#MKKumar, #ఎంకెకుమార్, #Budget2025 , #బడ్జెట్2025, #TeluguStories, #TeluguArticle

సామాన్యుల ప్రయోజనాన్ని అణచి, కార్పొరేట్లకు ప్రోత్సాహం?
Review On Budget 2025 - New Telugu Article Written By - M K Kumar
Published In manatelugukathalu.com On 04/02/2025
బడ్జెట్ 2025 విశ్లేషణ - తెలుగు విశ్లేషణాత్మక వ్యాసం
రచన: ఎం. కె. కుమార్
భారత ప్రభుత్వం 2025 సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్‌పై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇది ముఖ్యంగా కార్పొరేట్ అనుకూలంగా ఉందని, సామాన్య ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేకపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో ప్రధానంగా పెద్ద కంపెనీలకు పన్ను రాయితీలు, పెట్టుబడిదారీ విధానాలకు ప్రోత్సాహం లభించింది. మరోవైపు రైతులు, కూలీలు, మధ్య తరగతి ప్రజలకు తగిన స్థాయిలో మద్దతు లభించలేదనే భావన వ్యాపిస్తోంది.
ప్రభుత్వం "వికసిత్ భారత్" పేరుతో ఆర్థిక ప్రగతిని హైలైట్ చేస్తోంది. ఈ బడ్జెట్ ద్వారా సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలిగిందనే ప్రశ్నకు సరైన సమాధానం కనిపించడం లేదు. పార్లమెంట్‌లో బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత, ప్రజా సంక్షేమ పథకాలకెంత కేటాయింపు జరిగిందనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం వంటి పథకాలకు నిధులు ఎంత కేటాయించారనే ప్రశ్నలు మిగిలిపోయాయి.
వ్యవసాయ రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. అయినప్పటికీ, ఈ బడ్జెట్‌లో రైతులకు నిరాశే మిగిలింది. వ్యవసాయానికి కేటాయించిన మొత్తం గత ఏడాదికంటే తక్కువగా ఉంది. ఎరువుల సబ్సిడీని తగ్గించారు. రైతులకు తీవ్రమైన దెబ్బ. ఆహార ధాన్యాల సబ్సిడీలోనూ కోత విధించడం వల్ల పేదలు మరింత కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. రైతులకు ప్రధాన మద్దతుగా చెప్పబడే "ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి"లో ఎలాంటి పెరుగుదల లేదు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన సి2+50% వ్యయంతో మినిమం సపోర్ట్ ప్రైస్ (ఎం ఎస్ పి ) పెంచుతామని చెప్పిన ప్రకటన ఇంకా అమలు కాలేదని అర్థం. సి2 విలువతో కూడిన 50% అదనపు ఖర్చును ధరల్లో పెంచమని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గత ఏడాది రూ. 86, 000 కోట్లుగా ఉంచినట్లు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది తక్కువగానే కనిపిస్తోంది. పనికి తగ్గ వేతనం లేకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకం కొనసాగడం అనేది అసలైన సమస్య. గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కూలీలు రోజుకు రూ. 600 వేతనం కావాలని డిమాండ్ చేసారు. కానీ ఇప్పటికీ వారు రూ. 225 మాత్రమే పొందుతున్నారు. ఇదే పరిస్థితి వ్యవసాయ కార్మికులకు కూడా ఉంది.
ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన అంశాలలో ఒకటి రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు. ఇది మొదటిసారిగా మధ్యతరగతికి ఊరట కలిగించేదిగా కనిపిస్తుంది. దేశంలో దాదాపు 95% కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో, వారిలో ఎంతమందికి రూ. 12 లక్షల వార్షిక ఆదాయం ఉంటుందన్న ప్రశ్న ఎదురవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సగటు ఆదాయం నెలకు రూ. 8, 000 మాత్రమే. నగరాల్లో రూ. 14, 000. అంటే, ఈ పన్ను మినహాయింపు ప్రయోజనం అత్యంత తక్కువ మంది మధ్యతరగతి ఉద్యోగస్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అసలు సమస్య పెరిగిన పరోక్ష పన్నుల వల్ల సామాన్య ప్రజలకు మరింత భారం పడుతుండటమే.
