top of page

మనోతత్త్వాలు


'Manothatvalu' - New Telugu Story Written By Ch. C. S. Sarma

Published In manatelugukathalu.com On 08/12/2023

'మనోతత్త్వాలు' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


ఈ సృష్టిలో అన్నా చెల్లెలి అనుబంధం.... అపూర్వం.... అద్వితీయం... ఆడబిడ్డ వివాహానికి ముందు అతిగా గౌరవించేది నమ్మేది తన తల్లిని, తండ్రిని, అన్నను... పేదల ప్రేమాభిమానాలు ఎన్నటికీ చెరగనివి.... మాయనివి.... కలిమిలేములు రీతిగా వ్యక్తులు మనోతత్త్వాలు ఎంతో చిత్రం విచిత్రం.


వెంకన్నా, పార్వతి అన్నాచెల్లెళ్ళు.... వారి తండ్రి నాగయ్య... తల్లి నాంచారు... పేదవారు... కాయకష్టం చేసికొని నిజాయితీగా బ్రతికేవారు. నాగయ్య కరణం గంగాధరం గారి ఇంట్లో పాలేరు... పార్వతి మునుసబ్ మంగయ్య ఇంట్లో పనిమనిషి.


ఆ గ్రామం... హై రోడ్డుకు రెండు కిలోమీటర్ల దూరం.... అక్కడినుండి.... తాలూకా పట్నం పదికిలోమీటర్లు. వెంకన్న మునుసబ్ గారింట్లో పాలేరు. ఉదయం ఏడుగంటల నుండి సాయంత్రం ఏడుగంటల వరకూ ఇంటి చాకిరి, వారి పొలం పనులు చేసేవాడు.

మునుసబ్ మంగయ్యకు కరణం గంగాధరానికి బద్దవైరం....


మునుసబ్ మంగయ్యకు ఒక కొడుకు రఘు. కూతురు పల్లవి. కరణం గంగాధరానికి ఒక కూతురు రాగిణి, ఒక కొడుకు శేఖర్.


మునుసబ్ కరణాలకు ఏవిధంగా వైరిభావాలో అదే రీతిగా వారి కుమారులు దాదాపు ఒకే వయస్సు, ఒకే తరగతి చదువుతున్న రఘు, శేఖర్ల మధ్యన బేధభావాలు.

మా తండ్రి మునుసబ్ మంగయ్య గొప్ప అని రఘు.... మా తండ్రి కరణం గంగాధరం గొప్పని శేఖర్‍ల భావన.


ఆడపిల్లలు మునుసబ్ కూతురు పల్లవి, కరణం కూతురు రాగిణిలు ఒకే తరగతి. ఇరువురికి మంచి స్నేహం.


పిల్లల ముందు పెద్దలు మాట్లాడే మాటలను విని, మగపిల్లల తత్త్వం కూడా ఆ తండ్రుల తత్త్వాల్లాగానే ద్వేషం, పగలతో నిండివున్నాయి. చిన్న వయస్సున మదిలో ఏర్పడిన నీచభావాలు పిల్లల ఎదుగుదలతో పాటు, మనోభావంలా ఎదిగి ఇరవై సంవత్సరాల రఘు, శేఖర్లు జన్మ విరోధులుగా మారిపోయారు. కరణం గంగాధరం, తనకున్న పలుకుబడితో గ్రామాల్లో మునుసబ్ కరణాల హోదాలు రద్దు అవగానే, తన కొడుకు శేఖర్, బి.ఎ పాసైనందున వి.ఆర్.ఓ గా ఆ గ్రామానికి రెవిన్యూ అధికారిగా చేశాడు. మునుసబ్ మంగయ్య ఏం తక్కువ తిన్నవాడు కాదు. తన కొడుకు రఘును పంచాయితీ సర్పంచ్‍గా మెంబర్లను కొని చేశాడు.

* * *

ఈ చరాచర సృష్టికి మూల స్త్రీ పురుషులు. జంతువులకూ, పక్షులకూ ఆడామగ లింగబేధం వుంది. కాలవాహినిలో ఒక తరుణాన రెండు లింగాల మధ్యన ఆకర్షణ, అభిమానం, ప్రేమలు సహజాలు. అవి ప్రకృతి ధర్మాలు.


