రాందాస్ మాస్టరు
- Srinivasarao Jeedigunta
- 4 days ago
- 5 min read
#JeediguntaSrinivasaRao, #RamdasMaster, #రాందాస్, #JeediguntaSrinivasaRao, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Ramdas Master - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 10/05/2025
రాందాస్ మాస్టరు - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రాందాస్ గారు గవర్నమెంట్ స్కూల్ తెలుగు టీచర్. ఆయన క్లాస్ కి పక్కన క్లాస్ స్టూడెంట్స్ కూడా వచ్చి ఆయన పద్యాలు రాగయుక్తం గా పాడుతూ పాఠాలు చెప్పుతో వుంటే, నిశ్శబ్దంగా వినే వారు. అప్పట్లో టీచర్స్ కి యిప్పుడులా లక్షల జీతాలు లేవు. బతకలేక బడిపంతులు అనే వాళ్ళు.
దాసు గారికి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు. మిగిలిన టీచర్స్ లా ట్యూషన్ చెప్పి నాలుగు రూపాయలు సంపాదించి సంసారాన్ని పోషించుదాము అనుకుంటే, తెలుగు చెప్పించుకోవడానికి ఎవ్వరూ రాకపోవడం తో మొదటి వారం నుంచి కిరాణా షాపులో అప్పు పెట్టడం అలవాటైపోయింది.
తండ్రి నుంచి వచ్చిన పెద్ద దొడ్లో చిన్న పెంకుటిల్లు వుండటం తో అద్దె బాధ తప్పింది. ఆయన క్లాస్ లో టెన్త్ క్లాస్ చదువుతున్న సూర్య అనే స్టూడెంట్ అంటే చాలా యిష్టం. అలాగే సూర్య కూడా దాస్ గారింటికి వెళ్లి ఆయన దగ్గర తెలుగు వ్యాకరణం నేర్చుకునే వాడు.
దాస్ గారికి బట్టతల, ఆ తలమీద గోలికాయ అంత లంప్ వుండేది. కొంతమంది అల్లరి పిల్లలు ఆయన కనిపించగానే అదిగో గోళీగారు వస్తున్నారు అని వెకిలిగా కామెంట్ చేసేవాళ్ళు. దాస్ గారు కూడా కొన్నాళ్ళు పిల్లల కామెంట్ పట్టించుకోలేదు కానీ వాళ్ళ మాటలు భరించలేక రెండు రోజులు సెలవు పెట్టి లంప్ ని ఆపరేషన్ చేయించుకున్నాడు.
రెండు రోజుల సెలవు అయిన తరువాత నున్నటి తలతో స్కూల్ లో దాస్ గారు కనిపించడం తో ఎవ్వడో కుర్రాడు ఒరేయ్ కట్ గోళీ గారు వస్తున్నారు అనడం తో చివరికి దాస్ గారికి ఆ పేరు ఉండిపోయింది. తోటి టీచర్స్ కూడా అదే పేరుతో మాట్లాడుకునే వారు. యిహ చేసేది లేక దాస్ గారు కూడా ఆ పిలుపు కి అలవాటు పడిపోయారు.
సూర్య టెన్త్ క్లాస్ మంచి ర్యాంక్ లో పాస్ అయ్యాడు. దాస్ గారు తన గుర్తుగా మంచి పెన్ను గిఫ్ట్ గా యిచ్చారు. కాలం రివ్వున జరిగిపోతోంది.
యిప్పుడు సూర్య చీఫ్ జనరల్ మేనేజర్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ కి.
వారం లో నాలుగు రోజులు క్యాంపు లో ఉంటాడు. పెద్ద గవర్నమెంట్ క్వార్టర్స్ లో నివాసం. అతని భార్య వినత పిల్లాడి ని చూసుకుంటో సూర్య కి తోడుగా ఉంటుంది.
‘అబ్బా! ఈయన యింకా రెండు రోజులు వరకు క్యాంపు నుంచి రారు, ఏమిటో పేరుకి పెద్ద ఉద్యోగం కాని ఇంటిపట్టున వుండి పెళ్ళాం పిల్లలతో గడపలేరు’ అనుకుని కాలింగ్ బెల్ మ్రోగడం తో సోఫాలో నుంచి లేచి తలుపు తీసింది.
