top of page
Original.png

ప్రేమంటే...!

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguArticle, #Premante, #ప్రేమంటే, #RepublicDay

ప్రేమికుల రోజు సందర్భంగా.... ప్రేమంటే...! : ఒక విశ్లేషణ


Premante - New Telugu Article Written By Sudhavishwam Akondi

Published in manatelugukathalu.com on 14/02/2026

ప్రేమంటే...! - తెలుగు వ్యాసం

రచన: సుధావిశ్వం ఆకొండి


"ప్రేమ" అంటే ఏంటి? ఓస్! ఎంత సులభమైన ప్రశ్న. ప్రేమంటే ఇష్క్, కాదల్, లవ్ ఇది తెలియదా? చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు అంటారా? అవును సినిమాల ప్రభావం ఎంతగా ఉందో తెలుసుకోండి.. ప్రేమ అనేది ఒక అలౌకిక భావన అనీ, అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో చెప్పడం కష్టం అనో ఇలా రకరకాలుగా చెబుతారు.


"అచ్చా! మే చల్ తి", వస్తా! వెళ్ళొస్తా! అంటూ అలనాటి హిందీ, తెలుగు గీతాల్లో కానీ, "చల్ తి హు మే! జల్దీ హై క్యా", "ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది" హిందీలో షారూక్ ఖాన్ నుంచి తెలుగులో తరుణ్ వరకూ అలా ఇంకా.. ఎన్నెన్నో గీతాలు ప్రేమ భావనలు పొంగించాయి యువతలో. కానీ..


అసలు ప్రేమంటే ఏమిటి? సినిమాల్లో చూపించినట్టు నాలుగు డ్యుయేట్లూ, హీరోయిన్ తండ్రితో సహా అందరినీ చితగ్గొట్టడం. చదువూ, సంధ్యా అనవసరం. కమిషనర్ కూతుర్లయితే మాత్రం పెళ్లి చేస్కోరా? లాంటి చెత్త డైలాగులు యువత పైకి వదలడం. సరే కమిషనర్ కూతుర్లు పెళ్లి చేసుకుంటారు ఓకే! కానీ వాళ్లకూ, వాళ్ళ తల్లిదండ్రులకు ఏ ఆప్షన్స్ లేవా? హీరో ఎంత చెత్త వెధవ అయినా వెంటపడాలా? ఇదేమి సినిమా పైత్యమో? ఇదేనా అసలు ప్రేమకి అర్థం?


 ప్రేమ అనేది అలౌకిక భావన. నిజమే! కానీ అది కేవలం ఒక ఇద్దరు స్త్రీ, పురుషులకు మధ్య ఉండే కామ భావననేనా?


భగవంతుని పై ప్రేమ భావన ఉంటే అది ఆయన వద్దకు చేరుస్తుంది. ఆయనతో ఏ రకమైన సంబంధం పెట్టుకున్నా ఆయన్ని చేరవచ్చు, మోక్షాన్ని పొందవచ్చని అంటుంది భాగవతం, ఇతర పురాణాలు.


కానీ మనుషుల్లో ఉండే ప్రేమ భావనలకు ఒక పరిధి ఉంటుంది.


మొట్టమొదట మనిషి పుట్టగానే శిశువుగా ఉన్నప్పుడు ఉండే ప్రేమ కేవలం తల్లి పైన మాత్రమే ఉంటుంది. కొంచెం పెరిగాక తండ్రి, ఆ తర్వాత అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు. ఇంకా పెరిగి స్కూలుకు వెళ్లడం మొదలయ్యాక ఫ్రెండ్స్. అలా ఈ బంధాలన్నీ ప్రేమ తోనే ముడిపడి ఉంటాయి కదా!


కానీ అన్నీ ఒక పరిధిలో ఉంటాయి.


మాటా, నడవడిక ఒక్కొక్క సంబంధాన్ని బట్టి ఒక్కోలా ఉంటుంది. అమ్మ దగ్గర మాట్లాడినట్టుగా నాన్న దగ్గర మాట్లాడడం ఉండదు. ఇంకా తోబుట్టువులతో నడుచుకునే విధానం మరోలా ఉండాలి. అలాగే టీచర్స్ వద్ద నడిచే విధానం ఒకలా ఉంటుంది. ఫ్రెండ్స్ దగ్గర వేరేలా ఉంటుంది. అలాగని ప్రేమ లేదని కాదు కదా! అందరిలో ప్రేమ ఉంటుంది. అందరితో ప్రేమ, ఆప్యాయత ఉంటాయి.


కానీ...


ఇప్పుడు యువతలో ప్రేమ అనేది వెర్రి తలలు వేస్తుందని అనిపిస్తోంది. ఈ ప్రేమికుల రోజుకు ఉన్న లవర్, మరుసటి సంవత్సరం కల్లా ఆ లవర్ స్థానం మారిపోతోంది. తాగడం, పబ్బుల్లో ఎగరడం ఇదేనా ప్రేమ అంటే? సినిమాలకు, ఔటింగ్స్ కి వెళ్లి వస్తే అదే ప్రేమా? తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తే, బాధ్యత తెలియకుండా ఇలా జల్సాలు చేయడమా ప్రేమంటే? ఇవన్నీ యువత ఆలోచించుకునేట్టు తల్లిదండ్రులు చేయాలి.