పంచాయితీ సర్పంచ్ మాజీ మునసబ్ మంగయ్య కొడుకు రఘు... మాజీ కరణం గంగాధరం కుమార్తె రాగిణి అంటే ప్రేమ అభిమానం.


తన అభిప్రాయాన్ని రఘు తల్లి నాగమ్మకు తెలియజేశాడు. నాగమ్మ ఏకాంతంలో భర్త మంగయ్యకు తెలియజేసింది.


మంగయ్య ఆలోచించాల్సిన విషయం అని భార్యకు వెంటనే తన సమ్మతిని తెలియజేయలేదు.

యదార్థం మాజీ మునుసబ్ మంగయ్య కంటే మాజీ కరణం గంగాధరం స్థితిపరుడు. పది ఎకరాలు, మూడు కార్లు, పండే పంటభూమి, దాదాపు పది ఎకరాల మెట్టమాగాణి వున్నవాడు. కీర్తిశేషులు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు కల్పించిన ఆస్థిలో బాలికకూ సమాన హక్కు భాగం అనే చట్టరీత్యా కరణం (మాజీ) గంగాధరం కూతురు పల్లవిని తన కోడలుగా చేసికొంటే గంగాధరం ఆస్థిలో సగభాగం తనకు కాబోయే కోడలు పల్లవికి సంక్రమిస్తుందని మునుసబ్ (మాజీ) మంగయ్య.. ఆలోచించి, తన సమ్మతిని భార్య నాగమ్మకు తెలియజేశాడు మంగయ్య. నాగమ్మ పరమానందంతో మాజీ కరణం గంగాధరం గారి ఇంటికి వచ్చిన వారి అర్థాంగి శాంతమ్మతో తమ భార్యాభర్తల నిర్ణయాన్ని గురించి ప్రస్తావించింది నాగమ్మ.


మావారితో మాట్లాడి, మా నిర్ణయాన్ని మీకు తెలియజేస్తామని జవాబు చెప్పింది శాంతమ్మ.

ఇంటికి వెళ్ళి నాగమ్మ చెప్పిన సమాచారాన్ని పతిదేవుల వారికి తెలియజేసింది శాంతమ్మ.

తల్లి చెప్పిన విషయాన్ని విని కూతురు రాగిణి ఒక ఆటంబాంబును పేల్చింది.


"అమ్మా!.... నేను నా కాలేజీ మేట్ శశాంక్ కలెక్టర్ గారి అబ్బాయిని ప్రేమించాను. అతనూ నన్నూ ప్రేమించాడు. మీరు నాన్నా కలసి కలెక్టర్ గారిని సంప్రదించి మా వివాహాన్ని జరిపించండి" తన అభిప్రాయాన్ని ఎలాంటి జంకుగొంకులు లేకుండా చెప్పింది. కూతురు నిర్ణయాన్ని శాంతమ్మ తన భర్త గంగాధరానికి తెలియజేసింది. ఆ భార్యాభర్తలు, ఆమె సోదరుడు రఘు ఆశ్చర్యపోయారు. రాగిణిని నిలదీసి అడిగారు. తన నిర్ణయం మారదని రాగిణి స్పష్టంగా ఎలాంటి బెదురూ లేకుండా తన నిర్ణయాన్ని వారికి చెప్పి తన గదికి వెళ్ళి తలుపు మూసుకొంది.


ఆవేదనతో శాంతమ్మ "దానికి అంతటి తెగువ, తెగింపు ఏర్పడేదానికి కారణం చదువు. బి.ఎస్.సీ వరకూ వెలగబెట్టిందిగా!...." విచారంగా చెప్పింది.


తండ్రి గంగాధరం, తన బావమరిది రఘు ఏం చేయాలనే ఆలోచనలో మునిగిపోయారు.

* * *

వివాహం అనేది కొందరి యువతీ యువకులలో, అలాగే వారి తల్లిదండ్రులలో నేడు గొప్ప సమస్యగా మారింది.


