అవ్వస్వామి
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- May 9
- 8 min read
#Avvaswamy, #అవ్వస్వామి, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ,#TeluguHeartTouchingStories

Avvaswamy - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 09/05/2025
అవ్వస్వామి - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
"ఆటోబాబూ!.... శివాలయం వచ్చిందా!...."
"వచ్చిందవ్వా!.... మనం గుడి ముందే వుండాము..."
"బాబూ!.... ఆటోని ఆపయ్యా!... అవునూ, నీ పేరు..."
"శంకర్ అని చెప్పా కదా అవ్వా!...."
"ఆ...ఆ... చెప్పావ్!... వయస్సు అయింది కాదా బాబూ, జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. తప్పుగా అనుకోకయ్యా, అవునూ ఇంతకీ నీవు ఎవరి అబ్బాయివి?" ఆటో దిగుతూ అడిగింది అవ్వ.
"మాలకొండయ్య చిన్న కొడుకుని. అవ్వా!... మా వూరి జనం నీకు తెలుసా!...." ఆటో శంకర్ ప్రశ్న…
అవ్వ వయస్సు యాభై ఏళ్ళలోపే, కానీ భూతకాలం జీవిత గమనం మనో క్లేశం (దుఃఖం) కారణంగా డెభ్భై ఏళ్ళ ముసలితనం ఏర్పడింది. ముక్కు మీదికి జారిన అద్దాలను ఎగతోసుకొని శంకర్ ముఖంలోకి చూచింది.
’నన్ను ఈ వూరినించి పంపించినోడేరా నీ అబ్బ.... కిరాతకుడు!...’ అనుకొంది అవ్వ.
"వెళుతున్నా అవ్వా!..." అన్నాడు శంకర్.
తల ఆడించింది అవ్వ.
శంకర్ ఆటోలో వెళ్ళిపోయాడు. అవ్వ ఆలయ సింహ ద్వారాన్ని (గేటు) సమీపించింది.
’తండ్రి సర్వేశ్వరా!..... ఎన్నాళ్ళకెన్నాళ్ళు!.... ముఫ్ఫై ఐదు సంవత్సరాలు గడిచినాయి. గుర్తుపట్టావా సామీ నన్ను... నేనయ్యా నీ అవ్వను, నీ ఆలయం చుట్టూ వూడ్చి నీళ్ళు చల్లి, వీధి గేటు కాడ ముగ్గులు ఏసిన, నీ సేవకురాలిని సామీ!... నీ అవ్వను....’ అనుకొంటూ, మెల్లగా గేటు దాటి ధ్వజస్థంభాన్ని సమీపించి మెడను పైకెత్తి గాల్లో యాభై అడుగుల ఎత్తు వున్న దాని పై భాగాన్ని తన మెడను సాచి పైకి చూచి.....
"అయ్యా!.... సామీ శివయ్యా!.... చాలయ్యా ఈ బతుకు, వూరిని....నిన్నూ... ఓసారి ఆ బండ సామిగాడ్ని సూడాలనొచ్చినా, వాడు బతికి వుండాడా!... పైకిలాగేసినావా!... సామీ!....’ అంటూ శ్రీ పరమేశ్వరులను తలచుకొంది అవ్వ....
.
అవ్వ అనేపేరు వినేదాని ఆశ్చర్యంగా వింతగా వుంది కదూ!... దానికి ఒక కారణం... కథా వుంది.
*
అవ్వ అమ్మపేరు అలిమేలు. తండ్రి వెంకన్న. పెండ్లి అయిన రెండూ సంవత్సరాలకు తొలి కాన్పు, రెండేళ్ళ తరువాత మరో కాన్పు, ఆ రీతిగా ఐదు కాన్పులను పదేళ్ళలో కన్నది అలిమేలు, పుట్టిన ఐదుగురూ ఆడపిల్లలే. అందరూ రెండు మూడూ నెలలు బ్రతికి గతించారు. ఒక్కబిడ్డ కూడా బ్రతకనందుకు వెంకన్న అలిమేలు, చాలా బాధపడ్డారు. ఆ వూరి శివాలయం పూజారి సాంబయ్య గారి తల్లి పార్వతమ్మ, అలిమేలు వారి ఇంట్లో పనిచేసేది. వెంకన్న వూరి కాపరి. రాత్రి సమయాన.
