ప్రేమ తెగువ

'Prema Theguva' written by Chaturvedula Chenchu Subbaiah Sarma
రచన : చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ
రాము పదోక్లాసు వరకు చదివాడు. పేదకుటుంబం... తల్లీ తండ్రి కూలీ నాలీ చేసి రామును పదోక్లాసువరకు చదివించారు. తరువాత వారికి సాధ్యం కాలేదు.
కుటుంబ పరిస్థితులను అర్ధం చేసుకొన్న రాము... ఓ లారీ షెడ్‌లో చేరాడు. నెలకు మూడువందలు జీతం...
యజమాని జీతం ఇవ్వగానే తీసుకెళ్లి తల్లి చేతికి ఇచ్చేవాడు.
తల్లి శ్యామల... కావలసిన బియ్యం, పప్పు... ఉప్పు.. నూనె.. మొదలైన సామాగ్రిని తెచ్చుకొని
జాగ్రత్తగా నెల అంతా జరిపేది.
తాపీ పనిచేసే... శ్రీహరి సాయంత్రం పని ముగించుకొని వచ్చేటపుడే... రెండు గ్లాసులు మందు
వేసుకొని ఇంటికి వచ్చి... భార్య శ్యామల పెట్టింది తిని పడుకొంటాడు.
శ్రీహరి... తొలుత తాగివచ్చిన రోజున శ్యామల చాలా రగడ చేసింది... ఏడ్చింది... అసహ్యించుకొంది...
కానీ... కాలగతిలో శ్రీ హరిలో మార్పు లేదు... అనవసరంగా అతన్ని ఎదిరించి... తిట్లు తన్నులు
తినడం ఇష్టం లేక మౌనంగా వుండి పోవడాన్ని అలవరచుకొంది శ్యామల...
రాముకు... పదహారేళ్ల ప్రాయం... బస్సు యాక్సిడెంట్‌లో శ్రీహరి... శ్యామల గతించారు.
రాముకు తోడు... వున్నది నాయనమ్మ శేషమ్మ... రెండు సంవత్సరాల్లో రాము డ్రయివింగ్
నేర్చుకొన్నాడు. ఆ యజమాని రాఘవయ్య. రాఘవా ట్రాన్స్‌పోర్టు ... పేర లారీ సర్వీసును ప్రారంభించాడు. మన తెలుగు రాష్టం... ప్రక్కనున్న తమిళనాడు, కర్నాటక, కేరళల నుండి సామాగ్రిని బాంబే, కలకత్తాలకు తరలించే వ్యాపారం... రాఘవయ్యది.
మంచి వ్యక్తిత్వం... పెద్దా చిన్నా... గురువు... దైవం పట్ల అభిమానం... గౌరవం ... భక్తి కలవాడు.
వ్యాపారం ప్రారంభించిన సంవత్సరం లోపలే... అతని మాటతీరు... వ్యక్తిత్వాన్ని బట్టి మంచి
పరపతితో... రాఘవా ట్రాన్సుపోర్టుకు మంచి గుర్తింపు వచ్చింది. ఆరు లారీలతో వ్యాపారం సాగిస్తున్నాడురాఘవయ్య. వారికి ఒక కూతురు... శైలజ... పదహారేళ్ల వయస్సు... ఇంటర్మీడియట్‌లోకి వచ్చింది.
రాఘవయ్య భార్య కమల... ఆమె తమ్ముడు కోటేశ్వరరావు...
తల్లితండ్రులు లేనికారణంగా... కోటేశ్వరరావు బావగారి ఇంట్లోనే వుంటూ ... అక్క బావ చెప్పిన
పని మాత్రం చేస్తూ... కాలం గడుపుతున్నాడు. పాతికేళ్ల వయస్సు... పదో కాసు ఫెయిల్ అయినాడు. అక్క కమల రెండు మూడుసార్లు ఫీజులు కట్టించి... ప్రైవేటు ఏర్పాటు చేసి... తమ్ముడు పదోక్లాసు పాసైనాడని చెప్పుకోవాలనే తాపత్రయంతో ఎంతో ప్రయత్నించింది.
కానీ... కమల ఆశ... అడియాసగానే మారింది.... కారణం కోటేశ్వరరావుకు... క్రికెట్... సినిమాలు...
వీడియోలు... ఆడియోలు... సెల్ఫీలు... మీద ఉన్న ధ్యాస... ఆసక్తి చదువు మీద లేదు... మూడవ సారి చేసిన ప్రయత్నం కూడ విఫలం కావడంతో కమల అతనిని చదివించే ప్రయత్నాన్ని నిలిపివేసింది.
అడ్డదిడ్డాలుగా తిరుగుతూ... తన వర్గ స్నేహితులతో చీట్లాట.. తాగుడుకు ప్రాముఖ్యత ఇస్తూ
జాలీగా కాలం గడుపుతున్నాడు కోటేశ్వరరావు... వాడు ఆ రీతిగా సంచరించేదానికి కారణం అక్క కమల సహకారం...
కోటేశ్వరరావు ... మనసున తన అక్క శైలజకు తనకూ వివాహం చేస్తుందని... అలా జరిగితే
రాఘవయ్య సామ్రాజ్యానికి తానే సర్వాధికారి కాగలననే ఆశ... దురాశ.
శైలజ... అపుడపుడూ తండ్రితో కలసి లారీ 'షెడ్డుకు వెళ్లి లెక్కలు చూచేది. శైలజ తెలివిగల
అమ్మాయి. అ షెడ్‌లో పదిమంది పనివారు... తమ ఆరు లారీల రిపేర్లే కాకుండా... వేరే వాళ్ల లారీలను...
కార్లను, రిపేరు చేయించేవాడు రాఘవయ్య. మెకానిక్‌గా వారికి ఆ ప్రాంతంలో చాలా మంచి పేరు. శైలజతండ్రికి తగిన కూతురు...
ఆరు లారీలకు... పన్నెండు మంది డ్రైవర్లు... పన్నెండు మంది క్లీనర్లు... పనిచేస్తున్నారు.
