కృత్రిమ మేథ
- Chilakamarri Rajeswari

- Jun 11
- 3 min read
#ChilakamarriRajeswari, #చిలకమర్రిరాజేశ్వరి, #KruthrimaMedha, #కృత్రిమమేథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Kruthrima Medha - New Telugu Story Written By - Chilakamarri Rajeswari
Published in manatelugukathalu.com on 10/06/2025
కృత్రిమ మేథ - తెలుగు కథ
రచన: చిలకమర్రి రాజేశ్వరి
“ఏమండీ, లేవండి, ఇంత మొద్దునిద్ర ఏంటండీ, తొందరగా లేవండి” అంటున్న భార్య అరుపుల్లాంటి మాటలకు ఉలిక్కిపడ్డాడు సదాశివం.
“ఏంటే, ఇప్పుడు ఏం కొంపలు ములిగిపోయాయని కేకలు పెడుతున్నావు, బంగారంలాంటి నిద్ర పాడుచేసావు కదే” అంటూ విసుక్కుంటూ కళ్ళు తెరిచాడు.
భయంతో వణికిపోతున్న భార్యని చూసి “ఏంటి భాగ్యం, ఏమైంది” అని అనునయంగా అడిగాడు.
“అది కాదండి, మరేమో..” అంటూ మాటలు రానట్టుగా ఉండిపోయింది.
ధైర్యం చెపుతున్నట్టుగా ఆమె భుజంమీద చేయివేసి, “అసలేమైంది చెప్పు, ఇదిగో, కొంచెం మంచినీళ్లు తాగి, నెమ్మదిగా చెప్పు” అని మంచినీళ్ళు గ్లాసులో పోసి త్రాగమని ఇచ్చాడు.
ఆవిడ అవి త్రాగి కొంచం కుదుటపడి, “ఏమైందంటే మన చిన్నాడి గది సర్దుదామని, వాడి గదిలోకి వెళ్ళాను. లోపల మంచం చివర ఒకమూల పులి గుడ్లురుముతూ నాకేసే చూస్తోంది. వెంటనే భయం వేసి, బయటికి వచ్చేసి, గది తలుపులు గడియ వేసి, మిమ్మల్ని లేపాను. అసలు మన ఇంట్లోకి పులి ఎలా వచ్చిందో అర్థం కావడంలేదు” అని భయం భయంగా చెప్పింది.
“ఏంటి, ఏమన్నా పగటికల కన్నావా? పులులు అడవిలో ఉంటాయి గానీ ఇళ్లలోకి రావు. అడవిలో దారి తప్పి మన ఇంటికి రావడానికి, మన ఇల్లు ఏమన్నా అడవిలో ఉంది అనుకున్నావా? సిటీ మధ్యలో ఉంది. నువ్వు దేన్ని చూసి ఏమనుకున్నావో” అంటూ తేలికగా కొట్టేసాడు.
“అవునులెండి, మీరసలు నా మాటలు ఎప్పుడు నమ్మారు గనుక. తలుపు తీస్తే అది ఎలాగూ బయటికి వచ్చి మనిద్దరినీ తినేస్తుంది. అప్పుడు నేను నిజమే చెప్పానని మీరు అందామనుకున్నా అనలేరు” అంటూ సాగదీసింది భాగ్యం.
“అదికాదు భాగ్యం, నేనిపుడేమన్నానని చెప్పు, పద చూద్దాం” అంటూ గది బయటికి వచ్చాడు.
ఇలా వాళ్ళిద్దరూ మల్లగుల్లాలు పడుతూండగానే, వాళ్ల అబ్బాయి రామ్ రావడం, గడియ తీసి గదిలోకి వెళ్లడం జరిగింది.
“అదేంటండీ, నేను గడియ పెట్టి వచ్చాను, ఇప్పుడు తీసిఉంది. మనం గదిలో మాట్లాడుకుంటున్నపుడు, అబ్బాయి వచ్చేసి గది లోపలకు వెళిపోయాడేమో, ఒక్కగానొక్క కొడుకు, ఆ పులి బారినపడి ఏమైపోయాడో” అంటూ తిరిగి ఏడుపు మొదలుపెట్టింది.
