top of page
Original.png

సగటు మనిషి

#సగటుమనిషి, #SagatuManishi, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు


Sagatu Manishi - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 19/11/2025

సగటు మనిషి - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


మనిషికి ఒక ధ్యేయం, పట్టుదల ఉండి గట్టిగా కృషి చేస్తే భగవంతుడి సహకారం ఎప్పుడూ ఉంటుంది.


యం.కాం. డిగ్రీ చేత పట్టుకుని కట్టుబట్టలతో బ్రతుకు తెరువు కోసం సికింద్రాబాద్ చేరిన ఆనంద్‌కి సిటీ కొత్త. తెలిసిన వారెవరూ లేరు.


దేవుడిపై భారం వేసి, గట్టిగా ప్రయత్నిస్తే ఏదో ఒక దారి దొరకక పోదనే ఆత్మవిశ్వాసంతో హైదరాబాద్‌కు బయలుదేరేడు.


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంలో జేబులో మిగిలిన పది రూపాయలు పెట్టి బిస్కెట్ పేకెట్ కొని తింటూ కాలినడకన వస్తుండగా, కొద్దిదూరం తర్వాత క్లాక్‌టవర్ పబ్లిక్ పార్కులో చెట్లకింద పడుకుని కొందరు, చీట్ల పేకాట ఆడుతూ మరికొందరు తనలాగే బ్రతుకు తెరువు కోసం వచ్చిన వారిలా కనిపించారు అక్కడ.


ఎండ ముదిరినందున కొంచెం విశ్రాంతి కోసం పార్కులోకొచ్చి ఒక చల్లని ప్రదేశంలో చెట్టు కింద కూర్చున్నాడు ఆనంద్.


రోడ్డు మీద చెత్తాచెదారం ఏరుకుని అమ్మి దొరికింది తింటూ విశ్రాంతి మందిరంలా గడ్డి మీద పడుకుని సేదతీరుతున్నారు మరికొందరు.


పార్కు చివరి ఫుట్‌పాత్ నీడలో చిలక జోస్యం చెప్పే వ్యక్తి పాత న్యూస్‌పేపర్ పరుచుకుని కూర్చుంటే, ఒకరిద్దరు ఆశావాహులు అతని దగ్గర చేరి వారి భవిష్యత్ కలలు తెలుసుకుంటున్నారు.


ఆనంద్ బిస్కెట్ పేకెట్ తిని పార్కులో కొళాయి నీళ్లు తాగాడు. కాబట్టి కడుపు చల్లబడింది. తర్వాతి కార్యక్రమం ఏమిటా అని ఆలోచనలో పడ్డాడు. సిటీలో మంచి ఉద్యోగం సంపాదించి అమ్మను తీసుకువచ్చి మంచి డాక్టరుకి చూపించి ఆయాసానికి వైద్యం చేయించాలి. కళ్ల డాక్టర్ చేత పరీక్ష చేయించి కళ్లజోడు పెట్టించాలి — భవిష్యత్ గురించి ఆలోచనలో ఉన్నాడు.


కొద్ది సేపటి తర్వాత మరొక వలసపక్షి పాత న్యూస్‌పేపర్ కింద పరుచుకుని ఆనంద్‌కి కొద్దిదూరంలో కూర్చున్నాడు.


అక్కడి పరిసరాలు, పరిస్థితులను బట్టి పొట్ట చేత పట్టుకుని వచ్చిన తనలాంటి వారి అడ్డా క్లాక్‌టవర్ పార్క్ అని అర్థమైంది ఆనంద్‌కి. అక్కడ ఉన్న వారిలో అన్ని వయసుల వారు, చింపిరి జుట్టు, పెరిగిన గెడ్డాలు, మాసిన బట్టలతో దేవదాసుల్లా కనబడుతున్నారు.

“ఏ ఊరు సామీ!” పలకరించాడు దగ్గర కూర్చున్న వ్యక్తి.


ఆంధ్రా నుంచి వచ్చానని తన వివరం చెప్పాడు ఆనంద్.