ఒకరోజు పని ముగించి అలిమేలు…
"పెద్దమ్మగోరు ఇంటికి ఎలతుండా పనంతా అయినాది" చెప్పింది అలిమేలు.
"అలిమేలూ!..."
"పెద్దమ్మగోరూ!..."
"ఏమో ఇంకా ఏమీ అనుకోలేదా!... రెండేళ్ళు అయింది కదే!...." అడిగింది పార్వతమ్మ.
"అమ్మా!... ఎందుకమ్మా!... తొమ్మినెల్లు మోయడం, నరకయాతనతో కనడం, ఆ బిడ్డ రెండు మూడు నెలల్లో చావడం ఇలాగే కదమ్మా ఐదుసార్లు జరిగినాది. బిడ్డల మీదా ఆశ పోనాదమ్మ!" విచారంగా చెప్పింది అలిమేలు.
"ఓసేయ్!... అలిమేలు, నాకెందుకో అనిపిస్తూ వుందే!.... ఈసారి నీకు పుట్టె బిడ్డ లక్షణంగా బ్రతుకుతుందని, ఆ బిడ్డకు అవ్వ అనే పేరు పెడతానని ఆ శివయ్యకు మొక్కుకో!... నా మాట విను" చెప్పింది పార్వతమ్మ.
తలాడించి ఇంటికి పోయింది అలిమేలు. పార్వతమ్మ చెప్పిన మాటలను భర్త వెంకన్నతో చెప్పింది.
అతని ముఖంలో ఆనందం…
.
అలిమేలు గర్భం దాల్చి ప్రసవించింది. పండంటి ఆడపిల్ల. ఆ పాపకు అవ్వ అనే పేరు పెట్టారు. వెంకన్న, అలిమేలు ఆ బిడ్డను ఎంతో గారాబంగా పెంచారు. అవ్వ ఐదేళ్ల వయస్సు, తెల్లని రంగు కన్ను ముక్కు చక్కని తీరుతో అవ్వ ఎంతో అందంగా వుండేది. తల్లి చెప్పగా తాను శివయ్య వరాన పుట్టానని తెలుసుకొంది. ఆ పార్వతీ పరమేశ్వరుల మీద నమ్మకం భక్తి అవ్వకు చిన్నతనం నుండీ ఏర్పడ్డాయి.
అవ్వను ఆ దంపతులు స్కూల్లో చేర్చారు. స్కూల్లో అవ్వ అధ్యాపకులు చెప్పే విషయాలను అతి శ్రద్ధగా విని, వారు నిర్వహించిన పరీక్షలలో బాగా వ్రాసి ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యేది. ఆ కారణంగా ఉపాధ్యాయులందరూ అవ్వను ఎంతగానో అభిమానించేవారు.
అప్పటికి అవ్వ వయస్సు పది సంవత్సరాలు. ఐదవ తరగతి చదువుతూ ఉంది.
ఆలయంలో ప్రవేశించి అవ్వ మనస్సున గత జ్ఞాపకాలు... మూసి వున్న గర్భగుడి తలుపును సమీపించి దైవానికి నమస్కరించి వచ్చి మండపపు స్థంభాన్ని ఆనుకొని కళ్ళు మూసింది అవ్వ.
*
ఆ గ్రామ అధికారి (సర్పంచ్) మాలకొండయ్య. అలిమేలు వారి ఇంటి పనులను నిర్వర్తిస్తూ అతని భార్య చంగమ్మకు సాయంగా వర్తించేది.
