'Rekkalu Thodigina Pakshulu' New Telugu Story
Written By Vadapalli Purna Kameswari
'రెక్కలు తొడిగిన పక్షులు' తెలుగు కథ
రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి
ఆకాశం నిండా మేఘాలు ముసురుకున్నట్టే వసుధ మనసు నిండా ఆలోచనలు అలముకున్నాయి. దూరంగా కనబడుతున్న పనస చెట్టునే తదేకంగా చూస్తోంది వసుధ. “మొండెము మాత్రమే కనబడుతోంది. విస్తరించుకుని కొమ్మలు గానీ, వాటిని అంటిపెట్టుకుని ఆకులు గానీ లేవు. కలపగా వాడుకుందుకు మాత్రమే పనికొస్తుందేమో అన్నట్టు. అంతలోనే ఆశ్చర్యం కలిగేట్టు నేలకు దగ్గరగా మానుని అంటిపెట్టుకుని గుత్తులు గుత్తులుగా పిందెలు కనిపిస్తున్నాయి. ఆకులే ఎరుగని ఆ మాను నాకూ జీవం వుందని సంకేతింస్తున్నట్టు అనిపించింది. ఊపిరి పోసుకునేందుకే అన్నట్టు గుత్తుల చుట్టూ ఆరు ఏడూ ఆకులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎందుకూ పనికిరాదనిపించేట్టు ఉన్న ఆ చెట్టు, ఎన్ని కాయలు కాచిందో? ఊపిరిపోసేందుకు ఆకులూ, మోసేందుకు కొమ్మలూ లేకున్నా ఎన్ని పిందెలకు జన్మనిస్తోందో? ఎందరో బ్రతుకుల్లా, ఇవ్వడమేకానీ ఆశించాలని తెలియదు కాబోలు ఈ తరువుకు కూడా!!”
ఈ చెట్టు నాకేదో సందేశమిస్తోందా అనిపించింది వసుధకి. ఆ మోడు గురించిన తన గోడును డైరీలో పదిల పరుచుకుంది. డైరీ పేజీలూ తన ఆలోచనల్లానే రెపరెపలాడుతున్నాయి.
******
విరక్తీ, వైరాగ్యం మనిషిని ఇలా చుట్టు ముడతాయని తనకు అర్థమైయ్యేటప్పటికి సగం జీవితకాలం అయిపోయింది. పదిహేనేళ్ళు ఎలా గడిచిపోయాయో.....
వివాహమనే అందమైన బంధంలో అడుగు పెట్టింది. ఒక మల్టీ నేషనల్ కంపెనీలో CEO హోదా. గొప్ప సంపద ఉన్న అందమైన భర్త, రత్నాల్లాంటి పిల్లలు, చల్లగా సాగిపోతోందనిపించే సంసారం. తన మనసు సరిహద్దులను దాటి వెలుపలి నుంచి చూసే ప్రతీ ఒక్కరికీ అదో చక్కటి ఆదర్శవంతమైన సంసారమే.
మహీధర్ తో జీవితాన్నీ, శరీరాన్నీ పంచుకున్న వసు, అతని మనసంతా నిండిపోవాలనుకుంది. అర్ధాంగిగా అది ఆమె కనీస కోరిక అనుకుంది. కానీ అది సాధ్య పడలేదు. మహీధర్ తన చుట్టూ ఎంతో ఎత్తుగా కట్టుకున్న అహం గోడను ఛేదించి అతడి మనసులో తనకైన ఒక స్థానాన్ని ఎర్పరచుకోవాలని ఆరాట పడింది. అహంతో కట్టుకున్న ఆ కోటను కట్టుదిట్టంగా కాపాడుకుంటున్నాడు. మాటలు కటువే కానీ మనసు కఠినం కాదని ఎప్పటికప్పుడు మనసును మభ్య పెట్టుకుంటూ సరి పెట్టుకుని సాగిపోతోంది. మనసు కోరుకున్న ఆ ప్రేమను మాత్రం ఎన్నడూ చవిచూసి ఎరుగదు. దాన్ని పొందడానికే అహర్నిశలూ ఆరాటపడుతూ వచ్చింది. అతని గుండెలమీద వాలి చెప్పాలనుకున్న ఊసులన్నీ తన మనసులా మిగిలిపోయిన ఖాళీ డైరీ కాగితాలతో చెప్పుకుంటూ, సిరాతో రాతలుగా పదిలపరచుకోవడం అలవాటు చేసుకుంది. రెపరెపలాడుతున్నా మొదటి పుటంలో.....
“ఏళ్ళు ఎలా గడిచి పోయాయో తెలీదు. పేరుకు తగ్గ ఓర్పు. ఇంటికి తగ్గ ఇల్లాలు అన్న మాటలు వినీ వినీ విసిగి పోయాను. నిర్మలంగా కనిపించే నా మనసు లోతుల్లోని అల్లకల్లోలాన్ని అర్థం చేసుకొనే వారే లేరు. నాకంటూ ఒక వ్యక్తి కూడా కరువైయ్యారు. అలా నా మనసుని చదివిన ఒకే ఒక వ్యక్తి, నా ప్రాణ స్నేహితురాలు వైశాలి.
ఆ వైశూ జీవితమూ ఎన్నో మలుపులు తిరిగింది. పెద్దగీత పక్కన చిన్నగీత చిన్నదే అన్నట్టు, వైశాలికొచ్చిన కష్టం ముందు తనదేం పెద్దది కాదేమో అనిపించింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనంత దూరమైయ్యాము. ఏళ్ళ క్రితం కలిసిననాడు చెప్పుకున్న కబుర్లు, ఆప్యాయంగా వైశాలి పలకరించిన రోజూ మళ్ళీ కళ్లల్లో మెదుల్తోంది.”
“ఏవేఁ సంసారం ఎలా సాగుతోంది. ఐశ్వర్యమూ, అందమూ, అంతస్తూ అన్నీ ఉన్న మహీధర్ గారి భార్యగా భేషుగ్గా ఉంటుంది” అంది వైశాలి.
“అదేనే వైశూ, అందరి లాగానే నువ్వూ అనుకుంటున్నావు. రంగుల కలలతో తొలి మజిలీగా మొదలైన జీవితం మొదటి రోజే అపశృతి పలికింది” నిర్లిప్తంగా అన్నాను.
“అదేంటే? అత్తమామలు ఎంతో మంచివారు అని ఆ మధ్య చెప్పావుగా, మరి సమస్య ఏంటి” ఆశ్చర్యంగా అడిగింది.