“అలాగా! చదువుకున్న కుర్రోడివా? చదువుకున్నోడైనా, చాకలైనా ఈ సిటీలో ఒకటే. ఇప్పుడెక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి. పార్టీ జండాలు పట్టుకుని జై కొట్టడానికి మనుషులు అవసరమవుతారు. మనుషులను సప్లై చేసే బ్రోకరోడు ఇక్కడికి వస్తాడు. ఆడితో పోతే లారీ ఎక్కించి తీసుకుపోయి బిర్యానీ పేకెట్, క్వార్టర్ మందు, ఆడికమీసు ఇచ్చి వంద రూపాయిలిచ్చి ఇక్కడ వదిలిపోతాడు. ఇష్టం అయితే ఇప్పుడు చెప్పు — బ్రోకరోడు వచ్చి నాకే మాటాడుతా” అన్నాడు.

ప్రస్తుతం ఏదో ఒక ఆధారము దొరికితే తర్వాతి సంగతి ఆలోచించొచ్చని కున్నాడు ఆనంద్ మనసులో.

మధ్యాహ్నం మూడు గంటలైంది. ఒక లారీ పార్కు గేటు పక్కన ఆగింది. దుబ్బు మీసాలు, భారీ శరీరం, పహిల్వాన్‌లాంటి వ్యక్తి, మెడలో రుమాలు చుట్టి, తెల్లని కళ్లి షర్టు, చేతికి సిల్వర్ కడియంతో పార్కులో కొచ్చాడు. వలసపక్షులన్నీ అతన్ని చుట్టుముట్టాయి. బ్రోకర్‌తో పాటు వచ్చిన అనుచరులు సభకి కావాల్సిన వారిని ఒకపక్క నిలబెడుతున్నారు.


చెట్టు కింద కూర్చున్న ఆనంద్, పక్కనున్న వ్యక్తిని చూసి దగ్గరకు రమ్మని చేత్తో సంకేతం చేసాడు బ్రోకరు. వాళ్లిద్దరూ దగ్గరికి రావడం తో “బండి ఎక్కండి” అన్నాడు. ఉదయం తిన్న బిస్కెట్ పేకెట్ తప్ప మరేమీ లేనందున ఆకలితో నకనకలాడుతోంది. వీళ్లతో వెళ్లితే ఏదైనా తినిపిస్తారనుకున్నాడు.


ఆనంద్ పక్కన కూర్చున్న వ్యక్తి ఇంతకుముందు రాజకీయ మీటింగులకు వెళ్లి వచ్చిన వాడే కనక, ఆనంద్‌ని కూడా వారి వెంట తీసుకుపోయాడు.


రాజకీయ సభ అంబర్‌పేటలోనట. అక్కడ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఎలక్షన్‌లో తలపడుతున్నారు. పోటీ చాలా గట్టిగా ఉంది.


కూలీ జనం లారీ దిగగానే బిర్యానీ పేకెట్, మంచినీళ్ల పేకెట్ ఇచ్చి డబ్బులు, క్వార్టర్ బాటిల్ మందు మీటింగ్ అయిన తర్వాత ఇస్తారట.


ఆనంద్ వెంట ఉన్న వ్యక్తి ఈ బ్రోకర్‌తో చనువుగా ఉండడం వలన “అన్నా, ఈ పోరగాడు కాలేజీ చదివినోడని… ఏదైనా నౌకరీ చూడమనండి” అన్నాడు.


బ్రోకర్ ఆనంద్‌ని పై నుంచి కిందికి చూసి— “బిడ్డా, ఏం చదువుకున్నావు?” అని అడిగాడు. సమాధానమిచ్చాడు ఆనంద్.


“అరే! మా సార్‌కి ఎలక్షన్ పద్ధులు రాయడానికి చదువుకున్న పోరగాడు కావాలని చెప్పిండు. ఈ మీటింగ్ అయినాక సార్‌ని కలుద్దాం లే” అన్నాడు.


సభ మైదానంలో జనం కూర్చుని జైజై కొడుతున్నారు. మద్యలో కార్యకర్తలు చెప్పినప్పుడు చప్పట్లు కొడుతున్నారు. కిరాయి జనంతో మైదానం కిటకిటలాడుతోంది.

రాత్రి పది గంటలవరకూ ఎన్నికల ప్రచారం జరిగింది. కిరాయి జనాలు జండాలు అప్పగించి వంద రూపాయలు, క్వార్టర్ బాటిలు మందు అందుకుని లారీ ఎక్కేరు.

