top of page

శక్తి వేధులు


'Sakthi Vedulu' written by Aduri Hymavathi

రచన : ఆదూరి హైమావతి

మూరెడు దూరం నుంచి కూరలు మాస్క్ మీంచి మూ చూసి ఏరుకుని, బారెడుదూరం నుంచి తూకం వేయించుకుని, మరో జానెడు దూరం నుంచి డబ్బిచ్చి నడుం లేపిన నర్మద, "నమ్మీ!" అనే పిలుపు విని చివ్వున వెనక్కి తిరిగింది.

ఈ ‘కరోనా’ వల్ల ఎంత ఆప్తులైనా దూరం నుంచే చేతులూపి పలకరించుకోవడం అలవాటైంది.

హంసిక చిరునవ్వుతో చూస్తోంది.

మహదానందంగా "ఏయ్ ! హంసీ! నువ్వా! ఎన్నాళ్ళైందే నిన్ను చూసి ! కూరలకేనా! ఏపాటుతప్పినా ‘సాపాటు’ తప్పదు కదా! ఐనా ఇంత దూరం వచ్చావేంటే కూరలకు! ఏంటే ఇలా రోజురోజుకూ బక్కచిక్కుతున్నావ్!"అంటూ బరువైన సంచీ పట్టుకుని ముందుకువచ్చి, హంసిక చేయి ‘ఆగమనట్లు’ సైగచేయగా, సామాజికదూరం పాటించి నిల్చుంది ముంగమూతితో నర్మద.

"ఏయ్ ! నమ్మీ! నీవన్నట్లు ‘సాపాటుకే’ కానీ నేననవలసిన మాట నీవన్నావ్! మరీ ఇంతదూరం రావాలిటే కూరలకు?" అడిగింది హంసిక.

"ఇక్కడైతే మంచి లేతవంకాయలు దొరుకుతాయనీ, తెచ్చి నూనెవంకాయ కూర చేయాలనీ మా 'శ్వశ్రువు' ఆజ్ఞ.” ఏడవలేక నవ్వింది నర్మద.

" ఓహ్! నాకేసేనన్నమాట! ఇక్కడైతే కందా,బచ్చలీ రెండూ దొరుకుతాయని, నేవెళ్ళకపోతే తానే రిక్షాలో వెళ్ళి తెస్తాననీ'శ్వశురుడు' సతాయించడంతో వచ్చానే. కరోనా అంటించుకొస్తే నేనేం చేయను? భాస్కర్ మొదటే చెప్పాడే 'అడిగినవన్నీ చేశావంటే తలకెక్కుతాడనీ, ఆపైన

దించుకోలేవనీ'. అతడి మాట వినకపోడాన అల్లాడుతున్నాననుకో, నాకు కావలసిందేలేవే!" నిస్సత్తువగా అంటూ, “సరేకానీ, అదేంటే ఇలాగైపోయావు! ముఖం వాడి పోయింది. చర్మంపాలి పోయింది. నీరసించావు! తినడం లేదా? ఇంట్లో, ఒంట్లో అంతా కులాసానేకదా!" అంది గాభరాగా హంసిక.

హంసిక ,నర్మదతో మాట్లాడుతుండగానే ఫోన్ మోగింది.చూసింది ఇంకెవరూ.. శ్వశురుడే! 'అడిగినవి దొరికాయా? అని తెల్సుకోనై ఉంటుందిలే' అనుకుంది హంసిక. ఫోన్ తీయకుండా నర్మదకేసి చూసింది.

"అంతా కులాసానే, నేనుతప్ప . ఎందుకడుగుతావ్! ఇటీవల చాలా జరిగాయిలేవే! చెప్పుకోను కూడా నాకెవ్వరూ లేక --" అంటూ గద్గదస్వరంతో కళ్ళు తుడుచుకుంది. హంసిక మనస్సు చివుక్కుమంది. హంసిక ప్రియనెచ్చెలి నర్మద. కరోనావల్ల చూసి చాలాకాలమైంది. ‘గడపేకైలాసం, వాకిలే వైకుంఠం’ రోజులు కదా ఇవి.

మళ్ళీ ఫోన్. చూసి పట్టించు కోలేదు హంసిక. "సరేకానీ ! నీతో ఇప్పుడిక్కడ మాట్లాడే టైంలేదు . ఇంటికెళ్ళి వండివార్చాలి. ఆఫీసుపని నిన్నమిగిలిపోయింది చూడాలి. సాయంకాలం ఐదింటికి కాఫీలయ్యాక మేడపైకెళ్ళి ఫోన్ చేస్తా. ఆసమయం నాకు కేటాయిస్తావుగా!" అంటూ ఆగకుండా టూవీలరెక్కి రివ్వునెళ్ళి పోయింది నర్మద.

ఇద్దరూ ఒకే ఊరివారేకాక చిన్ననాటి స్నేహితులు, కలసి చదువుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. పెళ్ళయ్యాక కూడా ఉండేది ఒకేనగరమైనా, చెరోచివర. పైగా కరోనాకాలం

వచ్చిపడిందాయె. పక్కవీధులవారికే పలకరింపులకు కష్టకాలం.

'ఏమైవుంటుంది దీనికి! వాళ్ళాయన కాస్త అదోరకం మనిషని తెల్సు. ఇదేపాపం సర్దుకుపోతుంటుంది. పిల్లలిద్దరిని ఒంటిచేత్తో బుధ్ధిగాపెంచి పోషిస్తూ చక్కగా చదివిస్తున్నది. ఇప్పుడేం కొత్తసమస్య వచ్చిపడిందో! మనిషి శారీరకంగానేకాక మానసికంగానూ కుంగినట్లు అనిపిస్తోంది. సాయంకాలం వరకూ వేచివుంటే కానీ పజిల్ కి సమాధానం తెలీదు.' అనుకుంటూ కారు తోలుతుండగా, మళ్ళా ఫోన్ మోగింది. చూసుకుంది.