శైలజకు అందరూ పరిచయస్తులే. అందరినీ ఆమె ఎంతో ప్రేమగా పలకరించేది. వారూ ఆమె
విషయంలో ఎంతో మర్యాదగా... గౌరవంగా వుంటారు.
అందరు డ్రైవర్లలో చిన్నవాడు రాము...
శైలజ కు రాము మాటతీరు... అతను తనకు, తన తండ్రికి ఇచ్చే గౌరవ మర్యాదల దృష్ట్యా... అతని పట్ల ఎంతో గౌరవం... అభిమానం... రాఘవయ్యగారి దృష్టిలో వారంతా తన సహకుటుంబీకులనే భావన. అందరినీ ఎంతో అభిమానంతో చూచుకోవడమే వారికి ఆనందం.
రాము... లారీకి చెన్నైలో వాటర్‌పంపులను లోడ్ చేసికొని కలకత్తా బయలుదేరాడు. అతని
శిష్యుడు పాండు పదహారేళ్లవాడు... శ్రమజీవి... పాండు అంటే రాముకి ఎంతో ప్రీతి... అభిమానం...
వారి లారీ ఏలూరు దాటి హైవేలో వెళుతూవుంది. సమయం రాత్రి పదిగంటలు. తాను ఆ
రూట్‌లో వచ్చినపుడల్లా ఆగే నూకాలమ్మ దాబా ముందు భోంచేసేదానికి లారీని ఆపాడు రాము...
నూకాలమ్మకు ఒక తమ్ముడు వెంకన్న... మూగవాడు... వయస్సు నలభై సంవత్సరాలు... ఒక కూతురు...చిలకమ్మ... పదునెనిమిదేళ్ల ప్రాయం... నూకాలమ్మ దాబా దగ్గర చాలామంది చిలకమ్మ కారణంగానే లారీలను ఆపుతారు.
చిలకమ్మ... చాలా అందగత్తె... రంగు చామనఛాయ... విశాలమైన కళ్లు... నోరు.. పెదవులు అన్నీ
... చెక్కినట్టు చూపరులకు ఎంతో ఆకర్షణను కలిగించే అంశాలు...
వెంకన్న... చిలకమ్మ... సప్లైర్లు... వంటంతా నూకాలమ్మ... వెంకన్న.. భార్య అనసూయ చేస్తారు.
వెజ్... నాన్‌వెజ్ రెండూ తయారు చేస్తుంది నూకాలమ్మ... ఆమె చేతి వంటకంలో ప్రత్యేక రుచి...
లారీ డ్రైవర్లు రాత్రి సమయంలో అక్కడ భోంచేసి ముందుకు సాగుతారు.
రాము పాండు లారీ దిగారు. నూకాలమ్మ రేకుల షెడ్‌లో... కుడిపక్క వున్న సిమెంటు తొట్టిలోని
నీళ్లతో ముఖం కాళ్ళూ చేతులూ కడుక్కొని బెంచీ ముందున్న కుర్చీల్లో ఎదురెదురుగా ఇరువురూ కూర్చున్నారు.
చిరునవ్వుతో వారి ముందు రెండు గ్లాసుల మంచినీళ్లు వుంచింది చిలకమ్మ,
“ఏం సార్... బాగున్నారా |...”
నవ్వుతూ అడిగింది చిలకమ్మ...
“ఆ... నీవెలా వున్నావ్ ?...” అడిగాడు రాము.
“నీలాటి మారాజుల దయతో మేమంతా బాగుండాం... సార్.”
“చూడు చిలకా !... నేను మారాజును కాను... లారీ డైవర్‌ను...” నవ్వుతూ చెప్పాడు రాము.
“బాబుగారూ !... మీలాంటి వాళ్లు వచ్చి మా హోటల్లో తిని పోతావుంటారు కాబట్టి మేమూ
నాలుగు మెతుకులు తింటూవుండాం... మీరు రాకపోతే... మా పొయ్యి ఎలగదు కదయ్యా ...”
అనునయంగా నవ్వుతూచెప్పింది చిలకమ్మ,
“అన్నా |... చిలకమ్మక్క ... భలే తమాసాగా మాట్ట్లాడతాదన్నా !...” నవ్వాడు పాండు...
“ఆ... ఆ... సరే... ఏమిస్తావు తినేదానికి ?...” అడిగాడు రాము..
“చపాతీ కూర్మా... కోడికూర ఇవ్వనా !...” అడిగింది చిలకమ్మ.
“ఏరా పాండూ .”
“సరే అన్నా...”
“ఏయ్ చిలకా !... నాలుగు చపాతీలు... రెండు ప్లేట్లు... కోడికూర ఒక ప్లేటు.. కూర్మా |... తొరగా
తీసుకురా .”
“అట్టాగే ... పది నిముసాలు !..”
వెళ్లిపోయింది చిలకమ్మ,
“చిలకమ్మను చూచి మూడు వారాలపైన అయింది. ఆమె ముఖంలో ఏదో కళ.. ఆకర్షణ...
చామనచాయ అయినా అందగత్తే ... అనుకొన్నాడు రాము.
వెంకన్న రెండు ప్లేట్లలో మూడు మూడు చపాతీలు తెచ్చి వారి ముందు వుంచాడు.
చిలకమ్మ రెండు ప్లేట్లలో కోడికూర... కూర్మా తెచ్చి టేబుల్‌పైన పెట్టింది.
“తినండి సార్ ... ఏమన్నా కావాలంటే అడగండి !...” నవ్వుతూ చెప్పింది చిలకమ్మ.
రాము... పాండు... తెచ్చినవి తిన్నారు... అత్మారాముడు శాంతించాడు...
“బిల్లు ఎంత ?...” అడిగాడు రాము...
“ముప్పైఎనిమిది ...”
నలఖై రూపాయలు ఇచ్చాడు రాము.
“ఎల్లొస్తాం!...”లారీ వైపుకు నడిచారు.
చిలకమ్మ రెండు రూపాయలతో లారీని సమీపించింది. అప్పటికే రాము పాండూ లారీ ఎక్కేసారు.
