top of page

సరదా సరదాగా కాసేపు


Sarada Saradaga Kasepu Written By Yamini Ashok Tinnanuri

రచన : యామినీ (తిన్ననూరి)అశోక్


ఆ ఊర్లో విశాలంగా వున్న వీధిలో ఒక పాతకాలపు వైభవంతో అలరారే ఇల్లు.. విశాలమైన వాకిలి,ఎత్తైన అరుగులు, పచ్చని చెట్లు,మొక్కలతో ,పెరట్లో తులసికోట... చుట్టూ గచ్చు చేసిన పెరడు..,కాలానుగుణంగా అమరిన ఆధునిక సౌకర్యాలతో... ఆకాలానికి, ఈకాలానికి..వారధిగా, ఉంది...ఆ ఇల్లు. వేసవికాలం సెలవులు...కాబట్టి పిల్లా జెల్లా..తో పాటు పెద్దవాళ్ళ సందడి... మగవాళ్ళు అందరూ కలిసి పొలానికి వెళ్లారు...కౌలు కి ఇచ్చిన పంట లావాదేవీలు మాట్లాడి వచ్చేందుకు. ఆడవారికి క్షణం తీరిక లేని పనులు వంటగదిలో. ఏడాదికి ఒక్కసారి, ఏదైనా కార్యం ఉంటే ఒకసారి(అప్పుడూ అందరూ రారుగా) వచ్చే పిల్లలకోసం ఎవరికి నచ్చింది వారికి చేసిపెట్టే హడావిడి. ఇక పిల్లలు అయితే అందరూ కలిసేసరికి కిష్కింధ కాండ చేస్తున్నారు.. అయినా ఒక్కరూ వారిని గదమాయించట్లేదు.అందుకు కారణం ఆ ఇంటి పెద్ద పావన శాస్త్రి గారు. వసారాలో వాలు కుర్చీలో కూర్చుని పిల్లల ఆటపాటలు చూస్తూ...వారి అల్లరిలో వారి బాల్యాన్ని వీక్షిస్తూ మురిసిపోతున్నారు. అల్లరి చేయని పిల్లలు పిల్లలే కాదన్నది ఆయన అభిప్రాయం. పెద్దయ్యాక ఎలాగూ చేయలేరు... ఇప్పుడు కూడా కట్టడి చేయటం దేనికని...ఆయన ఉద్దేశ్యం. మితిమించితే దగ్గరకు పిలిచి లాభనష్టాలు వివరించి మళ్లీ ఆటలకి పంపేవారు. ఎనభై ఏళ్ళు పైబడిన వృద్ధ బ్రహ్మచారి ఆయన. యాత్రలకని వెళ్లిన అన్నా వదినలు.. దురదృష్టవశాత్తు బస్సు యాక్సిడెంట్ లోపోతే, వారి ఏడుగురు సంతానానికి ఈయనే తల్లి తండ్రి అయ్యి చదువులు, పెళ్లిళ్లు చేసి ఈ బాధ్యతల వల్ల పెండ్లి కూడా మానుకుని... వారిని వృద్ధిలోకి తెచ్చిన త్యాగమూర్తి . నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు. అందరి బాధ్యతలు తీరాయి. నిమ్మపండు వంటి మేనిఛాయ తో, తిరునామాలు,ధరించి, మెడలో తులసి పూసలమాలలు, ప్రశాంత వదనం, సదా చిరునవ్వుతో, నోటినుంచి ఒక్క పరుషమైన మాట కూడా రానీయని ఉత్తముడు. చూడగానే చేయెత్తి నమస్కరించాలనిపించే నిండైన విగ్రహం. ఆయన పెంపకంలో పెరిగిన ఆ నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు మంచిగా చదువుకుని చక్కగా స్థిరపడ్డారు. కూతుర్లు అత్తవారిళ్లల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. కోడళ్లు కూడా...