top of page

నిజాయితీ!!!



'Nijayithi' - New Telugu Story Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 12/12/2023

'నిజాయితీ' తెలుగు కథ 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



కాలింగ్ బెల్ మ్రోత వినగానే ఇంట్లో వున్న జానకి తలుపు తెరిచింది.

భర్త రఘు... వారి సోదరి శశి నిలబడివున్నారు.


"ఆ... రండి... రండి... ఆ... శశీ... అత్తయ్యా..... మామయ్యా అంతా కులాసేనా!" అడిగింది జానకి. 

బస్సు ప్రయాణంలో అలసిపోయిన శశి నిట్టుర్చి "అంతా బాగానే వున్నారు వదినా" అంది ముక్తసరిగా. 


"బస్సు ప్రయాణం కదా అలసిపోయావు వెళ్ళి స్నానం చేసిరా టిఫిన్ తిందువుగాని. ఇంటర్వ్యూ రేపు కదా! హాయిగా పడుకొని విశ్రాంతి తీసుకో" చిరునవ్వుతో అభిమానంగా చెప్పింది జానకి.

"అలాగే వదినా!" అని శశి గెస్ట్ రూములోనికి ప్రవేశించింది.


"తొమ్మిదిన్నరకల్లా ఆఫీసులో ఉండాలి" అంటూ రఘు తన చేతిలోని చెల్లెలి సూట్ కేసును జానకి చేతికిచ్చి అతను మరో రెస్టురూములోనికి దూరాడు. శశికి జానకి అంటే గౌరవం లేదు. తన అవసరానికి వచ్చినందున ముక్తసరిగా ఉంది.


అన్నాచెల్లెలు స్నానాలు డ్రస్సింగు ముగించుకొని డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. జానకి వారికి టిఫిన్, కాఫీ ఇచ్చింది. సేవించారు.


శశి బెడ్ రూములోకి వెళ్ళి పడుకొంది. రఘు భార్యకు చెప్పి స్కూటర్ పై ఆఫీసుకు బయలుదేరాడు.

ఆ సాయంత్రం రఘు ఆఫీసునుంచి బయలుదేరి మూడు సినిమా టిక్కెట్లతో ఐదు గంటలకు ఇంటికి చేరాడు. ముందుగా ఫోన్ చేసి జానకికి విషయాన్ని చెప్పినందున వదిన మరదళ్ళు రెడీగా వున్నారు. ముగ్గురూ 'భరత్ అను నేను’ మహేష్ బాబు సినిమాకు వెళ్ళి చూచి ఆనందంగా హోటల్లో భోజనం చేసి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారు.


మరుదినం అన్నాచెల్లెలు ఎనిమిదిన్నరకు రెడీ అయినారు. శశికి ఇంటర్వ్యూ. జానకి వారికి టిఫిన్, కాఫీలు ఇచ్చింది. తిని వారు బయలుదేరి పోయారు.


జానకి వాళ్ళు వుండేది ఫస్ట్ ఫ్లోర్లో కింద సెల్లార్లో వాచ్మెన్ అతని భార్య ఉంటారు. అతని పేరు గోపి. ఆమె పేరు నిర్మల. గర్భవతి. బట్టలు ఐరెనింగ్ చేసి డబ్బులు సంపాదించుకొంటారు.

ఆ బిల్డింగులో పది ఇళ్ళు అందరూ వీరికే బట్టలు ఇస్తారు.

నిర్మల "అమ్మగారూ!" అని పిలిచింది.


విప్పిన గుడ్డలను కట్టగా చుట్టిపెట్టి వుంచిన వాటిని జానకి నిర్మలకిచ్చింది.

వాటిని తీసుకొని వెళ్ళి నిర్మల గుడ్డలను విదిలించి లెక్క చూచుకొంది. చివరిసారిగా విదిలించిన శశి బ్లౌజులోనుంచి బంగారు చైన్ జారిపడింది. ఆశ్చర్యంతో నిర్మల దాన్ని చేతిలోనికి తీసుకొంది.


నిర్మల భర్త గోపి ఆ దృశ్యాన్ని చూచాడు. వేగంగా నిర్మల చేతిలో వున్న ఆ బంగారు గొలుసును తన చేతిలోనికి తీసుకొని చూచాడు.


బంగారు చైను అటూ ఇటూ కళ్ళు పెద్దవి చేసి త్రిప్పి చూడసాగాడు. మనిషి ఉదయాన్నే కల్లు సేవించాడు. 


"ఏందయ్యా అలా చూస్తుండావు?" అడిగింది నిర్మల.


"ఒసేయ్! ఇది బంగారం కదా!"


"అవునయ్యా! మన జానకమ్మ గారి మరదలు శశి అమ్మగారిది."


"ఆమెదే అని నీకు ఎలా తెలుసు? అహా నీకెలా తెలుసు?" గద్దించినట్లు అడిగాడు. 


"ఆమె మెళ్ళో వుంటే చూచినానయ్యా!"


"సరేలే యీ ఇసయాన్ని ఇంతటితో మరిచిపో"


నిర్మల ఆశ్చర్యంగా గోపి ముఖంలోనికి చూచింది.

"ఏందే అట్టా చూస్తుండావ్?" కళ్ళు పెద్దవి చేసి అడిగాడు.


"చైన్ను చూచే నీ చూపు సరిగా లేదు. దాన్ని ఇలా ఇవ్వు. నేను ఎల్లి జానకమ్మ గారికి ఇయ్యాల!"

గోపి పకపకా నవ్వాడు.


