top of page

సంక్రాంతి  వెలుగులు

Updated: Jan 21

#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #SankranthiVelugulu, #సంక్రాంతి వెలుగులు, #Sankranthi2025,


Sankranthi Velugulu - New Telugu Poem Written By  - Dr. C. S. G. Krishnamacharyulu

Published in manatelugukathalu.com on 14/01/2025 

సంక్రాంతి  వెలుగులు - తెలుగు కవిత

రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు


సీ/ 

సంక్రాంతి అరుదెంచె సౌందర్యమూర్తియై 

కళ్ళాపి జల్లండి కాంత లారా! 

సంక్రాంతి యేతెంచె సౌభాగ్య దాయియై 

ముగ్గులు పెట్టండి ముదిత లారా! 

సంక్రాంతి వేంచేసె సంపద రాశియై 

గొబ్బెమ్మ పేర్చండి కొమ్మ లారా!

సంక్రాంతి వచ్చెను సరదాల మాలికై 

హారతి నివ్వండి అతివ లారా! 

తే.గీ./ 

పోరు ఆటలు విడనాడి పురుషులార 

ఘనముగా బంధుమిత్రులను గౌరవించి

కరుణ నిరుపేదలకు కొంత కలిమి పంచి 

శాంతి వెలుగులు నింపండి జగతి నిండ.   


తే.గీ./ 

 ఆట పాటలు, సరదాలు అతిశయింప 

విందు భోజనాల రుచులు వెల్లి విరియ

సరస సంగీత  నృత్యాలు సందడింప

సంకు రాతిరి పండుగ జరుపు కొనుడు. 


తే.గీ./ 

సాంప్రదాయాల మంచిని సంగ్రహించి 

జన్మ భూమి సంస్కృతి నెంచి సాగి పొమ్ము

మనకు పండుగ నేర్పెడి మంచి అదియె 

స్వాగతించుము సంక్రాంతి సంత సముగ.  


-Dr. C..S.G . కృష్ణమాచార్యులు



Comentarios


bottom of page