పిల్లలు యుక్త వయస్కులు కాగానే.... స్కూలు, కాలేజీ రోజుల్లో వారికి నచ్చిన వారితో పరిచయం పెంచుకోవటం, పార్కులు, షికార్లు, సినిమాలు తిరిగిచూట్టం. ఫైనల్‍గా ప్రేమించుకోడం (కుల మతాలకు తల్లిదండ్రులకు సంబంధం లేకుండా) ఎవరినో వారిని చూచినవారు మీ అమ్మాయి ఎవరితోనో తిరుగుతూ వుందని చెప్పడం, అలాగే అబ్బాయి తల్లితండ్రులకు తెలియజేయడం జరుగుతున్న విషయాలు.


కన్నవారు వారు విన్న విషయాన్ని గురించి యువతీ యువకులు అడిగితే ’అవును, నేను అతను ప్రేమించుకొన్నాము. మీరుగా మా వివాహాన్ని జరుపుతారా, లేక కాదంటారా!... మీరు కాదంటే మేము రిజిస్టార్ ఆఫీసులోనో, గుడిలోనో మా ఇష్టానుసారంగా విహాహం చేసుకొంటాము. మీ సమాధానం ఏమిటి?...’ ఆ రకమైన బెదిరింపు మాటలు... తల్లితండ్రులపై నిరసన. ఇది ఒక వర్గం.


రెండవ వర్గం.... తమ వివాహాన్ని (మతాంతర, కులాంతర) తల్లిదండ్రులు అంగీకరించరని, వారే ఒక తీర్మానానికి వచ్చి, స్నేహితుల సహాయంతో వారి ఇష్టానుసారంగా గుడిలోనో, రిజిస్టార్ ఆఫీస్‍లోనో వివాహం (వ్యామోహపూరితం) చేసికొంటారు.


మూడవవర్గం : తల్లిదండ్రులంటే గౌరవం, భయం. తమ ప్రేమ కలాపాన్ని వారికి చెప్పలేక, ఒకరు మనం ఎక్కడికైనా వెళ్ళి వివాహం చేసికొందామనే నిర్ణయంతో, మరొకరు తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసికోవాలనే ఉద్దేశ్యంతో... అంతవరకూ వారు సాగించిన ప్రేమ సంచారాలను మరిచి, అభిప్రాయ భేదాలతో మనోబలహీనత చేత..... కోరుకొన్నవారిని పొందలేక ఆత్మహత్యను చేసికొని తమ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకొంటారు. ఆ ఆత్మాహుతి చేసికొన్నవారు ఆడవారైనా కావచ్చు, మగవారైనా కావచ్చు. ఆ ప్రేమ నీటిమీద బుడగలా వారి మరణంతో సమసిపోతుంది. వారి కథ దుఃఖాంతంగా ముగిసిపోతుంది. ఇలాంటివారు వల్లేవేసిన ప్రేమపదం నిజమైన ప్రేమ కాదు అది కేవలం వేడి శగపూరిత అనిశ్చల భావం. పర్యవసానం ఆవేశపూరిత ఆత్మార్పణం కని పెంచిన వారికి తీరని ఆవేదనకు ఆ రీతిగా కలిగిస్తారు.

కనిపెంచి పెద్దచేసి తమనోట పెట్టుకోవలసిన దారి పిల్లల నోట వుంచి పెంచి సాకి సంతరించిన పెద్దచేసిన తల్లితండ్రులను వారు మరచిపోయి అలాంటి ఆత్మహత్మల పాలౌతారు కొందరు. వారు చదువు, సంస్కారం విజ్ఞానం సంకరపూరితంగా వారి చావుకు విచక్షణ రహితంగా కారణం అవుతున్నాయి.


మాజీ మునుసబ్ మంగయ్య కొడుకు రఘు పై మూడవ వర్గానికి చెందిన వాడై ఫ్యాన్‍కు ఉరి వేసుకొని చచ్చిపోయాడు. మంగయ్య, నాగమ్మలను దుఃఖసాగరంలో ముంచిపోయాడు.

* * *

"నమస్కారం సార్!....." ఎంతో వినయంగా గంగాధరం కలెక్టర్ కన్నారావు గారికి నమస్కరించాడు.

"మీరెవరండి?..." కన్నారావు గారి ప్రశ్న.


గంగాధర్‍ను వారు కూర్చోమని కూడా చెప్పలేదు. గర్వం. అహంకారం.

గంగాధరం వెంటనే జవాబు చెప్పలేదు.