'ఇంకెవరూ! శ్వశురుడే. మాఆయనైనా కాస్తసేపు పనిమీద వెళ్ళిందికదా వస్తుందని ఊరుకుంటాడేమోకానీ, ఇతగాడు వదలడు.స్నేహితులతో మాట్లాడుతున్నా, పిల్లల్తో హోంవర్కు చేయిస్తున్నా, ఆఫీసుపని చేసుకుంటున్నా,

వంటచేస్తున్నా పదేపదే వచ్చి చూసి, ఏదోఒకటి అడుగుతుంటాడు.

ఐదేం తిండిపిచ్చో దేవుడా! తాను పేరైనా వినని స్వీట్లూ, హాట్లూ చేయమంటాడు. భాస్కర్ చెప్పనే చెప్పాడు. 'పాపమని ఒకటి చేశావా! అది తింటూండగానే మరొకటి అడుగుతాడు. ఊర్కో! మా అమ్మవిసిగిపోయి వదిలేసింది అని’ . తానే మొదట్లో పాపం పెద్దాయన అనుకుని చేయసాగటాన నెత్తికెక్కేశాడు. దింపుకోటం చేతకావట్లేదు.'

‘నామందు వచ్చిందా? నాసబ్బు ఐపోయింది చూసావా? నేను బయటికెళ్ళాలి. ఎవరు తీసుకెళతారు? నాకు గొంతునొప్పిగా ఉంది, పొట్ట పట్టుకుంది’. అంటూ నిరంతరం ఏదో చెప్తూ వెంటపడుతుంటాడు. తాను పిల్లలను చూడాలా? ఇతగాడిని చిన్నపిల్లాడిలా చూసుకోవాలా? రోజంతా ఏదో ఒకటి నవుల్తూనే ఉంటే పొట్ట నొప్పెట్టకేం చేస్తుంది? ఇంతవయస్సు వచ్చీ అన్నీ చెప్పాలంటే తనకెంత కష్టంగా ఉంటుందో అర్ధం చేసుకోడు. ఈయన భార్య ఎలా భరించిందో పాపం. అందుకే ఆవిడలా ఉగ్రంగా,ఆశాంతిగా, ఏదీ భరించలేనంత అసహనంగా ఉండేది. ఉన్నన్నాళ్ళూ తనను బాగానే వేధించింది. కోడల్ని నాపట్ల అలా వుందనుకుంది తను. కానీ ఇతనివల్లే! ఇతగాడిని అన్నాళ్ళు భరించిందంటే గొప్పే. ఏంమనిషీయన! ఆమధ్య వారంపాటు జ్వరం వస్తే 'ఎలాఉందని' కాక, 'నీమీదే ఆధారపడి వున్నాం , నీవే సంరక్షురాలివి' అంటాడా!

ఎవరైనా ఇంట్లో పెద్దలుంటే వేళకు తిండి , ఒంట్లో బాగోలేకపోతే మందు ఇప్పిస్తారు. నిరంతర పర్యవేక్షణ ఎవరు చేయగలరు? రోజంతా ఎవరు మాట్లాడగలరు? మరేం పనులుండవా? అతడి సమయాన్ని అతగాడే గడుపుకోవాలి, ఇంట్లోవాళ్ళు ఇతడితో రోజంతా గడపాలంటే ఎలా కుదురుతుంది? ఆమాత్రం ఆలోచించడా! ఏం పసివాడుకాదే!

తనకూ ఎందుకో ఇటీవల ఒంట్లో ఓపిక ఉండటంలేదు. నీరసం వస్తోంది. ఆఫీసు పని చేసుకోవాలా? ఇతనికి అన్నీ అమర్చాలా? ఇదేం వేధింపో బాబూ. మరీ ఎక్కువైపోయింది ' అనుకుంటుండగా మళ్లాపోన్. ఫోన్ మాట్లాడాలంటే కారు ఆపాలి. కుదరదు’. అనుకుంటూనే కారు తోలుతుండగా ఇంటికెళ్ళేలోపు ఐదు ఫోన్లు.

కారు పార్కుచేసి లోనికెళ్ళగానే " అన్నిసార్లు ఫోన్ చేశాను తియ్యలేదేం హంసికమ్మా! ఆవకాయ, గోంగూర తెస్తావని చేశాను. " అంటూ గేటువద్దకే ఎదురొచ్చాడు. అంతా టిఫిన్లూ, పండ్లూ చిరుతిండిలాగా తింటే ఇతగాడు ఊరగాయపచ్చళ్ళు చిరుతిండిలా తింటాడు. సంచీతీసి పచ్చళ్ళ సీసాలు టేబులుమీదపెట్టి, వంటగదిలోకి నడిచింది హంసిక.

వెనకాలే " నేనడిగిన కూరలు దొరికాయా!" అంటూవచ్చాడు.

బాగా విసిగి వున్న హంసిక " మీరెళ్ళి మీగదిలోకూర్చోండి, తెచ్చాను , చేసిపెడతాను. వెనకెనకా తిరక్కండి. చాలాపని ఉంది" అంది, కూరలు బయటికితీస్తూ.

ఒక నియమానికి కట్టుబడి పెరిగినవారికి అన్నీ ఇబ్బందులే. పెద్దలను గౌరవించాలి, సేవచేయాలని చిన్నతనం నుండీ ఇంట్లో తల్లితండ్రులు చెప్పిపెంచిన సంస్కారంవల్ల, బాధపడటంతప్ప మరేం చేయలేని, భరించలేని తన స్థితికి తనపై తనకే జాలేసింది హంసికకు.

వంట చేస్తూనే నర్మద గురించి ఆలోచనలో పడింది. 'ఏమై ఉంటుందబ్బా!, పాపం సగమై పోయింది. గుమ్మడిపండులా ఉండేది, రంగూ పోయింది, వాడిపోయింది. ఒకమాత్రానికి భయపడేరకం కాదు నర్మద.

