top of page
Writer's pictureBharathi Bhagavathula

సాఫల్యం

#BhagavathulaBharathi, #భాగవతులభారతి, #Safalyam, #సాఫల్యం, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Safalyam - New Telugu Story Written By Bhagavathula Bharathi

Published In manatelugukathalu.com On 30/11/2024

సాఫల్యం - తెలుగు కథ

రచన: భాగవతుల భారతి

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



ముసురేసిన ఆకాశం వర్షిస్తూ 

మురిపాల నిను గుర్తుచేస్తోంది. 

ఙ్ఞాపకాల జడిలో నను తడిపేస్తూ.. 


మైకు ముందుకు జరిపి.. ప్రశ్న అడిగిన వారివైపు, ఓసారి కన్నెత్తి ఆకాశం కేసి చూసి, ఆలోచిస్తూ.. తలదించుకున్నాడతను. 


జీవితం కూడా తల దించుకోమనే నేర్పిందేమో?! తనకి!? జీవితం నేర్పిందా?

ఆమె నేర్పిందా? నిట్టూర్చాడు అతను. 


గతం మనసును కుదిపేస్తుంటే క్షణం మౌనం గా ఉన్నాడతను. 


"ఈ మల్లె తీగ ఇక్కడ పెట్టావేం?" ఆమె ప్రశ్నకు.. 

"నీలా నాజూగ్గా ఉండి, నాలాంటి మామను అల్లుకోవాలనీ!ఈ కొబ్బరిచెట్టుకి అల్లికగా పెట్టా!" అతడనగానే రెల్లు పూవల్లే నవ్విందామె. 


"అయ్యో! ఆ లేగదూడ పారిపోతోంది చూడూ!" అన్నాడతను. 


"అవునూ! అమ్మ దగ్గరకే పోతోందిలే! నేను చెప్పింది ఏం చేసావ్?" ఆమె అడిగింది. 

"అవన్నీ!?.. మన పెళ్ళి జరిగి ఇంకా ఏడాది కూడా కాలేదు. అప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకోటం అమ్మానాన్నలకు నచ్చదేమో?!"


"ఈ పల్లెటూరిలో ఉండి మనమేం చేస్తాం చెప్పూ"


"ఏం చేస్తున్నామో చూస్తున్నావుగా! ఉదయం అంతా! ఇలా ఈ పెరడులో చెట్లు నాటడం, తర్వాత నాన్నకి సాయంగా, పొలానికి పోవటం, మధ్యాహ్నం రావటం, కాస్త, అమ్మచేతి వంట తినటం, అలా ఊళ్ళోకి వెళ్ళి ఓ ఆర్. యం. పి డాక్టర్ గా, వైద్యసహాయం చేయటం.. 


సాయంత్రం కాగానే, ఇంటికివచ్చి, ఉడుకునీళ్ళోసుకుని, 

వేడి అన్నంలో, పెరుగూ, మామిడికాయ పచ్చడి, మామిడి పండు రసమూ యేసుకుని, జుర్రి, ఆరుబయట వెన్నెలలో, నులక మంచం పై, నీ పక్కన నడుం వాల్చి, వెన్నెలను చూస్తూ, నీతో!.. "


"ఇక చాల్లే ఆపు. ఈ పల్లెటూరిలో ఏముంది? పేడకంపూ, మట్టి యిల్లు తప్పా! ఎంచక్కా పట్నం పోదాం!అక్కడ జీవనోపాధి కి తక్కువేం ఉండదు. నేనూ ఇంటర్ పాసయ్యాను. ఏదో చిన్నపాటి ఉద్యోగం నాకూ దొరుకుతుంది. పోదాం.. పా"


"వద్దు వెన్నెలా! ఇక్కడి స్వేచ్ఛ, స్వచ్చతా, ఈ పైరుగాలి పచ్చదనం, వీళ్ళ మనసుల అమాయకత్వం.. ఇవన్నీ పట్నంలో ఉంటాయా?"

ఇలా రోజూ ఈ కొత్త జంట చంద్రయ్య, వెన్నెల ల సంభాషణ, చిలిపి తగాదాలూ, చంద్రయ్య తల్లీదండ్రీ వింటున్నారు. 