మామగారి మంచితనం తెలిసికొని ..ఆయనకి అనుగుణంగా, అందరూ కలిసి సామరస్యంగా ఉంటూ... సొంత అక్క చెల్లెళ్ళ లాగా మెసిలేవారు. ఆయన లేకుంటే తమ పరిస్థితి ఏంటో తెలిసిన వారు, బాగా అర్థం చేసుకున్న వారు కావడం తో...ఆయన పట్ల వినమ్రులై నడుచుకోవడం తప్ప ఇంకేమీ చేసినా వారి రుణం తీర్చుకోలేమన్నది...వారి నరనరానా జీర్ణించుకు పోయింది. ఆయన త్యాగాన్ని వృధా చేయక, మంచిపేరు తెచ్చుకుని ఎప్పుడూ కలిసి ఉందటమే...ఆయనకు తామిచ్చే బహుమతి అని.. వారందరికీ తెలుసు. అందుకు తగ్గట్లే నడుచుకునే వారు. వారి అదృష్టం కొద్దీ అందరి జీవితభాగస్వాములు కూడా అంతే సంస్కార వంతులు. ఏడుగురు పిల్లల్లోనూ ఆఖరి వాడైనట్టి గురునాథశాస్త్రి కొంత ప్రత్యేకతలు కలిగిన వాడు. ఆఖరి వాడు ,పావన శాస్త్రి గారి చేతుల్లోకి వచ్చినప్పుడు అతగాడు కేవలం మూడేళ్ళ చంటివాడు. అందుకే ఆయనదగ్గర కాస్త గారాబం... ఉండేది అతనొక్కడికే... **** **** **** **** **** అందరిలోనూ ఆఖరివాడు అయిన గురునాథశాస్త్రి కాస్త ప్రత్యేక మైన వ్యక్తి. పెద్దలు,పిన్నలు అంతా ఆయన్ని' గురన్నా' అని పిలుస్తారు. ఆయన వయసులో చిన్నవాడే కానీ సకల విద్యాపారంగతుడు. ఎం ఏ ఎకనామిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్. కాలేజీ లెక్చరర్. రాని విద్య లేదు. పాకశాస్త్రం నుంచి పాండిత్యగోష్టుల వరకు,పిచ్చుక గూళ్ళు కట్టడం నుంచి ఇంటి ప్లాను ల వరకు ఏదైనా సరే... అనర్గళంగా మాట్లాడే వాక్చాతుర్యం కలవాడు. అల్లరి విషయంలో పిల్లలకంటే ఎక్కువ. పూజల విషయంలో చిన్నాన్న గారికి ధీటైన వారసుడు.గొప్ప హాస్య చతురుడు. ఒక్కడు చాలు, అల్లరికి..వందమంది పెట్టు.పెద్దల్లో ఇమడని పసివాడు, పిల్లల్లో ఇమడని పెద్దవాడు. ఈ అల్లరి గురన్నకి పెళ్లి అయ్యి ఏడాది కావస్తోంది. దేవుడు ఒక్కోసారి సరైన వ్యక్తుల్ని వెతికి మరీ కలుపుతాడన్నట్లు.. నిర్మల, అదేనండీ గురన్న భార్య సరిగ్గా గురన్న కి ధీటైనది. అల్లరి గానీ, ఆచారం గానీ. ఏకాస్తా సమయం దొరికినా ఇద్దరూ పిల్లల్ని మించి