పెళ్ళైన సంవత్సరంలోపే మంచి ఉద్యోగం సంపాదించి, ఆఫీసు కెళ్లాల్సిరాగానే, నర్మద ‘శ్వశ్రువు’ ఏంపేచీ పెట్టిందో ! ఒక్క వారం లోపలే నర్మద ఆఫీసుకు దగ్గరనీ, రానూపోనూ కష్టం, కాలం తగ్గుతాయనీ నర్మద మగడు మాధవ్ తూర్పు దిక్కునున్న తన ఇంటి నుంచి నర్మద ఆఫీసు వైపు పడమరకు ఇల్లు వెదికి నర్మద నివాసం మార్చాడు. మారు మాట్లాడక కొత్తనగరమైనా భయమన్నది లేకుండా నర్మద ఒంటరికాపురం సాగించింది. అప్పుడప్పుడూ వచ్చి రెండుసార్లు కడుపు పండించి పోయాడా మగవాడు.

కాన్పుకైనా తిరిగి చూసిందిలేదు. కొడుక్కెందుకు పెళ్ళిచేసిందో , అతగాడెందుకు చేసుకున్నాడో ఆ తల్లీకొడుకు లిద్దరికి మాత్రమే తెలుసేమో! ఎంత చిత్రం!

రెండు కాన్పులకూ నర్మద తల్లితండ్రులే సాయంగావచ్చారు.

‘ఇలాంటి వ్యక్తులూ ఉంటారాని’ తాను ఆశ్చర్యపోయింది. చుట్టపుచూపుగా వచ్చి మాధవ్ అతడి తల్లీ చూసిపోయారు తప్ప ఒకసాయం కానీ, సహకారం కానీ చేసిఎరుగరు. తనకైతే అప్పుడు పట్టలేనికోపం వచ్చింది. మాధవ్ ను కడిగేయాలనుకుంది. నర్మద వద్దని బ్రతిమాలడంతో ఊరుకుంది. తానే నర్మదకు ఆసమయంలో సాయంచేసింది. పాపం నర్మద తల్లిదండ్రులు మాధవ్, అతని తల్లి వైఖరిచూసి కూతురి మెడకు ఒక ‘తుమ్మమొద్దును బండకొయ్య ’ వేశామని బాధపడి, నర్మద తండ్రి మంచి ఆరోగ్యంగా ఉండే వ్యక్తి కాస్తా ఉద్యోగంలో ఉండగానే గుండెపోటుతో మరణించాడు. ‘కారుణ్య నియామకం’తో నర్మద తల్లికి ఆఉద్యోగం రాగా ఆమె ఎలాగో జీవిస్తున్నది.

అందుకే దానికి తానంటే ప్రాణం. ఐనా ఇంత బాగాలేకపోయినా తనకెందుకు చెప్పలేదబ్బా!' అని ఆలోచిస్తూ అన్యమనస్కంగానే వంటకానిచ్చి, శనివారం కనుక ఆఫీసుపని పక్కనపెట్టి, మిగతాపనులన్నీ ముగించుకుని ఐదు ఎప్పుడవుతుందాని ఎదురు చూడసాగింది హంసిక. ఈలోగా ప్రతిపావు గంటకూ, "హంసికమ్మా! నా బి.పీ. టాబ్లెట్లు ఐపోయాయి చూశావా?" అనో,

"నా బట్టలు ఇస్త్రీనుంచీ వచ్చాయామ్మా!"అనో,

"నాగదిలో దుమ్ము పట్టినట్లుందే చూశావామ్మా? "అనో ఒకటే ప్రశ్నలు.

"నా ప్యాంట్లుచూడమ్మా ఎలా లూజైపోయాయో " అంటున్న అతడిని ఎలా అర్ధంచేసుకోవాలో తెలీలేదు హంసికకు. ఇదేం వేధింపుబాబూ! నిరంతరం ఇతడిని చూస్తూ ఉండాలా?' అందరిళ్ళలో పెద్దవారు ఇలాగే ఉంటారా! 'ఇతని ప్యాంట్లు చూట్టమూ తనపనేనా!'

భాస్కర్తో చెప్పడు, ఒక్కదులుపు దులిపేస్తాడని భయం. తానే అన్నిటికీ. ' అనుకుంది హంసిక.

మొబైల్ మోగ్గానే పట్టుకుని మేడపైకెళుతున్న హంసికను , ఏదోఅడగాలని తనకేసే చూస్తున్న శ్వశురునితో, 'మళ్ళావచ్చి మాట్లాడుతాను ఆగమన్నట్లు సైగచేసి ' ఆత్రంగా ఫోన్ తీసుకుని పైకెక్కింది . వాట్స్యాప్లో మాట్లాడసాగింది నర్మద.

"చెప్పవే నమ్మీ! ఏమైందీ?!"అంది హంసిక.

"హంసీ! నీవు నమ్మవే! ఇటీవల మాఆయన రెండునెల్లు వేరే ఊర్లో ఆఫీసుపనికెళ్ళాలని వాళ్ళఅమ్మను నాఇంట్లో వదలివెళ్ళాడు. ఈకరోనాకాలం వచ్చేసరికి ప్రయాణసాధనాల్లేక అక్కడే ఇరుక్కుపోయాడు. అప్పటి నుంచీ ప్రారంభమయ్యాయి నాకష్టాలు. ఇప్పటికి మూడు నెలలైంది. అక్కడ కొడుక్కు వండి పెట్టుకునేదా! ఇక్కడ ఒక్కపనీ ముట్టదే! కాఫీకూడా రోజుకు పదిసార్లు చేతికివ్వాలి. పెద్దావిడ పోన్లేని అన్నీచేసేదాన్ని. నూనెవంకాయకూరలు, కారపుకాకరకాయలూ గర్భిణీ అడిగినట్లు అడిగితే ఏంచేయనే! అవన్నీ సరే ! ఆవిడ వచ్చిన పదిరోజులకే నాశక్తి ఎవరో పీల్చేసినట్లు నశించిపోసాగిందే! నీవు నమ్మవు.

