top of page

ప్రేమంటే ఏమిటో తెలియదే


'Premante Emito Theliyade' written by A. Annapurna

రచన : A. అన్నపూర్ణ

“మాలినీ ! పనమ్మాయి కావాలన్నావుగా. చందేరిని పంపుతున్నా. మాకు ఎలాగూ ట్రాన్స్ఫర్ అయింది కనుక వెళ్ళిపోతున్నాం. ఇకనుంచి మీ ఇంట్లో చేస్తుంది. మంచి పద్దతి గలమనిషి. నమ్మితే ప్రాణం ఇస్తుంది. తేడావస్తే

ప్రాణం తీస్తుంది. పనిమనిషిగా చూడద్దు. చెల్లిలా చూడు. జీతం ఎక్కువే కానీ నమ్మకం ముఖ్యం. గ్యారెంటీ అది!” అంటూ ఫ్రెండ్ ఇంద్రాణి ఫోన్ చేసింది.

''థాంక్స్ ఇంద్రాణీ ! మీఇంటికి వచ్చినపుడు చూసాను. పర్వాలేదు. అవసరం ఐతే వేరే ఖర్చు తగ్గించుకుంటాలే” అంటూ హాపీగా ఫీలైంది మాలిని. పనిమనుషులకు యూనియన్ వుంది. వాళ్ళు పంపుతారు. కానీ వాళ్ళు మనం చెప్పినట్టు చేయరు. వాళ్ళు చేసినట్టు మనం చేయించుకోవాలి. అది ఎలా చేసినా ఏడాది భరించాలి. ఫిక్స్డ్ శాలరీ. ఒక బెడ్ రూమ్ ఫ్లాటు

ఐనా రెండు రూములు ఐనా 5 వేలు, మూడు నుంచి పెరుగుతుంది. ‘బాగా చేయడంలేదు’ అనకూడదు. ఆవిడ ఇగో దెబ్బతింటుంది. మనమీదే కంప్లైంట్ చేస్తుంది. కనుక విడిగా తగిన వాళ్ళని చూసుకుంటారు కొందరు. మాలిని అదృష్టం బాగుంది కనుక చందేరిని పంపింది ఇంద్రాణి.

చందేరికి కూడా మాలిని తెలుసు కనుక ఇంద్రాణి, 'మాలిని ఇంటికి వెడతావా?' అని అడగ్గానే ఒప్పుకుంది. వెంటనే పనిలోకి వచ్చింది. “మాలినీ మేమ్! బాగున్నావా?” అంటూ పలకరించింది నవ్వుతూ.

''బాగున్నాను చందూ! ఇదిగో ఇల్లు. సామాను ఇక్కడ వుంది. నేను ఇంద్రాణి దీదీ అనుకో..” అంటూ అన్నీ చూపించింది మాలిని. ఆ రోజు నుంచి టంచన్ గా పనికి రావడం, చక చక పూర్తి చేసి వెళ్లడం.. వంక పెట్టాల్సిన అవసరమే రాలేదు. జీతం మాత్రం పదిహేనువేలు. ఎనభై వేలు తెచ్చుకునే మాలినికి అదేమీ ఎక్కువకాదు. అనవసరంగా మాటాడదు చందేరి. కీ ఇచ్చి వెళ్ళిపోయినా ఫర్వాలేదు.

మాలినికి ప్రమోషన్ వచ్చి విదేశీ బ్రాంచీలకు పంపుతున్నారు కంపెనీవాళ్ళు. అప్పుడు కీ ఇచ్చేసి.. ఇల్లు అప్పగించి పూర్తి జీతం కూడా ఇచ్చేది మాలిని. ఒక్కరోజు సెలవు అడగదు. మాలిని శని ఆదివారాలు సెలవు ఇచ్చేది.

ఒకరోజు కళ్ళు వాచి, మొహమంతా ఉబ్బరించి ఉంటే “చందూ! ఆరోగ్యం బావోలేదా? రెస్టు తీసుకో. ఇంటికెళ్ళు ..” అంది మాలిని.

