క్షమించు ప్రియతమా!
Updated: Aug 1
తెలుగు నీతి కథ, inspirational Telugu story, తృప్తి విలువ, కోరికల గురించి కథ, moral stories Telugu

Kshaminchu Priyathama - Telugu Emotional Love Story | Palla Venkata Ramarao
క్షమించు ప్రియతమా - తెలుగు భావోద్వేగ ప్రేమ కథ | పల్లా వెంకట రామారావు
Published In manatelugukathalu.com On 03/07/2026
"ప్రేమించాను... కానీ నిన్ను పెళ్లి చేసుకోలేను... కమల చెప్పిన కారణం వింటే షాక్ అవుతారు!"
పల్లా వెంకట రామారావు గారి క్షమించు ప్రియతమా కథను చదవండి.
ప్రపంచం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కళ్లతో చూసేది, రెండోది మనసుతో అనుభవించేది. అనిల్, కమలల ప్రపంచం రెండో రకానిది.
ఒకరోజు ఉదయం, వాళ్ళిద్దరూ ఒక రోడ్డు క్రాసింగ్‌లో అనుకోకుండా ఢీకొన్నారు.
ఒకరి చేతిలో ఉన్న కర్ర, మరొకరి గాజుల శబ్దం తప్పించి ఇంకేమీ వాళ్ళకి వినిపించలేదు.
"కాస్త చూసుకో వచ్చు కదండీ! నాకంటే కళ్ళు లేవు, మీరైనా జాగ్రత్తగా ఉండాలి కదా" అని కోపంగా అంది కమల.
"భలే వారండీ! నాకు మాత్రం ఉన్నాయా? నేను కూడా బ్లైండ్‌నే" అని బదులిచ్చాడు అనిల్.
కమల నమ్మలేనట్టుగా "ఏంటండీ జోక్ చేస్తున్నారా?" అంది.
"నా బ్రతుక్కి జోక్ కూడానా? నేను నిజమే చెప్తున్నానండీ. నమ్మలేరా? నిరూపించాలా?" అని అన్నాడు అనిల్.
కమల తన తప్పు తెలుసుకుని సిగ్గుపడింది. "సారీ అండీ. మీరూ కొందరిలాగా నన్ను తమాషా చేస్తున్నారేమో అనుకున్నాను. "
"పర్లేదు లెండి. మనకు ఇది మామూలే. బై ద వే, నా పేరు అనిల్. ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాను, " అన్నాడు అనిల్.
"నైస్ టు మీట్ యు. నా పేరు కమల" అంది కమల.
మాటల్లో వాళ్ళిద్దరూ ఒకే యూనియన్ మీటింగ్‌కి వెళ్తున్నామని తెలుసుకున్నారు. అనిల్ వెంటనే కాఫీ షాప్‌కి వెళ్దామని అడిగాడు. ఆ క్షణం నుండీ వాళ్ళ స్నేహం మొదలయ్యింది. కాఫీ తాగుతూ, నవ్వుతూ, ఒకరి మనసులోని మాటలు మరొకరు పంచుకున్నారు.
రెండు నెలల తర్వాత...
వాళ్ళ బంధం ప్రేమగా మారింది. ఒక రోజు అనిల్ కమలకు ఫోన్ చేసి, "ఏం చేస్తున్నారు?" అని అడిగాడు.
కమల "కిటికీ పక్కన కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను" అంది.
"అవునా? ఎలా?" అని ఆసక్తిగా అడిగాడు అనిల్.
కమల ఆ మధురమైన దృశ్యాన్ని కళ్ళ ముందు చూస్తున్నట్టు వర్ణించింది. "ఇందాకే వర్షం కురిసి ఆగిపోయింది. పక్షులు రెక్కలు ఆరబెట్టుకుని కిలకిలలాడుకుంటున్నాయి. కోయిల ఆనందంతో పాట పాడుతోంది. "
"అవునవును. వినిపిస్తోంది" అన్నాడు అనిల్, ఆ దృశ్యాన్ని తను కూడా అనుభవిస్తున్నట్టుగా.
కమల తన మనసులోని భావాలను మాటలుగా మార్చింది. "మట్టి వాసన కమ్మగా వస్తోంది. ఆకులపై పడ్డ నీరు బిందువులుగా కిందకి రాలుతూ కొత్త రాగాల్ని పలికిస్తోంది. తడికి అతుక్కున్న ఆకులు మెల్లిగా విడిపోతూ, చెట్టు ఒళ్ళు విరుచుకుంటున్నట్లుంది. అమ్మ ఇచ్చిన కాఫీ కమ్మదనాన్ని, వెచ్చదనాన్ని ఒకేసారి అందిస్తుంటే వర్ణించలేని అనుభూతుల్ని మనసారా ఆస్వాదిస్తున్నాను."
"అబ్బో! మీలో ఇంత పొయెటిక్ సెన్స్ ఉందని నాకు తెలీదండీ, " అని అనిల్ ఆశ్చర్యంగా అన్నాడు.
కమల నవ్వుకుంది.
"ఏమండీ, మీరు మంచి మూడ్‌లో ఉన్నారు కాబట్టి, మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. విన్నాక కూడా మీరు ఇదే మూడ్‌లో ఉండాలి" అని అనిల్ కాస్త కంగారుగా అన్నాడు.
