శాంతికోసం!!!
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- Jan 1
- 4 min read
#SanthiKosam, #శాంతికోసం, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Santhi Kosam - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 01/01/2025
శాంతికోసం - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
ప్రపంచం.. మానవులు.. రాగద్వేషాలు..
బాంధవ్యాలు.. అనుబంధాలు..
అవసానదశ.. అంతిమయాత్ర..
అంతా.. మిధ్య!!!.. అంతా.. అశాశ్వతం.. అంతా మాయ.. ఎవరికి ఎవరో!!!
రాఘవయ్యగారు మధ్యతరగతి వ్యక్తి. మేనమామ కూతురు సంధ్యను చిన్ననాటి నుంచీ మహదానందంగా, యుక్తవయస్సులో ప్రేమించి, అభిమానించి వివాహం చేసుకొన్నాడు.
మనిషి.. సదా మంచిని గురించి ఆలోచించడం, మంచిని పదిమందికి పంచడం, వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడటం అతని తత్త్వం. ఉపాది స్కూలు మాస్టర్, తెలుగు పండిట్. ఇల్లాలు సంధ్య.. వారిని అన్ని విషయాల్లో అభిమానించేది, గౌరవించేది. ప్రాణసమానంగా ప్రేమించేది.
వారికి ఇరువురు పిల్లలు. అశోక్, అనంత్. ఇరువురినీ చక్కని క్రమశిక్షణతో పెంచి పెద్ద చేశారు ఆ దంపతులు. వారిరువురి అభిప్రాయం, తమ జీవితకాలంలో, తమవలన పిల్లలు ఏ విషయంలోనూ బాధపడకూడదని. అలాగే వారిరువురికి మన హైందవ సనాతన ధర్మాలపట్ల, పురాణాల పట్ల, సంస్కృతి పట్ల ఎంతో గౌరవాభిమానాలు. యుక్తవయస్కులైన పిల్లలు ఆంగ్ల విద్యాభ్యాసం చేసి, డిగ్రీలు సాధించి, ఒకరు అశోక్ ఇంజనీర్‍గాను, రెండవ అతను అనంత్ న్యాయవాదిగాను స్థిరపడ్డారు. మనోతత్త్వాలు మారిపోయాయి.
రాఘవయ్య, సంధ్యలు ఇరువురి కుమారులకు సకాలంలో వారు నచ్చి, మెచ్చిన కలవారి యువతులు శోభ, జయలతో వివాహం జరిపించారు. అబ్బాయిలు, అమ్మాయిల చేతిలో కీలుబొమ్మలైనారు. అశోక్, శోభ విశాఖపట్నంలో ఉద్యోగరీత్యా వున్నారు. అశోక్ మామ సివిల్ కాంట్రాక్టర్ నరహరి. భార్య సౌదామిని ప్రిన్సిపాల్. శోభ బ్యాంక్ ఎంప్లాయ్. ఆమె తమ్ముడు శత్రు బి. టెక్ ఫైనల్ ఇయర్.
అనంత్, జయలు అత్తగారి ఊరు గుంటూరులో, అత్తగారి ఇంట్లోనే వున్నారు. కారణం జయ ఆమె తల్లిదండ్రులైన నరసింహం, రాజహంసలకు ఒకే కూతురు. అంటే.. అనంత్ ఇల్లరికపుటల్లుడనే చెప్పాలి.
రాఘవయ్య, సంధ్యలది గ్రామవాసం.
కొడుకులు అశోక్, అనంత్‍లది నగరవాసం.
ఉన్నంతలో దానం, ధర్మం, పరోపకారణం రాఘవయ్యగారు తన జీవితకాలంలో పాటించిన సద్గుణాలు.
రాఘవయ్య సంధ్యలు ఇరువురు కొడుకుల కోరికపై వారి వారి ఇళ్ళకు కొంతకాలం క్రిందట ఉద్యోగంలో రిటైర్‍మెంటును పొందిన తర్వాత వెళ్ళారు. పట్టుమని పదిరోజులు కొడుకులైన అశోక్, అనంత్‍ల ఇండ్లలో ఉండలేకపోయారు. కారణం కోడళ్ళు శోభ (అశోక్ భార్య), జయ (అనంత్ భార్య) వారిని చిన్నచూపుతో చూచి, అమర్యాద, అగౌరవపరిచారు. ఆ కారణంగా అభిమానవంతులైన ఆ దంపతులు వారి ఊరికి తిరిగి వచ్చారు.