''ఇది మామూలే దీదీ! నా భర్త మోతీ తాగివచ్చి కొడతాడు” అనేది.

రెండుసార్లు ఊరుకుని మూడోసారి మాలిని “ఎవరైనా ఒక్కమాట అంటే పడనిదానివి, వాడి చేతిలో ఇన్ని దెబ్బలు తింటావా? పోలీసు రిపోర్ట్ ఇద్దాం పద!" అని కోపగిస్తే ''వద్దులే దీదీ! నీతో చెప్పినందుకు మళ్ళీ కొడతాడు'' అనేది.

ఒకరోజు పనిచేస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. మాలిని హాస్పిటల్ కి తీసుకెళ్లి మోతీకి ఫోన్ చేసింది. అతను వచ్చి భోరున ఏడ్చి ' నావలన ఎన్నికష్టాలు చంద్రీ నీకు! ఇక తాగను.. నీమీద ఒట్టు' అని మాలిని ముందు ప్రమాణం చేసాడు. కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఒక్క నిముషం కదలకుండా బెడ్డు పక్కనే కూర్చున్నాడు. ప్రేమగా పొదివి పట్టుకుని ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్లాడు డాక్టర్ డిశ్చార్జ్ చేసాక.

అది చూసి 'మోతీ తాగకపోతే మంచివాడే..‘ అని నమ్మింది మాలిని. వారం తర్వాత పనికి వచ్చినప్పుడు చందేరిని చూసి కుదుట పడింది.

విదేశాల్లో మాలిని పనితీరు శ్రద్ధ చూసాక ఐదు ఏళ్లపాటు అమెరికాలో ప్రాజక్ట్ అప్పగించారు కంపెనీ సి ఈ ఓ . ఏడాది అయ్యాక ఇండియా వచ్చింది. చందేరి పట్ల కూడా నిర్ణయం తీసుకుని ఆమెను అడగాలని అనుకుంది.

చందూకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మోతీకీ చేసింది. అందుబాటులో లేదని జవాబు వచ్చింది. ఇంటికివెళ్ళి చూస్తే తాళం పెట్టి వుంది. పక్కింటివాళ్ళని అడిగితే చెప్పారు.

"చందేరి, మోతీ ఎక్కడినుంచి వచ్చారో తెలియదు. చెప్పలేదు. చందేరి చాల అభిమానం గలది.

ఆ పిల్ల చదువుకున్న గొప్పింటి పిల్లగా అనిపించేది. ఇద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నామని, పెద్దవారికి ఇష్టం లేదని, అందుకే దూరంగా వచ్చామని చెప్పారు. పిల్లలు లేరు. కొన్నిరోజులు బాగానే వున్నారు. మోతీ ఏ పని చేస్తాడో తెలియదు.. తర్వాత రాజకీయ నాయకుల పంచన చేరి తాగుడికి బానిసై చందేరిని కొట్టేవాడు.

తాగొద్దు అని ఆమె గొడవచేస్తే రోజుల తరబడి ఇంటికి రావడం మానేసాడు.

విసిగిపోయిన చందేరి ఒకరోజు అర్థ రాత్రి మోతీని హత్య చేసింది. పోలీసులు వచ్చి తీసుకువెళ్లారు.''

వాళ్ళు చెప్పింది విన్న మాలిని తల్లడిల్లి పోయింది.

'అయ్యో చందూ! నీవెంత విసిగిపోయావో.. దెబ్బలకు ఓర్చుకున్నావు, కానీ ఏదో జరిగింది. మోతీ ఏ దుర్మార్గానికి ఒడికట్టాడో.. సహనం కోల్పోయావు . సమయానికి నేనులేను. ఇప్పుడైనా నిన్ను కాపాడుకుంటాను. నాతో బాటు నిన్ను అమెరికా తీసుకు వెడదామని అనుకున్నాను. ఇంతలో ఈఘోరం జరిగింది. నాకు ఏమైనా చెప్పాలని అనుకుందేమో..?'

