మే 2025 - కవితల సమీక్ష
- Dr. C S G Krishnamacharyulu
- May 31
- 5 min read
#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #ReviewOnTeluguPoems, #కవితలసమీక్ష, #TeluguPoems

Review On Poems Published IN May 2025 - Written By - Dr. C. S. G. Krishnamacharyulu
Published in manatelugukathalu.com on 31/05/2025
మే 2025 - కవితల సమీక్ష - తెలుగు సమీక్ష
రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
మన తెలుగు కథలు.కామ్
మే 2025 - కవితల సమీక్ష
( May1- May 31, 2025)
మన అంతర్జాల వేదిక పైన ఆవిష్కరింపబడుతున్న కవితల లోని అంశాలను విశ్లేషించి ఒక సమీక్ష వ్రాయాలని, మే నెలలో కవితలను ఒక శాంపిల్ గా తీసుకున్నాను
మే నెలలో ప్రచురితమైన కవితలు, వేదన కలిగించాయి, కరుణ కురిపించాయి. జాతిని ఏకం చేసే ప్రేరణ కలిగించాయి. మనుజుల సద్భావానికి, సద్వర్తనకు తగు సూచనలిచ్చాయి.
శ్రామిక దినోత్సవ కవితలు
మేడే కవితలు, సందర్భానికి అనుగుణంగా వుండి, శ్రామికుల కష్టానికి, స్వేదానికి హారతి పట్టి, వారి కండగా మనమంతా నిలవాలని వుద్బోధ చేసాయి.
“గనులలో గండాలతో, కొండలలో బండలతో, పొలాల్లో పొలిమేరల్లో పడ్డ శ్రమకు పంచుకునే మంచి లేక”(యశోద: కార్మిక లోకం)
“కరిగి కరిగి కాంతి నిచ్చు క్రొవ్వొత్తులు కార్మికులు” ( సోమన్న : త్యాగానికి చిహ్నం మేడే).
“నీ శ్రమతోటే నేడు దేశం బ్రతుకుతోంది, చెమట చుక్కలే జీవమును పోస్తూంటే” ( గాయత్రి: కర్షకుడా నీ కోసం), “నీవులేనిదే మాకు తలదాచుకునే నీడలేదు ఇది నిజము. పనికోసం ఎక్కడికైనా వెడతావు, నీకు ఎల్లలులేవు భాషాబేధములేదు” (అన్నపూర్ణ: వందనం-అభివందనం).
“సమిష్ఠిగా నడిచి మన జాతినుద్ధరిద్దాము, మమతతో కార్మికునికి మాన్యత నిద్దాము" (గాయత్రి:"శ్రామిక దినోత్సవము).
ఎంత వైభవంగా శ్రామిక దినోత్సవం జరిగిందో, అంతే వుత్సాహంగా కవితలు వెలువడి, స్వేద జీవులకు మనో ధైర్యాన్నిచ్చాయి.
అంతర్జాతీయ మాతృ దినోత్సవ కవితలు
అమ్మని సృష్టి కర్తగా, పోషకురాలిగా, మమతాను రాగాల మూర్తిగా, కీర్తించి వందనాలు సమర్పించారు కవులు.