“ఇల్లూ అత్తమామలూ అన్నీ సానుకూలమే. పెళ్ళైన కొత్తల్లో అందమైన భార్యను చూసి మురిసిపోతూ భర్తలు ప్రశంసించి ఆకట్టుకుంటారని విన్నాను. కానీ మొదటి రోజు నుంచే ఆశల మేడలు పేకముక్కల్లా కుప్ప కూలిపోయాయి. పూజ కొద్దీ పురుషుడు అంటారు. అన్నీ ఉండి అనుభవించలేక పోవడం ఏంటో నన్ను చూస్తేనే తెలుస్తుంది. అయిన వారింట పుట్టి కలవారింట మెట్టి మంచి సంపాదన గల భర్త లభించడం ఏ ఆడపిల్లకైనా అదృష్టమే అవుతుంది. అలా అనే నన్నూ అందరూ అనుకున్నారు. అంతవరకూ నేను అదృష్టవంతురాలినే. అయితే అన్నింటికీ మించిన ఐశ్వర్యం భర్త అనురాగం పొందడం. అది మాత్రం పెళ్ళైన ఎన్నేళ్ళకూ నాకు లభించలేదు. భార్యకు అన్నింటినీ మించిన అదృష్టం భర్త మనసు గెలవడం అని తెలిసిన నేను ఆయన మనసు గెలవడానికి విశ్వ ప్రయత్నం చేసాను. కానీ నా దురదృష్టమో ఏమో, విఫలమే అయ్యాను. తనువులు కాదు, మాటా, మనసులు ఏకమవ్వాలి అని మనసులో ఎంతగా అనుకున్నా అనుభవంలో అందుకు భిన్నంగానే జరిగింది.
చేతకాదని వెనుదిరగడమూ తెలియక ఓటమిని అంగీకరించే తత్త్వమూ కాక సతమతమయ్యాను. ఏళ్ళు గడిచే కొద్దీ మహీధర్ విషయంలో పూర్తిగా ఓడిపోయాననే భావన. మానసిక ఆందోళనకు గురి అవుతూ వచ్చింది మనసు మాత్రం ఆ ఓటమిని అగీకరించ లేదు. ఏం చేస్తే మహీ సంతోషంగా నవ్వుతూ వుంటాడు. ఏం చేస్తే ఆనందంగా ఉంటూ దాన్ని నాకూ పంచుతాడు అని అనుక్షణం ఆలోచిస్తూ ఆరాట పడ్డాను.
పురుషాహంకార అగ్నిలో అనునిత్యం రగిలిపోతున్న మహీ, నేను చేసే ప్రతి పనిలోనూ వంకను వెదకడం, పుల్ల-విరుపు మాటలతో గుచ్చడం, ఏం చేసినా తప్పే, ఎలా చేసినా తప్పే అన్నట్టుండడం బాధను కలిగించేది. భర్తను తృప్తిపరచడంలో విఫలమవుతున్నానన్న బాధ దహించేయగా, న్యూనతా భావనతో నన్ను నేను నిందించుకునే స్థాయికి దిగిపోతున్నాను. ఆవేదన నాలో ఒక వింత కోరికకు సైతం దారితీసిందంటే నమ్ము.
నా స్థానాన్ని తీసుకుని ఆయనను అన్నివిధాలా సంతోష పెట్టగలిగె వ్యక్తిని సాక్షాత్తూ నేనే కళ్ళారా చూడాలి. ఒక్క సారి నాకు అలాంటి అవకాశం వస్తే బాగుండు. ఏ భార్యా కలలోకూడా తలవనిది సవతి పోరే ఐనా సరే. నా భర్త నాకే సొంతం అన్నది ఆడదాని వైవాహిక హక్కుని కూడా వదులుకుంటాను. నా ఆడతనాన్నీ, ఆలితనాన్నీ పరీక్షించుకోవాలనిపిస్తోంది వైశూ. అలాంటి కోరిక కలగడమే దురదృష్టకరమైతే, ఆఖరికి అదీ తీరకపోవడాన్ని మాత్రం అదృష్టమో దురదృష్టమో! పెద్ద అబద్ధాలలో చిన్న నిజాలు దాగున్నట్టు, ఈ విశాలమైన భవనాల్లో ఇంత ఇరుకుతనం ఉంటుందని అందులో నేనిలా నలిగిపోవలసి వస్తుందనీ ఎన్నడూ అనుకోలేదు.
వసు మాటలకు అప్రయత్నంగా ధారాపాతమైయ్యాయి వైశూ కళ్ళు. లేమిలో, అనారోగ్యంతో బాధ పడుతున్నా, తన భార్యను ఉన్నదాంట్లో సంతోషంగా చూసుకోవాలని ఆరాటపడే తన భర్త పేద వాడా ఈ మహీధరా అనుకుంది మనసులోనే. స్తబ్దులా నిలబడిపోయింది.
******
కొత్తల్లో కొన్నాళ్ళు తత్త్వం అర్థంచేసుకోవడానికీ, అర్థమైయ్యాకా మారతారన్న ఆశ కొన్నాళ్ళూ, తరువాత కాపురం మొగుడ్నీ వదిలి ఎలా వెళ్లాలి, వెళితే అందరూ ఏమనుకుంటారో అన్న జంకూ, బిడియం ఒక పక్క, కన్నవారితో సహా నా సమస్య ఎవరికైనా ఎలా చెప్పాలా అన్న ఆలోచనలు ఇలా ఏడాది గడిచి పోయింది. ఇంతలో నెల తప్పి, పాప పుట్టడం. చంటిబిడ్డను పెంచడంలోనే సమయంమంతా గడిచిపోయింది. రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు.
పదిహేనేళ్ళైనా పరిస్థితిలో మాత్రం మార్పులేదు.
*****
“అమ్మా. అత్తయ్యా, మావయ్యా వచ్చేస్తున్నారు” అప్పటికి ఆరో సారి చెప్తోంది శృతి. వారిజత్తయ్యంటే శృతికి ఎంతో ఇష్టం. సాగర్ మావయ్యను తన ఫేవరెట్ హీరోతో పోలుస్తూ సంబర పడిపోతుంది.
“ఇదిగో, ఐపోయిందిరా. మరో అరగంటలో సిద్ధం అయిపోతాయి” హడావిడిపడుతూనే బదులిచ్చింది వసు.
ఆ రోజు ఆదివారము. అందులోనూ, ఆడపడుచు వారిజ, సాగర్ లు సపరివారంగా భోజనానికి రాబోతున్న రోజు. అసలు ఆదివారమే విశేషమైన రోజు. అందరూ ఇంట్లో సావకాశంగా కలసి భోంచేసే రోజు. రాత్రి నిద్దట్లో సైతం, తెల్లవారితే వండ వలసిన పదార్ధాల గురించే దృష్టి అంతా. ముఖ్యంగా మహీకి కోపం రాకుండా భోజనం పూర్తవ్వాలన్న ఆలోచలలే మెదలుతూ వుంటాయి వసుధ మనసులో. ఇంచుమించు ప్రతీ రోజూ అదే తపనతోనే గడుస్తుంది. ఆదివారం మరింత ప్రత్యేకం అంతే. ఊరంతా తన వంటను మెచ్చుకున్నా, మహీ మెచ్చుకోలుని పొందాలనే ఆశతోనే చేస్తుంది. హీనపక్షం చీవాట్లైనా తప్పించుకుంటే చాలన్న భావం. ఏ రోజుకారోజే పరగడుపుగా గడుస్తుంది.