వెంకన్న మాలకొండయ్య పాలేరు. సౌమ్యుడు, నీతిమంతుడు, నిరక్షరాస్యుడు. అమాయకుడు. ఆ దంపతులు ఇరువురు అవ్వను బాగా చదివించాలని కలలు కనేవారు. వెంకన్న అప్పుడప్పుడు బడికి (స్కూలు) వెళ్ళి తన కూతురు చదువును గురించి అధ్యాపకులను అడిగేవాడు. వారు, అవ్వ బాగా చదువుతుందని, మంచి మార్కులు వస్తాయని, క్లాస్ ఫస్టు అని చెప్పేవారు. ఆ మాటలను విన్న వెంకన్నకు ఎంతో ఆనందం. భార్య అలిమేలుతో ఉపాధ్యాయులు అవ్వను గురించి చెప్పిన మాటలను చెప్పేవాడు. తమ కుమార్తె తెలివి తేటలకు ఆ పేద దంపతులు ఎంతగానో సంతోషించేవారు. అవ్వను అతి ప్రేమతో చూచుకొనేవారు. మాలకొండయ్య బావమరిది, తెలంగాణ ప్రాంతపు నల్లకొండవాసి, ఆ గ్రామ పఠేల్ ఫకీరయ్య అక్కా బావను చూచేదానికి ఆ వూరికి వచ్చాడు. తల్లిని కలవడానికి వచ్చిన అవ్వను చూచాడు. కుందనపు బొమ్మలా వున్న అవ్వ, ఆమె మాటలు, మంచితనం.... ఫకీరయ్యకు బాగా నచ్చింది.
వరిని కోసి కుప్పలు వేశారు రైతులు. ఆ కుప్పలకు రాత్రి కావలి వెంకన్న. రాత్రి సమయంలో ఆ గ్రామస్థులు కుప్పలకు కావలిగా ఒంటరిగా చేలల్లోనే వుండేవారు వెంకన్న.
మాలకొండయ్య వైరవర్గం వారు మనుషులను ఏర్పాటు చేసి, అతని పంట కుప్పలను తగులబెట్టించాలని నిర్ణయించుకొని, పొరుగూరి రౌడీలను పిలిచి ఆ విషయాన్ని వారికి చెప్పి కొంత డబ్బును ఆ రౌడీలకు ముట్ట చెప్పారు. విచక్షణారహితులైన ఆ ముగ్గురు రౌడీలు అమావాస్య రాత్రిలో మాలకొండయ్య కుప్పలను తగలబెట్ట వచ్చారు. వారిని చూచిన వెంకన్న తన చేతి కఱ్ఱతో వారిని కొట్టి తరిమే ప్రయత్నించాడు. వారు ముగ్గురు. వెంకన్న ఒక్కడు.. నలుగురి మధ్యన పోరాటం.
ఆ ముగ్గురిలో ఒక అతను వెంకన్నను కత్తితో గుండెల్లో పొడిచాడు. వెంకన్న ’అమ్మా’ అంటూ నేల కూలాడు. ఆ ముగ్గురూ కుప్పలకు నిప్పంటించి పారిపోయారు. అమావాస్య గాంఢాంధకారం దూరంగా నక్కల అరుపులు.
కత్తిపోటు గుండెకు తగిలిన కారణంగా వెంకన్న అరగంటసేపు బాధపడి రక్తహీనతతో శాశ్వతంగా కళ్ళు మూశాడు. భల్లున తెల్లవారింది. కొందరు రైతులు తమ కుప్పలను చూడవచ్చిన వారు, రక్తంతో నేలకూలి చనిపోయిన వెంకన్నను చూచారు. వెంకన్న శవాన్ని అతని ఇంటికి చేర్చారు. ఆ వార్త విన్న ఫకీరయ్య తాను అక్కడ వుంటే తన బావ మాలకొండయ్యతో అటూ ఇటూ ఊరేగాల్సి వస్తుందని అక్కా బావగార్లతో చెప్పి తన వూరికి వెళ్ళిపోయాడు.