“అపరిచితుణ్ణి నేను.- ఈ లోకానికి నన్ను పరిచయం చేసింది అమ్మ” (రంగాచారి :అమ్మ)
“పసిడి మాటలతో -భాష నేర్పేది అమ్మ -బిడ్డ బోసి నవ్వులకు- మురిసిపోయేది అమ్మే”(కందర్ప మూర్తి: మాతృ వందనం);
“అమ్మ మనసు అంటే భరోసా – తియ్యదనం -అమ్మ ప్రేమంటే వంద శాతం మధురం” ( మధు నివ్రితి : అంతర్జాతీయ మాతృ దినోత్సవం )
“అమ్మ యనిన చాలు ఆదరిం చగలదు- మనసు నిండ వెన్న, మాట తీపి” (దుర్గాప్రసాద్ :అమ్మంటే)
“ఇంటికి రాణీ ఆయినా ఇంటిల్లిపాదీకి సేవికలా నిరంతరమూ - శ్రమించే అలుపెరగని నిస్వార్థజీవి అమ్మ”.( విజయలక్ష్మ :అమ్మ);
“కరిగిపోతుంటుంది కర్పూరమై తల్లి -పరమాత్మ రూపిణికి భక్తితో వందనం!” (గాయత్రి: అమ్మ)
“అమ్మ లేక సదనం- వాడిపోయిన వనం-ఆమె ఉంటే కళకళ- తారల్లా మిలమిల” (సోమన్న :వర్ణింప సాధ్యమా!).
ఇలా కవులు/కవయిత్రులు అమ్మని శ్లాఘిస్తూ పులకించిపోగా, ఒక కవి అమృతంవంటి అమ్మతనాన్ని కీర్తిస్తూ ముగ్గురమ్మలను, “అమ్మ నాశీర్వదించరె అమ్మలార!” అని వేడుకున్నారు (కృష్ణమాచార్యులు: అమ్మకు ఆశీస్సులు). మరో కవితలో “దైవం మీద భారం వేసి బ్రతుకు మీద చిరుఆశతో కాలం వెళ్లదీస్తున్న నిర్భాగ్యురాలైన తల్లి” వేదన వ్యక్తమైంది. (నీరజ హరి ప్రభల :కన్నతల్లి వేదన - రోదన - ఆవేదన )
మొత్తానికి మాతృమూర్తికి నీరాజనం పట్టడంలో అందరూ పోటీ పడ్డారు. వ్యాసరూపంలో అమ్మని దశావతార మూర్తిగా వర్ణించే ప్రయత్నం, మధు నివృతి (అమ్మ – దశావతారం) చేయగా మాతృదేవోభవ" అని “మనం తొలిగా నమస్కరించేది అమ్మకే. అమ్మను మరిచి పోతే మనకు ఉనికే ఉండ డదు” అని హెచ్చరిక చేసారు నీరజ హరి ప్రభల(మాతృదేవోభవ).
దేశభక్తి కవితలు
పాకిస్తాన్ ఉగ్రదాడులకు ప్రతిగా భారత్ "ఆపరేషన్ సిందూర్" పేరిట దాడులు జరిపిన సందర్భంగా,సైనికులకు అంజలి ఘటిస్తూ కవులు ఎంతో వుత్సాహంగా రచనలు చేసారు.
“దేశ సౌభాగ్యమే నా ఊపిరిగ - దేశ సరిహద్దుల రక్షణే నా ప్రధమ కర్తవ్యం” (కందర్ప మూర్తి: నేను సైనికుడను) అని “దేశ రక్షణ కొరకు-నీ ప్రాణాన్ని కడకు పణంగా పెట్టుకునే--సైనికుడా! నీకు సలాం! “ ( సోమన్న: సైనికుడా! నీకు సలాం!),
“సైనికుడా! ధన్యుడవు- అందరికి స్ఫూర్తి దాతవు” ( సోమన్న: చిరస్మరణీయుడు సైనికుడు)
అని సోమన్న కీర్తించారు. అదే భావాన్ని పలికిస్తూ కందర్ప మూర్తి,
“నీ ప్రాణాలకు తెగించి ప్రజల - రక్షణే బాధ్యతగా నీ సాహసం - ఎందరో యువతకు స్ఫూర్తి!”(కందర్ప మూర్తి : సాహస సైనిక సోదరా! వందనం నీకు) అని కొనియాడారు.
“దాయది కుట్రతో -దద్దరిల్లిన దేశం - వీరులై మనవారు - విజయాన్ని తెస్తారు”(గాయత్రి: మన వీర సైనికులు ) అని గాయత్రి, “వీర సైని కులకు విజయసి ద్ధికలుగు - భరత ఖ్యాతి తెలుపు భక్తి మీర” అని దుర్గాప్రసాద్ దీవించారు. (దుర్గాప్రసాద్: కదిలె భరత సేన).
