'Andamaina Prakrutiki Bhashyalenno' A. Annapurna
రచన : A. అన్నపూర్ణ
అలిగిన పడతిలా అలవోకగా ఒరిగిన కొండను..
తొంగిచూస్తున్నాడు దొంగ చాటుగా సూర్యుడు.
పైన ఆకాశం, కొండకు పక్కగా సాగరం - సైగలతో..
''ఉష్ నిశ్శబ్దం ''అంటూ.. మవునంగా వున్నాయి.
తెరచాప పడవల్లో పల్లె పదాలు పాడుకుంటూ జాలరులు..
ఇంటికి చేరుతున్నారు సంధ్య పడకుండానే .
చీకట్లు ముసురుకుంటున్న ఆకాశం తళుకు తారల..
నల్ల దుప్పటి కప్పుకుంది చలికి వణుకుతూ.
కొండగాలి తిరిగింది గుండెలు జలదరించి వణుకుతుంటే..
తీరంలో పడవలు దిగాలుగా వున్నాయి.
కల్లోల సాగరంలో ఎగిరిపడే అలలు కొండలను ఢీకొంటూ ..
భయపెడుతూ పిచ్చిపట్టినట్టు ఘోషిస్తూన్నాయి.
సహనానికి ఒక హద్దు ఉందని చెబుతూనే..
ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తోంది.
నింగీ నేలా ఒకటైపోవాలని ఆత్రపడుతుంటే..
కొండలు హద్దులు పెడుతూ అడ్డుగా నిలిచాయి.
తెల్లని హంసల్లా తెలిమబ్బులు దేశాలకు సాగుతుంటే..
మేఘ సందేశాలు పంపుతున్నారు ప్రియతములు.
చిక్కని చీకటిలో చెట్లమీద మిణుగురులు..
వెలుగుతూ దారి చూపిస్తున్నాయి బాటసారులకు.
తరచి తరచి చూస్తే.. అన్నీ పరోపకారులే..
ప్రతివారికీ మార్గదర్శికాలే !
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : నాపేరు అప్పాద్వేదుల అన్నపూర్ణ. నాది కాకినాడ. మా నాన్నగారు శ్రీ బులుసు వెంక టేశ్వర్లుగారు, పిఠాపురం రాజా వారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసారు. ఆయన రచయిత, కవి, పండితులు. ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం సబ్జెక్ట్స్ లో పీజీ చేసారు. ఇంటినిండా గ్రంధాలూ, ఇంటి ఎదుట నేను చదువుకునే స్కూల్ గ్రంధాలయం వున్న కారణమో, నాన్నగారి ప్రభావమో అన్ని పుస్తకాలూ చదివాను. ఆరుద్రగారు డాక్టరేటు చేసే రోజుల్లో నాన్నగారి దగ్గిరున్నగ్రంధాలు తీసుకెళ్లారు. విశ్వనాధ, దివాకర్ల వంటి దిగ్గజాలు మాఇంటికి వచ్చి కాకినాడలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అలా వారిని చూసినట్టు లీలగా గుర్తు. నాన్నగారు రాసిన 150 పుస్తకాల్లో ఒకటి అప్పటి విద్యాశాఖ మంత్రి శ్రీ పీవీగారు, విశ్వనాధ, దివాకర్ల ఆవిష్కరించారు.
తరువాత మహాఋషుల చరిత్రను (పది భాగాలూ) టీ టీ డీ వారు హక్కులు తీసుకుని ప్రచురించే
అవకాశం కల్పించిన శ్రీ పీ వీ ఆర్ కె ప్రసాదుగారు.. ఇలా చాల గుర్తులు మెదులుతూనే వున్నాయి.
నాగురించి చెప్పాలంటే రచనలు చేయడం ఆలస్యంగా జరిగింది.చదువు పెళ్లి పిల్లలు బాధ్యతలు తీరి రచన పత్రికలో 'వసుంధర' గారి ప్రోత్సహంతో నామొదటి కథ ''సెలయేరులో అల'' ప్రచురించబడింది. ఆ తరువాత అన్నిపత్రికల్లో వచ్చాయి. ఎక్కువగా రచన, ఈనాడువారి చతుర, విపుల లో ప్రచురించారు. ఇటు ఈ కథలు, చతుర నవలలు రాస్తూనే లోక్ సత్తా సంస్థ స్థాపకులు డా.జయప్రకాశ్ నారాయణగారి సంస్థలో చేరాను. పార్టీలోనూ పనిచేసాను. సంస్థ పత్రికలో వ్యాసాలు రాసే అవకాశం జె పీ ఇచ్చారు. ఇరవై సం.లు వారితోపాటు పనిచేసే మహత్తరమైన అవకాశం లభించడం నాకు గర్వకారణం. ఇప్పుడూ లోక్ సత్తా లో వ్యాసాలు రాస్తూనే వున్నాను. కవితలు కూడా రాస్తూ వుంటాను. మావారు మేథ్స్ ప్రొఫసర్. మాకు ముగ్గురు పిల్లలు.అమెరికాలో వున్నారు. మేము కూడా ఎనిమిది సం.గ ఇక్కడే అమెరికాలో వుంటూ వున్నాము.
ధన్యవాదాలు.
అన్నపూర్ణ.
Yorumlar