సాయం చేసినందుకు ఫలితం
- Palla Venkata Ramarao

- May 8
- 3 min read

Sayam Chesinanduku Falitham - Telugu Moral Story | Palla Venkata Ramarao
సాయం చేసినందుకు ఫలితం - తెలుగు నీతి కథ | పల్లా వెంకట రామారావు
Published In manatelugukathalu.com On 08/05/2026
“మంచి మనసు ఉన్నవారే ఎక్కువగా మోసపోతారా?”
అపాత్రులకు సాయం చేసినందుకు ఫలితం ఏమిటో పల్లా వెంకట రామారావు గారి కథలో తెలుసుకోండి.
రామకృష్ణ, సత్తయ్య, గోపయ్య.. ఈ ముగ్గురు స్నేహితులు ఒకప్పుడు నలుగురిలో సోదరుల మాదిరిగా కలిసిమెలిసి ఉండేవారు. గోపయ్య, సత్తయ్య ఒకే వీధిలో నివసించేవారు కావడం వల్ల వారి బంధం చిన్నతనం నుంచే గట్టిగా ఉంది. రామకృష్ణ వారితో కాస్త ఆలస్యంగా కలిసినప్పటికీ, వారి స్నేహంలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు.
వారి చదువుల ప్రయాణంలో ఎన్నో కష్టసుఖాలను పంచుకున్నారు. పరీక్షల్లో ఒకరికొకరు సాయం చేసుకున్నారు. నాటకాలలో కలిసి నటించారు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు.
చదువులు పూర్తయిన తర్వాత, వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అది ఉద్యోగ వేట. ఈ ముగ్గురిలో రామకృష్ణ చాలా తెలివైనవాడు, పట్టుదల ఉన్నవాడు. అతని ప్రతిభ, కష్టపడే స్వభావం కారణంగా అతనికి ఒక పెద్ద జమీందారీలో వెంటనే ఉద్యోగం దొరికింది. రామకృష్ణ మొదటి సంవత్సరంలోనే తన పనితీరుతో అందరి మన్ననలు పొందాడు. అతని పై అధికారులు అతనికి పెద్ద బాధ్యతలు అప్పగించారు. అతని జీవితం సవ్యంగా సాగుతోంది. కానీ అతని స్నేహితుల జీవితాలు మాత్రం ఇంకా నిలబడలేదు.
కొంతకాలం తర్వాత ఒక రోజు సత్తయ్య రామకృష్ణ దగ్గరికి వచ్చాడు. సత్తయ్య ముఖంలో ఆందోళన కనిపించింది. గోపయ్యకి ఇంకా ఉద్యోగం దొరకలేదని, ఎక్కడికి వెళ్ళినా ఫలితం లేదని బాధపడ్డాడు. సత్తయ్య మాటలు విన్న రామకృష్ణ మనసు కరిగిపోయింది. తన స్నేహితుడు బాధపడుతుంటే ఎలా ఊరుకోగలడు? వెంటనే గోపయ్యని తనతో తీసుకెళ్లి, తన జమీందారీలో ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అధికారులను కలిశాడు.
కానీ అక్కడ ఖాళీలు లేవని అధికారులు తేల్చి చెప్పారు. ఈ విషయం మిత్రులకు చెప్పినప్పుడు, వారు నిరాశ చెందారు.
"ఏదైనా ఉపాయం ఆలోచించరా రామకృష్ణా! నువ్వు తలచుకుంటే ఏదైనా సాధ్యమే" అని బ్రతిమాలారు.
వారి ఒత్తిడితో రామకృష్ణ మళ్ళీ అధికారుల దగ్గరికి వెళ్లి "నా మిత్రుడికి దయచేసి ఏదైనా సహాయం చేయండి. అతనికి ఉద్యోగం దొరకకపోతే అతని కుటుంబం చాలా ఇబ్బందులు పడుతుంది" అని అభ్యర్థించాడు.
అధికారులు కొంతసేపు ఆలోచించి ఒక ప్రతిపాదన చేశారు. "రామకృష్ణా! నీ జీతం కొంత తగ్గించుకుంటే, ఆ తగ్గించిన జీతంతోపాటు ఖజానా నుంచి కొంత వేసి గోపయ్యని పనిలో పెట్టుకుంటాము. నీ పనితనం వల్ల ఈ జమీందారీకి ఎంతో లాభం ఉంది. కానీ నీ స్నేహితుడిని మాత్రం నీ జీతం తగ్గించుకుంటేనే పెట్టుకోగలం" అని చెప్పారు.
రామకృష్ణ ఒక క్షణం తటపటాయించాడు. తన జీతం తగ్గించుకోవడం అంటే తన కుటుంబ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతుంది. కానీ స్నేహితుల కోసం ఆ మాత్రం త్యాగం చేయలేనా అనుకున్నాడు. వారికి ఉన్నది తానొక్కడే ఆపద్బాంధవుడు అనుకున్నాడు. చివరకు ఒప్పుకున్నాడు.