“ఇవిగో... మీ రెండు రూపాయలు...”
ఆమె గొంతు విన్న రాము “వుంచుకో చిలకా !..” అన్నాడు.లారీని కదిలించాడు.
లైట్లతో దేదీష్యమానంగా ముందుకు సాగిపోయినలారీని కొన్ని క్షణాలు... రామూను తలచుకొంటూ
చూస్తూ వుండిపోయింది చిలకమ్మ, తల్లి నూకాలమ్మ పిలుపు విని రేకుల షెడ్‌లోకి వెళ్లిపోయింది.
“రాము చాలా మంచోడు... చిలకా !... చిలకా !... అని ప్రేమగా పిలుస్తడు.... ఎపుడూ నవ్వుతూ
మాట్టాడతడు... అట్టాంటోడు పెనిమిటైతే ఎంత బాగుంటది?... జీవితం అనందమయం అయిపోతుంది...ఆయన పెళ్లాం కాబోయే అదృష్టం ఎవరికి వుందో !...” అనుకొంది చిలకమ్మ,
రాము... బండిని అరవై డెబ్బై కిలోమీటర్ల (గంటకు) వేగంతో నడుపుతున్నాడు. అతని మస్తిష్కంలో చిలకమ్మను గురించిన తలపులు...
“మంచి పిల్ల... అందం... అణకువ... పెద్దా చిన్నా గౌరవం... మర్యాదా... బాగా తెలుసు... నాబోటోడికి
తగింది... ఈ సారొచ్చినపుడు నూకాలమ్మను అడగాల.. కూతురు పెల్లి ఎపుడని... అపుడు అన్ని విషయాలు
బయట పడతాయ్ !...” అనుకొన్నాడు రాము.
తర్వాత కాలంలో దాదాపు పదినెలలు... రాముకు బాంబే...కలకత్తా వైపుకు ట్రిప్పు పడలేదు.
బెంగుళూరు మైసూరు కొచ్చిన్ తిరువనంతపురం హైదరాబాద్ ప్రాంతాల్లో లారీని నడిపాడు.
కానీ మనసులో అపుడపుడూ చిలకమ్మ వయస్సు వాళ్లు ఎవరైనా కనిపిస్తే.. చిలకమ్మను
గుర్తుచేసుకొనేవాడు... చూడాలనుకొనేవాడు ... కానీ కుదరలేదు.
రాము... పాండూ ఆరోజు మధ్యాహ్నం... కొచ్చిన్‌లో లోడ్ దించేసి గుంటూరుకు వచ్చారు.
రాఘవయ్య పినమామగారి కూతురు వివాహం... భార్యాభర్తలు వెళ్లాలని నిర్ణయించుకొన్నారు .
వరికోతల సమయం. ఆ వ్యవహారాన్ని చూచుకొనేటందుకు బావమరిది కోటేశ్వరరావుకు అన్నీ
వివరంగా చెప్పి... పదిఎకరాల వరి కోతను సవ్యంగా ముగించమని, పదివేలు డబ్బును ఇచ్చి రాఘవయ్య
కమలలు చెన్నైకి బయలుదేరారు. పరీక్షలు దగ్గరలో ఉన్న కారణంగా శైలజ ఆ వివాహానికి వెళ్లలేదు.
వారు బయలుదేరిన కారు వర్క్‌షాపు దగ్గర ఆగింది. రాఘవయ్య దిగాడు. అపుడే బెంగుళూరు
నుంచి వచ్చిన రాము నమస్కరించాడు.
రాఘవయ్య రామూని దగ్గరకు రమ్మని పిలిచాడు. వరిపైరు కోతకు సంబంధించిన బాధ్యత
బావమరిదికి అప్పగించినా... అతను ఆ కార్యభారాన్ని సవ్యంగా నిర్వహించలేడనేది వారి భావన. అందుకే
అ విషయం రామూకు చెప్పి... వరికోతలు సవ్యంగా జరిగేలా చూడమని చెప్పాడు. పదివేలు డబ్బు
కోటేశ్వరరావుకు ఇచ్చినట్టు , దాన్ని తీసుకొని కూలీలకు ఇవ్వవలసిందిగానూ... చాలకపోతే తన కూతురు
శైలజను అడిగి కావాల్సిన డబ్బును తీసుకొని పనిని పూర్తిచేయవలసిందిగా చెప్పాడు రాఘవయ్య.
యజమాని మాటలకు రాము 'సరే సార్... అంటూ వినయంగా జవాబు చెప్పాడు.
బాధ్యత... తనకు ఎంతో నమ్మకమైన రాముకు అప్పగించారు. ఎలాంటి సందేహం లేకుండా
రాఘవయ్యగారు చెన్నై బయలుదేరారు.
మరుదినం ఏడుగంటలకల్లా రాము... పాండు పొలానికి వెళ్లారు. కూలీల మేస్త్రీ యాభైమంది ఆడ
మగ జనాలను చేలో దించి వరికోత ప్రారంభించాడు. అందరూ మాస్కులు తగిలించుకొన్నారు. వంత
పాటలు పాడుకొంటూ ఆడామగా ఒంటిగంట వరకు వరి కోతకోశారు.
ఒకటి నుండి రెండు వరకు భోజనం సమయం. వారు తెచ్చుకొన్న ఆహారాన్ని వాళ్లు తిన్నారు.
కొందరికి మేస్త్రీ వెళ్లి పొట్టాలు కట్టించుకొని వచ్చి వారికి ఇచ్చాడు. వారితోపాటు తనూ తిన్నాడు.
అ సమయంలో... రాము... పాండు టవున్‌కు వెళ్లి భోంచేసి రెండింటికల్లా తిరిగి వచ్చారు.
కూలీలు వారి పనిని ప్రారంభించారు. కోటేశ్వరరావు పదివేలు జేబులో పెట్టుకొని ఆనందంగా మూడుముక్కల
ఆటలో దిగాడు. మూడు గంటల లోపలే పదివేలు ఓడిపోయాడు.
