top of page

శభాష్ సంజీవి - ఎపిసోడ్ 8



'Sabhaash Sanjeevi - Episode 8' - New Telugu Web Series Written By Otra Prakash Rao Published In manatelugukathalu.com On 08/02/2024

'శభాష్ సంజీవి - ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక

రచన : ఓట్ర ప్రకాష్ రావు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


‘గుడ్దిగోలా’ బ్రాండ్ కూల్ డ్రింక్ తాగడంవల్ల వచ్చే నష్టం గురించి స్కూల్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు తొమ్మిదవ తరగతి స్టూడెంట్ సంజీవి.. దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు, డీలర్ చండుడు.. 


వార్డెన్ విశ్వనాథాన్ని లోబరుచుకుని, సంజీవి మీద దొంగతనం నేరం మోపి, ఆ బాధలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేస్తారు.. అక్కడ బాలు అనే కుర్రాడు పరిచయమౌతాడు సంజీవికి.. 


సంజీవి కిడ్నాప్ అయినట్లు గ్రహిస్తాడు హెడ్ మాస్టర్ వెంకటరమణ. సంజీవి దయ్యమై వచ్చినట్లు వార్డెన్ విశ్వనాథాన్ని భయపెడతారు విద్యార్థులు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిజం ఒప్పుకోవాలనుకుంటాడు విశ్వనాథం. 


తమను బంధించిన చోటునుండి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు బాలు, సంజీవి. పిల్లల మంచితనం చూసి, వాళ్ళను వదిలివేస్తారు చండుడి అనుచరులు. 

హెడ్ మాస్టర్ తో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు సంజీవి, బాలు. 

బాలు, పేరెంట్స్ తో ఫోన్ లో మాట్లాడుతాడు. 


ఇక శభాష్ సంజీవి - ఎపిసోడ్ 8 చదవండి.. 


పోలీసులు చెప్పడంతో మీడియా వారందరూ వచ్చారు. రిపోర్టర్ అడిగే ప్రశ్నలకు బాలు, సంజీవిసమాధానం చెప్పారు. 


 ఆ సాయంత్రం హోటల్ గదినుండి పోలీసు వారి జీపులో హాస్టలుకు వచ్చారు. అప్పటికే హాస్టల్విద్యార్థులతో, బడిపిల్లలతో, హాస్టల్ ప్రాంగణం అంతా నిండుకొంది. 

"సాహస బాలురకు సుస్వాగతం"


"బాలు సంజీవి స్వాగతం సుస్వాగతం" అంటూ పేపర్లలో రంగులతో రాసిఅతికించి వున్నారు. 

బాలు సంజీవి హాస్టల్ లోనికి ప్రవేశించగానే ఒక్కసారిగా పైనుండి పువ్వులు వేశారు"గ్రేట్ బాలు.. గ్రేట్ సంజీవి " అంటూ గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టసాగారు. ఆనందంతో బాలు వెనుకవున్న తల్లి తండ్రుల వైపు చూసాడు. 


కన్నీళ్లు తుడుచుకొంటున్న తల్లి తండ్రులను చూస్తూ "అమ్మా, నాన్న ఏమైంది "అంటూ అనుమానంగా అడిగాడు. 


"బాధకాదు బాలూ, చాలా చాలా సంతోషం కలగడంతో ఆనందబాష్పాలు "అంటూ దగ్గరకు ప్రేమతో తీసుకొన్నారు. 


బాలూ సంజీవిలకు పూల మాలలు, శాలువా వేసి గౌరవించారు. 

విశ్వనాథం తన ప్రసంగంలో జరిగినదంతా దాపరికం లేకుండా చెప్పిన తరువాత "ఆ రోజు సాయంత్రం సంజీవిచేత నేను తీసుకొచ్చిన దుప్పట్లు పంచాలని అనుకొన్నాను. ఆ దుప్పట్లు అలాగే వుంది. ఎవరికీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ దుప్పట్లు అన్నీ సంజీవు బాలు కలసి అందరికీ పంచవలసినదిగా కోరుతున్నాను " అంటూ ముగించాడు. బాలు, సంజీవిలు హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంచారు. 

