top of page

రుచి

#SurekhaPuli, #సురేఖపులి, #Ruchi, #రుచి, #TeluguStory, #తెలుగుకథ

ree

Ruchi - New Telugu Story Written By Surekha Puli

Published In manatelugukathalu.com On 18/07/2025

రుచి - తెలుగు కథ

రచన: సురేఖ పులి

కథా పఠనం: పద్మావతి కొమరగిరి

అమ్మ నాన్న పట్టణం పెళ్లి సంబంధం చూసి నా ప్రమేయం లేకుండా ఒప్పుకొని వచ్చారు. ఒక్కగానొక్క కొడుకు ప్రభుత్వ ఉద్యోగం, పెద్ద ఇల్లు; బంధువుల పిల్లలతో ఇల్లు ఎప్పుడు కళ కళ లాడుతూ ఉంటుందని తొందర పెట్టారు. మెట్రిక్ తోనే చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. 


నిజమే విశాలమైన గదులు, ఎత్తైన చూరు, పొడుగాటి కిటికీలు, దళసరి తలుపులు, ఇంటి ముందు పూల మొక్కలు, ఇంటి ఎదుట ముచ్చటైన పెద్ద ముగ్గు. ఇంటి వెనుక ఒకవైపు ఏపుగా పెరిగిన జామ, మామిడి, సపోటా, అరటి, బొప్పాయి చెట్లు. మరోవైపు ఆకుకూరలు, కూరగాయల మొక్కలు. ముఖ్యంగా తులసి కోట, దాని గూట్లో ఎల్లవేళలా వెలుగుతున్న దీపం. మాంఛి హుందా ఆరోగ్య అవయవ సౌష్టవం గల్గి ప్రేమగా చూసుకునే మా వారు. కన్నకూతురు వలె చూసుకుంటున్న అత్త మామలు; ఇంతకంటే స్వర్గం వేరొకటి ఉంటుందా?!


ప్రతి రోజు చేసే వంటలు ఇష్టంగా తినేవారు. వేసవి కాలం వచ్చింది. మామిడి కాయల నిల్వ పచ్చడి పెట్టాను. ఇంటికి వచ్చే పోయే బంధు వర్గం వలన సంవత్సరం పచ్చడి వంద రోజుల్లో ఖాళీ అయ్యింది. 


ఆ తరువాత “నీ చేతి పచ్చడికి తిరుగు లేదు, మాకు విడిగా పెట్టమని” వరుస కట్టారు. ఎవరికి వారే ఖర్చు భరించారు. ‘బంధు మిత్రులకు సాయం చేయాలి, అందరి మన్ననలు పొందాలి’ ఈ మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ వాటి వెనుక నేను పడే శ్రమ అధికమైంది. అందుకే మొహమాట పడకుండా “నా వల్ల కాదని చెప్పాను.”


“లక్ష్మీ! అలా అనకు, ఏదో పాపం మా కజిన్స్ ఎంతో ఆశగా అడుగుతున్నారు. చాలా సార్లు వాళ్ళు పెట్టిన పచ్చళ్లు, ఊరగాయలు బూజు పట్టడం, రుచిగా లేక పోవడం వలన నిన్ను బతిమాలి అడుగుతున్నారే తప్ప, ఏదో నిన్ను కష్ట పెట్టాలని వారి ఉద్దేశ్యం కాదు” మా వారితో పాటు అత్తగారు వంత పాడారు. 


అయితే ఒక షరతు పెట్టాను; అదేమంటే నాకు సహాయంగా ఒక ఆడమనిషి కావాలని. వారంలో ఇంచుమించు నా వయసున్న మాణిక్యం వచ్చింది. ముఖం చూడగానే పొగరనిపించింది. నేనేమో తెలంగాణ, ఆవిడ ఆంధ్ర. 


ఇంట్లో స్వయంగా తయారు చేసిన పొడులు, పచ్చళ్లు ఆమె భర్త సైకిల్ మీద వీధుల వెంట తిరిగి అమ్ముకుని సాఫీగా ఇల్లు నడుపుకుంటున్నట్టు తెలిసింది.


నాణ్యమైన ఎండు మిరపకాయలు తెచ్చి డాబా పైన మండుటెండలో ఎండబెట్టి, శుభ్రపరిచి ఇంటి వెనుక భూమిలో పాతిన రోట్లో రోకలితో, కుదురు అడ్డం పెట్టి పచ్చడి కారం పొడితో పాటు ఏడాది నిలువ పెట్టుకునే వంట కారప్పొడి, పసుపు కూడా దంచడం; అలుపెరుగక సులువుగా పచ్చడికి కావలసిన ఇతర దినుసులన్నీ వేయించి పొడి కొట్టింది. మరి ఎక్కువ మోతాదులో పంచాల్సిన పచ్చడి కదా!