“అనుకొన్నది ఒకటి... అయినది ఒక్కటి... బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్టా..." అన్న పాట
సామెతగా కోటేశ్వరరావు డబ్బును కోల్పోయి... బిక్కమొఖంతో ఇంటికి చేరాడు.
రామును... మేస్త్రీ కొంత అడ్వాన్స్ అడిగాడు... అతను కోటేశ్వరరావు వస్తాడని ఎదురు చూస్తున్నాడు.
అతని దగ్గర పదివేలు ఇచ్చినట్టు రాఘవయ్యగారు చెప్పిన మాటలు అతనికి గుర్తుకు వచ్చాయి.
ఐదు గంటలైనా... కోటేశ్వరరావు పొలానికి రాలేదు... రాము తన వద్ద ట్రిప్‌కు వెళ్లేటపుడు ఖర్చులకు
గాను తీసుకొన్న డబ్బులో రెండువేలు మిగిలాయి. ఆ రెండు వేలను ఆ మేస్రీకి యిచ్చి... రేపు జాస్తిగా
ఇస్తాను..' వినయంగా చెప్పాడు రాము. ఐదున్నరకు కోత కూలీలందరూ వెళ్ళిపోయారు.
రామూ పాండు తన స్కూటీమీద యజమాని ఇంటికి వచ్చారు.
ఆ ఇంటికి వరండా ముందునుండి మీడమీదికి మెట్లున్నాయి. ఆ మెట్ల ద్వారా కోటేశ్వరరావు మేడపైని తన గదికి వెళ్లి మందు పుచ్చుకొని శయనించాడు.
రాము... పాండు వరండాలో ప్రవేశించారు. సమయం సాయంత్రం ఏడుగంటలు.
పాండు కాలింగ్ బెల్ నొక్కాడు.
పనిమనిషి రంగమ్మ తలుపు తీసింది.
“నాపేరు రాము. నేను కంపెనీ డైవర్ని... చిన్నమ్మగారున్నారా ?....” అడిగాడు రాము.
“ఆ... రామూ... నీవేనా... అయ్యగారు నీపేరు అమ్మగారితో చెబుతుండగా చాలాసార్లు విన్నాను.
చిన్నమ్మగారు ఇపుడే కాలేజీ నుంచి వచ్చారు...”
“కాస్త పిలుస్తారా !... ఒక ముఖ్యమైన విషయం మాట్టాడాలి !...” అనునయంగా చెప్పాడు రాము.
“అలాగే...” రంగమ్మ లోనికి వెళ్ళిపోయింది.
పది నిముషాలతర్వాత శైలజ వరండాలోకి వచ్చింది.... రామూను చూచింది.
“మీ పేరు రామూ కదూ !...” చిరునవ్వుతో పలకరించింది.
“అవునండీ...”
“రండి... లోనికి రండి...” తాను వెనుతిరిగి హాల్లోకి నడిచింది...
రాము... పాండు బిక్క మొహంతో ఆమెను అనుసరించారు.
శైలజ సోఫా ముందు నిలబడి...
“రండి... కూర్చోండి...” సోఫాను చూపించింది.
రాము పాండు ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యంతో చూసుకొన్నారు.
“మీరు మా మనుషులు... ఎంతో ముఖ్యమైనవారు... ఇది మీ ఇల్లే అనుకోండి... భయపడకండి..
కూర్చోండి... ” చిరునవ్వుతో చెప్పింది శైలజ.
రామూ భయం భయంగానే సోఫాలో కూర్చున్నాడు. అతని ప్రక్కన పాండు...
శైలజ వారి ఎదుట సోఫాలో కూర్చుంది.
రంగమ్మ రెండు గ్లాసుల్లో మంచినీళ్లు.. రెండు టీ కప్పులతో వచ్చి... టీపాయ్‌ని వారి ముందుకు
జరిపి... వాటిని టీపాయ్‌పై పెట్టి వెళ్లిపోయింది.
“తీసుకోండి...” చిరునవ్వుతో చెప్పింది శైలజ.
ఇరువురూ మంచినీరు తాగి.. టీ త్రాగి కప్పులను టీపాయ్‌పై వుంచారు.
“అ... ఇపుడు చెప్పండి... విషయం ఏమిటి ?...”
“నాన్నగారు ఈరోజు మన చేనులో వరికోత అని నన్ను అక్కడకు వెళ్లి చూడమని చెప్పారు. నేను వీడు అక్కడినుంచే వస్తున్నాము. యాభైమంది పనిచేశారు. అయిదు ఎకరాల పంటను కోశారు. అందరూ
మంచి వాళ్లు... బాగా పనిచేశారు.
నాన్నగారు చెప్పారు... మీ బావగారి చేతికి పదివేలు ఇచ్చినట్టు... వారు అక్కడకు వస్తారని... కానీ
రాలేదు. మేస్త్రీ సాయంత్రం డబ్బులు అడిగాడు. నాదగ్గర రెండు వేలు వుంటే వారికి ఇచ్చి.. మిగిలినది
రేపిస్తానని సర్దిచెప్పి పంపాను. ఈ విషయం మీకు చెప్పాలని వచ్చాను....” ఎంతో సౌమ్యంగా చెప్పాడు రాము.
తన బావ కోటేశ్వరరావు నడవడికను తన తల్లి మూలంగా ఎరిగిన శైలజ... తల్లీ తండ్రి ఊళ్లో లేని
సమయంలో అతనితో ప్రసంగం అనుచితమని భావించి... తండ్రి తనవద్ద ఇచ్చి వెళ్లిన ఇరవైవేల నుండి
రామూకు పదివేలు ఇచ్చి పంపాలని నిర్ణయించుకొని... తన గదివైపుకు వెళ్లి డబ్బు తీసుకొని వచ్చింది.
“రామూ !... ఈ పదివేలు మీదగ్గర వుంచండి. నేను రేపు పొలానికి వస్తాను... ఇక మీరు వెళ్లండి...”
అనునయంగా చెప్పింది శైలజ. రామూ... పాండు లేచి నిలబడ్డారు , రామూ గౌరవంగా చేతులు జోడించాడు. పాండు కూడ అదే పని చేశాడు.