ప్రేమ అనేది త్యాగాన్ని కోరుతుంది. కానీ ప్రేమ పేరుతో హత్యకు వెనుకాడకపోవడం ఎంత పైశాచికత్వం!


ప్రేమించేప్పుడు అమ్మాయికోసం రోడ్లపై తన్నుకోవడం ఇవన్నీ ఇప్పుడు హీరోయిజం. ఒకవేళ అదృష్టం బావుండి పెళ్లి చేసుకుంటే, ఒకరంటే ఒకరికి బోర్!


"అప్పుడు నా వెంట పడ్డావు, ఇప్పుడు అంత ప్రేమలేదు నీకు!" అని అమ్మాయిల కంప్లైంట్.


"నువ్వంత అందగత్తెవి అని చేసుకున్నా ఇప్పుడు ఎలావున్నావు? నీకు ఇగో ఎక్కువ! నువ్వూ సంపాదిస్తున్నావని పొగరు!" అని అబ్బాయిల కంప్లైంట్.  


మొత్తానికి ఏడాది తిరక్కుండానే మా అభిప్రాయాలు కలవట్లేదు మాకు విడాకులు కావాలి అంటూ కోర్ట్ మెట్లెక్కడం. ఇదేనా ప్రేమంటే? 

పెళ్లికి ముందు ఎవరు ఎవరితో ఫ్రీగా ఉన్నా ఏమీ పట్టించుకోరు.


కానీ ఆ తర్వాత...


"వాడితో క్లోజ్ గా ఉన్నావు" అని అబ్బాయి,


"నా నేచర్ అది అందులో తప్పేంటి? నువ్వూ దాంతో ఉన్నావుగా!" అని అమ్మాయి ఒకరినొకరు అనుమానించడం, కొట్టుకోవడం, అది ముదిరిపోయి, విడిపోవడం ఇదేనా ప్రేమంటే? 


"అప్పుడు పొరబడ్డాం, నిజమైన ప్రేమ అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది ఇంకొకరిని చేసుకుంటాం" అని అంటారేమో!


అప్పుడు మాత్రం నిజమైన ప్రేమ అని ఎలా తెలుసుకుంటారు?


నిజమైన ప్రేమ కోసం అన్వేషిస్తూ ఎలిజెబిత్ వంటి వారు జీవిత కాలం అంతా పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉన్నారు. తెలుసుకోగలిగారా?


ఇంకా కొందరు ఈ పెళ్లి వల్లే అంత ప్రాబ్లెమ్ పెళ్లి లేకుండా ప్రేమ ఉన్నంతకాలం కలిసిఉండి, నచ్చకపోతే విడిపోయి ఇంకొకరిని వెదుక్కోవాలి అనే ధోరణి మొదలయ్యింది. ఈ పని పశువులు కూడా చేస్తాయి మరి! కాకపోతే కామాన్ని ప్రేమగా చెప్పవు అవి.


ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు చేసిన పెళ్లి అయినా తెలుసుకోవాల్సింది ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవించడం. ఒకరికి కష్టం కలగకుండా ఇంకొకరు ప్రవర్తించడం. రెండు రూపాలుగా కనిపిస్తున్న ఏక స్వరూపంగా ఉండాలి భార్యాభర్తలు. 


ఏ రకమైన పెళ్లి అయినా, పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక. ఎంత ఒకే సంప్రదాయం వారే అయినా పెరిగిన వాతావరణాన్ని బట్టి మనస్తత్వాల్లో తేడాలుంటాయి. మొట్టమొదట ఇద్దరిలోనూ సర్దుకుపోయే గుణం పెంచుకోవాలి. ఎదుటివారిలో సరియైన లక్షణాలు లేకుంటే వారిలో మార్పుకు కృషి చేయాలి.


"చాలా ప్రయత్నం చేశాను కానీ మా మధ్య ప్రేమే లేదు!" అని నిర్ణయానికి వచ్చేస్తారు. ఎంతసేపు నాపై ప్రేమ లేదు అనుకోకుండా నేను ఎంత ప్రేమను ఎదుటి వారికి అందిస్తున్నాను అనే కోణంలో ఇద్దరూ ఆలోచిస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ ఇంకా బలంగా ఉంటుంది.


అది కుటుంబ వ్యవస్థను బలపరుస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన ప్రేమపూరిత వాతావరణం మనుషుల్లో వెల్లివిరుస్తుంది. అప్పుడు ఆ సమాజం వసుధైక కుటుంబం అంటే జగమంత కుటుంబం నాది అనుకునేలా చేసి, భగవంతుని అనుగ్రహాన్ని పొందేలా చేస్తుంది. 


ఏది ఏమైనా ఇలాంటి ఆర్భాటపు రోజులు కేవలం జరుపుకుంటూ, యువత పశు ప్రవృత్తి వైపు వెళ్లకుండా మంచి కుటుంబ వ్యవస్థ దిశగా పయనించాలని మనం అందరం ఆశించాలి. అందుకు ఎవరి పరిధిలో వారు కృషి చేయాలి!


 సర్వే జనా సుఖినోభవంతు! సమస్త సన్మంగళానిభవంతు!

కృష్ణార్పణమస్తు


🙏🙏🙏🙏🙏


సుధావిశ్వం




-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page