"మిమ్మల్నే!.... మీరెవరు?... విషయం ఏమిటి?..." భృకటి చిట్లించి అడిగాడు కలెక్టర్ కన్నారావు.

గంగాధరం మెల్లగా......


"మా అమ్మాయి రాగిణి, మీ అబ్బాయి శశాంక్ ప్రేమించుకొన్నారట.... వారి వివాహ విషయాన్ని గురించి..."


"మాట్లాడాలని వచ్చారా!..." గంగాధరం పూర్తిచేయక ముందే అన్నారు కలెక్టర్ కన్నారావు.

"అవును సార్!..." దీనంగా చెప్పాడు గంగాధరం.


"మీ వివరాలు ఏమిటి?"


తన భార్యా పిల్లలను గురించి, ఆస్థిపాస్తుల గురించి గంగాధరం వివరించాడు.

గంగాధరం మాటలకు కన్నారావు గారు బిగ్గరగా నవ్వాడు. అందులో వున్నది హేళన.... గర్వం....

గంగాధరం సిగ్గుతో తల దించుకొన్నాడు.

"శశాంక్!..." బిగ్గరగా పిలిచాడు కన్నారావు.


కొన్నిక్షణాల్లో శశాంక్.... వారి తల్లి సంధ్యాగారు వచ్చారు. వారి ముందున్న సోఫాలో కూర్చున్నారు.

"వీరెవరండి?....." అడిగింది సంధ్య.


"మీరు ఇంతకు ముందు చెప్పారే.... మీ వివరాలు, మరోసారి చెప్పండి" వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు కన్నారావు.


గంగాధరానికి చెమట పట్టింది.


పై పంచతో ముఖం తుడిచుకొని, మెల్లగా తాను వచ్చిన విషయాన్ని చెప్పాడు.

"ఏమిటండి అతని మాటలు!...." ఆశ్చర్యంతో అడిగింది సంధ్య.


"అర్థం కాలేదా!.... వారి అమ్మాయి రాగిణిని, మన శశాంక్ ప్రేమించాడట. వారిరువురికీ వివాహాన్ని జరిపించాలట!..." వికటంగా నవ్వాడు కన్నారావు.


"నాన్నా!.... వారు చెప్పింది నిజమేనా!..." కొడుకు ముఖంలోకి చూస్తూ అడిగింది సంధ్య.

"అబద్ధం!...." అన్నాడు శశాంక్.


గంగాధరం తలపై పిడుగు పడినట్లయింది. కళ్ళల్లో నీళ్ళు, పిచ్చివానిలా ఆ ముగ్గురి ముఖాల్లోకి చూచాడు.


"ఖాసిం!...." పిలిచాడు కలెక్టర్ కన్నారావు.


ఆరు అడుగుల స్థూలకాయుడు వచ్చాడు.

"జీ సాబ్!...."


"వీరిని తీసుకొని వెళ్ళి వీధిలో వదలు!...." శాసించాడు కన్నారావు.


"సార్!.... నేను చెప్పింది నిజం సార్!...." దీనంగా పలికాడు గంగాధరం.


ఖాసిం అతని చేతిని పట్టుకొని లాక్కొనిపోయి వీధిలో వదలి వీధి గేటు మూశాడు.

గంగాధరం భోరున ఏడుస్తూ ముందుకు సాగాడు.


శశాంక్ చెప్పింది అబద్ధం. రాగిణితో తిరిగాడు. వాడుకొన్నాడు. మోజు తీరింది. గంగాధరం చెప్పింది అబద్ధం అన్నాడు కలెక్టర్ కొడుకు శశాంక్.


* * *

శశాంక్.... తనను తిరస్కరించిన సమాచారాన్ని విన్న రాగిణి చాలా బాధపడి భోరున ఏడ్చింది. తల్లి శాంతమ్మ, కూతురు రాగిణిని ఓదార్చింది.


తన కూతురు వలన తనకు అవమానం జరిగిందని గంగాధరం కూతుర్ని ద్వేషించసాగాడు. మాట్లాడేవాడు కాదు. ఆమె ముఖంలోకి చూచేవాడు కాదు.


