top of page
Original_edited.jpg

ఆశల వెన్నెల

  • Writer: Kolla Pushpa
    Kolla Pushpa
  • 4 hours ago
  • 5 min read

#KollaPushpa, # కొల్లాపుష్ప, #AsalaVennela, #ఆశలవెన్నెల, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Asala Vennela - New Telugu Story Written By Kolla Pushpa

Published In manatelugukathalu.com On 18/11/2025

ఆశల వెన్నెల - తెలుగు కథ 

రచన: కొల్లా పుష్ప


సూర్యుడు పశ్చిమాన వాలుతున్నాడు. రాములు గుడిసె చీకటితో నిండిపోయింది. దీపం వెలుతురు మసకగా ఉంది. లోపల రాములు, లక్ష్మి నేల మీద కూర్చుని ఉన్నారు. వారి ఇద్దరు పిల్లలు - ఏడేళ్ల వాణి, ఐదేళ్ల రాజు - వారి ఒళ్లో తల పెట్టుకుని నిస్సత్తువుగా పడుకున్నారు. 


"అన్నం కావాలమ్మా".. అన్నాడు దీనంగా రాజు. 


లక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన పిల్లల ఆకలి కేకలు ఆమె గుండెను పిండేస్తున్నాయి. ఆమె నిస్సహాయంగా రాములు వైపు చూసింది. రాములు ముఖం బాధతో నిండిపోయింది. రోజు కూలికి వెళ్తేనే డొక్కచక్రం తిరిగే వారి జీవితం వర్షం కారణంగా నిలిచిపోయింది. రెండు రోజులుగా వారికి పని లేదు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి ఆహారం నిన్నటితోనే అయిపోయింది. 


"ఏమండీ.. ఏం చేద్దాం? పిల్లలు ఆకలితో తట్టుకోలేకపోతున్నారు. అప్పు ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి? అన్నది లక్ష్మి


"ఎవరిస్తారు లక్ష్మి మనకు అప్పు? ఉన్న కొద్దిపాటి పలుగు, పార చూసి కూడా ముఖం తిప్పుకుంటున్నారు. రేపు పొద్దున్నైనా పని దొరికితే కానీ గడవదు. మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా మనలాంటి వాళ్లే కదా !" అన్నాడు రాములు నిస్తేజంగా. 


అంతే.. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరికీ నిద్ర పట్టలేదు. పిల్లల ఆకలి రోదనలు, తల్లిదండ్రుల నిస్సహాయత ఆ గుడిసె నిండా అలుముకున్నాయి. లక్ష్మి ఎలాగోలా కొంచెం నీళ్లు పిల్లలకు తాగించింది. అది వారి ఆకలిని ఎంత మాత్రం తీర్చలేదు. 

@@@


మరునాడు రాములు పని వెతుక్కుంటూ బయలుదేరాడు. అతని నడక పక్కనే ఉన్న సంపన్నుల వీధి గుండా సాగింది. అక్కడ పెద్ద పెద్ద బంగళాలు రంగురంగుల విద్యుద్దీపాలతో వెలిగిపోతున్నాయి. మధ్యలో పెద్ద కళ్యాణ మండపం ఉంది. బ్యాండ్ బాజాల మోతలు, పాటల సందడి ఆ ప్రాంతాన్ని హోరెత్తిస్తున్నాయి. 


రాములు 'ఎవరి పెళ్లి జరుగుతుందో ఏమో.. ఎంత ఆర్భాటంగా చేస్తున్నారో!' అనుకున్నాడు. 


లోన తింటున్న వారి ప్లేట్లు చూసాడు ఎన్నో పదార్థాలు ఉన్నాయి. పేదవాడికి ఒక్కరకమైనా కడుపునిండా తినడానికి లేదు. డబ్బున్న వాళ్ళు అన్ని రకాలు వేసుకుని సగం సగం తిని ప్లేట్లు పడేస్తున్నారు. వాటి వంక ఆశగా చూస్తూ ముందుకు నడిచాడు. 


సాయంత్రం పని దొరక్క నిరాశగా ఇంటికి తిరిగి వస్తుండగా, అదే కళ్యాణ మండపం ముందు జనం గుంపులు గుంపులుగా నిలబడి ఉండడం చూశాడు. వారి చేతుల్లో పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయి. ఆసక్తిగా దగ్గరికి వెళ్లి  "ఇక్కడ ఏమి జరుగుతోంది? ఇంత మంది ఎందుకు నిలబడి ఉన్నారు?" అని అడిగాడు ఆసక్తిగా. 


