మంచి కాలం ముందుంది
- Chilakamarri Rajeswari

- 3 hours ago
- 4 min read
#ChilakamarriRajeswari, #చిలకమర్రిరాజేశ్వరి, #ManchiKalamMundundi , #మంచికాలంముందుంది, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Manchi Kalam Mundundi - New Telugu Story Written By - Chilakamarri Rajeswari
Published in manatelugukathalu.com on 26/02/2026
మంచి కాలం ముందుంది - తెలుగు కథ
రచన: చిలకమర్రి రాజేశ్వరి
ఉదయం సమయం 8 గంటలు.
"ఏమోయీ, అలా వాకింగ్‌కి వెళ్ళి వస్తాను, ఏమన్నా కావాలంటే చెప్పు, వచ్చేటప్పుడు తీసుకువస్తాను" అంటూ చెప్పులు వేసుకుంటూ అడిగాడు పరమేశ్వర్.
"కూరలు తీసుకురండి, అన్నీ అయిపోయాయి" అని బదులిచ్చింది జయ.
ఒక గంట తరువాత ఉత్త చేతులతో వచ్చిన భర్తను చూసి, "ఏంటండీ, ఏమీ దొరకలేదా?" అంటూ అడిగింది జయ.
"అది కాదు, సందు చివర నా స్నేహితుడు కలిశాడు. ఇపుడు అమ్మకానికి వస్తున్న కూరగాయలు అన్నిటిలోనూ ఏదో రకమైన కల్తీ కలుపుతున్నారుట అని వాడి చరవాణిలో వేరే సమూహాల నుంచి వచ్చిన సందేశాలను చూపించాడు. ఎందుకైనా మంచిదని ఇంక కూరలు కొనకుండా వచ్చేసాను. ఈ పూటకు, ముద్దపప్పు, ఆవకాయ, చారు తో సర్దుకుందాంలే. మా వాడు చెప్పినవన్నీ వినేటప్పటికి తలనొప్పి వచ్చింది, కొంచెం వేడిగా కాఫీ ఇవ్వు. పొద్దున పేపరు చదవకుండా వెళ్ళిపోయాను, ఆలస్యం అవుతోందని. ఈ లోపల పేపరు తిరగేస్తాను" అంటూ కాళ్ళు కడుక్కొని వచ్చి కుర్చీలో కూర్చుని పేపరు చేతిలోకి తీసుకున్నాడు.
"అలాగే" అంటూ లోపలికి వెళ్ళింది జయ. వెళ్ళిన ఐదు నిమిషాల లోనే, "జయా! జయా!" అని వినిపించిన కేకలకు, ఏమయిందోనని, హడావుడిగా వంటింట్లో నుంచి పరిగెత్తుకొని వచ్చింది.
"చూసావా? మనకు సరఫరా చేసే పాల డైరీలో, పాలు, పాల పదార్థాలలో కల్తీ జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు,
సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం అని చాంతాడంత అక్షరాలతో 'బ్రేకింగ్ న్యూస్' అని వేశారు. ఇవాళ కు ఉన్న పాలు వాడేయ్. పాల పాకెట్లు ఇచ్చే అబ్బాయికి చెబుతాను, వద్దని" అని అన్నాడు.
"కాఫీ ఇస్తాను కానీ మంచినీళ్ళు అయిపోయాయి. ఆ అబ్బాయి మంచినీళ్ళు తేలేదు మరి, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. బోరు నీళ్ళతోనే వంట చేస్తున్నాను" అని నసుగుతూ చెప్పింది జయ.
"ఎవరికీ రాలేదా? రవిని అడుగుతాను, వాళ్లకి ఇచ్చాడా?" అని అంటూ రవికి ఫోన్ చేసి మాట్లాడాడు.
"ఏమోయ్, మంచినీళ్లు ఏవో పంపు దగ్గర పట్టేసి మనకి మినరల్ వాటర్ అని ఇస్తున్నాడుట. ఆ విషయం తెలిసి రవి అడిగితే, 'ఏంటండీ, ఎవరు చెప్పారు మీకు? కావాలంటే తీసుకోండి, లేకపోతే మానేయండి. మీకే కాదు, ఇంక ఈ సందులో ఎవరికీ వేయను. ఏం చేస్తారో చేసుకోండి' అని బుకాయించి తెచ్చిన బాటిల్ కూడా ఇవ్వకుండా తీసుకువెళ్ళిపోయాడుట. బోరు నీళ్ళే తాగుదాం, వడకట్టు ప్రస్తుతానికి. ఇదిగో ఇంకో విషయం కూడా చెప్పాడు, మనం సరుకులు తీసుకునే దుకాణంలో కూడా కల్తీ సరుకులు అమ్ముతున్నారని ఎవరో ఫిర్యాదు చేశారని, దుకాణం మూసేశారుట. సర్లే, తొందరగా వంట చేసేసి భోజనం పెట్టు" అంటూ విసుక్కుంటూ పేపరులో తల దూర్చాడు.
మధ్యాహ్నం భోజనం చేసి, పడుకుని లేచిన తరువాత, సాయంత్రం "ఏమోయీ, వాతావరణం చాలా చల్లగా ఉంది. వేడి వేడి పకోడీలు తింటే బాగుంటుంది, చేయచ్చుగా?" అన్నాడు.
"మీరు పడుకున్నపుడు, టీవీ వార్తలలో మనం ఉపయోగిస్తున్న పొద్దుతిరుగుడు నూనెలో కల్తీ జరుగుతోంది అని చెప్పారు అండీ. అందుకని నూనె అంతా పారబోసేశా" అంటూ చెప్పింది.
