'Sabhaash Sanjeevi - Episode 7' - New Telugu Web Series Written By Otra Prakash Rao Published In manatelugukathalu.com On 03/02/2024
'శభాష్ సంజీవి - ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక
రచన : ఓట్ర ప్రకాష్ రావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
‘గుడ్దిగోలా’ బ్రాండ్ కూల్ డ్రింక్ తాగడంవల్ల వచ్చే నష్టం గురించి స్కూల్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు తొమ్మిదవ తరగతి స్టూడెంట్ సంజీవి.. దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు, డీలర్ చండుడు..
వార్డెన్ విశ్వనాథాన్ని లోబరుచుకుని, సంజీవి మీద దొంగతనం నేరం మోపి, ఆ బాధలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేస్తారు.. అక్కడ బాలు అనే కుర్రాడు పరిచయమౌతాడు సంజీవికి..
గుడ్దిగోలాకు అనుకూలంగా మరో మ్యాజిక్ ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు చండుడు. ఆ మెజిషియన్, సంజీవి చేసిన ప్రదర్శన మోసమని నమ్మిస్తాడు. సంజీవి కిడ్నాప్ అయినట్లు గ్రహిస్తాడు హెడ్ మాస్టర్ వెంకటరమణ. సంజీవి దయ్యమై వచ్చినట్లు వార్డెన్ విశ్వనాథాన్ని భయపెడతారు విద్యార్థులు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిజం ఒప్పుకోవాలనుకుంటాడు విశ్వనాథం.
తమను బంధించిన చోటునుండి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు బాలు, సంజీవి. పిల్లల మంచితనం చూసి, వాళ్ళను వదిలివేస్తారు చండుడి అనుచరులు.
ఇక శభాష్ సంజీవి - ఎపిసోడ్ 7 చదవండి..
ఎవరూ గుర్తుపట్టకూడదని ముఖానికి మాస్క్ వేసుకున్నట్లు జేబురుమాలు కట్టుకున్నారు.
ఆటోలో ఎక్కుతున్నప్పుడు "బాబూ మీరు ఈ వూరికి కొత్తా, ఇప్పుడు కరోనా భయం ఏమీ లేదు " అన్నాడు ఆటో డ్రైవర్.
"మా జాగ్రత్తలో మేముండాలి గా " అన్నాడు బాలు.
ఆటోవెళ్తున్నప్పుడు దారిలో వచ్చిన హై స్కూల్ చూపిస్తూ, "అన్నా అదే హై స్కూల్ "అన్నాడు సంజీవి.
వెంకటరమణ ఇంటిముందు ఆటో నిలబడగానే దిగారు. ముఖానికి కట్టుకున్న జేబురుమాళ్ళు తీసేసారు.
కాలింగ్ బెల్ కొడుతూ "సార్ " అంటూ పిలిచాడు సంజీవి.
తలుపులు తెరచిన వెంకటరమణ ఎదురుగానున్న సంజీవిని చూడగానే కొన్నిక్షణాలు నమ్మలేక పోయాడు.
"సంజీవి.." అంటూ సంతోషంతో చేతులు పట్టుకొంటూ కుర్చీలో కూర్చొనబెట్టాడు.
జరిగింది క్లుప్తంగా చెప్పాడు సంజీవి.
“పోలీసు స్టేషన్ కు మీతో కలసి వెళ్లాలని వచ్చాను సార్ "
"దానికిముందు హాస్టల్ వార్డెన్ విశ్వనాథం ఇంటికెళ్లి ఆయనను చూసి పోదాం "
"ఆ సార్ నామీద.. "అన్నాడు సంజీవి.
రమణ అసలు విషయం చెప్పాక "నేను తప్పుగా అర్థం చేసుకొన్నాను. వెంటనే వెళ్దాం సార్ " అన్నాడు.
ఇన్స్పెక్టర్ రామూర్తి కి ఫోన్ చేసి చెప్పాడు.
"రమణా, మీరెవరూ రావద్దండి. పోలీసు వెహికల్ తీసుకొని నేనే వస్తాను. " అన్నాడు.
