top of page

తేల్ మాలిష్! బాడీ మాలీష్!!

#ThelMalishBodyMalish, #మాలిష్, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Thel Malish Body Malish - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 09/05/2025

తేల్ మాలిష్ బాడీ మాలీష్ - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


అనకాపల్లి ఉడ్ పేట చదువుల వారి వీధి అది. మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటుతోంది. 


ఇంట్లో వంటరిగా లోకనాథానికి ఏమీ కాలక్షేపం అవడం లేదు. కరెంటు పోయి చాలసేపైంది. టీ వీ పనిచెయ్యడం లేదు. కాలక్షేపం లేక పిచ్చెక్కుతోంది. 


పగలే దొంగలు తాళాలు పగలకొట్టి ఇళ్లు దోచేస్తున్నారని వార్తలు వస్తుండటం, పోలీసువాళ్లు ఇంట్లో వారు పైకి వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చెస్తుండటంతో దగ్గరి బంధువుల పెళ్లికి భార్యను, కూతుర్నీ పంపి ఇంటికి కాపలాగా లోకనాథం ఉన్నాడు. పేపరు ఉదయమే చదివేసినప్పటికీ కాలక్షేపం కోసం మళ్లా తిరగేస్తున్నాడు. ఒట్టి భోలా మనిషి. ఏదీ దాచుకోడు. ఎవరైన కొంచం పొగిడితే చాలు వాగుడు మొదలెడతాడు. లోకనాథం ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ వైద్య పరంగా నిర్బంధ పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. 


వీధి అరుగు మీద వాలు కుర్చీ వేసుకుని పేపర్లో సినేమా బొమ్మలు, ప్రకటనలు చూస్తున్నాడు. ఇంతట్లో వీధిలో " తేల్ మాలిష్, బాడీ మాలీష్, " అంటూ అత్తరు సాయిబు అరుచుకుంటూ వెళ్తున్నాడు. 


ఆ అరుపులు విన్న లోకనాథం పేపరు పక్కన పెట్టి అత్తరు సాయిబ వైపు ఒక లుక్కేసాడు. ఆరడుగుల ఎత్తు కండలు తిరిగిన శరీరం, నెత్తిమీద రూబీటోపీ పొడవు చేతుల సిల్క్ చొక్కా మీద నిలువు గీతలు, పైన బూడిద రంగు వేస్టుకోటు, కింద మలేషియా పువ్వుల లుంగీతో చేతిలో పొడవైన రంగుల సిల్క్ తాళ్లతో వివిధ ఆకారాల సీసాలలో సుగంధ అత్తర్లు, నూనెలు వేలాడుతు మనిషి మంచి బందోబస్తుగా కనబడుతున్నాడు. 


ఎప్పటినుంచో ఒళ్లు నొప్పులతో బాధ పడుతున్న లోకనాథానికి అత్తరు సాయిబును చూడగానే అవన్నీ బయటపడ్డాయి. 


"ఓ అత్తరు సాయిబూ, ఇటురా" అని పిలిచాడు. 


"ఏం సారూ, కాళీగా కూసున్నారు. మాలీష్ చెయ్యాలా? " అన్నాడు. 


 "ఆ, చెయ్యాలి సాయిబూ! బాగా చేస్తావా?"అడిగాడు లోకనాథం. 


 "ఒక్కసారి నా చేత బాడీ మాలిష్ చేయించుకుంటే మళ్లీ మళ్ళీ చేయించుకుంటారు. " గేస్ కొట్టాడు సాయిబు. 


"దొరా ! దుబాయ్, ఇరాన్, హైదరాబాద్ మాలీష్ లన్నీ వచ్చు. మాతాత హైదరాబాదు ఎల్లి అక్కడి బాడీ మాలీషులన్నీ నేర్చి పిఠాపురం దివాణం గారికి సేవచేసేవాడట. అక్కడ మానాన్న, తాత గగ్గర నేర్చుకుని నాకు నేర్పినాడు. ఇప్పుడు దివాణాలు పోయినాక ఇలా రోడ్లంట తిరగాల్సి వస్తోంది సారూ. మీ ఒంటికి హైదరాబాద్ మాలీష్ చక్కగా ఉంటాది. "


 "ఎంత తీసుకుంటావేమిటి?" అడిగాడు లోకనాథం. 