మధ్య వయస్కుడైన వ్యక్తి "ఇదిగో ఇక్కడ పెళ్లి జరిగింది. ఇప్పుడు ఫంక్షన్ అయిపోయింది కదా.. మిగిలిన ఆహారాన్ని పంచుతున్నారు. పేదవాళ్ల కోసం ఏర్పాటు చేశారు. మీరు కూడా కావాలంటే నిలబడవచ్చు. "

రాములు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఆకలితో అలమటిస్తున్న తన పిల్లలు గుర్తుకువచ్చారు. ఒక చిన్న ఆశ అతని గుండెల్లో చిగురించింది. 


కడుపు నిండా భోజనం దొరకుతుందనే ఆశతో రాములు తొందరగా ఇంటికి చేరుకున్నాడు. లక్ష్మి దిగులుగా కూర్చుని ఉంది. పిల్లలు నిస్సత్తువుగా ఆడుకుంటున్నారు. 


రాములు ఉత్సాహంగా "లక్ష్మి.. ఒక శుభవార్త! ఆ పెళ్లి మండపంలో మిగిలిన ఆహారాన్ని పంచుతున్నారట. మనం వెంటనే వెళ్దాం. పిల్లలైనా కడుపు నిండా తింటారు. "


లక్ష్మి ముఖంలో కాస్త వెలుగు కనిపించింది. పిల్లలు కూడా ఆ మాట వినగానే లేచి నిలబడ్డారు. 

లక్ష్మి "నిజమాండీ? అయితే పదండి త్వరగా వెళ్దాం. " అన్నది. 


నలుగురు కలిసి కళ్యాణ మండపం దగ్గరికి వెళ్లారు. అప్పటికే చాలా మంది పేదవాళ్లు క్యూలో నిలబడి ఉన్నారు. రాములు, లక్ష్మి తమ పిల్లలతో కలిసి ఒక మూలన నిలబడ్డారు. కాసేపటికి సిబ్బంది పెద్ద గిన్నెల్లో అన్నం, సాంబారు, కూరలు, స్వీట్లు తీసుకువచ్చి పంచుతున్నారు. 


వారి వంతు రాగానే రాములు, లక్ష్మి తమ డబ్బాలు చాచి నిలబడ్డారు. సిబ్బంది వారికి ఆహారం వడ్డించారు. ఆ రోజు వారి ఆనందానికి అవధులు లేవు. ఇంటికి రాగానే పిల్లలు ఆత్రంగా ఆ ఆహారాన్ని తినడం మొదలుపెట్టారు. 


"అబ్బా.. ఎంత బాగుంది ఈ అన్నం! నాన్న"అన్నది వాణి సంతోషంగా. "నాకు లడ్డూ కూడా వచ్చింది అమ్మా! చాలా బాగుంది" అన్నాడు రాజు లడ్డు తింటూ. 


లక్ష్మి కళ్లల్లో ఆనందభాష్పాలు. తన పిల్లలు కడుపు నిండా తింటుంటే ఆమెకు కడుపు నిండినంత సంతోషంగా ఉంది. రాములు కూడా తృప్తిగా భోజనం చేశాడు. ఆ రోజు ఆ మిగిలిన ఆహారం వారికి దేవుడిచ్చిన ప్రసాదంలా అనిపించింది. 


@@@

 

కొన్ని రోజుల తర్వాత మళ్లీ అదే కళ్యాణ మండపంలో మరో పెద్ద ఫంక్షన్ జరిగింది. ఈసారి కూడా రాములు, లక్ష్మి ఆశగా అక్కడికి వెళ్లారు. పిల్లలు కూడా "మళ్లీ మంచి అన్నం తిందాం" అని ఉత్సాహంగా వచ్చారు. కానీ ఈసారి వారికి నిరాశ ఎదురైంది. ఫంక్షన్ అయిపోయాక సిబ్బంది మిగిలిన ఆహారాన్ని పెద్ద పెద్ద కుప్పలుగా చేసి పారబోస్తున్నారు. 


"ఏమిటండీ ఇది? ఆహారాన్ని పారబోస్తున్నారా?" అన్నాడు రాములు ఆశ్చర్యంగా. 