తను నమ్మిన బంటు వెంకన్న మరణానికి మాలకొండయ్య అతని భార్య చెంగమ్మ చింతించారు. ఇక వెంకన్న భార్య అలిమేలు కూతురు అవ్వ విచారానికి అవధులు లేవు. కులంవారంతా వారిని ఓదార్చారు. వారితో పాటు వారి ఎదురింటి సామి, పదిహేను సంవత్సరాల బాలుడు, వెంకన్నను మామా మామా అని పిలిచేవాడు. అతని తల్లి పిచ్చమ్మ ఎంతగానో వాపోయారు. మగపిల్లలు లేని వెంకన్నకు, తల్లి పిచ్చమ్మ చెప్పగా సామీ ఖర్మ చేసే కర్తగా నిప్పు కుండను పట్టుకొని సామీ శవానికి ముందు స్మశానం వైపుకు నడిచాడు.
*
విచారంగా తండ్రిని తలచుకొంటూ కన్నీరు కార్చుతున్న అవ్వను సమీపించాడు సామీ.
సామీ వృత్తి, గుడ్డలు కుట్టే మస్తాన్ సాహేబ్ దగ్గర మిషన్ మీద గుడ్డలు కుట్టడం. మస్తాన్ గారి దగ్గర ముగ్గురు పనిచేస్తున్నారు. అందులో సామీ ఒకడు.
అవ్వకు సామీకి ఎదురెదురు ఇండ్లైనందున బాగా పరిచయం ఒకరి పట్ల ఒకరికి గౌరవం అభిమానం.
సామీ తండ్రి లారీ డ్రైవర్. ఆరు ఏళ్ళ క్రిందట యాక్సిడెంట్‍లో మరణించాడు. ఆ కారణంగా ఐదవ తరగతితో, చదువును ఆపి మస్తాన్ సాహేబ్ దగ్గర గాజాలు చేసే పనికి చేరాడు. ఇప్పుడు నెంబర్ వన్ టైలర్. మస్తాన్ గారు అందరి కంటే సామీకి ఎక్కువ డబ్బులు ఇస్తాడు. కారణం సామీ పనితీరు, నాణ్యత, కష్టమర్లను పలకరించి గౌరవించే విధానం.
చిన్నతనం నుండి అవ్వ సామీకి మంచి స్నేఃఅం. ఒకరిపైన ఒకరికి ఎంతో అభిమానం, గౌరవం.
అవ్వ తండ్రి వెంకన్న మరణంతో, తల్లి అలిమేలు ఆవేదనతో మాలకొండయ్య ఇంటికి పనికి సరిగా రోజూ వెళ్ళేది కాదు.
ఒకనాడు చంగమ్మ...
"ఓసేయ్ అలిమేలూ!... నీ ఆరోగ్యం సక్కబడేదాకా నీ కూతుర్ని మనింటి పనికి పంపాలే!... అది చదువు మానేసిందిగా!..." అడిగింది చంగమ్మ.
తలాడించి ఇంటికి వచ్చిన అలిమేలు, చంగమ్మ మాటలను అవ్వతో చెప్పింది. తల్లి ఆరోగ్య పరిస్థితి సరిగాలేనందున అవ్వ మాలకొండయ్య ఇంటికి తన తల్లికి బదులుగా తాను పనికి వెళ్లడం ప్రారంభించింది.
ఆరుమాసాలు సాపీగా సాగిపోయాయి. అలిమేలు ఆరోగ్యం చక్కబడింది. కూతురికి బదులుగా తాను మాలకొండయ్య ఇంటికి పనికి వెళ్ళడం ప్రారంభించింది.
