top of page
Original.png

ప్రస్థానం


ప్రస్థానం కథ, తెలుగు కథ, భావోద్వేగ తెలుగు కథ, స్నేహం కథ, వృద్ధాప్యం, ఒంటరితనం, అంత్యక్రియలు, మానవత్వం, జీవిత సత్యాలు, మహిళల స్నేహం, తెలుగు కుటుంబ కథ, అనాథల సేవ, తెలుగు సాహిత్యం, మన తెలుగు కథలు, emotional Telugu story, friendship story Telugu, old age story Telugu

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'ప్రస్థానం' కథలో జీవిత అనిశ్చితి, వృద్ధాప్యం, స్నేహం, మానవత్వం, ఆశ, నష్టం మరియు జీవిత ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ సాయంత్రపు వెలుగులో కలిసి నడుస్తున్న ఇద్దరు వృద్ధ తెలుగు మహిళల భావోద్వేగ ప్రతీకాత్మక దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'ప్రస్థానం' కథలో జీవిత అనిశ్చితి, వృద్ధాప్యం, స్నేహం, మానవత్వం, ఆశ, నష్టం మరియు జీవిత ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ సాయంత్రపు వెలుగులో కలిసి నడుస్తున్న ఇద్దరు వృద్ధ తెలుగు మహిళల భావోద్వేగ ప్రతీకాత్మక దృశ్యం.

Prasthanam - Telugu Emotional Family Story | Nayana kasthuri

ప్రస్థానం తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | నయన కస్తూరి

Published in manatelugukathalu.com on 03/07/2026

                                                                                                                      

ప్రస్థానం జీవితం, మరణం, స్నేహం, మానవత్వం గురించి లోతుగా ఆలోచింపజేసే ఒక హృదయాన్ని కదిలించే తెలుగు భావోద్వేగ కథ. వృద్ధాప్యంలో ఒంటరితనం, కుటుంబ బంధాల విలువ, మరణం తర్వాత ఆచారాల కంటే బ్రతికున్నవారికి చేయు సేవ గొప్పదనే సందేశాన్ని ఈ కథ అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. కమలమ్మ, సరోజనమ్మల మధ్య ఉన్న స్వచ్ఛమైన స్నేహం, ఒక విషాద సంఘటన ద్వారా జీవిత సత్యాలను తెలియజేస్తూ ప్రతి పాఠకుడి మనసును తాకుతుంది. స్నేహం, మానవత్వం, వృద్ధాప్యం, జీవిత సత్యాలు, తెలుగు కుటుంబ కథలు ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన కథ ఇది.


సరోజనమ్మ, కమలమ్మ మంచి స్నేహితురాళ్లు. 


ఇద్దరిలో సరోజనమ్మ కొంచెం చిన్నది. ఆవిడకి ఒకే ఒక్క కొడుకు. ఈ మధ్యనే పెళ్లి అయ్యింది. కొడుకు, కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులు. చిన్నాచితకా బజారు పనులు సరోజనమ్మే చేసుకుంటుంది. ఆవిడకి ఇంకా ఆ మాత్రం ఓపిక ఉంది. దానికి తోడు కమలమ్మకి బజారు పనులలో ఎలాగూ తోడుగా రమ్మంటుంది. ఎలాగూ వెళ్ళక తప్పదు. 


ఆరే! మీకు కమలమ్మ గారి గురించి ఏమీ చెప్పలేదు కదూ? చెప్తా వినండి మరి. డెబ్బయి పడిలో పడిన ఆమె ఒంటరిగా జీవితం సాగిస్తోంది. ఆమె భర్త పోయి ఐదు సంవత్సరాలు అవుతోంది. వారికి సంతానం కలుగలేదు. పెద్ద ఆస్తిపరులు కాదు. బంధువుల రాకపోకలేమీ లేవు. అందుకని సరోజనమ్మ గారి స్నేహంతో ఆమెకు భర్త తర్వాత లభించే కొద్దిపాటి కుటుంబ పెన్షన్ తో కాలం వెళ్లబుచ్చుతోంది. 