తండ్రి నిరసన రాగిణికి ఎంతో బాధను కలిగించింది. పరిపరివిధాల ఆలోచించింది. తన్ను కోరిన రఘు తన మూలంగా మరణించాడు. తాను ప్రేమించిన శశాంక్ తన్ను ప్రేమించలేదని అబద్ధం చెప్పాడు. రెండునెలలు భారంగా గడిచిపోయాయి.


చదువు, సంస్కారం వున్నా.... క్షణికావేశంలో తాను చేసి విచక్షణారహిత చర్యకు తను బలైపోయింది. మదిలో అవమానం!.... నెలతప్పింది రాగిణి... మనస్సున భయం, బాధ. పరిపరివిధాల ఆలోచించి కడకు చావాలని నిర్ణయించుకొంది.


ఆ రోజు అమావాస్య. అర్థరాత్రి సమయం. మంచంపై నుండి లేచి వారి ఇంటికి కొంతదూరంలో వున్న బావిలో దూకి చావాలని నిర్ణయించుకొని బయలుదేరింది.

ఆ బావి ప్రక్కన నాగయ్య, నాంచారమ్మల గుడిసె.

రాగిణి బావివి సమీపించింది.


గుడిసె నుండి బయటికి వచ్చిన వెంకన్న రాగిణి ఆవేశపు నడకను ఆమె వెళ్ళే దిశను గమనించారు. ఆమె వెనకాలే నడిచాడు. రాగిణి బావిని సమీపించింది. దూకబోయింది.

వెనకాలవున్న వెంకన్న పరుగున వెళ్ళి రాగిణిని వెనుకనుంచి భుజలు పట్టుకుని తనవైపు లాక్కొన్నాడు.


ఈనిన పులిలా రాగిణి వెనుతిరిగి వెంకన్నను చూచింది. భోరున ఏడ్చింది.

"ఎందుకు నన్ను ఆపావు. నేను చావాలి!...." కన్నీటితో అంది రాగిణి.


"అమ్మగారూ!... మీరు బావిలో పడి చావడం ఏంటమ్మగోరు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక చిక్కు సమస్య వుంటది. దానికి చావు పరిష్కారం కాదమ్మగోరు. మీరు బాగా చదువుకొన్నోళ్ళు. నేను మీకు చెప్పేటంతోణ్ణి కాను. నాతోరండి. మీ కష్టాన్ని నాకు సెప్పండి. నేను మీకు సాయం చేస్తాను." అనునయంగా చెప్పాడు వెంకన్న.


ఆవేశంలో వున్న రాగిణి....

"నేను గర్భవతిని. నన్ను ఒకడు మోసం చేశాడు. అందుకే నేను చావాలి!" ఆవేశంగా చెప్పింది రాగిణి.


వెంకన్న జాలిగా రాగిణి ముఖంలోకి చూచాడు.

"నన్ను వదులు..." బిగ్గరగా అరిచింది రాగిణి.


"నేను ఒకమాట చెప్పనా!...." అడిగాడు వెంకన్న.


"ఏమిటది?...." ఆవేశంగా అడిగింది రాగిణి.


"మీరు నాతో రండి. మా ఇంటికాడకెళ్ళి మాట్లాడుకొందాం" చిరునవ్వుతో చెప్పాడు వెంకన్న.


అతని ముఖంలోకి పరీక్షగా చూచింది రాగిణి.

"నేను నిన్ను ఒకమాట అడగనా!...."


"అడగండి అమ్మాయిగారూ!...."


"నీవు!...."


"నేను!..."


"నన్ను!...."


"నన్ను!.... చెప్పండి?"


"ఏం చేయాలనుకొంటున్నావు?...."


"బావిలో దూకేదానికి ఒప్పుకోను. అదికాక మీరు ఏం చేయమన్నా నేను చేస్తాను."


"నన్ను పెండ్లి చేసుకొంటావా!...."


"ఆ...." ఆశ్చర్యపోయాడు వెంకన్న.


"ఏం అంతగా ఆశ్చర్యపోయావ్!...."


"అమ్మగోరూ!.... మీరెక్కడ నేను ఎక్కడ. నేను కూలీనాలీ చేసికొని బతికేవోణ్ణి. మీరు.... మీరు.... మారాజులు... కుదరదు. సరికాదు..." అమాయకంగా చిరునవ్వుతో చెప్పాడు వెంకన్న.