గత పదేళ్ల మోదీ పాలనలో కార్పొరేట్ ప్రపంచానికి ఇచ్చిన మినహాయింపులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. భారీ కంపెనీలకు పన్ను మినహాయింపులు, రుణ మాఫీలు లభిస్తున్నా, రైతులకు, కూలీలకు మాత్రం ఎలాంటి సహాయం అందడం లేదు. బీమా రంగంలో 100% ఎఫ్ డి ఐ అనుమతించడం ద్వారా ప్రభుత్వ రంగ బీమా సంస్థల ప్రైవేటీకరణ మార్గాన్ని ప్రభుత్వం పూర్తిగా సుగమం చేసింది. దీనివల్ల రైతులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత కార్మికులు మరింత అనిశ్చితి పరిస్థితిని ఎదుర్కొంటారు. భారత ప్రభుత్వ పార్లమెంటు ఇటీవల పేరుకుపోయిన మొండిబకాయలను (ఎన్ పి ఎ) లేదా బ్యాంకుల్లో పేరుకుపోయిన రుణాలను రద్దు చేసింది. దీన్ని. 2024 చివర్లో ప్రకటించారు. రుణం పైన వ్యాజ్యాలు, రుణ మాఫీలు, ఇతర చర్యలు తీసుకోవడం ద్వారా ఈ విలువను 8 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేసారు. ఇందులో గత పది సంవత్సరాల్లో మూడు లక్షల కోట్ల మొండిబకాయలు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని పత్రికల్లో వార్తలు వచ్చాయి.
ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ అని ప్రభుత్వం చెప్పినా, పలు కీలక రంగాల్లో నిధులు తగ్గించడం వల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. ప్రధానంగా, ఆహార ధాన్యాల సబ్సిడీ భారీగా తగ్గింపు చేయబడింది. ఎరువుల సబ్సిడీ తగ్గించడంతో రైతులు మరింత ఖర్చుతో వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. మహిళా సంక్షేమ పథకాలకు నిధులు గతంతో పోల్చితే తక్కువ కేటాయించారు. వృద్ధాప్య పెన్షన్లు, అనాథ పిల్లల కోసం పథకాలకు నిధుల లోపం కనపడుతోంది.
ఈ బడ్జెట్ ద్వారా కార్పొరేట్ కంపెనీలకు మరింత స్వేచ్ఛ కల్పించబడింది. పన్ను మినహాయింపులు, ప్రైవేటీకరణ ప్రోత్సాహంతో కంపెనీల లాభాలు పెరిగుతాయి. సామాన్య ప్రజలకు మాత్రం మినహాయింపులు తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ రాబడి తక్కువగా ఉండటంతో సామాన్యులకు నిధుల కేటాయింపు తగ్గించబడింది. ఇది దేశ ఆర్థిక అసమానతను మరింత పెంచే అవకాశముంది.
గత ఏడాది రూ. 1. 52 లక్షల కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ. 1. 71 లక్షల కోట్లకు పెంచారు. కానీ ఇది కేంద్ర సిబ్బంది జీతాలు, పెన్షన్ల కోసం కేటాయించిన రూ. 2. 74 లక్షల కోట్ల కంటే తక్కువ. వ్యవసాయ పెట్టుబడుల పెంపు లేకుండా, బడ్జెట్‌లో పెద్ద కంపెనీలకు ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వడం రైతుల అసంతృప్తికి కారణమైంది.
రైతుల నేరుగా లాభపడే పథకాలపై స్పష్టత లేకపోవడం కిసాన్ నిధి పథకం గురించి స్పష్టమైన ప్రస్తావన లేదు. రైతులకు రుణమాఫీ, పంటల బీమా మెరుగుదల వంటి డిమాండ్లు నిర్లక్ష్యం చేయబడ్డాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) పరిమితిని రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచారు. ఇది కొంతమంది రైతులకు మాత్రమే ఉపయోపడుతుంది.
ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కమ్) ఫిబ్రవరి 5న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది.