ఎదురుగా ఖాది చొక్కా, ముతక పంచే భుజం పైన కండువా తో డబ్భై ఏళ్ళ మనిషి నిలబడి వున్నాడు.
సహజం గా బ్రాహ్మణ కుటుంబం కావడంతో చాలా మంది బీద బ్రాహ్మణులు ఏదో ఒక సహాయం కోసం వస్తో ఉండటం, వాళ్ళకి కాదు అనకుండా ఇంతో అంతో డబ్బు యిచ్చి పంపించే అలవాటు సూర్య కి.
“ఆయన లేరు, క్యాంపు లో వున్నారు. తరువాత రండి” అంది చిరాకుగా.
“సార్ వస్తే ఈ లెటర్ ఇవ్వండి” అని ఒక చిన్న పేపర్ మీద ఏదో రాసి యిచ్చాడు.
సరే అని తలుపు వేసుకుంది.
ఆ రోజు క్యాంపు నుంచి వచ్చిన భర్త కి భోజనం పెడుతో “మీరు ఊరిలో వున్నప్పుడు బీద బ్రాహ్మణులమని సహాయం కోసం వస్తున్నారు. అదే అలవాటు తో మీరు క్యాంపు లో వున్నప్పుడు వచ్చి విసిగిస్తున్నారు” అంది.
“పోనీ ఒక వంద రూపాయలు యిచ్చి పంపితే మనం బీదవాళ్ళం అయిపోము కదా! వాళ్ల మీద విసుగుకోవడం ఎందుకు?” అన్నాడు చేతులు కడుగుకుంటో.
“అన్నట్టు మొన్న ఒక ముసలాయన వచ్చాడు. మీరు లేరని చెప్పాను. ఏదో కాయితం యిచ్చి మీకు ఇమ్మన్నాడు. ఎక్కడో పెట్టాను, గుర్తుకు రాగానే యిస్తాను” అంది.
ఒక గంట తరువాత “యిదిగో ఆయన యిచ్చిన కాయితం” అంటూ యిచ్చింది వినత.
కాయితం లో ‘చిరంజీవి సూర్యాకి.. నేను నీ తెలుగు టీచర్ రాందాస్ ని. గుర్తుకు వచ్చానా.. మా అబ్బాయి యిక్కడే జాబ్ చేస్తున్నాడు. నేను, మా ఆవిడా కొన్నిరోజులు మా అబ్బాయి దగ్గర వుండి మళ్ళీ మన వూరికి వెళ్ళిపోతాము. నువ్వు యిక్కడే పెద్ద ఆఫీసర్ గా ఉన్నవని తెలిసి నిన్ను చూడాలి అని వచ్చాను. నీకు వీలుంటే ఈ నెంబర్ మా అబ్బాయిది, ఫోన్ చేస్తే మాట్లాడుతాను’ అని వుంది.
“యిదిగో వినీ, యింటికి ఎవ్వరైనా వస్తే వివరాలు తెలుసుకోకుండా పంపించేయడమేనా, నా ఉద్యోగంతో నాకే గర్వం రాలేదు, నీకు ఎక్కువైంది, ఆ వచ్చిన ఆయన మా మాస్టర్ గారు. యింటికి తెలియని వాళ్ళు వస్తే వాళ్ళు మన సహాయం కోసం వచ్చారని తలుపులు వేసేయడం నీకు బాగా అలవాటు అయ్యింది”అన్నాడు కోపంగా.
“బాగానే వుంది. ఆ వచ్చిన ఆయన మీకు టీచర్ అని నాకేం తెలుసు, వేసుకున్న బట్టలు చూస్తే అలా అనిపించలేదు” అంది వినత.
వెంటనే రాందాస్ గారు యిచ్చిన నెంబర్ ని చూసి ‘అరే.. యిది మా టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఆఫీసు వాళ్ల ఫోన్ లా వుంది. అనుకుంటూ ఫోన్ చేసాడు.
“నమస్కారం సార్, నాన్నగారికి యిస్తున్నాను” అంటూ అతి వినయంగా జవాబు వచ్చింది.