“మీరు నాకంటే పెద్దవారు... నాకు నమస్కరిస్తే. అది నాకు మంచిది కాదు...” చిరునవ్వుతో చెప్పింది శైలజ.
ముగ్గురూ భవంతి వరండాలోకి వచ్చారు.
“వెళ్లొస్తామండీ... ” అని చెప్పి రామూ పాండు వెళ్లిపోయారు.
యదార్దానికి... శైలజ రామూతో మాట్లాడుతుండగా... ఇంటి లోపల వున్న మెట్ల ద్వారా కొంతవరకు
కిందకు వచ్చి కోటేశ్వరరావు వారి సంభాషణ విన్నాడు. పేకాటలో తాను పదివేలు పొగొట్టుకున్న విషయం
శైలజకు తెలియదు. కానీ రామూ మూలంగా... తన తండ్రి వెళ్లేటపుడు కోటేశ్వరరావుకు పదివేలు ఇచ్చిన
విషయం... శైలజకు తెలిసింది. రామూ వాళ్లు వెళ్లిపోగానే శైలజ తన గదికి... కోటేశ్వరరావు తన రూమ్‌లోకి
వెళ్లిపోయారు.
లోనికి వస్తూ... అతను మెట్ల పైన పైకి వెళ్లడం శైలజ గమనించి మౌనంగా తన గదికి వెళ్లిపోయింది...
ఆమె మనస్సున రామూను గురించిన ఆలోచనలు... తన తండ్రి రాత్రి భోజనాల సమయంలో తన దగ్గర
పనిచేసే ప్రతి ఒక్కరి మంచి చెడ్డలు గురించి తన భార్య, కూతురుతో చెప్పేవాడు. అందరికంటే ఎక్కువగా
రామూ మంచితనాన్ని గురించి చెప్పేవాడు.
రామూ ట్రిప్ ముగించుకొని రాగానే ఆరోజో... మరుసటి రోజో రామూను తనతో ఇంటికి తీసుకొని
వచ్చి ఇరువురూ భార్య కమల వడ్డించగా కలసి భోజనం చేస్తూ పనివారిని గురించి మాట్టాడుకొనేవారు.
ఒక్కో రోజు వారితో శైలజ కూడ కలసి భోంచేసేది... నమ్మకానికి మారుపేరైన రాము అంటె... ఆ కారణంగా
శెాలజకు ఎంతో గౌరవం... అభిమానం...
రూమ్‌లోకి వెళ్లి తలుపు బిగించుకొన్న కోటేశ్వరరావు... పదివేలు జూదంలో పోగొట్టుకున్న కారణంగా...
ఎలాగైనా ఆ పదివేలను సంపాదించి శైలజకు ఇచ్చి తాను మంచివాడిననిపించుకోవాలనే ఆరాటం...
తనకున్న మిత్రులు తన దగ్గర వుంటే తింటూ జేజేలు పలికేవారేగాని... పదిపైసలిచ్చే బాపతుకాదు...
ప్రయత్నించాడు కోటేశ్వరరావు... కానీ ఫలితం శూన్యం... “నేను ఈ అపాయం నుండి బయటపడాలంటే
శెలజను కొంచెం కాకా పట్టాలి... కవ్వించాలి... నవ్వించాలి... ఆమెకు నాపై అభిమానం పెరిగేలా నటించాలి...
సమయం చూచి ఆమె దగ్గర నుండి పదిహేనువేలు కొట్టెయ్యాలి... అంటే దొంగిలించాలి. ఆ నేరాన్ని
చేసింది రంగమ్మ... లేకపోతే తోటపనివాడు గోవిందయ్య గానో చేసి ... నేను తప్పించుకోవాలి..." అనే
నీచమైన నిర్ణయానికి వచ్చాడు కోటేశ్వరరావు.
మరుదినం... రాము పాండు పొలానికి పనివాళ్లకంటే ముందు చేరారు. మేస్త్రీ, పనివారు ఎనిమిది గంటలకు వచ్చి వరి కోత ప్రారంభించారు.
పదిగంటల ప్రాంతంలో ఇరువురూ సిటీకి వచ్చి టీ బిస్కెట్లు తీసుకొని పదకొండు గంటల ప్రాంతంలో
వారందరికీ ఇచ్చారు... రామూ ... పాండూలు.
అదే సమయనానికి శైలజ తన టివిఎస్ జూపిటర్ స్కూటీ పైన పొలాన్ని సమీపించి... స్కూటీకి
స్టాండువేసి నడుచుకుంటూ రామూ పాండూలను సమీపించింది. ఆమెను చూడగానే రాము పాండు
విష్ చేశారు. లేబర్ మేస్త్రీ వీరి దగ్గరకు వచ్చి నమస్కరించాడు.
రాము... కోటేశ్వరరావు వస్తాడనుకొన్నాడు. కానీ అతను అంతులేడు.
“మా బావ వచ్చాడా రామూగారూ !..” అడిగింది శైలజ
“రాలేదండీ...”
వ్యంగ్యంగా నవ్వింది శైలజ.
“పని ఎలా జరుగుతూ వుంది ?...”
“అందరూ బాగా పనిచేస్తూ వున్నారండీ !...”
“ఓకే. డబ్బులు ఓ ఐదువేలు ఇవ్వనా...”
“వద్దండీ... రాత్రి ఇచ్చారుగా... వున్నాయి...”
“ఇంకా ఏమైనా చెప్పాలా !..”
“లేదండీ...”
“సరే... నేను వెళుతున్నాను.. మీరు జాగ్రత్త... మూతికి మాస్కు సరిగా పెట్టుకోండి...” తన
మాస్కును సరిచేసుకొంటూ చెప్పి శైలజ వెళ్లి తన స్కూటీ ఎక్కి వెళ్లిపోయింది.
యధావిధిగా మధ్యాహ్నం భోజనం... సాయంత్రం ఐదుగంటలకు పని ఆపి అందరూ పనివారు
వెళ్లిపోయారు.