బ్రోకర్ మనుషులు లారీని ముందుకు నడపబోతే, బ్రోకర్ ఆనంద్‌ని ఆపి మిగతా జనాల్ని పంపించేసాడు.


మీటింగ్ పూర్తయ్యి కార్యకర్తలతో మాట్లాడుతుండగా బ్రోకర్ ఆనంద్‌ని వెంటబెట్టుకుని సిట్టింగ్ యం.ఎల్.ఏ. గారికి పరిచయం చేసాడు.


యం.ఎల్.ఏ. గారు ఆనంద్ క్వాలిఫికేషన్ అడిగి తెలుసుకుని, ఆనంద్ బ్యాగులోంచి తీసిన సర్టిఫికెట్లు పరిశీలించి మరునాడు తన పి.ఎ.ని కలవమని చెప్పారు.

రాత్రికి బ్రోకర్ ఆనంద్‌కు వసతి ఏర్పాటు చేసాడు.


మరునాడు ఉదయాన్నే ఫ్రెష్‌గా తయారై యం.ఎల్.ఏ. గారి పి.ఎ.ని కలియగా, ఆయన క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని ప్రశ్నల ద్వారా తన అనుమానాలు తీర్చుకున్నారు.

ఆనంద్ కామర్స్ పీజీతో పాటు కంప్యూటర్, అకౌంట్స్, కొన్ని స్పెషల్ కోర్సులు చేసినందున పి.ఎ. గారిని సంతృప్తిపరచడంలో సఫలీకృతుడయ్యాడు. అందువల్ల ఎన్నికల జమాఖర్చులు చూసే ఎకౌంటెంట్‌గా కుదిరాడు. ఉండటానికి వసతి, భోజనం ఏర్పాటు అయింది.


ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆనంద్ శక్తి సామర్థ్యాలతో పనులు, జమా–లెక్కలు చక్కబెడుతున్నాడు. పని వత్తిడితో బిజీ అయ్యాడు. పోలింగ్ తేదీ దగ్గరవడంతో రాత్రింబవళ్లు కష్టపడి పని చేసి పోలింగ్ సక్రమంగా జరిపించాడు.


ఎన్నికల ఫలితాలు తెలిసాయి. సిట్టింగ్ ఎం.ఎల్.ఏ. గారు రెండోసారి భారీ మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా మంత్రి పదవి కూడా వరించింది.

ఆనంద్ కృషి చూసి మంత్రిగారు ఆనంద్‌ని దగ్గరే ఉంచుకున్నారు. మంచి జీతం, వసతి సౌకర్యాలు కల్పించారు.


కొద్దికాలంలో ఆనంద్ దశ తిరిగింది. పెద్దవయసున్న మంత్రి గారి పి.ఎ. అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడంతో, ఆ పదవి ఆనంద్‌ను వరించింది. ఆయన ఆంతరంగిక కార్యదర్శిగా అయ్యాడు.


అనామకుడిగా ఎటూ దారి తెలియకుండా హైదరాబాద్ వచ్చిన ఆనంద్, అదృష్టదేవత కనికరంతో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు.


ఇప్పుడు ఆనంద్ రూపురేఖలు మారిపోయాయి. మంత్రి గారి వెంట తిరుగుతూ  కార్యక్రమాలు చూసుకుంటూ, అధికారులకు అపాయింట్‌మెంట్లు ఇస్తూ అందరిలో గౌరవప్రదమైన వ్యక్తిగా మారాడు.


తనను ఉన్నత స్థాయికి తెచ్చిన క్లాక్‌టవర్ పార్కులో కలిసిన అజ్ఞాతవ్యక్తి కోసం ఎంతో ప్రయత్నించినా అతని జాడ దొరకలేదు. బ్రోకర్ ద్వారా వెతికించినా ఫలితం లేదు. క్లాక్‌టవర్ వలసపక్షులకు ఆవాసం, తిండి వసతి కల్పించాడు.


పల్లెలో ఉన్న తల్లిని నగరానికి తీసుకువచ్చి తగిన వైద్య చికిత్సలు చేయించాడు.

బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని వలసపక్షిలా వచ్చిన తనకు నగరం ఉన్నత స్థాయి కల్పించి తన ఆశయాల అలలను తీరం చేర్చిన భగవంతుడికి మనసారా కృతజ్ఞతలు తెలిపాడు ఆనంద్.


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page