“సూర్యానా, ఎలా వున్నావు, అబ్బా ఎన్ని రోజులైంది నీ మాట విని, నువ్వు ఫోన్ చెయ్యడం చాలా ఆనందంగా వుంది నాయనా” అన్నారు రాందాస్ గారు.
“అదేమిటి మాస్టర్.. మిమ్మల్ని ఎలా మర్చిపోగలను, మీ ఆరోగ్యం, మేడం ఆరోగ్యం ఎలా వుంది, మీ అమ్మాయి ఎక్కడ వున్నారు?” అని అడిగాడు సూర్య.
“అమ్మాయి బెంగళూరు లో వుంది. అల్లుడు కాలేజీ లో లెక్చరర్. అబ్బాయి యిక్కడే మీ డిపార్ట్మెంట్ లోనే జూనియర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు” అన్నారు.
“ఓహో మా ఆఫీసులోనా.. నాకు తెలిసి వుంటే కలిసే వాళ్ళం, మీ అబ్బాయి కి ఫోన్ యివ్వండి” అని వాళ్ల అబ్బాయి తో మాట్లాడి, “రేపు ఆదివారం కదా! మీ యింటికి వస్తాము, లొకేషన్ పెట్టండి” అన్నాడు సూర్య.
“సార్! మీకు ఎందుకు శ్రమ.. మా నాన్నగారిని తీసుకొని మీ యింటికి వస్తాము” అన్నాడు.
“మా మాస్టర్ ని చూడటానికి నేను రావాలి కాని ఆయనని నా దగ్గరికి పిలిపించుకోకూడదు, మీరు లొకేషన్ పంపండి” అని ఫోన్ పెట్టేసాడు.
“యిదిగో రేపు ఉదయం మా మాస్టర్ ఇంటికి వెళ్తున్నాము. అటెండర్ ని పంపి నాలుగు రకాల పండ్లు, స్వీట్స్ తెప్పించు, కొద్దిగా ఎక్కువ తెప్పించు” అన్నాడు.
ఉదయం 9 గంటలకు భార్య ని తీసుకుని రాందాస్ మాస్టర్ గారి అబ్బాయి యింటి లొకేషన్ కి వెళ్ళాడు. మధ్యతరగతి వాళ్ళు వుండే ఏరియా. అడ్రస్ ప్రకారం మూడు ఫ్లోర్ల అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లారు. మాస్టర్ గారు వుండేది మూడవ ఫ్లోర్, లిఫ్ట్ లేదట. డ్రైవర్ పండ్ల బుట్ట పట్టుకుని వస్తో వుండగా మెల్లగా మెట్లు ఎక్కుతున్నారు.
రెండవ ఫ్లోర్ లోనే మాస్టర్ గారి అబ్బాయి ఎదురు వచ్చి “సార్! యిది చిన్న అపార్ట్మెంట్ అవడంతో లిఫ్ట్ లేదు, మీకు శ్రమ కలిగించినందుకు క్షమించండి” అన్నాడు భయపడుతూ.
అచ్చు మాస్టర్ గారి పోలికలే. “మీ పేరు ఏమిటి?” అన్నాడు సూర్య.
“కృష్ణదాస్ సార్” అన్నాడు.
మొత్తానికి మూడవ ఫ్లోర్ కి వచ్చారు. అది రెండు పడకగదుల ఫ్లాట్, ఉన్నంతలో నీట్ గా వుంది.
పడక కుర్చీలో కూర్చుని భాగవతం చదువుకుంటున్న మాస్టర్, అలికిడి కి పుస్తకం లోనుండి తల పైకెత్తి చూసి గబుక్కున లేచి నుంచుని “నువ్వు మా సూర్యావేనా” అంటూ వచ్చి గట్టిగా కౌగిలించుకుని వెంటనే వదిలేసి “క్షమించు బాబూ.. నువ్వు యింకా చిన్నప్పుడు శిష్యుడువని అసౌకర్యం కలిగించాను, యిలా వచ్చి కూర్చో” అంటూ పడక కుర్చీ చూపించారు రాందాస్ గారు.