మరికొంతసేపటిలో రామూర్తి బైక్ లో వచ్చాడు. వెనుకనే జీప్ వచ్చింది.
రాంమూర్తి తో జరిగిందంతా చెప్పాడు.
అందరూ పోలీసు స్టేషన్ కు బయలుదేరుతూ దారిలో విశ్వనాథం ఇంటికి వెళ్లారు.
వారితోపాటు వస్తున్న సంజీవిని చూడగానే ఆశ్చర్య పడింది విశ్వనాథం భార్య యమున
"విశ్వనాథంను చూడాలని పట్టుపట్టడంతో పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా ఇలా వచ్చాము. ఆయనను పిలవండి, మేము వెళ్ళాలి. " వెంకటరమణ అన్నాడు.
యమున వేగంగా స్నానాలగది దగ్గరకు వెళ్లి "ఏమండీ తొందరగా రండి. మీకో శుభవార్త " బిగ్గరగా అంది.
"ఏమిటో చెప్పు స్నానం చేస్తుండగా మధ్యలో రమ్మంటావా " లోపలనుండి అడిగాడు.
“ఆ సంజీవి క్షేమంగా ఇప్పుడు మనింటికి వచ్చాడు. " అంది.
"ఏమిటీ సంజీవి వచ్చాడా" అంటూ తలుపులు తెరుచుకొని వేగంగా వచ్చి "సంజీవి.. సంజీవి " అంటూచేతులు పట్టుకొంటూ "ఎరా బాగున్నవారా, " అంటూ కన్నీళ్లతో అడిగాడు.
అతనిభార్య ఒక పంచె తీసుకొని వచ్చి భర్తకు కప్పింది.
'విశ్వనాథం సారుకు నేను వచ్చానన్న వార్త అంతులేని సంతోషం కలిగించింది. ఆర్కిమెడిస్ యురేకా అంటూ స్నానాలగది నుండి వచ్చినట్లు ఆయన ’సంజీవి సంజీవి’ అంటూ దుస్తులు వేసుకోవాలన్నఆలోచన లేకుండా అలాగే వచ్చారు. ' అని సంతోషంతో అనుకొన్నాడు సంజీవి.
"సంజీవీ, హాస్టల్ విద్యార్థులలోనీవంటే నాకు ప్రత్యేకమైన అభిమానము ఉందిరా. నేను చేసిన చిన్న పొరపాటు నీవు కష్టాలు అనుభవించావు. నీవు వెళ్ళినప్పటినుండి మనశాంతిని కోల్పోయానురా. నిన్నుప్పుడు చూస్తుంటే చాలా చాలా సంతోషంగా వుందిరా" దుఃఖం, సంతోషం కలిసిన గొంతుతో అన్నాడు విశ్వనాథం.
“నన్ను క్షమించండి సార్ నేనూ మిమ్మల్ని తప్పుగా అంచనా వేసాను. హెడ్మాస్టర్ సార్ ఇంతకుమునుపు మీగురించి అంతా చెప్పారు. " అన్నాడు సంజీవి.
"మీరు పొరపాటుగా చేసినపని మంచిలో ముగిసింది. ఒక పెద్ద గ్యాంగ్ పట్టుకొనడానికి సహకరించింది సార్ " అన్నాడు బాలు.
సంజీవి జరిగిన కథ క్లుప్తంగా చెప్పాడు.
"మీరిద్దరూ రాత్రంతా నిదురలేకుండా బస్సులో వచ్చి ఎలా వున్నారో చూడండి. ఇద్దరూ స్నానాలు చేసుకొని టిఫన్ తిన్నతరువాత వెళ్ళండి. " అన్నాడు విశ్వనాథం.
"సాయంత్రం మీ హాస్టల్ కు వస్తారు. వీళ్ళిద్దరూ మా డిపార్ట్మెంట్ కు చాలా సహాయం చేశారు. వీళ్ళకు ఏలోటూ లేకుండా చూసుకొనవలసిన బాధ్యత మాకు వుంది. వీళ్లిద్దరికీ కావలిసిన దుస్తులు తీసుకొని రమ్మని మా డిపార్ట్మెంట్ మనిషిని పంపాము. అలాగే స్నానం టిఫన్ పూర్తయ్యాక న్యూస్ పేపర్ల వారు టీవీల వారితో వీరు మాట్లాడాలి. ఈరోజు వీరికి చాలా పనివుంది " అన్నారు రాంమూర్తి.