"ఏరా! వెన్నెల అంత ముచ్చట గా చెబుతోంది గా! ఇక్కడ చేసే డాక్టరీ పట్నంలో చేసుకుంటే బోలెడు డబ్బురా! వెన్నెల మాత్రం ఎవరురా? నా అక్క కూతురేగా? దాని సంతోషమే మన సంతోషం. పట్నం పోయి కాపరం పెట్టండి. వైజ్జిగం (వైద్యం)అనేది.. అందరికీ అవసరమైనదేగా! పోతూవస్తూ ఉండచ్చూ!"


ఎన్నో రకాలుగా నచ్చచెప్పాక, చంద్రయ్య వెన్నెలతో, పట్నంలో కాపురం పెట్టాడు. 

చందమామ, వెన్నెల లా చక్కని కాపురం.. 

 --------------

"బావా!నేను పనిచేసే పెద్ద స్కూల్లో, నేను మరీ చిన్నపిల్లలకు, ఆయాలాంటి చిన్న టీచర్ ని. అదేస్కూల్లో పెద్ధ చదువులు చదివి, పెద్ధ జీతానికి, మంచి ఉద్యోగం చేస్తున్న టీచర్లుఉన్నారు. వారిలాగా, నేనూ, చదువుకుంటాను. ఇంకా పెద్ద టీచర్ నయితే, ఇంకా, బోలెడు జీతం వస్తుంది" 


"కానీ! వెన్నెలా! నువ్వు ఒట్టి మనిషివి కాదే! ఓ పిల్లవాడికి తల్లివి.. ఓ బిడ్డను కడుపున మోస్తున్నావ్? అమ్మానాన్నా ఏమంటారో? ఇంత రిస్క్ ఎందుకంటారో! ఏమో!?"


"మరి! ఖర్చులు పెరగటల్లా!? దానికి తగిన సంపాదన ఉండాలంటే మనం మన నాలెడ్జ్ పెంచుకోవాలి కదా! నేను చదువుకుంటా. "


"సరేలేరా! చదువుకోవాలనే దాని ఇష్టం కాదనటం ఎందుకు? చదువుకోనీ! మేము డబ్బు పంపుతాములే!"


తల్లీదండ్రీ కూడా ఆమెకే ఓటు వేయటంతో, చదువుకు తనవంతూ, ఆర్ధికంగానూ, కుటుంబపరంగానూ, చేదోడు వాదోడుగా ఉంటూ, వెన్నెలను డిగ్రీ, పూర్తి చేయించి.. బి.యిడి రాయించాడు. 


లేడీస్ రిజర్వేషన్ కోటాలో.. స్కూల్ అసిస్టెంట్ టీచర్ జాబ్ వచ్చేసింది. మరుసటి ఏడు ట్రాన్స్ ఫర్ మీద ప్రమోషన్ వచ్చింది. 


"పిల్లలు చిన్నవాళ్ళు. ఎక్కడో దూరంగా భూపాలపల్లి లో ఎందుకు? ఇక్కడే దగ్గరలో ట్రాన్స్ ఫర్ చేయించుకో " అన్నాడు చంద్రయ్య. 


కానీ అప్పటికే వెన్నెల తీరూ తెన్నులు మారిపోయాయ్. మాటతీరు, కట్టూ బొట్టు, లో మార్పూ, మాటలో పాలిష్ వచ్చేసినాయ్. 


సెల్ ఫోన్ సంభాషణలూ, పిల్లనూ, వంటింటినీ పట్టించుకోకపోవటం, పట్టణ నాగరికతను 

శరీరంలోనూ, నడవడిక లోనూ నింపేసింది వెన్నెల. ఆమెను గమనించిన భర్త, అటుపెద్దలూ, ఇటు పెద్దలూ, కొంచెం మందలించాలని చూసారు. నచ్చలేదు. 


"నేను భూపాలపల్లి వెళ్ళిపోతున్నాను ఇక అక్కడే ఉంటాను."

ఉన్నట్లుండి బాంబు పేల్చింది వెన్నెల. 


"అదేంటి? నీకిక్కడ ఏం తక్కువైంది. బంగారంలాంటి మగడు. నువ్వు కోరినట్లే, సిటి కొస్తివి. కోరి సదివితివి. కోరిన జాబూ వచ్చే. సంసారాన్ని తీర్చిదిద్దుకోరాదటే! పోనీ నీ మగడు ఆర్. యం. పి కదా! చేతిలో వైద్దెం(వైద్యం) దేశంలో ఎక్కడైనా ఉపయోగపడుద్ది. ఇల్లు చూసుకుని నలుగురూ ఆణ్ణే ఉండండి" హితవు చెప్పారు. 