 "పనితనానికి ధర ఏమిటి దొరా! మామూలుగా నా రేటు యాబై. చేసాక నా పనితనం చూసి వంద ఇచ్చిన వారున్నారు. ఇంకా పెద్ద మారాజులు వంద పైన ఇచ్చినవారున్నారు. దొరా! ముందు బోణీ బేరం మీదే. " అంటూ భుజాన వేలాడుతున్న నూని సీసాలు పక్కన పెట్టాడు. 


"ఆగాగు సాయిబూ, ఇక్కడ కాదు. ఇంట్లో చేద్దువుకాని" అని వీధి తలుపులు దగ్గరగా వేసి హాల్లో బనీను విప్పి లుంగీ మడిచి సోఫా కుర్చీలో కూర్చున్నాడు లోకనాథం. 


లోకనాథం శరీరాన్ని చూసి "సారూ, మీ బాడీ పహిల్వాన్ బాడీలా కండలు తిరిగి మంచి పట్టుమీదుంది. ఏం తింటున్నారేటి ? " అంటూ సాయిబు మళ్ళీ పంపు కొడుతుంటె లోకనాథం తబ్బిబ్బవుతు  "మా తాతలు నేతులు తాగేవారట. నేను నేతులు తాగకపోయినా వారి వారసత్వంతో బాడీ మైంటైన్ చేస్తున్నానంటు" సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు లోకనాథం. 


అసలే బట్టతల, దాని మీద సాయిబు తల నూని చేతిలో పోసుకుని నడి నెత్తి మీద మద్దెల వాయించినట్టు లప్ తప్ మంటూ చేతి వేళ్లకు పని చెబుతున్నాడు. అలా నూని మర్దన

చేస్తుంటే లోకనాథానికి స్వర్గం కనబడుతోంది. 


అత్తరు సాయిబు తన పనితనం చూబెడుతూ నూనితో నుదుడు, కొత్తెం, చెవుపైన చెంపలు, మెడ అలా భుజాలు నడుం, వీపు తొడలు కాలి పిక్కలు నూనితో మాలీష్ చేస్తుంటే లోకనాథం

అదో రకమైన మైకంలో తేలిపోతున్నాడు. బాడీ మాలిష్ చేస్తూనే అత్తరు సాయిబు ఇల్లంతా పరిశీలనగా గమనించ సాగేడు. ఇంట్లో ఇంకెవరు లేనట్టు నిశ్శబ్దంగా కనిపించింది. 


"ఏంటి సార్! ఇంట్లో ఒక్కరే కానొస్తున్నారు. అమ్మ గారు ఊరెళ్లారా?" మరొకసారి నెత్తి మీద చేతి వేళ్ల పనితనం కనబరుస్తు కోటు జేబులోంచి చిన్న సీసా మూత తీసి వాసన చూపించాడు అత్తరు సాయిబు. 


"మా ఆవిడ పిల్లలు కశింకోట పెళ్లి కెళ్లారయ్యా! ఈమధ్య పగలే దొంగతనాలు జరుగుతున్నాయని నేను ఇంటి కాపలాగ ఉండిపోయాను" మగతగా చెప్పేడు. 


"సారూ, తల దిమ్ము తగ్గిందా? ఒంటి నెప్పులు సర్దుకున్నాయా" అని సాయిబు అడుగుతూంటే "సాయిబూ, నిజంగా కళ్ల ముందు స్వర్గం చూపెడుతున్నావయ్యా " అంటూనే సోఫా కుర్చీ వెనక

 తల వాల్చి మగతలో పడ్డాడు. 


 "సారూ, సారూ " అని తట్టిలేపాడు లోకనాథాన్ని. 


 ఇంకెక్కడి లోకనాథం, ఈ లోకాన్ని వదిలి స్వర్గలోకంలో విహరిస్తున్నాడు. 


మాలిష్ వాలా రూపంలో ఉన్న ఖాసీం సాయిబు పగటిదొంగ. తన కోటులోపలి జేబులో దాచిన తాళాల గుత్తి మారుతాళంతో  బెడ్ రూంలో ఉన్న ఐరన్ బీరువా తలుపు తెరవగా సాయిబు కళ్లు 

జిగేల్ మన్నాయి. వెయ్యి, ఐదు వందల నోట్ల కట్టలు కనబడ్డాయి.  పక్కన సీక్రెట్ అరలో బంగారు వస్తువులు ధగధగమంటున్నాయి. 


