'Peparu Kashtalu' written by Lakshmi Madan
రచన : లక్ష్మీ మదన్
నేను పేపర్ ను.. నా కష్టాలు చెప్పాలని వచ్చిన.. తెల్లారితే భయం నాకు.. నన్ను ఏసే పిల్లగాడు గట్టిగ మల్షి ఇసిరి కొడ్తడు ఇంట్లకు .. కుయ్యోమని ఇంట్ల వడ్త. ఒక్కొక్క సారి గేటు కాడ నీళ్ళళ్ళ వడ్త.. నా రాత బాగుంటే ఇంట్ల వడత..
అరె.. అరే.. ఓ ఇంటాయన.. మొకం గడుక్కో ముందు! ఇననే ఇనడు.. కంపు గొట్టంగ చదవ వట్టే.. గింతట్ల ఫోన్ వొచ్చే.. చీ చీ.. గా తుంపిల్లు వడంగ మాట్లాడుడు.. వాక్.. వాక్.. మొత్తం చదువుడు గాంగనే ఆడ ఇసిరేసి పోయిండు.. హమ్మయ్య! ఇగ రెస్ట్ తీసుకుంటా.. అగో ఎవరో బెల్ కొట్ట వట్టిరి..
ఎవలుల్ల గీయాల్ల..
బాగున్నావే కాక అనుకుంటూ నోట్ల ఆకు నవులుకుంటు వొచ్చే.. బుడు బుంగొలే
వచ్చుడుతోనే నన్ను దీషి చదవ వట్టే..
దేశమంత గీయన శేతిల ఉన్నట్టు పోజు..
ఆగు.. ఆగు.. నీ ఆకు పాడుగాను.. నాకు జర్డా వడదయ్య.. గది ఊసిరా..
యింటాడు నా మాట? నీ చదువుడు పాడుగాను!
గిట్ల వచ్చేటోళ్లు.. పోయేటోళ్లు.. నన్ను నల్షి పెట్టిరి..
జెర్ర సేపు యిరామం.. గాల్లు తింటున్నరు..
ఫ్యాన్ బంజెయ్యకుండ వోయిరి.. గా గాలికి కొట్కవోతున్న..
అయ్యో.. అయ్యో.. పడ్తున్న..
ఇంతట్ల ఇంటాయన వొచ్చి..
కరెంట్ బిల్ మస్త్ వొస్తుంది.. ఫాన్ బంజెయ్యరు అని కోపం తోని కట్క వొట్టిండు
నిమ్మలమాయే పానం! శ్ ష్
కుదార్తంగా తిని ఇంటామే సోఫాల కూసొని సదివింది.. గీమే మంచిగనే ఉన్నది.. కడిగిన ముత్యం లెక్క గొడ్తుంది..
మంచిగ మడ్తవెట్టి గూట్లవెట్టింది
రాత్రికి పిల్లగాండ్లు ఆడుకుంట చింపవట్టిరి.. ఓ పోరలు.. ఊకొండ్రా..చేయ్యి నొప్పి వెడ్తుంది..
గాయి పోరలు.. ఆల్ల అయ్య, అవ్వ జెప్పినా యినరు..
ఇగ అందరు వన్నరు.. నిద్ర వోత
తెల్లారితే కథ ఎట్లుంటదో
పొద్దు గల్ల పనామే చుడ్వ గట్కొనీకి.. నన్ను పర్రున జింపే..
ఇంటమే వెట్టిందట..
అమ్మా! గూట్ల ఎస్కొనీకి జేర్రన్ని ఇయ్యి అనే..
ఇగ పోరలు మూతి తుడ్వనీకి నేను.. ఇంకోటి తుడ్వనీకి నేనే..
అప్పుడప్పుడు ఏస్కోని కుసుంటారు.. వాక్.. పాడు గాను.. నన్నిగిట్ల వాడు కుంటున్నరు..
ఎవలకు చెప్పాలే నా బాధలు..!
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి
కలం పేరు : లక్ష్మీ మదన్
హైదరాబాద్ లో ఉంటాను.
500 కి పైగా కవితలు, 300 కి పైగా పద్యాలు, పాటలు, కథలు రాసాను.
Comments