భోజనాల తర్వాత ఇంట్లో వాడుకకు కావలసిన సరుకుల కోసం ఇద్దరు చెరో చేతి సంచి పట్టుకుని బయలుదేరారు సరోజినమ్మ మరియు కమలమ్మ. రెండు వీధులు దాటారో లేదో రోడ్ కి ఒక పక్కగా పదిమంది జనం గుమిగూడి ఉన్నారు. ఏమైందో చూద్దామని స్నేహితురాళ్లిద్దరూ గుంపులో దారి చూసుకుని దూరి చూద్దురు కదా, ఒక ముసలావిడ పడి ఉంది. చేతిలో గుడ్డ సంచి ఉంది. చూడబోతే పాపం ప్రాణం పోయినట్టుంది. అందరూ సానుభూతి చూపిస్తున్నారు.


"అయ్యో, ఎక్కడావిడో ఇక్కడ ప్రాణం పోయింది."


"వివరాలు కూడా తెలియవు. వాళ్ల వాళ్లకు కబురు ఎలా తెలిసేనూ?" అందరూ అనుకుంటున్నారు.


ఒక పెద్ద మనిషి ఆమె చేతిలో ఉన్న సంచి తీసి చూశారు. అందులో ఒక చిన్న పర్స్. అందులో 52 రూపాయలు తప్పితే వారికి ఇంటి నంబర్ కానీ ఫోన్ నంబర్ కానీ దొరకలేదు.


"ఎవరు లేరనుకుంటా. పోలీసులకి చెప్తే మునిసిపాలిటీ వాళ్లు తీసుకుని పోయి చెయ్యాల్సింది చేస్తారు."


"కమలా మనకి ఆలస్యమవుతుంది, పోదాం రా" అంటూ అచేతనంగా నిలబడిపోయి అలాగే చూస్తున్న కమలమ్మ చేయి లాగి బయలుదేరదీసింది.


"సరోజినీ, పాపం ఆ శవాన్ని ఏమి చేస్తారే? ఎవరు సంస్కారం చేస్తారు? 

అయినవాళ్లేవరు లేకపోతే?" అడిగింది మనసు నిండా బాధ నింపుకుని కమలమ్మ.


"ఏం చేస్తారు! మున్సిపాలిటీ వాళ్లు చెత్త బండిలో వేసుకుని చెత్తతో పాటు తగలేస్తారు. అయినా కమలా! అవేమీ ఆలోచించకు ఇప్పుడు. ఎవరి ప్రారబ్దం వాళ్లది.

పద పద మన పని కానిచ్చుకుందాము" అంటూ ముందుకు సాగింది.


"సరోజినీ, నా మనసు ఏ మాత్రం బాగాలేదు సుమా. ఇప్పుడేమీ కొనుక్కోవద్దు, పద ఇంటికి పోదాం" అని బలవంతం పెట్టి ఇంటి దారి పట్టించింది.


మర్నాడు పొద్దున్నే సరోజనమ్మ వాళ్ల ఇంటి తలుపు ఎవరో కొట్టిన చప్పుడైంది. ఆ రోజు ఆదివారం కావడంతో కొడుకు, కోడలు ఇంకా నిద్రలేవలేదు.

"ఎవరబ్బా ఇంత పొద్దున్నే" అనుకుంటూ తలుపు తీసింది సరోజనమ్మ. ఎదురుగా కమలమ్మ.


"ఏవిటమ్మా కమలా ఇంత పొద్దుటే వచ్చావు? మొహం ఏమిటలా ఉంది, వంట్లో నలతగా ఉందా ఏమిటి?" ఆరా తీసింది.