ఆడుకుంటారు. అందరిలోకి చిన్నదయ్యేసరికి తొడికోడళ్లు గానీ, ఆడపడుచులు గానీ ఎంతో గారాబంగా చిన్న పిల్ల లానే చూస్తారు. అలా అని చిన్నపిల్ల లాగే ఉంటుందా!! అదేం లేదు, మంచి పనిమంతురాలు. ఇంటిపని, వంటపని... ఏదైనా సవాల్. అందుకే ఆ పిల్లంటే ముచ్చట పడి పోతారు ఇంట్లో అంతా. పిల్లలైతే ఇంకా...! మరి పెద్దల్లో పిల్లలు కదా వీళ్ళిద్దరూ అందుకే అందరికి... గురన్న, అన్నా, నిర్మల అత్త(పిన్ని) అన్నా... వారికి ప్రాణం. ఆ ఇద్దరూ పిల్లల్ని అందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని పాటలు పాడుతూ ఆడుతూ ఉంటే పావన శాస్త్రి గారు మురిసిపోయేవారు. నిర్మలకి పిల్లలకు తలంటు పోయడం అంటే మహా సరదా. పిల్లలు కూడా నిర్మల తలకి పోస్తానంటే... కిమ్మనకుండా వచ్చి పోయించుకుంటారు. అందరూ ఒక్కదగ్గర ఉండేసరికి...పెద్దవాళ్లే పనులన్నీ చేసేస్తున్నారు. నిర్మలని నువ్వెళ్ళి పిల్లల్తో ఉండమని పంపించారు.ఇక నిర్మల ఊరుకుంటుందా.. పిల్లల్ని రెచ్చగొట్టి... వరుసపెట్టి అన్ని ఆటలూ ఆడించేసింది. అందరూ దుమ్ముకొట్టుకు పోయారు. పెద్ద కోడలు వీళ్ళని చూసి.. బాగా తిట్టింది. 'స్నానాలు చేసి వెళ్లి, మళ్లీ మట్టిలో ఆడారు.. శుభ్రంగా తలంటుకుని గానీ లోనికి అడుగు పెట్టొద్ద'ని శాసించి వెళ్ళింది. నిర్మల కళ్ళు తళుక్కున మెరిశాయి. అసలే నిర్మల కి ఇష్టమైన పని. "రండర్రా.... అందరూ.." అంటూ "అక్కా! పనితో పని శుభ్రంగా నలుగు పెట్టేస్తాను.. ఆ నలుగు పిండి, నూనె గిన్నె ఇచ్చెయ్యి" అని హడావిడి చేసి... గురన్నని బావిలో నీళ్లు చేదమని పురమాయించింది. పనివాడిని పిలుచుకో పొమ్మన్నాడు గురన్న. ఆమాత్రం నాకు తెలుసు గానీ.. మీరు తోడాల్సిందే... అంటూ పట్టు పట్టి బావిదగ్గరికి తోసింది. ఒసే నిర్మలా...! అర్భకుడిని అని కూడా చూడకుండా ఇటువంటి పనులు చెప్తావా!? అంటూ కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళాడు. పిల్లలు అంతా ఒకటే నవ్వులు గురన్న అలా నడవడం చూసి. పిల్లల నవ్వులకి రెచ్చిపోయిన నిర్మల ఒక్కొక్కరిని లాగి పీట మీద కూర్చోబెట్టి...