రాము... పాండు తమ ఇంటికి చేరారు...
సమయం... రాత్రి ఎనిమిది గంటలు.. రాము సెల్ మ్రోగింది...
ఆత్రంగా చెవిదరికి చేర్చాడు రాము...
“ఎవరూ!...”
“కనుక్కోవాలి ...” అందమైన నవ్వు.
రామూకు ఆ కంఠం గుర్తుకు వచ్చింది... చిలకమ్మ...
“ఆ... చిలకా !...” నవ్వాడు రాము.
“అయ్యగారు ఎలావుండారు... చూడాలని వుంది... వస్తరా !...” వినసొంపుగా పలికింది చిలకమ్మ.
అన్నంతింటూ చిలకమ్మను గురించే ఆలోచన... తన జ్ఞాపకాలకు తగినట్టుగా చిలకమ్మ పలకరింపు...
రమ్మని ఆహ్వానం... ఆనందంతో నవ్వుకొన్నాడు రాము.
“వస్తున్నా చిలకా !...” చిరునవ్వుతో చెప్పాడు. సెల్ కట్‌చేశాడు.
పొలం విషయం మధ్యాహ్నందాకా చూచుకోమని పాండుకు చెప్పి రాము స్కూటీలో ట్యాంక్ ఫుల్
చేసికొని చిలకమ్మ నిలయానికి బయలుదేరాడు.
వర్షం ప్రారంభమయింది. ఉరుములు మెరుపులు... రామూ ముందుకు వెళ్లలేకపోయాడు.
అతికష్టంమీద ఇంటికి తిరిగి వచ్చి... తడిగుడ్డలను విప్పి... పొడిగుడ్డలను కట్టుకొని పడుకొన్నాడు.
పాండుకు ఫోన్ చేసి విపరీతమైన వర్షం కారణంగా తాను తిరిగి వచ్చినట్టు... ఉదయం కలసి పొలానికి
వెళదామని చెప్పాడు. నిద్రపోయాడు.
సూర్యోదయం అయింది. రాము లేచి పళ్లు తోముకొని టీ కాచి నానమ్మకు ఇచ్చాడు. పాండు
వచ్చాడు. ఇద్దరూ కలసి టీ తాగుతున్నారు.
వాకిట్లో పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది.
నలుగురు పోలీసులు వచ్చి రామూను సమీపించి 'యు ఆర్ అండర్ అరెస్ట్' అని చెప్పి అతని చేతులకు
బేడీలు వేసి లాక్కొనిపోయి వ్యాన్ ఎక్కించారు. వారూ ఎక్కారు. వ్యాన్ వెళ్లిపోయింది.
పాండుగాడు... రాము నాయనమ్మ... లబోదిబో అని ఏడుస్తూ పోలీసుల చేతులు పట్టుకొని...
రాము ఏ నేరం చేయలేదని చెప్పినా.. పోలీసులు వినిపించుకోకుండా వారి పని వారు చేసికొని వెళ్ళిపోయారు.
రాము అరెస్టు వార్త విన్న కోటేశ్వరరావు వర్క్‌షాప్‌కు వెళ్ళాడు. అ విషయాన్ని అందరికి ఆనందంగా
నవ్వుతూ చెప్పాడు. సోము అనే డ్రైవర్ అతనితో కలసి వంతపాడాడు. సోమూ తప్ప వర్క్‌షాప్‌లోని
వారెవరూ రామూను శంకించలేదు. జరిగిన దానికి బాధపడ్డారు.
అమాయకుడు... ఎంతో నిజాయితీపరుడైన రామూను పోలీసులు అరెస్టు చేసి లాక్కెళ్లిన విషయాన్ని
పాండు ఫోన్ చేసి శైలజకు... తన యజమాని రాఘవయ్యగారికి తెలియజేశాడు. పాండు శైలజలు పోలీస్
స్టేషన్‌కు వెళ్లి రామును చూచారు... కన్నీటితో పిచ్చివాడులా ఏడుస్తున్న రామూను చూచిన వారిరువురికి
... కన్నీరు... ఏడుపు... పోలీసులు... రాము చిలకమ్మను ఆమె తల్లిని హత్య చేశాడని చెప్పారు.
శెాలజ తమాయించుకొని...
“రామూగారూ !... నేను నాన్నగారికి ఫోన్‌చేసి విషయాన్ని చెప్పాను. నాన్నగారు వస్తారు. మిమ్మల్ని
బెయిల్‌మీద విడిపిస్తాము. భయపడకండి... మీ నానమ్మను మా ఇంటికి తీసుకొని వచ్చి నేను
చూసుకొంటాను... చిలకమ్మ, ఆమె తల్లి హత్యకు మీకు ఎలాంటి సంబందం లేదు... ఎవరో పన్నిన
కుట్ర ఇది. బాధపడకండి. పోలీస్ ఎంక్వయిరీలో అన్ని నిజాలు బయట పడతాయి" అనునయంగా
చెప్పింది శైలజ.
టైమ్ అయిపోవడంతో శైలజ పాండూలు స్టేషన్ నుండి బయటకు నడిచారు. తన్ను అరెస్టు చేసిన
కారణం చిలకమ్మ, ఆమె తల్లి మరణం అని శైలజ చెప్పగానే విన్న రాము ఎంతగానో ఏడ్చాడు.
శైలజ సబ్‌ఇన్స్పెక్టర్ కు రామూ నీతి నిజాయితీని గురించి చెప్పింది. అసలైన హంతకులను
వెతికి పట్టుకోండి.. అని వినయంగా కోరింది.
“మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాము...” చెప్పాడు ఇన్స్పెక్టర్ త్రివేది.
శైలజ పాండు ఇంటికి వెల్లిపోయారు.
త్రివేది రామూను విచారించాడు. రాము తనకు, ఆ హత్యకు ఎలాంటి సంబంధం లేదని... ఆ రాక్షస చర్యను చేసింది ఎవరో తనకు తెలియదని కన్నీటితో చెప్పాడు.
