top of page
Original.png

ప్రేమ బంధం

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #ప్రేమబంధం, #Premabandham, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

Premabandham - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 01/07/2025

ప్రేమ బంధం - తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


“అమ్మా! తలనెప్పిగా ఉంది. కాస్త కాఫీ ఇవ్వవా?” అంది అప్పుడే కాలేజి నుంచి ఇంటికొచ్చిన అన్విత.


“సరే! నీవు గదిలోకి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో! వేడిగా కాఫీ పట్టుకొస్తాను.” అంది తల్లి లక్ష్మీదేవి వంటింట్లో కెళుతూ. 


కాసేపటికి వేడిగా కాఫీ కప్పుతో కూతురి గదిలోకి వెళ్లి తన చేతికిచ్చి కాసేపు విశ్రాంతి తీసుకోమని అన్వితకు చెప్పి మరలా తన పనులలో మునిగిపోయింది లక్ష్మీ దేవి. 


హైదరాబాద్‌లో ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్న అన్విత చాలా తెలివిగా, నిబద్ధతగా ఉండే అమ్మాయి. తల్లిదండ్రులు రమణయ్య లక్ష్మిదేవి లకు ఏకైక కూతురైన అన్విత గారాబంగా పెరిగినా చదువుపట్ల శ్రధ్ధ చూపుతూ కష్టపడి చదువుతోంది. సంప్రదాయాలపై నమ్మకం కలిగిన పెద్దలు వారి ఆశయాలన్నీ అన్విత జీవితం చాలా గొప్పదిగా ఉండాలన్నదే ఆశతో ఉంటున్నారు.


అదే కళాశాలలో మంచి ప్రతిభ కలిగిన విద్యార్థి ఆకాష్. అతను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాధాశ్రమంలో పెరిగి పెద్దై కష్టపడి చదువుతూ ఉన్నత విలువలు కలిగినవాడు. అన్విత, ఆకాష్ లు ఇద్దరూ మొదట తమ చదువులో ప్రాజెక్టుల మధ్య స్నేహితులుగా కలుసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత వారి మధ్య స్నేహం పెరిగి క్రమేణా ఇరువురి మనసులు కలిశాయి. ఒకటి రెండు సంవత్సరాల్లో అది ప్రేమగా మారింది. 


అయితే ఇద్దరూ అన్విత తల్లిదండ్రుల మనసును గెలుచుకోవాలని, ఆతర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.


చివరి సంవత్సరం చదువు పూర్తవుతుండగా, ఆకాశ్ మంచి ఉద్యోగం పొందాడు. కొన్నాళ్ల తర్వాత అన్విత కూడా అదే కంపెనీలో ఉద్యోగ ఆఫర్ పొంది ఉద్యోగంలో చేరింది. రోజులు హాయిగా గడుస్తున్నాయి. కొన్నినెలల తర్వాత అన్విత తమ ప్రేమవిషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలని నిర్ణయించుకుంది.


ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో “నాన్నా, అమ్మా... నేను మీ ఇద్దరికీ ఈ రోజు ఓ ముఖ్యమైన విషయం చెబుతున్నాను. నేను ఆకాశ్‌ని ప్రేమిస్తున్నాను. అతడు చాలా మంచి మనిషి. మీ అంగీకారంతోనే నేను అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.” అంది అన్విత.


అన్విత తండ్రి రమణయ్య కొద్దిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇంట్లో నిశ్శబ్దం నెలకొంది.


“మీది నిజంగా ప్రేమా? దోమా? ఈ కాలం పిల్లలు వయస్సులో ఆకర్షణని ప్రేమ అనుకుని భ్రమతో పెళ్లి దాకా వెళ్లి చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తర్వాత ‘బ్రేకప్’ అని విడిపోతారు. రోజూ పేపర్లు, టివి లలో ఇవేకా మనం చూస్తున్నాం ” అంది లక్ష్మీదేవి.