అందరికీ నూనె పట్టించి ఒక వరుసలో కూర్చోబెట్టింది. చిన్న నుంచి పెద్ద వరకూ వరుస గా తలంటడం మొదలు పెట్టింది. "ఒరే చంటాడా... ఇట్రా.. ,ఏంట్రా... నీ బుర్ర నిండా ఏముంది? నిండా నీళ్లున్నాయా! చూడు నీ బుర్ర ని కదిలిస్తుంటే.. కుళ క్ కుళక్ అంటుందేంట్రా..." అని వాడిని, తలంటు పోసి పంపింది. వాడు తలూపుకుంటూ 'కుళక్, కుళక్..' అని నవ్వుకుంటూ పరుగులు పెట్టాడు. ఏ మాటకామాట.. నిర్మల తలంటితే తన్మయత్వంతో నిద్ర రావడం ఖాయం. అంత సున్నితంగా చేయిస్తుంది. "ఒరే , నాయనా, భావనారాయణా...రా,రా, నీ బుర్రలో ఏముందో చూద్దాం" అంటూ ఇంకోరిని, "ఏమే పావనీ, నీకేమే...! ఇంత పెద్ద జడ, బూజు దులుపుకోవడానికి బాగుంటుంది..." అని నవ్విస్తూ, నవ్వుతూ... తలంటుతోంది. "ఒరే వాసూ... నువ్వు రా...అసలే, నీ రింగుల జుట్టు...రుద్దాలంటే కష్టం.." అని వాసుని పిలుస్తూ ,ప్రభకేసి తిరిగి "పెద్దమ్మని అడిగి కాఫీ పెట్టించుకురా" అంటూ పురమాయించింది. ప్రభా వాళ్ళమ్మ..(.పెద్దకోడలు..) కాఫీ గ్లాసు పట్టుకుని వచ్చి "నాకు తెలుసు గా..నలుగురికి తలంటితే నాలుగు గుక్కలు గొంతులో దిగక పోతే కష్టం..బండి నడవడానికి.." అని నవ్వుతూ నిర్మల చేతికి ఇచ్చింది. తోడి కోడళ్లు ఇద్దరూ... కబుర్లు చెప్పుకుని పెద్దావిడ లోనికి వెళ్ళగానే మళ్లీ తలంట్లు మొదలు. "ఒరే, వాసూ.. హేమక్క చేతి కాఫీ యే కాఫీ రా.. మీ అమ్మ పెట్టిన కాఫీ త్రాగితే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుంటుంది..తెలుసా...!" అంటూ తన్మయత్వంతో మాట్లాడుతూ.. తలంటుతోంది. "ఒరే వాసూ...! ఇదేమి రా! తలనిండా మట్టి ఉంది. అందుకేనా! జుట్టు ఇంత బాగా మొలుస్తోంది... అంతా బాగుంది గానీ ఇలా ఉంటే తలమాసినోడు అని పిల్లని ఎవ్వరూ ఇవ్వర్రా నాయనా!" అనేసరికి పిల్లలంతా గొల్లున నవ్వారు.అప్పటికే తలారబెట్టుకుని...అరుగుమీద కూర్చున్న పిల్లలు..వంటింట్లోంచి తెచ్చుకున్న జంతికల్ని కరకర నమిలేస్తున్నారు ..ఆనవ్వులు,ఈ శబ్దాల...మధ్యవినిపించిన మాటలు విని నిర్మల నిర్ఘాంత పోయింది. ఉలిక్కిపడి, కుంకుడుకాయరసం ఉన్న కంచు గిన్నెతో పాటు ఆపళం గా లేచింది. *** *** *** *** "నిన్నిచ్చాడు కదే మీ నాయన.." ఈ సౌండ్ వచ్చింది అప్పటిదాకా తలంటిన వాసు దగ్గర్నుంచి. నిర్ఘాంత పోయిన నిర్మల.."ఒరే వాసూ...!" అని అరిచేసరికి "ఇక్కడున్నా పిన్నీ "అంటూ దూరంగా వాసు.

