#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #PrakruthiPatalu, #ప్రకృతిపాఠాలు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 8
Prakruthi Patalu - Somanna Gari Kavithalu Part 8 - New Telugu Poems Written By - Gadwala Somanna Published In manatelugukathalu.com On 28/01/2025
ప్రకృతి పాఠాలు - సోమన్న గారి కవితలు పార్ట్ 8 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
ప్రకృతి పాఠాలు
----------------------------------------
అందమైన పూవులు
అవనిలోన తరువులు
అందించును సొగసులు
అలరించును మనసులు
పారే సెలయేరులు
ప్రాకే చిరు తీగలు
ఇల పరోపకారులు
మానవుల సేవకులు
ప్రకాశించు తారలు
విహరించే ఖగములు
మనిషికి స్ఫూర్తి దాతలు
పుడమిలోన మొక్కలు
చిన్ని చిన్ని చీమలు
అవే సంఘజీవులు
నేర్పునోయ్! పాఠాలు
ప్రబోధించు సత్యాలు

జీవిత సత్యాలు
----------------------------------------
చదవాలోయ్! లోకము
పొందాలోయ్! జ్ఞానము
మనశ్శాంతి ఉంటే
జీవితాన నాకము
పఠించాలోయ్! వేదము
గ్రహించాలోయ్!సారము
గుండెల్లో భారము
పెట్టుకుంటే నష్టము
మంచి వారి స్నేహము
చేస్తేనే మోదము
లేకున్న ప్రమాదము
అంతులేని దుఃఖము
బ్రతుకే పోరాటము
చేయాలోయ్!అనిశము
వీడరాదు ధైర్యము
చేరాలోయ్! గమ్యము

మాటల ముత్యాలు
----------------------------------------
బంధాలను దూరము
జీవితాలు ఘోరము
చేసుకోకు ఎన్నడు
నిలుపుకున్న ధన్యుడు
వెలుగులీను సూర్యుడు
గుణంలోన శ్రేష్ఠుడు
గౌరవింప మాన్యుడు
ఎంతైనా అర్హుడు
మాట మీద ఉంటే!
జగమంతా వెంటే!
సార్ధకము జీవితము
సద్బోధలు వింటే
కఠినమైన మాటలు
హృదయాల్లో మేకులు
చెప్పొద్దు చాడీలు
విరచనోయి!మనసులు
చెప్పువారు నీతులు
తవ్వరాదు గోతులు
విపరీతపు బుద్ధులు
పాడు చేయు బ్రతుకులు

బాలలకు బాటలు-బంగారు మాటలు
----------------------------------------
ఆకసాన సింగిడి
పూస్తేనే అందము
మనసులోన ఒత్తిడి
తగ్గితే ఉల్లాసము
జీవితాన అలజడి
రేపును సుడిగుండము
పదే పదే భయపడి
తెచ్చుకోకు గండము
అదుపులేని మనసులు
చెరుపునోయి! బ్రతుకులు
తుదకు మిగులు భస్మము
కల్గించును విస్మయము
హద్దులోన ఉంటే
అందరికీ క్షేమము
మహనీయుల మార్గము
తలపించును స్వర్గము

సూర్యచంద్రుల ఆదర్శము
----------------------------------------
పగటిపూట సూర్యునికి
రాత్రివేళ చంద్రునికి
క్రమశిక్షణే అధికము
అక్షరాల నిజము! నిజము!
క్రమాన్ని పాటిస్తారు
వేళకు వచ్చేస్తారు
చీకట్లు తరిమికొట్టి
కాంతిని వెదజల్లుతారు
నేర్పుతారు పాఠాలు
చెపుతారు గుణపాఠాలు
ఉగ్రరూపం దాల్చితే
చెప్పలేని అనర్ధాలు
స్వార్థమే లేని వారు
వెలిగే సూర్యచంద్రులు
భువిలో పరోపకారులు
కడు ఆదర్శమూర్తులు