“ఒక్కసారి తాళం తీస్తారా? ఇంట్లో ఏమైనా వుత్తరం పెట్టిందేమో! నాదగ్గిర పనిచేసేది, ఒక చెల్లిలా ఉండేది” అంటూ అడిగింది పొరుగింటి వారిని.

''అవును. మీదగ్గిర పనిచేస్తానని, దీదీ అని పిలుస్తానని .. మీరు బాగా చూసే వారని చెప్పింది. ఈ ఇంట్లో సామాను మమ్మల్ని తీసుకోమంది. ఈ ఇల్లు మా బంధువులదే” అంటూ వాళ్ళు తలుపు తీశారు. వెతగ్గా చందేరి డైరీ కనబడింది. అది ఇంగ్లీష్ లో రాసుకుంది. ఇంటికి వచ్చి చదవడం మొదలుపెట్టింది మాలిని.

''దీదీ! ఏదో ఒకరోజు ఈ పరిస్థితి వస్తుందని నాకు తెలుసు. అప్పుడు నా డైరీ చూస్తావు. మోతీకీ చదువురాదు. కనుక చూస్తాడని బాధలేదు. అందుకే రాస్తున్నాను. నువ్వు ఒక్కదానివే నాకు ఆత్మీయురాలివి. అమ్మ నాన్నలు వ్యవసాయం చేసేవారు. వాళ్ళకి చదువులేదు. ఒక్క కూతురిని. గారాబంగా పెంచారు. పెద్ద చదువు చదివించాలని ఆశ పడి అడిగింది ఇచ్చారు. పొరుగూరి కాలేజీలో చేర్పించారు. కానీ ప్రేమించిన వాడితో పెళ్ళికి అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదో అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం ఐనది. కానీ ఏమిలాభం? ఆత్మాభిమానం అడ్డువచ్చింది. నేను చేసిన తప్పుకి నేనే శిక్ష వేసుకోవాలి అనుకున్నాను.

ప్రేమ అనేది ఒక మైకం. ఒక వల. ఆ వల్లో పడ్డాక మంచి తెలియదు. విచక్షణ ఉండదు.

‘అది చాల గొప్ప పని. అమ్మ నాన్నలను ఎదిరించాలి. ప్రేమను గెలిపించుకోవాలి.’ - అదొక్కటే ధ్యాస. స్నేహితులు ప్రోత్సహించారు. రెచ్చగొట్టారు. ‘చరిత్రలో నిలబడి పోతారు. ఎందరికో ఆదర్శం’ అన్నారు.

ఇంటినుంచి డబ్బు నగలు తీసుకుని పారిపొమ్మని మోతీకీ చెప్పారు. నేను వెనక ముందూ ఆలోచిస్తే చందేరిని కాలేను. ‘అదేదో అద్వంచర్ ! తర్వాత అమ్మానాన్న బతిమాలి తీసుకెళతారు’ అని భ్రమ కలిగింది. మోతీ కూడా ''అవును.. నీకు, నాకు మీ వాళ్ళు పెళ్లి చేయరు. మనం చేసుకున్నాక ఏమీ చేయలేరు. నీ నగలు, ఇంట్లో వుండే డబ్బు తీసుకురా.. నాకు పని దొరికిన తర్వాత నగలు కొంటాను” అన్నాడు.

‘వాడికి చదువులేదు. ఇంటర్ చదివిన వాడికి ఆఫీసరు వుద్యోగం వస్తుందా?’ అనే బుద్ధిలేదు నాకు..

సినిమాలు, టీవీ సీరియల్స్, పిచ్చికథల ప్రభావం.. అన్నీ నిజం అనుకున్నాను. ఇప్పుడు స్కూలు, కాలేజీ.. విద్యానిలయాలుకాదు.. ప్రేమకు సోపానాలు అనుకున్నాను. 'అబ్బాయిలతో అరమరికలు లేకుండా పెద్దవాళ్ళ భయంలేకుండా మాటాడుకోవచ్చు.స్నేహం చేయచ్చు' అనే స్వేచ్చాప్రపంచం అనుకున్నా.