"అవును, మా స్నేహితురాలు చెప్పింది, పప్పుదినుసులు, వంట నూనెలు అన్నింటిలోనూ కల్తీ కలుపుతున్నారు. అందుకని ఇప్పుడు సేంద్రియ ఉత్పత్తులు వస్తున్నాయటగా? అవి కొనుక్కుంటే కల్తీ బాధ ఉండదుగా, మేము అన్నీ అవే కొనుక్కుంటున్నాము అని చెప్పింది. మనం కూడా అవి కొనుక్కుందాం అండీ. నూనెలు కూడ గానుగలో ఆడినవి అమ్ముతున్నారుట కదా, అవే కొనుక్కుందాం" అని సాగదీసింది.
"వాటి ఖరీదు ఎంత ఉంటుందో ఆలోచించావా? మనం పెట్టే నెలవారీ సరుకుల ఖర్చు మూడింతలు అవుతుంది. అయినా 'సేంద్రియ పదార్థాలు ఇక్కడ అమ్మబడును' అనగానే ఉరుకులు, పరుగుల మీద కొనేస్తున్నారు. అవి కల్తీరహితమైనవా కాదా, ఆ దుకాణాలకు ఎక్కడి నుంచి వస్తున్నాయో అని కూడా తెలుసుకోకుండా" అన్నాడు పరమేశ్వర్.
"అవునండీ, మనం అమాయకులం. ఎవరేం చెప్పినా నమ్మేస్తాం. నిజంగా ఏం జరుగుతోందో ఎలా తెలుస్తుంది? ఎవరు నిజాయితీగా చెబుతారు? మనలాంటి వాళ్లు ఎవరిని నమ్మాలి?" అంది జయ విచారంగా.
"అవును, పత్రికలలో అధికారులు హఠాత్తుగా కొన్ని దుకాణాలు సోదాలు చేసి, సాక్ష్యాలతో సహా కల్తీ జరుగుతోందని పట్టుకున్నామని ఇచ్చే ప్రకటన ఆ రోజున చాంతాడంత అక్షరాలతో వేస్తారు. ఆ తరువాత ఆ విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకున్నారో ఎవరికీ తెలియదు.
నాలాంటి వాళ్ళు ఒక వారం రోజులు ఆ విషయం గురించి పత్రికలలో వెతుకుతాము. తరువాత మేము కూడా నెమ్మదిగా మరిచిపోతాం. మళ్ళీ కల్తీ పదార్థాలు అమ్మే దుకాణాలు, పాల డైరీలు, మినరల్ వాటర్ సరఫరాలు అన్నీ యథాతథంగా పని చేయడం మొదలుపెడతాయి. అప్పటికి మనం కూడా విసుగుపుట్టి, సరుకులు దొరికితే చాలు అనే పరిస్థితికి వచ్చేస్తాం.
ఎందుకంటే ఇవి అన్నీ అటు ఉన్నత తరగతికి చెందినవారిపై కానీ, ఇటు దిగువ మధ్యతరగతి చెందినవారిపై కానీ ఎలాంటి ప్రభావం చూపవు. మన మధ్యతరగతి వారమే అన్నిటికీ వెంటనే స్పందిస్తాము. అందుకే మనల్ని అందరూ లక్ష్యంగా చేసుకుంటారు."
"అన్నిట్లోనూ కల్తీ. చివరికి మనం పీల్చే గాలి కూడా కలుషితమైనదే. ఎక్కడ చూసినా కల్తీ. ఇలా ఐతే ఏం తినగలం? కల్తీ పదార్థాల మూలంగా ఆసుపత్రుల పాలైతే, అక్కడ కూడా చికిత్స సరిగా జరుగుతుందని హామీ ఎవరూ ఇవ్వలేరు. ఎందుకంటే అక్కడ వాడే మందులు కూడా కల్తీ వేమో మనకు తెలియదు కదా? ఎలా బ్రతకగలం? ఎలాగండీ, ఈ పరిస్థితి మారేది?" అంది జయ విచారంగా.
"అవును, పిల్లలు తినే చాక్లెట్, ఐస్ క్రీమ్‌లతో పాటు, అందరూ తాగే పాలు, పెరుగు, నీరు ఒక్కటేమిటి, అన్ని ఆహార పదార్థాలు, పానీయాలు కల్తీమయమైపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపటి తరాలను కల్తీ ఆహారం బారి నుండి రక్షించుకోలేక మనమే వారి భవిష్యత్‌ను కాలరాస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది.
మనుషులు స్వార్థాన్ని, ధన దాహాన్ని పక్కనపెట్టి, నైతిక విలువలు పాటిస్తూ, చిత్తశుద్ధితో జీవితాన్ని గడపడం మొదలుపెడితే పరిస్థితులలో మార్పు రావడం తథ్యం. అప్పుడే రేపటి తరాలవారు ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి
మనం అవకాశం కల్పించినవారం అవుతాం. ఆ మంచి రోజు తొందరలోనే రావాలని ఆశిద్దాం" అంటూ మహాకవి శ్రీశ్రీ గారి పాట "ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నంద నందనా" ను ఆలాపిస్తూ ఆశావహం వెలిబుచ్చాడు పరమేశ్వర్.
***
చిలకమర్రి రాజేశ్వరి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
చిలకమర్రి రాజేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి
నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.
మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.
నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.
పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని, నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.




Comments