top of page

సరైన నిర్ణయం



'Saraina Nirnayam' - New Telugu Story Written By Yasoda Pulugurtha

 Published In manatelugukathalu.com On 18/04/2024 

'సరైన నిర్ణయం' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)



అప్పుడే ఆఫీస్ నుండి ఇంట్లోకి అడుగు పెట్టిన శ్రీనివాసరావుకి ఇంట్లోని వాతావరణం ఏదో మార్పుని గోచరిస్తోంది. అతని అక్క సుమతి హాల్ లో సోఫాలో కూర్చుని మూడు సంవత్సరాల మనవరాలు నిత్యను ఒడిలో పెట్టుకుని ఏదో ఆలోచిస్తోంది.


"అక్కా ఎప్పుడొచ్చా”వంటూ ఆప్యాయంగా పలకరించిన తమ్ముడిని చూస్తూ "ఉదయం పదకొండు గంటలకు వచ్చానురా శ్రీనూ. ఎందుకో నిత్యను, వల్లి ని చూడాలనిపించింది. తెల్లవారుఝామున బస్ కి బయలదేరి వచ్చాను. మళ్లీ రేపు రాత్రి బస్ కు వెళ్లిపోతానురా". 


"అదేమిటి అక్కా మరో నాలుగు రోజులు ఉండి వెళ్ల వచ్చు కదా? ఏమంత కొంపలు ములిగిపోతున్నాయని వెంటనే బయలదేరాలి"?


"ఈ మాత్రమేనా రాగలిగానురా శ్రీనూ, ఎక్కడకూ కదలాలని పించడం లేదు. పోనీ వల్లినీ నిత్యనూ నా దగ్గరే పెట్టుకుందామనుకుంటే మా ఇంటి పరిస్తితులు తెలుసు కదా". 


"శేఖర్ లో ఏ మార్పూ రాలేదా అక్కా"?


“ఏమీ మార్పు లేదురా శ్రీనూ, వాడికి త్రాగుడు మరీ ఎక్కువైంది. ఇంట్లోనుండే వర్క్ కాబట్టి ఆ సమయానికి ఏదో పనిచేసుకుంటున్నాడు”. 


"పెళ్లి చేస్తే మారుతాడేమో అక్కా"!


"పెళ్లా! ఆ మాట ఎత్తావంటే ఇంట్లోనుండి పోతానంటున్నాడు.

ఏమి ప్రేమలో గానీ, తాను ప్రేమించిన సుధీరను మరచిపోలేనంటాడు. ఆ అమ్మాయేమో వీడిను కాదని అమెరికా సంబంధం వస్తే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. 

మరో అమ్మాయిని ఎవరినీ తన జీవితంలోకి రానివ్వడుట. ఆడపిల్లల మీద నమ్మకం లేదట” సుమతి చీర చెంగుతో కళ్ల నీళ్లను తుడుచుకుంటోంది.


“పెద్దవాడు మోహన్ అర్ధాంతరంగా చనిపోయాడు. వీడు చూస్తే ఇలాగ? నా ప్రాణం వల్లీ, నిత్యల పట్ల కొట్టుకుపోతోంది. 

నీ కూతురు వల్లి నా చేతుల్లోనే పెరిగింది చిన్నప్పటి నుండి. మేనకోడలని ముచ్చటపడి మోహన్ కి ఇచ్చి పెళ్లిచేసాను. దురదృష్టం కాకపోతే హాయిగా కాపురం చేసుకుంటున్న ఇద్దరినీ విధి విడదీయడమేమిటి? బైక్ ఏక్సిడెంట్ లో వాడు చనిపోవడమేమిటి?” ఆవిడ కు దుఖంతో గొంతుకు గద్గదమవుతోంది.


"ఊరుకో అక్కా. మనం ఏడ్చినంత మాత్రాన మోహన్ తిరిగి వస్తాడా? విధి దాని నుదుటి మీద అలా వ్రాసి పెట్టాడు. దాన్ని అలా చూస్తుంటే మాకూ దుఖం ఆగడం లేదు. ఏమి చేయగలం” అంటూ ఆయన లోపలికి వెళ్లిపోయాడు.


సుమతి, శ్రీనివాస్ అక్కా తమ్ముళ్లు. ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు ఎక్కువే. సుమతి కి ఇద్దరూ మగపిల్లలు అవడంతో తమ్ముడి కూతురు శ్రీవల్లి అంటే చాలా ప్రేమ. తెల్లగా రబ్బరు బొమ్మలా మెరిసిపోయే శ్రీవల్లి ని చిన్నతనం నుండీ తన దగ్గరే పెట్టుకుని చూసుకుంది. సుమతి భర్త హైద్రాబాద్ లో ఒక ప్రైవేట్ కంపనీలో పనిచేసేవాడు. 


శ్రీనివాసరావు నిజామాబాద్ మున్సిపల్ కార్పరోషన్ లో సెక్షన్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. మేనకోడలి మీద మమకారంతో తన పెద్ద కొడుకు మోహన్ కు చేసుకోవాలనుకుంది. సుమతి దగ్గర శ్రీవల్లి హాయిగా ఆనందంగా ఉంటుందని శ్రీనివాస్ దంపతులు కూడా వల్లిని మోహన్ కిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డారు. మోహన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి "మోదీ బిల్డర్స్" లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. రెండో వాడు శేఖర్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విప్రో లో పని చేస్తున్నాడు.


శ్రీవల్లి, మోహన్, సుమతీ, అందరూ హైద్రాబాద్ లో ఒకే ఇంట్లో ఉండేవారు. మోహన్ కు పెళ్లైన రెండు సంవత్సరాలకు సుమతి భర్త హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. వల్లి అప్పుడు మూడో నెల గర్భవతి. భర్త మరణం సుమతిని కృంగతీసింది. మోహన్, వల్లీ సుమతి కి ఎంతో ధైర్యం చెప్పి ఒక మనిషిగా చేసారు. 


వల్లికి నెలలు నిండాయి. పురుడు హైద్రాబాద్ లోనే అని సుమతి అంటే సరేనని పురుటి కి నెలరోజుల ముందే వల్లి తల్లి పద్మావతి హైద్రాబాద్ వల్లి అత్తగారింటికి వచ్చేసింది. పండంటి పాపాయిని ప్రసవించింది వల్లి. సుమతి భర్త పేరు నిత్యానంద్ మూలాన పాపకి నిత్య అని పేరు పెట్టుకున్నారు. సుమతికి మనవరాలే లోకం. పాపాయి పెంపకంలో భర్త పోయిన దుఖాన్ని మరచిపోసాగింది.


శ్రీవల్లికి ఒక అన్నయ్య. పేరు శాంతి స్వరూప్. నిజామా బాద్ లోనే స్టేట్ బ్యాంక్ లో ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. శ్రీవల్లి కి వివాహమైన సంవత్సరం తరువాత అతనికి కూడా వివాహమైంది. అతని భార్య స్నేహ కూడా అక్కడే ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో హెచ్ ఆర్ డి విభాగంలో పనిచేస్తోంది. ఎమ్.బి.ఏ చదివింది. నిత్య పుట్టిన సంవత్సరానికి వారికి కూడా ఒక పాప పుట్టింది. పాప పేరు అవని. కొడుకూ, కోడలు ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లిపోతే పద్మావతి మనవరాలిని, ఇంటిని చూసుకుంటూ ఉంటుంది.


కాలం ఒక్కలా సాగిపోతే అసలు సమస్యలే ఉండవు. మోహన్ తమ్ముడు శేఖర్ కు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటే ఒకరోజు చెప్పాడు తాను తన కొలీగ్ సుధీరను ప్రేమించానని ఆమె కులం వేరని. సరే శేఖర్ ఇష్టాన్ని కాదనడం ఎందుకని ఒప్పుకున్నారు. పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవాలను కుంటున్నారు. ఒకరోజు మోహన్ ఆఫీస్ నుండి రాత్రి లేట్ గా వస్తుంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర బైక్ స్కిడ్ అవడం అతని తలకు బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. రెండు వారాలు మృత్యువుతో పోరాడి ఇంక పోరాడలేక ప్రాణం వదిలాడు. 


భర్త మరణం, పెద్ద కొడుకు మరణం సుమతిని అతలాకుతలం చేసాయి. శ్రీవల్లి దుఖాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. పిచ్చిదానిలా శూన్యంలోకి చూస్తూ గడిపేది. అక్కడ ఉంటే మోహన్ జ్నాపకాలతో పిచ్చిది అవుతుందేమోనన్న భయంతో శ్రీనివాసరావు పద్మావతి వల్లిని తమతో నిజామాబాద్ కి తీసుకు వచ్చేసారు.


కాలం తనకు వేటితోనూ పనిలేదనుకుంటూ తిరిగిపోతోంది. ఈ లోగా శేఖర్ ప్రేమించిన సుధీర శేఖర్ ను పెళ్లి చేసుకోనని అమెరికా మీద మోజుతో అమెరికా సంబంధం చేసుకుని వెళ్లిపోయింది. మోహన్ ను ఎంతగానో అభిమానంచే శేఖర్ అన్నయ్య దూరం అయ్యాడనే బాధ ఒకవైపు, తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సుధీర తనను మోసం చేసిందన్న ఆవేదన మరోవైపు అతనిని త్రాగుడుకి అలవాటు చేసింది. ఏదో దుఖాన్ని మరచిపోదామని అప్పుడప్పుడు డ్రింక్ చేసే శేఖర్ కు ఆ డ్రింకే అతనిని సేద తీరుస్తూ త్రాగుడికి బానిసను చేసింది. 


శేఖర్ తన కళ్ల ఎదుటే అలా పతనమవడం సుమతి భరించలేక పోతోంది. వల్లిని, మనవరాలు నిత్యనూ చూడాలని తమ్ముడింటికి వచ్చింది.


ఆ రోజు సాయంత్రం స్నేహ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి అవని జ్వరంతో మంచం మీద పడుకుని ఉంది. ఇంట్లో ఏమిటో హడావిడిగా అనిపించింది స్నేహకు. అవని దగ్గర ఎవరూ లేరు. ఆడపడచు అత్తగారు కనిపించారు. ఒళ్లో నిత్యను కూర్చోపెట్టుకుని ఏవో కబుర్లు చెపుతున్నారు. అవని జ్వరంతో మూలుగుతుంటుంటే ఎవరూ అవనిని పట్టించుకోవడంలేదన్న అసహనంతో వంటింట్లో కాఫీ కలుపుతున్న అత్తగారి దగ్గరకు వచ్చింది. 


స్నేహను చూస్తూనే అత్తగారు "వచ్చావా స్నేహా, మా ఆడపడుచు సుమతి వచ్చింది నీవూ స్వరూప్ ఆఫీసులకు వెళ్లగానే. మీ మామయ్యగారు కూడా వచ్చేసారు ఆఫీస్ నుండి. నీకూ కాఫీ ఇస్తానుండు" అనగానే తారాజువ్వలా లేచింది స్నేహ.


"అవని కి జ్వరం వచ్చి మూలుగుతుంటుంటే ఇంట్లో అందరూ ఏమి చేస్తున్నారుట? కాఫీ ముఖ్యమా ఇప్పుడు"? పిల్ల జ్వరంతో ఒళ్లు తెలియకుండా పడుంటే ఎవరూ దగ్గర లేరు"? ఆవేశంతో ఏమి మాట్లాడుతోందో తెలియకుండా ఉంది. 


ఈ లోగా వల్లి వచ్చిందక్కడకు.

"వదినా ఇంతవరకు నేను అక్కడే ఉన్నాను. పేరాసిట్ మాల్ సిరప్ అవని చేత తాగించాను. దాని పక్కనే ఇంతవరకు కూర్చుని ఇప్పుడే బాత్ రూమ్ కి వెళ్లాలని వచ్చాను".


వల్లి మాటలను విననైనా వినకుండా "నేను గమనిస్తున్నాను నిత్యకు ఇస్తున్న ప్రాముఖ్యత 'అవని' కి ఇవ్వడం లేదు, దానినసలు సరిగా పట్టించుకోవడం లేదు. అత్తయ్యగారూ, మీ అమ్మాయి భర్త పోయాడని మీరు సానుభూతి చూపించవచ్చ. కానీ అనుక్షణం మీ అమ్మాయినే ఊరడిస్తూ ఆమె పక్కనే కూర్చుంటూ ఇలా ఎంత కాలం అండీ? ఆవిడే లోకమా? ఇంట్లో ఇంక మనుషులే లేరా? వాళ్ల సంగతి చూడర"? 


ఆవేశంలో గట్టిగా మాట్లాడుతున్న మాటలు ఇంట్లో అందరికీ వినబడుతూనే ఉన్నాయి.


ఈ లోగా శాంతిస్వరూప్ కూడా ఆఫీస్ నుండి వచ్చేసాడు.

"ఏమైంది స్నేహా? ఏమిటి నీ మాటలు బయటకు వినిపిస్తున్నాయి"


ముందు మీరు ఇలారండంటూ అతని చేయి పట్టుకుని అవని పడుకున్న గదిలోకి తీసుకొచ్చింది.

"ఏమైంది బేబీకి” ఆత్రుతగా మంచమీద కూర్చుని అవని నుదుటి మీద చేయి వేసాడు. వెచ్చగా తగిలింది.


"జ్వరం వచ్చింది దానికి. దానిని పట్టించుకునే నాధుడే లేడు. ఆ విషయమే మీ అమ్మగారిని ప్రశ్నిస్తుంటే నేనేదో గట్టిగా మాట్లాడుతున్నానని మీరనడం బాగాలేదు” మొహం ఎర్రగా చేసుకుంటూ సీరియస్ గా అంది.


"అమ్మా మా వల్లి బాగానే చూసుకుంటున్నారు కదా స్నేహా? దానికి కాస్త ఒళ్లు వెచ్చబడితే ఇంత రాధ్దాంతం దేనికి"?


"ఏమిటీ రాధ్దాంతమా, నేను చేస్తున్నానా? తల్లీతండ్రీ ఉన్నా అనాధలా పెరుగుతోంది అది. తండ్రి లేకపోయినా మహారాణిలా పెరుగుతోంది మీ చెల్లెలి కూతురు”.

"స్టాపిట్ స్నేహా”, తర్జనతో బెదిరించాడు. “ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటే మంచిది".


"మా వల్లిని ఒక్కమాటన్నా ఊరుకోను. బావగారు చనిపోతే అది ఎక్కడకు వెడుతుంది? అసలుకే పుట్టెడు దుఖంలో ఉంది. దాని ఎదురుగా ఇలా మాట్లాడడం సంస్కారం కాదు". కోపంగా అక్కడనుండి వెళ్లిపోయాడు.


ఆ రాత్రి ఎంత బ్రతిమాలినా వల్లి భోజనం చేయనని అంటే పద్మావతి బలనంతంగా వల్లికి కంచంలో భోజనం వడ్డించింది. తలొంచుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న కూతురితో "భోజనం చేయవే తల్లీ, మీ వదిన గురించి తెలిసిందే కదా"?


"వదిన అనడం సహజమే కదమ్మా? నేను ఎన్నాళ్లిలా పుట్టింట్లో కూర్చోగలను చెప్పు”, కంట తడిపెడుతూ ఏడుస్తున్న కూతురిని ఓదార్చడానికి ఆ తల్లి ఆసక్తురాలైంది.

గదిలో కూర్చుని ఇవన్నీ గమనిస్తున్న సుమతి మనసు దుఖంతో బరువెక్కింది.


ఈ సమస్యకు పరిష్కారమేమిటో అర్ధం కాకుండా ఉంది. కానీ తానేమీ చేయలేదు. ఒక వారం రోజుల తరువాత

సూట్ కేస్ లో తన బట్టలు, నిత్య వస్తువులు సర్దుకుంటూ హడావుడి పడుతోంది వల్లి.


"ఏమిటి వల్లీ నీ నిర్ణయంలో మార్పులేదా"?

"అమ్మా, నా నిర్ణయం మంచిదే అని నేను అనుకుంటున్నాను. డిగ్రీ చదివి బి.ఇ.డి చేసాను. హైద్రాబాద్ లో నా ఫ్రెండ్ సునీత ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ జాబ్ చూసిపెట్టింది. వెంటనే రమ్మనమంది. వెడతానమ్మా”.


"ఎలా ఉంటావే వల్లీ ఒంటరిగా పిల్లతో"?


"అమ్మా ఎల్లకాలం మీరు నాకు తోడు ఉండరు. నేను నా గురించి కంటే కూడా నిత్య గురించి దాని భవిష్యత్ గురించి ఆలోచించాలి కదమ్మా. మోహన్ తాలూకా వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు కాస్త బేంక్ లో ఉన్నాయి. నీతా నాకు సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ కూడా చూసిందట. తప్పదమ్మా, ఇలా ఇక్కడే కూర్చుంటే ఎప్పటికీ ఏమిచేయలేని ఆసక్తురాలిని అవుతాను. నన్ను ప్రోత్సహించి ధైర్యాన్ని చెప్పి సాగనంపు. అంతేగానీ నిరుత్సాహ పరచ”కంటూ తల్లికి గట్టిగా చెప్పింది.


ఈ లోగా స్టేషన్ వెళ్లడానికి బుక్ చేసిన కేబ్ వచ్చింది.

నిత్య ను ఎత్తుకుని సూట్ కేస్ తీసుకుని బయలదేరుతున్న శ్రీవల్లి వైపు అలా చూస్తూ ఉండిపోయిందావిడ.

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.









71 views0 comments
bottom of page