top of page

ప్రేమ గెలిచేనా.. ఓడేనా ..


'Prema Gelichena Odena' written by Soumya Kankipati

రచన : సౌమ్య కంకిపాటి

అది 2015 వ సంవత్సరం..

పాడిపంటలకు పేరు పెట్టిన ఒంగోలు జిల్లాలోని శ్రీ హర్షిని డిగ్రీ కళాశాలలో బి. ఎస్సీ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు సంజయ్. అతను చాలా మంచి కుర్రాడు. అన్నిటిలో చురుగ్గా పాల్గొంటాడు, అందరినీ సరదాగా పలకరిస్తాడు. సంజయ్ కి ఒక చెల్లి. అమ్మ నాన్న చెల్లి వీళ్ళే ఇతని ప్రపంచం. సంజయ్ రోజు కళాశాలకి రావటం కూడా పెద్దగా ఇష్టం ఉండేది కాదు. పరీక్షల సమయంలోనో లేదా పోటీలు జరిగేటప్పుడో కళాశాలకి వస్తుంటాడు. అలా అని చదువు మాత్రం నిర్లక్ష్యం చేయడు. మంచి మార్కులు తెచ్చుకుంటాడు. మొదటి సంవత్సరమంతా బాగానే సాగింది. కళాశాలకి రావటం,చదుకోటం, పోవటం. ఇదే అతని దినచర్య. రెండో సంవత్సరం కూడా అలానే మంచిగా సాగుతుండగా అతని జీవితంలో అనుకోని మలుపు ఎదురైంది. అతని జీవితాన్నే మార్చేసింది. అతనికి ఒక కొత్త సంజయ్ ని పరిచయం చేసింది...

ఎప్పటిలాగానే సంజయ్ తన తోటి స్నేహితులతో కలిసి సబ్జెక్ట్ షెడ్యూల్ తరగతి మారటానికి మెట్లు దిగుతూ వెళ్తున్నాడు. ఇంతలో ఎదురుగా ఆకుపచ్చ డ్రెస్సు నీలం చున్నీలో, కిలకిలమని నవ్వుకుంటూ తన తోటి స్నేహితురళ్ళతో కలిసి తరగతి మారటానికి మెట్లు ఎక్కుతూ ఎదురైంది ఒక అమ్మాయి. ఆమె పేరు సంధ్య. ఆమెను చూడగానే సంజయ్ ఒక్కసారిగా తనని తాను మరచిపోయాడు. ఆమె రూపాన్ని, ఆమె అందమైన నవ్వున్ని, ఆమె వస్త్రధారణని మనసునిండా నింపేసుకొని ఎటు వెళ్తున్నాడో కూడా తెలియనంతగా తన స్నేహితుల వెనకాలే అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. తరగతిలోకి వెళ్ళినా తన మనసు మాత్రం సంధ్య ఎదురు వచ్చిన మెట్లపైనే ఒదిలేసాడు..

సంధ్య 2015 వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన సంజయ్ చదివే గ్రూపులో మొదటి సంవత్సరం జాయిన్ అయ్యింది. అప్పటికే తరగతులు మొదలయ్యి మూడు నెలలు అవుతోంది. కానీ సంధ్య ఎమ్సెట్ లో మంచి ర్యాంక్ రావటం వలన బిడిఎస్ జాయిన్ అవుదామనుకుని కౌన్సెలిగ్ అయ్యేవరకు వేచి చూసింది. అనుకోకుండా, కొంచెం ర్యాంక్ తేడాతో ఆమె బిడిఎస్ సీట్ చేజారిపోయింది. ఇంక తప్పక చివరికి డిగ్రీ కళాశాలలో బి. యస్సీ కెమిస్ట్రీ జాయిన్ అయ్యింది. సంధ్య విషయానికి వస్తే ,సంధ్య చాలా అల్లరి పిల్ల. అల్లరి పిల్ల అయినప్పటికీ చాలా అమాయకపు పిల్ల. అందరినీ ఊరికినే నమ్మెస్తుంది. చదువులోనే కాదు ఆటపాటల్లోనూ చురుకైన అమ్మాయి. జాలి గుణం కూడా ఎక్కువే. కళాశాలలో ఆలస్యంగా చేరటం వలన సంధ్య త్వరగా ఎవ్వరితో కలవలేకపోయింది. పైగా కొత్తవాళ్ళకు అలవాటు పడటానికి తనకి చాలా సమయం పడుతుంది. స్నేహితులను చేసుకోటానికి ఆమెకు రెండు నెలలు పట్టింది. రెండు నెలలు పట్టినా, తనకి తగ్గ స్నేహితులే దొరికారు. అల్లరి, ఆటలు, పాటలు, కబుర్లతో రెండు నెలలు చక్కగా గడిచాయి. ఆ సమయంలోనే తరగతి షెడ్యూల్ మారుతూ సంజయ్ కి ఎదురుపడింది సంధ్య. అప్పటినుండీ మొదలైంది మనోడి ప్రేమకథ...

సంజయ్ సంధ్యని చూసిన మరుక్షణం నుండీ తనని మళ్ళీ మళ్ళీ చూడాలని, మాట్లాడాలని రకరకాల ప్రయత్నాలు, చాలా సాహసాలూ చేసేవాడు. ఎంతలా అంటే కళాశాలకి అప్పుడప్పుడు వచ్చే తను ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా ఉండేంతగా మారిపోయాడు. నిజం చెప్పాలంటే ఆదివారం తనకు చర్చ్ అయిపోగానే తిన్నగా ఇంటికి వెళ్ళే సంజయ్ కళాశాలలో జరిగే ఆటాల పోటీలు చూడటానికి వచ్చేవాడు. ఆటలు చూడటానికి కాదు ఎక్కడ సంధ్య కనిపిస్తుందో అనే ఆశక్తితో. సంధ్య కనిపించకపోయేసరికి దిగాలుగా ఇంటికి వెళ్ళేవాడు. మళ్ళీ సోమవారం కళాశాలకు రావటం సంధ్యని చూడటం, ఊహల్లో తేలటం ఇది సంజయ్ రోజూవారీ దినచర్య అయింది.

ఒకరోజు కెమిస్ట్రీ డే సందర్భంగా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ క్విజ్ మరియు ఆటల పోటీలు నిర్వహించింది. అందులో జరిగే కార్యక్రమాల్లో జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ నుండి ఇద్దరిద్దరు పాల్గొనాల్సి ఉంది. జూనియర్స్ నుండి సంధ్య మరియు ఆమె స్నేహితురాలు పాల్గొన్నారు. అది గమనించిన సంజయ్, సీనియర్స్ విభాగం నుండి తను ఒక్కడే పాల్గొన్నాడు. క్విజ్ అయిన తర్వాత ఆటలు మొదలయ్యాయి. సంజయ్ తన తోడుకి కావాలనే జూనియర్ ని తెచ్చుకున్నాడు. అతడైతే సంధ్యతో మాట్లాడటానికి సహాయం చేస్తాడని. బుడగలు ఊదే పోటీ పెట్టారు. సంధ్య ఎలాగో చురుకైన అమ్మాయి. సంధ్య మరియు ఆమె స్నేహితురాలు బుడగలు వేగంగా ఊది శభాష్ అనిపించుకున్నారు. సీనియర్స్ వంతు వచ్చింది. పాపం సంజయ్ మాత్రం తన తోడు తెచ్చుకున్న జూనియర్ అతని పరువు నిలబెడతాడు అనుకుంటే, ఇద్దరు కలిసి కనీసం రెండు బుడగలు కూడా పూర్తిగా ఊదలేకపోయారు. అందరు పడి పడి నవ్వుతున్నారు. అందరు ఏమో కానీ సంధ్య ముందు పరువు పోతుందని తెగ సిగ్గు పడిపోయాడు మన సంజయ్. కానీ, సంధ్య ఒక్కసారిగా నవ్వేసరికి తను సిగ్గుపడటం మరిచిపోవటమే కాదు సంధ్య అందమైన నవ్వుకి తనని తానే మైమరచిపోయాడు. నిజానికి సంజయ్ అనే ఒక వ్యక్తి గురించి అందరు మంచిగా మాట్లాడుకోవటం సంధ్య వినినప్పటికి అతనిని చూడటం సంధ్యకి ఇదే మొదటిసారి. అందరిముందు పరువు పోతే పోయింది కానీ, మనోడికి సంధ్యతో మాట్లాడే మంచి ఛాన్స్ దొరికింది. చాలా ధైర్యం చేసి తన జూనియర్ సహాయంతో ఆమె పేరు, వివరాలు తెలుసుకున్నాడు. తర్వాత సంధ్యతో మాట కలిపాడు. 'మీరు చాలా బాగా ఆడారు' అని సంజయ్ అంటే 'మీరూ బాగా ఆడారు' అని సంధ్య అనేసరికి అతనికి ఎక్కడలేని ఆనందం కలిగింది. అతను మొదటిసారిగా ఆమె నోటి నుండి విన్న తియ్యటి మాట అది. సంజయ్ కి సంధ్య పేరు తెలిసినా, మాట కలపటం కోసం 'మీ పేరు' అని అడిగాడు. 'సంధ్య, మీది' 'సంజయ్'...