"ఇంకెందుకు ఆలశ్యం! భలే చాన్సులే " అంటూ అక్కడే అందుబాటులో ఉన్న రెడీమేడ్ బట్టల చేతిసంచీలో నోట్ల కట్టలు, బంగారు వస్తువులు చక్కగా సర్ది "ఆయ్, అల్లా! ఈదుకా సమయంలో

పెద్ద తోఫా ఇచ్చినావు" అని హాల్లోంచి బయటపడి వీధి తలుపులు దగ్గరిగా లాగి ఉడాయించాడు అత్తరు సాయిబు. 


మధ్యాహ్నం మూడైంది. లోకనాధం భార్య భవాని పెళ్లి చూసుకుని విందుభోజనం పూర్తి చేసి కూతురుతో ఇంటి ముందు ఆటో దిగింది. 

 

మెట్లెక్కి తలుపు తట్టకుండానే తెరుచుకున్నాయి.  'ఏమిటీ మనిషి? వీధి తలుపులు వేసుకోకుండా లోపల ఏం చేస్తున్నారనుకుంటు' హాల్లో కాలు పెట్టింది. 


హాయిగా సోఫా కుర్చీలో గుర్రు పెడుతూ నిద్రపోతు కనిపించాడు లోకనాథం


'ఏమండీ' అని పిలిచినా లేవకపోయేసరికి వంటగదిలోంచి చల్లటి నీళ్లు తెచ్చి మొహం మీద జల్లేసరికి స్వర్గం నుంచి భూలోకాని కొచ్చిన లోకనాథం. 


"భలేగా చేసావయ్య, తేల్ మాలిష్! మజా వచ్చింది " అంటూ కళ్లు తెరిచాడు మగతగా. 


ఎదురుగా భార్య భవాని చండిలా ఉగ్ర రూపంతో పళ్ళు కొరుకుతు కనబడింది. 

 

"మీరెప్పుడొచ్చారు?" అంటూ కళ్లు నులుముకుంటూ తేల్ మాలిష్ వాలా ఏడీ ? సాయిబు చేతిలో ఏం మాయ ఉందో కానీ భలేగా తల మర్ధన చేసాడు. అరె 'ఏడీ' డబ్బులు తీసుకోకుండా వెళ్లి పోయాడా? " అంటున్నాడు అమాయకంగా. 


విషయం తెల్సిన భవాని కంగారుగా బెడ్రూమ్ కెళ్ళి చూస్తే కొంప కొల్లేరైంది. 


"మీ తేల్ మాలిష్ మండా! వాడు తేల్ మాలిష్ వాడు కాదు. పగలు ఇళ్ల తాళాలు పగలకొట్టే గజదొంగ. బెడ్రూమ్ బీరువా మారు తాళాలతో తెరిచి నా బంగారం నగలు, ఆఫీసులో ఒక పార్టీ ఇచ్చిన యాబై వేలు రేపు బ్యాంక్ లో వేద్దామని బీరువాలో ఉంచాను. అంతా దోచేసాడు దొంగ వెధవ " అని బావురుమంది భవాని. 


"పోలిసులకు ఫోన్ చెయ్యి. వెంటనే రిపోర్టిద్దాం. ఈమధ్య పోలీసులు చాలా బాగా రియాక్టు అవుతున్నారు. వాడు పొలిమేరలు దాటకుండా పట్టుకుంటారు" అమాయకంగా ఉచిత సలహా లిస్తున్నాడు లోకనాథం. 


రెవిన్యూ ఆఫీసులో సీనియర్ సూపరిండెంటుగా బాగా లంచాలు మరిగి డబ్బు సంపాదించిన భవాని మండిపడుతూ పోలీసు కంప్లైంటు ఇస్తే నేను, మీరూ జైల్లో ఉంటాం. ఇన్ కం టాక్స్ రైడింగ్ జరిగితే ఇంత డబ్బు బంగారం ఎక్కడినుంచి వచ్చాయని నిలదీస్తే జైలే గతి. 


 తేలు కుట్టిన దొంగలా పడుండాల్సిందే అనుకున్నారు ఇద్దరూ. మొత్తానికి తేల్ మాలిష్ వాలా బాగా తలకి క్షవరం చేసాడు. 


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page