పునాదిరాళ్ళు
- Sammetla Venkata Ramana Murthy
- Aug 11
- 4 min read
#SusmithaRamanaMurthy, #సుస్మితారమణమూర్తి, #Punadirallu, #పునాదిరాళ్ళు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Punadirallu - New Telugu Story Written By Susmitha Ramana Murthy
Published In manatelugukathalu.com On 11/08/2025
పునాదిరాళ్ళు - తెలుగు కథ
రచన : సుస్మితా రమణ మూర్తి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“శేఖర్! ఈ లెక్క నీకు అర్థమైందా?.. నాకు మొదటి రెండు స్టెప్పులు అర్థం అయాయి. మూడో స్టెప్పునుంచి అర్థం కావటం లేదు. నీకు తెలిస్తే చెప్పరా!”
“నాకూ అర్థం కాలేదురా! టీచరు ఎప్పుడూ కోపంగా ఉంటారు. మరల అడిగితే తిడతారన్న భయంతో అడగలేదురా!”
“మరెలారా?.. ఈ అధ్యాయంలో ప్రాథమిక సూత్రాలే అర్థం కాలేదు. సారేమో రోజు రోజుకి లెక్కలు యమ స్పీడుగా చెప్పుకు పోతున్నారు!”
“నాక్కూడా అర్థం కావటం లేదురా! ఇంట్లో అమ్మ, నాన్నలను అడిగితే—మీ సార్నే అడిగి నేర్చుకోమని అంటున్నారు”
“నీవు మెరిట్ స్టూడెంటువి. లెక్కల్లో కూడా నీకే ఎక్కువ మార్కులు కదరా! నీకు కూడా అర్థం కాలేదంటే ఆశ్చర్యంగా ఉందిరా!”
“నేనేదైనా శ్రద్ధగా వింటాను. అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాను. ఎంతకీ బుర్రకు ఎక్కకపోతే బట్టీ పట్టేస్తాన్రా!”
“నిజంగానా!?.. లెక్కలు కూడానా!?.. ”
“సూత్రాలు బట్టీ పడతారా!”
“సూత్రాలు నేర్చుకుంటే, లెక్కలు చేయడం సులభమని మనసారే ఎన్నోసార్లు చెప్పారు. ఆ సూత్రాలు మనకు అర్థం అయాయా, లేదా అన్నది వారు చూడటం లేదురా!”
“అవున్రా! అందుకే ట్యూషను పెట్టించమని అమ్మ, నాన్నలను అడుగుతాను. అక్కడ ధైర్యంగా అడిగి నేర్చుకుంటారా! ”
“అందరూ నీలా ట్యూషను పెట్టించుకోలేరు కదరా!.. మా నాన్న తాపీ మేస్త్రి. అమ్మ ఆస్పత్రిలో ఆయా. పుస్తకాలు కొనడానికే ఇబ్బంది పడుతున్నారురా! ”
“ట్యూషన్లో నాకు అర్థం అయితే, నీకు తప్పకుండా చెబుతాలేరా!”
‘అమ్మ, నాన్నలు అయిదో క్లాసు దాటలేదు. తను బాగా చదువుకోవాలన్నది వారి కోరిక. స్కూలులో టీచర్లు చెబుతున్న లెక్కలు అర్థం కావటం లేదు..’
అది పదవ తరగతి చదువుతున్న రవి మనసులోని బాధ.
*****
“మైడియర్ స్టూడెంట్స్! నేను మీ కొత్త లెక్కల టీచరుని! మీ సార్ పది రోజులు సెలవు పెట్టారు. ఇంతవరకు అయిన అధ్యాయాల్లో మీకు అర్థం కాని లెక్కలు ఉంటే చెప్పండి. బాగా అర్థం అయేలా చెబుతాను”
“నమస్కారం సార్! నాపేరు రవి. ఈ లెక్క మూడో స్టెప్ నుంచి అర్థం కావటం లేదండీ!”
“ఈలెక్క ఇంతకంటే సులంభంగా మరో పద్ధతిలో చెబుతాను. ఓకేనా?”
“సార్! ఆలెక్క నాకూ అర్థం కాలేదండీ!”
“నీ పేరు?”
“శేఖరండీ!”
“చూడు శేఖర్! నే చెప్పబోయేది చాలా సులభమైన మెథడ్!” అంటూ బోర్డుపై చక చకా స్టెప్పులు వేసి కూర్చున్నారు వారు.