త్రివేది వర్క్‌షాప్‌కు వెళ్లాడు. అక్కడ పనిచేసేవారినందరినీ రామూను గురించి విచారించాడు.
అందరూ రామూ చాలా మంచివాడని అలాంటి కిరాతకపు పనిని అతను చేసి వుండడని సమాధానమిచ్చారు.
కంప్లైంట్ ఇచ్చిన అనసూయను త్రివేది స్టేషన్‌కు పిలిపించి విచారించాడు.
“రామూ చాలాకాలంగా చిలకమ్మను కోరుతున్నాడని... ఆ రాత్రి త్రాగి వచ్చి ఒంటరిగా వున్న
చిలకమ్మను బలవంతం చేసి మాట వినని కారణంగా చంపేశాడని... అడ్డం వెళ్లిన తన వదిన నూకాలమ్మను
చంపేశాడని... ' అనసూయ బోరున ఏడుస్తూ చెప్పింది.
అనసూయ వయస్సు ముప్పై సంవత్సరాలు. తన మొగుడు మూగవాడు అయిన వెంకన్న అంటే
ఇష్టం లేదు. లారీ డైవర్ సోముకు, అనసూయకు మంచి స్నేహం...
నూకాలమ్మ... కూతురు పెళ్లికని డబ్బును కూడబెట్టింది.... తనకు బిడ్డా పాపా లేనందున... తన
భర్త మూగవాడైనందున.. వాడు నూకాలమ్మకు తమ్ముడైనందున... పైకి వారితో నవ్వుతూ... మాట్లాడుతూ...
లోలోన వారిపై పగ ద్వేషాన్ని పెంచుకొంది అనసూయ... సోమూ సాయం కోరింది...
తప్పక సాయం చేస్తానని మాట ఇచ్చాడు సోము...
కోటేశ్వరరావుకు... సోముకు మంచి స్నేహం... కారణం... ఇరువురి తత్వాలు ఒకటే... పదివేలు
చీట్లాటలో పోగొట్టుకున్న కోటేశ్వరరావును సోమును అడిగాడు. తనతో చేయి కలిపితే పదివేలు ఇస్తానన్నాడు
సోము. కోటేశ్వరరావు అంగీకరించాడు.
తన మోపెడ్‌పై బయలుదేరిన రాము వర్షం కారణంగా ముందుకు వెళ్లలేక
ఇంటికి తిరిగివచ్చాడు.
అతని రాకను గమనించిన సోము... కోటేశ్వరరావుకు వెంటనే రమ్మని ఫోన్ చేశాడు. పదివేలు
అవసరం... తాను చీట్లాట ఆడాలన్నా... తాగాలన్నా.. మరికొంత డబ్బు అవసరంగా వున్న కోటేశ్వరరావు
సోమూ మాట ప్రకారం నడుచుకొంటే... వాడు తనకు డబ్బు ఇస్తాడనే ఆశతో బయలుదేరి అతని వద్దకు...
చేరాడు.
వర్షపు వాతావరణం... ఓ అరబాటిల్ విస్కీ తీసుకొని ఇరువురూ తాగారు.
ఆ సాయంత్రం... అనసూయ సోమూకు ఫోన్ చేసి... తను తన భర్త సొంతవూరికి వెళ్లి రేపు తిరిగి
వస్తామని చెప్పింది... ఆమాటలను విన్న తర్వాత సోమూ అందంగా స్కెచ్ వేసి ఆ రాత్రికి ఆ దాబాను,
చిలకమ్మను కొల్లగొట్టాలనే నిర్ణయంతో... కోటేశ్వరరావును సాయం రమ్మన్నాడు. కోటేశ్వరరావు తన
అవసరం దృష్ట్యా సోమూను కలిశాడు. ఇరువురూ నూకాలమ్మ హోటల్‌కు చేరారు.
సమయం ఒకటిన్నర గంట... తల్లీ కూతుళ్లు నిద్రపోతున్నారు. సోమూ విషయాన్ని ఒకదాని
తర్వాత ఒకటి అనే రీతిలో కోటేశ్వరరావుకు చెప్పాడు. ధనదాహంతో ఎండిపోయివున్న కోటేశ్వరరావు సరే
అన్నాడు... సోమూ చెప్పినట్టు నడుచుకొన్నాడు.
టేబుల్‌ను పగలకొట్టి... నూకాలమ్మ దాచుకొన్న డబ్బును ముందే దోచుకున్నారు. తర్వాత సోమూ
చిలకమ్మ ప్రక్కన చేరి బలవంతం చేయబోయాడు. సోమూ కోటేశ్వరరావును... నూకాలమ్మ కదలకుండా
తాళ్లతో కట్టేయమన్నాడు. ఆపని కోటేశ్వరరావు సరిగాచేయలేకపోయాడు. నూకాలమ్మ కదిలింది. చిలకమ్మ
అరిచింది. ఆ అరుపు విన్న నూకాలమ్మ బిగ్గరగా అరిచింది. లేచి కోటేశ్వరరావును నూకాలమ్మ... సోమూను
చిలకమ్మ పట్టుకొన్నారు. నలుగురి మధ్యన పెనుగులాట... తాగి అనుకున్నది జరగకపోయినందున
ఆగ్రహావేశాలతో సోము... నూకాలమ్మ... చిలకమ్మల గొంతు పిసికేశాడు. అయోమయ స్థితిలో కోటేశ్వరరావు
సోమూతో వాడు చెప్పినట్టు చేయవలసి వచ్చింది.... చేశాడు...
శ్వాస ఆగిపోయిన ఇరువురినీ ప్రక్కకు త్రోసి... సోము ... కోటేశ్వరరావులు నగరం వైపుకు తమ
వాహనంలో వెనుదిరిగారు. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. సోమూ పదివేల రూపాయల సొమ్మును
నూకాలమ్మ టేబుల్ నుంచి దొంగిలించాడు.
రాఘవయ్యగారు చెన్నై నుంచి వచ్చారు. రామూతో అన్ని విషయాలు మాట్లాడారు.