"చెప్తా సరోజినీ, లోపలికి పద, తలుపు వేసేయి. రాత్రి ఒక్క నిమిషం నిద్ర పడితే ఒట్టు. గుండెల్లో ఒకటే బాధ. నిన్నొకటి అడుగుతాను కాదనకుండా చేస్తావా?" కోరింది కమలమ్మ.


"ఏమి కావాలి నీకు? చెప్తే కదా తెలిసేది."


"నువ్వు చేస్తావా? చెయ్యవా? ముందు చెప్పు" జాలిగా అడిగింది కమలమ్మ.


'అబ్బ, నువ్వడిగితే నేను చెయ్యకుండా ఉంటానా? మనసులో అనుమానం పెట్టుకోకుండా అడుగు.' భరోసా ఇచ్చింది సరోజినమ్మ.


"మరి నేను చనిపోయినప్పుడు నాకు నీ కొడుకు చేత తల కొరివి పెట్టిస్తావా?" గబగబా మనసులో మాట బయటపెట్టేసింది.


ఊహించని ఈ ప్రశ్నకి సరోజినమ్మ హతాసురాలైంది. "కమలా ఏమిటి నువ్వడిగేది? నీకేమీ కాదు. నువ్వు బాగానే ఉంటావు." అని సముదాయించింది.


"ఇప్పుడేమీ కాలేదులే, అలా అయినప్పుడు నీ కొడుకు చేత నాకు దహన సంస్కారాలు చేయిస్తావా లేదా?" అని మళ్లీ అడిగింది. సరోజినమ్మ నోట మాట రాక అలాగే ఉండిపోయింది.


"సరోజినీ, నీ డబ్బులేమీ పెట్టక్కర్లేదు. ప్రతీ పైసా నాదే పెట్టు. నీకు ఖర్చులకు సరిపడా డబ్బు నేను ముందుగానే అందజేస్తాను. నాకు ముందు వెనుక ఎవ్వరూ లేరే. నా కడుపున ఒక్క కాయన్నా కాయలేదు. నీకు తెలుసుగా." అంటూ ఆగి సరోజినమ్మ మొహం లోకి చూసింది. కానీ కమలమ్మకు అవునా కాదనా అర్థం కాలేదు.


"మనం నిన్న చూసిన అనాధ చావు నేను భరించలేనే. నాకు అన్నీ పద్ధతి ప్రకారం జరగాలి. ఆయనగారు ముందే వెళ్లిపోయారు నా గురించి ఏ మాత్రం ఆలోచించకుండా. ఏమంటావు? చేస్తావా? రేపు నేను నీకు డబ్బు తీసుకుని వచ్చి ఇస్తా. వెళ్లొస్తా" అంటూ వెళ్లిపోయింది.


మరుసటి రోజే కమలమ్మ ఒక లక్ష రూపాయలు తీసుకుని వచ్చి సరోజినికి ఇచ్చి, ఆమె దగ్గర నుండి మాట తీసుకుని నిశ్చింతగా వెళ్లిపోయింది.


ఆ రోజు శనివారం కావడం వలన ఆంజనేయుడి గుడికి వెళ్లడానికి కమలమ్మ, సరోజినమ్మ ఇంటికి ఉదయాన్నే వచ్చింది.

"వచ్చావా కమలా! నీకే కబురు పెడదామనుకుంటున్నా. రేపు వేణు, కోడలు ఢిల్లీ వెళ్తారుట. అబ్బాయి ఆఫీస్ పని మీద వెళ్తున్నాడు. కోడల్ని కూడా వస్తావా అని అడుగుతున్నాడు."


"వెళ్లనివ్వు. పాపం సరదాగా నాలుగు రోజులు తిరిగి రానివ్వు."


"అదేనే నేనూ చెప్తున్నాను. నన్ను కూడా రమ్మంటున్నారు. ఒక్కర్తివి ఉండటం ఎందుకంటూ."


"ఓ అయితే సరోజా నువ్వు కూడా వెళ్తున్నావా! నన్నోకర్తినీ వదిలేసి ఇక్కడ?" కమలమ్మ కంగారు పడింది.