నావే కాదు- అమ్మనగలు, అప్పుడే సిటీలో ఫ్లాట్ కొందామని నాన్నగారు తెచ్చిన కోటిరూపాయలు తీసుకుని మోతీగాడితో వచ్చేసాను. అమ్మ నాన్న పరువుకోసం భయపడి పోలీసు రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ వూరు వదిలి ఎక్కడికో వెళ్లిపోయారుట . ఇద్దరూ నాతోపాటు డబ్బునూ, పరువునూ కూడా పోగొట్టుకొని, బెంగతో మరణించారు. అనుకున్నది జరగలేదు. కానీ విచిత్రం! మోతీ నన్ను విడిచిపోలేదు. వుద్యోగం వచ్చేదారిలేక రాజకీయ నాయకుల నీడలో వెధవపన్లు చేస్తూ బతికేస్తున్నాడు. నేను గౌరవంగా ఇంద్రాణి మేడం తరువాత మీ ఇంట చేరి పని చేస్తున్నా. ఇలా గడిచినా బాగుండేది. రాజకీయాల్లో ఒక నాయకుడికి నామీద కన్నుపడింది. మోతీని లోబరుచుకుని తాగించి నన్ను బలితీసుకోడానికి సిద్ధపడ్డాడు. అందుకే .. నేను మోతీని చంపేసాను.. నాజీవితం ఇలాగ ముగిసిపోతుంది.. మీ ప్రేమ అభిమానం గుర్తు చేసుకుంటూ బతికేస్తాను.సెలవ్..” - మీ ప్రియమైన చందేరి .

చదవడం పూర్తి చేసిన మాలినికి కన్నీటితో చెంపలు తడిసిపోయాయి. అయ్యో ఎంతపని జరిగింది!

‘నిన్ను శాయశక్తులా కాపాడుకుని నాతో తీసుకువెడతా! ఇందులో నీ తప్పులేదు. శీల రక్షణకోసం హత్యచేశావు. నీతిమాలిన రాజకీయనాయకుల దాహానికి బలికాకుండా తప్పించుకున్నావు.

ప్రౌడఫ్యూ మైడియర్ చందూ! అదొక్కటే చాలు. న్యాయం నీవైపే వుంది. నా పలుకుబడితో నిన్ను రక్షించుకుంటా’ అనుకుంది మాలిని దృఢంగా !

వెంటనే చందేరి గురించి కంపెనీ డైరెక్టర్ సలహా తీసుకుని, మంచి లాయర్ని కలిసింది. తన అమెరికా ప్రాజెక్ట్ వదులుకుంటాను అంది. ఎంత డబ్బు ఇచ్చినా నాదేశంలో ఒక దీనురాలికి సహాయం చేయలేనప్పుడు పరాయి దేశంలో ఖ్యాతి నాకు అవసరం లేదు అంది. లాయరుగారితో కలసి జైల్లో చందేరి దగ్గిరకి వచ్చింది.

“అంతా నేను చూసుకుంటా. నువ్వెలాటి తప్పు చేయలేదు” అంటూ ధైర్యం చెప్పింది. కొన్నివివరాలు అడిగి తెలుసుకుంది. “ఇల్లు వదిలి వచ్చినపుడు తెచ్చిన డబ్బు గురించి మోతీకీ తెలియదు. ఫిక్స్డ్ డిపాజిట్లో వేసాను” అంది. రాజకీయనాయకుడు - మోతీల సంభాషణ రికార్డు చేసిన ఫోను కూడా బ్యాంకు లాకర్లో పెట్టానని, ఆ వివరాలు చెప్పింది చందేరి.