"ఏంటి? ఎప్పుడూ లేనిది, ఏదైనా కొత్త విషయమా?" అంది కమల.
"అది పాతదే కానీ చెప్పాలంటే కొత్తగా ఉంది, " అన్నాడు అనిల్.
కమల నవ్వుతూ, "ఏమిటండీ ఆ కంగారు, కొత్తగా ప్రేమలో పడ్డవారిలాగా, " అంది.
"ఎగ్జాక్ట్‌లీ!" అని అనిల్ అరిచాడు. "చూశారా! దేవుడు మీ నోటితోనే పలికించాడు. "
కమల నవ్వు ఆగిపోయింది. "ఏంటి కొంపదీసి నిజంగానే... "
"కమలా! సీరియస్ గా చెప్తున్నా... " అన్నాడు అనిల్.
"ఓకే ఓకే, చెప్పండి అయితే, " అంది కమల.
ఒక్క క్షణం నిశ్శబ్దం.
"కమలా! ఐ లవ్ యూ. డూ యూ లవ్ మి?" అని అడిగాడు అనిల్.
మళ్ళీ కొద్దిసేపు నిశ్శబ్దం.
"కమలా! పలుకవా?"
"ఊ... " అని చిన్నగా అంది కమల.
"ఏంటి? సరిగా చెప్పు, " అని అడిగాడు అనిల్.
"ఊ... " అని ఈసారి దీర్ఘంగా, ఒప్పుకుంటున్నట్టు పలికింది.
"అంటే... " అని సంతోషంగా అన్నాడు అనిల్.
ఇద్దరూ నవ్వుల్లో మునిగిపోయారు. వాళ్ళ ప్రేమకు రెక్కలొచ్చాయి.
కొన్ని రోజుల తర్వాత...
అనిల్ కమలకు ఫోన్ చేసాడు. "కమలా! ఇంట్లో నా పెళ్లి గురించి ఫోర్స్ చేస్తున్నారు. ఇక టైం వచ్చేసింది. మన ప్రేమ గురించి చెప్పేసి పెళ్లి ఫిక్స్ చేసుకుందాం. ఏమంటావ్?" అని అడిగాడు.
కమల వైపు నుండి ఎటువంటి స్పందనా రాలేదు.
"హలో కమలా! పలుకు, " అని అనిల్ కంగారుగా అన్నాడు.
"ఏమని చెప్పను అనిల్! కన్న కలలు పేకమేడల్లా కూలిపోతుంటే మనసు దాటి మాట బయటకి రావడం లేదు" అని కమల ఉదాసీనంగా అంది.
"ఏమైంది కమలా?" అని అనిల్ ఆందోళనగా అడిగాడు.
"అనిల్! మనం ఒకటయ్యే అదృష్టం లేదు, " అంది కమల.
"ఏం, ఎందుకని?" అని అడిగాడు అనిల్.
"అదంతే అనిల్. నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా, " అంది కమల.
"కారణం చెప్పకుండా ఏంటిదంతా?" అని అడిగాడు అనిల్.
కమల తన మనసులోని బాధను, భయాన్ని బయటపెట్టింది. "ఏ సారూప్యత అయితే మనల్ని కలిపిందో, అదే మనకిప్పుడు శాపమైంది. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల, లేదా రెండు మనసుల కలయిక కావొచ్చు. కానీ పెళ్లి భవిష్యత్తుకు సంబంధించిన అతి పెద్ద నిర్ణయం. చాలామంది ఇక్కడే తప్పటడుగు వేస్తారు. ఎమోషన్స్ కు లోనై నిర్ణయం తీసుకుంటారు.
మన విషయానికి వస్తే, మనల్ని పెంచడానికి మన తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. మనం పెళ్లి చేసుకుంటే పిల్లల్ని ఎలా పెంచుతాం? ఒకవేళ మన తల్లిదండ్రులు సహాయం చేసినా, వారు ఎంతకాలం చేయగలరు? స్నేహితులు, చుట్టాలు సహాయం చేసినా జీవితాంతం మన వెంట ఉండలేరు కదా?
అదే మన జీవిత భాగస్వామి పిల్లల్ని చూస్తూ వారి ముద్దుముద్దు చేష్టలు వర్ణిస్తుంటే, వారి ఎదుగుదలను తెలియజేస్తూ ఉంటే ఆ తృప్తి, ఆ ఆనందం వేరుగా ఉంటుంది. బాగా ఆలోచించి చూడు నీకే అర్థమవుతుంది. ఏ పరిస్థితులు మనల్ని కలిపాయో, ఆ పరిస్థితులే పెళ్లికి అడ్డుపడుతున్నాయి. నేను సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను" అని కమల గొంతులో బాధతో చెప్పింది.
ఆ తర్వాత ఒక్క క్షణం ఆగి, తన మనసుని బరువెక్కిన మాటతో ముగించింది.
"సారీ మై డియర్... "
సమాప్తం.
***************
పల్లా వెంకట రామారావు గారి కొన్ని ఇతర రచనలు:
పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు
Profile Link:
జన్మస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా.
జననం: 1974
తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ
చదువు: ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)
ఉద్యోగం: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
అభిరుచి: సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్) travel India telugu
(యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)
రచనలు: 'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,
వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,
బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల
ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల
బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం
మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ
కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా
రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ
వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.











Comments