top of page

రామనాథం గారి వేలు

#RamanathamGariVelu, #రామనాథంగారివేలు, #MunagaRamaMohanaRao, #మునగారామమోహనరావు, #TeluguHeartTouchingStories

ree

Ramanatham Gari Velu - New Telugu Story Written By Dr. Munaga Rama Mohana Rao  

Published In manatelugukathalu.com On 09/10/2025

రామనాథం గారి వేలు - తెలుగు కథ

రచన: Dr. మునగా రామ మోహన రావు 

ఆయన బ్రిటిష్ ఆర్మీ లో తర్ఫీదుపొంది, భారతదేశానికి స్వతంత్రం వచ్చాక భారత సైన్యంలో చేరారు. ఎక్కువ కాలం ఉత్తరభారతంలోనే పనిచేసి, బ్రిగేడియర్ గా రిటైర్ అయ్యి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. 


వీరి భార్య సీతా మహాలక్ష్మి గారు ఎంతో ఉత్తమరాలు. ఆమె ఎప్పుడూ పూజలు, రామనాథంగారికి సమయానికి ఏమికావాలో అవి సమకూరుస్తూ బిజీ గా ఉండేవారు.

 

వీరికి నలుగురు సంతానం.

 

ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. పెద్దమ్మాయి పద్మ తరువాత శ్రీధర్, రమేష్. చివరగా రాధిక. 


పిల్లలు హైస్కూల్ లో చదువుతున్నప్పటినుండి, సీతమ్మగారికి పనుల్లో సహాయ పడటానికి, బందరులో ఆయనకు బాగా నమ్మకస్తుల వాళ్ళ అబ్బాయి వెంకటేష్ ని తెచ్చుకొని ఇంట్లోనే ఉంచుకున్నారు.

 

పిల్లలకు కూడా వెంకటేష్ అన్ని అవసరాలను ఎంతో ఓర్పుతో తీరుస్తుండేవాడు. వాళ్ళుకూడా వెంకటేష్ కి దగ్గరయ్యారు. 


పెద్ద అమ్మాయి పద్మ మొదటినుంచి కొంచెం ముభావంగా ఉండేది, MA చదివిన తరువాత దూరపు బంధువుల అబ్బాయి, పెద్ద ఉద్యోగస్తుడితో వివాహం జరిపించారు. 

తరువాత ఇద్దరు అబ్బాయిలు. ఒక అతను చెన్నైలోని ఐ ఐ టి లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసాడు. రెండో అబ్బాయి డాక్టర్.లాస్ట్ అమ్మాయి రాధిక., ఆమెకు రామనాథంగారంటే చాలా ప్రేమ. తను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్.


పిల్లలందరూ మెరిట్ స్టూడెంట్సే. అదృష్టవశాత్తు ముగ్గురు పిల్లలకి అమెరికాలో మంచి ఉద్యోగాలు రావడంతో అమెరికాలో సెటిల్ అయ్యారు. 


రామనాథం గారు 1975 ప్రాంతంలో అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న బంజారా హిల్స్ లో 1500 ల గజాల స్థలం కొని ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు. వీరు మొదటినుంచి కూడా క్రమశిక్షణ తో ఉండేవారు. 


ఆయన పనులకు ఎవరిమీదా ఆధారపడేవారు కాదు. సీతమ్మ గారైతే పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు. ఎల్లప్పుడూ పిల్లల బాగోగులలో నిమగ్నమయ్యి ఉండేవారు. 

అమెరికా వెళ్లిన ముగ్గురికి వివాహాలు అయ్యాయి. వాళ్లందరికి అక్కడి పౌరసత్వం కూడా వచ్చింది. వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్లకి మనవళ్ళు, మనుమరాళ్ళు కూడా కలిగారు. 


పిల్లలందరూ వేరే చోట్ల ఉండటం వల్ల, వెంకటేష్, రామనాధం గారికి, సీతమ్మ గారికి అన్నీ తనై ఎంతో నిజాయితీగా సొంత తల్లి తండ్రులను చూసుకునే విధంగా చూసేవాడు.


బ్యాంకు పనులకైతేనేమి, మిగతా అన్ని పనులకు రామనాథం గారి తో కూడా వెళ్ళేవాడు. ఇంటిపనులన్ని దగ్గరుండీ చూసుకునేవాడు. ఇలా వెంకటేష్ వాళ్ళఇంట్లో సొంతమనిషి అయ్యాడు. 