మహాకవి శ్రీనాధుడన్నట్టు ‘మంచి భోజనం కన్నూ నింపాలి, కడుపూ నింపాలి’ మొబైల్ ఫోన్లో. శ్రీనాధుని చలోక్తులను వింటూ వంట చేస్తోంది. అంతేనా, మావారి మనసూ నింపాలి అనుకుంది. వారిజకీ సాగర్కీ ఇష్టమైనవి కూడా ఆవేల్టి మెనూలో చేర్చింది.
“కందా-బచ్చలి కూరలో ఆవ రుబ్బి వేస్తూ, పులుపూ అదీ సరిగ్గా పడకపోతే సుదీపుకి నచ్చదు. ఆవపెట్టిన కూరలు ఆయనకి నచ్చవు కనుక వంకాయ మెంతికారం. శృతికి బంగాళాదుంపల వేపుడు ఎర్రగా వేయిస్తే ఇష్టం. వారిజకిష్టమైన ఇంగువ దట్టించిన అప్పడాల పిండి సిద్ధం. సాగర్ గారికి ఇష్టమైన ఆవడలు వుండనే వున్నాయి. ఆదివారపు భోజనంలో అప్పడాలు, వడియాలు లేకపోతే ఆయనకు ససేమిరా నచ్చదు” సిద్ధం చేసినవన్నీ మరో సారి చూసుకుంటోంది వసుధ.
“అమ్మా, యమ్మీ. ఆలు ఫ్రై అంటే అది నీ చేతిదే అయ్యుండాలి. ఇంత కరకరలాడే వేపుడు చెయ్యడం ఎవ్వరి తరమూ కాదు” బంగాళాదుంప వేపుడు ముక్క నోట్లో వేసుకుంటూ అల్లరిగా అంది శృతి.
“ఎంగిలి చేతులు పెట్టకు, నాన్నగారు చూస్తే కోప్పడతారు” సన్నని స్వరంతో మందలించింది వసుధ.
మేడమెట్ల పక్కన వరండాలో నడుస్తూ ఫోనులో ఎవరినో చెరిగేస్తున్నాడు మహీధర్. కిందకి దిగి రుసరుసలాడుతూ వంటిట్లోకి వచ్చాడు.
“ఇన్నేళ్లుగా ఆ వెధవల వల్ల మనం నష్టపోతూనే వున్నాము. వీ నీడ్ టు టేక్ ఎ కాల్”, గర్జిస్తూ, కొంచం కాఫీ ఇవ్వూ చిరాకుపడుతూ ఆర్డర్ వేసాడు. వసు గుండెల్లో రాయి పడ్డట్టైయ్యింది. సమస్య కాఫీ ఇవ్వడం కాదు.
“వారిజా వాళ్ళు వచ్చే వేళైయ్యింది. అయ్యగారు యీ మూడ్ తో రుస-రుసలాడితే సాగర్ అన్నయ్యగారు ఏం బాధ పడతారో. రోజెలా మారనున్నదో? మునుపోసారి అలా ఆఫీసు గొడవ మనసులో పెట్టుకుని సాగర్ పై చిరాకు పడితే అతడు నొచ్చుకుని కొన్నాళ్ళు రావడం మానేసాడు. ఈయన మాత్రం అవేవీ గుర్తు పెట్టుకోరు” మనసులో అనుకుంటూనే కాఫీ కప్పు అందించింది.
కత్తి మీద సానులాంటిదే ఈ సంసారంలో నిత్యం ఈదడం అనుకుంటుండగానే, సుదీప్ మీద అరుపులూ, కేకలు పెడుతూ విరుచుకు పడ్డమూ, వాడు చిన్నబుచ్చుకోవడమూ జరిగిపోయాయి. శృతి మాత్రం తప్పించుకుని తిరుగుతోంది. ఫోనులో ఎలాంటి చర్చలు జరిగినా, ఆఫీసు విషయాలపై ఉద్రిక్తలు రేగినా దాని పర్యవసానం ఇంటిల్లపాదీ అనుభవించి తీరవలసిందే.
భోజనం వేళైయ్యింది. ఇల్లంతా నిశ్శబ్దం అలముకుంది. అంతలో మరో ఫోను. అనుకోకుండా ఆఫీసు పని వచ్చిందని సాగర్, రాలేకపోతున్నట్టు వారిజ చేసింది. అసలే అర్భం, ఆపై గర్భం అన్నట్టూ, ఇప్పుడు ఆ మాటకి ఏం రంకెలేస్తారో అనుకున్నారు.
“అన్నం చాలా బిరుసుగా మేకుల్లా వుంది. మింగుడు పడుతుందా? మనిషన్నవాడు ఇది తింటాడా. ఫులుసులో ఒకటే ఖారం” కళ్ళెర్రచేసి మంచినీళ్ల గ్లాసుని ఎత్తి ఢాం అని పెడుతూ అన్నాడు మహీధర్.
“నిన్న అన్నం మెత్తగా ఉందని కంచాన్ని విసిరి కొట్టడం గుర్తున్నా ఆ మాట పైకనే ధైర్యంలేక బెరుకుగా చూస్తూ వుండిపోయింది వసు. విషయం గుర్తున్నా చెప్పలేని నిస్సహాయతతో ఊరుకుండిపోయారు పిల్లలు. అమ్మ కళ్ళల్లో వెంటనే నీరు రానందుకు ఆనంద పడకపోయినా, మునపట్లా నొచ్చుకోని మార్పు అమ్మలో వచ్చినందుకు బాధ మాత్రం పడలేదు. అరువు తెచుకున్నట్టు బలవంతపు చిరునవ్వుని పెదవులకు పులముకుని, అదేదీ తన చెవినే పడనట్టు కొంచం పప్పు వడ్డిస్తాను అంది వసుధ. నిమ్మకు నీరెత్తినట్టు పైకి అనిపించినా, మనసులో మాత్రం సాగర్ వారిజలు రానందుకు వారి ముందు కూడా నగుబాటు కలగ నందుకు ఆనందించింది.
“అవకూర ఎంతో బాగుందమ్మా” లొట్టలేస్తూ, అమ్మని పొగుడుతూ తినలేకపోయాడు సుదీప్. కంచంలో మొహం దాచేసుకుని అన్నం కలపసాగాడు.
“నాకోసం కరకరలాడుతూ వేయించిందమ్మ” ఎర్రగా వేగిన ఆలూ వేపుణ్ణి చూస్తూ అనాలనుకున్న శృతి నోటికి తాళమే పడింది.
మరింత కోపాన్ని తెచ్చిపెట్టుకుంటూ “ఈ పచ్చి మిరపకాయ నములు అని వసు చేతికిచ్చాడు మహీ.
చేసిన తప్పుకి శిక్ష అన్నట్టు “నీ పులుసూ అంతే కారంగా వుంది” అన్నాడు మహీ పచ్చిమిరపకాయను నములుతూ కళ్ళనీళ్ళు కక్కుతున్న వసుధతో.