మా ఎదురింటి మాధవి నన్ను చూసి మాట్లాడి చెప్పిన విషయాలు వింటే నీవు షాకవుతావు. మాశ్వశ్రువు[అత్త] ఇంటికొచ్చిన రెండువారాలకు ఒకరోజున నేను కళ్ళుతిరిగి పడిపోయానే. మాపిల్లలిద్దరూ కంగారుగా ఎదురింటి మాధవిని పిలిచారు.ఆమె స్నేహంగా ఉంటుంది మాతో. ఆమెవచ్చిచూసి వాళ్ళ ఇంటి పక్కనేఉన్న డాక్టర్ రంజని దగ్గరకు ఎలాగో తీసుకెళ్ళింది. నాకసలు బీ.పీ, షుగర్ లాంటివి లేనేలేవుకదే! నారక్తపోటూ, చక్కెర లెవెల్స్ చూసి డాక్టర్ ఆశ్చర్యపోయి, ఫ్యామిలీ హిస్టరీ అంతా అడిగి ఏవో మాత్రలిచ్చి జాగ్రత్తలు చెప్పి పంపింది”.

"ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదే! నేను పరాయిదాన్నైపోయానుటే ! మీ మాధవిపాటి కాకపోయానుటే!” కోపంగా అంది హంసిక.

“ఈ కరోనా కాలంలో అంతదూరానున్న నీవెలా వస్తావే! మునుపంతా నీవేకాదుటే నాకు సాయంచేసింది? మాధవి మాటలు వింటే నీవూఆశ్చర్యపోతావ్! తాను వంటరిగా వున్న వాళ్ళ వదినను తనఇంట్లో ఉంచుకున్నందున ,తనకైన అనుభవం వల్ల ఆమె తెలుసుకుందిట. అంతేకాక మాధవి ఆధ్యాత్మికమార్గంలో ఎదిగిన మనిషి. ధ్యానాలు, జపాలూ చేస్తుంటుంది. ‘నెగటివ్ ఎనర్జీని’ ఇట్టేపట్టేయగలదు. మాఇంట్లో అడుగుపెట్టగానే కనిపెట్టేసింది మాధవి. ప్రతిమనిషికీ ఆరా వుంటుందిట. వారి మనస్సునూ, ఆలోచనలనూ బట్టి వారి నుంచి ఆ ఆరావెలుగులా వ్యాపిస్తుంటుందిట. వ్యతిరేక భావపరంపర ఉన్నవారి నుంచి నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంటుందిట. ఆమె మాఇంట్లో కాలు పెట్టగానే నెగటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉందని

గుర్తించిందిటే. ఆడాక్టర్ ఒకసంస్థ నడుపుతున్నదిట. కొన్ని రకాల మనస్తత్వం ఉన్నవారికి కౌన్సిలింగ్ చేస్తుందిట. ఆమె చెప్పిన సమాచారం వలన తనఅనారోగ్యానికీ, ఇంట్లో నెగటివ్ ఎనర్జీకీ కారణం తెల్సుకుందిటే. నాకీ అనారోగ్యం కేవలం మాశ్వశ్రువు ప్రభావంట. ఆమె నేనెక్కడుంటే అటేచూస్తుంటుందే! నీవనొచ్చు, చూస్తే ఏమవుతుందని. మామూలుగా చూట్టంవేరు, ఈచూపువేరు. రోజంతా నామీదే దృష్టి. ‘నరుడి కంటికి నల్లరాళ్ళు పగులుతాయంటారు’ కదే! గుండులాంటి నేను బెండునై పోయానే. మాధవి చెప్పిన మాటలు వింటుంటే తలతిరిగి పోయిందే." కంఠంలో దుఃఖం పెల్లుబకగా ఆగింది నర్మద .

“ఏంచెప్పిందే ఆవిడ?”

“ఆగు చెప్తాను. నీకూ ఇదే ప్రభావమని నా భావన. సగమయ్యావు.జాగ్రత్తగా విను. ‘'ఫిలీస్ క్రిస్టల్ ' అనే ఆవిడ, వ్రాసిన ‘రీ కనెక్టింగ్ లవ్ ఎనర్జీ’ [Phyllis Krystal -Reconnecting Love Energy] అనే పుస్తకంలోని విషయాలకు, తనఅనుభవం జోడించి చెప్పిందే హంసీ!”

"ఏంటే నిన్నింతగా ఆశ్చర్యపరచే ఆకొత్త విషయాలు?"

“కొందరు పైకి అమాయకుల్లా కనిపిస్తారు కానీ వారికి ఎమోషనల్ డిపెండెన్సీ అంటే చిత్త విభ్రమ లేక పరాధీనత అనవచ్చేమో చాలఎక్కువగా ఉండి, వారిఅవసరాలు ఎవరు తీరుస్తారాని ఎదురు చూస్తుంటారు. సానుభూతివల్లో, లేక బాధ్యతవల్లో ఎవరైనా వారిని ఆదరించడం జరిగితే, ఇకవారిపై పూర్తి భారంవేసి, తద్వారా వారిశక్తిని క్షీణింపజేస్తారు. వారు ఆశించే అపరిమితమైన శ్రద్ధ, ఆదరణ లభించకపోడంతో ,వారి ఆగ్రహం, అసంతృప్తితో కూడిన

నెగటివ్ ఎనర్జీవల్ల ఎదుటివారి, అంటేతనను ఆదరించేవారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతీసేలాప్రవర్తిస్తారు. వీరిని‘శక్తివేధులు’అనవచ్చు.

"అంటే ఏంటే నర్మదా! కాస్త అర్థమయ్యేలా చెప్పవే!"