ఇంక ఆ రోజు పోటీ ముగిసింది. ఎవరి తరగతులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక అప్పటినుండీ సంజయ్ సంధ్యతో మాటలు కలపటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ సంధ్య ఎదురుగా వచ్చేసరికి మాటలు మాయమైపోతాయి. నోరు తడారిపోతుంది. సంధ్య ఎప్పుడూ ఒక్కతే వెళ్ళదు. తనతో పాటు పక్కన ఇద్దరు స్నేహితురాళ్ళు ఉండాల్సిందే. అందువలన సంజయ్ కి తనతో మాట్లాడే అవకాశం సరిగ్గా చిక్కేది కాదు. అయినా సరే, సంధ్య ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తూ, తనని చూస్తూ, ఆనందిస్తూ కొన్ని నెలలు అలా కాలం గడిపాడు. సంజయ్ ఇంట్లో కూడా సంధ్యని తలచుకోవటం అలవాటు అయిపొయింది. ఒకరోజు సంజయ్ ఒక్కడే కూర్చుని తనలో తానే నవ్వుకుంటున్నాడు. అది గమనించిన సంజయ్ వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మతో 'అమ్మా! వీడు ఒక్కడే కూర్చుని పిచ్చోడిలా నవ్వుకుంటున్నాడే, చూడు ఒకసారి వచ్చి' అని ఆట పట్టించింది. నిజానికి సంజయ్ ఇంట్లో వాళ్ళ అమ్మకి అన్ని చెప్పేస్తాడు. ఏమీ దాయడు. ఒకసారి సంజయ్ వాళ్ళ అమ్మ 'ఎంట్రా ఎవరా అమ్మాయి?' అని అడిగింది. అందుకు సంజయ్ 'అమ్మా! తను చాలా మంచి అమ్మాయి. కానీ ఇప్పుడు మేము స్నేహితులం మాత్రమే' అని బదులిచ్చాడు. సంజయ్ రోజు సంధ్య విషయాలు, ఆమె సహాయ గుణం అన్నీ ఇంట్లో చెప్తుంటాడు. అతని కుటుంబానికి కూడా సంధ్య అంటే ఇష్టం ఏర్పడింది..

చివరికి 2016 ఏప్రిల్ నెల వచ్చేసింది. అందరు సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలలో లీనమైపోయారు. మన సంజయ్ మాత్రం బాధగా ఉన్నాడు. ఎందుకంటే పరీక్షలు అవగానే వేసవి సెలవులు వస్తాయి. సెలవులు వస్తే సంధ్యని రోజు చూసే అవకాశం ఉండదు. చివరికి ప్రాక్టికల్ పరీక్షలు కూడా అయిపోయాయి. రేపటినుండి సెలవులు అనగా, సెలవుల ముందు రోజు అందరు కలుసుకుని సరదాగా గడుపుతున్నారు. సంధ్య కెమిస్ట్రీ మేడంని కలవటానికి ఒంటరిగా వెళ్తుంది. అదే సమయంలో ఎదురుగా మెట్ల కింద కాలి చోటులో సంజయ్ కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎదురుగా సంధ్య రావటం చూసి అతని కళ్ళు తారాజువ్వల్లా వెలిగిపోయాయి. ఇదే మంచి సమయం అనుకుని సంధ్యని పిలిచాడు. సంధ్య అతని దగ్గరికి వచ్చింది.

'రేపటినుండి సెలవులు కదా ఏదైనా ఊరు వెళ్తున్నావా లేదా ఇదే ఊరిలో ఉంటావా' అని సంజయ్ అడిగాడు. అందుకు బదులుగా 'ఏమో తెలీదు మరి' అని సమాధానమిచ్చింది సంధ్య.

అడగాలా ఒద్దా అని తటపటాయిస్తూ చివరికి 'మీరు ఫేస్ బుక్ యూజ్ చేస్తారా' అని అడిగాడు. సంధ్య 'హా చేస్తాను కానీ అప్పుడప్పుడు' అని బదులిచ్చింది. సంజయ్ యూజర్ ఐడీ అడిగాడు. సంధ్య, ముందు సంకోచించినా అతని గురించి మంచి అభిప్రాయం ఉండటంతో తన యూజర్ ఐడీ అతనికి చెప్పింది. సంజయ్ తన దగ్గరున్న పేపర్ మీద ఒక్క తప్పు కూడా రాకుండా మొత్తం స్పెల్లింగ్ అడిగి మరీ నోట్ చేసుకున్నాడు. సంధ్యకు చివరిగా చిరునవ్వుతో వీడ్కోలు చెప్పాడు...

అవి వేసవి సెలవులు. ప్రతి ఒక్కరు అనందంగా తమ సొంత ఊర్లు వెళ్లి సెలవులు గడుపుతున్నారు. సంధ్య మాత్రం తన సెలవులను వృథాగా గడపకుండా పెయింటింగ్ శిక్షణ తీసుకుంటుంది. అందరు బాగానే ఉన్నారు కానీ, సంజయ్ మాత్రం ఏదో కోల్పోయిన వాడిలా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. పది రోజులు అయిపోయాయి ఇంక సంజయ్ వల్ల కాలేదు. సంధ్య తనకిచ్చిన ఫేస్ బుక్ ఐడీ ద్వారా సంధ్యకి రిక్వెస్ట్ పెట్టాడు. సంధ్య ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. సంధ్య మాత్రం తన పెయింటింగ్ శిక్షణలో బిజీ అయిపోయి ఉంది. నెల రోజుల తర్వాత తన ఫేస్ బుక్ ఓపెన్ చేసింది సంధ్య. సంజయ్ రిక్వెస్ట్ ని చూసి యాక్సెప్ట్ చేసింది. అప్పుడు పోయింది మనోడికి గుబులు. ఇక అప్పటినుండి సంజయ్ తనతో మాట్లాడటానికి ఒక మార్గం దొరికిందని ఆనందించాడు.తన మనసులో మాటను సంధ్యకి చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఏదోక మాట కలపటం సంధ్య తిరిగి రిప్లై ఇవ్వటం. మొత్తం సెలవుల మీద సంధ్య సంజయ్ తో ఫేస్ బుక్ లో మాట్లాడింది రెండు మూడు సార్లు మాత్రమే ఎందుకంటే మేడం ఎప్పుడూ చాలా బిజీగా ఉంటారు.

వేసవి సెలవులు అయిపోయాయి. అది 2016 జూన్ 20. కళాశాలలు తెరచుకున్నాయి. అందరు హుషారుగా తమ స్నేహితులని కలవటానికి వస్తున్నారు కానీ సంజయ్ మాత్రం తనని మాయలో పడేసి తనని నెలన్నర్ర ఒంటరిగా ఒదిలేసిన సంధ్య కోసం వస్తున్నాడు. సంధ్య కోసం బస్ స్టాప్ లో నించుని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు. ఇంతలో సంధ్య రానే వచ్చింది. సంధ్య బస్ దిగుతూ వస్తుంటే మనోడికి పోయిన ప్రాణం తిరిగొచ్చినంత ఆనందం కలిగింది. సంధ్యకి హాయ్ చెప్పాడు. సంధ్య తిరిగి హాయ్ అనింది. సంజయ్ కి పూర్తిగా అర్థమైపోయింది. అతను సంధ్య ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు అని. ఇక అప్పటినుండి ఆమె ప్రేమలో మునిగి తేలుతున్నాడు. సంధ్య ఏ తరగతికి వెళ్ళినా తను కూడా తన వెంట వెళ్ళటం, సంధ్య చూడాలని కావాలనే తన తరగతికి ఆలస్యంగా రావటం, సాయంత్రం ఆరింటికి గంట కొట్టగానే అందరికంటే ముందు గేట్ బయిట ఉండి సంధ్యకి ఎదురు అవటం, సంధ్య వెళ్ళే బస్ స్టాప్ లో ఏ పని లేకపోయినా వేచి చూడటం, సంధ్య బస్ ఎక్కినాకా అదే బస్ ని తన బండి వేసుకుని వెంబడించటం ఇలా సంజయ్ ప్రతి రోజు చేసే ముఖ్య పనులు అయిపొయాయి. అతనిని ఎవరూ గమనించరు ఎవరూ చూడరు అనుకునేవాడు కానీ, ఒక అబ్బాయి ప్రేమలో పడితే అది ఎవ్వరికీ తెలియకుండా ఎలా ఉంటుంది. చివరికి ఆ నోట ఈ నోట సంజయ్ గురించి గుప్పుమనింది. ఎందుకంటే సంజయ్ కళాశాలలో చాలా ఫేమస్ కదా. కానీ ఎవరూ బయిట పెట్టలేదు. అప్పుడప్పుడే ఇద్దరు కొంచెం కొంచెంగా మాటలు పెంచుకుంటున్నారు. ఒకసారి సంధ్య తన స్నేహితులతో ల్యాబ్ లో ప్రాక్టికల్స్ చేస్తుంది. సంధ్య స్నేహితురాలు శ్రావణి అనే అమ్మాయి సంధ్యతో, 'చూడు చూడు నిన్నే చూస్తున్నాడు సంజయ్ అన్నయ్య. నిన్ను లవ్ చేస్తున్నట్టున్నాడు నేనెప్పటినుండో గమనిస్తున్నా అన్నయ్యని' అనింది. అందుకు సంధ్య 'చి అదేమీ లేదు. తను మంచోడు చాలా మంచిగా మాట్లాడతాడు అందరితో లాగానే నాతో కూడా మాట్లాడతాడు. నువ్వు వేరేగా ఆలోచించకు, తప్పు' అని బదులిచ్చింది. శ్రావణి 'సరే చూస్తూ ఉండు ఎప్పుడోకప్పుడు నువ్వంటే ఇష్టం అని చెప్తాడు' అనింది.

సంధ్య శ్రావణి అన్న మాటలను పట్టించుకోలేదు ఎందుకంటే తనకి ఈ ప్రేమలు అంటే అంతగా పడదు. సమాజంలో జరిగే మోసాలు వల్లనో లేదా తనకి ప్రేమ మీద అంత నమ్మకం లేకనో సంధ్య ఈ ప్రేమలకి దూరంగా ఉండాలనుకుంది. అలానే ఉంటుంది. మరి అటువంటి మనసుని మార్చాలంటే తన మనసులో ప్రేమ పుట్టించలంటే సంజయ్ కి ఒక పెద్ద సాహసం లాంటిదే. కానీ సంజయ్ మాత్రం చాలా సులభంగా తన ప్రేమని వ్యక్తపరచి సంధ్య మనసులో చోటు సంపాదించాలి అనుకున్నాడు. ప్రతి జూనియర్ ని చెల్లి అని పిలిచే అతను సంధ్యని మాత్రం పేరుతోనే పలకరించేవాడు.