అది చూడడం ఇష్టంలేదన్నట్టు పిల్లలు కంచాల్లోకి తలను వంచేసుకున్నంత పని చేసి నిశ్శబ్దంగా భోజనం చేస్తున్నారు. వారానికోసారి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆదివారపు భోజనకాలం అలా గడిచిపోయింది. ఆలాంటివి జరగడం షరా మామూలే అయిపోయింది.
ఇదంతా రెండు దశాబ్దాలుగా వసూ చూస్తున్న తీరే. మొదట్లో భయ కంపితురాలై వొణికేది. అటు తరువాత “నేను చెయ్యని తప్పుకి ఎందుకు రోజూ ఇలా చిరాకులూ-చీదరింపులూ పడాలి” ఆక్రోశపడుతూ రగిలిపోయేది. గుడ్లల్లోనుంచి నీరుకక్కుతున్నా పసి పిల్లలను చూసుకుని చేసేది లేక దుఖాన్ని దిగమింగుకునేది. కాలక్రమేణా అలవాటు పడిపోయి సమ స్థితికి వచ్చి స్తబ్దుగా ఉండిపోవడం అలవాటు చేసుకుంది.
విరుగుతున్న మనసు, పైబడుతున్న వయసు తెచ్చిన మార్పు కాబోలు అది. తన మనసుకి సాంత్వనను కలిగించేవి ఏకాంతంగా ఆమె రాసుకునే రాతలే. దాదాపు మూడు డైరీలు పూర్తయ్యాయి. సంవత్సరాలు గడిచేకొద్దీ డైరీలలో తన వ్యధలే కాదు, తన చుట్టూ వున్నవారి మనోభావాలూ కథల్లా, కవితల్లా, మాటల్లా జాలువారుతూ వచ్చాయి. కాగితాలు వెనక్కి తిప్పి చూసుకునే కొలదీ, నేనెంత ఎదిగానో అని మనసులో మెదిలినవన్నీ అందంగా సిరాతో చిత్రింప బడ్డాయి.
పాతికేళ్ళనాటి వసూ ఇలా ఉండేది కాదు. పెళ్ళైన కొత్తలో భర్త కొన్న చెంగావిరంగు చీర కట్టుకుని ఎంతో ఆశగా ఆఫీసు నుంచి రానున్న భర్త కోసం ఎదురుచూస్తూ
“శ్రీవారూ, నారంగుకి నప్పే మీరు మెచ్చి తెచ్చిన చీర. ఎలావుందో చెప్పాలి. మీరనుకున్నంతగా నప్పిందా?” సిగ్గూ బిడియమూ కలబోసి చిలిపిగా అడిగింది.
“బానే వుంది. ఆడవాళ్ళందరికీ ఉన్న అవయువాలే నీకూ వున్నాయి, నీకు ప్రత్యేకంగా చీర నప్పడానికేముంది?” నిర్లిప్తంగా అన్నాడు.
“నీకు చీర నప్పడం కాదు. చీరకు నువ్వే అందం తెచ్చావు” అమాంతం కౌగిట్లో బంధిస్తూ అంటాడనుకుంది.
ఒక అందమైన విషయాన్ని కూడా అంత కటువుగా చెప్పగలరని మొట్ట మొదటిసారి తెలిసింది వసుధకు. కాఠిన్యమైన ఆ మాటలు గుండెను పిండేసాయి. మనసు విరిగిపొయింది. మచ్చుక్కి మాత్రమే తలచుకున్న సంఘటన తప్ప, ఇలాంటివి ఇంకెన్నో. ఎన్నెన్నో.
అనితర సాధ్యమైన విషయమని తెలిసినా, పిచ్చి హృదయం ఎప్పటికప్పుడు ‘నా వసూ’, అంటూ లాలనగా మృదువుగా మాట్లాడాలని కోరుకుంటూనే వుంది, తీరక బాధ పడుతూనే వుంది.
తగిలిన ఆ దెబ్బకు పాతికేళ్ళైనా నేటి వరకూ అలాంటి ప్రశ్నను అడగే సాహసం మరెన్నడూ చేయలేకపోయింది.
తన దృష్టినంతటా భర్తపైనే కేంద్రీకరిస్తూ అన్ని పనులూ చేస్తున్నా, ప్రతీ రోజూ ఒక అనూహ్య పరిస్థితిని ఎదుర్కోవడం, తన చుట్టూ అనిష్చితత ఆవహించినా, అదే వాతావరణంలో ఉంటూ అనుక్షణం నలిగిపోకా తప్పలేదు. అందమైన పొదరిల్లుగా అమర్చుకున్న ఆ ఇల్లు భయకంపితమైన ఆవరణగా మారడం బాధనే కలిగించేది. ఐతే, పిల్లల కోసం, వారిని తనూ బాధ పెట్టలేక వారి పెంపకంలో దృష్టినంతా కేంద్రీకరిస్తూ సాగిపోయింది. అణిగి-మణిగి ఉండడంచేత మహీ ఇంట్లోనే కానీ మనసులో స్ధానం పొందలేకపోయానన్న బాధ మాత్రం తనను వీడలేదు.
క్రమేణా తనకి అమరిన జీవితంతోనూ, జీవితభాగస్వామి వ్యవహరించే పద్ధతితోనూ రాజీ పడడం అలవాటు చేసుకోవడం ప్రారంభించింది. పైకైతే మాట్లాడకుండా సద్దుకోవడం పేరిట రాజీ పడిందేకానీ, ఏళ్ళు గడచేకొద్దీ, మానసికంగా కృంగిపోతూ, క్షోభకు గురి అవుతూ, లోలోపల కుమిలిపోయింది. తుపాకీ తూటాల కంటే పదునైన మాటల తూటాలతో గుచ్చే వారికి బ్రతికుండగానే అవతలి వ్యక్తిని చంపేయగలగడం అతి సులభమైన పని. అది గ్రహించక చేస్తున్నందు వలనో ఏమో మహీ మాత్రం మారనూలేదు తెలుసుకునే ప్రయత్నం చేయనూలేదు.
“భార్యా-భర్తల మధ్య శారీరిక సుఖ ప్రస్తానం గడిచాక మానసిక సాంగత్యం చిక్కబడి ఎంతో చక్కని సంభాషణలు వస్తాయని నమ్మాను. తనజీవితంలో అటువంటి బహూమూల్యమైన ఘట్టం రాలేదు. మనసు విరిగినా శరీరాన్ని అప్పచెప్పు కాపురాన్ని నెట్టుకుని వచ్చాను. ఇప్పుడు పిల్లలు ఎదిగారు. జీవితం అలవాటైపోయి బాధ తగ్గింది. సెలయేటిలా సాగవలసిన జీవనగమనం ఆనకట్టకి కట్టుబడ్డ జలనిధిగా మారింది” రవివర్మ కుంచెకు కూడా అందని సౌందర్యరాశిగా వర్ణిస్తూ తన కథలో కథానాయిక జీవితాన్ని చిత్రీకరిస్తూ, అకస్మాత్తుగా జరిగిన కొసమెరుపుగా తన మాటలను అవలీలగా రాసేసింది.