*** *** ***

 బడిలోనే సంజీవికి అభినందన సన్మానం ఏర్పాటు గొప్పగా చేశారు. వేదికమీద విద్యాధికారి, ఆఊరి ప్రముఖులు, బాలు, సంజీవి, జడ్డు కూర్చొనివున్నారు. ప్రముఖులతోపాటు జడ్డూ కోర్చొనడం అందరినీ ఆశ్చర్య పరిచింది. 


 విద్యాధికారి తన ప్రసంగంలో "సంజీవి, బాలు సమయస్ఫూర్తితో శాస్త్రీయంగా అలోచించి జంక్ ఫుడ్ అనే ఆయుధాన్ని సంజీవి ఉపయోగిస్తే, తన తర్కంతో గుడ్డి గోలాతో గోడను పడేలా బాలూ చేసాడు. " అన్నాడు. 


కిడ్నాప్ జీవితం గురించి సంజీవి కొంతసమయం, బాలు కొంత సమయం వివరంగా చెప్పారు. 

బాలు తన ప్రసంగంలో సెల్ ఫోన్ వలన తన జీవితం దెబ్బతిన్న విషయం కూడా వివరించి చెప్పాడు. 


జడ్డూ మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు "పిల్లలూ, నేను వ్యాపారస్థుడిని. ఆ ఏజెంట్ చండుడు తన మాటలతో నన్ను మంత్ర ముగ్దున్ని చేసాడు. ఆ చండుడు తేనే పూసిన కత్తి అని ఇప్పుడు తెలుసుకున్నాను. వున్న పానీయాల్లో గుడ్ది గోలా మంచిదంటూ చెప్పాడు. వ్యాపారం బాగా జరగడంతో నేనూ ఆ పానీయం మంచిదనే భావించాను. అసలు నిజం ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ చేతులతో మీకు ఆ విషంఅమ్మాను. ఈ కార్యక్రమం ముగిశాక నా అంగడి బయట ఇంకా అమ్ముడు పోని గుడ్ది గోలా పానీయము బాటిల్స్ బయట వుంచాను. మొదటి బాటిల్ తీసుకొని కుప్పతొట్టిలో వేయడానికి సంజీవి అంగీకరించాడు. ఆ తరువాత మీరందరూ తీసుకొని అక్కడున్న కుప్పతొట్టి లో పడవేయండి. ఈ రోజు నుంచి నేను రసాయనములు లేని ఆరోగ్యకరమైన పానీయములు అమ్మదలచుకొన్నాను. " అన్నాడు.


అందరూ చప్పట్లు కొట్టారు. 


కార్యక్రమం ముగిశాక సంజీవి ఒక గుడ్ది గోలా పానీయాన్ని కుప్పతొట్టిలో వేసాడు. వెనుకనే పిల్లలందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఆ గుడ్ది గోలాను తీసుకొని కుప్పతొట్టి లో వేశారు. చాలామంది వీడియో తీశారు. ఆ వీడియో కొన్ని న్యూస్ చానెల్స్ నందు ప్రసారం చేశారు. 


జడ్డు అంగట్లో నిమ్మ రసం, మసాలా మజ్జిగ, కొబ్బరినీళ్లు అమ్మకం ప్రారంభించాడు. 

బడిపిల్లలు, ఊరివారు జడ్డూను మెచ్చుకొన్నారు 

*** *** ***

 

బాలు తల్లి తండ్రులు ఆ ఊరిలోనే ఒక ఇంటిని అద్దెకు తీసుకొన్నారు. మరుసటిరోజే వున్న ఇంటిని ఖాళీ చేసికొత్త ఇంటికి వచ్చారు. 


 ప్రతిరోజూ బడి వదిలాక బాలు ఇంటికెళ్లి కాస్సేపు గడిపిన తరువాత, సంజీవి హాస్టలుకు వెళ్లడం అలవాటు చేసుకొన్నాడు.