ఒకసారి సంధ్యని తన స్నేహితురాళ్ళు సంజయ్ అన్నయ్య నిన్నే చూస్తున్నాడు, నిన్ను చూసి నవ్వుకుంటున్నాడు, నిన్ను ఇష్టపడుతున్నాడు పైగా నిన్ను చెల్లి అనడు, చూడు త్వరలో ఐ లవ్ యు కూడా చెప్తాడు అని ఆట పట్టించారు. అందుకు సంధ్య కోపం తెచ్చుకోలేదు కానీ సంజయ్ ని అడుగుదాం ఈసారి ఏమంటాడో తన నోటి నుండే విందాం అని చెప్పింది. అందుకు సరే అన్నారు సంధ్య స్నేహితులు. ఇంటర్వెల్ వచ్చింది. సంజయ్ సంధ్యని చూడటానికి వచ్చాడు. అప్పుడు సంధ్య అతనిని పిలిచి 'నువ్వు నన్ను చూస్తున్నావంటా, నన్ను లవ్ చేస్తున్నావంటా, నా ఫ్రెండ్స్ అంటున్నారు నిజమేనా' అని అడిగింది. సంధ్య ఒక్కసారిగా అలా అడిగేసరికి ఆమె స్నేహితురాళ్ళు మౌనం అయిపోయారు. సంజయ్ కూడా చిరునవ్వుతో సిగ్గుపడుతూ ఏమో సంధ్య వాలెందుకంటున్నారో అని బదులిచ్చాడు.ఇంతలో ఇంటర్వెల్ అయిపోయింది. తర్వాత ఎవరి తరగతులకు వాళ్ళు వెళ్ళిపోయారు. సంజయ్ మాత్రం ప్రతి రోజు ఎలా మాట్లాడాలి ఎలా కలవాలి ఎలా తన మనసులో మాట చెప్పాలి అనుకునే సమయంలో సంధ్యకి కొంచెం తన మనసులో మాట తెలియటం కొంచెం పని సులభం అనిపించింది. ఇక ఎలాగో అందరికి తెలిసిన విషయం అసలు తెలియాల్సిన వాళ్ళకి కూడా తెలపాలని ఆ రోజు నుండి సంధ్యతో బాగా మాటలు కలిపాడు. సంధ్య లవ్ చేస్తున్నావా అని అడిగితే ఎక్కడ తిడుతుందేమో అని, లేదు మనం మంచి ఫ్రెండ్స్ అని బదులిచ్చేవాడు. ఫ్రెండ్ అంటున్నాడు కదా అని సంధ్య కూడా సంజయ్ తో బాగా మాట్లాడేది. ఇలా కొన్ని నెలలు గడిచాయి. సంజయ్ ఆమె ప్రేమలో పడి తేలుతూ సంధ్య కూడా అతనిని తిరిగి ప్రేమిస్తుంది అని చాలా నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాడు. అది గమనించిన సంధ్య తోటి స్నేహితులు సంధ్యని హెచ్చరించారు. 'సంజయ్ నీ విషయం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు. నువ్వు ఇంకా అతనితో మాట్లాడటం మానేసెయ్' అని చెప్పారు. అదే రోజు సాయంత్రం సంధ్య సంజయ్ తో 'నన్ను ప్రేమిస్తున్నావా లేదా నాతో స్నేహం చేస్తున్నావా? నిన్ను నన్ను అందరూ తప్పుగా అనుకుంటున్నారు' అని. అందుకు సంజయ్ 'నాకు నువ్వంటే ప్రాణం రా, నువ్వు లేకుండా బ్రతకలేను, నువ్వు కావాలి నాకు నీతో జీవితాంతం బ్రతకాలని ఉంది' అని తన మనసులో మాట చెప్పేశాడు. అందుకు సంధ్య, 'మరి స్నేహం అని ఇన్ని నెలలు ఎందుకు అబద్దం చెప్పావు' అని అడిగితే, 'ఎక్కడ నువ్వు మాట్లాడటం మానేస్తావో అనే భయంతో చెప్పలేకపోయాను' అని బదులిచ్చాడు సంజయ్. సంధ్యకు ఇవన్నీ నచ్చని విషయాలు. అందుకని సంజయ్ తో 'నాకు ఇష్టం లేదు ఈ ప్రేమలు, నేను నిన్ను ప్రేమించలేను. ఏదో స్నేహం అన్నావని మంచివాడివని ఇన్ని రోజులు మాట్లాడాను, అంతకుమించి ఏమీ లేదు, ఇకపై మనమిద్దరం మాట్లాడుకోవటం జరగదు ఇక నువ్వు నా గురించి ఆలోచించటం మానేసెయ్' అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయింది సంధ్య. ఆమె వెనకాలే బ్రతిమిలాడుతు వెళ్ళాడు సంజయ్. అయినా లాభం లేకపోయింది. సంధ్య వెళ్ళిపోయింది. సంజయ్ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు సంజయ్ సంధ్యతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. సంధ్య పలకలేదు. సంజయ్ తట్టుకోలేకపోయాడు. కళాశాలకు వచ్చేదే ఆమె కోసం. అలాంటిది తనే మాట్లాడటం లేదనేసరికి సంజయ్ రెండు రోజులు కళాశాలకు రావటం మానేశాడు. మానేయటానికైతే మానేశాడు కానీ అతని మనసు మాత్రం సంధ్య చుట్టూనే తిరుగుతుంది. ఇంట్లో ఉండలేకపోయాడు. మూడోరోజు మళ్ళీ కళాశాలకు వచ్చాడు. సంధ్య మాత్రం పట్టించుకోలేదు. సాయంత్రం బస్ స్టాప్ లో సంజయ్ సంధ్యతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలని కోరాడు. అందుకు సంధ్య సరే అనింది. 'నన్ను క్షమించు, నీ ఇష్టం తెలుసుకోకుండా నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇంకెప్పుడు అలా చెయ్యను. నువ్వు నన్ను ప్రేమించవద్దు. నేను నిన్ను ప్రేమించమని కూడా అడగను. దయచేసి మామూలుగా ఉండు, ప్లీజ్..' అని క్షమాపణ చెప్పాడు. అందుకు సంధ్య 'క్షమాపణలు ఏమీ ఒద్దు ప్రేమ గురించి నా దగ్గర తీసుకురాకుండా ఉంటే చాలు' అనింది. సరే అన్నాడు సంజయ్. కానీ సంధ్య అతనితో మాట్లాడటానికి ఇష్టపడలేదు. మరుసటి రోజు సంధ్యకి హాయ్ చెప్పాడు. సంధ్య చూసి స్పందించకుండా వెళ్ళిపోయింది. రెండు రోజులు చూసాడు. సంధ్య దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడాడు. 'ఎందుకు సంధ్య నన్ను చూసీ కూడా చూడనట్టు ఉంటున్నావు. నేనేమీ తప్పు చేశాను. దయచేసి అలా ఉండకు. నేను తట్టుకోలేను. నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టను అని అంటున్నాను కదా, నాతో మాట్లాడు' అని కోరాడు. స్నేహితులుగా ఉందాం అని సంధ్యని బ్రతిమిలాడాడు. సంధ్య ప్రేమ గురించి తీసుకురాకూడదని మాట తీసుకుంది. సంజయ్ అందుకు అంగీకరించాడు. సంధ్య కూడా స్నేహితులుగా ఉండటానికి ఒప్పుకుంది. అప్పుడు చూడాలి సంజయ్ కి తల మీద ఒక పెద్ద బండ కిందకి దించినంత ప్రశాంతత కలిగింది. ఇక ఎవ్వరు ఏమనుకున్నా సంజయ్ ఫ్రెండ్స్ అన్నాడు కదా అని సంధ్య కూడా పట్టించుకోలేదు. ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. నిజానికి సంజయ్ ఎక్కడ సంధ్య తనకి శాశ్వతంగా దూరం అయిపోతుందో అనే భయంతో స్నేహితులుగా ఉండటానికి ఒప్పుకున్నాడు కానీ అతనికి సంధ్య పట్ల ప్రేమ మాత్రం రవ్వంత కూడా మారలేదు. అలా అని సంధ్య దగ్గర తన ప్రేమను వ్యక్తపరచటం లేదా ప్రేమ చూపించటం చెయ్యలేదు. అలా అని నటించనూ లేదు. ఒక మంచి స్నేహితుడుగా తనకి దగ్గరయ్యాడు. తన గురించి సంధ్యకి పూర్తిగా అర్థమయ్యాక సంధ్య తన ప్రేమని ఒప్పుకుంటుంది అనే ఒక చిరకాల ఆశతో ఎదురుచూస్తున్నాడు. సంజయ్ ప్రతి రోజు కళాశాలలో సంధ్యని చూస్తూ ఉండేవాడు, సాయంత్రాలు బస్ స్టాప్ లో సంధ్య బస్ నంబర్ 7 వచ్చేవరకు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. సంధ్య ఇంటికి వెళ్ళేవరకు తనకి తెలియకుండా తోడుగా తన బండి మీద వెంబడించేవాడు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి.