కన్నబిడ్డలు ఎన్ని తప్పులు చేసినా మన్నించి వారికి మంచిని బోధించడం తల్లిదండ్రుల కర్తవ్యం, ధర్మం.
ఒక సంధర్భంలో పెద్దకొడుకు అశోక్ రాఘవయ్యగారిని.. ’నన్ను మీరు ఎందుకు కన్నారు!.. నేను నన్ను కనమని మిమ్మల్ని అడిగానా!’ ఆవేశంతో విచక్షణారహితంగా అశోక్ మాధవయ్యగారిని అడిగాడు.
తనయుని ఆ పలుకులు రాఘవయ్యగారికి, అశోక్ తన తలను నరికినట్లనిపించింది. తల్లి సంధ్య విచారంగా కన్నీరు కార్చింది. అతను ఆ మాట అనేదానికి కారణం.. ఆస్థిని పంపకాలు చేయమని అశోక్ అడగటం!..
’ఇప్పుడు కాదులే చేస్తాను’ అని రాఘవయ్య చెప్పడం.
వారి అర్థాంగి సంధ్య కొడుకు మాటలను విని బాధతో అశోక్‍ను మందలించింది. ఆవేశంతో అశోక్ భార్యతో కలిసి వెళ్ళిపోయాడు.
ఆ మరుదినం రాఘవయ్య లాయర్ రామారావు గారిని పిలిపించి ఆస్థిని మూడు భాగాలుగా విభజించి, భార్య ఇరువురి కొడుకుల పేర వ్రాయించి రిజిస్టర్ చేయించి, ఆ రిజిస్టర్‍ను పోస్టులో ఇరువురు తనయుల అడ్రస్‍కు పంపించాడు.
కొడుకులిరువురూ ఆ డాక్యుమెంట్స్ రిసీవ్ చేసుకొన్నారు. ఓ నెలరోజుల తర్వాత వచ్చారు అన్నాదమ్ములు, కోడళ్ళూ. తోటే కోడళ్ళ తండ్రులు.
వి. ఆర్. ఓ ను సంప్రదించి భూములను విక్రయించే దానికి వారంరోజులు పట్టింది.
వయస్సుమీరిన సంధ్య ఆ వారం రోజులు కొడుకు, కోడళ్ళకు, వియ్యంకులకు టిఫిన్, భోజనం, రాత్రి డిన్నర్ వేరు వేరుగా తయారు చేసి వారి పొట్టలను సగౌరవంగా నింపేదానికి సతమతమైపోయింది. రాఘవయ్య తాను చేయగల సహాయాన్ని సంధ్యకు చేసేవాడు.
వారంతా ఉదయం ఎనిమిదిన్నరకు లేచేవారు. లేవగానే బెడ్ కాఫీలు, తర్వాత తొమ్మిదిన్నరకు వారు చెప్పిన టిఫిన్, మధ్యాహ్నం ఒంటిగంటకు రెండు కూరలతో భోజనం, నాలుగు గంటలకు పకోడినో, బజ్జీలో స్నాక్స్, టీ, రాత్రి ఎనిమిది గంటలకు డిన్నర్, తను శ్రమించి వారందరికీ క్రమంగా అమర్చేది. సంధ్య కొడుకులు కాని, కోడళ్ళ తండ్రులు కాని, తమ కూతుళ్ళను అత్తకు సాయం చేయండి అని శోభ, జయలకు ఎవ్వరూ చెప్పలేదు.
వారంరోజుల తర్వాత బయలుదేరేముందు వియ్యంకులు రాఘవయ్యగారితో..
"బావగారు! ఆ మూడవభాగాన్ని రెండు భాగాలుగా చేసి మీ కొడుకులకు ఇస్తే, మేము వచ్చిన పని పూర్తయినట్లు అవుతుంది. లాయర్‍ను పిలిపించండి. "
అది ఇరువురు వియ్యంకుల మాట.
"నాన్నా!.. మామయ్య చెప్పింది యదార్థం. లాయర్‍ను పిలిపించి మూడవ భాగాన్ని మా అన్నాదమ్ములకు సమానంగా పంచి ఇవ్వండి. మేము వెళ్ళిపోతాం" అన్నాడు అశోక్.