“నిన్ను కిడ్నాప్చేసాక నీవు ఎంతో నరకాన్ని అనుభవించి వచ్చావు. నీవు అంతా వివరించి చెప్పావు. జిల్లా మొత్తం టోకు వ్యాపారం చేస్తున్నచండుడు పారిపోయినా, వాడి బంధువు ఎవడో ఆ టోకు వ్యాపారం బాధ్యత తీసుకొని నడుపుతున్నాడంట. ఒక్క మన వూరిలోనే గుడ్ది గోల పానీయం అమ్మకం మానుకున్నారు. అన్ని ఊర్లలో ఎప్పటిలాగా వ్యాపారం అవుతుంది. “ అన్నాడు యుగంధర్.


 "బాలన్నఉంటున్నమిద్దె మీద విశాలమైన స్థలం వుంది. మీరందరూ బడివదిలాక అక్కడికి రండి. ఆవిషయమై చర్చించాలి. బడిలో చర్చించడం సరియైనదిగా తోచడం లేదు" అన్నాడు సంజీవి. 

 

సాయంత్రం చాలావరకు తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థులందరూ గుమికూడారు. 

"మనం పోరాటం చేయాలి "


"సంజీవి ఏమిటి నీవంటున్నది. "


"ఔను పోరాటంచేయాలి. శాంతియుతమైన పోరాటం "


"మన చదువులు దెబ్బ తింటుంది. తల్లితండ్రులు అంగీకరించరు "


"నేను బడి పనిచేసే రోజుల్లో పోరాటం చేయమనడం లేదుగా. ఆదివారాలు మాత్రం చేదాం.


పోరాటంఅంటే ప్రతి ఆదివారం ఒక గంట మాత్రమే రైలు, బస్సు నిలిపివేద్దాం. " అన్నాడు సంజీవి. 

"ఇది జరిగేపని గా అనిపించడం లేదు సంజీవీ" అన్నాడు ఒక విద్యార్ధి.


"మన బడిలో ఇంత పెద్ద సంఘటన జరిగినా పక్క ఊరిలోని విద్యార్థులలో మార్పు రాలేదు. ఇప్పటికీ గుడ్ది గోల పానీయం అమ్ముడు పోతూనే వుంది. మన ఊరు పిల్లలు మాత్రం పోరాటం చేసినంత మాత్రాన విజయవంతం అవుతుందా సంజీవీ " 


"మీరంతా తప్పుగా ఊహించుకొంటున్నారు. దూబగుంట అనే గ్రామంలో రోశమ్మ అనే మహిళ ఉండేది. భర్త చనిపోవడంతో ఇద్దరు కొడుకులను కష్టపడి పెంచి పెద్ద చేసింది రోశమ్మ. వారు ప్రయోజకులు కావడానికి బదులు సారాకు బానిసలయ్యారు. కుటుంబ జీవితం చిన్నాభిన్నమైంది. 

తన కుటుంబంలాగా మరో కుటుంబం కాకూడదని రోశమ్మ భావించింది. ఆ గ్రామంలో సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభించింది. ఆ ఉద్యమం జిల్లా మొత్తం ఆ తరువాత రాష్ట్రం మొత్తం వ్యాపించింది" అన్నాడు అక్కడే వున్న బాలు. 


"అన్నా! నీవు చెప్పేది ఒక మహిళ గురించి, విద్యార్థి గురించి కాదుగా "అన్నాడు ఒక అబ్బాయి. 

"2014సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి ఇద్దరికీ ఇచ్చారు. అందులో మలాలా యాసూఫ్ జాయి అను పదిహేడు సంవత్సరాల వయసున్న టీనేజ్ అమ్మాయికి లభించింది. తీవ్రవాదంపై అత్యంత సాహసోపేతంగా ప్రాణాలకు తెగించి పోరాడింది. అసామాన్యమైన మలాలా సాహసాలకు ప్రపంచమంతా శబాష్ మలాలా అంటూ మెచ్చుకొన్నారు " అన్నాడు బాలు. 