చంగమ్మ అన్న ఫకీరయ్య అక్కా బావను చూడవచ్చారు. అతని దృష్టి అవ్వపైన అలాగే వుంది. తనతో ఈసారి అవ్వను తన వూరికి తీసుకొని వెళ్ళాలని నిర్ణయించుకొన్నాడు. ఆ విషయాన్ని గురించి అక్క చంగమ్మతో మాట్లాడాడు ఫకీరయ్య....
"అక్కా!... వూర్లో మీ మరదలు ఇంటి పనులన్నీ చేసుకోలేక సతమతమైపోతుండాది. ఆ అవ్వ పిల్లని నాతో పంపించు వాళ్ళ అమ్మతో మాట్లాడి మన ఇంటి యవ్వారం నీకు తెలిసిందే కదా!... కళ్ళల్లో పెట్టుకొని సూచుకొంటాం. పెద్దోడు అంజయ్యకు రెండేళ్ళల్లో చదువు పూర్తవుతాది. వాడికి లగ్గం సేద్దాము. కోడలు పిల్ల ఇంటికొచ్చినాక ఆ అవ్వ పిల్లను మీ వూరికి పంపుతా. వాళ్ళమ్మతో మాటాడి అవ్వ పోరిని నాతో మనూరికి పంపే!...." అనునయంగా అడిగాడు ఫకీరయ్య.
చంగమ్మ విషయాన్ని భర్త మాలకొండయ్యతో చెప్పింది. మాలకొండయ్య అలిమేలుతో మాటాడి ఒప్పించి అవ్వను ఫకీరయ్యతో నల్లకొండకు పంపేదానికి ఒప్పించాడు. ’నెలకు మూడువేలు జీతం. కూడూ గుడ్డా తలకు నూనె సబ్బు అన్నీ నా బామ్మర్ది డబ్బుతోనే. ఓ అలిమేలా రెండు మూడేళ్ళు అవ్వ వుండిందంటే, దాదాపు లక్షరూపాయలు నీ చేతిలో వుంటాయ్. ఆ పిల్ల పెళ్ళి బ్రహ్మాండంగా జరిపించొచ్చు. అక్కడ మన పిల్లకు, ఏ కొరతా వుండదు. నా చెల్లి సంపంగి. దాని పిల్లలు ముగ్గురు, నా బామ్మర్ది చాలా మంచోళ్ళు మన పిల్ల అవ్వకు ఆడ ఏ కొరతా వుండదు. నా మాటలు నమ్ము" ఆ రీతిగా అనునయంగా చెప్పి అలిమేలును ఒప్పించాడు మాలకొండయ్య.
తల్లి తనకు చెప్పిన పై విషయాన్ని అవ్వ తన మిత్రుడు సామీకి చెప్పింది.
సామీ మొదట పోవద్దు అని చెప్పాలనుకొన్నాడు. కానీ... కొంతసేపు ఆలోచించాక, అవ్వ ఆ ఫకీరయ్యతో నల్లకొండకు పోవడం మంచిదే అనిపించింది. కారణం దాని పెండ్ళికి రెండు ఏళ్ళలో కొంత డబ్బు చేరుతుంది కదా అనే విషయంరీత్యా....
"అవ్వా!..."
"చెప్పు సామీ!...."
"ఆ ఫకీరయ్యతో నల్లకొండకెల్లు. రెండు ఏళ్ళు వుండు. నేను అమ్మతో అప్పుడప్పుడూ ఆడకి వచ్చి నిన్ను చూస్తుంటా!... నా మాటల నమ్ము. తప్పక నిను చూచేదానికి వస్తా!...." ఎంతో అభిమానంతో చెప్పాడు సామీ!....
"సామీ! నేను నీకు ఒకమాట సెప్పాల!...."
"అదేందో సెప్పు అవ్వా!..."
"సెబుతుండా!...."
"సెప్పు!...."
"నువ్వు కోప్పడకూడదు!..."
"కోప్పడను చెప్పు!.."