పక్కనున్న వ్యక్తి "అవును బాబు ఈసారి నిర్వాహకులు ఎవరికీ ఇవ్వద్దని ఏదో కారణం చెప్పారు"


రాములు గుండెల్లో బాధ కలిగింది. నిన్నటి వరకు ఎంతో మందికి కడుపు నింపిన ఆహారం ఇప్పుడు ఇలా వృధాగా పోతుంటే చూడలేకపోయాడు. పిల్లల మొహాల్లో నిరాశను చూసి అతని మనసు మరింత కలత చెందింది. 


'ఇంత మంచి ఆహారం ఇలా వృధా అయిపోవడం ఎంత దారుణం! పేదవాళ్లెంత మంది ఆకలితో ఉన్నారో కదా.. ' అనుకున్నది లక్ష్మి. 



@@@


ఆ రాత్రి రాములుకు నిద్ర పట్టలేదు. ఒకవైపు తన పిల్లల ఆకలి, మరోవైపు కళ్లెదుటే ఆహారం వృధా అవ్వడం అతని మనసును తొలిచివేసింది. లక్ష్మితో తన బాధను పంచుకున్నాడు. 


"లక్ష్మి.. మనం ఒక పూట తిండి కోసం ఎంత కష్టపడుతున్నామో తెలుసు కదా! అక్కడ ఇంత మంచి ఆహారం వృధాగా పోతుంటే చూస్తూ ఊరుకోలేను. ఏదో ఒకటి చేయాలి. "


"మీరనేది నిజమేనండీ. ఆ రోజు పిల్లలు ఎంత సంతోషంగా తిన్నారో నాకు గుర్తుంది. మళ్లీ అలా జరిగితే ఎంతో మందికి ఉపయోగపడుతుంది. " అన్నది భర్తతో ఏకీభవిస్తూ. 


రాములు ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా ఈ ఆహార వృధాను ఆపాలని, ఆ ఆహారం ఆకలితో ఉన్న పేదవాళ్లకు అందేలా చేయాలని ఒక దృఢమైన సంకల్పానికి వచ్చాడు. 


మర్నాడు ఉదయం రాములు ధైర్యం తెచ్చుకుని ఆ కళ్యాణ మండపం యజమాని దగ్గరికి వెళ్లాడు. కాస్త భయంగానే తన పరిస్థితిని వివరించాడు. ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని పేదవాళ్లకు పంచే ఏర్పాటు చేయమని వినయంగా అడిగాడు. 


యజమాని "చూడండి బాబు.. మాకు చాలా పనులుంటాయి. ఇవన్నీ మాకు తలనొప్పి వ్యవహారాలు. ఆహారం పాడైపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు? వెళ్లిపోండి. " నిర్లక్ష్యంగా. 


కానీ రాములు వెనక్కి తగ్గలేదు. ప్రతిరోజు వెళ్లి ఆయనను అభ్యర్థిస్తూనే ఉన్నాడు. 


తనలాంటి ఎంతో మంది పేదవాళ్ల ఆకలి గురించి ఆయనకు వివరించే ప్రయత్నం చేశాడు. అతని నిజాయితీ, పట్టుదల యజమానిలో మార్పు తెచ్చాయి. 


యజమాని "సరే.. మీ మాట వింటాను. కానీ ఒక షరతు. మీరు ఒక నమ్మకమైన బృందాన్ని ఏర్పాటు చేసుకుని రండి. ఫంక్షన్ అయిపోయాక మిగిలిన మంచి ఆహారాన్ని వారికి అందజేస్తాను. కానీ ఆ ఆహారం పంచిపెట్టే బాధ్యత పూర్తిగా మీదే. ఎటువంటి సమస్య వచ్చినా మీరే చూసుకోవాలి. " అని రాములును అక్కడున్న మండపం అధికారికి పరిచయం చేశాడు. 


రాములకు సంతోషంతో మాటలు రాలేదు. 

రాములు కృతజ్ఞతగా "ధన్యవాదాలు అయ్యా! మీ దయను ఎప్పటికీ మర్చిపోను. తప్పకుండా నేను ఒక మంచి బృందాన్ని ఏర్పాటు చేస్తాను. 


@@@


రాములు వెంటనే తనలాంటి పేదవాళ్లతో కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. వారికి కళ్యాణ మండపం యజమానితో జరిగిన ఒప్పందం గురించి వివరించాడు. అందరూ సంతోషంగా సహకరించడానికి ఒప్పుకున్నారు. 