"ఇంతకూ మనం గుడ్ది గోలా పానీయం నిషేదించమని పోరాటం చెయ్యాలా" 


"అది కాదు" 


"మరేమిటి "


“రెండే రెండు కోరికలు. మొదటి కోరిక ఏమిటంటే ప్రముఖ హీరో డబ్బుకోసం గుడ్ది గోలా తాగమంటూ ప్రకటన చేసాడు. ఆ హీరో చదువుకున్నవాడు. అంత చదువు చదివిన వ్యక్తి సినిమాలలో నటించడానికి ఎన్నో కోట్లు తీసుకొంటున్న వ్యక్తి, అత్యాశతో వారిచ్చే డబ్బుకోసం ఆ గుడ్ది గోలా పానీయం ఆరోగ్యమైనదంటూ ప్రకటనలో నటించినందుకు క్షమాపణ చెప్పాలి. రసాయనం లేని కొబ్బరి బొండాం, నిమ్మరసం, చెరకు రసం లాంటి పానీయములు త్రాగమని ప్రకటించాలి "


అందరూఆశ్చర్యంగా సంజీవి వైపు చూడసాగారు. 

" రెండవ కోరిక ?"


"ప్రతి పాఠశాలకు ఐదువందల అడుగుల తరువాత జంక్ ఫుడ్విక్రయం జరగాలి "


"రెండూ జరిగేలా లేవు "


"మీరు మరలా పొరపాటు పడుతున్నారు. మన దేశంలో ఒక జిల్లాలో పాఠశాలకు ఐదువందల మీటర్ల తరువాత జంక్ ఫుడ్ విక్రయించాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. రెండవ కోరిక పెద్ద కోరిక కాదు " అన్నాడు బాలు. 


"పోరాటం అంటే డబ్బు కావాలి. బానర్ తయారు చెయ్యడం, ఇంకా ప్రచారసాధనాలు అంటే మైక్ లాంటివి, టిఫన్లు, టీ ఖర్చులు.. ఎవరిస్తారు "


“సాయంత్రం వేళ మనం చందాలు వసూలు చేద్దాం ఈ రోజే వ్యాపారస్తుల ఇండ్లకు వెళదాము. ”

బట్టల వ్యాపారస్తుడు బంగారయ్య అంగడికి వెళ్ళాడు. సంజీవిని చూడగానే ప్రేమతో ఆహ్వానించాడు. 


”నిన్ను టీవీలో చూసాను. నేరుగా వచ్చి కలవాలని అనుకొన్నా, పనులవల్ల రాలేకపోయాను "అన్నాడు బంగారయ్య. 


సంజీవి తాను వచ్చిన సంగతి వివరించాడు.


"సంజీవీ, ఈ నెల అంతా మీ సమ్మెకు కావలసిన మైక్, బ్యానర్ లాంటి ఖర్చులు నేనే బరిస్తాను "

'సార్.. " ఆశ్చర్యం సంతోషం కలిసిన గొంతుతో పిల్లలు అన్నారు.

 

"ఇలా ముందుకు రావడానికి కారణం మా అమ్మాయి. జంక్ ఫుడ్ తిని తిని ఇప్పుడు మా అమ్మాయి అనారోగ్యం పాలయింది. ప్రకటనలు నమ్మి మోసపోయి అనారోగ్యం తెచ్చుకొంది. మీరు చేస్తున్న పోరాటంలో న్యాయముంది. మీకు కావలసిన సాయం చేస్తాను. కానీ నాపేరు ఎక్కడా పోస్టర్ నందు ప్రకటించకూడదు " అన్నాడు బంగారయ్య.

*********

హెడ్ మాస్టర్ గదికి సంజీవి వెళ్ళాడు. 

"సార్, గుడ్డి గోలా పానీయం పై పరోక్షంగా పోరాటం ప్రారంభిస్తున్నాము "


" సంజీవీ, ఏం చెబుతున్నావు "


తీసుకొన్న నిర్ణయం గురించి చెప్పాడు.