మామిడి కాయలు పెద్ద గంగాళం నీళ్ళల్లో శుభ్రపరచి, తుడిచి ముక్కలు కొట్టి పచ్చడి కలిపి జాడిలో భద్రపరిచే వరకు మాణిక్యం బాధ్యత వహించేది. నేను కేవలం కుర్చీ వేసుకుని సరైన కొలతలతో పని పురామాయించేదాన్ని. ఇతర నిలువ పచ్చళ్లు అంటే చింతకాయ, ఉసిరికాయ, నిమ్మకాయ వంటి పచ్చళ్లకు కూడా సాయం తీసుకొనేదాన్ని. ఈ శ్రమ ఫలితం మా వారికి దక్కింది. 


మాణిక్యం అంటే నాలో ఆత్మీయత పెరిగి పాత బట్టలు ఇమ్మని అడిగితే కొత్త నేత చీరలు కొనిచ్చాను. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు ఉండేది. కారణం అడిగితే చెప్పదు.


ఎడతెరపిలేని వానలు కురుస్తున్నాయి మాణిక్యం ఏడుస్తూ వచ్చింది. పెళ్ళయి ఎంతో కాలమైంది సంతానం కలగడం లేదని మొగుడు కొట్టాడుట. మా వారు సలహా ఇచ్చారు “డాక్టర్ పరీక్ష చేయించుకోండి” అని. మా వారు జోక్యం కలిగించుకుంటే నచ్చలేదనుకుంటా.. ఆ తర్వాత మాణిక్యం రాలేదు. 


వీలు చేసుకుని నన్ను మా వారు కారులో మాణిక్యం ఇంటికి తీసుకెళ్లారు. యవ్వనం మితిమీరిన అమ్మాయి వచ్చి అక్కకు జ్వరమని పలుకరించింది. మా ఫ్యామిలీ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాము. తిరుగు ప్రయాణంలో ఏడుస్తూ చెప్పింది పిల్లలు పుట్టలేదని తన చెల్లెలు తన భర్తతో సంబంధం పెట్టుకుని కులుకుతున్నారట. ఫలితంగా నెల తప్పింది! గట్టిగా నిలదీసి అడిగితే, మొగుడు చావు దెబ్బలు కొట్టి తనదైన బంగారం, వెండి దాచుకున్న కొద్ది డబ్బు లాక్కొన్నాడట. అంతే, ఇక ఆ తరువాత మాణిక్యం కనబడలేదు. 


***


ఉద్యోగ రీత్యా మేము న్యూయార్క్ లో సెటిల్ అయ్యాము. మా పిల్లల తరం తర్వాత తరం వచ్చింది. వయసు భారం తప్ప ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా వారు ప్రాణం విడిచారు. నేనూ ఎప్పుడో పోతాను, పోయే ముందు ఒక్కసారి నా స్వదేశం చూడాలనిపించింది. ఊహించలేనంతగా మారి పోయింది భాగ్యనగరం!


అప్పటి పట్టణం ఇప్పుడు గ్రేటర్ మున్సిపాలిటీ అయ్యింది. అద్దెకు ఉంటున్న ప్రభుత్వ ఆఫీస్ ను ఖాళీ చేయించి, అధిక డబ్బు ఖర్చు చేసి అర్బన్ క్లీన్ మరమ్మతు చేస్తే ఇంటికి కళ వచ్చింది.


నా పెద్ద మనవడు అర్జున్ కారులో నగరమంతా తృప్తి తీరా తిరిగాను. గుర్తు పట్టలేనంతగా మారి పోయింది నగరం. మన దేశం కూడా జనాలతో, వాహనాలతో బరువెక్కింది. మాణిక్యం ఇంటి వైపు దారి చూపించాను 


ఇల్లు కనబడలేదు, అద్దాల దుకాణం “తెలుగు రుచులు” అనే చిన్న బోర్డు ఉంది. లోపలికి వెళ్ళాను, ఎంతో శుభ్రంగా, పద్దతిగా అమర్చిన అన్ని రకాల పచ్చళ్లు, పొడులు, నెయ్యి, వెన్న, వడియాలు, అప్పడాలు, చల్ల మిరపకాయలు.. అబ్బో ఎన్నో! వయసు మళ్ళి మాణిక్యం భర్త కాష్ కౌంటర్ వద్ద కూర్చున్నాడు. ఎదురుగా మాణిక్యం చెల్లెలి ఫోటోకు దండ ఉంది. వారి పిల్లలు కాబోలు అటు ఇటు తిరుగుతూ వచ్చిన వినియోగదారులతో వారి ఉత్పత్తుల గొప్పలు చెప్తున్నారు. 