"నీవంటే నాకు ఇష్టం. నన్ను పెళ్ళి చేసుకొంటవా!.." దీనంగా అడిగింది అవ్వ.
సామీ పకపకా నవ్వాడు.
"ఎందుకు నవ్వుతున్నావ్?" రోషంతో అడిగింది అవ్వ.
"నీవు చాలా తెలివైనదానివి. మంచిదానివి. నీకు నేను తగను. కానీ... నీవు తిరిగి వచ్చాక, నీకు తగిన మంచి పిల్లోణ్ణి చూచి నీకు లగ్గం ఘనంగా.... గొప్పగా జరిపిస్తా అవ్వా!..." ఎంతో వాత్సల్యంతో చెప్పాడు సామి.
"నాకు నీవు కావాలి!...."
’అవ్వ మాట పట్టింపు కల మనిషి అని సామికి తెలుసు. వాదన తగదు. తాను సంతోషంగా వూరెల్లాల!....’ అనుకొని....
"అవ్వా!.... నీవు వూరు ఎల్లిరా!... నీవు వచ్చాక మాటాడుకొందాం. నీ ఆనందమే నా ఆనందం, సరేనా!..." చిరునవ్వుతో చెప్పాడు సామీ.
అవ్వ ఆనందంగా తలాడించింది.
ఆ మరుదినం... ఫకీరయ్య కార్లో అవ్వ నల్లకొండకు వెళ్ళిపోయింది.
*
అనాదిగా యుగయుగాలుగా చరిత్ర పుటల్లోని సత్యాలు... కొందరి పురుషుల దృష్టిలో స్త్రీ మూర్తి ఆటబొమ్మ. వెలయాలు దేవదాసి. అలాంటివారు జీవితాంతం అవివాహితులుగానే బ్రతుకవలసిన పరిస్థితి. ప్రజాభిమానులు, ధనవంతులు, పరాక్రమవంతులు అయిన పురుష పుంగవులు. తమ గౌరవ ప్రాభల్యాల కోసం తమ ఇంట ఒక స్త్రీని అవివాహితగా వుంచుకొని ఇంటికి వచ్చిన అతిధులకు, సర్వ సత్కార్యాలు చేసి నిశీధి సమయమున, అతిధులు వారి ఇంట రాత్రిని గడిపే రితిగానే తమ ఇంట వున్న స్త్రీ, ఆ అతిధికి ఆమర్యాదను జరిపే పద్ధతి. ఆ పఠేల్ ఫకీరయ్యగారి పరంపరలో వుంది.
అవ్వ ఆ యింటికి చేరిన వారం రోజుల్లోనే, ఆమెను సేవా తత్పరురాలిగా ఫకీరయ్య మార్చేశాడు. అవ్వ కొన్ని రోజులు ఎంతగానో ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి ఆమె నయనాల్లో కన్నీరు ఇంకిపోయాయి. ఇకపై తన జీవితం ఇంతే అనే నిర్ణయంతో శిలలా మారిపోయింది. రెండుసార్లు సంవత్సరం లోపల సామీ, అవ్వ తల్లి అలిమేలు, అవ్వను చూచి మాట్లాడాలని ఆ వూరికి వచ్చారు. ఫకీరయ్య, అవ్వ తన బంధువుల వూరికి భార్యతో కలిసి పోయిందని, పదిరోజులు రాదని వందరూపాయలు వారి చేతిలో వుంచి సాగనంపాడు.
అవ్వ ఆ ఇంట పంజరపు చిలకయ్యింది.
కూతురు మీద దిగులుతో అన్నపానీయాలు మాని అలిమేలు ఒక రాత్రి గుండె పోటుతో మరణించింది. సామీ, అలిమేలు ఖర్మకాండాలను కన్నీటితో నిర్వహించాడు. కాలచక్రం చిత్ర విచిత్రంగా ఇరవై భ్రమణాలను చేసింది.