"ఏందయ్యా! ఆ నవ్వు?" ఆశ్చర్యంతో అడిగింది నిర్మల.


"ఒసే నీలా! నీవు ఎంత అమాయకురాలివే. మన చేతిలోకి ఒచ్చిన బంగారు గొలుసుని, తిరిగి నీ యజమానురాలికి ఇస్తానంటావా!" ఆవేశంగా అడిగాడు గోపి.


"అదే కదయ్యా న్యాయం?"


"న్యాయమా! గోంగూరా! ఒసే! దీన్ని నేను నీకివ్వ. పక్కనున్న పట్నానికి ఎల్లి మార్వాడికి అమ్మేస్తా. దాదాపు ఆరు ఏడు వేలు డబ్బు వస్తాది!" కళ్ళు ఎగరేసి ధీరుడిలా నవ్వాడు గోపి.


"ఇదిగో! నేను గొలుసును అమ్మగారికియ్యాల ఇలా ఇవ్వు!" ఆవేశంగా అడిగింది నిర్మల.


గోపి ఆ గొలుసును తన మెడలో వేసుకొన్నాడు. నిర్మల ఆశ్చర్యపోయింది. వారి పెండ్లి జరిగి రెండు సంవత్సరాలు. ఇంకా పిల్లాపాపలు లేరు. ప్రస్తుతం తను గర్భవతి. రెండేళ్ళ సహజీవనంతో నిర్మల గోపిని బాగా అర్థం చేసుకొంది. పరమ మూర్ఖుడు. తనమాటే కరెక్ట్ అని వాదించే రకం. మంచి చెడ్డల విచక్షణ లేనివాడు. 


ఇకపై అతనితో వాదించి ప్రయోజనం లేదనే ఆలోచన కొచ్చిన నిర్మల....

"అయ్యా! గొలుసు నీ మెడలో చాలా బాగుందయ్యా!" నవ్వుతూ చెప్పింది.


"అట్టాగా!"


"అవును"


"అమ్మగారికి ఇయ్యాలను అనవుకదా!"


"ఆహా!.... అయ్యా!..."


"ఏంటే?"


"ఏదీ, దాన్ని ఒకసారి నా మెడలో ఎయ్యి అయ్యా!"


"ఓస్ అంతేనా!" నవ్వుతూ తన మెడలోని బంగారు గొలుసును తీసి నిర్మల మెడలో వేశాడు ఆనందంగా గోపి. మెడలోని గొలుసును తాకి చూచింది నిర్మల.


"బాగుందా అయ్యా!" ప్రీతిగా అడిగింది.


"బెమ్మాండంగా వుందే" నవ్వాడు గోపి.


సత్తు కంచంలో గంజి అన్నాన్ని వొంచి గోపి ముందుకు వుంచింది. గోపి కంచం ముందు కూర్చుని తినడం ప్రారంభించాడు.


"దొడ్లోకి ఎల్లి వస్తా" అని చెప్పి నిర్మల వేగంగా ఇంట్లోనుండి బయటికి నడిచి జానకమ్మ గారి ఇంటివైపుకు నడిచింది.


'జానకమ్మ బంగారు తల్లి ఎముకలేని చెయ్యి. తాను తినే టిఫిన్ కూడా నాకు పెడుతుంది. సాయంత్రం పూలు కొంటే నాకు రెండు మూరలు కొని ఇస్తుంది. 'నిర్మలా నీవంటే నాకెంతో ఇష్టం. కారణం నీవు చాలా అమాయకురాలివి, యదార్థవాదివి, కల్లాకపటం తెలియనిదానివి. ఈ రోజుల్లో నీలాంటివారు చాలా తక్కువ. నా యోగం బాగుండి నీవు నాకు దొరికావు' అంటూ ఎంతో ప్రేమాభిమానాలతో జానకి పలికే పలుకులను తలుచుకొంటూ నిర్మల వారి ఇంటి ద్వారాన్ని సమీపించింది.


జానకమ్మ మరదలు శశి శూర్పణక. ఇంటర్వ్యూకు వెళ్ళే తొందరలో చైన్ ను చూచుకోనట్లుంది. అక్కడ చూచుకొని ఉంటే అన్నకు చెప్పి భోరున ఏడుస్తూ ఇంటికి వస్తుంది. జానకమ్మ మీద అనుమానం పెంచుకుంటుంది. పెద్ద చిన్నా లెక్కలేకుండా నోటికి వచ్చినట్లు వాగుతుంది. జానకమ్మను ఏడిపిస్తుంది అనుకుంటూ గోడకున్న కాలింగ్ బెల్ నొక్కింది నిర్మల.


జానకి తెలుపు తెరిచి నిర్మల చేతిలోని చైన్ ను చూచి తెల్లబోయింది. నిర్మల విషయాన్ని చెప్పి బంగారు చైన్ ను జానకికి అందించింది చిరునవ్వుతో.


జానకి కళ్ళు చెమ్మగిల్లాయి. చైన్ ను టీపాయ్ పై వుంచి నిర్మలను దగ్గరకు తీసుకొని కౌగలించుకొంది.


"శశి వచ్చి నన్ను అనుమానించి ఏడ్చి అఘాయిత్యం చేసేది. నీవు నన్ను రక్షించావు నిర్మలా. నీలోని 'నిజాయితీ'కి నా ధన్యవాదాలమ్మా" అంది బొంగురుపోయిన కంఠంతో జానకి.


సమాప్తి

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


64 views0 comments
bottom of page