అది 2017 ఫిబ్రవరి నెల. కళాశాలలో కెమిస్ట్రీ మూడు బ్యాచులను ఎక్స్కర్షన్ కి బందర్ బీచ్ కి తీసుకువెళ్ళాలని డిపార్ట్మెంట్ నిర్ణయించింది. సంజయ్ కి చివరి సంవత్సరం అయిపోవస్తుంది. కళాశాల విడిచిపెట్టి వెళ్లిపోవాలి. సంధ్య కి మరోసారి తన ప్రేమని తెలపాలనుకున్నాడు. ఎక్స్కర్షన్ కి రెండు రోజులు ముందు సంజయ్ తన ప్రేమ ప్రస్తావన తీసుకువచ్చాడు. సంధ్య మళ్ళీ కోప్పడింది. సంజయ్ ఎంత వేడుకున్నా సంధ్య మాత్రం కరగలేదు. అంతేకాకుండా సంజయ్ ని బాగా అరిచి వెళ్ళిపోయింది. సంజయ్ ఇంక ఎక్స్కర్షన్ కి రాకూడదని నిర్ణయించుకున్నాడు. ఎక్స్కర్షన్ రోజు వచ్చేసింది. కెమిస్ట్రీ మేడంకి సంజయ్ కొంచెం బాగా తెలిసిన అబ్బాయి. ఎక్స్కర్షన్ కి రావట్లేదని తెలిసి మందలించి రప్పించింది. అందరు తయారు అయ్యి పొద్దున్నే 7 గంటలకి బస్ ఎక్కి రెడీ గా ఉన్నారు. సంజయ్ కూడా రాకూడదనుకుంటునే మేడం చెప్పటంతో వచ్చాడు. అప్పటికి సంధ్య ఇంకా రాలేదు. తన కోసం ఎదురుచూస్తూనే ఎక్స్కర్షన్ కి వెళ్ళటానికి తోటి స్నేహితులతో కలిసి అన్నీ సర్ధుతున్నాడు. ఇంక సంధ్య రాదు అనుకున్న సమయంలో నల్లటి రంగు డ్రెస్సు లో తెల్లటి రూపంలో అందంగా తయారు అయ్యి వచ్చింది సంధ్య. సంజయ్ కూడా నల్లటి రంగు షర్ట్ వేసుకున్నాడు. ఇద్దరు మ్యాచింగ్ అయ్యేసరికి ఒక్కసారిగా గాల్లో ఎగిరిన్నట్టుగా తన మనసు ఎగిరి సంధ్య దగ్గరకు వెళ్లి తనని కొద్దిసేపు అలా చూసి కళ్ళతోటే పలకరించి వచ్చింది అతని మనసు. ఎందుకంటే సంధ్య అరిచిన అరుపులు అతనికి ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అందుకనే తనతో మాట్లాడితే మళ్ళీ ఎలా అరుస్తుందో అని భయపడి ఏమీ మాట్లాడకుండా తనని చూస్తూనే ఉండిపోయాడు సంజయ్. అందరు హుషారుగా ఆట పాటలతో బందరు చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళాక సంజయ్ సంధ్యతో ఏమీ మాట్లాడలేదు. అది అంతా బురద ప్రాంతం. అందరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నడుస్తున్నారు. సంజయ్ సంధ్య ఎక్కడ పడిపోతుందో అని తనని దూరం నుండే జాగ్రత్తగా కంట కనిపెట్టుకుంటున్నాడు. ఆ రోజంతా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అలా ఆ రోజు గడిచిపోయింది. తిరిగి కళాశాలకు వచ్చేసరికి రాత్రి 9 అయ్యింది. కొంతమంది తమ ఇళ్ళకు దగ్గరలో దిగిపోయారు. మరి కొంత మంది బస్ స్టాండ్ లో దిగిపోయి అక్కడినుండి తమ ఇళ్ళకు వెళ్ళారు. సంధ్య కూడా బస్ స్టాండ్ లో దిగిపోయింది. తనకి తోడు ఎవ్వరూ లేరు. ఒక్కతే వేరే బస్ ఎక్కి ఇంటికి వెళ్తుంది. సంజయ్ ఎప్పుడూ తనని ఒంటరిగా విడిచిపెట్టలేదు. సంధ్యకు తెలీకుండానే తన వెంట వచ్చాడు. దారి మధ్యలో సంధ్య సంజయ్ ని గమనించింది. తోడుగా వస్తున్నాడని గ్రహించింది. బస్ దిగినాకా సంధ్య వెళ్ళే సందు వరకు తోడొచ్చాడు సంజయ్. సంధ్య అతనికి థాంక్స్ చెప్పింది. అందుకు సంజయ్ నా బాధ్యత అని చెప్పి సంధ్య ఇంటికి వెళ్లేవరకు దూరం నుండి గమనిస్తూ ఉన్నాడు. తర్వాత తను కూడా వెళ్లిపోయాడు. ఆ రోజు అలా ముగిసిపోయింది.

మళ్ళీ 2017 ఏప్రిల్ నెల వచ్చేసింది. పరీక్షలు మొదలయ్యాయి. సంజయ్ కి ఏదో దూరం అవుతుందనే లోటు అర్థమవుతుంది. సంధ్యకి తన ప్రేమని చెప్పలేక, దాచుకోలేక సతమతమైపోయాడు సంజయ్. సంధ్య తో ఒక మంచి స్నేహితుడిగా ఉండిపోయాడు. అతనికి చదువు కూడా ఈ సంవత్సరంతో అయిపోయింది. అది కూడా సంధ్యను కలిసే అవకాశం ఉండదని అతని బాధ. సెలవులు వచ్చాయి. ఈసారి సంధ్య సంజయ్ తో ఫేస్ బుక్ లో మాట్లాడలేదు. సంజయ్ చాలా మౌనం అయిపోయాడు. సంధ్య తన ముందు లేకపోవటం, తన మాటలు వినపడకపోవటం ఇవన్నీ అతనిని మౌనం చేసేసాయి. ఇలా వేసవి సెలవులు ముగిశాయి.

2017 జూన్ నెల. సంధ్యకు చివరి సంవత్సరం. అయితే సంజయ్ మాత్రం ఇంక రాడు అని అందరు అనుకున్నారు ఎందుకంటే అతనికి బి. ఎస్సీ పూర్తి అయిపోయింది కాబట్టి. సంధ్య కూడా అలానే అనుకుంది. తన వల్ల సంజయ్ కి ఏ బాధ ఉండదు అతను ఇకపై మంచిగా ఉంటాడు తన భవిష్యత్తు చూసుకుంటాడు అనుకుంది. తనకి ఏమీ తెలుసు సంజయ్ భవిష్యత్తు సంధ్యనే అని. కళాశాలకు మొదటి రోజు బస్ ఎక్కటానికి స్టాప్ కి వచ్చింది సంధ్య. అక్కడ సంజయ్ ని చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకు వచ్చావు అంటూ నిదానంగా అడిగింది. ఊరికే చూసి పోదాం అని వచ్చా కానీ నిన్ను ఇబ్బంది పెట్టను మంచిగా చదువుకో, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి సంధ్యని ఒకసారి చిరునవ్వు నవ్వమని అడిగాడు. సంధ్య నవ్వింది. సంధ్య బస్ ఎక్కాక సంతోషంగా అక్కడినుండి వెళ్లిపోయాడు.

వారం రోజులు గడిచాయి. ఎవరు అనుకోనట్టుగా సంజయ్ యం. ఎస్సీ కెమిస్ట్రీలో మొదటి సంవత్సరం సీట్ కొనుక్కున్నాడు. కానీ యం. ఎస్సీ తరగతులు పొద్దున పూట అయితే బి. ఎస్సీ తరగతులు మధ్యాహ్నం. అయినా పర్వాలేదు. కళాశాలకు రావటానికి అతనికి ఒక అవకాశం దొరికింది. అతడు జాయిన్ అయిన విషయం సంధ్యకు తెలిసింది. కొన్ని రోజులకు సంజయ్ సంధ్యతో మాట్లాడటం మొదలుపెట్టాడు. సంధ్యతో తన గురించి చెప్పాడు. 'సంధ్య! నేను ఉద్యోగం చూసుకున్నాను. నాకు చదువు అంత ఇష్టం లేదు. నేను కేవలం నీకోసమే జాయిన్ అయ్యాను. అలా అని నిన్నేమీ ఇబ్బంది పెట్టను.

నువ్వు నాతో మాట్లాడితే చాలు. నువ్వే నా బలం. అలానే నువ్వే నా బలహీనత కూడా. నేను నీతో మాట్లాడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. నువ్వు నన్ను ప్రేమించమని అడగను. కేవలం మాట్లాడితే చాలు. నా సంతోషం నీ చేతుల్లోనే ఉంది. దయచేసి కాదు అని మాత్రం అనకు. ప్లీజ్ సంధ్య! నువ్వు ఫ్రెండ్లీగా మాట్లాడితే చాలు. నేను ఉద్యోగం మంచిగా చేసుకుంటాను. ప్లీజ్!!' అని వేడుకున్నాడు. అందుకు సంధ్య కాదనలేక సరే అనింది. ఇది ఒకటో రెండో సారి కాదు వంద సార్లు సంజయ్ రిక్వెస్ట్ చేయగా సంధ్య అప్పటికి మాట్లాడటానికి ఒప్పుకుంది. ఇంక సంజయ్ కళాశాలకు ఫీజ్ కట్టినా కూడా సంధ్య మాట్లాడుతుంది కనుక కళాశాలకు రావటం తగ్గించేసాడు. తన ఉద్యోగంపై దృష్టి పెట్టాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు సంజయ్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అయితే, సంధ్య కళాశాలకు వెళ్ళే సమయంలో సంధ్య బస్ వేంబడించేవాడు తోడుగా. అలాగే, సాయంత్రం కళాశాల అయిపోయాక సంధ్యతో పది నిమిషాలు మాట్లాడి ఇంటిదాకా తోడుగా వెళ్ళేవాడు సంధ్య బస్ వెనకాల. ఇలా కొన్ని నెలలు గడిచాయి. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు.