“నీకు అన్నీ తెలుగులోనే చెప్పాలంటే కుదరవు బాబూ! ఇటువంటి వారు భావావేశపూరిత ఉద్రిక్తత వల్ల, తనమీద ఎవరైనా పూర్తి శ్రద్ధ పెట్టాలని, తన బాధ్యత వహించాలనే విపరీతమైన కోరిక, గాఢమైన ఆశ వలన, వారికిఅన్నీ అమర్చేవారి మీదే వారిదృష్టి ఎక్కువగా ఉంటుందిట. వారిని తమ పరిరక్షకులుగా భావించి , వారు కోరుకునేంత శ్రధ్ధ , దక్కనపుడు ఆగ్రహాన్ని, అశాంతిని , వ్యతిరేకతనూ చూపులతో, మాటలతో, ఆలోచనలతో ప్రసరింప చేస్తారు. కొందరు తమకు దక్కనివి ఎదుటివారు పొందుతున్నపుడు, వారెంత దగ్గరవారైనాకానీ భరించలేరు. కక్షో, ఓర్వలేనితనమో, ఈర్ష్యో, అసూయో, ద్వేషమో, కుళ్ళో మరేదో రోజంతా అలాంటి ఆలోచన, దృష్టి ఉంచడంవల్ల ఎదుటివారిశక్తి క్షీణిస్తుందిట. నరుని దృష్టిలో అతనికే తెలియని 'దుష్ట అగ్నిశక్తి’ ఉంటుందిట. ఆనెగటివ్ ఎనర్జీవల్ల ఎదుటివారికి స్ట్రెస్ ఏర్పడి,తెలీని అనారోగ్యం, మానసికబాధ కలుగుతాయిట. మాధవి చాలా విషయాలు చెప్పిందే! అన్నీ యదార్ధాలనిపిస్తున్నాయి."

"ఏంటే! అన్నిటికీ మాధవి, మాధవి అంటున్నావ్!"

"అవునే విను. నేను హాల్లో నాటేబుల్ వద్ద కూర్చుని పనిచేసుకుంటుంటే వెనుకనుంచీ నామీదే ‘శ్వశ్రువు’ దృష్టి. చాలారోజులు నేను గమనించలేదు. కొన్ని రోజుల తర్వాత వీపుమీద సూదులతో గుచ్చినట్లు భరించలేనినొప్పి,

తలనొప్పి . ఎక్కువ పనిచేయడంవల్ల తలనొప్పి, ఎక్కువసేపు కూర్చోడంవల్ల వీపునొప్పనుకున్నాను. మాధవి చెప్పాక అసలు విషయం అర్ధమైంది . నాటేబుల్ ఇరుకైనా మేము పడుకునే గదిలోకి మార్చారు పిల్లలు. నాగది ఆమెకిచ్చానుకదా! తనసీటు మాగుమ్మం ముందుకు మార్చుక్కూర్చుంది, మేమంతా కనిపించేలాగా. పిల్లలు అంతా విన్నారుకదా ,' అమ్మా! మాకు దిక్కు నీవొక్కర్తెవే! డాడీ స్కూల్లో తండ్రి అనేచోట పేరు రాయించుకోను తప్ప ఏనాడూ తనడ్యూటీ తండ్రిగా చేసిఎరుగడు. అందుకే మామాట విను" అనిచెప్పి గదితలుపు వేయసాగారు.

మా ‘శక్తివేది’, "ఎందుకర్రా! అలాతలుపులేసేసుకుంటారూ! నేనొక్కర్తేనే ఇక్కడ హాల్లో తగలడాలా!" అనివారితో వేసేసుకుంది లడాయి.

" మాకు నీ టీ.వీ. శబ్దం చాలాఇబ్బంది, ఆన్లైన్ పాఠాలు, వినిపించడంలేదు. అందుకేవేస్తున్నాం. " అని చెప్పేశారు.

రోజంతా టీ.వీ పేరుకు పెట్టుకోడం నాకేసిచూట్టం, మామాటలు వినడం, నాపిల్లలను గుచ్చిగుచ్చీచూట్టం ఇదే ఆమెపని. ఆడమనిషి కాబట్టి సరిపోయింది. అన్నట్లు నాకేసు లాంటిదే ఐవుంటుంది నీదీనీ . అందుకే అలాగైపోయావ్! బాగా ఆలోచించు.సగమయ్యావు. నీముఖంలో వెలుగేలేదు. నీరసంగా ఉన్నావు, కళ్ళలో వెనుకటి కాంతిలేదు." అంటూ ఆగింది నర్మద.

నర్మద మాటలు విన్నాక 'నిజమే సుమా! మాశ్వశురుడు రోజంతా అతడ్ని నాబిడ్డలనుమించి, ప్రత్యేక శ్రధ్ధ చూపాలని కోరుకుంటూ , అదితీరక ,తనను ఉపేక్షిస్తున్నారనే భావనతో నిరాశతో నిరంతర దృష్టినిల్పి

నర్మద చెప్పినట్లు చూపులతో ' దుష్టఅగ్నిశక్తిని ' తనమీద ప్రసరింప జేస్తున్నాడేమో!. అందుకే అతను మాట్లాడిన ప్రతిసారీ నీరసం ఆవరిస్తోంది!' అనిపించింది హంసికకు .

ఇంతలో నర్మదకు వేరేఫోన్ వచ్చింది. సమాధానం చెప్పి అమిత ఆత్రంగా ,

"ఓహ్ మై గాడ్!నీకు తెలుగులోనే చెప్పాలిగా ! మాతృభాషాభిమానివి. ఎంతాశ్చర్యం మరో ఐదునిముషాల్లో డాక్టర్ రంజని తన ‘రీకనెక్టింగ్ లవ్ హోం’లో ఉండేవారితో ఆన్లైన్ సంభాషణ జరుపబోతున్నారు. నన్నూ జాయినై వినమని లింక్ పంపారు. నీవూ వినవే. క్రిందకెళ్ళి కూర్చుని టీ.వీకి అనుసంధానిస్తే మనఇంట్లోవాళ్ళువింటే ప్రయోజనం ఉండవచ్చు.ఇది వీడియో సమావేశం హంసీ! నే క్రిందకెళుతున్నా"అంటూ క్రింద కెళ్ళింది నర్మద.