అందరూ జీపులో పోలీసుస్టేషనుకు వెళ్లారు. జీపు ముందుగా బైకులో రాంమూర్తి వెళ్ళాడు.
బైక్దిగగానే స్టేషన్ దగ్గరున్న నలుగురిని చూస్తూ "హాయ్ డిటెక్టివ్స్ మీకు ఎలా తెలిసింది "
"ముఖ్యమైన పనివుంది రమ్మనమని హెడ్ మాస్టర్ చెబితే వచ్చాము. ఏం పనో చెప్పలేదు చెప్పలేదు అంకుల్ " అన్నాడు భగవాన్.
అప్పుడే వచ్చిన నిలబడిన జీపులోంచి దిగుతున్న సంజీవిని చూడగానే "ఒరే సంజీవీ" ఇంచుమించు నలుగురూ ఒక్కసారి బిగ్గరగా సంతోషంతో అరుస్తూ దగ్గరకు వెళ్లారు
****** ***
ఇద్దరు పోలీసుల సాయంతో హొటేలుకెళ్ళిస్నానం చేసుకొని కొత్త దుస్తులు ధరించారు.
ఏ సి రూములో వున్నవారికి హోటల్ వారు టిఫన్ పెట్టారు.
"అన్నా, ఇద్దరికీ ఒకే డిజైన్ వున్న దుస్తులు తీసుకొనివచ్చారు" అన్నాడు సంజీవి.
"వాళ్ళుకూడా మనల్ని అన్నాతమ్ములుగా మార్చేసారు" అన్నాడు బాలు.
"వాళ్ళు చెప్పినా చెప్పకపోయినానువ్వు నాకు అన్నవే "
జిల్లాకేంద్రంనుండి పోలీసు అధికారులు వచ్చారు.
పోలీసు అధికారులంటే ఏదో తెలియని భయం ఉండేది వారు చాలా స్నేహ పూర్వకంగాసరదాగామాట్లాడటం ఇద్దరికీ ఆశ్చర్యం కలిగింది.
జరిగిందంతా వివరంగా చెప్పారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
"సంజీవి శాస్త్రీయం, బాలుతర్కం బాగానే వుంది. అడగడం మర్చిపోయాను అక్కడివారందరికి పరోటా, చికెన్ కొత్తు పరోటా, కంపెనీ స్నాక్స్ అంటూ పెట్టి వారిని శారీరకంగా అనారోగ్యం చేసారుగా, మరి మీరేమి తిన్నారు "
"వంటగది మా సామ్రాజ్యం సార్, వాళ్లకు కావలసింది మూడువేళలా ఆహరం. మేమేమి చేస్తున్నామో ఇంతవరకు చూడలేదు. పరోటాలతో పాటు మాకోసం గోధుమ రొట్టెలు చేసుకొంటాము. ఎక్కువ రోజులు అన్నం చేసుకొంటాము. ఆహారం విషయంలో మేము అన్ని జాగ్రత్తలు పాటించాము సార్ " అన్నాడు సంజీవి.
"చివరకు జంక్ ఫుడ్ ఆహరం శాస్త్రీయంగా ఫుడ్ పాయిజన్ అవుతుందని నిరూపించి సంజీవి గెలిచాడు సార్ " అన్నాడు బాలు.
"మొదట గెలిచింది బాలన్న సార్. తన తర్కంతో ఆసిడ్ లాంటి గుడ్డి గోలా గోడకు పోస్తే ఒకరోజు గోడ పడిపోతుందని చెప్పినట్లు గోడ పడిపోయింది. బాలు అన్ననే గెలిచాడు సార్ " అన్నాడు సంజీవి.
"తర్కం, శాస్త్రీయం విషయంలో ఏం సమాధానం చెప్పాలో తెలీదుగానీ మా పోలీసుడిపార్టుమెంటుకు పెద్ద సాయం చేశారు " అన్నారు.