ఓ మిట్టమధ్యాహ్నం, చంద్రయ్య లేని సమయంలో, బట్టలూ సర్టిఫికెట్ లు తీసుకుని, ఆడపిల్లను నట్టింట్లో వదిలేసి, 

మగపిల్లవాడిని తీసుకుని, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎంతమంది ఫోన్లు చేసినా ఎత్తలేదు. 


పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తే, చంద్రయ్య తల్లీదండ్రీతో పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. 


అక్కడ వెన్నెలను చూసి, "వెన్నెలా! ఏందే ఇదీ? బాగున్నావా? భూపాలపల్లి నుండి ఎప్పుడు వచ్చావ్? ఇంటికి రాకుండా పోలీస్ స్టేషన్ లో ఏంచేస్తుండావే?" ఆతురుతో అడుగుతున్న, చంద్రయ్య, అతని తల్లిదండ్రులతో.. 

పోలీస్ అధికారి "ఓరి! మీ యాక్టింగో! నీ మీద నీ భార్య వెన్నెల కేసు పెట్టింది. మీ వల్ల తన కొడుకుకు, తనకు, ప్రాణహాని ఉందని కేసువేసింది. ఇద్దరూ ఫామిలీ కోర్టుకు కౌన్సిలింగ్ కు హాజరు కావాలి. " అన్నాడు. 


"ఇదేందిరా అయ్యా?! పోలీసులేందీ? ఇదేదో కౌన్సి? గిదేందిరా? ఇయ్యన్నీ వద్దురా! మన పల్లెకు పోదాంపద!" తల్లీ దండ్రీ హతాశులయ్యారు. ఏడ్చారు. 


"ఫ్యామిలీ కౌన్సెలింగ్ అంటే, భార్యాభర్తల ను ఓ చోట చేర్చి, పెద్దలు మంచి మాటలతో కలపాలని చూస్తారు. అంతేగానీ! కొట్టటాలూ తిట్టటాలూ, ఏం ఉండవు" పోలీసులు నచ్చచెప్పారు. 


రెండు సిట్టింగ్ లకు హాజరయ్యాక, పోలీస్ ఇన్స్పెక్టర్.. 

"చంద్రయ్యా! ఆమె వెళ్ళిపోవటానికి సరైన కారణాలు చెప్పటం లేదు. ఆమె చెప్పే కారణాలూ అతుకుతున్నట్లు లేవు. మీ ఆవిడ నీతో కలిసి ఉండటానికి అంగీకారం తెలపటానికి, ఏడాది గడువు కావాలంటోంది. నువ్వు ఆమె ఉన్న చోటికి వెళ్ళటానికైనా పరిస్థితులేవో చక్కబెట్టుకోవాలని చెబుతోంది. ఏడాదే పడుతుందో?! ఎన్నేళ్ళు పడుతుందో వేచి చూడటం తప్ప ఏం చేయగలం?


కానీ! చంద్రయ్యా! సిగరెట్, తాగుడు అలవాటు కూడా లేని, పిచ్చి చంద్రయ్యా! పల్లెటూరి అమాయకత్వం నీకింకా వదిలినట్లు లేదు. రెండు కౌన్సిలింగ్స్ తర్వాత నాకర్థం అయింది ఒకటే! నువ్వు ఆఫ్ట్రాల్ ఆర్. యం. పి డాక్టర్ గా మిగిలిపోయావ్. నేను కులాన్ని ఎత్తి చూపుతున్నాననుకోకు. మీ వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ. అలాంటిది! ఆడపిల్ల అయి ఉండీ, ఆమె అరవై వేల జీతానికి, ఎదిగింది. నువ్వు ఆ అమ్మాయి కి అవసరంలేదు. ఈ విషయం నీ మట్టి బుర్రకు ఇంకా అర్థం కాలేదా? మేం ఇంతకు మించి, ఫ్యామిలీ మాటర్స్ లో, తలదూర్చకూడదు. విడాకులు తీసుకుని, వేరే పెళ్ళి చేసుకో!" 