"నా చెయ్యి వదలు. నేను బావిలో దూకి చచ్చిపోతాను" ఆవేశంగా చెప్పి, చేతిని విదిలించుకొంది.

రాగిణి చేయి వెంకన్న చేతిలోనుండి జారిపోయింది.

రాగిణీ వేగంగా బావివైపుకు నడిచింది.


వెంకన్న రాగిణీని తనవైపు లాక్కొని... గట్టిగా కౌగలించుకొన్నాడు. రాగిణీ గువ్వలా అతని హృదయంపై ఒదిగిపోయింది. కొన్ని నిముషాలు వారి మధ్యన మౌనం....


తరువాత.... వెంకన్న రాగిణీ చేతిని తన చేతిలోకి తీసికొన్నాడు. ఇరువురూ మౌనంగా నడిచారు. వెంకన్న రాగిణీని ఆమె ఇంట్లో ముందు వదలి తన గుడిసెకు చేరాడు. పడుకొన్నాడు. రాగిణీ ఇంట్లోకి వెళ్ళి తన గదిలో మంచంపై వాలిపోయింది. వెంకన్నకు నిద్రపట్టలేదు. ’చావబోయిన రాగిణిని నేను రక్షించాను. తను నన్ను ఒక కోరిక కోరింది. అంటే ఆమెకు నామీద గౌరవం... నమ్మకం.... వుందన్నమాట. ఇసయం వుదయం... అమ్మానాన్నలతో చెప్పాలి. వాళ్ళు ఏమంటారో వినాలి’ ఆ నిర్ణయానికి వచ్చి కళ్ళుమూశాడు వెంకన్న.


తన చెల్లెలు పార్వతి గుర్తుకువచ్చింది. ఆమెతో రాగిణి మామ కిరీటి పశువుల డాక్టర్ పరాచికాలు ఆడడం తాను రెండు మూడు సార్లు చూచాడు. ’నా చెల్లి పార్వతికి కిరీటికి వివాహం జరిగితే చాలా బాగుంటుంది. ఈడు జోడి చూడముచ్చటగా వుంటారు. అమ్మా నాన్నలతో ఈ విషయాన్ని గురించి కూడా మాట్లాడాలి’ అనే నిర్ణయానికి వచ్చాడు వెంకన్న.


మంచంపై వాలిన రాగిణి కనులముందు నవ్వుతూ వెంకన్నా... ’వెంకన్నా... మంచి అందగాడు. కాయకష్టం చేసిన మంచి దిట్టమైన శరీరం.... నా మాటకు మా గొప్పతనాన్ని చూచి అవుననలేకపోయాడు. చావబోయిన నన్ను ఆపి తన హృదయానికి హత్తుకొన్నాడంటే.... నేనంటే అతనికి ఇష్టం అయ్యుండాలి. రేపు వారింటికి వెళ్ళాలి. అతనితో మరోసారి మాట్లాడాలి. అతన్ని ఒప్పించాలి. పెండ్లి చేసికోవాలి. చచ్చి సాధించేదేముంది?.... ఏదైనా బ్రతికి ప్రయత్నపూర్వకంగా సాధించాలి. ఆనందంగా బ్రతకాలి. అమ్మతో తన నిర్ణయాన్ని రేపు చెప్పాలి. నేనంటే అమ్మకు ప్రాణం. అమ్మ నాన్నను అన్నను ఒప్పించి వెంకన్నతో నా వివాహాన్ని జరిపించగలదు’ ఆ తలపులతో ఆ నిర్ణయంతో రాగిణి.... ఏవేవో ఊహలతో కళ్ళుమూసింది.


* * *

మరుదినం వుదయం రాగిణి గత రాత్రి జరిగిన విషయాన్ని, వెంకన్న తన్ను ఆపిన విషయాన్ని తన తల్లి శాంతమ్మకు చెప్పింది. ఆ మాటలను విన్న శాంతమ్మ కన్నీరు కార్చింది. "నాకు వెంకన్నకు పెండ్లి జరిపించండమ్మా" అని చివరగా చెప్పింది రాగిణి.