2017 డిసెంబర్ నెల. ఆ సమయంలో అన్ని యూనివర్సిటీల నుండి రకరకాల కళాత్మక పోటీలు నిర్వహిస్తారు. అందులో గెలిచిన వారు సౌత్ జోన్ లో పాల్గొనటానికి అర్హులవుతారు. ఈసారి సంధ్య ఆర్ట్స్ విభాగంలో పాల్గొనటానికి కళాశాల యాజమాన్యం నిర్ణయించింది. అయితే పాటల విభాగం నుండి తన తోటి స్నేహితురాలు పాల్గొంటుంది కనుక సంధ్య కూడా తనకు తోడుగా తన స్నేహితురాలు ఉన్నందున ఆర్ట్స్ విభాగంలో తన పేరు ఇవ్వటానికి సరే అనింది. ఈ విషయం ముందు సంజయ్ కి తెలియలేదు. తర్వాత తెలిసింది. కళాశాలలోనే కదా అని సంజయ్ కూడా ప్రోత్సహించాడు. పోటీలు ప్రారంభం అయ్యాయి. మూడు రోజులు బాగా జరిగాయి. మూడో రోజు విజేతలను తెలిపారు. పాటల విభాగంలో మొదటి బహుమతి సంధ్య స్నేహితురాలికి, ఆర్ట్స్ విభాగంలో మొదటి బహుమతి సంధ్యకి వచ్చాయి. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సంధ్య మరియు ఆమె స్నేహితురాలు చెన్నై లో పాల్గొనటానికి గొప్ప అవకాశం వచ్చింది. సంధ్య చెన్నై వెళ్ళదులే అనుకున్న సంజయ్ కి ఇది ఒక షాక్ లాంటిదే. సంధ్య తల్లిదండ్రులు మొదట వద్దని అభ్యంతరం చెప్పినా, తన కళాశాల యాజమాన్యం అడగటంతో చివరికి ఒప్పుకున్నారు. డిసెంబర్ 17 న చెన్నై వెళ్ళవలసి ఉంది. ఇదే మాట డిసెంబర్ 16 న సంధ్య సంజయ్ కి బస్ స్టాప్ లో చెప్పింది. సంధ్య ఆ మాట చెప్పగానే సంజయ్ ఏదో కోల్పోయిన వాడిలా అయిపోయాడు. కొంచెంసేపు సంధ్యతో ఏమీ మాట్లాడలేకపోయాడు. సంధ్య నచ్చజెప్పింది. తన మాటలకి సంజయ్ కొంచెం నెమ్మదించాడు. సంధ్యకు దగ్గరగా కూర్చుని జాగ్రత్తలు చెప్పాడు. సమయానికి తిని పొడుకో. ఎక్కువగా కష్టపడకు. వచ్చినంతే చక్కగా చెయ్యి అని చెప్పి కొంచెంసేపు ప్రేమగా మాట్లాడి సంధ్యని పంపించాడు. సంజయ్ కి ఇది ఒక పరిక్షలాంటిది ఎందుకంటే అంతదూరం సంధ్య అతనికి ఉండటం ఇదే మొదటిసారి. వారం రోజులు ఎప్పుడూ గడిచిపోతాయా అని వేచి చూసాడు. అతనికి మాత్రం వారం రోజులు చాలా కష్టంగానే గడిచాయి. సంధ్య వారం రోజుల తర్వాత పోటీలు ముగించుకుని తిరిగి తన ఊరు వచ్చేసింది. సంజయ్ సంధ్య రావటమే ఆమెను కలిసి మాట్లాడి తను లేని లోటుని సంధ్యకు చెప్పాడు. మళ్ళీ వాళ్ళ స్నేహం మామూలే.

2018 వ సంవత్సరం వచ్చేసింది. సంధ్యకు కూడా చివరి సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి. పరీక్షలు అన్నిటినీ మంచిగా పూర్తి చేసి కళాశాలకు సెలవు చెప్పేసింది సంధ్య. మళ్ళీ సంజయ్ కి కష్టాలు మొదలయ్యాయి. ఈసారి సంధ్య చదువు కూడా అయిపోయింది. తను ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది ఎలా ఉంటుంది తనకి దూరంగా ఎలా ఉండాలని బాధపడ్డాడు. సంధ్య లేకుండా అలానే గడుపుతూ ఏదో వెళ్ళాలి కదా అని ఉద్యోగానికి వెళ్తూ జీవితం నెట్టుకొచ్చాడు సంజయ్. వేసవి సెలవులు అయిపోయాయి.

సంధ్య యం. ఎస్సీ జాయిన్ అవుదాం అనుకుంది కానీ ఎందుకో తను అనుకోకుండా ఒక స్కూల్ లో డ్రాయింగ్ టీచర్ గా జాయిన్ అయింది. తనతో పాటు తన ఇద్దరు స్నేహితులు కూడా టీచర్ గా జాయిన్ అయ్యారు. టీచర్ గా చేస్తూనే ముగ్గురు యం. ఎస్సీ కట్టారు. సంధ్య స్కూల్ లో టీచర్ గా జాయిన్ అయిన విషయం తెలుసుకున్న సంజయ్ ఊపిరి పీల్చుకున్నాడు. మళ్ళీ ఎప్పటి మామూలుగానే సంధ్యని స్టాప్ లో కలవటం మాట్లాడటం చేశాడు. సంధ్యని ప్రేమించి మూడు సంవత్సరాలు దాటుతుంది. సంధ్య ఇప్పటికైనా తన ప్రేమను అర్ధం చేసుకుందేమో అని మళ్ళీ తన ప్రేమను తెలపాలనుకున్నాడు. ఒకరోజు సంధ్యతో మాట్లాడటానికి తనని కలిశాడు. 'సంధ్య! నా మీద ఇంకా నమ్మకం లేదా? నా మీద ప్రేమ లేదా? ఎప్పటికీ కలగదా? దయచేసి నా ప్రేమను అర్థం చేసుకో. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నీకు నేను ఇంక ఏమి చేయాలి చెప్పు సంధ్య నీ కోసం ఏమీ చేయమన్నా చేస్తాను' అని ప్రాధేయపడ్డాడు. అందుకు సంధ్య 'నాకు ఈ ప్రేమల మీద నమ్మకం లేదు అని ముందే చెప్పాను. పైగా, మా ఇంట్లో కూడా అస్సలు ఒప్పుకోరు. నువ్వు నన్ను అడగటం మానేస్తే మంచిది లేకపోతే నేనే మాట్లాడటం మానేస్తా' అనింది. అందుకు సంజయ్ 'మీ ఇంట్లో ఒప్పుకుంటే నీకు ఒకే కదా?' అని అడిగాడు. అందుకు సంధ్య వాళ్ళ ఇష్టమే నా ఇష్టం అని బదులిచ్చింది. సంజయ్ కి ఒక చిన్న ఆశ దొరికింది. 'సంధ్య! నేను మీ పేరెంట్స్ ని ఒప్పిస్తాను. ఇదొక్క నమ్మకం ఉంచు నా మీద. నువ్వు నాతో మాట్లాడు. మీ పేరెంట్స్ ఒప్పుకుంటేనే మన పెళ్ళి జరుగుతుంది. అప్పటివరకు మాట్లాడు' అంటూ కోరాడు. సంధ్య ఒప్పుకోలేదు. మళ్ళీ మళ్ళీ కోరాడు. చివరికి సంధ్య కూడా సరే అనింది.

సంధ్య ప్రతిరోజు స్కూల్ కి వెళ్ళటం, సంజయ్ ఉదయం, సాయంత్రం రావటం, సంధ్య తో మాట్లాడటం సర్వసాధారణం అయిపోయింది. 2018 సెప్టెంబర్ నెలలో మరోసారి సంజయ్ ప్రేమ ప్రస్తావన తెచ్చాడు. ఈసారి సంధ్య రెండువారాలు మాట్లాడటం మానేసింది. ఆ దెబ్బతో సంజయ్ తన ఉద్యోగం చేయలేకపోయాడు. సంధ్య వెంట పడి .మళ్ళీ పాత పాట మొదలుపెట్టాడు. కనీసం మాట్లాడమని బ్రతిమిలాడటం ప్రారంభించాడు. సంధ్య ఒప్పుకోలేదు. చివరికి ఉదయం నుండి సాయంత్రం వరకు సంధ్య స్కూల్ దగ్గరే ఏమీ తినకుండా ఉండి, తను మాట్లాడుతుందని ఒక చిన్న ఆశతో ఎదురుచూసాడు. అతనిని చూసి సంధ్య మనసు కరిగింది. ప్రేమ గురించి పక్కన. ముందు తన స్నేహితుడు అలా అయిపోవటం చూసి సంధ్య తట్టుకోలేకపోయింది. అతనితో, మాట్లాడతాను, ఇంటికి వెళ్ళమని చెప్పింది. సంజయ్ ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. ఉద్యోగం లేదు. అయినా పర్వాలేదు సంధ్య మాట్లాడుతుంది చాలు అనుకున్నాడు. 2018 జూన్ నుండి 2019 ఏప్రిల్ వరకు సంధ్య స్కూల్ లో టీచర్ గా చేసి తర్వాత మానేసింది. ఆ సమయంలో సంధ్య సంజయ్ ని కొంచెం కొంచెం అర్ధం చేసుకోవటం మొదలుపెట్టింది. సంజయ్ సంధ్య ఫోన్ నంబర్ కనుక్కున్నాడు. సంధ్య ఈసారి ఇంట్లోనే ఉండి తన ఎం.ఎస్సీ పరీక్షలకు సిద్ధపడుతుంది. సెప్టెంబర్ నెల అవుతుంది. సంధ్య నుండి ఏ మాట లేదు. తను ఎలా ఉందో ఎం చేస్తుందో తెలీదు. ఒకరోజు సంజయ్ సంధ్య కి మెసేజ్ చేశాడు. సంధ్య నుండి స్పందన రాలేదు. కొన్ని నెలలకి సంజయ్ మళ్ళీ మెసేజ్ చేశాడు. ఈసారి సంధ్య నుండి జవాబు వచ్చింది. అప్పటినుండి మళ్ళీ మాటలు మొదలయ్యాయి. అప్పుడప్పుడే సంధ్య తనకే తెలియకుండా సంజయ్ కి దగ్గరవుతుంది.