ఇన్స్పెక్టర్ మాటలకు.. అవాక్కయిన చంద్రయ్య.. ఎంతో మానసిక వ్యధ పడి, తన కూతుర్ని ఎలా పెంచాలో తెలియక, వెన్నెల వెళ్ళిపోయిన బాధ తట్టుకోలేక, సతమతమయ్యి, చేష్టలుడిగి కూర్చున్నాడు. విడాకులు మాత్రం వద్దన్నాడు. రోజులు గడుస్తున్నాయ్. 


"ఏరా! సెంద్రిగా! పట్నం మన బతుకుల్ని ఇలా చెట్టుకోర్నీ, పుట్టకోర్నీ సేసేసింది. మనం మన పల్లెకు పోదాం పద. 

అక్కడే నువ్వు మళ్ళీ పాక్టీస్ మొదలుపెట్టు. తెలిసిన ఊరు. తెలిసిన మనుషులు. అందరూ కలిసిమెలిసి ఉండే మనూరు నిన్ను, తప్పకుండా, చేరదీస్తదిరా! నీ ఆడపిల్ల.. పల్లెటూరిలో ఉంటుంది.. మా దగ్గరే!" తల్లీ దండ్రీ నచ్చచెప్పారు. 


"పిల్లను మీరు మన ఊరికి తీసుకెళ్ళండి. నేను ఏం చేయాలో చేసి చూపిస్తా! భయపడకండి! నేను అఘాయిత్యం చేసుకోను" మాట ఇచ్చి పట్నంలో ఆగిపోయాడు, చంద్రయ్య. 

 -----------

కొన్నేళ్ల తరువాత..

"మీరు చంద్రయ్య దగ్గరనుండి.. డాక్టర్ చంద్రం గా ఎదిగి, అవార్డ్ అందుకుని, ఈ పల్లెటూరికి మా అందరికి వైద్య సేవలు చేయటానికి రావటం చాలా ఆనందంగా ఉందండి. "


"రిజర్వేషన్ కోటాలో నేనూ మెడికల్ సీట్ కోసం ప్రయత్నించాను. ఇంటర్ సైన్స్ గ్రూప్ కాబట్టి, మమతా మెడికల్ కాలేజీ లో సీటు కోసం, ఎంట్రన్స్ రాసి, పగలూ రాత్రీ చాలా కష్టపడి చదివాను. అమ్మానాన్నా, ఎకరం పొలం అమ్మేసి, నా పాపను వాళ్ళే, పెంచుతూ, చాలా సహకరించారు. 


వాళ్ళు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం.. నేను పుట్టి, పెరిగిన కన్నతల్లి లాంటి ఈపల్లెటూరిలోనే, డాక్టర్ గా మీఅందరికీ, సేవలందించాలనే దృక్పథం తోనే.. ఈ ఊరు వచ్చి, చుట్టుపక్కల పల్లెలకూ, ఊపిరి పోస్తున్నాను. "


"అందుకే మీరు ఉత్తమ డాక్టర్. 

ఆ అవార్డ్ అందుకున్న మీరు, పల్లె పట్నమూ మధ్యలో మీ పయనం లోని, అనుభవాలు.. ?"


"పల్లె.. నన్ను కన్నతల్లి, ఐతే! నాకు, ఇంత చదువును ఇచ్చి.. పరిజ్ఞానం అందించి, ఓ ఉత్తమ వైద్యుడు గా నిలబెట్టింది పట్టణమే కదా! మరి! పట్టణానికి అన్నంపెట్టి, పెంచి పోషించేది. అభ్యుదయానికీ.. ఎంతోమంది జీవనోపాధికీ, బాటలు వేసిందీ!? పల్లెటూరి రైతన్నలేకదా!? రెండిటి మధ్యలో వారధిని నేను. అయినా, నా పయనం మళ్ళీ పల్లెటూరికే! ఎందుకంటే? పల్లెలు పెట్టే అన్నమే! నగరానికి పుష్టి. "


"ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు. మీ విజయం వెనుక? ఆమెమీద మీ అభిప్రాయం?"


"యస్! నా విజయం వెనుకా ఓ ఆడదే.. నా వెన్నెల.. గమ్మత్తుగా.. తన విజయం వెనుక నేనుంటే, నా విజయం వెనుక ఆమె ఉంది. 


చంద్రుని నుండి వెన్నెల ను ఎవరూ వేరు చేయలేరు, అనేందుకు ఇదే సాక్ష్యం. వెన్నెల ఈ పల్లెటూరికి మళ్ళీ వస్తుంది. చంద్రునిలో లీనమవటానికి".. 