''భేష్! చాలా తెలివైన పనిచేసావ్. ఇక అస్సలు భయంలేదు” అని భరోసా ఇచ్చింది మాలిని.

'' ఈ కేసుతో రాజకీయ నాయకుల ఆటకూడా కట్టిద్దాం” అన్నారు లాయరుగారు మరింత ధైర్యం ఇస్తూ.

మాలినికి చందేరి గురించి ఇంద్రాణి చెప్పిన మాట గుర్తు వచ్చింది. ''నమ్మితే ప్రాణం ఇస్తుంది. తేడావస్తే ప్రాణం తీస్తుంది''అని.

అవును.. చందేరి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం గల అభిమాన ధనురాలు!

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : నాపేరు అప్పాద్వేదుల అన్నపూర్ణ. నాది కాకినాడ. మా నాన్నగారు శ్రీ బులుసు వెంక టేశ్వర్లుగారు, పిఠాపురం రాజా వారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసారు. ఆయన రచయిత, కవి, పండితులు. ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం సబ్జెక్ట్స్ లో పీజీ చేసారు. ఇంటినిండా గ్రంధాలూ, ఇంటి ఎదుట నేను చదువుకునే స్కూల్ గ్రంధాలయం వున్న కారణమో, నాన్నగారి ప్రభావమో అన్ని పుస్తకాలూ చదివాను. ఆరుద్రగారు డాక్టరేటు చేసే రోజుల్లో నాన్నగారి దగ్గిరున్నగ్రంధాలు తీసుకెళ్లారు. విశ్వనాధ, దివాకర్ల వంటి దిగ్గజాలు మాఇంటికి వచ్చి కాకినాడలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అలా వారిని చూసినట్టు లీలగా గుర్తు. నాన్నగారు రాసిన 150 పుస్తకాల్లో ఒకటి అప్పటి విద్యాశాఖ మంత్రి శ్రీ పీవీగారు, విశ్వనాధ, దివాకర్ల ఆవిష్కరించారు.

తరువాత మహాఋషుల చరిత్రను (పది భాగాలూ) టీ టీ డీ వారు హక్కులు తీసుకుని ప్రచురించే

అవకాశం కల్పించిన శ్రీ పీ వీ ఆర్ కె ప్రసాదుగారు.. ఇలా చాల గుర్తులు మెదులుతూనే వున్నాయి.

నాగురించి చెప్పాలంటే రచనలు చేయడం ఆలస్యంగా జరిగింది.చదువు పెళ్లి పిల్లలు బాధ్యతలు తీరి రచన పత్రికలో 'వసుంధర' గారి ప్రోత్సహంతో నామొదటి కథ ''సెలయేరులో అల'' ప్రచురించబడింది. ఆ తరువాత అన్నిపత్రికల్లో వచ్చాయి. ఎక్కువగా రచన, ఈనాడువారి చతుర, విపుల లో ప్రచురించారు. ఇటు ఈ కథలు, చతుర నవలలు రాస్తూనే లోక్ సత్తా సంస్థ స్థాపకులు డా.జయప్రకాశ్ నారాయణగారి సంస్థలో చేరాను. పార్టీలోనూ పనిచేసాను. సంస్థ పత్రికలో వ్యాసాలు రాసే అవకాశం జె పీ ఇచ్చారు. ఇరవై సం.లు వారితోపాటు పనిచేసే మహత్తరమైన అవకాశం లభించడం నాకు గర్వకారణం. ఇప్పుడూ లోక్ సత్తా లో వ్యాసాలు రాస్తూనే వున్నాను. కవితలు కూడా రాస్తూ వుంటాను. మావారు మేథ్స్ ప్రొఫసర్. మాకు ముగ్గురు పిల్లలు.అమెరికాలో వున్నారు. మేము కూడా ఎనిమిది సం.గ ఇక్కడే అమెరికాలో వుంటూ వున్నాము.

ధన్యవాదాలు.

అన్నపూర్ణ.
54 views0 comments

Commentaires


bottom of page