‘పాత సారు చెప్పింది కాస్తయినా అర్థం అయింది. ఈసారు చెప్పింది అసలు అర్థం కాలేదు’ అనుకున్నారు అందరూ.
“ఈ మెథడు బాగుంది కదూ?”
నవ్వుతూ అడిగారు టీచరు.
భయంతో అందరూ తలలు ఊపారు.
*****
పదవ తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు హెడ్ మాస్టారు కోసం మీటింగు హాలులో ఎదురు చూస్తున్నారు. వారు అత్యవసర సమావేశం పెట్టడానికి కారణం ఎవరికీ తెలియదు.
అయిదు నిమిషాల తర్వాత వారు వచ్చారు. అందరూ నమస్కారం చేసారు.
“నమస్కారం! కూర్చోండి. ఈ సమావేశం మన స్కూలు పురోగతికి ఎంతో కీలకమైనది. ఈ ఏడాది కూడా ముప్పైమంది విద్యార్థులను మాత్రమే పబ్లిక్ పరీక్షకు పంపిస్తున్నాం. అందరూ ప్రథమ శ్రేణిలో పాసవాలన్నదే మా ధ్యేయం“
“ఇది అందరికీ తెలిసిన విషయమే కదండీ?.. ఈ అర్జంటు సమావేశం ఎందుకో చెప్పండి సార్!” ఓ టీచరు అడిగారు.
“ఆ విషయం చెప్పే ముందు, ఒక విద్యార్థి ఆవేదన చెబుతాను వినండి”
అందరూ ఆశ్చర్యంగా వారిని చూడసాగారు.
“ఆ విద్యార్థికి బాగా చదువుకోవాలన్న కోరిక ఉంది. అంతగా చదువుకోని తన తల్లిదండ్రులకు కొడుకుని తమ రెక్కల కష్టంతో, బాగా చదివించాలన్న తపన ఉంది. అంత వరకూ బాగానే ఉంది. సమస్యల్లా స్కూలులో టీచర్లు చెప్పే పాఠాలు అర్థం చేసుకోలేక ఆ విద్యార్థి చాలా బాధ పడుతున్నాడు.
అర్థం కానివి టీచర్లను అడిగితే, పాఠాలు చెప్పినప్పుడు సరిగ్గా ఎందుకు వినరని విసుక్కుంటున్నారు” అంటూ వారు టీచర్ల వేపు చూసారు.
అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు.
“టీచర్లు సెలవు పెడితే, వారికి బదులుగా వచ్చే టీచర్ల వలన కూడా విద్యార్థులు మనోవేదనకు గురి అవుతున్నారు. లెక్కలు గాని, మరో సబ్జెక్టు అయినా పుస్తకాల్లో ఉన్న విధంగా కాకుండా, కొందరు టీచర్లు అతి తెలివితో వేరే విధంగా బోధన చేస్తున్నారు. విద్యార్థులకు అర్థం అవుతోందా, లేదా— అన్న విషయం గమనించటం లేదు. అప్పుడు ఆ పిల్లల మానసిక స్థితి గురించి ఆలోచించండి. ఈ సమస్యకు ఎవరైనా పరిష్కారం చెప్పగలరా?”అంటూ హెచ్. ఎమ్ గారు అందరి వేపు చూసారు.
అందరూ ఆలోచిస్తున్నారు.
తమకు తోచిన పరిష్కారాలు చెబుతున్నారు. హెచ్. ఎమ్ గారికి ఏదీ నచ్చటంలేదు. “ విషయం టీచర్లు, హెచ్. ఎమ్ కి సంబంధించినది, బాధితులు మాత్రం విద్యార్థులు”
వారి మాటలకు టీచర్లు హెచ్. ఎమ్ గారి వేపు అసహనంగా చూసారు. వారు మరల చెప్పసాగారు.
”సమస్యను నా దృష్టికి తీసుకు వచ్చినది ఎవరనేది మీకు కాసేపటిలో తెలుస్తుంది. ఈలోగా అందరికీ సంబంధించిన కొన్ని విషయాలు చెబుతాను. జాగ్రత్తగా వినండి“ అంటూ అందరివేపు చూసారు వారు.
