top of page
Original_edited.jpg

పాకుడు రాళ్లు

  • Writer: Srinivasa Rao Nagavarapu
    Srinivasa Rao Nagavarapu
  • May 9
  • 3 min read

#NagavarapuSrinivasaRao, #నాగవరపుశ్రీనివాసరావు, #పాకుడురాళ్లు, #PakuduRallu#TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #కొసమెరుపు

ree

Pakudu Rallu - New Telugu Story Written By Nagavarapu Srinivasa Rao

Published In manatelugukathalu.com On 09/05/2025

పాకుడు రాళ్లు - తెలుగు కథ

రచన: నాగవరపు శ్రీనివాస రావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"కొంచెం అర్జెంటు. నా పని చూస్తారా?" అక్కడ ఉన్న అయిదు కౌంటర్ లలో అడుగుతూ తిరుగుతున్నాడు తిమ్మయ్య. 


"ఏంటయ్యా నీ గోల. ఇక్కడికి వచ్చేవారందరికీ అర్జంటే. ఆర్డినరీలు ఉండవు. " తన జోకుకి తానే నవ్వుతూ, "క్యూ లో రావాలి. " చెప్పింది ఒక చేత్తో కీ బోర్డు ని ఒత్తుతూ, ఇంకోచేత్తో ముఖం మీద పడ్డ ముడతల్ని దాచడంలో ఓడిపోయి కిందకు జారుకుంటున్న మేకప్ ని అద్దుకుంటూ అవస్థలు పడుతున్న ఒక రిసెప్షనిస్ట్. 


అది మూడు అడ్మిషన్ లు ఆరు ఆపరేషన్ లు గా వెలుగుతున్న ఒక కార్పొరేట్ ఆస్పత్రి. "ఇంతకీ ఏమిటి నీ సమస్య?" అడిగింది ఆమె. అతడు నోరు విప్పి "రాళ్లు... " అంటూ మొదలెట్టగానే, "అర్ధమైంది రాజా.. " అతని మాటలు మధ్యలోనే ఆపుచేసి, రజనీకాంత్ స్టైల్ లో చెప్పింది రిసెప్షనిస్ట్. "నీతో ఎవరైనా వచ్చారా? నువ్వు ఎలా వచ్చావు? ఎవరు పంపారు?" ప్రశ్నల వర్షం కురిపించింది. 


అతడు అయోమయంగా చూస్తూ, "నేను ఒక్కడినే వచ్చాను. నా స్వంత లారీలో వచ్చాను. డా. గంగరాజు గారు పంపారు. " బుద్ధిమంతుడైన విద్యార్థిలా సమాధానాలు చెప్పాడు. 


 'ఒక్కడే వచ్చాడు, స్వంత లారీలో వచ్చాడు. ఈ మాత్రం హింట్ ఇస్తే చెలరేగిపోతాను. అసలే ఈ నెల టార్గెట్ రీచ్ అవడం లేదు. ' మనసులో అనుకుంటూ వార్డ్ బాయ్ ని పిలిచి, "అర్జెంటు గా ఇతన్ని యూరాలజీ డిపార్ట్మెంట్ స్కానింగ్ రూమ్ కి తీసుకెళ్ళు" అంటూ ఒక వీల్ చైర్ లో కుదేసింది. 


'నాకు స్కానింగ్ వద్దు. అసలు రాళ్లు.. ' అంటున్న అతని మూతిమీద కొట్టినంత పని చేసి, "మాకు ఏం చెయ్యాలో తెలుసు. మాపనికి అడ్డురాకు. స్కానింగ్ అంటే భయం, ఇంజక్షన్ అంటే భయం. ఇక జబ్బులెలా తగ్గుతాయి?" గదమాయించింది ఆమె. 


స్కానింగ్ రూమ్ లో ఆర్భాటాన్ని చూసి, అసలే అయోమయంగా ఉన్న తిమ్మయ్య భయపడ్డాడు. 'అంతా నార్మల్' అని చెప్పబోతున్న స్కాన్ టెక్నీషియన్ గొంతు నొక్కుతూ, 'ప్లాన్ బి' అన్నాడు రిపోర్ట్ రాస్తున్న వ్యక్తి. అతను అప్పటికే విపరీతంగా కిడ్నీ స్టోన్స్ ఉన్న ఇంకొక రోగి రిపోర్ట్ ని తిమ్మయ్య పేరుతో కాపీ, పేస్ట్ చేస్తున్నాడు. 