వారి సంభాషణనంతా విన్న కిరీటి అక్కను సమీపించాడు. తాను వెంకన్న చెల్లెలు పార్వతిని ప్రేమిస్తున్నట్లు చెప్పి "అక్కా! నాకు పార్వతికి వివాహం జరిపించే బాధ్యత నీదేనమ్మా!" అక్క చేతులు పట్టుకొన్నాడు.


తమ్ముడు కూతురి నిర్ణయాలను గురించి శాంతమ్మ తన భర్త గంగాధరం గారితో చర్చించింది.

గంగాధరంగారు తొలుత ఆవేశపడ్డా... తన కూతురి భవిష్యత్తు బాగుండాలనే సదుద్దేశంతో భార్య మాటలకు ఆమోదముద్ర వేశారు.


వెంకన్న తండ్రి నాగయ్యను ఇంటికి పిలిపించాడు. తన నిర్ణయాన్ని నాగయ్యకు తెలియజేశాడు. అంటే తన కూతురికి వెంకన్నకు పెండ్లి..... నాగయ్య కూతురు పార్వతి తన బావమరిది కిరీటికి వివాహం. వెంకన్న రాగిణీని గురించి, కిరీటిని గురించి చెప్పి వున్నందున నాగయ్య గంగాధరం గారి అభిప్రాయంతో ఆనందంగా ఏకీభవించాడు.


తన కూతురు పార్వతి, పశువుల డాక్టర్ కిరీటికి ఇల్లాలు కానున్నందుకు... తన కొడుకు గంగాధరం గారి కూతురు రాగిణిని వివాహం చేసికొని తన ఇంటికి కోడలుగా తీసుకురాబోతున్నందుకు ఎంతగానో సంతోషించాడు.


గంగాధరం, శాంతమ్మలు పురోహితులను పిలిపించి.... రాగిణి, వెంకన్న వివాహానికి... కిరీటి, పార్వతీల పెండ్లికి మంచి ముహుర్తాలను నిర్ణయించారు.


గ్రామప్రజలంతా గంగాధరం గారు ఆదర్శవంతులని గొప్పగా చెప్పుకొన్నారు.

యదార్థంగా... ఎవరి స్వార్థం వారిది... ఎవరి మనోతత్వం వారిది.

గంగాధరం శాంతమ్మలు కళంకరహితంగా తమ కూతురు వెంకన్న భార్య అవుతున్నందుకు సంతోషించారు.


మంచిమాట, అందంచందం వున్న పార్వతి తాను కోరిన విధంగా తన ఇల్లాలు కాబోతున్నందుకు కిరీటికి ఎంతో ఆనందం.


చావబోయిన రాగిణీని కాపాడగలననే సత్‍భావన... ఆమె తనను భర్తగా స్వీకరిస్తున్నందుకు వెంకన్న సంబరం.... ప్రేమించినవాడు మోసంచేసి తిరస్కరించినా... మంచీ మానవత్వం ప్రేమాభిమానాలు కల కష్టజీవి.... స్వఛ్ఛమైన మనసున్న మంచి మనిషి వెంకన్న తనకు భర్త కాబోతున్నందుకు రాగిణికి పరమానందం.


కూతురి జీవితం... నాశనమైపోయిందని (స్వయంకృతాపరాధంతో) ఆమెను అసహ్యించుకొన్న గంగాధరం.... తన కూతురి కథను తెలిసీ నిరభ్యంతరంగా రాగిణిని భార్యగా స్వీకరిస్తానన్న వెంకన్న మంచి మనస్సుకు మానత్వానికి గంగాధరం దంపతులు ముగ్ధులైనారు. పెద్దలు నిర్ణయించిన ముహూర్తాలకు రాగిణీ, వెంకన్న.... పార్వతి, కిరీటిల వివాహాలను గంగాధరం, శాంతమ్మలు ఘనంగా జరిపించారు.


మాజీ మునసబ్ మంగయ్య వారి అర్థాంగి నాగమ్మ ఉత్తరదేశానికి మనశ్శాంతి కోసం... తీర్థయాత్రలకు బయలుదేరారు. వారి కుమార్తె పల్లవి పోలీస్ ట్రైనింగ్‍లో చేరింది.


* * *

సమాప్తి

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


36 views0 comments

Comments


bottom of page