****
“వైశాలీ. యాభై అన్నది పెద్ద వయసు కాదే. నా మాట విని కాస్త ఆలోచించు. నీకంటూ ఒక తోడుండాలి. ఇలా తాడూ బొంగరమూ లేని జీవితం ఇంకా ఎన్నాళ్ళూ. అతనూ మా ఆడపడుచు కొడుకు. చిన్నప్పటి నుంచి నేను చూసి ఎదిగినవాడు. నెమ్మదస్తుడు, మంచివాడు. ఇద్దరు పిల్లలు. ఐదు వేళ్ళూ నోట్లోకి వెళుతున్నాయి. ఏర్పరుచుకున్న గూడుంది. కూతురు పెళ్ళి చేసేశాడు. భార్య హటాత్తుగా గుండెపోటుతో కాలం చేసి మూడేళ్ళయ్యింది. మరో మూడేళ్ళలో రిటైరవుతాడు. అన్నివిధాలా మీ ఇద్దరికీ జత కుదురుతుందన్న నమ్మకం నాకుంది” అనునయంగా అంది పెద్దమ్మ.
“మళ్ళీ పెళ్ళా? అసలు అలాంటి ఆలోచనలు నాకు లేవు పెద్దమ్మా. సంతానం లేదనే కొరతేకానీ ఆయనతో నేను సంతోషంగానే బతికాను. గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. నాకెలాంటి కోరికలూ లేవు. వుద్యోగం చేసుకుంటున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. ఎవ్వరి మీదా ఆధార పడలేదు. ఇప్పుడు నాకు లోటు ఏంటి?” అంది వైశాలి.
“ఏ అచ్చటా-ముచ్చటా తీరకపోయినా ఇన్నేళ్ళూ ఆ కాపురాన్ని నెట్టుకొచ్చావు. వివేకుకి ఎన్నో సేవలు చేశావు. అనారోగ్యం వల్ల అతనికి ఆయువు తీరింది. వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏకాకిగా మిగిలావు. జీవితంలో ఆ అధ్యాయం ముగిసిందే కానీ జీవితం కాదు” అంది పెద్దమ్మ.
యథాలాపంగా వైశాలి అన్న ఆ మాటల్లో తనే గ్రహించలేని వెలితిని మనసుతోనే చదివింది పెద్దమ్మ. గుండెలోతుల్లో దాగున్న వెలితిని వెలికితీసి చూప తలచింది.
“లోటు ఈనాటిది కాదే. పాతికేళ్లుగా పాతుకు పోయిన లోటు. గ్రహించ గలిగినా, నువ్వు చూడ దలుచుకోని లోటు. శారీరిక వాంఛలు తీరలేదు. అమ్మ కమ్మతనాన్ని చవి చూడలేదు. అత్తగారి ఆరళ్ళూ, లేమితో అవస్ధలు. వివేక్ ప్రేమ ఇవన్నిటినీ మరిపింపచేసినా, లోటు లోటే కదా”, అనారోగ్యంతో బాధపడుతున్న వివేక్ వైశాలిని గుండెల్లో దాచుకున్నా, దాన్ని సుఖపెట్టలేని స్ధితి అతడిది. మనసులోనే అనుకుంది పెద్దమ్మ.
“నాన్న అన్నదమ్ముల్లో అందరి కంటే పెద్దవారైనా పెదనాన్నగారు కాలంచేసి పదిహేను సంవత్సరాలైయ్యింది. ఇప్పుడు ఎనభైల్లో వున్న పెద్దమ్మ నోటి వెంట ఇలాంటి మాటలు రావడం ఆశ్చర్యంగా అనిపించింది. ఇన్నేళ్ళుగా పెద్దమ్మను చూస్తున్న నాకు ఆమెలో ఇలాంటి అభ్యుదయ భావాలు ఎన్నడూ కనబడలేదే!! ఆఫీసులో వివాహం గురించి ఎందరో చూఛాయగా ప్రస్తావించినా, చిరునవ్వుతో హుందాగా తోసిపుచ్చేసానే. ఆమ్మో, మన కుటుంబాల్లో ఇలాంటివి తలచనైనా తరమా? చిన్ననాటి నుండి పెరిగిన వాతావరణం ఇచ్చిన సంస్కారమూ నా నోటిని కట్టేసాయి. అటువంటి ఆలోచనలే ప్రవేశించకుండా మనసు తలుపులను గట్టిగా మూసేసుకున్నానే. ఇప్పుడు పెద్దమ్మ మాటలు మళ్ళీ మనసుని తట్టి లేపుతున్నాయి. ఆధునిక చదువులు చదువుకుని వుద్యోగం చేస్తూ స్వావలంబనతో జీవిస్తూ, సాటి స్త్రీ మనసును తెలుసుకోలేక ‘ఇప్పుడావిడకు పెళ్ళెందుకో’ అని వదిన లాంటి ఈ తరం వారి మాటలు మరువలేదు. ఎనభైల్లోవున్నా ఇటువంటి ఆలోచనలున్న పెద్దమ్మ లాంటి వారేగా నిజమైన అభ్యుదయ వాదులు??” అనిపించింది.
“వైశూ, నేను వెళ్ళిపోయాకా కూడా నిన్ను ఇలాగే చూడాలనుకుంటున్నాను. నొసట కుంకుమను మాత్రము నువ్వు ఎన్నడూ తీయకూడదు” వివేక్ అన్న ఆ ఆఖరి మాటలు గుర్తొచ్చి మనసు కలుక్కుమంది. ఒక వేళ అయనన్న మాటల సంకేతం ఇది కాదుకదా. అలాంటి ఆలోచనలు ఆయన మనసులో కలిగాయేమో. మునుపెన్నడూ అలాంటి భావుకత ఆయనలో చూసి ఎరుగని నాకు ఆనాడు అశ్చర్యంగానే అనిపించింది. ఇప్పుడా అపశకునపు మాటలెందుకండీ అంటూ బాధ పడుతున్న నన్ను మరింత బాధ పెట్టలేక అప్పటికొదిలేసారు. కానీ, ఆయన ఎదో చెప్పాలనుకున్నది మాత్రం నిజం. దాని అంతరార్ధం ఇప్పుడు అర్ధమవుతోంది.
సగటు ఇల్లాలిగా ఎటువంటి ఆనందమూ చవిచూడని ఇరవయ్యేళ్ళ రసవిహీనమైన కాపురము, పిల్లా-పాపల కేరింతలు లేని వైవాహిక జీవితము. ఇంచు-మించు ఆసుపత్రిలా అనిపించే ఇల్లూ, వైద్య సేవకురాలినీ అనిపించుకునే ఇల్లాలిగా రోజులు గడిచిపోయాయి. ఆలిగా అడుగు పెట్టి నర్సుగా మారిన వైనం. ఇవన్నీ కలిసి వైశాలి జీవన పయనం. ఆస్తమా వ్యాధితో బాధ పడుతున్న వివేకుకు సేవలు చేస్తూ అతన్ని కాపాడుకోవడం కోసం అనేక విధాల ప్రయత్నంచింది వైశాలి. ఊపిరితిత్తులు క్షీణించడంతో ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్ధితిలో ఇంట్లోనే ఆక్సీజను వసతి ఎర్పాటు చేసింది.