మా చిన్నారి
---------------------------------------
చిన్నారి రాగాలు
సన్నాయి నాదాలు
మదిలోన మెదలేను
ఎన్నెన్నో భావాలు
అలతి అలతి పదాలు
పలికేను ముద్దుగా
కథలను వినిపిస్తే
వింటుంది శ్రద్ధగా
పాపాయి ఇంటిలో
వెలిగేను దివ్వెలా
నవ్వితే ముఖంలో
విరిసేను పువ్వులా
చిన్నారి సదనాన
కన్పించు చుక్కలా
ఎదిగేను లోకాన
ఎంచక్కా మొక్కలా
బహుమానము బాలిక
చూడాలి మంచిగా
కాంతులీను దీపిక
చదవాలి గొప్పగా
ఆడపిల్లల భవితకు
వేయాలి బాటలు
మానాలి వివక్షత
ఎరుగాలి బాధ్యత

కలం సందేశం
---------------------------------------
మంచిదైతే ఆశయము
అదే అభినందనీయము
సొంతమైతే విజయము
పల్లవించు ఆనందము
తెచ్చిపెట్టు క్రమశిక్షణ
అపారమైన గౌరవము
జీవితాలకు రక్షణ
చివరికదే ఆదర్శము
దిద్దుకుంటే జీవితము
జరుగుతుందోయ్! అద్భుతము
లేకుంటే సమాజాన
చూపుతుందోయ్! ప్రభావము
హద్దులేని జీవితాలు
చిరిగిపోయిన కాగితాలు
దారము తెగిన పతంగులు
నాశనమే కుటుంబాలు
ఇది అక్షర సందేశము
పాటించమని ఆదేశము
ఆచరిస్తే క్షేమము
లేకపోతే పతనము

వాస్తవాల వెలుగులు
---------------------------------------
మేఘాల నీడలో
విహరించే పక్షులు
స్వచ్ఛమైన స్వేచ్ఛకు
అవే కదా! సాక్షులు
ఎంచక్కా నీటిలో
నివసించే చేపలు
ప్రవాహానికి జడియక
ఎదురీదే ప్రాణులు
ఆశల పందిరిలో
జీవించే మనుషులు
ఆశయ సాధనలో
పోరాడే యోధులు
మంచిని కాంక్షించే
మహిలోన మహాత్ములు
సమైక్యత సాధించే
నిజముగా భగీరథులు
విశాల విశ్వంలో
ఎన్నెన్నో వింతలు
పరికింప అబ్బురము
ఎనలేని సంబరము
మనిషి జీవితంలో
ఉండునోయి! కొరతలు
అధిగమిస్తే గనుక
బాగుపడును బ్రతుకులు

చక్కని బామ్మ మాటలు
---------------------------------------
అందమైన పక్షులు
స్వేచ్చగలవి పక్షులు
నింగిలో హాయిగా
విహరించే పక్షులు
వనంలోని పూవులు
ఇష్టమైన పూవులు
కనువిందు చేసే
సొగసులీను పూవులు
ఇంటిలోని పిల్లలు
ముద్దులొలుకు పిల్లలు
అవనిలో అందరిని
అలరించే పిల్లలు
పుడమిలోని తరువులు
ఫలాలిచ్చు తరువులు
మానవాళి మనుగడకు
ఉపకరించు తరువులు
వసుధలోన వనితలు
సదనంలో జ్యోతులు
కుటుంబాన్ని దిద్దే
బాధ్యత గల వనితలు
బుద్ధి చెప్పు గురువులు
గద్దించే గురువులు
సమాజాన పూజ్యులు
జ్ఞానమిచ్చు గురువులు

అమ్మ ప్రేమ అద్భుతము
---------------------------------------
అమ్మ పిలుపులో ఉంది
అనురాగము మెండుగా
ఆమె గుండెలో ఉంది
ప్రేమామృతము నిండుగా
తల్లి గుణంలో ఉంది
త్యాగమే క్రొవ్వొత్తిలా
మల్లెలాంటి మనసుంది
జీవజలపు ఊటలా
మాత మాటలో ఉంది
ఆశీస్సులు ధారలా
అనునిత్యం వెలుగుతుంది
ఆకసాన తారలా
మాతృమూర్తి బహుమానము
లేదు లేదు కొలమానము
ఆమె ఉంటే కుటుంబము
అగును శోభాయమానము
***
-గద్వాల సోమన్న
Comments