"ఇక కాస్సేపట్లో మీడియా వారు వస్తారు. వారడిగిన దానికి సమాధానం చెప్పినతరువాత ఇక్కడి నుండి మీరు వెళ్లిపోవచ్చు. "
"బాలూ, మీడియా వారు వెళ్ళాకనిన్ను మీ ఊరిలో దింపే ఏర్పాటు చేయమంటావా. " అడిగాడు పోలీసు అధికారి.
"మా నాన్న ఫోన్ నుంబర్ తెలీక ఫోన్ చెయ్యలేదు. మీడియాలో ఫోటో చూసాక తప్పకుండా ఇక్కడకు వస్తారు. మా అమ్మా నాన్నలు అనుమతిస్తే నేను ఇక్కడే వుండి చదువుకోవాలనుకొంటున్నాను. వెంకటరమణ సార్ నన్ను పదవతరగతి పరీక్షలకు వెళ్లే ఏర్పాటు చేస్తానన్నారు. "
"బాలూతో వాళ్ళ అమ్మానాన్నలువీడియో కాల్ నందు మాట్లాడే ఎర్పాటు చెయ్యి రామూర్తీ. వాళ్ళు సంతోషిస్తారు. " అన్నాడు పోలీసు జిల్లా అధికారి.
బాలుదగ్గర వారి చిరునామా తీసుకొన్నాడు.
మరి కొన్ని నిముషములలోనే వీడియో కాల్ నందు వచ్చారు.
"అమ్మా మీరు బాలూ తల్లితండ్రులా" అడిగాడు రామ్మూర్తి.
"ఔను మీరెవరు ? మా బాలు ఎక్కడున్నాడు ? ఎలావున్నాడు? " ఏడుపుగొంతుతో అమ్మ గట్టిగా అనడం బాలు విన్నాడు.
"అమ్మా బాలు బాగున్నాడు, మీ బాలుమా పోలీసువారికి పెద్దముఠాను పట్టించి మంచి పేరుతెచ్చుకొన్నాడు, ఇంకాసేపట్లో మీడియా ముందు మాట్లాడతాడు. మీరు బాలూతో మాట్లాడండి " అంటూ బాలు చేతికి ఫోన్ ఇచ్చాడు రామూర్తి.
బాలూను చూడగానే బోరుమని ఏడవసాగింది. "అమ్మా.. అమ్మా.. " అంటూ బాలూ పిలుస్తున్నా ఏడుస్తూనే వుంది. బాలూకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడే తండ్రి కనపడ్డాడు. అమ్మ దగ్గరనుండి నాన్న ఫోన్ తీసుకున్నాడని ఊహించాడు. ఇంకా అమ్మ ఏడుస్తున్న గొంతు వినపడుతూనే వుంది.
మొదటి సారి తండ్రి కళ్ళలో కన్నీరు చూసాడు.
"ఒరే బాలూ, నిన్ను ఎంతప్రేమగా పెంచాము తెలుసా. నిన్నేనాడైనా ఒక్క దెబ్బయినా కొట్టామానీవు సెల్ ఫోన్ కు పూర్తిగా బానిసయినప్పుడు మేమిద్దరం ఎంతగా బాదపడ్డామో నీకు తెలీదు, నీకు తెలీకుండా డాక్టరుదగ్గరకు వెళ్లి అడిగాము. సెల్ ఫోన్ రిపేరు చెయ్యండి, కొత్తది అడిగితే కొన్ని రోజులు తరువాత కొంటాము అంటూ ఆలశ్యం చేయమని ఆ డాక్టరు అన్నారు. నేను సెల్ ఫోన్ రిపేర్ అయ్యేలా చేసాను. కానీ నువ్వు అలా చేస్తావనుకోలేదు. "