హంసిక చేసేదిలేక తానూ అదేపని చేసింది. ఇంట్లో పిల్లలనూ, భర్త భాస్కర్నూ కూడా పిలిచి చూడమని కోరింది. ఏకళనున్నారో అంతావచ్చి హాల్లోకూర్చోగానే, అంతాఎక్కడుంటే అక్కడికి పిలవకుండానే వచ్చి, వారికి ఎప్పుడూ ఏకాంతము [ప్రైవసీ]కూడా లేకుండాచేసే హంసిని శ్వశురుడు[మామగారు] వచ్చి కూర్చున్నాడు.

డాక్టర్ రంజని లైన్లోకొచ్చింది." ప్రియబాధవులారా! మనం ఈరోజుమళ్ళా కలవడం ఆనందంగా ఉంది.మనం గతంలో చెప్పుకున్న మాటలు ఎంత మందికి అర్ధమయ్యాయో, ఎందరు ఆచరిస్తున్నారో చెప్తే,నేను మీకు మరేమైనా అదనంగా చెప్పాలేమో ఆలోచిస్తాను." అంది.

అక్కడున్నవారిలో ఒకామె లేచి చెప్పసాగింది.


"నాపేరు మానస.నేనిక్కడ నామానసికస్థితి బాగోలేక చేరాను . నేను ఒకఇంటి కోడలిని. ఐతే నాకు చిన్నతనంలో తల్లిప్రేమ దూరమై అందరినుండీ ఆప్రేమను పొందాలని ఆశించి విఫలమై అందరిమీదా నాకుతెలీకుండానే ఉక్రోషం పెంచుకున్నాను. నాకు దొరకని ప్రేమ, సంరక్షణ నన్ను పలకరించే వారందరినుండీ నాకు దక్కాలని ఆశించి,అది నేనుకోరినంత లభించక, తృప్తిలేక, వారిశక్తి క్షీణించేలాగ ప్రవర్తించాను .

నా తప్పు ఇక్కడికి వచ్చాక నాకు తెలుస్తున్నది.మన రంజని గారు చెప్పినట్లు, 'ప్రతి జీవికీ ప్రేమ అనేది ఒక అవసరం. ఆహారంతో పాటుగా ప్రేమ మానవులను ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేలా చేస్తుంది. పుట్టుకనుంచి మరణంవరకూ మానవుడు ప్రేమకోసం తపిస్తాడు. ఈప్రేమను పొందని మానవుడు అనేక మార్గాలు అన్వేషిస్తాడు. పసిపిల్లలకు తల్లిఇచ్చే ఆహారంతో పాటుగా ప్రేమ కూడ అత్యంత అవసరమే. ఎందుకంటే ఆహారం ‘శరీరానికైతే’, ప్రేమ ‘మనస్సుకు’ ప్రత్యేక ఆహారం. తల్లిప్రేమ అనేది బిడ్డకుదక్కే మొదటివరం. శాస్త్రజ్ఞులు జంతువులతో జరిపిన ప్రయోగాలవలన, మంచి పౌష్టికాహారం ఇచ్చినప్పటికీ, తల్లి ప్రేమలేనిదే ఆజీవిసరిగా అభివృద్ధి చెందలేదని ఋజువైందిట. పిల్లల్లో ఆత్మవిశ్వాసం , స్వతంత్రత లోపిస్తుందిట.

తల్లిప్రేమ లోపించిన కొందరు ఇతరుల నుండి ప్రేమ, రక్షణ, సానుభూతి ఆశించి దాన్ని బంధువుల నుండో, స్నేహితుల నుండో, లభిస్తుందని ఆశపడి , అది దక్కక, ఎంతో అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తారు. ‘ప్రేమ అనేది

బలవంతంగా పొందేది కాదు’ కదా! పొరపాట్లు చేయడం సహజం ఐతే మనలను మనం అర్ధంచేసుకున్నాక దాన్ని సవరించుకోవడం మన ధర్మం. రంజనీ మేడం చెప్పిన విషయాలు నేనెంత వరకూ అర్ధం చేసుకున్నానో ఆ మేడం వింటారని ఇదంతా చెప్పాను. “అంటూ ఆపింది.

మరొ మహిళ చెప్పసాగింది. " నేను ఇక్కడ చేరిన ఒకపేషెంటును. నాపేరు రుక్మిణి. నేను ఇక్కడికి వచ్చాక రంజనిమేడం మాటలువిన్నాక అర్ధంచేసుకున్న విషయాలు ఏమంటే, నాలాంటి మానసికంగా అభివృద్ధి చెందని పెద్దలు, తరచూ ఇతరుల నుండి ప్రేమ, రక్షణ, సానుభూతి,తమ బాధ్యత మొత్తం ఇంకోరు భరించాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులను దబాయిస్తారు, డిమాండ్ చేస్తారు .నేనూ అంతే. నేనుచిన్నతనంలోనే భర్తను కోల్పోడంవలన నాకొడుకూ, కోడలూ సంతోషంగా అన్యోన్యంగాఉంటే భరించలేక పోయాను. వారిమీద వ్యతిరేక భావనలతో వారిప్రతిచర్యా గమనిస్తూ వారిని అశాంతిపాలు చేశాను. ఒక పిశాచంలా పీడించాను. మేడం మాటలవలన నాకు అర్ధమైన విషయంఇది . నాలాంటివారు ఎదుటివారు ఎంతఆప్తులైనా వారి సుఖసంతోషాలు చూసి భరించలేకపోవడమనే మానసిక వ్యాధికి లోనవుతారు.. అసంతృప్తితో తమపై ఇతరులు ప్రేమచూపడం లేదని, ఓదార్చడం లేదనీ బాధపడతారు. ఎదుటివారి శక్తికి మించి ఆశిస్తే ఏదైనావారికి విసుగు తెప్పించి,వారి శక్తి క్షీణించి, మనకు వారిని ఇంకా దూరం చేస్తాయి. అది తీరనపుడు ఇంట్లోవారిపై వ్యతిరేకభావన పెంపొందించుకుంటారు.