ఆతని ఆరోగ్యము సంగతి ఎలా వున్నా ఆమె పై అతనికున్న ప్రేమ బలమే ఆమె పెదవులనుండి చిరునవ్వు చెదరనివ్వకుండా ధైర్యంగా నిలబెట్టింది. సరదాగా నవ్వుతూ నవ్విస్తూ వుండే వివేక్ గుణం అన్నిటినీ మరిపించింది. వైశూ, నిన్ను నేను ఏవిధంగానూ సుఖ పెట్టలేక పోతున్నానని అప్పుడప్పుడు అనుకున్నా, అమితమైన ప్రేమ, అంతకు మించిన ఆరాధన, తనకు ఆ సాన్నిహిత్యమే ఎంతో సంతృప్తినిచ్చేది. కౌగిట్లో ఒదగడంకన్నా మనసంతా నిండి వుండడంలోనూ, కళ్ళెదురుగా మసలుతూ, మనసువిప్పి నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడంలోనే ఆనందాన్ని పొందుతున్న ఆ దంపతుల జంట చూడముచ్చటగానే వుందని పెద్దమ్మ అస్తమానూ అనేది. అలాంటి పెద్దమ్మే ఇప్పుడు మరు మనువుకు అంకురార్పణ చేసింది. ఐనా వైశూ మనసులో మాత్రం సంశయం తీరలేదు. జీవితం ప్రశ్నార్థకంగా వున్నప్పుడల్లా తనకి సమాధానం చూపేది ఎప్పుడూ తన ప్రాణ స్నేహితురాలు వసుధే.
ఇరవైయేళ్ళనాడు కాలేజీ తరువాత విడిపోయినా, అప్పుడప్పుడూ మాట్లాడుకోకుండా మాత్రం ఎప్పుడూ లేరు. వైశాలితో మాట్లాడిన రోజు పెద్ద పండుగాలా గడిచేది వసుకి. ఇప్పుడు ఆ రాతలకి ఒక్క సారిగా తాళం వేసేసావేంటే అని వైశాలి అంటూనే వుండేది. కాలేజీ రోజుల్లో స్టేజీ డ్రామాలకు మాటలు రాస్తూ, కథను అందంగా మలుస్తున్న వసుధ ఆలోచనా విధం వైశాలికి ఎంతగానో నచ్చేది. ఏ విషయాన్నైనా అన్ని కోణాల్లోనూ పరిశీలించే నేర్పు వసుధకి వుండేది. కధలుగా రాయనే అని వైశూ మాట్లాడినప్పుడల్లా పట్టుపట్టడంతో అందిరి జీవితాలూ కథలుగా డైరీలో పొందుపరిచ సాగింది. ఏవో పిచ్చిరాతలే అనిపించినా ఆ రాతలు ఎంతో తృప్తినిచ్చేవి వసుధకు.
“వైశూ, వివేక్ గారితో నీ మనసుకున్న అనుబంధం మాకు తెలియనిది కాదే. పెద్దమ్మైనా నేనైనా చెప్పేది, అపురూపమైన గతం గొప్పదే. కానీ అందమైన జీవితాన్ని కళ్ళెదురుగా చూస్తూ వదులుకోకూడదు. నీకు అన్యాయం చేసానని అనిపించి కాబోలు, ఆ దేవుడే పెద్దమ్మ రూపంలో నీకో తోడుని ఇస్తున్నాడు“ అంది వసుధ సంబర పడిపోతూ.
ఎప్పుడూ వసు మాటపై ఎనలేని గౌరవం వుంది. ఇప్పుడు పెళ్ళి విషయంలోనూ తన మనసును అర్ధంచేసుకున్న ప్రాణ స్నేహితురాలి అభిప్రాయం అడిగిన తరువాతే సుమఖత తెలుపుతూ పెద్దమ్మకు తన నిర్ణయం చెప్పాలనుకుంది వైశాలి. అలాగే చేసింది కూడా.
సన్నంచు పట్టు చీర హుందాగా కట్టుకుని, నెరిసిన కురులను వదులుగా ముడివేసుకుని, చుట్టూ మల్లెమాలను తురిమి, నొసటి నిండా ఎర్రని కుంకుమను అద్దుకుని మనసులో ఉన్నతంగా నిలిచిన వివేక్ పై ఆరాధనాభావంతో, నూతన జీవితంలోకి ఆహ్వానిస్తున్న ధనంజయ్ మెడలో పూమాల వేసింది వైశాలి. ఆనందముగా తన స్నేహితురాలిని అభినందిస్తూ వసుధ మనస్పూర్తిగా ఆశీర్వదించింది. వైశాలికున్న విశాల హృదయానికి తగ్గట్టు దైవమే చక్కటి దారి చూపాడని సంబరపడుతూ అభినందించింది వారిజ.
కొడుకూ కోడలూ, కూతురూ అల్లుడూ చిరునవ్వులతో ఆహ్వానించగా కొత్తజీవితంలోకి అడుగు పెట్టింది వైశాలి. నిండు హృదయంతో పెద్దమ్మ ఆశీర్వదించగా, ఇద్దరు స్నేహితురాళ్ళూ ఇరువైపులా నిలిచి అభినందించగా ధనుంజయ్ కి అర్ధాంగి అయ్యింది. ఏ గూటినైనా అందంగా అలంకరించుని ఆనందంగా అమర్చుకోగల వైశాలికి జీవితం కొత్తగూటిని ఇచ్చింది.
*****
పేరంత విశాలమైన హృదయమూ కలవాడు సాగర్. చలాకీ స్వభావంతో అందరినీ ఇట్టే ఆకట్టేసుకునే స్వభావం. నవ్వుతూ తుళ్ళుతూ వుండే వారిజకు అన్ని విధాలా అనుకూలమైన సంబంధమని ఖాయం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా పెళ్ళి జరిగింది. వాళ్ళ కాపురం ఎంతో చక్కగా సాగిపోతోంది. ఆడబిడ్డ సంసారం చూసి సంబర పడైపోయేది వసుధ. ఒదినా మరదళ్ళన్న బంధం కంటే వారి మధ్య స్నేహబంధమే ఎక్కువ, ఒకే వయసు కావడంతో ఎన్నో కబుర్లతో ఆ స్నేహం పెనవేసుకు పోయింది. సాగర్ వ్యాపారం మూడు పువ్వులూ ఆరు కాయలుగా సాగిపోతోంది. విధి వైపిరీత్యం. పదేళ్ళుగా చిగురించి మానైన వ్యాపారం భాగస్వాముల మోసంతో తీరని నష్టం తెచ్చింది. సాఫీగా సాగిపోతున్న జీవితంలో పెను తుఫాను తెచ్చింది. తేరుకోలేని అగాధాల్లో పడేసింది. ఆస్తులు పోయాయి. బంగళా వాసం నుంచీ చిన్నింటి కాపురానికి చేరుకున్నారు.