2020 ఫిబ్రవరి 14 న సంధ్య స్నేహితురాలి పెళ్లి నిశ్చయం అయింది. పెళ్లి తెల్లవారు జాము 12 గంటలకు. సంధ్య తన స్నేహితురాళ్ళతో కలిసి వెళ్ళింది. సంజయ్ ఆమెను చూసి తన ఆనందానికి అవధులు లేనట్టుగా పొంగిపోయాడు. మొదటిసారి సంధ్య సంజయ్ ప్రేమను అర్ధం చేసుకున్న రోజు కూడా అదే. కానీ ఆ విషయం సంధ్యకు కూడా తెలీదు. ఆ విషయం సంధ్య కళ్ళలో స్పష్టంగా కనిపించింది సంజయ్ కి. సంధ్య మాట్లాడకపోయినా ఆమె కళ్ళు మాట్లాడతాయి అని సంజయ్ ఎప్పుడూ అంటుంటాడు. ఆమె కళ్ళు అన్ని భావాలను వ్యక్తపరుస్తాయి అని ఆమె కళ్ళను చూస్తే ఏదైనా అర్థమైపోతుంది అని సంజయ్ బాగా నమ్ముతాడు. ఆ రోజు రాత్రి సంజయ్ ఏదో గెలిచినట్టుగా సంతోషపడ్డాడు.

నెల తర్వాత సంధ్య మరో స్నేహితురాలి పెళ్లి. అది కూడా రాత్రే. పెళ్లికి గాగ్రా వేసుకుని నడుచుకుంటూ వస్తుంటే ఒక దేవతలా కనిపించింది సంజయ్ కి. ఆమెను చూసినప్పుడల్లా సంజయ్ తనను తాను మర్చిపోతుంటాడు. ప్రపంచంలో ఎక్కడ లేని సంతోషం అతనికే సొంతం అన్నట్టు పొంగిపోతాడు. సంధ్య వచ్చింది. ఆమెను పలకరించి పెళ్లి అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి పెళ్లి భోజనం చేశారు. కొంచెంసేపు ఒంటరిగా మాట్లాడుకున్నారు. సంధ్య సంజయ్ ని మంచి ఉద్యోగంలో స్థిరపడమని సమయం వృథా చేయొద్దని అతనికి మంచి మాటలు చెప్పింది. సంధ్య తన మనసులో మాట ఏమైనా చెప్తుందా అని ఎదురుచూసాడు కానీ సమాధానం ఏమీ రాలేదు. కానీ, సంజయ్ కి సంధ్య అంత దగ్గరగా ఉండటం పైగా రాత్రి సమయం, కొంచెం ఎక్కువసేపు మాట్లాడే అవకాశం రావటం ఇదే మొదటిసారి. ఆ సమయం సంజయ్ కి ఒక స్వర్గంలాగా అనిపించింది. సంధ్య మరియు ఆమె స్నేహితురాలు సంధ్య ఇంటికి వెళ్ళిపోయారు. సంజయ్ తోడుగా వెంట వెళ్ళాడు. అదే సంజయ్ కి సంధ్య కి మధ్య ఇన్ని సంవత్సరాల తర్వాత జరిగిన మంచి సంభాషణ. సంధ్య కోరిక మేరకు మంచి ఉద్యోగంలో చేరాడు సంజయ్.

2020 మార్చ్ నెల. ఆ నెలలో దేశమంతటా లాక్డౌన్ ప్రకటించారు. అది కరోనా కాలం. దేశాన్నే గడగడలాడించింది. దేశమే కాదు ప్రపంచ యావత్తును గడగడలాడించిన సంవత్సరం కూడా ఇదే. అప్పటికే కొన్ని దేశాలు లాక్డౌన్ ను అమలులో ఉంచారు. భారత దేశంలో మార్చ్ 24 న ప్రకటించారు. ఎవ్వరు తమ ఇళ్ళను వదిలి బయటకు రాకూడదని గవర్నమెంట్ నియమాలు పెట్టింది. అందరు ఇళ్లకే పరిమితం అయ్యారు. అయినా కూడా కరోనా తగ్గలేదు. దేశమంతటా వ్యాపించేసింది. ఎంతో మంది అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. మరెందరో ప్రాణాలతో పోరాడి మరణించాల్సి వచ్చింది. బయిట జనం తిరగటం లేదు. తిరిగితే పోలీసులు లాఠీఛార్జి చేస్తున్నారు.

సంజయ్ సంధ్యని కలవలేని పరిస్థితి. అప్పుడప్పుడే సంధ్య సంజయ్ మనసుకి దగ్గర అవుతున్న సమయం కానీ కలవలేరు. మెసేజుల తోటే ఇద్దరు మాట్లాడుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. మే నెల వచ్చింది. ఆ నెలలో సంధ్య పుట్టినరోజు. ఆ రోజు సంధ్యతో 'సంధ్య! నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నీ జీవితంలో ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటాను ఎప్పటికీ నీకు నీడగా నిలుస్తాను. నీ కోసం ఏమీ చేయటానికైనా సిద్ధం. నా ఊపిరి ఉన్నంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను' అని ప్రమాణం చేశాడు. కనీసం ఆ రోజైన సంధ్య తన మనసులో ఏముందో చెప్తుందని ఎదురుచూసాడు. సంధ్య ఏమీ చెప్పలేదు కదా సంజయ్ మాటలకి స్పందన కూడా ఇవ్వలేదు. సంజయ్ చాలా కుమిలిపోయాడు. సంధ్య మనసు మారదు అని బాధ పడ్డాడు. మానసికంగా చాలా బలహీనపడిపోయాడు. ఉద్యోగం కూడా చేయలేకపోయాడు. అతను అలా ఉండగా జూన్ నెల వచ్చేసరికి సంజయ్ మరియు అతని కుటుంబానికి కరోనా సోకింది. ఈ విషయం సంధ్యకి తెలిపాడు. న్యూస్ లో జరిగే బాధాకరమైన మరణాలకు ప్రపంచం మొత్తం వణికిపోతుంది. అలాంటి వార్తలు విని బాధ పడే సంధ్యకు సంజయ్ మరియు అతని కుటుంబం కరోనాతో బాధపడుతున్నారని తెలిసి సంధ్య తట్టుకోలేకపోయింది. సంజయ్ కుటుంబం మొత్తం ఆ సమయంలో చాలా బాధ అనుభవించారు. సంధ్య కూడా బాగా ఏడ్చింది. నిజం చెప్పాలంటే సంధ్యకు సంజయ్ మీద స్నేహంకంటే ఇంకా ఏదో ఉందని అప్పుడే అర్థమైంది. ఆ సమయంలో సంజయ్ ని చూడటానికి వీలు లేదు. కరోనా వల్ల ఎవరూ బయటికి రాకూడని పరిస్థితి. సంజయ్ కూడా సంధ్యను చూడకుండా ఉండలేడు. సంజయ్ పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. కరోనా తగ్గటం లేదు అయినా సరే సంధ్య ఒక చిన్న మెసేజ్ చేయగానే తన బాధనంతా మర్చిపోతాడు. ఆ సమయంలో సంధ్య సంజయ్ ని కలవలేకపోయినా దూరంగా ఉండే సంజయ్ కి ధైర్యం చెప్పింది. తనకి సంజయ్ పై ప్రేమ ఉందని సంధ్య చెప్పకపోయినా ప్రతిరోజు సంజయ్ కి చెప్పే జాగ్రత్తల్లో తన ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. సంజయ్ కూడా సంధ్యలో కలిగిన మార్పును ఆస్వాదిస్తున్నాడు. సంజయ్ కుటుంబం కొంచెం కొంచెం గా కోలుకుంటున్నారు. సంజయ్ కి మాత్రం తగ్గటం లేదు. ఆ సమయంలో సంధ్య సంజయ్ కి చాలా దగ్గరైపోయింది. నిజం చెప్పాలంటే, సంధ్య మాటలే సంజయ్ త్వరగా కోలుకునేలా చేశాయి. తన మాటలతో సంజయ్ మనసుకి మందులా మారింది. సంజయ్ ఆరోగ్యంగా, మానసికంగా బలంగా ఉండటానికి చాలా కష్టపడింది. సంజయ్ కి తగ్గిపోయి మామూలుగా అయితే అతను సంతోషపడే ఒక మాట కలిసినప్పుడు చెప్తాననింది. సంజయ్ సంధ్య ప్రేమగా మాట్లాడే మాటలకు కొంచెం మామూలు మనిషి అవుతున్నాడు. సంధ్య చెప్పాలనుకున్న మాట ఏమిటో వినాలని చాలా ఆతృతతో ఉన్నాడు. ఆ మాట వినటం కోసం మరియు సంధ్య ఇచ్చిన బలంతో సంజయ్ రెండు వారాలకు మామూలు మనిషి అయ్యాడు. కుటుంబం మొత్తానికి కూడా కోవిడ్ తగ్గిపోయింది. అందరికి నిదానంగా ఆరోగ్యం మెరుగుపడింది.

ఆగస్ట్ నెల వచ్చింది. గవర్నమెంట్ ఒకటొకటిగా నిబంధనలను తీసేసింది. సెప్టెంబర్ నెలకు లాక్డౌన్ ను పూర్తిగా తొలగించేశారు. ఆ సమయంలో సంధ్య సంజయ్ ను కలవాలనుకుంది. సెప్టెంబర్ 20 వ తేదీనా కలుద్దాం అని, ఆ రోజు సంజయ్ సంతోషపడే మాట చెప్తానని సంజయ్ కి ఆశ చూపింది. అతనికి మాట ఇచ్చింది. సంజయ్ కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. ఇన్నేళ్లకు సంధ్య కచ్చితంగా తన ప్రేమకు బదులు ఇస్తుందనే దృఢ నమ్మకంతో వేచి చూస్తున్నాడు. అప్పటిదాకా రోజు సంజయ్ సంధ్య మెసేజ్ లో మాట్లాడుకుంటున్నారు. సెప్టెంబర్ 14 వ తేదీనా ఇద్దరు చాలా ఆలస్యం అయ్యేవరకు చాట్ చేసుకున్నారు. చాలా సేపు ఇద్దరి అభిప్రాయాలు గురించి, ఇద్దరి ఇష్టాల గురించి మాట్లాడుకున్నారు. సెప్టెంబర్ 15 వ తేదీ వచ్చేసింది. ఆ రోజు సంధ్య నుండీ ఎటువంటి మెసేజ్ రాలేదు. ఆ తర్వాత రోజు కూడా ఏ మెసేజ్ రాలేదు. సంజయ్ ఒక్కరోజు సంధ్య నుండి మెసేజ్ రాకపోతే ఉండలేడు. అటువంటిది సంధ్య మాట్లాడి మూడు రోజులు అవుతుంది. సెప్టెంబర్ 19 వ తేది వచ్చింది. ఆ రోజు సంధ్యకు మెసేజ్ చేసాడు కానీ ఏమీ బదులు రాలేదు. సంధ్య తనను సర్ప్రైజ్ చేయటానికి మెసేజ్ ఏమీ ఇవ్వట్లేదని సంజయ్ అనుకున్నాడు.