2025-26 బడ్జెట్‌లో, కార్పొరేట్ కంపెనీలకు పన్ను రాయితీలు ఇచ్చారు. ప్రస్తుతం, కంపెనీలు 25% పన్ను చెల్లిస్తుంటే, ఈ బడ్జెట్‌లో చిన్న కార్పొరేట్ల కోసం పన్ను తగ్గింపును ప్రవేశపెట్టారు. ₹400 కోట్ల నికర ఆదాయం గల సంస్థలు 22% పన్ను చెల్లించాలి. ఇది కార్పొరేట్ రంగానికి లాభప్రదమైన విధంగా ఉంది. ఎందుకంటే పన్ను తగ్గింపులతో, కంపెనీలకు పెట్టుబడులు పెంచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రైవేట్ సంస్థలకు పెద్ద పెట్టుబడులు పంచడం ప్రారంభించారు. రోడ్లు, రైళ్లు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు వంటి రంగాల్లో పలు ప్రైవేట్ సంస్థలు పాల్గొనడం ద్వారా పెట్టుబడులు పెరగనున్నాయి. ₹10 లక్షల కోట్ల విలువైన మౌలిక వసతి నిర్మాణానికి ప్రోత్సాహకాలు ఉంటాయి. ప్రైవేట్ సంస్థల కోసం, ప్రత్యేక సులభతలు, రాయితీలు అందించడం ద్వారా వారి వ్యాపార వ్యవహారాలను మరింత సులభం చేస్తోంది. దీనికి చెందిన ఉదాహరణగా, రుణాలపై సులభతలు, పెట్టుబడులకు అనుకూలమైన పథకాలు ఉన్నాయి. ఎగుమతులు పెంచేందుకు పలు ప్రోత్సాహకాలు మంజూరు చేశారు. కార్పొరేట్ సంస్థలు తమ ఉత్పత్తులను విదేశాలకు విక్రయించడానికి సులభతలు పొందే అవకాశముంది. టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి రంగాలకు మద్దతు ఇచ్చే విధంగా ప్రోత్సాహకాలు పెరిగాయి. ఇందులో భాగంగా, స్టార్ట్‌ప్ సంస్థలకు కూడా భారీ ప్రోత్సాహకాలు కల్పించారు. పెద్ద కంపెనీలు కూడా ఈ ప్రయోజనాలు పొందగలవు.
బడ్జెట్‌లో పారిశ్రామిక రంగానికి అనుకూలంగా కొన్ని రెగ్యులేటరీ సులభతలను అందించారు. కొత్త కంపెనీలు ప్రారంభించడంలో ఇబ్బందులు తగ్గించడం, లైసెన్సింగ్ ప్రక్రియను సులభం చేయడం వంటి చర్యలు తీసుకున్నారు.
2025-26 బడ్జెట్ ప్రకారం, భారతదేశం మొత్తం అప్పు 160 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఈ మొత్తాన్ని దేశవ్యాప్త జనాభాతో (సుమారు 140 కోట్ల మంది) పంచుకుంటే, ప్రతి భారతీయుడిపై సుమారు ₹1, 14, 000 వరకు అప్పు వస్తుంది. భారతదేశం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025-26) సుమారు ₹15-16 లక్షల కోట్ల వరకు కొత్త అప్పు తీసుకునే అంచనాలు ఉన్నాయి. ఈ అప్పును మేలు చేసే ప్రభుత్వ వ్యయాలకు, నిధుల అవసరాలకు ఉపయోగిస్తారు. భారతదేశం ప్రస్తుతం ఏడాది ₹8 లక్షల కోట్లకు పైగా వడ్డీ చెల్లిస్తుంది. అంటే, దేశం బడ్జెట్‌లో ప్రస్తుత అప్పుల వడ్డీపై సరిపడే మొత్తాన్ని కేటాయించాల్సి ఉంటుంది.
ఈ లెక్కల ప్రకారం, భారతదేశం ప్రస్తుతం అప్పులు, వాటి వడ్డీ చెల్లింపుల భారం పెరిగిపోతున్నది. తద్వారా, ప్రభుత్వ ఆదాయాలు వాటిని పోషించేందుకు, దేశ అభివృద్ధికి కావాల్సిన పెట్టుబడులను పొందడంలో వెనుకబడి వుంది.
ఈ బడ్జెట్ వాస్తవానికి పెద్ద సంస్థలకు మేలు చేసే విధంగా రూపొందించబడింది. ప్రభుత్వ నినాదాలు ఎంత గొప్పగా ఉన్నా, రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలకు వాస్తవ ప్రయోజనం తక్కువగానే ఉంది. ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో మాయ చేస్తున్నారు. వాస్తవంలో ఇది కార్పొరేట్‌ల లాభాలను పెంచే బడ్జెట్‌గా మిగిలిపోతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే, వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. సామాన్య ప్రజలకు నిజమైన ఉపశమనం కలిగించలేదు. ఈ బడ్జెట్ కేవలం కార్పొరేట్ అనుకూల విధానాలను కొనసాగించేందుకు మాత్రమే ఉపయోగపడుతోందని చెప్పుకోవచ్చు.
-ఎం. కె. కుమార్
ఇందులో వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని తెలియజేస్తున్నాము.
సర్, బడ్జెట్ 2025 : మీ సమీక్ష సులభంగా అర్థమయ్యేట్లు రాశారు. కథలు, కవితలకు భిన్నంగా వ్యాసం చాలా బాగుంది. 🤝👏