"సారీ నాన్నా, ఫోన్ కొనిస్తేనే ఇంట్లో వుంటాను. లేకుంటే ఇల్లువదిలి పోతాను, అంటూ బెదిరించగానే మీరు కొత్త సెల్ ఫోన్ కొనిచ్చారు. "
"అప్పుచేసికొత్తదికొనిచ్చాము, నిన్నుఎలా మార్చాలో అర్థంకాలేదు. ఆ సెల్ ఫోన్ వలన పదవతరగతిలో అన్ని సబీజెక్టులలోఫెయిల్ అయ్యావు. అప్పుడుకూడా నిన్ను మందలించాము తప్ప కోప్పడలేదు. ఫెయిల్అయిన బాధ నీలో లేదు. బైక్ కావాలంటూ గొడవపెడితే మేము కొనివ్వము అంటూ ఖండితముగా చెప్పాము. ఇంతకుముందులాగానే కొనివ్వకుంటే ఇల్లు వదిలి పోతానంటూ బెదిరించావు. అప్పుడుకూడా పరుషముగా మాట్లాడలేదు. కానీ నీవు కోపంతో ఇల్లువదలి పారిపాయావు. మేము ఏమి తప్పుచేశామని ఇల్లువదలి పారిపోయావు. "
"క్షమించండి నాన్నా. మిమ్మల్ని వదిలి వెళ్ళాక నేనెంత తప్పు చేసానో తెలుసుకున్నాను, సెల్ ఫోన్ ఎంతటి అపాయకరమైనదో నేనిప్పుడు తెలుసుకున్నాను. తొమ్మిదవతరగతిలో కళ్ళజోడు వేసుకున్నా ఆ సెల్ ఫోన్ దుష్ఫలితం గుర్తించలేదు. అమ్మకు ఫోన్ ఇవ్వండి " అన్నాడు.
"ఒరే నీవువెళ్ళాక మేము మనుషులుగా జీవించలేదురాశవం లాగజీవించాము. మేమిద్దరమూ చిన్నప్పటినుడి కొట్టకుండా పెంచడం తప్పుకాదు, తప్పుచేసినప్పుడు చెప్పినా విననప్పుడు నిన్ను కొట్టివుంటే నీవిలా వెళ్ళివుండేవాడివి కాదని ఇప్పుడు బాధపడుతున్నాము " అంది అమ్మ.
"అమ్మా ఇల్లువదలి ఎంతపెద్ద పొరపాటో ఇప్పడు తెలుసుకొన్నాను"
"జరిగిందేదో జరిగిపోయింది. వెంటనే ఏదో ఒక బస్సు, ట్రైన్ ఉంటే వచ్చేయ్. "
"అమ్మ, మా వలన మత్తుమందు పానీయం తయారుచేసే ఒక పెద్ద కంపెనీని స్వాధీనం చేసుకొన్నారు. ఇంకాసేపట్లో మీడియా వారు మాతో ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు. "
"ఆ విషయాలు అన్నీ తరువాత మాట్లాడుకొందాం. ఆ కార్యక్రమం పూర్తి అయిన వెంటనే నీవు వచ్చేయ్ "
"అమ్మా, ఒకే ఒక చిన్న విషయం చెప్పాలి. నేను ఈ ఊరిలో చదువుకోవాలనుకొంటున్నాను. నీవు వద్దంటే ఈ రోజే వచ్చేస్తాను "
బాలూ చేతిలో ఫోనును సంజీవి తీసుకొన్నాడు.