ఈ సందర్భంగా, ఒక భిన్నమైన కవితలో కవి, “ప్రియ పాకిస్థాన్ దేశ పెద్దలారా! - అహింసా పరమోధర్మ సూక్తిని, శాంతి మంత్రాన్ని- ఉజ్జ్వల భవిష్యత్తుని కోరే యువతకు చాటి చెప్పండి” అని కోరారు(కృష్ణమాచార్యులు: పాక్ పెద్దలకు పిలుపు).
మొత్తానికి విభిన్న శైలులలో కవులు/కవయిత్రులు, తమ దేశ భక్తిని చాటి చెప్పి, పాఠకులను వుత్తేజ పరిచారు
దైవప్రార్ధనలు
హనుమజ్జయంతి సందర్భంగా “ అంజనేయునికి జయమంచు నినదించెదము - ప్రాంజలించి వరదుని భక్తితో మ్రొక్కెదము” అని గాయత్రి వేడుకున్నారు.( గాయత్రి: భక్తసులభుడు హనుమ). చదువుల తల్లి, “బ్రహ్మ దేవుని యిల్లాలు రాత మార్చు - కోరి కొల్వరె జనులార! గుండె నిండ !” అని బాలకృష్ణవేణి పిలుపు నిచ్చారు( వీణాధరి)
మార్పుకి హెచ్చరికలు
కొందరు మన సమాజంలోని మనుషులకు హెచ్చరికలు చెసారు.
“నడుస్తున్నామా, అభివృద్ధి పధంలో, పడుతున్నామా, అధోగతిలో..”(సత్యనారాయణ: పతనం),
నేటి యువకులు మానవ సంబంధాలను నిర్లక్ష్యం చేసి ఫోన్ కి దాసులైన రీతిని వర్ణిస్తూ “కలల ప్రపంచాన తేలుచుండు -నెట్టింటి సామ్రాజ్యము నేలుచుండు.. కరముల నిడుకొన్న దృశ్య సాధనమె కడు రమ్యమై తోచు చుండు.. అని ఒక కవి వర్ణన. (దుర్గాప్రసాద్ :నేటి యువకుడు)
“కాలం విలువ తెలుసుకో, సద్వినియోగం చేసుకో, మానవ జన్మను సార్థకం చేసుకో”. (రాజేశ్వరి: కాలమా నీకు జోహార్లు). అని ఒక హెచ్చరిక.
మన సమాజం వృద్ధులని గౌరవించి ఆదరించమంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరించే వారెందరో.
“వృద్ధులతో మాట్లాడడం టైం వేస్ట్ అని భావిస్తారు” (మోహనకృష్ణ: గౌరవ తక్కువే),
“ మానవత్వం మృగ్యమై మనిషి- మృగంగా మారుతున్న వైనం మహర్షిగా మారకున్నా, మానవత్వం కల మనిషిగా బతకడం నేర్చుకో” (రాజేశ్వరి: మనిషీ నీ పయనం ఎటు?) అని హితవు పలికారు.
అయినా మారని బిడ్డలున్న పెద్దవారు రాజీ పడి చేసే తీర్మానం, “మనసులేనివారి దగ్గర మనుగడ సాగించడము దుర్లభం.మాకు మేమే ధైర్యం చెప్పుకుంటాము. మధురమే జీవితము అనుకుంటాము” ( విజయలక్ష్మి: మేము)
కొందరి కవితలు జీవన సూక్తులను ప్రకటించాయి. “ప్రకృతికే మానవులు ప్రణతులను చేయాలి” (గాయత్రి “ప్రకృతిమాత), “మాతృభాషను ప్రేమిద్దాము- కొత్తతరానికి రుచిచూపించి ఇదీ తెలుగు గొప్పతనం అని చాటి చెపుదాము” (విజయలక్ష్మి: మాతృభాష)
ప్రశంసలు
నర్సుల దినోత్సవ సందర్భంగా, “రోగుల భద్రత కోసం నర్సుల బృందం సమూహం -సురక్షితమైన సిబ్బంది గా ప్రాణాలను కాపాడడం” అని ఒక కవి ప్రశంసించారు (మధు నివ్రితి :నర్సులు - అసలైన హీరోలు).