"పబ్లిక్ లో పోరాటం అంటే చాలా కొన్ని సంప్రదాయాలు అంటే ముందుగా పోలీసుల దగ్గర అనుమతి తీసుకోవాలి "


"తెలుసు సార్, ఈ రోజు బడి వదిలాక నలుగురు కలసి వెళ్లి ఇన్స్పెక్టరుకు ఉత్తరం ఇవ్వాలనుకొంటున్నాము "


"ప్రభుత్వోద్యోగిగా నేను ఏమీ చెప్పలేక పోతున్నాను. కానీ నీ రెండవ కోరిక అయిన పాఠశాలకు ఐదువందల మీటర్ల లోపున జంక్ ఫుడ్ అమ్మకం నిషేదించాలని మా జిల్లా ఉపాధ్యాయుల సంఘం కలెక్టరుకు ఒక వారం క్రితమే ఉత్తరం ఇచ్చాము. " అన్నాడు. 


 సాయంత్రం విద్యార్థులు కలసి ఒక ఉత్తరం తయారు చేసారు. ఆ ఉత్తరం తీసుకొని వెళ్లి ఇన్స్పెక్టర్ దగ్గరకువెళ్లి ఇచ్చారు. 


ఉత్తరం చదివిన రామూర్తి ఉలిక్కి పడ్డాడు 

"సంజీవి, నీ వయసెంత.. ఈ వయసులో పోరాటం అంటూ..”


"పోరాటానికి వయసుతో పనేముంది సార్, పోరాటం చేసిన టీనేజ్ అమ్మాయి మలాలా గురించి నేను చెప్పనక్కర లేదు. ఆమె పోరాటానికి గుర్తింపుగా నోబుల్ బహుమతి ఇచ్చారన్న సంగతి మీకు తెలుసుకదా సార్ "


"మాటలు బాగా నేర్చావే. ఆ వుత్తరం అక్కడ పెట్టి వెళ్ళు "నవ్వుతూ అన్నాడు రాంమూర్తి. 

 పోస్టర్లు ప్రింట్ అయింది. 


 'గుడ్డి గోలా పానీయం ఆరోగ్యమైనదని అబద్దపు ప్రకటన చేసిన ఆ హీరో.. క్షమాపణ చెప్పాలి' 

'సహజ పానీయాలు తాగమంటూ.. హీరో ప్రకటన విడుదల చెయ్యాలి' 


'పాఠశాలకు ఐదువందల మీటర్ల లోపున జంక్ ఫుడ్ అమ్మకాన్ని నిషేధించాలి'


'మా కోరిక నెరేవేరేంత వరకు ప్రతి ఆదివారం ఒక గంట ధర్నాపోరాటం చేస్తుంటాము' ప్రతి స్లోగన్ క్రింద ఇట్లు ప్రభుత్వ పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యార్థులు అనివుంది దాని ప్రక్కన ఆ ఊరి పేరు వుంది. 


అదేవిధంగా అందరికీ పంచడానికి కరపత్రాలు ప్రింట్ చేయించారు. 


చిన్న బానర్లు తడికలకు అతికించారు. ఆదివారం పది మంది పిల్లలతో బానర్లు పట్టుకొని రైల్వే స్టేషన్ కు వెళ్లి పట్టాల పైన కూర్చొన్నారు. బండి నిలబడిన తరువాత కరపత్రాలు పంచారు. పావు గంట తరువాత పోలీసులు వచ్చి “ఇక వెళ్ళండి “ అంటూహెచ్చరించడంతో లేచి వెళ్లారు. 

 అక్కడినుండి బస్సుస్టాండుకు వెళ్లి మరో పావు గంట బస్సులన్నీఆపి కరపత్రాలు పంచారు. 

వాటి ఫోటోలు మిత్రులు సెల్ ఫోన్ ద్వారా తీశారు. అక్కడకూడా పోలీసులు పావుగంట కాగానే వెళ్ళమని చెప్పడంతో వెళ్లిపోయారు.


హాస్టల్ నందు భోజనం ముగించుకొని బాలు ఇంటికి వెళ్ళాడు సంజీవి. 


"అన్నా, మా తరగతిలో వారందరూ వస్తారనుకొన్నాను. మొత్తం పదిమంది వచ్చారు. ఈ పోరాటం ఎంతవరకు విజయవంతం అవుతుందో అర్థంకావడం లేదు " అన్నాడు సంజీవి. 