“భాగ్యం, నువ్వు మొదట ఆ ఏడుపు ఆపు, నీ ఏడుపుతో నా బుద్ధి పని చేయడంలేదు” అంటూ ఏం చేయాలా అని ఆలోచించసాగాడు.
“ఇంతలో గదిలోంచి రామ్ బయటికి వచ్చాడు, “అమ్మా, ఆకలేస్తోంది, పలహారం పెట్టు” అంటూ.
“ఒరేయ్, నువ్వెప్పుడు లోపలికి వెళ్ళావురా, నీకేం కాలేదుకదా” అంటూ దగ్గరకి తీసుకుంది.
“ఏంటమ్మా, ఏమైంది, ఎందుకు అంత భయపడుతున్నారు? గదిలోకి వెళితే ఏమౌతుంది?” అని అన్నాడు రామ్.
“అదేంటి? నా కళ్ళ తో నేను చూసాను, నీ గది సర్దుదామని తలుపు తీసేటప్పటికి లోపల ఒకమూలగా ఉన్న పెద్దపులిని. వెంటనే తలుపు గడియ పెట్టేసి, భయంతో నాన్నగారిని నిద్రలేపాను. ఏంచేయాలో తెలియక మేమిద్దరం తలలు బద్దలుకొట్టుకుంటుంటే, నువ్వు గది లోపలనుంచి బయటకు వచ్చి, ఏమైంది అంటూ ఇంత నెమ్మదిగా అడుగుతున్నావా?” అని అంది భాగ్యం.
“అదా, అమ్మా, నువ్వేం చూసి భయపడ్డావో, నాకు ఇప్పుడు అర్ధం అయింది. నేను కృత్రిమ మేధ మీద ప్రాజెక్టు చేస్తున్నాను. దానిలో భాగంగా నిన్న రాత్రి పులిని సృష్టించాను. పొద్దున్నే మీకు వివరంగా చెప్పి చూపిద్దామనుకున్నాను. ఇంతలో మా స్నేహితుడి దగ్గరనుంచి ఫోను వస్తే హడావుడిగా వెళిపోయాను. రావడం కొంచెం ఆలస్యం అయింది. నువ్వు నా గది సర్దుతావని అనుకోలేదు. ఆ పులి ఏం చేయదు అమ్మా, భయం లేదు” అని బదులు ఇచ్చాడు.
“ఆడవులని ఒకవైపు నరికి, ఆ క్రూరమృగాలకు నిలువనీడ లేకుండా చేస్తున్నారు, అలాంటప్పుడు అడవిలోంచి పులి, సిటీ దారి పట్టిందంటే ఆశ్చర్యపోనక్కరలేదు. ఇక ముందు ముందు జరగబోయేది కూడా అదే. అందుకే భయం వేసింది పులి అడవి నుంచి మన ఇంటికి వచ్చిందేమోనని అభ్యుదయం పేరిట స్వలాభాల కోసం అడవులు నాశనం చేయడం, ఆధునిక సాంకేతిక పేరుతో సృష్టికి ప్రతిసృష్టి చేయూలనుకోవడం మంచిది కాదు. ఆధునిక సాంకేతికత మనుషులను మరమనుషులుగా మార్చకూడదు” అని అంది భాగ్యం.
“అవును అమ్మా, నువ్వు చెప్పిన మాటలు నూటికి నూరుపాళ్ళు నిజం. మనిషి కనిపెట్టిన కృత్రిమమేధ మానవాళి అభ్యుదయానికి పనికి రావాలే గానీ, వినాశనానికి దోహదం చేయకూడదు. నేను ఈ రోజు నుంచి, ఆ దిశగానే, నా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతాను” అన్నాడు రామ్.
మంచిమాట అన్నావు రామ్, సహజవనరులను కాపాడుకుంటూ, మానవత్వపు విలువలను పాటిస్తూ, ఆధునిక సాంకేతికతను సరైనరీతిలో అందరూ ఉపయోగించుకొనేటట్లుగా చేస్తేనే నిజమైన అభివృద్ధి పథంలో నడుస్తుంది దేశం, పద ఆకలి వేస్తోంది అన్నావు. పలహారం చేద్దువుగాని, పద అంటూ వంటయింటివైపు దారి తీసింది భాగ్యం.
చిలకమర్రి రాజేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి
నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.
మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.
నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.
పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని, నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.




Comments