“మేడమ్! అమ్మగారు, మీరు కూర్చోండి. ఈ కేటలాగ్ చూసి మీకు నచ్చినవి చెప్బితే మీ వద్దకు తెస్తాను” కొద్దిగా మాణిక్యం పోలికలున్న అమ్మాయిని చూస్తే ముచ్చటేసింది. 


కాష్ కౌంటర్ వద్ద కుర్చీలో కూర్చున్నాను. అర్జున్ దుకాణం అంతా తిరిగి తన కోరిక మేరకు చిన్న తోపుడు బండి సరుకులతో నింపుకున్నాడు. బిల్లు వేలల్లో అయినట్టుంది. “గ్రానీ! నీకేం కావాలి?” 


అవును, నాకేం కావాలి! స్తబ్దతగా ఉంది. అర్జున్ తోసుకుంటూ వచ్చిన బండిలో అన్నీ ఉన్నాయి, ఇంకా కొత్తగా ఏం కావాలి? 

ఆత్మీయత కోసం వెతుకుతున్నాను. కనబడలేదు. 


***


కరెంట్ పొయ్యి మీద అన్నం వండాడు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ముద్ద ముద్దకు పచ్చడి వెరైటీ మారుస్తూ తింటున్నాడు. 


“గ్రానీ! మన రుచులు మన రుచులే!” నోట్లో నీరు ఊరుతుంటే లొట్టలు వేసుకుంటూ అన్నాడు. 


“ఆ.. నోరు తెరువు.. నీకు ఇష్టమైన మాగాయ పచ్చడి” అంటూ ఊరిన ముక్కను తృప్తిగా అన్నంలో కలిపి ముద్ద నాకు తినిపించాడు. 


“ఎలా ఉంది?” హుషారుగా అడిగాడు. నోట్లో ముద్ద, మాట్లాడితే పలక మారుతుందని సన్నగా నవ్వాను. 


“టేస్ట్!.. రుచి చెప్పు, క్వాలిటీ.. నాణ్యత? ఆ షాప్ వారు మన రేటింగ్ అడుగుతున్నారు. ఫైవ్ స్టార్ కొట్టనా?”తొందర పెట్టాడు.


“అర్జున్! నిజం చెప్పాలా??” నా మనువాడు నాకు మంచి స్నేహితుడు. 


“ఓన్లీ ట్రూత్.. నిజం చెప్పు గ్రానీ” నా కళ్ళల్లోకి చూస్తూ హుషారుగా అన్నాడు. 


“నాకు నచ్చలేదు. ఎక్కువ కాలం నిల్వ ఉండాలని కెమికల్స్, రంగు కలిపారు. నాకు రుచిగా లేదు.”


“మరి నాకు నచ్చింది కదా? ప్రాబ్లం వాళ్ళకు చెబితే వాళ్లు సరిదిద్దుకొని నాణ్యత సమకూరుస్తారు.” 


“అసలు రుచి నీకు తెలియదు. నీకు తెలియజేసే సత్తువ నాలో లేదు. రాను రాను ఈ రుచి లేని వాటికి మీరు అలవాటు పడ్డారు” అసలు విషయం చెప్పాను. అర్జున్ కు అర్థం కాలేదు. ప్లేట్ లో మిగిలిన అన్నంలో మరింత పచ్చడి కలుపుకుని తృప్తి పడ్డాడు. 


“తెలుగు రుచుల” మెసేజ్ మళ్ళీ మళ్ళీ వచ్చింది. జవాబు ఇవ్వలేదు. తెలుపు రంగు ఐదు నక్షత్రాలు పసుపు రంగుగా మారలేదు. 


*****

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 

పేరు :సురేఖ  ఇంటి పేరు: పులి

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.

ప్రస్తుత నివాసం బెంగళూరు  విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను.  స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008  లో స్వచ్ఛంద పదవీ విరమణ.

చందమామ, యువ, స్వాతి,  ఈనాడు,  మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే  లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.

Surekha Puli 


1 Comment


ధన్యవాదాలు 🙏

Like
bottom of page