"మరి వీడెవడ్రా.. ?" అంటూ జుట్టు పట్టుకుని ముఖం పైకెత్తింది. రెండు చేతుల్తో ఆ శాల్తీ.. ముఖం మీద నురుగు ని తుడుచుకునేసరికి "మీరా!" అంటూ ఉక్రోషం కొద్దీ చేతిలో ఉన్న కంచు చెంబుతో ఒక్కటి మొట్టింది. అసలే కళ్ళు తెరిచి కుంకుడు కాయ రసం కంట్లోకి పోవడంతో మంటెక్కిన గురన్న... ఠంగు మంటూ నెత్తిన పడిన చెంబు దెబ్బకి కళ్ళు సరిగ్గా కనపడక అడ్డదిడ్డంగా పరుగులు పెట్టాడు పెరట్లో..పిల్లలు పడీ పడీ నవ్వుతున్నారు. ఈ గందరగోళం విని బయటికి వచ్చిన ఆడవాళ్లు,అక్కడి దృశ్యం చూసి అలాగే నిలబడిపోయారు ఏం జరుగుతుందో అర్ధం కాక. చిన్న తుండు కట్టుకుని గురన్న పరుగులు పెడుతుంటే, సగం కుచ్చిళ్ళు నడుము న దోపుకుని పందెం కోడి లా పరుగెడుతోంది నిర్మల.. విషయం తెలుసుకున్న ఆడవాళ్లు నవ్వుకుంటూ లోనికి వెళ్లారు. (అసలీ తమాషా ఎలా జరిగిందంటే... నిర్మల వాసుని తలంటుకోడానికి పిలిచి.. కాఫీ త్రాగుతూ తోటి కోడలితో కబుర్లు చెప్తున్న సమయంలో... గురన్న వాసుని వెనక్కి లాగి... ఆ ప్లేస్ లో తాను ముడుచుకుని కూర్చుని కాస్త కుంకుడు రసం తలకి రుద్దేసుకున్నాడు. కాఫీ త్రాగేసి కబుర్ల సందట్లో.. కూర్చున్నది వాసుయే అని తలంటుతూ.. తలమాసిన వాడనేసింది...అదిగో.. అక్కడా... ఇంతటి అల్లరి ఘటన ఊపిరి పోసుకుంది.) ఎలాగో నవ్వుల మధ్య స్నానాలు అయ్యింది గానీ నిర్మల ఉక్రోషం మాత్రం తగ్గలేదు. భోజనాలప్పుడు పిల్లలు అంతా ఒక వరుసలో మగవాళ్ళు అందరూ ఎదురు వరుసలో కూర్చున్నారు. ఆడవాళ్లు వడ్డిస్తున్నారు. సాధారణంగా ఇలా అందరూ ఉన్నప్పుడు వడ్డించే పని సరదాగా,ఇష్టం తో చేస్తుంది. అటువంటిది నిర్మల రాలేదు. పావన శాస్త్రి గారు వంటింటి వైపు చూశారు. నిర్మల కనపడలేదు. అడిగారు." నిర్మల ఏదీ...? వడ్డించడానికి రాలేదూ...!" అంటూ. పిల్లలు నవ్వు దాచుకుందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆడవాళ్లు చెంగు నోటికి అడ్డం పెట్టుకున్నారు. పావన శాస్త్రి గారు గురన్న వైపు చూసి "ఒరే గురునాథం.. మీ ఆవిడని పిలువు..." అంటూ గురన్న వైపు చూసి , "అదేమిరా! అట్లా తడుముకుంటున్నావు...ఏమయ్యిందీ..". అనేసరికి పిల్లలు పోలోమంటూ నవ్వులు. మగవాళ్ళెవరికీ విషయం అర్ధం కాక... తెల్లమొహాలు వేసుకుని చూస్తుంటే...పావన శాస్త్రి గారు కాస్త గట్టిగా "నిర్మలా...!" అంటూ పిలిచారు అనేకంటే అరిచారని చెప్పొచ్చు. మెల్లగా నిర్మల వచ్చి నిలుచుంది.