"అవును నాన్నా!" ఆ పని చేయండి. మేము హ్యాపీగా వెళ్ళిపోతాము" అన్నాడు అనంత్.
దీర్ఘదృష్టి కల రాఘవయ్యగారు ఇలాంటిరోజు అంటూ ఒకనాడు వస్తుందని ముందుగానే ఆలోచించి, ఆస్థిని మూడుభాగాలు చేసిన రోజునే, మూడవభాగాన్ని రెండు భాగాలుగా చేసి పత్రాలను వ్రాయించి వుంచారు. వియ్యంకులు, కొడుకులు అడగగానే, తన పెట్టెను తెరిచి ఆ పత్రాలను వారికి అందించారు. వారంతా ఆనందంగా వెళ్ళిపోయారు. భర్త చేసిన ఆ కార్యం సంధ్యకు నచ్చలేదు. సంధ్యకే కాదు.. రాఘవయ్యకూ వారి తత్త్వం నచ్చలేదు. రభస జరగడం వారికి ఇష్టం లేదు.
"చూడు సంధ్యా!.. నేను చేసిన పని నీకు నచ్చలేదని నాకు తెలుసు. వారు ఆరుగురు. మనం ఇద్దరం వృద్ధులం. వారిచేత ఈసడించుకోవడం, అప్రశస్త ప్రసంగాలు చేయడం నాకు ఇష్టం లేదు. మనపట్ల ఎలాంటి అభిమానం లేకుండా వారు అడిగారు. ఇలాంటిరోజు ఒకనాడు వస్తుందని నాకు ముందే తెలుసు సంధ్యా!..
ఆ పత్రాలను మూడు భాగాల పత్రాలుగా వ్రాయించిన నాడే లాయర్ ద్వారా వ్రాయించాను. వారు అడిగారు. ఇచ్చేశాను. మన మనస్సుకు బాధ, వారి మనసులకు ఆనందం!.. ఏనాడో పెద్దవాడన్నట్లు, మనంగా వారిని కన్నంగా!.. వారిపట్ల మనం పాటించవలసిన ధర్మాన్నే నేను పాటించాను. నా మనోశాంతి కోసం. ఇందులో ఎలాంటి అతిశయమూ లేదు. బాధపడకు. అంతా దైవ నిర్ణయం.. " రాఘవయ్య మనస్సున ఎంతో బాధ. పైకి మేకపోతు గాంభీర్యం..
ఆ తరువాత.. వారంరోజులకు సంధ్య మనోవేదనతో రాత్రి సమయంలో గుండె ఆగి చనిపోయింది.
రాఘవయ్య హితుడు, శిష్యుడు శివన్న శివాలయం పూజారి సంధ్య మరణవార్తను అశోక్, అనంత్‍లకు తెలియజేసే ప్రయత్నించారు. కానీ వారి శివన్న కాల్‍ను రిసీవ్ చేసుకోలేదు. రెండుమూడుసార్లు ప్రయత్నించాడు శివన్న. ఫలితం శూన్యం.
అర్థాంగి అంత్యక్రియలను భోరున ఏడుస్తూ రాఘవయ్య గారే చేశారు. పేరుకు ఆస్థి భాగాలకు ఇరువురు కొడుకులు. శివన్న కార్డుముక్క వ్రాసి ఇరువురికీ పోస్ట్ చేశాడు. కనీసం పదవరోజు కన్నా వారు రావాలనే భావనతో.. కార్టును చూచుకొన్న అన్నాతమ్ముడు పదవరోజుకు వచ్చారు. మొసలి కన్నీరు కార్చారు.
"అయ్యా!.. సుపుత్రులారా!.. నా భార్య స్మశాన పయనం నా మూలంగానే జరగాలన్నది ఆ సర్వేశ్వరుల నిర్ణయం కాబోలు. జరిగిపోయింది. మిగతా ఖర్మకాండాలను నా ఇల్లాలికి నేనే చేయాలని సంకల్పించుకొన్నాను. అందులో నాకు మీ అమ్మకూ సంతోషం, ఆనందం. మీరు శ్రమ పడనవసరం లేదు. అవసరం ళేదు.. " కన్నీటితో చెప్పాడు రాఘవయ్య.