"నిన్నెందుకు వదిలి వెళ్తానే కమల? ఆ! దేవుడు పిలిచినా వెళ్లనే.. నువ్వు ఆ నాలుగు రోజులూ ఇక్కడే ఉండు. మనం సరదాగా గడుపుదాము." సరోజనమ్మ తన ప్లాన్ చెప్పింది.


"నువ్వే రావచ్చు కదుటే మా ఇంటికి" కమలమ్మ తన మనసులోని మాట చెప్పింది.


"అది కాదే, ఇక్కడుందాము. హనుమాన్ గుడికి వెళ్లొచ్చు. సుజాత వంటకు ఉంది. అన్నీ చేసి పెడుతుంది. మార్నింగ్ వాక్ కి వెళ్లొచ్చు. సరేనా?"


"సరెలేవే, నీ మాట ఎప్పుడు కాదన్నానే? నేనే వచ్చి ఉంటాలే" కమలమ్మ ఒప్పుకుంది.


"థాంక్స్ కమలా! అయితే వేణుతో చెప్పేస్తున్నా. నువ్వు ఉంటావని వాళ్లను వెళ్లమని చెప్తాను. సరేనా?"


అంటూ ఆనందంగా కమలను పట్టుకుని దగ్గరకు తీసుకుంది.


 "అలాగేలేవే చెప్పు వేణుతో. ఎప్పుడెళ్తారో చెప్తే నేను నాలుగు చీరలు, మందులు, మాకులు అన్నీ తెచ్చుకుంటాను."


"అలాగే మందులు తెచ్చుకో చాలు. చీరలు నావే కట్టుకోవచ్చులే."


"అలాగే లేవే. సరే ఇక నేను ఇంటికి వెళ్తాను" అని తన ఇంటికి బయలుదేరింది కమలమ్మ.


కమలమ్మని తల్లికి తోడుపెట్టి వేణు భార్యతో సహా ఢిల్లీ వెళ్లడానికి విమానం ఎక్కాడు. ఇక్కడ స్నేహితురాళ్లిద్దరూ చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపారు. వాళ్ల కబుర్లకి అంతే లేకుండా పోయింది. నాలుగు రోజుల్లో ఒక రోజు సినిమాకి వెళ్లారు. ఒక రోజు షాపింగ్ కి వెళ్లారు. ఇంకో రోజు ఇంకో ఫ్రెండ్ కౌసల్యని వెళ్లి కలిశారు. చాలా సంతోషంగా గడిపారు. 


ఇక ఆ రోజు వేణు వాళ్లు ఇంటికి వచ్చే రోజు. వేణు రాగానే అన్నీ సంగతులు చెప్పాలనుకున్నారు. షాపింగ్ లో కోడలికి కొన్న చీర చూపించి, సంతోష పెట్టాలనుకున్నారు. వేణుకి ఇష్టమైన మామిడికాయ పప్పు, వంకాయ కూర చేసి ఉంచారు. వాళ్లు వచ్చే విమానం లాండింగ్ టైం మధ్యాహ్నం పన్నెండు గంటలకి. ఇంటికి వచ్చేటప్పటికి రెండు అవుతుంది. కలిసి భోజనం చేద్దామని అన్నీ రెడీగా టేబుల్ మీద పెట్టి కాసేపు టీవీ చూద్దామని పెట్టింది కమలమ్మ. ఇద్దరూ కూర్చుని చూస్తున్నారు.


"ఏదైనా న్యూస్ ఛానల్ పెట్టవే, న్యూస్ చూద్దాము" సరోజినమ్మ అడిగింది. కమలమ్మ పెట్టింది.


ఇద్దరూ చూస్తున్నారు. "సౌండ్ పెంచవే, ఏదో విమాన ప్రమాదం లాగా ఉంది" చెప్పింది కమలమ్మకి. 


