శక్తి స్వరూపిణి
- T. V. L. Gayathri
- Apr 25
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #శక్తిస్వరూపిణి, #SakthiSwarupini, #రథచక్రాలు

గాయత్రి గారి కవితలు పార్ట్ 15
Sakthi Swarupini - Gayathri Gari Kavithalu Part 15 - New Telugu Poems Written By
T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 25/04/2025
శక్తి స్వరూపిణి - గాయత్రి గారి కవితలు పార్ట్ 15 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
శక్తిస్వరూపిణి.
(కవిత )
******************************
కలిమినొసగే ధరణి కలుషితంబాయెగా
కలతతో నిత్యంబు కాలిపోతుందిగా
జీవకోటికి సతము శ్రేయమొసగే వేల్పు
పావనంబగు పృథ్వి భయముతో వణికింది
మనుజులే పగవారు మాయలను చేశారు
కనుగప్పి తల్లినే కాల్చివేస్తుంటారు
వనములను నరుకుచూ పశువులను చంపుచూ
గనులనే త్రవ్వుచూ గర్జించి నవ్వుచూ
తెలివిహీనులు జనులు దిశలనే మరిచారు
నిలుచున్న గృహముకే నిప్పుపెట్టేశారు
ప్రళయకాలంబొకటి పరుగుతో వస్తుంది
నలువైపులా గాంచి నాశనము చేస్తుంది
శక్తి స్వరూపిణిగ సంహారకారిణిగ
వ్యక్తమై సర్వమును భస్మమ్ము చేస్తుంది
తెలిసికొంటూ జనులు ధిషణ చూపించాలి!
చెలిమితో నీ భువికి సేవ చేస్తుండాలి!
వనములను పెంచుతూ పశువులను ప్రేమించి
అనునిత్య మీధరకు హాయి కలిగించాలి!
శుభముగా నదులనే శుభ్రమ్ము చేయాలి!
అభయమొసగే జనని కాలంబనవ్వాలి!
తల్లి దీవించగా తనయులకు రక్షణగ
చల్లగా భువిపైన సాగిపోతుండాలి!//
************************************
రథచక్రాలు
(వచనకవిత )

వస్తాయా జగన్నాథ రథచక్రాలు?
చూస్తామా భవ్యమౌ భానోదయాలు?
ఆకలి కేకలార్తనాదాలతో
చీకటిలో ఛిద్రమౌ ఆశలతో
నిలువెత్తున మన భారతం
కలతలో మున్గి విలపిస్తోంది
బలవంతులదైన రాజ్యంలో
పలు గాయాల దెబ్బలతో
పేదరికమింకా వెక్కి ఏడుస్తోంది
బదులివ్వడానికి భయపడుతోంది
మతోన్మాదుల విష వలయంలో
మతిపోయే మారణహోమంలో
సమన్యాయం చచ్చిపోయింది
మమతన్నది మాయమయింది.
జగన్నాథ రథచక్రాలొస్తాయని
జగతికి శుభమే జరుగుతుందని
చీకటిలో పరిగెడుతూ నీ జనులు
వేకువకై పడిగాపులు పడుతున్నారు.
అదిగదిగో రథఘోష వినిపించిందా?
కదిలొచ్చిన దైవత్వం కనిపించిందా?//
*******************************

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Коментарі