ఈ విషయాలన్నీకూడా నాకు మానసలాగే ఇక్కడికి వచ్చాక రంజనీమేడం కౌన్సిలింగ్ ద్వారా తెలిశాయి. " అంది.

మరొక నడివయస్సు మహిళ లేచింది." నాపేరు పార్వతి. నాకు తల్లంటే తెలియదు. నాకు ఊహ వచ్చినప్పటి నుండీ అనాధశరణాలయంలో వారి దయా దాక్షిణ్యాలతో పెరిగాను. వారివిసుగు, ఆగ్రహం, అనాదరణ ఇవే నానిత్యానుభవాలు, దాంతో నాస్వభావమే వింతగా ఉండేదని రంజనిమేడం వివరించాక గ్రహించాను. తల్లీబిడ్డా ఎవరైనా ప్రేమగాఉంటే చూడలేక వారిపట్ల ద్వేషభావన, అయిష్టత పెంచుకుని , అలాంటివారు కనిపిస్తే చూపులతో, మాటలతో వేధించేదాన్ని. నాచూపుల్లోని ద్వేషంవలన చాలామంది అనారోగ్యం పాలయ్యారని నాకుఇప్పుడు అర్ధమవుతున్నది. ఇది నా ప్రమేయం లేకుండానే జరిగిందని చెప్పగలను. ఈ ' రీకనెక్టింగ లవ్ హోం'లో చేరాక నాకళ్ళు తెరుచుకున్నాయి. నేను 'ఫిలీస్ క్రిస్టల్ 'వ్రాసిన ‘రీకనెక్టింగ్ లవ్ ఎనర్జీ’బుక్ చదివి చాలావరకూ నాదోషాలు గ్రహించాను. ఐతే ఒక్కవిషయం చెప్పగలను, రంజనీమేడంలా ప్రేమచూపితే నాలాంటివారు తయారుకారని భావిస్తాను.నేను ఇక్కడే వుండి సేవచేసుకోదలచాను." అనిముగించింది.

తర్వాత ఒకపురుషుడు లేచాడు. "నాపేరు నరసింహం. పసితనంలోనే తల్లి మరణించగా , తండ్రి పెంపకంలో పెరిగాను, ఎక్కడ పెడమార్గం పడతానో అని మానాయన నన్ను కఠిన క్రమశిక్షణతో పెంచాడు. ఆయన చెప్పినట్లు చేయడమే తప్ప మరొకటి నాకు తెలియదు. దానివల్ల నామేధ పెరగలేదు. స్వతంత్రంగా ఏమీ చేయలేకపోయేవాడిని. నాభార్యకూడా నన్ను గౌరవంగా

ప్రేమగా,చూడలేదు. నామొద్దుతనం వలన ఆమె నన్ను ఇష్టపడేదేకాదు. దాంతోనేను ఒకవిధమైన నిరాశానిస్పృహలతో , అయోమయ జీవితం గడిపాను. తండ్రి తర్వాత భార్య అధికారంలో బతికాను. ఆమె మరణానంతరం నాపిలల్లపై ఆధారపడి, నాకు కావాలనిపించిన ప్రతి ఒక్కటీ నాకు నాపిల్లలు, కొడుకు,కోడలు ఎవరైనా సరే వారే ఏర్పాటుచేయాలని అవివేకంగా , అప్పటికప్పుడు, చిన్నపిల్లలు’ కొండమీదికోతిని కోరుకున్న రీతిగా అందించాలని అనుచితంగా కోరుకుంటూ, నాకుతెలీకుండానే వారిని ఇబ్బందిపాలు చేశానని ఇక్కడికివచ్చి చేరిన ఏడాది తర్వాత, రంజనీతల్లి బోధల వలన తెల్సుకున్నాను. నాకు ఇక్కడేబావుంది. ఇహఇంటికెళ్ళి వారిని మళ్ళీ బాధించను. అక్కడికెళితే మళ్ళీ నాబుధ్ధి వక్రమార్గం పట్టొచ్చు. అందువల్ల ఇక్కడే ఉండాలనుకొంటున్నాను."అనిముగించాడు.

వెంటనే డాక్టర్ రంజని అందుకుని చెప్పసాగింది " 'రీకనెక్టింగ్ లవ్ హోం’ మేట్సందరికీ మంచే జరుగుతుంది. మీరు ఎన్నిరోజులు ఇక్కడ ఉండాలనుకుంటే అన్నిరోజులు ఇక్కడే ఉండవచ్చు. ఐతే మీరు వెళ్ళి మీమీ ఇళ్ళలో 'మారిన మనస్సులతో' జీవించడంవల్ల ఇళ్ళలోవారూ సంతోషిస్తారు. మీఇష్టం. మీలాంటివారు మీకు తెలిస్తే ఇక్కడ చేర్పించవచ్చు .