"ఏమయ్యా! తిమ్మయ్యా? ఎవరైనా నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు, నీలా నలభై రాళ్లు పొట్టలో వేసుకోరు. అది కడుపా? క్యారీ బ్యాగా?" అన్న మాటలతో అప్పటికే భయపడ్డ తిమ్మయ్య బెదిరిపోయాడు. 


"ఇమ్మీడియేట్ గా ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ గారు చెప్పారు, (స్వంత లారీ ఇక్కడే ఉంది)" 'అశ్వత్థామ హతః, కుంజరః' అన్నట్లు చెప్పింది అప్పుడే అక్కడికొచ్చిన రిసెప్షనిస్ట్. 


అప్పటికే బెదిరిన తిమ్మయ్య ఆ మాటవిని ఝడుసుకున్నాడు. నోరు తెరిచి ఏదో అందామనుకున్నాడు కానీ, అప్పటికే ఆ ప్రమాదాన్ని పసిగట్టిన హాస్పిటల్ స్టాఫ్ వేసిన ప్లాస్టర్ నోటికడ్డంగా ఉండడంతో మాట బయటకు రాలేదు. 


తనంతతానే గాలానికి చిక్కిన, ఒంటరిగా వచ్చిన, లారీ ఓనర్ అయిన, తిమ్మయ్య గారి ఆపరేషన్ ఏర్పాట్లు ఆగమేఘాల మీద జరిగిపోయాయి. తిమ్మయ్యని ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టారు. హాస్పిటల్ గౌన్ తొడిగారు. కదలకుండా కాళ్ళుచేతులను ఎలుకల జెల్ లాంటిదానితో అతికించారు. ఈ భయానక భీభత్స పరిస్థితి చూసి ఆల్రెడీ ఝడుసుకున్న తిమ్మయ్య అనస్థీషియా అక్కరలేకుండానే మూర్ఛపోబోయాడు. 


తిమ్మయ్య అదృష్టం కొద్దీ, ఆపరేషన్ చెయ్యడానికి అప్పుడే థియేటర్ లోకొచ్చిన, హిప్పోక్రటిక్ ఓత్ ఇంకా మరచిపోని అంతరించిపోతున్న జాతికి చెందిన సర్జన్ డా. వైద్య నారాయణ అతని నోటికున్న ప్లాస్టర్ విప్పి, ఫార్మాలిటీ ప్రకారం, " రాళ్ళెక్కడ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి?" అని కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించారు. 


వచ్చిన దగ్గరినుండి ఆ ప్రశ్నకోసమే ఎదురుచూస్తూ మూర్ఛపోబోతున్న తిమ్మయ్య తేరుకుని, "కాంపౌండ్ వెనకాతల లారీలో. గోడ రిపేర్ పని ఉందని డాక్టర్ గంగరాజు గారు పంపితే, ఒక లోడ్ వేసుకొచ్చాను. ఎక్కడ అన్లోడ్ చెయ్యాలో కనుక్కోడానికొచ్చి, రిసెప్షన్ లో మునిగి ఇక్కడ తేలాను" అని చెప్పి, పుంజాలు తెంపుకుని బతుకుజీవుడా అనుకుంటూ ఒకటే పరుగు పెట్టాడు. 


ఆ దృశ్యం చూడలేక హాస్పిటల్ గోడలమీదున్న వివిధ వైద్య పద్ధతుల పితామహులైన హిప్పోక్రేట్స్, ధన్వంతరి, చరకుడు, హాన్నేమన్, అగస్త్యుడు ముఖాలు వెనుకవైపు తిప్పుకున్నారు. 


అంకితం: పైన చెప్పిన విధంగా లేని హాస్పిటల్స్ యాజమాన్యాలకు, సిబ్బందికి. 


సమాప్తం


నాగవరపు శ్రీనివాస రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు పాఠకుడిగా ముదిరి రచయితగా మారిన చిరు రచయితను నేను. స్వస్థలం శ్రీకాకుళం. ఉద్యోగరీత్యా 25 సంవత్సరాలుగా కర్ణాటక లోని మంగళూరు వాసం చేస్తున్న ప్రవాసాంధ్రుడిని. ఎప్పుడూ చదవడం, అప్పుడప్పుడు రాయడం అభిరుచులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page