గోపయ్యకు ఉద్యోగం దొరికిందని తెలియగానే వారు ఆనందంతో ఉప్పొంగిపోయారు. రామకృష్ణ తన జీతం తగ్గించుకుని చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్పారు. కానీ ఆ కృతజ్ఞతలు ఎక్కువ రోజులు నిలవలేదు. గోపయ్య ఉద్యోగంలో చేరిన తర్వాత అతని అసలు నైజం బయటపడింది. ఏ పని సరిగ్గా చేసేవాడు కాదు. పనిలో ఆలస్యం చేసేవాడు. తరచుగా చిన్న చిన్న పొరపాట్లు చేసేవాడు.
రామకృష్ణ అతనికి పనులు ఎలా చేయాలో చెప్పి, అతని బాధ్యతలను కూడా తానే నిర్వర్తించసాగాడు. దీనివల్ల రామకృష్ణకు పని భారం పెరిగింది. ఒక్కోసారి ఇద్దరి పనీ తనే చేయాల్సి వచ్చేది. "పుణ్యానికి పోతే పాపం ఎదురైంది" అనే సామెత అక్షరాలా నిజమైంది. తన స్నేహితుడికి సాయం చేయబోయి తన జీవితాన్ని తానే కష్టాల్లోకి నెట్టుకున్నాడు. పని భారం పెరిగి, జీతం తక్కువై, రామకృష్ణ ఆరోగ్యం కూడా దెబ్బతింది. అతని పై అధికారులు కూడా రామకృష్ణను పని విషయమై మందలించడం మొదలుపెట్టారు.
ఎందుకంటే గోపయ్య చేసే పొరపాట్ల వల్ల వారి పని దెబ్బతినేది. చివరికి, ఈ బాధలు, కష్టాలు భరించలేక రామకృష్ణ ఆ ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించు కున్నాడు. ఈ నిర్ణయం వల్ల అతనికి ఎంతో బాధ కలిగింది. "మంచి చేయబోతే చెడు ఎదురైంది" అని బాధపడ్డాడు.
రామకృష్ణ ఉద్యోగం మానేసిన వెంటనే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. సత్తయ్య రామకృష్ణ ఖాళీ చేసిన స్థానంలో ఉద్యోగంలో చేరాడు. ఈ విషయం విన్న రామకృష్ణ మరింత బాధపడ్డాడు. ఆషాఢభూతుల్లాగా స్వార్థంగా ప్రవర్తించిన తన స్నేహితుల తీరు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
రామకృష్ణ ఈ చేదు అనుభవం తర్వాత ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. "ప్రతి ఒక్కరికీ సాయం చేయాలని అనుకోవద్దు. ముఖ్యంగా ఎవరి బాధ్యతలను అనవసరంగా భుజాన వేసుకోవద్దు. స్వార్థపరులైన స్నేహితుల్ని అసలు నమ్మకూడదు" అని నిర్ణయించుకున్నాడు.
***************
పల్లా వెంకట రామారావు గారి కొన్ని ఇతర రచనలు:
పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు
Profile Link:
జన్మస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా.
జననం: 1974
తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ
చదువు: ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)
ఉద్యోగం: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
అభిరుచి: సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్) travel India telugu
(యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)
రచనలు: 'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,
వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,
బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల
ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల
బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం
మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ
కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా
రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ
వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.









@DeepikaPalla123
•1 hour ago
Good story