అప్పటినుండి ఆ కళ్యాణ మండపంలో ఏ ఫంక్షన్ జరిగినా, రాములు, అతని బృందం అక్కడికి వెళ్లి మిగిలిన ఆహారాన్ని సేకరించి, ఆ ప్రాంతంలోని పేదవాళ్లకు పంచేవారు. ఒకప్పుడు వృధాగా పోయే ఆహారం ఇప్పుడు ఎంతో మంది ఆకలి తీర్చే ఒక యజ్ఞంలా మారింది. 


"మీ వల్ల ఎంతో మంది ఆకలి తీరుతోంది చూడండి. మీది బంగారు మనసు. " అన్నది లక్ష్మి. 


రాములు "ఇది నా ఒక్కడి వల్ల కాదు లక్ష్మి. మనందరి సహాయంతోనే ఇది సాధ్యమైంది. ఆ దేవుడి దయ కూడా ఉంది" అన్నాడు వినయంగా. 


కాలం గడుస్తోంది. రాములు చేసిన మంచి పని ఆ ఊరంతా వ్యాపించింది. అతనిని అందరూ గౌరవంగా చూసేవారు. అతని పిల్లలు కూడా తండ్రిని చూసి గర్వపడేవారు. 


@@@


కాని కొద్ది రోజులు గడిచాక ఆ మండపం అధికారి మారిపోయాడు. ఆహారం ఇవ్వడం మానేశాడు. ఎందుకని అడిగినా జవాబు చెప్పలేదు. అది తెలుసుకోవాలని రాములు చాలా ప్రయత్నించాడు. ఒకరోజు విందు కార్యక్రమం అయిపోయాక ఆ మిగిలిన వాటిని ఒక రూంలోకి తీసుకెళ్లి ప్యాక్ చేయడం చూశాడు. 


 ఆ విషయం వాళ్లని అడిగేశాడు. 


"మా యజమాని ఇవన్నీ ప్యాక్ చేసి హోటల్ కి పంపిస్తున్నాడు అందుకని మీకు ఎవరికీ ఏమీ ఇవ్వద్దని చెప్పాడు" అన్నారు వాళ్లు తమ పనిలో నిమగ్నం అవుతూ. 


మండపము యజమాని డబ్బుకు ఆశపడి పేదల కడుపులు కొడుతున్నాడని అర్థమైంది రాములుకు. 

ఈ విషయాన్ని ఎలాగైనా అసలు యజమానికి తెలియజేయాలి అనుకున్నాడు. 

 

ఒక తెలిసిన వ్యక్తి ద్వారా ఈ జరుగుతున్న విషయాన్ని వీడియో తీయించి అసలు యజమానికి, పోలీసులకు అందజేశాడు. 


పోలీసులు రంగంలోకి దిగి సంపన్నులైన కుటుంబాల వద్ద ఎక్కువ డబ్బు తీసుకొని పదార్థాలను ఎక్కువ గా వండించి మిగిలిన వాటిని అమ్ముకుంటున్నాడని ఇటు ధనవంతులను అటు పేదవాళ్ళను కూడా మోసం చేస్తున్నాడని పోలీసులు అతనిని అరెస్టు చేశారు. 


రాములు ఒకపక్క కూలీ పని చేసుకుంటూనే ఇటువంటి పెద్ద పెద్ద కళ్యాణ మండపాల దగ్గరకు వెళ్లి మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకుని పేదలకు పంచి పెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. 


 

 @@@


వాణి బాగా చదువుకుని టీచర్ అయింది. రాజు చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. 

ఒకరోజు వాణి తన స్కూల్లో పిల్లలకు రాములు గురించి చెప్పింది. 


రాములు కథ ఆ ఊరిలో ఒక ఆదర్శంగా నిలిచింది. పేదరికం, వృధా అనే రెండు భిన్నమైన లోకాలను కలిపే ఒక వారధిలా అతని జీవితం ఇప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాడు. ఒక చిన్న ఆలోచన, ఒక మంచి సంకల్పం సమాజంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో రాములు నిరూపించాడు. పేదవారికి ఆశల వెన్నెలగా నిలిచాడు. 


                    శుభం 

కొల్లా పుష్ప గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం: కొల్లా పుష్ప








Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page