“నిన్ను ఏనాడో దేవతలా నా మనసులో నిలుపుకున్నాను. ఏనాటికైనా నీకు మళ్ళీ అలాంటి బంగళాను, అదే నా ప్రేమ-మందిరాన్ని కట్టి అందులో మహారాణిగా కూర్చోపెడతాను. ఆందాకా ఈ కౌగిట్లోనే బందీగా దాచుకుంటాను. నీతోడున్నంత వరకు నాకు ఏ లోటూ లేదు, సాధించలేనన్న భయమూలేదు. పోయిన ఆస్తి నాకేమీ బాధను కలిగించలేదు." అంటూ ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడు సాగర్. వారిద్దరినీ పెనవేసి ముడివేసినది ఆనాటి ప్రేమేనైనా, అంతగా అల్లుకుపోయిన బంధాన్ని సైతం విడతీయ గలిగింది నేటి యీ లేమి. చెక్కుచెదరని సాగర్ ప్రేమను కలిమీలేములు మార్చలేక పోయినా, వారిజ మనసును మాత్రం లేమి మార్చేసింది.
అన్నిటికీ వసుధ అభిప్రాయం తీసుకునే వారిజ ఇప్పుడు సీతకన్నేయ సాగింది. కష్టాలన్నవి ఎల్లకాలమూ ఉండిపోవు, అవి వచ్చినప్పుడే గుండె నిబ్బరం మరింత అవసరమని ఎంతగా చెప్పి చూద్దామన్నా, అవకాశం ఇవ్వని వారిజ దగ్గర వసుధ విఫలురాలే అయ్యింది.
తన గుండెగూటిలో ఆమెను పదిలంగా దాచుకున్న సాగర్ ప్రేమ మాత్రమే వారిజకి సరిపోలేదు. పాతికేళ్ళ వైవాహిక జీవితంలో మళ్ళీ తమకంటూ ఒక గూడు కూడా కట్టలేని లేమి తనని కుంగదీసి మనసును మార్చేసింది. వైశాలి చేస్తున్న ఆఫీసులోనే వారిజ చేరింది. కలిమిలేని ప్రేమ కౌగిలి ఆమెకు బిగువుగా అనిపించింది. లేమితో ఆమెను ఉక్కిరిబిక్కి చేసింది.
వైశాలి పని చేస్తున్న ఆఫీసులోనే వారిజ పదేళ్ళగా పనిచేస్తోంది. విశాలమైన సాగర్ హృదయం ఆమెకు ఇరుకనిపించింది. ఆ వైవాహిక బంధంలోంచి అంచలంచలుగా తనను తాను విడిపించుకుంటోంది. సమాజ కట్టుబాట్లను తెంచుకుంటూ, విలువలను తుంచుకుంటూ సాగింది. అందమైన అమరికగా తానే ఏర్పాటు చేసుకున్న మరో బంధాన్ని వెతుక్కుంది. టిప్పుటాపుగా కనిపిస్తూ హీరోలా వుండే రాజా మాటలకు పడిపోయింది. కారులు షికారులే ఆనందమనుకుంది. వారిజ లాంటి మనోస్థితిలో వున్నవాళ్ళు ఇట్టే అతడి వలలో చిక్కుకుంటారు. గీత దాటింది. అద్భుతమైన కలల ప్రపంచపు వలయంలో చిక్కుకుంది. రంగుల కలగా కనిపిస్తున్న జీవితాన్ని చుసి మురిసిపోయింది. అనిశ్చితతో నిండిన చంచలమైన స్వర్గసుఖాలను శాశ్వతమని భావించి దాన్నే మాధుర్యమని తలచింది.
నిజం నిప్పులాంటిది. కాల్చేస్తుంది. గీత దాటినందుకు సమాజం తనని శవముతో సమముగా జమ కట్టింది. కలలు ఎన్నటికీ నిజాలు కాలేవని తెలిసేలోవు చెదిరిపోయాయి. సమాజమంచా నిందించినా కనీసం రాజా తనను అర్థం చేసుకుంటాడనుకుంది. రాజాకు తన మీద ప్రేమ వుంది. నేను బాధ పడుతుంచే చూస్తూ ఊరుకోలేడు అనుకుంది.
“అందంగా వున్నావు, అన్నిటికి సిద్ధంగా వున్నావు, ఇద్దరమూ కావాలనుకున్నాము అనుభవించాము. ఇప్పుడేదో పతివ్రతలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు చట్టాలు మాట్లాడడానికీ నేను సమాధానం చెప్పడానికీ మనమేమి పెళ్లి చేసుకోలేదే? డబ్బు లేదన్న ఒకే ఒక కారణం కోసం కట్టుకున్నవాడిని వదిలి నన్ను చేరావు. రేపు నాకంటే డబ్బున్నవాడు దొరికితే నన్ను వదలి వాడితో ఎగిరిపోవన్న నమ్మకమేంటి?” వెటకరిస్తూ రాజా అన్నమాటలు శూలాల్లా గుచ్చుకున్నాయి. పరాయి పురుషుడికి పడకను పంచిన స్త్రీ ఆటబొమ్మేనన్న విషయం అర్ధమవ్వడానికి జీవితం కోల్పోవలసి వచ్చింది. చెప్పుదెబ్బ తిన్నట్టయ్యింది. సాగర్ ని పెట్టిన క్షోభకు ఆ శిక్ష చాలదు. సాగర్ పేరు తలిచే అర్హత కూడా లేదు. ఇంకా ఎంతో పెద్ద శిక్ష పడాలి అని ఆత్మ నింద చేసుకుంది.
ఒదిన మాటలు రుచించలేదు. వైశాలి వంటి స్నేహితురాలి సాన్నిహిత్యంలోనూ జీవితాన్ని చక్క పెట్టుకోలేకపోయానని మనసులోనే మదన పడింది వారిజ. మనో వ్యధతో చిక్కి సగమైయ్యింది.