"ఏం జరిగింది?"ఎందుకు రాలేదు వడ్డించడానికి.." అడిగారు పావన శాస్త్రి గారు. "............." "ఎవరూ మాట్లాడరేం? "వీడెందుకు ఊరికే తల తడుముకుంటున్నాడు..?" అందరిలో చిన్నవాడు..." మరే.. తాతయ్యా... నిర్మలత్త గురన్నని చెంబుతో తలమీద కొట్టింది...! "అనేసరికి పావన శాస్త్రి గారి కళ్ళు ఎర్రబడ్డాయి. *** *** *** *** ఏం.. నిర్మలా!? ఇదేం విపరీతం చేష్టలు." నిర్మల గుమ్మం పట్టుకుని నిల్చుండి పోయింది. గురన్నేమో విస్తట్లో మొహం పెట్టేసాడు. "ఏం గురునాధా... అంత కొట్టుకోవాల్సినంత గొడవేమి జరిగింది మీ మధ్య.. ? ఏనాడైనా ఇటువంటివి మనింట్లో కనీవినీ ఎరుగుదుమా?! " "................." ఈ మౌనాన్ని, తమకి ఇష్టమైన ఇద్దరూ ముద్దాయిల్లా తలవంచుకోవడం చూసి సహించలేక పోయిన పిల్లలు ఒకరి ముఖాలు ఒకరు చూసి సైగలు చేసుకున్నారు. అందరిలోకి పెద్దదైన ప్రభ...తెగించి చెప్పడం మొదలు పెట్టింది. "అసలేం జరిగిందంటే తాతగారూ... "అంటూ మొదలు పెట్టి వివరంగా చెప్పింది. మధ్యలో కాస్తో కూస్తో చిన్నపిల్లలు కూడా అందుకున్నారు ధైర్యం వచ్చి. "ఇదండీ తాతగారూ...జరిగింది" అనేసరికి..పావన శాస్త్రి గారు కోపంతో మండి పడుతున్న వారు కాస్తా మంచి గంధం చల్లినట్లు శాంతించారు. "ఓరి బడుద్దాయి...అదట్రా సంగతీ..., అయినా ఇన్నేళ్లు వచ్చినా , ఈ అల్లరేమిట్రా... " అంటూ నవ్వేశారు." మంచిపని చేసింది... మరి నాలుగు తగలనిచ్చి ఉండాల్సింది..." అంటూ నవ్వేసరికి... అందరూ జత కలిపారు. నవ్వులు గవ్వలైనాయక్కడ...! సాయంత్రం అందరూ వీధి అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.మరో వైపు అరుగుమీద వాలుకుర్చీలో పావన శాస్త్రి గారు కూర్చుని ఉన్నారు. కొడుకులు ముగ్గురూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. ఉన్నట్లుండి గురన్న అక్క కొడుకు , "మామయ్యా! నువ్వు ఆ మాట అనకుండా ఉంటే అత్త మాకులాగే నీకు కూడా చక్కగా వీపు రుద్ది స్నానం చేయించి ఉండేది కదా! అనవసరంగా అన్నావు మామయ్యా!" అన్నాడు. అందరూ ఇటు తిరిగారు... గురన్న ఏం చెప్తాడా!? అని...! దానికి గురునాథశాస్త్రి...అదే గురన్న 'తలమాసిన వాడంటే కోపం వచ్చి అన్నాను గానీ, ఏమీ అనకుండా ఉంటే, ఆఖర్న తెలిస్తే నేను పెరట్లో తుండుగుడ్డ కూడా లేకుండా గంతులు వేయాల్సి వచ్చేది. నాకు పరువు, మీకు కళ్ళూ రెండూ పోయేవి కాదుట్రా...! అదీ రెండు బొప్పిల్తో సరిపోయింది. సున్నం లోకి ఎముక మిగలనిచ్చేదిట్రా... మీ అత్త...!" అంటూ తల తడుముకుంటూ" అబ్బా...!" అనేసరికి అందరూ నవ్వేశారు. వాలుకుర్చీలో కూర్చున్న పావన శాస్త్రి గారు రెండు చేతులూ ఎత్తి దణ్ణం పెడుతూ...ఎప్పుడూ... ఇలాగే... ఈ కుటుంబం ఇలా నవ్వులతో, కేరింతలతో హాయిగా ఉండేలా దీవించు తండ్రీ...!" అంటూ ప్రార్ధించారు. ఉక్రోషపడిన గురన్న" ఇంకా నయం, రోజూ కంచు చెంబుతో మొట్టికాయలు తింటూ ఉండాలి నేనంటూ(గురన్న)మొక్కుకోక పోయావూ... అంటూ బుంగమూతి పెట్టుకుని తల తడుముకుంటూ ఉంటే... అందరూ మరోసారి నవ్వుకున్నారు పువ్వులు చల్లినట్లు గా...! (సమాప్తం)

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయిరచయిత్రి పరిచయం

పేరు.. యామినీ(తిన్ననూరి) అశోక్

వయసు.. 56

హాబీ.. కవితలు ,కథలు వ్రాయడం,చదవడం

ఫేస్ బుక్ లో గత ఆరేళ్లు గా రచనలు పోస్ట్ చేస్తున్నాను.


95 views0 comments

Comments


bottom of page