రామనాథంగారు ఒక మంచి సంబంధం చూసి దగ్గరుండి వెంకటేష్ కి పెళ్లి జరిపించారు. అతని కుటుంబం అంతా అక్కడే వారి అవుట్ హౌస్ లోనే వుంటున్నారు, 


రామనాథం గారి 85 వ ఏట భార్యా వియోగం కలిగింది, ఆ తరువాత ఆయన అన్నింటికీ వెంకటేష్ మీదే ఆధారపడేవారు. అతను కూడా ఆయనకు ఏలోటూ రాకుండా చూసుకునేవాడు. ఆయన ఎప్పుడూ అమెరికా లో పిల్లదగ్గరికి వెళ్లేవారు కారు.

 

రామనాథం గారికి 90 వ సంవత్సరం వచ్చేప్పటికి కొంచెం ఆరోగ్యం బాగుండక పోవడంతో పెద్దమ్మాయి వాళ్ళు హైదరాబాద్ వచ్చి వాళ్ళ నాన్నగారి ఇంటికి దగ్గరగా వేరే ఇల్లు తీసుకొని సెటిల్ అయ్యారు. 


అప్పుడప్పుడు వచ్చి చూసి వెళుతుండేవారు, మరీ ఏదైనా అవుసరముంటే ఆయనే కబురు పెట్టేవారు. ఇంత జరుగుతున్నా మొగపిల్లలు ఇద్దరూ పట్టించుకునే వారు కాదు. ఎదో మొక్కుబడిగా ఏ ఆరునెలలకో ఫోన్ చేసి మాట్లాడేవారు కానీ వాళ్ళ నాన్నగారి గురించి ఏ బాధ్యతా తీసుకునేవారు కారు. 


సీతమ్మ గారు బ్రతికివున్నప్పుడు ఏ మూడేళ్లకో నాలుగేళ్లకో వచ్చి వెళ్తుండేవారు, అందరూ ఎంతో పెద్ద ఉద్యోగాల్లో బిజీ బిజీ గా ఎప్పుడూ హడావిడిగా ఉండేవారు, వాళ్లకు ఇండియా వచ్చి వీళ్ళదగ్గర కొద్ది రోజులు గడపటానికి కూడా ఖాళీ ఉండేది కాదు. సీతమ్మ గారు పోయాక వాళ్లకి ఇండియా ఊసే లేదు. 


క్రమేపి రామనాథంగారు, ఆయన ఆస్తుల పత్రాలు, బ్యాంకు లాకర్ వివరాలు పెద్దమ్మాయి వాళ్లకు చెప్పి, పొలాలు అవి అమ్మే భాద్యత పెద్ద అల్లుడుగారికి అప్పచెప్పారు. అయన వాటిని అమ్మి వచ్చిన డబ్బు ఫిక్సడ్ డిపాజిట్ చేసి అవి వారికి అప్పచెప్పేసారు. 


రామనాథం గారు ఎంత ముందుచూపు వారు అంటే, ఆయన తన ఆస్తిని అంతా పిల్లలు నలుగురూ ఎలా పంచుకోవాలో, సీతమ్మగారి బంగారపు వస్తువులు కూతుళ్ళకి, మనుమరాళ్ళకి ఏమేమి ఇవ్వాలో పెద్దమ్మాయి పద్మకు వివరంగా రాసి ఇచ్చారు. వీటితోపాటు ఒక సీల్డ్ కవరు కూడా ఆమెకు ఇచ్చి, దానిని అయన మరణించిన రోజున తెరవమని ఆమెకు అప్పచెప్పారు. 


ఆయన 99 వ ఏట కన్నుమూశారు.


ఈ వార్త కుటుంబసభ్యులందరికి అందిన రెండోరోజు సాయంత్రానికి అందరూ హైద్రాబాదు చేరారు. చిన్నమ్మాయి వాళ్ళ 12 ఏళ్ల మనవడిని కూడా తీసుకు వచ్చింది. కోడళ్ళు ఎవరూ రాలేదు. 


ఐస్ బాక్స్ లో ఉంచిన శవాన్ని చూసి ఒకసారి భోరున ఏడ్చారు. రామనాథం గారి శరీరం మీద అయన పాత పంచె ఒకటి పూర్తిగా కప్పిఉంచారు, ముఖానికి తప్ప. 


వారి అబ్బాయిలకి కూడా 65 ఏళ్ళు దాటాయి., వాళ్ళ నాన్నగారి శవం మీద ఏమి కప్పారో వాళ్లకు పట్టలేదు, నాన్నగారు వాళ్ళకు ఏమేమి ఆస్తులు మిగిల్చారు అనే తపన తప్ప. 