చలం 131వ జయంతి నాడు ఆయన స్త్రీ పక్షపాత ధోరణికి దుర్గాప్రసాద్ అద్దం పట్టారు
“ఆడదంటె యామె అబలకా దనినాడు- పరుల శాంతి కొరకు పాటు పడెదరని -వారి యునికి కొరకు పాటు పడెను.” (దుర్గాప్రసాద్: చలం ) అందాల పోటీల సందర్భంగా, “నీ అందమైన చూపుకే మన శత్రువులంతా మటాష్. పాకిస్తాన్ బోర్డర్ వద్ద నువ్వు నిల్చొని ఉంటే చాలు.. అని చమత్కరించారు తాతా మోహనకృష్ణ (తాత మోహనకృష్ణ : అందాల బొమ్మ)
ప్రకృతి విశేషం
వర్షం కురిస్తే వుండే సంతోష విషాద ప్రతిచర్యలను వర్ణించే కవిత, "వానొచ్చింది."
” వానొచ్చింది పిలవని చుట్టములా- రైతులకు ఆశాజ్యోతిలా, వానా వానా వల్లప్ప అంటూ - చిన్నారుల చిందులా,.. ముంపుప్రాంతాల జనులలో కన్నీటిని …… -వరద బాధితులు వలస దారిపట్టారు ( విజయలక్ష్మి : వానొచ్చింది).
మార్గ దర్శకులు
ఎందరొ కవులు, కవయిత్రులు వున్నా, సంఖ్యాపరంగా, శైలి పరంగా, అగ్ర స్థానంలో నిలిచింది
గాయత్రి, (గాయత్రి గారి కవితలు 8 పార్టులు, గాయత్రి- పల్లె పిలిచింది 9 పద్యమాలికలు), మరియు సోమన్న(11 పార్టులు, 55 కవితలు). కవిత వ్రాయాలనుకున్న వారికి వీరు మార్గ దర్శకులని చెప్పవచ్చు. గాయత్రి చందోబద్ధ పద్య రచనా ప్రయోగాలు శ్లాఘనీయం.
ముగింపు మాట
కవితలు సులభ శైలిలో నడిచాయి. కొందరి కవిత, మందగించిన నడకతో గద్యరూపం సంతరించుకోవడం గమనించ దగ్గ విషయం. పద్య రచన చేసే వారు ఛందస్సు విషయంలో జాగ్రత్త వహించాలి.
భావాలకు తగ్గట్లు, అక్షరాలు పరుగులు దీయాలి. పదములు మేధను, భావం మనసుని తాకాలి. ఈ విషయంలో సాధన అవసరం.
@@@@@
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.
ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).
Wonderful analysis reflecting the scholarship of the author. Kudos sir
ఈ క్రమబద్ధమైన విశ్లేషణ చేయాలన్న మీ ఆలోచన మరియు దాన్ని నిర్వహణ తీరు, మీ విమర్శనాత్మక ఆలోచనాశక్తిని మరియు భాషపై మీకున్న మమకారాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. అందరు సులభంగా రెండు నిమిషాలలో చదవగలిగేలా బాగా రచించారు. రచయిత కి అభినందనలు.👏
C..S.G . కృష్ణమాచార్యులుగారు మే2025లో ప్రచురించిన కవితల పై వ్రాసిన సమీక్ష చాలా బాగుంది. కవితలను అంశం పరంగా విభజించి, విశ్లేషించిన తీరు ప్రశంసనీయం.