పిడికిళ్లు కన్నా, ఇటువంటి దీనులకి చేతనైన సాయం చేసే చేతులే మిన్న అనేది నేను నమ్మిన సిద్ధాంతం. అందుకే మువ్వమ్మను నాతో పాటు తీసుకువెళ్లాను.


"చివరికి ఈ లాక్ డౌన్ నాకో అమ్మనిచ్చింది గిరి" కారు డోర్ తీస్తున్న గిరితో సంతోషంగా చెప్పాను.


"ఇలా ఎంత మందిని అమ్మలుగా చేసుకుంటారు మేడం?" గిరి విస్మయంగా అడిగాడు.


అప్పటికే నా దగ్గర పాతిక మంది అమ్మలున్నారు.


"నాలో మనిషితనం బతికుండే వరకూ" అమ్మను కావలించుకుంటూ బదులిచ్చాను.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : కిరణ్ విభావరి

నేను ఇప్పటి వరకూ 33 కథలూ, 4 కవితలూ రాశాను. నేను రాసింది నాలుగు కవితలే అయినా అన్నిటికీ విశిష్టమైన బహుమతులు అందుకున్నాను. NATA, NATS, జాషువా కవితా పురస్కారాన్ని అందుకున్నాను. కథల పోటీలలో కూడా తెలుగు తల్లి కెనడా అవార్డ్, స్వేరో టైమ్స్ పత్రిక వారి పోటీలో ప్రథమ బహుమతి, mom'spresso వెబ్సైట్ లో అత్యుత్తమ బ్లాగర్ గా, ఇంకా మరెన్నో పోటీల్లో బహుమతులు పొందుకున్నాను. నా కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అయ్యి, ఎందరో పాఠకుల మన్ననలు పొందాయి. ముఖ్యంగా నేను రాసిన కాఫీ పెట్టవు కథ social media లో వైరల్ అయ్యి, ప్రముఖ FM radio లో, అల్ ఇండియా రేడియోలో ప్రసారం అయ్యింది.

Saho, విశాలాక్షి, సినీ వాలి పత్రికల పోటీలలో ప్రథమ బహుమతి వచ్చింది. మల్లె తీగ కవితల పోటీలో విశిష్ట బహుమతి అందుకున్నాను. కొత్త వెలుగు అనే కథల సంకలనం ప్రచురించాను



135 views0 comments

Comments


bottom of page