తల్లి మాటలు విని అన్విత (శాంతంగా, నిశ్చలంగా):“అమ్మా, ప్రేమకి, ఆకర్షణలకి అర్థం నాకు తెలుసు. ఈ నిర్ణయం నేను ఇప్పుడు హడావుడిగా తీసుకోలేదు. మేమిద్దరం చదువుకునేటప్పుడే ప్రేమించుకుంటున్నాం. చదువులు పూర్తిచేసుకున్నాం. ఇద్దరం ఉద్యోగాలను కూడా పొందాం. అతడికి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అనాధ హాస్టల్లో పెరిగి, కష్టపడి చదివి ఉద్యోగం పొందాడు. మంచి మనసున్నవాడు. నేను ఈ పెళ్లి నిర్ణయం మీ ఆశీర్వాదంతోనే తీసుకోవాలనుకుంటున్నాను.” అంది అన్విత. 


రమణయ్య కొద్ది రోజులు ఆలోచించాడు. తన కూతురు ఎంత బాధ్యతగా ఆలోచించి నిర్ణయం తీసుకుందో, అతని గుణగణాలు, సంస్కారం తెలుసుకుందామని అన్విత ద్వారా ఆకాశ్‌ను ఇంటికి పిలిపించాడు.


ఆ సాయంత్రం అన్వితతో ఆకాష్ రాగానే “నమస్తే అంకుల్! నమస్తే ఆంటీ! ” అని రమణయ్య దంపతులకు నమస్కారం చేసి వాళ్లు ఆఫర్ చేసిన సీటులో పొందికగా కూర్చున్నాడు ఆకాష్. 


కాఫీ, టిఫిన్ మర్యాదలయ్యాక ఆకాష్ గురించిన వివరాలను తెలుసుకున్నారు. పెద్దల ఎడల ఆకాష్ కున్న వినయ విధేయత, మర్యాదలను చూసి పెళ్లి ఎడల తమ కూతురు సరైన నిర్ణయం తీసుకుందని వాళ్ల పెళ్లికి తమ అంగీకారాన్ని తెలిపారు రమణయ్య దంపతులు. అన్విత, ఆకాష్ లు చాలా సంతోషించారు. కాసేపయినాక ఆకాష్ వాళ్లవద్ద శెలవు తీసుకుని తన రూమ్ కి వెళ్లాడు. 


రమణయ్య దంపతులు ఒక శుభముహూర్తాన వాళ్లిద్దరికీ రిజిస్టర్ మారేజ్ చేశారు.ఆకాష్,అన్విత లు కూడా వీళ్ల వద్దే ఉంటూ రోజూ ఆఫీసుకి వెళ్లివస్తున్నారు. రోజులు హాయిగా గడుస్తున్నాయి. 


కొన్ని నెలల తర్వాత అన్విత గర్భవతైంది. అందరూ చాలా సంతోషించారు.నెలలు గడిచాక జరగవలసిన సీమంతం వేడుకల్ని చక్కగా జరిపించారు లక్ష్మీ దేవి దంపతులు. నెలలు నిండి ఒక రోజున పండంటి కొడుకుని కన్నది అన్విత. ఆకాష్ ఆనందానికి అవధులు లేవు. ఆ బిడ్డకి ‘సృజన్’ అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. 


సృజన్ తన ఆట, పాటలతో అందరినీ అలరిస్తూ మూడవ ఏడు వచ్చాక స్కూలులో చేరాడు. అమ్మమ్మ, తాతల ఆప్యాయత, ఆదరణ, అమ్మానాన్నల ముద్దు ముచ్చట్లతో సృజన్ చక్కగా పెరుగుతూ చక్కగా చదువుకుంటున్నాడు. 

ఆకాష్, అన్వితలు తమ కంపెనీలో లోన్ తీసుకుని మంచి ఇల్లు కొన్నారు. ఆ గృహ ప్రవేశానికి అందరినీ పిలిచారు.

 

అన్విత దంపతులు, రమణయ్య దంపతులు వచ్చిన వాళ్లకి మర్యాదలు చేసి చక్కటి విందునిచ్చారు. వాళ్లందరూ సంతోషంగా ఎవరిళ్లకు వాళ్లు వెళ్లారు. 


క్రొత్త ఇంట్లో అందరూ సుఖంగా ఉంటున్నారు. రెండు సం…తర్వాత రమణయ్యకి బాగా సుస్తీ చేసి ఎంత వైద్యం చేసినా ఫలించక ఒక రోజున నిద్రలోనే కన్నుమూశాడు. జరిగిన దానికి అందరూ బాధపడ్డారు. అన్విత,ఆకాష్ లు తమని తాము ఓదార్చుకుని, లక్ష్మీ దేవిని ఓదార్చి ధైర్యం చెప్పారు. తర్వాత జరగవలసిన క్రతువుని ఆకాష్ దగ్గరుండి యధావిధిగా జరిపించాడు. 