“మాస్టర్.. నేను మీ సూర్యాన్నే” అంటూ మాస్టర్ గారిని తీసుకుని వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోపెట్టి ఆయన కాళ్లకు నమస్కారం చేసుకున్నాడు.
డ్రైవర్ పళ్ళబుట్ట అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు.
“ఈమె నా భార్య వినత, మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మీరు మా మాస్టర్ అని తెలియక ఏమైనా ఆమర్యాదగా మాట్లాడి వుంటే క్షమించండి” అని మాస్టర్ రెండు చేతులు పట్టుకున్నాడు.
“అయ్యో అటువంటిది ఏమిలేదు సూర్యం” అని లోపల నుంచి తన భార్య ని పిలిచి “మన సూర్యం.. చిన్నప్పుడు మన యింటికి వచ్చేవాడు గుర్తుందా” అన్నారు.
సూర్యం వినత యిద్దరూ ఆవిడ కాళ్ళకి నమస్కరించారు. వినత బ్యాగ్ లో నుంచి పట్టు చీర తీసి ఆవిడకి యిచ్చింది. మాస్టర్ గారికి సూర్యం పట్టుపంచే యిచ్చి “దీవించండి మాస్టర్, మీ వల్లే నేను యింతటి వాడిని అయ్యాను” అన్నాడు.
“నాది ఏముంది సూర్యం. నీ కృషి వల్ల అభివృద్ధిలోకి వచ్చావు” అన్నారు రాందాస్ గారు.
“మాస్టర్ గారూ! మిమ్మల్ని మేడంని తీసుకుని వెళ్లి ఈ చుట్టుపక్కల వున్న గుళ్ళు అన్నీ చూపిస్తాను. ఎల్లుండి ఉదయం బయలుదేరి వెళదాం. మీరు రెడీగా వుండండి, ఈ శిష్యుడి కోరిక మన్నించాలి” అన్నాడు సూర్య.
మాస్టర్ గారికి యాదగిరిగుట్ట, భద్రాచలం, వరంగల్ రామప్ప గుడి, మొదలైన టెంపుల్స్ తీసుకుని వెళ్లి ప్రత్యేక దర్శనం పూజలు చేయించాడు. ఈలోపు ఆఫీస్ వాళ్ళని అడిగి మాస్టర్ గారి అబ్బాయి కృష్ణదాస్ పరిస్థితి తెలుసుకున్నాడు.
అతనిని పదిరోజుల క్రితం అనంతపురం ట్రాన్సఫర్ చేసారని తెలుసుకున్నాడు. అతనికి ప్రమోషన్ లిస్ట్ లో రెండు సారులు అవకాశం ఇవ్వలేదు అని కూడా తెలుసు కున్నాడు. బహుశా మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ట్రాన్సఫర్ ఆపమని అడగటానికి వచ్చారు అని గ్రహించి, కృష్ణదాస్ ట్రాన్సఫర్ ఆర్డర్స్ కాన్సల్ చేసి ప్రమోషన్ కూడా యివ్వమని ఆర్డర్స్ వేసాడు.
యాత్రలు పూర్తి అయిన తరువాత మాస్టర్ గారి దగ్గర సెలవు తీసుకుంటూ, “మీ అబ్బాయిని ప్రమోషన్ మీద హైదరాబాద్ లోనే ఉంచుతున్నాను” అని చెప్పాడు.
“సూర్యం! నిన్ను యిది అడగటానికే మీ యింటికి వచ్చాను. ఆతరువాత నువ్వు నన్ను చూడటానికి వచ్చినప్పుడు అనిపించింది ఎప్పుడో చెప్పిన చదువుని, చనువుని ఉపయోగించి నిన్ను గురుదక్షిణ అడగటం న్యాయం కాదు అని. కాని నువ్వు నిజమైన శిష్యుడువి కావడంతో నా మనసులోని కోరిక తీర్చి నేను అడగకుండానే గురుదక్షిణ సమర్పించావు. కలకాలం సుఖంగా ఆరోగ్యం గా వుండు నాయనా” అని దీవించారు.
జీవితంలో యింత ఆనందం ఎప్పుడు అనుభవించలేదు అనుకుంటూ యింటికి చేరుకున్నాడు సూర్య.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


コメント