*
మనస్సులోని వేదన, సరైన ఆహారాన్ని తినని కారణంగా అవ్వ వయస్సు ముఫ్ఫై అయిదు సంవత్సరాలే అయినా చూచేదానికి అరవై సంవత్సరాల వృద్ధురాలుగా మారిపోయింది.
ఫకీరయ్య గతించాడు. ఆయన భార్య మల్లమ్మ, కొడుకు ఏనాదయ్య వారి వివాహం జరిగిన ఎనిమిది సంవత్సరాలకు పుట్టాడు. పరమ మూర్ఖుడు, స్వార్థపరుడు అయిన ఫకీరయ్య నోటికి భయపడి, అతని చర్యలను వారించలేకపోయారు. అవ్వను వారి వూరికి పంపలేకపోయారు. ఫకీరయ్య మరణంతో ఆ తల్లీ కొడుకు అవ్వను పంజరం నుంచి విడిపించారు. పదివేలు డబ్బు ఇచ్చి అవ్వను ఆమె వూరికి పంపించారు.
శివాలయంలో మండపంలో స్థంభానికి ఆనుకొని అవ్వ తన గతాన్నంతా తలపోసుకొంది.
సామీ అవ్వమీద వున్న అభిమానంతో, నాలుగైదు సార్లు ప్రయత్నించినా, నల్లగొండలో అవ్వను కలిసికోలేకపోయాడు. ఆ బాధతో అతనూ నలభై సంవత్సరాల ప్రాయంలోనే అరవై సంవత్సరాలు పైబడిన ముసలివాడిగా మారిపోయాడు. అతని తల్లీ నాలుగు ఏళ్ళ క్రిందట మరణించింది. మాలకొండయ్య హాయంలో వారు గుఱ్ఱాలా రేసులు మూడూముక్కల ఆటల్లో, అతని ఆస్థిని సొంతం, హారతి కర్పూరంలా హరించుక పోయింది.
మాలకొండయ్య కొడుకు శంకర్ ఆటో నడుపుతూ తన ముసలి తల్లిని పోషిస్తున్నాడు.
అవ్వను గుడి దగ్గర దించి తన ఇంటికి పోయే దారిలో శంకర్ సామీని చూచాడు. అవ్వ వూరికి వచ్చిందని శివాలయం దగ్గర దించానని శంకర్ సామీకి చెప్పాడు. చేతికర్ర సాయంతో సామీ శివాలయాన్ని సమీపించి మండపానికి చేరాడు.
జీవకళ లేని అవ్వ మండప స్థంభానికి ఆనుకొని కన్నీరు కార్చడాన్ని చూచాడు. విచారవదనంతో మెల్లగా ఆమెను సమీపించాడు సామీ... ఆమె ముఖంలోకి చూచాడు. చెక్కిళ్ళపై కారిన కన్నీటిని, ముఫ్ఫై ఐదు సంవత్సరాలకే అరవై సంవత్సరాల వృద్ధురాలుగా గోచరించి అవ్వ ప్రక్కన కూర్చున్నాడు. అవ్వ కళ్ళు మూసుకొని వుంది.
"అవ్వా!....."
అతని పిలుపు అవ్వ చలికి సోకలేదు.
కొన్ని క్షణాలు ఆమెను పరీక్షగా చూచాడు. ఆమె ఆ స్థితికి సామీ హృదయం ముక్కలైంది. నయనాల నుండి ఆశ్రుధారలు.
"అవ్వా!...." కాస్త గట్టిగా పిలిచాడు.
తొట్రుపాటుతో అవ్వ కళ్ళు తెరిచింది. ఎదురుగా వున్న సామీని చూచింది. అతను సామీ అని ఆమెకు గుర్తు రాలేదు.
"అయ్యా!... మీరెవరు?" మెల్లగా అడిగింది.