ముఖ్యంగా మీరు తెలుకోవలసింది 'అనేక కారణాల వలన ప్రేమ లభించక , నిరాశా,నిస్పృహలతో,మానసికంగాపూర్తిగా ఎదగని {అన్ డెవలప్డ్ అడల్ట్స్ } (undeveloped adults)స్వభావం కలిగినవారు అమాయకంగా ఉంటూనే తమ దృష్టి, ఆలోచన, మాటల ద్వారా నెగటివ్ ఎనర్జీని ప్రసరింపజేసి ,వారికి తెలీకుండానే ఇతరులశక్తిని జలగల్లా లాగేస్తారు. వారిని నిర్వీర్యం చేస్తారు కూడా. వారు తనపై పూర్తిశ్రధ్ధ చూపడం లేదని భావించి నిరాశకులోనై తమ రక్షణ విషయంలో పిల్లల్లా ప్రవర్తిస్తూ, బాధపడుతూ వ్యతిరేక భావశక్తిని ఇతరులపై ప్రసరింపజేయవచ్చు.

ప్రేమ అనేది ఒక వస్తువు కాదు, ‘సహజంగా ఏర్పడవలసినది’ అని మరచిపోతారు. ప్రేమ భేషరతైనదనీ, అనంతమైనదని, అపారమైనదనీ, ప్రతిఫలం కోరనిదనీ మరచి, ఆశించడంతప్ప, ఆలోచించరు. అలాంటివారి నుంచి వ్యతిరేక భావాలు వ్యాపిస్తాయి. నేడు సమాజంలో 'ప్రేమ ' పేరుతో ఆడపిల్లలపై జరిగే అఘాయిత్యాలన్నింటికీ ఈ భావనా లోపమే కారణం.

అంతేకాక అంతా గుర్తుంచుకోవలసినది ఏమంటే, ఎవరైతే మనం మాట్లాడేప్పుడు సంతోషంగా ఉండరో , తప్పించుకు పోవాలని చూస్తారో వారు మనమాటలను, ప్రవర్తననూ, చూపులను ఇష్టపడటం లేదని తెల్సుకోవాలి. అంటే మన నుంచి వ్యతిరేక వ్యతిరేక భావపుంజములు ఎదుటివారిపై పడి వారు మనలను ఇష్టపడటంలేదు. ఇది గ్రహించి మనప్రవర్తననూ, ఆలోచనలనూ మార్చుకోవాలి.

మరొక విషయం మనం ఆధారపడవలసినది సృష్టికర్తఐన భగవంతుని మీద. ఆయన ప్రేమను కోరుకోవాలి. మానవుల ప్రేమనుకాదు. అందరిని పెంచి పోషించి కాపాడే భగవంతుడే అందరికీ రక్షకుడు. అదిగుర్తుంచుకుని ఆ పరమాత్మ ప్రేమకోసం తపించండి. ఆధ్యాత్మికమార్గంలో భగవంతుని అన్వేషించండి. మనశ్శాంతి అదేవస్తుంది.

మన ధ్యాన మందిరంలో ఎంత ఎక్కువ సేపు గడపగలిగితే అంత సమయం గడపండి. నేను ఒకమారు వచ్చి చూసి ఎవరైతే ఇళ్ళలో యిమడగలరని భావిస్తానో వారిని ఇళ్ళకు పంపుతాను. అదీ మీ ఇష్టాన్ని బట్టి. ఇక్కడే ఉండాలని కోరుకునే వారు ఇక్కడే ఉండవచ్చు. గత జన్మలో చేసుకున్న కర్మ ఫలాల వలన, మన జన్మ, మన సుఖసంతోషాలు మనకు లభిస్తాయి.ఇతరులను బాధించి, దాన్ని ఇంకా పెంచుకుని , మరుజన్మకు కూడా తీసుకెళ్ళకుండా భక్తిమార్గంలో శేష జీవితం ఆనందంగా గడపను ప్రయత్నించాలి. వీలుంటే సాధన చేసుకుని జన్మరాహిత్యానికి యత్నించాలి.

కలదు కలదొక్క మాల మీ కంఠమందు

ఎన్నిచేసిన నవియన్ని ఏర్చి కూర్చి

మంచియైనను చెడుగైన త్రుంచ కుండ

బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల

కర్మలన్నియు చేర్చిన కంఠమాల – అన్నారు బాబావారు.

కనుక మీకంఠమాలను బరువులేకుండా తేలిక చేసుకోండి. " అని ముగించింది డాక్టర్ రంజని.

మరునాడు ఉదయాన్నే ఇటు హంసిని మామగారు "అమ్మా! హంసమ్మా! కొంతకాలం నేను డాక్టర్ రంజని హోంలో ఉండి వస్తాను. అక్కడ నా లాంటివారు చాలామంది వున్నట్లు చూశాను. కాస్త స్థల మార్పు కోసం. పైగా అక్కడున్న నా వయస్సు వారితో కాలం గడుస్తుంది.” అని, "తల్లీ! నర్మదమ్మా! ఇల్లు వదలిపెట్టి చాలా రోజులైంది. వెళ్ళి చూసుకుని అక్కడే ఉంటాను, వాడు వచ్చిందాకా "అని అటు నర్మద, అత్తగారూ ఆటోలు మాట్లాడుకుని, తమబట్టలతో బయల్దేరారు.

సమాజంలో తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన వారికి ఏదైనా ఒక సంస్థో, మానసిక శాస్త్రజ్ఞులో కౌన్సిలింగ్ ఇస్తే, కఠినమైన క్రమశిక్షణ కాక , ప్రేమపూర్వక క్రమశిక్షణ తమ బిడ్డలకు అందిస్తే , భయంతో మనస్సు, మెదడు సరిగా ఎదగని ఇలాంటి అన్డెవలప్డ్ అడల్ట్స్ సమాజంలో తయారై ఎవ్వరినీ అశాంతిపాలు చేయరని భావించవచ్చా!

***శుభం***


76 views1 comment

1 comentario


dsatya_p13
dsatya_p13
02 jul 2021

అతి నర్మగర్భితమైన చక్కటి సందేశాన్ని అందించిన కథ. ధన్యవాదాలు మంచి కథ చదివే అవకాశం కల్పించినందుకు మేడం .

Me gusta
bottom of page