శివన్న సాయంతో రాఘవయ్య చెప్పిన రీతిగానే ఆ కార్యకలాపాలను ముగించాడు.
అశోక్, అనంత్‌లు వెళ్ళిపోబోయేముందు..
"నాన్నా!.. మీరు మాతో రండి" అడిగారు అశోక్.
"మీ ఇరువురిలో నేను ఎవరితో రావాలి!.. "
"ఆరునెలలు అన్నదగ్గర వుండండి. ఆరునెలలు నా దగ్గర వుండండి నాన్నా!" అనంత్ జవాబు.
"రేయ్!.. శివన్నా!"
"మామా!"
"విన్నావుగా వారి నిర్ణయం!.. " వ్యంగ్యంగా నవ్వాడు. ఆ క్షణంలో రాఘవయ్యగారి కళ్ళల్లో కన్నీరు.
"నేను మీతో రాను. మీరు వెళ్ళండి" కళ్ళు మూసుకొన్నాడు రాఘవయ్య. మరోసారి అడిగారు అన్నాదమ్ములు.
రాఘవయ్యగారు ఇచ్చారు.. అదే జవాబు.. అన్నాదమ్ములు నిట్టూర్చి వెళ్ళిపోయారు.
"శివన్నా!.. "
"మామా!"
"నా జీవిత చివరి క్షణాల్లో నాతో నటించవలసిన వాడివి నీవేనయ్యా!.. " చిరునవ్వుతో చెప్పాడు రాఘవయ్య.
మెల్లగా లేచి ఇంట్లోకి వెళ్ళి తన పెట్టెను తెరిచి ఒక కవర్‍ను చేతికి తీసుకొని మెల్లగా వరండాలోనికి శివన్నను సమీపించాడు.
"శివన్నా!.. దీన్ని తీసుకో!.. "
"ఏంటి మామా!.. ఇది?"
"విప్పి చూడు.. నీవు నన్ను ఎంతగానో అభిమానించావు. ఇది నా జీవిత చరమాంకం శాంతికోసం చేసిన పని ఇది" చిరునవ్వుతో కుర్చీలో కూర్చున్నాడు. శివన్న ముఖంలోకి నవ్వుతూ చూచాడు. తల ఒరిగిపోయింది.
"మామా!.. " బిగ్గరగా అరిచి శివన్న రాఘవయ్యను చుట్టుకొన్నాడు. అతనికి విషయం అర్థం అయ్యింది. ఏడుస్తూ ఇంట్లోకి పరుగెత్తి నట్టింట, చాపను పరిచి రాఘవయ్యను చాపపై పరుండబెట్టాడు. భోరున ఏడుస్తూ కవరులోని కాగితాన్ని బయటికి తీశాడు శివన్న. అది నూరు రూపాయల స్టాంప్ పేపర్. అందులో..
’శివా!.. ఈ ఇల్లు నీది.. నా అంతిమయాత్రను సాగించవలసింది నీవు!.. చేస్తావుగా నాన్నా!!!’ అని వ్రాసి ఉంది.
శివన్న చేతినుండి పేపర్ జారిపోయింది.
’మామా!.. మామా!.. ’ ఏడుస్తూ రాఘవయ్య తలవైపు నేలన వాలిపోయాడు. ఆత్రంగా.. ఇరుగు పొరుగు వారు రాఘవయ్య ఇంట్లోకి ప్రవేశించారు.
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
కథ ఎంతో ప్రేరణాత్మకంగా, భావోద్వేగానికి లోనైన ఒక మంచి రచనగా ఉంది. రాఘవయ్య గారి తత్త్వాలు, జీవిత పాఠాలు, చివర్లో "శాంతి" కోసం ఆయన చేసిన నిర్ణయం చాలా హృదయానికి హత్తుకునే విధంగా వర్ణించబడింది. ఈ కథ మానవ సంబంధాలు, ఆశలు, ఆవేదన, తల్లి దండ్రుల త్యాగాలకు అద్దం పడుతుంది.
.రాఘవయ్య గారి తత్వం, ధైర్యం, మరియు శివన్న పట్ల చూపిన ప్రేమ ఈ కథకు మరింత గంభీరతను చేకూర్చింది.