ఆరోజు రాత్రి అందరిలో ఒక సందేహం, దహన సంస్కారాలకి, మిగతా కార్యక్రమాలకి అయ్యే ఖర్చులు ఎవరు పెట్టాలి అని.


 చిన్నబ్బాయి “నేను కంగారుగా రావటంవల్ల ఏమీ తీసుకు రాలేదు” అన్నాడు.


పెద్దబ్బాయి ఏమీ మాట్లాడలేదు. అంతలో పద్మగారు లోపలినుంచి ఒక కవరు తెచ్చి, నాన్నగారు ఆయన పోయిన రోజున తెరవమన్నారు అని చెప్పి అందరి ఎదురుగా ఆయన ఇచ్చిన కవరుని తెరిచారు.


అందులో మూడు లక్షలు కాష్, ఒక వుత్తరం రాసి వుంది.


అందులో పిల్లలందరిని సంబోధిస్తూ, “మీరెవ్వరూ నా అంతిమయాత్ర కు అయ్యే ఖర్చులకు ( దహన సంస్కారాలకు )బాధపడవద్దు. ఈ కవరులో వున్న డబ్బుతో కార్యక్రమం ముగించండి. నేను కూడబెట్టింది అంతా పంచుకొని సుఖంగా వుండండి. మిగతా వివరాలు పద్మకి రాసి ఇచ్చాను”, అని వుంది. 


అందరిలో హమ్మయ్య అనే భావన కలిగింది. ఇకపోతే దహన సంస్కారాలు, ఖర్మ కాండలో ఇద్దరు అబ్బాయిలూ కలిపి చేయాలని వాళ్ళ చిన్నత్త చెబితే, చిన్నబ్బాయి భాస్కర్ అన్నాడు “నేను ఎంతో ముఖ్యమైన మీటింగ్స్ అన్నీ వాయిదావేసుకొని వచ్చాను, రేపు నాన్నగారి దహన కార్యక్రమం అయ్యాక మూడు రోజులు మాత్రమే వుంటాను, నేను గుండు అదీ చెయించుకోను, వాటినన్నిటినీ అన్నయ్యనే చూసుకోమనండి నేను ఈ నాన్సెన్స్ పడలేను” అని గట్టిగా చెప్పేసాడు. 


పెద్దబ్బాయి 12 వ రోజు వరకు వుండి అన్ని కార్యక్రమాలు జరపటానికి నిర్ణయం అయ్యింది. మరుసటి రోజు ఉదయం శవానికి స్నానం చేయిస్తున్నప్పుడు కుడిచేతి ఉంగరపు వేలికి పెద్ద బ్యాండేజ్ వుంది. దాన్ని కొడుకులు గానీ వచ్చిన చుట్టాలు గానీ పెద్దగా పట్టించుకోలేదు.


చివరి చూపుకి వచ్చిన కొందరు దాన్ని చూసికూడా మనకెందుకులే అని వూరుకుండి పోయారు. చిన్న అమ్మాయి మనుమడు చూసి “అమ్మమ్మా, పెద్ద తాతగారి వేలుకు ఏమైంది?” అని అడగటంతో, ఆమె కూడా అప్పుడే గమనించింది. కానీ అప్పుడు అక్కయ్యను గాని వెంకటేష్ ని గానీ అడిగే పరిస్థితి లేదు. అంతిమ యాత్ర ఏర్పాట్లలో అందరూ నిమగ్నమై వున్నారు. 


తరువాత పంతులుగారు చేయవలసిన విధివిధానాలను వివరిస్తుండగా, ప్రభుత్వంవారు లాంఛనాల ప్రకారం ప్రకారం శవయాత్రకు వాను, ఒక అధికారిని, పుష్పమాలలు అవి ఇచ్చి పంపారు. ఆవిధంగా రామనాధం గారి అంతిమయాత్ర ముగిసింది. 


చిన్నమ్మాయికి రామనాథం గారంటే ఎంతో ఇష్టం. ఎప్పటికప్పుడు వెంకటేష్ ద్వారా అయన క్షేమసమాచారాలు అడిగి తెలుసుకుంటూనే వుంది. అయినా నాన్నగారి వేలుకి ఇంత పెద్దగాయం అయితే చెప్పనే లేదేంటి అని ఆరోజు సాయంతం వెంకటేష్ విడిగా వున్నప్పుడు చూసి ఏమైందని అడిగినప్పుడు వెంకటేష్ తలదించుకుని జవాబు చెప్పలేదు. అయినా గట్టిగా నిలదీయటంతో, అతనికి కళ్లనీళ్లు ఆగటంలేదు. 