భావుకుడి లా చంద్రయ్య చెప్పిన సమాధానం అతనలో వెన్నెల పేరు చెబుతున్నప్పుడు కలిగిన తాదాత్మ్యం.. కులదీపకులైన ఎంతోమందికి స్ఫూర్తి అనుకున్నారంతా. 

 -------------------

వేకువ జామున తలుపు చప్పుడుకు లేచి, తలుపు తీసిన చంద్రయ్య.. ముఖంలో వేల చంద్ర కాంతులు. 


"వెన్నెలా! వచ్చేసావా? నే చెప్పలా? చంద్రుడు, వెన్నెలా ఎప్పటికీ విడిపోరనీ! ఇదే కదా జీవన సాఫల్యం"


"అవును బావా! టి. వి లో నీ ఇంటర్వ్యూ చూసాను. 'ఉత్తమ' డాక్టర్ గా ఎంత ఎత్తు ఎదిగావూ?! సంతోషమే. కానీ డాక్టర్ భార్య అని నా హోదాను పెంచుకోవాలని రాలేదు. 

ఇంటర్వ్యూ లో నామీద నీకున్న ప్రేమ, ఇంకా 

అలాగే ఉన్నదని తెలిసి, నీ లాంటి మనిషిని బాధపెట్టాననే నాలో ఏదో పశ్చాత్తాపం. 


అందుకే వచ్చేసా! వచ్చేటప్పుడు, మన ఊరికే టీచర్ గా, ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చాను. పల్లెటూరికి, బదిలీ త్వరగానే ఇస్తారు. ఇద్దరమూ కలిసి, పల్లెకు సేవచేద్దాం. " 


చేయీ చేయీ కలిపి, చుట్టుపక్కల పల్లెలకూ వెలుగయ్యారు చంద్రుడు, వెన్నెలా.

 

 ===========

భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.







137 views3 comments

3 Comments


కథ, కథనం చాలా బాగుంది. వెన్నెల పాత్రలో కొంత స్వార్థపూరిత ఆలోచన, తాను ఎదిగి, భర్త ఎదగక పోతే అది అతని అశక్తత చాతకానితనం అన్నట్టు ప్రవర్తించడం, మళ్ళీ అతను సమాజంలో ఉన్నతమైన గుర్తింపు తెచ్చుకోగానే మళ్ళీ పశ్చాత్తాపంతో అతని చెంత చేరడం అన్నదిఆమె చంచల ప్రవృత్తిని తెలుపుతోంది. ఒకరకంగా నేటి సమాజంలో ఉన్న పరిస్థితిని బాగా చిత్రీకరించారు.

Like

mk kumar
mk kumar
5 days ago

భారతి గారు రచించిన సాఫల్యం కథ అనేక భావోద్వేగాలు, సామాజిక సందేశం, కుటుంబ బంధాలు, పల్లెటూరి, పట్టణం మధ్య తేడాలు, జీవన విలువల గురించి చర్చిస్తుంది.


ఈ కథలో చంద్రయ్య, వెన్నెల జీవిత ప్రయాణం, వారి అభిప్రాయ భేదాలు, కుటుంబ జీవితంలో వచ్చిన సంఘటనలు, చివరకు వారి సాఫల్యానికి ఎలా దారి తీసిందో చాలా అందంగా వర్ణించబడింది.


ముఖ్యంగా పల్లె జీవితానికి చెందిన సంప్రదాయాలు, స్వచ్ఛత, పట్టణ జీవన విధానం మధ్య అంతరాలను స్పష్టంగా చూపించగలిగారు. వెన్నెల పాత్ర, ఆమె అభివృద్ధి, వ్యక్తిత్వ మార్పు, చివరకు ఆమె పశ్చాత్తాపం ఆమె పాత్రలోని గాఢతను తెలియజేస్తాయి.


కథ మొత్తం పాఠకుల మనసును తాకేలా ఉంటుంది. ఈ కథ స్నేహం, ప్రేమ, కుటుంబ బంధం, అలాగే సమాజంలో స్థానం కోసం చేసే పోరాటానికి అద్భుతమైన ఉదాహరణ.


Like

vani gorthy

6 hours ago

Nice❤

Like
bottom of page