పెట్టి చూస్తున్నారు. చూస్తుండగా సరోజినమ్మ ముఖ కవళికలు మారుతున్నాయి. "ఒసేవ్ సరోజా! మన వేణు వాళ్లు ఎక్కిన విమానం కాదు కదా" ఆందోళన స్వరంతో అడిగింది కమలమ్మ.


"ఏమోనే, ఏదోలాగా ఉంది నా మనసు. నాకు కంగారుగా ఉంది. కాళ్లు చేతులు ఆడటం లేదు. ఢిల్లీ నుండి హైదరాబాద్ విమానం. అదే నెంబర్, అదే టైం అదేనే. ఇంకేంటి? వేణు, కోడలు ఎలా ఉన్నారో ఏమయ్యారో. ఎలా తెలుస్తుంది?" అని కళ్లనీళ్లు పెట్టుకుంది సరోజినమ్మ. 


స్నేహితురాలను చూసి కమలమ్మకు గుండె చెరువైంది. ధైర్యం తెచ్చుకుని, "ఉండవే సరోజా, మనవాళ్లకు ఏమీ కాదు, దేవుడున్నాడు. మీ అన్నయ్యకు ఫోన్ చేసి, వివరాలు కనుక్కోమంటాను, కంగారు పడకు" అని చెప్పిందే కానీ, టీవీలో విమానం లాండింగ్ అయ్యే ముందు కూలి కాలి బూడిదయిందని, అందులోని వారందరూ పూర్తిగా కాలిపోయి ఎవరూ గుర్తుపట్టలేకుండా బూడిద లాగా మిగిలారని చెప్తుంటే, వారి క్షేమం పై ఏమాత్రం ఆశ లేకుండా పోయింది. 


సరోజనమ్మ వాళ్ల అన్నయ్యకి ఫోన్ చేసి, విషయమంతా చెప్పింది. ఆయన చెల్లెలిని కంగారు పడొద్దని చెప్పి, తను వెళ్లి కనుక్కుంటానని ఎయిర్పోర్ట్ కి వెళ్లాడు. 


స్నేహితురాలు ఏడుస్తూనే ఉంది కొడుకు, కోడలు కోసం. ఎదురు చూస్తూనే ఉన్నారు, తిండి తిప్పలు లేకుండా. ఎవరి శరీరాలో కనిపెట్టలేకపోయారని, అందరూ పూర్తిగా కాలిపోయారని, పోలీసులు అందర్నీ వెనక్కు పంపారని అన్నయ్య వచ్చి చెప్పేసరికి సరోజను ఎవరూ పట్టలేకపోయారు.


"బంధువులు ఎవరూ లేకపోతే అనాథ అంటారు. అందరూ ఉండి నా బిడ్డ, కోడలు అనాథల్లాగా వెళ్ళిపోయారు కమలా" అంటూ ఏడుస్తున్న సరోజను ఆపడం కమలమ్మకు సాధ్యం కావడం లేదు. 


ఎవరూ ఏమీ చేయలేకపోయారు, ఏడవడం తప్పితే. ఇలాంటి సమయంలో కుటుంబం ఉన్నా లేకపోయినా ఒకటిగానే ఉంది. మొన్న చూసిన అనాథ శవానికి, వేణు వాళ్లకు పెద్ద తేడా ఏమీ కనిపించలేదు కమలమ్మకి. ప్రాణం పోయాక వారికి ఏమీ తెలియదు. ఎవరు తలకి కొరివి పెడితే ఏమిటి? వీళ్లకి అసలు తలలే లేకుండా పోయాయి పాపం. 