*****
పీడకలలతో ముచ్చమటలు పోసి ఉలిక్కిపడి లేచిన వారిజ చెవుల్లో తాను ప్రేమించిన, కాదు కాదు ప్రేమించాననుకున్న రాజా మాటలే మారు మ్రోగాయి. ఆమెను వెంటాడి వేధిస్తున్నాయి. మనశ్శాంతి కరువైంది. మనసు పోయినచోటికే నడకా సాగితే తప్పటడుగులతో ఆ చోటు తృణీకరించి వెక్కిరిస్తుంది. అందరూ వున్న అనాధగా మారింది. ప్రేమకు మారుపేరైన సాగర్ తన చిన్ని గూటిలో కోడలు శృతి సేవలతో ఐశ్వర్యవంతుడైయ్యాడు. ఐశ్యర్య దాహంతో వారిజ నిరుపేదైయ్యింది. ఆకాశమంత ఎత్తులోవున్న సాగర్ ను అందుకునే అర్హతకోల్పోయానన్న ఆత్మన్యూనతా భావనతో చిరిగిన గాలిపటంలా రెపరెపలాడుతోంది. ఆత్మవంచనను భరించలేక ఆత్మాహుతికి పాల్పడాలని నిశ్చయించుకుంది. ప్రేమను పంచడమే తెలిసిన సాగర్ అలా జరగనివ్వలేదు. తప్పులు మనుషులు కాక మానులు చేస్తాయా. మన ఇరువురి కన్నీటితో ప్రక్షాళన జరిగింది. నాకు దూరమైపోయే తప్పు ఎన్నటికీ చెయ్యకు. ఎగిరిపోయి అనంత శూన్యాలలో కలిసిపోతున్న గాలిపటానికి కొత్త దారం కట్టాడు. తనకిచ్చిన ఆత్యున్నతమైన స్థానాన్ని వీడినందుకు ఆపరాధ భావనతో కృంగిపోతున్న వారిజను అక్కున చేర్చుకున్నాడు.
ఆ జంటను చూసి అమితానంద పడింది వసుధ.
****
తూరుపు సూర్యుడు ఆ రోజు తనకోసమే వేగంగా ఉదయించి నిదుర లేపాడనిపించింది వసుధకు. అప్పుడే రెక్కలు విచ్చుకుంటున్న విహంగంలా, విశాలమైన గగన వీధులలోకి స్వేఛ్చగా ఎగిరిపోవాలని ఆరాటపడింది. మచ్చుకకై పంపిన కథను చూసి పత్రిక వారు ధారావాహిక నవల వ్రాయమని కోరారు.
"కాఫీ ఏది?" ఎప్పటికిమల్లే చిరాకు పడుతూ అడిగాడు మహీధర్.
"ఫ్లాస్కులో పెట్టాను". ఎలాంటి ఉద్వేగమూలేని నిర్మలమైన స్వరంతో అంది వసుధ.
"ఆ పెడసరి సమాధానమేంటి? నాకు ఫ్రెష్ గా కావాలని తెలుసుగా" మహీ కంఠంలోని కాఠిన్యం రెట్టింపైంది. "పెట్టాలనిపించలేదూ, పెట్టలేదు" మరింత శాంతంగా అంది వసుధ. మరి టిఫిను సంగతి? అన్నాడు. అదీ చెయ్యట్లేదు!!!
ఇరవై ఏళ్ళ కాపురంలో ఎన్నడూ అలాంటి ధైర్యాన్ని కానీ, ఆత్మనిబ్బరాన్ని కానీ, ప్రశాంతతను కానీ ఆ ముఖంలో చూసి ఎరుగని మహీధర్ కి మొట్ట మొదటి సారిగా కోపం రాకుండా ఆశ్చర్యం వేసింది. కొద్దగా భయం కూడా వేయక పోలేదు. తన బలాన్ని మాత్రమే ఎప్పుడూ ప్రదర్శించి ఎరిగిన అతడు, ఆమె మొఖంలో ఒత్తిడిని కాక ఉపశమన భావనను చూసి భరించలేక పోయాడు. ఆధిపత్యంలో గెలుపును సగర్వంగా ఆనుభవించే అతనికి మొట్ట మొదటిసారి ఓటమి కనిపిస్తున్నట్టయ్యింది.
ఎప్పుడూ చిరునవ్వుతో సేవించడానికే వున్న అర్ధాంగి నేడు జడ పదార్థంగా మారిపోయింది!! తన గమ్యం గోచరిస్తున్నట్టు, ఒక (అ)సంతృప్తికరమైన స్థాయిని చేరుకుంది. ఈ మానసిక పోరాటం ఇక అనవసరం. నిశ్శబ్దంలోకి, ప్రశాంతత నిండిన చోటికి వెళ్ళి పోతున్నానన్నట్టు నిశ్చింతగా వుంది. భయంగా బెరుకుగా వున్న వసుధ నిశ్శబ్దాన్ని భరించ లేక పోయాడు మహీ. మానసికంగా వసూ లేని ఒంటరితనాన్ని ఊహించలేడు. ఆత్మగౌరవంతో ఎదిగిన ఆమె ఎత్తును సంస్కారవంతంగా చుసే ప్రయత్నం ఆరంభించక తప్పలేదు. సంస్కారవంతంగా మాట్లాడేంత ఎత్తుకు ఎదగకున్నా, పుల్ల విరుపు మాటలు పెట్టే బాధ తనకు తెలియడం మొదలుపెట్టింది. ఆ తూటాల్లాంటి మాటలతో ఆమె హృదయాన్ని నేనెంత గాయపరిచానో అని అంతర్మధనం మొదలైయ్యింది.
ప్రేమకు నిలయమైన సాగర్ ఇంటికి బిడ్డను కోడలిగా పంపారు. కొడుకుకీ ఒక తోడు దొరికింది. కోడలి ఇంట తల్లిగా లాలనగా చుసుకునే వైశాలి అడుగుపెట్టింది. పిల్లల పట్ల నాకున్న బాధ్యతలు తీరాయి. భార్యగా నాకు నేనే ఆపాదించుకున్న కొన్ని బాధ్యతలను త్యజిస్తున్నాను. ప్రాణం వుండీ అస్తిత్వము కోల్పోయిన నేను, ఉనికిలేని చోటును మానసికంగా వదిలి వెళుతున్నాను. నాకోసం నేనున్నానన్న విశాలమైన ప్రపంచంలోకి సాగిపోతున్నాను. నేను మాత్రమే గల నా చిన్ని ప్రపంచం. అలజడి నుండి ప్రశాంతతలోకి. బాహ్యంలోంచి అంతరంగం వైపుగా ఆత్మశక్తి మార్గం చూపగా సుదూర తేజంలోకి వసుధ సుజీవ పయనం ప్రారంభ మైయ్యింది. జీవితపు చేదు అనుభవాలూ, తియ్యటి అనుభూతుల ధారలు కలం లోంచి కథలుగా జాలువారాయి. పాఠకుల మనసులను ఇట్టే హత్తుకున్నాయి. వసుధ మహీకి భార్యగా మాత్రమే కాక రచయిత్రిగా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుని ఆత్మ తృప్తిని పొంద సాగింది.
ఋతువులు మారి పనస చెట్టు (తోటమాలి సంరక్షణతో) కొత్త చిగుళ్ళు తొడిగింది. కొమ్మల చిగురించిన ఆకులు రెపరెపల ఊసులు చెప్పగా కిలకిలా నవ్వుతున్నట్టు, సరికొత్త ఊపిరి పోసుకున్న మోడు సజీవంగా కనిపిస్తోంది.
కొత్త ఊపిరి పోసుకుని కథా రచయిత్రిగా గుర్తింపు పొంది, మొదటి ధారావాహిక నవల ‘రెక్కలు తొడిగిన పక్షులు‘ చివరి పేజీని పూర్తి చేసింది వసుధ.
*******
వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం
నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కధలకు, బహుమతులు పొందాను.
Comentários