అయినా రాధిక వదలక పోవటంతో, “వేలుకున్న ఉంగరం అయ్యగారు పోయిన మరుసటి రోజు తీస్తుంటే కొంచెం గీసుకు పోయింది” అని చెప్పబోయాడు. 


“గీసుకుపోతే అంత పెద్ద కట్టు ఎందుకు కట్టారు” అని కోపంతో గద్దించి అడగటం వల్ల, “ఎవరికీ చెప్పవద్దు. ముఖ్యంగా పద్మమ్మగారికి” అని తనకొడుకుమీద ఒట్టు వేయించుకొని ఏడుస్తూ ఆరోజు ఏమైందో చెప్పాడు.


“అమ్మాయిగారూ, అయ్యగారి కుడివేలుకి ఉంగరం ఉండేది. అది మీకు తెలుసు. అక్కయ్యగారు నాన్నగారు పోయిన మరుసటి రోజు దానిని తీసి ఇవ్వమన్నారు. కానీ నేను ఎంత ప్రయత్నించినా రాలేదు. ఎందుకంటే అప్పటికే అయ్యగారి శవం ఉబ్బి పోవటం వలన వేలు కూడా బాగా లావు అయ్యింది. ఈ విషయం పద్మమ్మగారితో చెబితే చాకుతో వేలు లోపల గుంట చేసి తియ్యమన్నారు. అయ్యగారికి నొప్పి పుడుతుంది అన్నాను.


‘చచ్చిన వాళ్లకి నొప్పేంటి, ఎలాగోలాగా కోసి తీయ’మన్నారు.

 

అన్నంపెట్టిన చేతిని నేను కోయలేను అని బ్రతిమాలిడితే, కంసాలి చారిగారిని పిలిపించారు. ఆయన కటింగ్ ప్లేయర్ తో కట్ చేయటానికి వీలుగా కొంచెం వేలు కండని కూడా కత్తిరించి ఉంగరాన్ని కట్ చేసి అక్కయ్యగారికి ఇచ్చారు” అనిచెప్పి దుఃఖం ఆపుకోలేక బోరుమని ఏడ్చి వెళ్ళిపోయాడు. ఇదంతా వింటున్నప్పుడు ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. 


ఆరోజు రాత్రి సమావేశంలో చిన్నబ్బాయి పద్మగారిని అడిగాడు, “అక్కాయి.. నావాటాకు ఏమి వస్తున్నాయి” అని.

 

ఆమె రామనాథంగారి బ్యాంకు డిపాజిట్లు, నగలు మరియు కాష్ వివరాలు అన్నీ చెప్పి, వాళ్ళ నాన్నగారు రాసిచ్చిన పేపర్ చూపిచ్చింది. అందరూ సరే అని వెళ్లేరోజు తీసుకుంటములే అన్నారు.

 

అప్పుడు “ఇల్లు అమ్మితే ఎంత వస్తుంది” అన్నప్పుడు, పద్మ అన్నారు “మన ఇల్లు మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది కాబట్టి ఓ 30 కోట్లు పై మాటే పలుకుద్ది. పెద్ద ఖర్మ అయ్యాక మీడియేటర్స్ తో మాట్లాడతాను” అన్నారు.

 

అంతా అయ్యాక చిన్నబ్బాయి భాస్కర్ అన్నాడు “మరి నాన్నగారి వేలి ఉంగరం ఏమిచేసావు?” అని వాళ్ళ అక్కయ్యను అడిగాడు. 


“ఏవుంగరం గురించి” అని అంటే, 


“నేను చెల్లితో వెంకటేష్ మాట్లాడింది అంతా విన్నాను. దానిగురించి నేను అడిగేది” అన్నాడు. అప్పుడు ఆమెకు ఏమి మాట్లాడాలో తోచలేదు. 


అప్పుడు రాధిక తనలో అణగదొక్కివుంచుకున్న కోపాన్ని వేళ్ళ గక్కింది.

 

“మీలో ఎవరికైనా నాన్నమీద ప్రేమవుందా, సిగ్గు లేకుండా ఆయన సంపాదించిన ఆస్తి పంచుకోటానికి వచ్చారు. అన్నీకలిపితే ఒక్కోళ్ళకి పదో కోట్లు వచ్చేట్లు వుంది. అక్కాయి అయితే కసాయిదానిలాగా వేలు కోయించి ఉంగరం తీసుకుంది. దానికోసం మీరూ కొట్టుకు చస్తున్నారు.