వేణు వాళ్లకి ఏమైనా తెలుస్తుందా తమకి ఎవరు అంత్యక్రియలు చేశారని? అసలు చేశారా లేదా అని?? రేపు తను పోతే తన తలకి కూడా ఎవరు కొరివి పెట్టినా ఒకటే. దాని కోసం డబ్బు ఏమీ కూడబెట్టక్కర్లేదు. ఆ లక్షను నేను, సరోజా కలిసి ఏదైనా అనాథ శరణాలయానికి ఇచ్చి అనాథలను బ్రతికించడానికి ఖర్చుపెట్టమంటాను. అంతే కాని, నేను చనిపోతే చేసే పూజలకి కాదు. ప్రస్థానం జేరాక ఆత్మ పరమాత్మలో కలిశాక ఎవరు అంతిమ సంస్కారాలు జరిపినా ఒకటే. ఒక నిర్ణయానికి వచ్చిన కమలమ్మ దుఃఖాన్ని ఆపుకుని, మనసు దృఢం చేసుకుని, సరోజినీని ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది.

***

💖 ఈ కథ మీ హృదయాన్ని తాకిందా?

జీవితం ఎంత అనిశ్చితమో, మనిషికి చివరికి మిగిలేది ప్రేమ, మానవత్వం మాత్రమే అని ఈ కథ గుర్తు చేస్తుంది.

📝 మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

📲 ఈ కథను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి.

❤️ బ్రతికున్నవారిని ప్రేమిద్దాం... అవసరంలో ఉన్నవారికి చేయూతనిద్దాం... అదే నిజమైన మానవత్వం.

మన తెలుగు కథలులో మరిన్ని విలువైన తెలుగు కథలు చదవడానికి మా వెబ్‌సైట్‌ను తరచూ సందర్శించండి.


నయన కస్తూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: నయన కస్తూరి

నా పేరు నయనతార కస్తూరి. నా విద్యార్హత M A English Lit. Med. తెలుగు, ఇంగ్లీష్  హిందీ భాషలంటే ఎంతో అభిమానం. కధలు వ్యాసాలు, ఆధ్యాత్మిక  విషయాలు  రచించుట నా హాబీ. నేను రచించిన కొన్ని కధలు మాస వార పత్రికలలో ప్రచురింప బడినవి..మేము హైదరాబాద్ వాస్తవ్యులము.

6 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Venkata Bandhakavi
Venkata Bandhakavi
28 minutes ago
Rated 5 out of 5 stars.

గుండెలు పిండి చేసే కథ ఆవిష్కరించారు నయన గారు. చాలా fatalistic మైండ్ సెట్ తో రాసినట్టున్నారు. అయితే, ఎన్ని సార్లు చదివినా " వాళ్లకు ఇప్పుడు ఎవరు తలకొరివి పెడితేనేం, వారికి తలలే లేకుండా పోతేనూ" అన్న వాక్యం చదువుతుంటే, నాకు నవ్వు ఆగలేదు. క్షమార్హుడిని, క్షంతవ్యుడిని.

Like

pbandhakavi55
15 hours ago
Rated 5 out of 5 stars.

గంభీరమైన కథ. మనసుని తాకింది

Like

kanakadurga sistla
kanakadurga sistla
16 hours ago
Rated 5 out of 5 stars.

gunde baruvekkinche katha.

Like

Rajasekhar Reddy
Rajasekhar Reddy
16 hours ago
Rated 5 out of 5 stars.

జీవితం, మరణం, మానవత్వం వంటి గంభీరమైన అంశాలను ఎంతో ఆలోచింపజేసే విధంగా అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రతి మాటలో లోతైన భావం కనిపించింది. చదివిన తర్వాత మనసులో ఎన్నో ప్రశ్నలు, ఆలోచనలు మిగిల్చే గొప్ప రచన. మీ రచనా శైలికి అభినందనలు. ఇలాంటి విలువైన రచనలు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను.

Like
Nayana Kasturi
Nayana Kasturi
14 hours ago
Replying to

Thank u very much.

Like

Rated 5 out of 5 stars.

హృదయాన్ని కదిలించే కథ! ఆలోచింపచేసే కథ! అభినందనలు నయన గారూ.

Like
bottom of page