"ఆంటీ! నా పేరు సంజీవి. నేను, బాలన్నఆ ముఠా దగ్గర మూడునెలలు గడిపాము. మేమిద్దరమూ అన్నదమ్ముల లాగ కలసిపోయాము. మా హెడ్ మాస్టర్ కు జరిగిందంతా చెప్పాము. ఈ సంవత్సరం పదవతరగతి పరీక్షలకు వెళ్ళడానికి ఏర్పాటు చేయడమే కాదు మంచి మార్కులతో పాస్ అయ్యేలా తాయారు చేస్తాననిచెప్పారు. మీరు ఒప్పుకుంటే బాగుంటుంది ఆంటీ "
"ఒకటి కాదు రెండు కాదుతొమ్మిది నెలలువాడికి దూరంగా వున్నాము. ఇక వాడిని దూరంగా ఉంచి మేము వుండలేముబాబూ. ఫోన్ వాడికి ఇవ్వు "
“అమ్మా ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చెయ్యడం లేదు. నేను సెల్ ఫోన్ అడగడం లేదు బైక్ అడగడం లేదు ఇక్కడ ఉంటే బాగా చదవగలనన్న నమ్మకం వుంది "
“మా దగ్గరకు వస్తే చదవవా “
"మీ దగ్గరకు వచ్చినా చదువుతాను అమ్మా. నేను పాత బాలూ కాదమ్మా. కొత్త బాలూను. మీరేమి చెప్పినా వింటాను “
"మీ నాన్న ఏదో మాట్లాడాలంటున్నాడు వుండు “
"బాలూ, నీలో మార్పు చాలా గుర్తించాను. నీవు చదువుకోసం అడుగుతున్నావు. ఇప్పుడే నేను అమ్మ కలసిఅక్కడకు బయలుదేరుతాము. ఇక మేమూ అదే ఊరిలో వుంటాము "
“నాన్నా మీ వుద్యోగం”
"ఆ ఊరికి ప్రక్కనే మా కంపెనీ వుంది. ట్రాన్స్ఫర్ అడిగితే తప్పకుండా ఇస్తారు “
"థాంక్స్ నాన్నా, థాంక్స్ అమ్మా, ఇక వుంటాను "అన్నాడు బాలు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
ఓట్ర ప్రకాష్ రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1. పేరు: ఓట్ర ప్రకాష్ రావు
https://www.manatelugukathalu.com/profile/oprao/profile2. నా గురించి : 2017న జనవరి నెలలో రాణిపేట బి.హెచ్.ఈ.ఎల్. నందు పదవీ విరమణ పొందిన తరువాత తమిళ నాడు లోని తిరుత్తణి లో స్థిరపడ్డా ను. ”Free Yoga” పేరు మీద తిరుత్తణి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితముగా యోగాసనములు నేర్పుతున్నాను. తీరిక సమయంలో కథలు వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను 2020 సంవత్సరం మార్చ్ మాసం నుండి లాక్ డౌన్ కారణంగా బడులు తెరవకపోవడంతో పిల్లలకు ఉచిత యోగ తరగతులకు వెళ్ళలేక పోయాను 3. విద్య : ఐ టీ ఐ 4. సాహిత్య ప్రపంచంలోని తీపి జ్ఞాపకాలు : 1988 న ఆంధ్రప్రభ వారు నిర్వహించిన తెలుగు మినీ కథల పోటీలో మొదటి బహుమతి, 2015 నందు రాయగడ రచయితల సంఘం నిర్వహించిన కథల పోటీలో కన్సోలేషన్ బహుమతి, 2017 ,2018,2019,2020 నందు కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందా ను. 2018 న కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కవితల పోటీలో బహుమతి పొందాను 2018 అక్టోబర్ నెలలో Mytales.in నిర్వహించిన చిట్టినీతి కథల పోటీలో నా కథను ఉత్తమ కథగా ఎన్నిక 2020 ప్రతిలిపి వారు నిర్వహించిన మాండలిక కథల పోటీలో మొదటి బహుమతి లభించింది 2021 శ్రీ శ్రీ కళావేదిక వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో మొదటి బహుమతి 2021 మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రత్యేక బహుమతి 6. ఇంతవరకు ప్రచురించినవి ఆంధ్రప్రభ ,ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, గోతెలుగు ,హాస్యానందం, జాగృతి, కెనడా తెలుగుతల్లి, ప్రజాశక్తి ,ప్రతిలిపి ,ప్రియదత్త, రచన, వార్త, విపుల ,శ్రీ శ్రీ కళావేదిక, మనతెలుగుకథలు.కామ్ - పత్రికలలోమొత్తం మీద ఇంతవరకు 70 కథలు ప్రచురించబడింది ఆంధ్ర ప్రభ , బాల భారతo ,ఈనాడు హాయ్ బుజ్జి , మనతెలంగాణ , నవతెలంగాణ , ప్రభాత వెలుగు దర్వాజా , ప్రజాశక్తి , సాక్షి, వార్త , విశాలాంధ్ర - పత్రికలలో 130 బాలసాహిత్యపు కథలు
댓글