రోజులు భారంగా గడుస్తున్నాయి. అన్విత కొన్నాళ్ళు శెలవు పెట్టి ఇంటివద్దే ఉంటూ తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం, ఆకాష్ చిలిపి అల్లరి, కబుర్లు, ఆటపాటలతో లక్ష్మీ దేవి క్రమేణా కోలుకుని మామూలు మనిషైంది. 


ఒకరోజున లక్ష్మీదేవి తన కూతురిని దగ్గరకు పిలిచి “అన్వితా! నేను చాలా రోజుల నుండి మనసులో బాధపడుతూ, పశ్చాత్తాప పడుతున్నాను. నీతో చెపితేగాని నా బాధ పోదు. తొలుత నీవు నీ ప్రేమ విషయం మాతో చెప్పగానే ‘ఇది ప్రేమ కాదు, ఆకర్షణ. ముందు పెళ్లి, తర్వాత విడాకులు. ఈనాడు ఇవన్నీ మామూలే. నీ నిర్ణయం సరైనది కాదు. ప్రేమా లేదు, దోమా లేదు. అని నీ అభిప్రాయాలను కొట్టిపారేసి నీ మనసుని కష్టపెట్టాను. నీవు మాకు ఒక్కగానొక్క ఆడపిల్ల. నీ జీవితం ఏమైపోతుందో? అనే భయంతో ఒక తల్లిగా ఆ మాట అన్నాను. నన్ను క్షమించమ్మా. 

నీ నిర్ణయం సరైనదే. మాకు కొడుకులాంటి అల్లుడు విశాల్ వచ్చాడు. అతని చేతులమీదుగా మీ నాన్న హాయిగా. వెళ్లపోయాడు. నీ పచ్చని కాపురం చూస్తున్నాక ఇంక నాకే దిగులు లేదు. నిశ్చింతగా నేను కూడా మీవద్ద కాలం వెళ్లదీస్తూ మీ నాన్నని చేరుతాను”. అంది తన భర్తని తలచుకుంటూ గద్గద స్వరంతో లక్ష్మీ దేవి. 


తల్లిని హత్తుకుని అన్విత “ అమ్మా!. ఆనాడే నేను నిన్నర్ధం చేసుకున్నాను. ఒక తల్లిగా నీ అనుమానం సహేతుకమైనదే. కానీ అమ్మా! అందరూ అలా ఉండరు. మంచి-చెడు అన్నిచోట్లా ఉన్నాయి. కాదనను. మనసులు, భావాలు కలిస్తే బంథాలు మరింత పటిష్టమవుతాయని, పదిలంగా ఉంటాయని నా నమ్మకం. దాన్ని నేను, ఆకాష్ నమ్ముతాము. మా తనువులు వేరైనా మా మనసులు ఒకటే. నీవు నిశ్చింతగా హాయిగా ఉండు. సృజన్ తో సంతోషంగా కబుర్లు చెప్పు” అని ఏదో పని ఉండి వంటగదిలోకి వెళ్లింది అన్విత. 


కాసేపు సృజన్ తన అమ్మమ్మతో ఆటలాడుతూ గడిపాడు. 

‘బంధం అనే మాట, మన ఇంట్లో పుట్టినవారికే కాదు... మన హృదయాన్ని గెలిచినవారికీ కావాలి. వీళ్ల ప్రేమ నన్ను మార్చింది. నా కూతురు నన్ను గర్వపడేలా చేసింది. స్వచ్ఛమైన ప్రేమ తమనే కాక, తమ కుటుంబాన్ని కూడా గెలిపిస్తుంది.’ అనుకుంది లక్ష్మీదేవి తన మనసులో. 


తనకు ఇంత సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించిన ఆభగవంతుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలిపి, తమని, ఈ ఇంటిని చల్లగా చూడమని ఆ దేవుని వేడుకున్నది లక్ష్మీ దేవి.



.. సమాప్తం .. 


ree

-నీరజ హరి ప్రభల

Profile Link


YouTube Playlist Link









Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page