సెప్టెంబర్ 20 వ తేది వచ్చేసింది. సంజయ్ పొద్దు పొద్దున్నే లేచి ఎప్పుడూ రెడీ అవ్వనంతగా చాలా నీట్ గా రెడీ అయ్యి ఒక ఎర్ర గులాబి పువ్వు కొనుక్కొని సంధ్యని ఎప్పుడూ కలిసే చోటులో మధ్యాహ్న సమయం ఒక గంట ముందే అక్కడికి వచ్చి సంధ్య కోసం ఎదురు చూసాడు. రెండు గంటలు అవుతుంది అయినా సంధ్య రాలేదు. సంధ్య ఎప్పుడూ సమయానికి ఉంటుంది అలాంటిది ఇంకా రాలేదు. సంజయ్ మాత్రం వెయ్యి కన్నులతో సంధ్య రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆమె ఏం చెప్తుందా అనే ఉత్సాహంతో వేచి చూస్తున్నాడు. సంధ్య రావటం ఆలస్యం అయినా, వేచి చూడటంలో ఇంత ఆనందం ఉంటుందా అని సంజయ్ అనుకున్నాడు. ఆ సమయంలో సంజయ్ మొదటిసారి సంధ్యని చూసిన రోజుని, కళాశాల యానివర్సరీ రోజు సంధ్య నీలం రంగు గాగ్రాలో రావటం, అలానే సంధ్య అతనితో కిలకిలమని నవ్వటం ఇవన్నీ సంజయ్ గుర్తుచేసుకుంటూ ఉన్నాడు. సమయం నాలుగు అవుతుంది. సంధ్య ఇంకా రాలేదు. మెసేజ్ చేసాడు అయినా ఎటువంటి స్పందన లేదు. సంధ్య వస్తుందనే నమ్మకంతో ఇంకా అక్కడే ఉన్నాడు. సాయంత్రం 7 అయింది. అప్పటికే అన్లాక్ సమయం అయిపోయింది. సంధ్య కోసం వేచి చూసి చూసి నిరుత్సాహంతో తిరిగి ఇంటికి బయలుదేరాడు. అసలు సంధ్య ఎందుకు రాలేదో అతనికి అర్ధం కాలేదు. తను మాత్రం సంధ్య ఇంట్లో కుదరక మెసేజ్ చేయటం లేదేమో అందుకే రాలేదేమో అని తనకి తాను సర్ది చెప్పుకున్నాడు. అంత నమ్మకం అతనికి సంధ్యపై. కానీ సంధ్య మాట్లాడి వారం పైన అవుతుంది. అదే అతనికి కొంచెం కలవరం కలిగించింది. సంజయ్ అలా అనుకుంటూనే ఇంటికి వెళ్లిపోయాడు.

ఆ రోజు రాత్రి పొడుకుంటూ సంధ్యకి మెసేజ్ చేసి తన మనసులో ఇలా అనుకున్నాడు. ' సంధ్యా ! ఏమైపోయావ్ !! మంచిగా తింటున్నావా లేదా ? ఎందుకు ఇవాళ రాలేదు ? నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, ఆ మాట చెప్పటానికే కలుద్దాం అన్నావు అని. నీ నోటి నుండి నన్ను ప్రేమిస్తున్నావని చెప్తే విందాం అనుకున్నాను. కానీ ఎందుకో రాలేకపోయావు. అయినా పర్వాలేదు. పది రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది కదా, 30న నా పుట్టినరోజు నాడు నీ మనసులో మాట చెప్పి నన్ను సర్ప్రైజ్ చేద్దామని రాలేదు కదా?! సరే! నీ సర్ప్రైజ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తాను. ఆ మాట విన్నాక నిన్ను ఇంక ఎప్పటికీ విడువను. నీతోనే ఉంటాను. ఐ ప్రామిస్ యూ అండ్ ఐ లవ్ యూ సంధ్యా... '

ఎవరికి తెలుసు సంధ్య సంజయ్ కి తన మనసులో మాట చెప్తానని మాట ఇచ్చి రాకుండా ఉండిపోయిందని.. ఎవరికి తెలుసు పుట్టినరోజు సర్ప్రైజ్ కోసం ఎదురుచూసే సంజయ్ కి అసలు తన మనసులో ఏముందో చెప్పకుండా సర్ప్రైజ్ ఇస్తుందని.. ఎవరికి తెలుసు ఐదు సంవత్సరాలుగా సంధ్యే ప్రాణంగా ఎదురుచూసే సంజయ్ ని చివరికి సంధ్య మోసం చేసిందని...

అది సెప్టెంబర్ 15. అదే రోజు సంధ్యకి కొంచెం జ్వరం వచ్చింది. ఒక రోజు మందులు వాడింది. తగ్గినట్టు అనిపించింది కానీ మళ్ళీ బాగా జ్వరం, దగ్గు ఎక్కువయ్యాయి. సంధ్య ఎప్పుడూ బయటకి వెళ్ళదు. వాళ్ళ ఇంటి పక్కన ఒకరికి కోవిడ్ వచ్చింది. అనుమానంతో కోవిడ్ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ అని తెలిసింది. ఆ విషయం సంజయ్ కి చెప్తే ఎక్కడ కంగారు పడతాడో, ఎక్కడ భయపడతాడో అని సంజయ్ కి చెప్పకుండా ఉండిపోయింది. సంధ్యకి మొదటినుండి ఉన్న అలవాటు ఇదే. ఏదైనా బాధ ఉంటే ఇతరులకు చెప్పుకోదు. తనలోనే దాచుకుంటుంది. అలానే సంజయ్ తనకి బాగోలేదని తెలిస్తే బాధపడతాడు అని చెప్పకుండా ఉంది. రెండు రోజులు అయింది. సంధ్యకి ఇంతకముందు ఉన్న అనారోగ్య కారణాల వల్ల కోవిడ్ తగ్గటం లేదు. ఒక్కసారిగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. సంధ్య తల్లిదండ్రులు సంధ్యని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. సంధ్య కూడా తగ్గిపోతుంది అని అనుకుంది. అనుకోకుండా సంధ్యని ఐ. సి. యూ లో ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. సంధ్య సంజయ్ ని 20న కలుస్తా అని ఇచ్చిన మాట తప్పింది. అదే రోజు తన ప్రేమను నిలుపుకోవాలని, గెలవాలని ప్రాణాలతో పోరాడి పోరాడి ఓడిపోయింది. సంజయ్ ని కలవటం కాదు కదా ఈ ప్రపంచానికే శాశ్వతంగా వీడ్కోలు పలికింది.

దీనికి బాధ్యులు ఎవరు. స్వచ్ఛమైన ప్రేమ చూపించిన సంజయ్ దా లేదా ఐదు ఏళ్ళు స్వఛ్చంగా ప్రేమించిన ప్రేమకు 70 ఏళ్ళు తోడు నిలుస్తా అని మాట ఇద్దామనుకున్న సంధ్యదా.

ఏమిటో అర్ధం కాదు. నిజమైన ప్రేమ అసలు ఈ రోజుల్లో ఎక్కడ ఉంది. అన్నీ అవసరాలతో కూడిన ప్రేమలే కనిపిస్తున్నాయి. మోసాలతో నిండిన ప్రేమలు కొన్నైతే, మోజుతో నిండిన ప్రేమలు మరి కొన్ని. ఎక్కడో ఒక చోట సంజయ్ సంధ్యల లాంటి ప్రేమలు అరుదుగా కనిపిస్తాయి. కనిపించినా, ఆ ప్రేమలు ఎప్పటికీ శాశ్వతంగా మిగలవు. మిగిలిన బ్రతికి ఉండవు. ఒకవేళ బ్రతికి ఉన్నా ఏవో ఒక అడ్డంకులు. మరి ఇటువంటి ప్రేమలు నిలిచేదెలా? తర్వాత తరాలకు ఆదర్శం అయ్యేదెలా?

అసలు సంజయ్ సంధ్య ప్రేమకి అడ్డు అయిన కరోనాకు బాధ్యులు ఎవరు? మనీషా? మృగమా?? ప్రకృతా???

మనిషి నిర్లక్ష్యమో లేక ప్రకృతి వైపరీత్యమోగానీ కరోనా వైరస్ పుట్టుకొచ్చింది. అయినా, ప్రకృతిలో మార్పులు కలిగితే అందుకు కారణం మనిషే అవుతాడు కనుక ఆ కరోనా వైరస్ పుట్టుకకు కారణం కూడా ముమ్మాటికీ మనిషే. ఆ ఒక చిన్న వైరస్ యావత్తు ప్రపంచాన్నే వణికించింది. ఎంతోమందిని ఆసుపత్రి పాలు చేసింది. వంద కాదు వెయ్యి కాదు కొన్ని లక్షల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఎందరో పొట్టకూటికోసం వలస వెళ్లిన వారు సొంత ఊరు రాలేక అక్కడే ఉండలేక నలిగిపోయారు. ఎంతోమంది ఉద్యోగాలు పోయి తిండిలేక ఇంట్లోనే ఉండిపోయారు. బయటికి వస్తే వైరస్ చంపేస్తుంది. ఇంట్లో ఉంటే తింటానికి తిండి లేక ఆకలి చంపేస్తుంది. అయినా కూడా చాలా మంది బ్రతికుంటే చాలు అన్నట్టుగా ఇంట్లోనే ఉండిపోయారు.