మీకు ఆయనమీద ఎంత గౌరవముందో అందరికీ తెలుసు. ఆయన శవం మీద అక్క ఏమి కప్పిందో చూసారా ఓ పాత పంచె కప్పించింది.

 

నాన్నగారు జీవితాంతం కూడబెట్టింది మీ ముఖాల మీదే వేసి పోయారు కదా.. అమ్మ పోయి పది ఏళ్ళు అయ్యింది. తరువాత ఇప్పటివరకు అయనను ఒక్కసారి అయినా చూడటానికి మీకు కుదరలేదు. ఈ రోజున నాన్నగారి ఉంగరం కోసం ఇంత దిగజారారు. 


ఆయన మనకోసం కూడబెట్టింది పదేసి కోట్లు పైనే తీసుకోబోతూ కూడా ఆయనకు జరిగిన అవమానానికి మీలో ఎవరికీ కూడా కించిత్తు పశ్చాతాపం లేదు. 


ఇందాకటి నుంచి ఎవరైనా మాట్లాడతారేమో అని చూస్తున్నా, మాకు ఎంత వస్తుందని మదనపడుతున్నారు కానీ, మీరెవరూ పదేళ్లుగా నాన్న ముఖాన్నికూడా చూడటానికి రాలేదు. వెంకటేష్ మన నాన్నగారికి అన్నిరకాల సేవలుచేసి మనమందరము లేని లోటు పూడ్చాడు. అతనికి ఏమీ ఇద్దామనిపించటం లేదా..” 


“అదేంటి.. ఇన్నాళ్లు వాళ్ళ అవసరాలు అన్నీ నాన్నే తీర్చాడు. పైగా మన అవుట్ హౌస్ లోనే వాళ్ళందరూ వున్నారు కదా” అని పెద్దబ్బాయి శ్రీధర్, పద్మా ఇద్దరూ అన్నారు.

 

“ఏమి మనుషులురా మీరు? మానవత్వమే మర్చి పోయినట్లున్నారు. మీరందరూ ఏమి ఇవ్వకపోయినా నాకొచ్చేదాంట్లోనుంచి ఒక పాతిక లక్షలు అతనికి ఇస్తాను. అక్కాయి రేపో మాపో ఇల్లు అమ్మేస్తుంది. అతను వున్న ఫళాన ఎక్కడికి పోతాడు, తనుకూడా మనకంటే కొంచెమే పెద్దే కదా.”


అయినా ఎవరూ ఏమీ మాట్లాడలేదు. 


రెండో అబ్బాయి రెండో రోజు, పద్మగారికి ఇల్లు అమ్మటానికి పవర్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి, మూడో రోజు వెళ్ళిపోయాడు. మిగతా ఇద్దరూ 15 రోజులు ఉండి అమెరికా వెళ్లిపోయారు. 


***

Dr మునగా రామ మోహన రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/ramamohan

ree

Dr మునగా రామ మోహన రావు గారు ఏలూరు , AP లో జన్మించారు, స్వయంకృషితో దేశీయ మరియు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించారు ,

4 మాస్టర్ డిగ్రీలు మూడు PhD లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన Harvard మరియు MIT ( Boston USA ) నుండి certificate of achievement పొందారు ,

భారతీయ మరియు విదేశీ multinational కంపెనీలలో leadership హోదాలలో పనిచేసి కార్పొరేట్ CEO గా రిటైర్ అయ్యారు .

తన రిటైర్మెంట్ కోసం దాచుకున్న 35 సంవత్సరాల సేవింగ్స్ నుంచి సింహభాగం అంటే షుమారు మూడు. కోట్ల రూపాయలు ( Rs 3 Crores )వెచ్చించి 2000 మంది నిరు పేద విద్యార్ధినుల చదువుకోసం 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం తో ప్యాలెస్ లాంటి దివ్య భవనాన్ని స్వీయ పర్యవేక్షణలో నిర్మించి దానం చేసారు .

ఇంకా సమాజం కోసం ఎన్నో దాన ధర్మాలు చేశారు , విద్యకోసం ఇంకా తనవంతు కృషి చేస్తూనే వున్నారు.


Start up companies కి సలహాదారుగా కూడా వున్నారు. IFMR లాంటి వున్నత management స్కూల్ లో visiting ప్రొఫసర్ గా విద్యను కూడా బోధించారు మరియు చాలా మంది సీనియర్

Management executives ని సమాజానికి అందించారు.



Comments


bottom of page