“విద్యార్థుల కోసం రెండు మాటలు—టీచర్లు పాఠాలు చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. అర్థం కాకుంటే వెంటనే అడిగి తెలుసుకోవాలి. బట్టీ పట్టకూడదు. లెక్కలు చేయడానికి సూత్రాలు బాగా అర్థం చేసుకోవాలి---
“తల్లిదండ్రులకు కొన్ని సూచనలు-- చదువుకున్న తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి పట్టించుకోవాలి. అర్థం కానివి ఎప్పటికప్పుడు ఇంటి దగ్గర చెబుతుండాలి. చదువుకోని తల్లిదండ్రులు వారి పిల్లల కోసం చదువుకున్న వారి సహాయం తీసుకోవాలి. రోజూ స్కూలు సమయం అయిన తర్వాత, గంట సేపు నేను స్కూలులోనె ఉంటాను. అప్పుడు ఎవరైనా వస్తే, అర్థం కాని పాఠాలు చెబుతాను--
”టీచర్లకు కూడా కొన్ని సూచనలు—టీచర్లు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలి. అర్థం కాని పాఠాలు విసుక్కోకుండా వారికి అర్థం అయేదాకా చెబుతుండాలి. ముఖ్యంగా లెక్కలుకి ప్రాథమిక సూత్రాలు అందరికీ అర్థం అయేదాకా చెప్పాలి. పుస్తకంలోని ఉదాహరణ లెక్కలు ముందుగా చేయించాలి. ఆ పద్ధతిలోనే బోధన కొనసాగించాలి. తమ ప్రతిభ చూపడానికి వేరే పద్ధతుల్లో బోధన చేయకూడదు”
టీచర్లు దిక్కులు చూడసాగారు.
“ఇక నాగురించి కూడా కొన్ని విషయాలు. ప్రధానోపాధ్యాయునిగా విద్యార్థుల ఇబ్బందులు, టీచర్ల బోధనా పద్ధతుల గురించి నిరంతరం తెలుసుకునే ప్రయత్నం చేస్తుండాలి. అలా చేయడం నా బాధ్యత “
“సమస్య మీకు, బాధ పడిన ఆ విద్యార్థి తెలియజేసాడా సార్?” “ ఆ విషయం తెలుసుకునే ముందు నేను తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం వినండి” అందరూ ఆసక్తిగా వినసాగారు.
“సమస్యను తెలియ జేసిన ఆ విద్యార్థికి ఈ ఏడాది స్కాలర్‌షిప్ ఏర్పాటు చేస్తాను. పైచదువులకు సహాయం చేస్తాను”
విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషించారు.
“ఆ విద్యార్థి గత్యంతరం లేక మా ఇంటికి వచ్చాడు. స్కూలులో బోధనా విధానం వలన, విద్యార్థుల బాధ గురించి ఏడుస్తూ చెప్పాడు. కొంత కాలం టీచర్లను, విద్యార్థులనూ గమనించాను. సమస్య టీచర్ల వలననే వచ్చిందని గ్రహించాను”
అందరిలో ఆ విద్యార్థి ఎవరన్న ప్రశ్న చోటుచేసుకుంది. “ ఆ విద్యార్థి ధైర్యంగా టీచర్ల బోధన గురించి, విద్యార్థుల బాధ గురించి నాకు చెప్పి, సహాయం అర్థించడం చాలా గొప్ప విషయం. ఆ విద్యార్థి నా బాధ్యతను గుర్తు చేసాడు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేసాడు. దిద్దుబాటు చర్యల గురించి ఆలోచించేలా చేసాడు. నా నిర్ణయాల వలన టీచర్లు కలవరం చెందాల్సిన అవసరం లేదు. వారికి ఏమైనా సమస్యలు ఉంటే, నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి పునాదిరాళ్ళు టీచర్లే అన్న విషయం, టీచర్లు అందరూ తప్పక గుర్తించుకోవాలి”
టీచర్లు అందరూ తలలూపారు.
“సార్! ఆ విద్యార్థి ఎవరండీ!?“
హెచ్. ఎమ్ గారు చెప్పారు.
“రవికుమార్!”
/ సమాప్తం /
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
సుస్మితా రమణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి
కలం పేరు : సుస్మితా రమణ మూర్తి
పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.
విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.
కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.
బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో
మీ సుస్మితా రమణ మూర్తి.
Komentáře