నిజం చెప్పాలంటే మనిషికి మనిషి విలువ తెలిసింది ఈ రోజుల్లోనే. మనిషి మానవత్వం బయిట పడింది కూడా ఈ సమయంలోనే. ఎక్కడో గుండె మూలల్లో ఉండిపోయిన ప్రేమలు, ఆప్యాయతలు, జాలి అనే భావాలు బయటికి వచ్చింది కూడా ఈ వైరస్ వల్లే. ఎందరో డాక్టర్లు కుటుంబాలకు దూరంగా ఉండి పగలనక రాత్రనక ఆసుపత్రిలో ఉండి కష్టపడి పనిచేసి చాలామంది ప్రాణాలు నిలబెట్టారు. మరెందరో సమాజం బాగుండాలని, ఎప్పటికప్పుడు పరిసరాలు శుభ్రంగా చేశారు. ఎంతోమంది తమకున్న దానిలోనే పేదలకు మరియు అవసరం ఉన్నవారికి సహాయపడ్డారు. ఎందరో మేమున్నాం అంటూ తోటివారికి ధైర్యానిచ్చారు. మరెందరో జీవితం అంటే తీరిక లేకుండా ఉద్యోగం చేయటం కాదు సొంతవారితో సమయం కేటాయించటం అని అదే నిజమైన జీవితం, అదే నిజమైన ఆనందమని తెలుసుకున్నారు. ఇలా ఒకటా రెండా, మనిషి అంటే ఏమిటో ఎలా ఉండాలో ఆ కరోనా వైరస్ ప్రతి ఒక్కరికి ఒక పెద్ద గుణపాఠం చెప్పింది...

ఒకప్పుడు ప్రపంచం అంటే

అందమైన పచ్చటి పొలాలు

ఆహ్లాదకరమైన ప్రకృతి

నిర్మలమైన ఆకాశం

నిర్మల మనసు గల మనుషులు

అవదుల్లేని నవ్వులు

హద్దుల్లేని ఆనందాలు

ప్రశాంతాన్నిచ్చే పక్షుల కిలకిలలు

పులకరించే పసినవ్వుల పలుకులు

ఇంతేనా..

పకపకమని ముచ్చటలొలికే ఆడపిల్ల నవ్వా

పరిమళిస్తూ వికసించే అందమైన పువ్వా

ప్రేమ మమకారాలు కలిసిన అవ్వ చేతి బువ్వ

తియ్యటి మకరందాన్ని అందించే అందమైన గువ్వ

బోసి నవ్వుల బిడ్డని ముద్దాడే అపురూప తల్లి ప్రేమా

ఉరకలేస్తూ ఒడ్డుని తాకే సముద్ర కెరటమా

బాధలలో నేనున్నానంటు ధైర్యమిచ్చే స్నేహమా

చీకటిని చీల్చుకుని వెలుగునిచ్చే సూర్యోదయమా

హృదయాన్ని పులకరించే ప్రియ స్పర్శ తుల్లింతలు

చిటపటమని ఆకులపై జారే చినుకుల జల్లులు

ఆట పాటలతో గంతులు వేసే పిల్లల కేరింతలు

రెపరెపలాడుతూ ఎగిరే సీతాకోక చిలుకలు

ఆహా!

ఇంతటి అందం ప్రపంచంలో ఉన్న మనుషులలోదా?

ప్రకృతిలో దాగి ఉన్న అందంలోదా?

ఎటు చూసినా ప్రకృతి మానవునిలో పెనవేసుకుని ఉంది

చూస్తుంటే ఎంత చక్కగా ఉన్నాయి ఈ అందాలు

అనుబంధాలు అంటేనే ఆనందం

కానీ ఇదంతా ఒకప్పటి గతం

ఎక్కడ ఉన్నాయి ఈ అందాలు

ఎక్కడ ఉన్నాయి ఈ ఆనందాలు

ఎక్కడ చూడు అసూయ ద్వేషాలు

ఎక్కడ చూడు అవమానాలు స్వార్ధాలు ఎందుకో ఈ అవహేళనలు

ఎందుకో ఈ అశాశ్వత భావాలు

మనిషీ.. ఓ మనిషీ...

మన చేతులే కనుక బాగుండి ఉంటే

ఈ చేతులు కడిగే అవసరమే వచ్చేది కాదు కదా

అదే విధంగా మన మనసే బాగుండి ఉంటే ఈ ముఖమును కప్పే అవసరమే వచ్చేది కాదు కదా

నడిసంద్రంలో మునిగాక ఓడలు చేద్దామని అనుకుంటున్నామా

చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నా ఏమీ ఉపయోగం

స్వార్థము నిలువునా నిండి ప్రకృతి పాడు చేసుకుంటున్నామా

కూర్చుని ఉన్న కొమ్మను నరికి దుఃఖిస్తూన్నామా

మనిషిని ప్రేమించి ఎంతో ఇష్టంగా దేవుడు సృష్టిని చేసాడు

మరి అంతే కాకుండా మనిషిని ఏలిక చేసాడు

కానీ,

మనసున గర్వించి మనిషి మార్పులు చేసాడు.. ప్రకృతి వికృతి చేసాడు..

చివరికి గాలిని కాలుష్యం చేసాడు

నీరును కాలుష్యం చేసాడు

భూమిని కాలుష్యం చేసాడు

చివరికి ఏమైంది??

తిండి కాలుష్యం చేసాడు

మందు కాలుష్యం చేసాడు

పొలము కాలుష్యం చేసాడు

ఫలము కాలుష్యం చేసాడు

ఆఖరికి మనిషి కాలుష్యం అయిపోయాడు

మనసు కాలుష్యం అయిపోయింది

చాలా ఆలస్యం అయిపోయింది

ప్రేమ చల్లారిపోయింది

బ్రతుకు పెడదారి పట్టింది.

మనిషి.. ఓ మనిషి...

మన నడవడి బాగుండి ఉంటే ఈ విపత్తు వచ్చేది కాదు కదా

మన ఆశకు హద్దులు ఉండి ఉంటే ఇంట్లో బంధీలం అయ్యేవాళ్ళం కాదు కదా

ఒకచోట ధనమే దేవుడని డబ్బును కొలిచాడు

మరి ఇప్పుడు ప్రాణము కొనగలుగుతున్నాడా

మరోచోట ప్రపంచ వేదికపై తానే రాజును అన్నాడు చివరికి క్రిములకు భయపడుతున్నాడు

ఆస్తి ఎంతున్నా ఏమి లాభం ఉంది

కీర్తి ఎంతున్నా ఏమి ఉపయోగం ఉంది

పదవి ఏదైనా ఏమి ప్రయోజనం ఉంది

చివరికి మరణసమయాన ధనము అక్కరకు రాదనే నిజము తెలిసింది.

ఎవడు ఉన్నోడు ఎవడు లేనోడు

అనే తేడా లేకుండా వ్యాధి గర్వాన్ని అణిచింది

సాటి మనుషులకు సాయపడమంటూ దైవనియమాన్ని నేర్పింది

మనిషి..ఓ మనిషి ఇకనైనా కన్నులు తెరిస్తే మన భవిష్యత్తు బాగుండదా?

మన తప్పులు దిద్దుకు మసలితే దైవానుగ్రహం లభించదా?

ప్రళయజలల్లో మునగక ముందే ఓడలు చేద్దామా

అగ్ని జ్వాలల్లో కాలకముందే ఆలోచిద్దామా

స్వార్థం కంచెలు తెంచి మనిషిని మనిషిగా చూద్దామా

ప్రకృతి ఒడిలో దైవం నీడలో ఆనందిద్దామా

అందుకే ఎప్పుడూ కూడా మన చేతలు బాగుండాలి

మన హృదయం బాగుండాలి

సాటి మనుషిని ప్రేమించాలి

ఆ దైవం కరుణిచాలి

మానవా! మేలుకో!!

మానుకో! మార్చుకో!!

నల్లటి వేష రూపంలో ఉన్న ఆ ముసుగుని తీసేద్దాం

ఎర్రటి జ్వలలా మండే కోపాన్ని ఆర్పేద్దాం

నీలి నింగిలాగ నిర్మల హృదయంతో ఉందాం

పసుపు పూసుకున్న భానుడిలా ప్రకాశిద్దాం

కాషాయపు కిరనాల్లా ప్రేమను పంచుదాం

తెల్లటి మల్లెపువ్వులా ఆప్యాయతలు వెదజల్లుదాం

పచ్చటి పంట పొలాల్లా నవ్వులు పండిద్దాం

అప్పుడే కదా ఉంటుంది ఈ జీవితానికి అర్ధం

అందుకే ప్రతి ఒక్కరం కలిసిమెలిసి జీవిద్దాం

ప్రకృతిలో కనిపించే ఇన్ని అందమైన రంగులు మన మనసునిండా కూడా నింపుకుందాం

అసూయలు అభాండాలు అబద్ధాలు అవమానాలు అనే రోగాలు తరిమేద్దాం అనుబంధాలు ఆప్యాయతలు అనురాగాలు ఆనందాలు అనే రంగులు పూసుకుందాం

ఎందుకంటే అన్ని రంగులు కలిస్తేనే ఇంద్ర ధనుస్సు

అదే ఈ అందమైన రంగుల మనసు...

సంజయ్ పుట్టినరోజున అంటే సెప్టెంబర్ 30 వ తేదీన సంధ్య కలుస్తుంది అని ఎదురుచూసాడు. సంధ్య రాలేదు. చివరికి అతనికి నిజం తెలిసింది. మరి అతను ఏమైపోయాడు. అతను ఎప్పుడూ సంధ్యకి ఇచ్చిన మాట తప్పలేదు. సంధ్యను వదలను అని ప్రమాణం చేసినట్టుగానే తన పుట్టినరోజున సంధ్య దగ్గరకి వెళ్లిపోయాడు...

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.



58 views0 comments
bottom of page