తాను వూరినుంచి వచ్చిన దగ్గరనుంచి కోటేశ్వరరావు తన్ను చూస్తే భయం భయంగా దూరంగా
వుంటూ ... వర్క్‌షాపులో సోమూతో రెండు మూడు సార్డు మాట్టాడ్డాన్ని రాఘవయ్య గారు గమనించారు.
బావకు అనుమానం వచ్చిందని గ్రహించిన కోటేశ్వరరావు ఆ ఊర్లో వుంటే తన మెడకు ఉచ్చు
బిగుసుకుంటుందనే భయంతో ఎటో పరారై పోయాడు.
అనసూయ తరపున సోము... అతనికి తగిన మరో ఇద్దరు వేరే ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లు... రామూనే
చిలకమ్మ తన్ను కాదన్నందుకు ఆగ్రహావేశాలతో చంపి.. అడ్డువచ్చి తల్లినీ హత్య చేసి పారిపోయాడని
చెప్పిన బలమైన సాక్ష్యం... రామూకు ఉరి శిక్ష పడే రీతిలో వుందని... వారి లాయర్ చెప్పగా....
రాఘవయ్యగారు తన భార్య... కూతురు శైలజతో ఎంతో విచారంగా చెప్పాడు. ఎంతగానో బాధపడ్డాడు...
తెల్లవారితే... రామూపైన ఆరోపించిన కేసు తీర్పు...
ఆ రాత్రి....
భోజనానంతరం... శెలజ తన గదిలో మంచంపై వాలిపోయింది. ఆమె మనస్సు నిండా రామూకు
సంబంధించిన ఆలోచనలే... రాము ఆ నేరాన్ని చేసి వుండడు...చేసింది వేరెవరో !... అతన్ని పగతో ఈ
కేసులో ఇరికించారు. బావ కోటేశ్వరరావు పరారు... అతనికి ఈ హత్యకు సంబంధం వుండి వుంటుందా
అసలు !... నిజానిజాలు దైవానికి తెలియాలి !... నాన్నకూ రామూ నిర్దోషి అని తెలుసు... తాను ఏమీ
చేయలేని స్థితిలో సాక్ష్యం బలంగా వుంది... కానీ రాము... దోషి కాదు. .. రాము హంతకుడు కాదు...
రామూని నేను రక్షించాలి.... నేను రామూను ఎలా రక్షించగలను...' ఆలోచన !.తీవ్ర ఆలోచన.
“రామూ చాలా మంచివాడు... నా రాము...” అనుకొంది శైలజ.
జడ్జిగారు వచ్చి వారి స్థానంలో కూర్చున్నారు.
న్యాయవాదులు వారి సీట్ల నుండి లేచి జడ్జీ గారికి నమస్కరించారు.
ఆర్డర్... ఆర్డర్... అంటూ కొయ్య సుత్తితో ప్యాండ్ పై జడ్జిగారు మూడుసార్లు కొట్టారు.
హాలు అంతా మౌనం... జనాల్లో కదలిక లేదు. జడ్జీగారి తీర్పును వినేందుకు... ఆతృతతో అందరూ వారివైపే చూస్తున్నారు.
“చిలకమ్మ... నూకాలమ్మ హత్య కేసులో నిందితుడు రాము బలమైన సాక్ష్యాధారాలతో
నిరూపించబడ్డాడు. కనుక ఐ.పి.ఎస్...”
“సార్ ... ఆపండి ... ” ద్వారం ముందునుండి ఓ స్త్రీ కంఠం...
జడ్జిగారు ఆపి ఆ వైపు చూశారు.
అందరూ ఆవైపు మెడలు త్రిప్పారు.
శైలజ... శైలజ... నిలబడి వుంది.
రాఘవయ్యగారు ఆశ్యర్యాందోళనలతో కూతురు వైపుకు నడిచారు...
“అమ్మా !...” దీనంగా పలకరించారు.
చిరునవ్వుతో తండ్రి చేతులపై తాకి శైలజ వేగంగా వెళ్లి బోన్‌లో నిలబడింది.
సినిమా ఫక్కీలో... “ మిలార్డ్ !... నా పేరు శైలజ. రాఘవయ్య్యగారి కుమార్తెను. రామూ మా లారీ డ్రైవర్. అతన్ని నేను
ప్రేమించాను. అతను నా మాట ప్రకారం చిలకమ్మ... నూకాలమ్మలు హత్య
చేయబడ్డ ఆ వర్షవు రాత్రి మా అమ్మా నాన్నా ఊర్లో లేని కారణంగా... నా పిలుపు ప్రకారం... ఆ రాత్రి రాము నా గదికి వచ్చాడు. మేము ఆ రాత్రి కలసివున్నాము. త్వరలో మేమిరువురము... మా తల్లిదండ్రుల
సమ్మతంతో వివాహం చేసుకోబోతున్నాము. మా రాముగారు నిర్దోషి... మరో మాట... మా బావ కోటేశ్వరరావు
పరారై పోయాడు... పోలీసులు అతన్ని పట్టుకోవాలి... వారుచేసే సన్మానాన్ని చేస్తే... అసలునిజం
బయటపడుతుంది.... మై లార్డ్... నిజాన్ని బ్రతికించండి సార్ !...”
శైలజ వాంగ్మూలానికి అందరూ ఆశ్చర్యపోయారు... రాఘవయ్య ఆనందంగా... నవ్వుతూ శైలజ
ముఖంలోకి చూచాడు. రామూ పిచ్చివానిలా శైలజ వైపు చూచాడు. శైలజ అందంగా నవ్వింది. కేసు
వాయిదా వేయబడింది. జడ్జిగారు వెంటనే కోటేశ్వరరావును పట్టి కోర్టుకు హాజరు పరచవలసిందిగా
పోలీసులను అదేశించారు.
“రాము నిర్దోషి... విడుదల చేస్తున్నాము...” అది జడ్జిగారి తీర్పు...
కన్నీటితో... కృతజ్ఞతా పూర్వకంగా చూచాడు శైలజ ముఖంలోకి రాము.
// సమాప్తి//
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.