"సంజీవీ, దూబగుంటలో సారా వ్యతిరేక పోరాటాన్నిరోశమ్మ పదిమందితో ప్రారంభించింది, ఆతరువాత జిల్లా.. రాష్ట్రం అంతా కదిలించింది. పోరాటం ఒక ఉప్పెనలా మారింది, మీ పోరాటం ఇంతకు మించి గొప్పగా మారుతుందన్న నమ్మకం నాకుంది " అన్నాడు బాలు. 


మిత్రుల ఫోన్ ద్వారా జిల్లాలో వున్నా ఉన్నత ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నాయకుడికి (SPL) ఫోన్ ద్వారా తాము చేస్తున్న పోరాటం గురించి తెలుపుతూ, ఆదరించమని కోరాడు. పిల్లల చదువు ఇబ్బంది కలగకుండా ప్రతి ఆదివారం పోరాటం చేస్తున్నట్లు తెలిపాడు. తమ కరపత్రాలు, బ్యానెర్లు, పోరాటం సమయాన చేసిన ఫొటోలో వాట్స్ అప్ ద్వారా అందరికీ పంపించాడు. 


========================================================================

ఇంకా వుంది..

========================================================================

ఓట్ర ప్రకాష్ రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1. పేరు:  ఓట్ర ప్రకాష్ రావు

https://www.manatelugukathalu.com/profile/oprao/profile2. నా గురించి   : 2017న జనవరి నెలలో రాణిపేట బి.హెచ్.ఈ.ఎల్. నందు పదవీ విరమణ పొందిన తరువాత తమిళ నాడు లోని తిరుత్తణి లో స్థిరపడ్డా ను. ”Free Yoga” పేరు మీద తిరుత్తణి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితముగా యోగాసనములు నేర్పుతున్నాను. తీరిక సమయంలో కథలు వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను 2020 సంవత్సరం మార్చ్ మాసం నుండి లాక్ డౌన్ కారణంగా బడులు తెరవకపోవడంతో పిల్లలకు ఉచిత యోగ తరగతులకు వెళ్ళలేక పోయాను 3. విద్య : ఐ టీ ఐ 4. సాహిత్య ప్రపంచంలోని తీపి జ్ఞాపకాలు  :  1988 న ఆంధ్రప్రభ వారు నిర్వహించిన తెలుగు మినీ కథల పోటీలో మొదటి బహుమతి,  2015 నందు రాయగడ రచయితల సంఘం నిర్వహించిన కథల పోటీలో కన్సోలేషన్ బహుమతి,    2017 ,2018,2019,2020 నందు కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందా ను.   2018 న కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కవితల పోటీలో బహుమతి పొందాను               2018 అక్టోబర్ నెలలో Mytales.in నిర్వహించిన చిట్టినీతి కథల పోటీలో నా కథను ఉత్తమ కథగా ఎన్నిక               2020 ప్రతిలిపి వారు నిర్వహించిన మాండలిక కథల పోటీలో మొదటి బహుమతి లభించింది             2021 శ్రీ శ్రీ కళావేదిక వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో మొదటి బహుమతి           2021 మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రత్యేక బహుమతి 6. ఇంతవరకు ప్రచురించినవి  ఆంధ్రప్రభ ,ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, గోతెలుగు ,హాస్యానందం, జాగృతి, కెనడా తెలుగుతల్లి, ప్రజాశక్తి ,ప్రతిలిపి ,ప్రియదత్త, రచన, వార్త, విపుల ,శ్రీ శ్రీ కళావేదిక, మనతెలుగుకథలు.కామ్ - పత్రికలలోమొత్తం మీద ఇంతవరకు 70 కథలు ప్రచురించబడింది       ఆంధ్ర ప్రభ , బాల భారతo ,ఈనాడు హాయ్ బుజ్జి , మనతెలంగాణ , నవతెలంగాణ , ప్రభాత వెలుగు దర్వాజా , ప్రజాశక్తి , సాక్షి, వార్త , విశాలాంధ్ర - పత్రికలలో 130 బాలసాహిత్యపు కథలు

58 views0 comments
bottom of page