"అవ్వా!... నేను సామీనీ!..." కన్నీటితో బొంగురు పోయిన కంఠంతో చెప్పాడు సామీ.
అవ్వ తన కళ్ళను పెద్దవి చేసి సామీని పరిశీలనగా చూచింది. ఆమె కళ్ళనుండి కన్నీరు కారుతూ ఉంది.
"సామీ!.... నువ్వా!...." కంపించే కంఠంతో పలికింది అవ్వ.
"అవును అవ్వా!... నేను... నేను నీ సామిని!" గద్గద స్వరంతో చెప్పాడు సామి.
అవ్వ విరక్తిగా నవ్వింది.
"ఎందుకు నవ్వుతున్నావ్?" అడిగింది అవ్వ.
"నీ సామిని అన్నావుగా!...."
"అవును. నేను నీ సామినే అవ్వా!..."
"అట్టాగా!...."
"అవును...."
"కానీ... నేను నీ అవ్వను కాదు. అది ఎప్పుడో చచ్చిపోనాది" విచారంగా చెప్పింది అవ్వ.
"అవ్వా!... అలా అనకు. ఏడవకు. నీకు నేనున్నాను."
అవ్వ విరక్తిగా నవ్వింది.
"అవ్వా!... నేను నిన్ను పెండ్లి చేసుకొంటా!.... నీ జీవితాంతం నీకు తోడుంటా!..."
"అట్టాగానా!...."
"అవును నా మాట నమ్ము!...
తన దగ్గరవున్న సంచి నించి పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడును బయటికి తీసింది అవ్వ.
"ఇదేందో తెలుసా!.... సామీ!..."
"తెలుసు, తాళి!..."
"నా మెడకు కడతావా?"
సామీ నవ్వుతూ అవ్వ చేతిలోని ఆ పసుపు తాడును తన చేతిలోకి తీసుకొన్నాడు. వెంటనే లేచి వంగి ఆ తాళిని అవ్వ మెడకు కట్టాడు. మూడు ముళ్ళు వేశాడు. నవ్వుతూ అవ్వ ప్రక్కన కూర్చున్నాడు.
అవ్వ ఆనందంగా నవ్వుతూ అతని ముఖంలోకి చూచింది. కళ్ళనుండి కన్నీటి ధారలు…
"అవ్వా!.... ఇప్పుడు మనం భార్యా భర్తలం." నవ్వుతూ చెప్పాడు.
సామీ అక్కడికి రాబోతే ముందు అవ్వ ఇరవై నిద్రమాత్రలు మింగి నీళ్ళు తాగింది.
అవ్వకళ్ళు స్థిరంగా నిలవలేకపోతున్నాయి. ఒరిగిపోయింది.
సామీ అవ్వ తలను తన తొడలపై వుంచుకొన్నాడు.
"సామీ!...."
"అవ్వా!... లే డాక్టరు దగ్గరికి వెళదాం!...." అవ్వను లేపబోయాడు సామీ....
"ఒద్దు సా...మీ... నేను ఇప్పుడు ఒట్టి అవ్వను.... కాదుగా ’అవ్వ సామీ!!" నవ్వుతూ ఆనందంగా కళ్ళు మూసింది.
ఆమె హృదయం ఆగిపోయింది.
భుజాలు పట్టుకొని "అవ్వా..... అవ్వా!..." కుదిపాడు సామీ.
కొన్ని క్షణాల్లో అతని విషయం అర్థం అయింది. ’అవ్వా!....’ ఏడుస్తూ ఆమె ఎదపై వాలిపోయాడు. పడినవాడు లేవలేదు. నోట పలుకు లేదు. తనువున కదలిక నోటమాట ఆగిపోయాయి.
గుడి పూజారిగారు వచ్చారు. ఇరువురూ వారికి తెలిసినవారే. నిర్జీవంగా పడివున్న వారిని చూచారు. వారి కళ్ళల్లో కన్నీరు ఆగలేదు.
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments