top of page

సెంటిమెంట్

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link


'Sentiment' New Telugu Story By Kalanos


రచన: కాలనోస్




“ఇదే రా ఇల్లు” అని అభి అన్నాడు నాతో.

“ఎప్పటినుంచి తాళం వేసి ఉంది?” అని అడిగాను.


“ఆరు గంటల నుంచి చూస్తున్నాను. తాళం వేసే ఉంది. పక్కింటి వాళ్లని అడిగాను. మధ్యాహ్నం నుండి ఇంట్లో లేరంట. ఎటెళ్లారో వారికి కూడా తెలియదట” అని వివరించాడు.


“ఇప్పుడేం చేద్దాం?”

“చేసేదేముంది? ఇంట్లో దూరి, రెండు నిమిషాల్లో పని కానివ్వాలి” అన్నాడు అభి.


నేను వెంటనే ఫోన్ తీసి యూట్యూబ్ కి వెళ్లాను. అక్కడ తాళాలు ఎలా తెరవాలో వెతకడం మొదలుపెట్టాను.


యూట్యూబ్ లో ఇలాంటివి కూడా ఉంటాయా అని అనుకుంటున్నారా - అక్కడ దొరకనివి లేవు.


క్లాసులో పాఠాలు చెప్పే టీచర్ కంటే ఎగ్జామ్ కి పది నిమిషాల్లో కాన్సెప్ట్ చెప్పే ఫ్రెండ్ గొప్పవాడు. అలాంటి ఫ్రెండ్ కంటే గొప్పది యూట్యూబ్.


నా ప్రయత్నం వృథా పోలేదు. ఒక యూట్యూబ్ వీడియో చూడగానే కాస్త క్లారిటీ వచ్చింది.

“నీ దగ్గర హెయిర్ పిన్ వుందిరా?” అని అభిగాడిని అడిగాను.


“నా దగ్గర ఎందుకుంటుందిరా?” అన్నాడు వాడు చిరాగ్గా.


“ఔను కదూ” అనుకుని ఏంచెయ్యాలా అని ఆలోచిస్తుండగా మళ్లీ వాడే, “ఒక సారి ఆగు. పక్కింటి ఆంటీని అడుగుతాను. చాలా మంచావిడ. వీళ్లింట్లో లేరని చెప్పింది ఆవిడే కదా” అన్నాడు.


వాడు పక్కింటి వాళ్ల తలుపు కొట్టాడు. ఆంటీ తలుపు తీసారు.

“ఆంటీ, మీ దగ్గర హెయిర్ పిన్ వుందా?” అని అభి అడిగాడు.


“హెయిర్ పిన్ ఎందుకు?” అని ఆవిడ ఆశ్చర్యంగా అడిగారు.


“ఇంటికి తాళం వేసి వుంది కదా.... మాకు కూడా లేట్ అవుతోంది…..” అని చెప్తుండగా నేను వాణ్ణి ఆపి, “ఔను ఆంటీ… హెయిర్ పిన్ మాకెందుకు? మావాడు అప్పుడప్పుడు క్రేజీగా బిహేవ్ చేస్తుంటాడు. ఒకసారి కాలేజిలో పాఠం చెబుతున్న లేడీ టీచర్ని, మీకు దోశలెయ్యడం వచ్చా అనడిగాడు. ఏమనుకోకండి. వీడి తరఫున నేను సారీ చెబుతున్నాను, సారీ” అని చెప్పి వాణ్ణి అక్కణ్ణించి లాక్కొచ్చాను.


ఆవిడ మమ్మల్ని విచిత్రంగా చూసి తలుపు వేసుకున్నారు.


అక్కడేం మాట్లాడలేదు కానీ, కాస్త ఇవతలికొచ్చేక, “ఎందుకు ఆపావురా... నేను మాట్లాడుతున్నాగా!” అని వాడు కోపంగా అరిచాడు.


“తాళం తియ్యడానికి హెయిర్ పిన్ అడిగితే, మనని దొంగలు అనుకుంటార్రా! నేను ముందునుండే చెప్తున్నా….. మనని దొంగలని ఎవరనుకుంటార్రా అన్నావ్…ఇప్పుడు చూడు!” అని నేను తిట్టడం మొదలుపెట్టాను.


ఈ లోగా పక్కింటి తలుపు తెరుచుకుంది. ఆంటీ ఏం చెప్పిందో ఏమో, అంకుల్ బయటకి వచ్చారు. కోపంగా మా వంక చూస్తూ “ఎవర్రా మీరు? ఇక్కడేం పని?” అంటూ దురుసుగా మీదకు వచ్చారు.


“అది కాదంకుల్…” అని అభి చెప్పడానికి ప్రయత్నించాడు.


“ఎవడ్రా నీకు అంకుల్!” అని కసిరి, “సెక్యూరిటీ, ఎక్కడ చచ్చావురా!” అని అరవడం మొదలుపెట్టాడాయన.


నాకు భయం మొదలయింది.

“చూస్తావేంటిరా! ఉరుకు బే…” అని అభి అరిచాడు.


అంతలోనే మనుషులు మమ్మల్ని చుట్టుముట్టడం మొదలుపెట్టారు.

ఎపార్ట్ మెంట్ కాంప్లెక్సులో మూడో ఫ్లోర్లో ఉన్నాం. వాచ్‍మెన్‍కి దొరకకుండా ఎలా తప్పించుకోవాలనేది నాకర్థం కాలేదు.


అభి నన్ను లాక్కుంటూ లిఫ్ట్ లోకి తీసుకువెళ్లాడు. “ఇప్పుడు మెట్లన్నీ బ్లాక్డ్. లిఫ్ట్ ఒక్కటే మనకున్న దారి. అందులోంచి బయట పడదామంటే, గ్రౌండ్ ఫ్లోర్ లో అందరూ అక్కడ కాసి ఉంటారు. వాళ్లకి దొరక్కూడదంటే మనం ఫస్ట్ ఫ్లోర్ లోనే బయటకు వచ్చెయ్యాలి. అక్కడ నుండి గోడ దూకుదాం” అన్నాడు.


“వీడు తప్పించుకోవడంలో పీ హెచ్ డీ ఎప్పుడు పొందాడు? నాకు చెప్పలేదే!” అని ఆశ్చర్యం వేసినా తప్పించుకోవాలన్న కోరిక వల్ల వాణ్ణి ఏం అడగలేదు. వాడి ప్లాన్ ప్రకారం బయటపడి నా బండెక్కి తప్పించుకున్నాం.


అభి రూంకి చేరుకోగానే నాకు పట్టరాని ఆనందమొచ్చింది. “రేపటి ఎగ్జామ్ తప్పకుండా పాస్…” అన్నాను.


అభికి కూడా మీకు లాగే నా లాజిక్ అర్థం కాలేదు. అర్థం కావాలంటే ఫ్లాష్‍బాక్ చెప్పాలి. బాగా పరిగెట్టాను కదా, అది ఒక్క క్షణం ఊపిరి తీసుకొని మొదలుపెడతాను.


నా పేరు కళ్యాణ్. నేను దొంగను కాదు. హైదరాబాదులో ఓ కాలేజిలో బీ టెక్ థర్డియర్ ఏదో చదివేస్తున్నాను. ఏదో అని ఎందుకు అన్నానంటే, ఇప్పటికి నాకు దగ్గర దగ్గరగా పది దాకా బాక్‍లాగ్సున్నాయి. కథకీ వివరాలతో సంబంధం లేదనుకోకండి, ఉంది!

పది బాక్‍లాగ్సుతో పాటు నాకు ఒక సెంటిమెంట్ కూడా ఉంది. నేనేదైనా పని తలపెడితే, దానికి ముందు నన్ను బాగా టెన్షన్ పెట్టే సంఘటన ఎదురవ్వాలి. అప్పుడు ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది.


ఉదాహరణకి - ఓసారి నేను ఆడాల్సిన క్రికెట్ బెట్ట్ మ్యాచికి జస్ట్ ముందు నా షూస్ కనిపించలేదు. చాలా వెతికాక దొరికాయి. ఆ మ్యాచ్ లో నేను నాలుగు వికెట్లు తీసి మా టీంని గెలిపించాను. మరోసారి ఓ పరీక్షకి ముందు పెన్ కనబడలేదు. వెతగ్గా వెతగ్గా చివరికది నా బ్యాగ్ లోనే దొరికింది. ఆ పరీక్షలో నాకు నేనే ఆశ్చర్యపడేటన్ని ఎక్కువ మార్కులొచ్చాయి.


వినడానికి విచిత్రంగా ఉండచ్చు కానీ నా విషయంలో ఇలా చాలాసార్లు జరిగింది. నేనే కాదు, మాయింట్లో అంతా కూడా నా విషయంలో ఇది నమ్ముతారు.


రెగ్యులర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సప్లిమెంటరీకి రెడీ ఔతున్నాను. ఈ సారి ఎలాగైనా పాసవ్వాలని పట్టుదలగా ఉన్నాను. అందుకు టెన్షన్ పెట్టే విశేషం ఏదో ఒకటి జరుగదా అని ఎదురు చూసాను. చూస్తూండగా పరీక్షలకిక ఒక్క రోజే ఉంది కానీ, అలాంటిదేం జరక్కపోయేసరికి, ఇక నేనే ఏదో చేయాలని నిర్ణయించుకున్నాను.

నా బ్యాగులో దొరికిన నా హాల్ టికెట్ తీసి, మా అమ్మ బట్టలు పెట్టుకునే బీరువా షెల్ఫులో దాచాను.


ఇప్పుడు నా హాల్ టికెట్ దొరకట్లేదని టెన్షనుగా అమ్మకి చెప్తాను. అంతా టెన్షన్ పడతారు. అప్పుడు అమ్మకి షెల్ఫ్ లో దొరుకుతుంది. అంతా సుఖాంతం!


ఐతే, ప్రతిసారీ ఏం జరిగినా నా చెయ్యి లేకుండానే జరిగేది. ఈ సారి అలా కాదు కదా అని నా మనస్సాక్షికి నచ్చలేదు. ఇంత చేసే బదులూ కష్టపడి చదవొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మన చేతుల్లో ఏం లేదన్నప్పుడే మనం సెంటిమెంట్లను పెట్టుకుంటాము. మరి పాసవ్వడం నా చేతుల్లో లేనట్టే నాకనిపిస్తుంది. హార్డ్ వర్క్ మీద నమ్మకం లేక నేను ఈ సెంటిమెంట్ నమ్ముతాను. నామీద నమ్మకం లేక మా అమ్మానాన్నలూ ఈ సెంటిమెంట్ నమ్ముతారు.


అలా నా ప్లాన్ ప్రకారం అమ్మ దగ్గరకి వెళ్లి హాల్ టికెట్ కనిపించట్లేదని చెప్పాను. అనుకున్నట్లే కాసేపు తిట్టింది. ఆ తరవాత నాతో కలిసి వెదకడం మొదలుపెట్టింది.

థ్రిల్ ఉండాలంటే వెంటనే దొరకకూడదు. షెల్ఫులో ఉంటుందని ఎవరూ ఉహించరు కూడా.


“నీ బ్యాగ్ తీసుకురా” అని అమ్మ ఆజ్ఞ వేసింది. తీసుకొచ్చాను. అందులో అమ్మ వెతుకుతూంటే, నాతో పాటు ఎనిమిదవ తరగతి చదువుతున్న మా చెల్లి కూడా మాకు వెదకడంలో సహాయపడింది.


బ్యాగ్ మొత్తం వెతికాక, మళ్లీ బ్యాగ్ వెదకడం మొదలుపెట్టింది అమ్మ. అమ్మ ముఖంలో టెన్షన్ తెలుస్తోంది. “ఏంకాదులే. ఇక్కడే ఎక్కడో ఉంటుంది” అని ధైర్యం చెప్పాను, అక్కడికది తన సమస్య అన్నట్లు.


“నువ్వు టెన్షన్ పడితే నేను చెప్పాల్సిన మాటలవి. బొత్తిగా సీరియస్‍నెస్ లేదు నీకు” అని తిట్టింది అమ్మ.


మరొకసారి బ్యాగ్ మొత్తం వెతికి, “లేదేంట్రా! ఇక్కడే పెట్టాను కదా” అని అమ్మ అంది.

“హాల్ టికెట్ నువ్వు నా బ్యాగులో పెట్టడమేంటి?” అన్నాను ఆశ్చర్యంగా.


“మొన్న ఇంట్లో ఏదో మూల నీ హాల్ టికెట్ కనిపించింది. నీ నిర్లక్ష్యాన్ని తిట్టుకుని వేరెక్కడైనా దాచాలనుకున్నాను. నీకు టెన్షన్ సెంటిమెంటొకటి ఉందిగా! అందుకని నిన్ను టెన్షన్ పెడదామని, నువ్వు చూడని చోట దాచాలనుకున్నాను. నీ బ్యాగ్ ముఖం ఎప్పుడో గానీ చూడవు కదా అని బ్యాగులో దాచాను. తీరాచూస్తే ఇప్పుడది ఇక్కడ లేదు” అని చెప్పింది.


అమ్మ మాటలు విని నేను కూడా నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను, “నువ్వు నా బ్యాగులో పెట్టిన హాల్ టికెట్, నా సెంటిమెంట్ కోసం నీ బట్టల బీరువా షెల్ఫులో దాచాను. అక్కడే ఉంటుందిప్పుడు” అన్నాను.


“వెధవా!” అని అమ్మ నవ్వేసింది. ఇక్కడతో అంతా సుఖాంతం… అనుకున్నాను. కానీ ఆ షెల్ఫులో హాల్ టికెట్ కనబడకపోయేసరికి, అమ్మ తో పాటు నాకూ టెన్షన్ మొదలయింది. ఇల్లంతా వెతకడం మొదలుపెట్టాము.


“అక్కడే పెట్టాను అమ్మా! ఇప్పుడు లేదేంటి?” అన్నాను కంగారుగా.

“చదువులోనే కాదు, అన్నింటా నీకు మరుపే! వెతుకు ఇల్లంతా. ఇంకెక్కడో పెట్టి ఉంటావు!” అంది అమ్మ.


అలా మేం వెతుకుతుండగా నాన్న ఇంటికి వచ్చారు, “ఏంటి వెతుకుతున్నారు?” అన్నారు.


“వీడి హాల్ టికెట్ కనిపించట్లేదు” అని జవాబిచ్చింది అమ్మ.


“పొద్దున్న ఎందుకో, నీ బట్టల బీరువా షెల్ఫ్ తీస్తే అక్కడ కనిపించింది హాల్ టికెట్. అదుండాల్సిన చోటు ఇదా అని చిరాకేసినా, వీడికి టెన్షన్ సెంటిమెంటొకటుందిగా. అందుకని పిల్లల గదిలో ఓ పుస్తకంలో దాచాను” అన్నారు నాన్న.


అది వినగానే ఆనందంగా మా గదికి వెళ్లాను. అక్కడ పుస్తకం ఏమీ లేదు. నాన్న దగ్గరికి వెళ్లి ఏ పుస్తకంలో పెట్టారని అడిగాను. ఏదో నోట్ బుక్ లో పెట్టానని చెప్పారు.


మా గదిలో బయట ఉన్న నోట్‍బుక్ మా చెల్లెలిది. అది తన బయాలజీ నోట్‍బుక్ అట. తన స్నేహితురాలు వారం రోజులుగా స్కూలుకి రాలేదట. నోట్స్ రాసుకుందామని మధ్యాహ్నం ఇంటికొచ్చి ఆ నోట్‍బుక్ తీసుకెళ్లిందిట.


చెల్లి దగ్గర వాళ్ల నాన్న ఫోను నంబరుంది. కానీ ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ ఎత్తలేదు. వాళ్ల అమ్మ నెంబరు చెల్లికి తెలియదట. చివరికా అమ్మాయి ఎడ్రస్ తెలుసుకొని మా అభిగాణ్ణి అక్కడికెళ్లి నిఘా ఉండమన్నాను. తర్వాత నేను కూడా వచ్చాను. ఇంటికి తాళం పెట్టి ఉండడంతో హెయిర్ పిన్ వాడదామని ఎలా భంగపడ్డామో మీకు తెలుసు.


ఇదండీ నా కథ!


ఏదో సమయానికి వాళ్లు ఇంటికి రాక తప్పదు. హాల్ టికెట్ దొరికేస్తుంది, పాసైపోతాను. అంతా సుఖాంతం.


తొమ్మిదింటికి చెల్లినుంచి ఫోనొచ్చింది. తన ఫ్రెండింట్లో వాళ్లు సకుటుంబంగా సినిమాకెళ్లారుట. అందుకనే వాళ్ల నాన్న ఫోన్ చూసుకోలేదు. ఇంటికొచ్చి చూసుకుని చెల్లికి ఫోన్ చేశారుట.


వాళ్ల అపార్ట్ మెంటుకి మళ్లీ వెళ్లాలంటే భయం వేసింది. వాళ్ల నాన్న నెంబర్ తీసుకొని చెల్లాయి నోట్‍బుక్ లో ఉన్న హాల్ టికెట్ తీసుకుని వీధి చివరికి రమ్మని రిక్వస్ట్ చేసుకున్నాను. పాపం ఒప్పుకున్నారు.


మాఫియా వాళ్లకి మాల్ అందే తరహాలో హాల్ టికెట్ నా చేతికొచ్చింది. నేను పట్టరాని ఆనందంతో, “ఈ దెబ్బతో నా బాక్‍లాగ్సు అన్నీ క్లియర్ అయిపోతాయిరా” అని అభికి హుషారుగా నా టెన్షన్ సెంటిమెంటు గురించి చెప్పాను.


వాడు కూడా ఆనందంగా నా హాల్ టికెట్ తీసుకుని చూసాడు. అంతే, వాడి ముఖం వెలవెలబోయింది, “ఇది నీ రెగ్యులర్ ఎగ్జామ్ హాల్ టికెట్ రా! సప్లిమెంటరీకి పనికి రాదు” అన్నాడు.


నాకు షాక్. ఇంతసేపూ నేను దాగుడుమూతలాడింది దేనికీ పనికిరాని రెగ్యులర్ హాల్ టికెట్ తోనా? మరి నా సప్లిమెంటరీ హాల్ టికెట్ ఎక్కడున్నట్టు? నా సెంటిమెంట్ ఇలా అడ్డం తిరిగిందేమిటి?


“వంద రూపాయిలు ఫైన్ కడితే ఎగ్జామ్ సెంటర్లో డూప్లికేట్ ఇస్తారు. అన్నీ సక్రమంగా జరుగుతాయి. భయపడకు. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో. నేను దగ్గరుండి రాత్రంతా నీచేత చదివిస్తాను” అన్నాడు అభి.


అభికి ఒక్క బాక్‍లాగ్ కూడా లేదు. మా ఇంట్లో వాళ్లంతా వాణ్ణి చూసి నేర్చుకోమంటారు. ‘పోనీ ఇలాగైనా పాసవుతానేమో’ అని సరిపెట్టుకున్నాను కానీ, నాకైతే నమ్మకం లేదు. అయినా కూడా ఇంటికి ఫోన్ చేసి హాల్ టికెట్ దొరికిందనీ, ఆ రాత్రికి అభి దగ్గరే ఉండి చదువుకుంటాననీ చెప్పాను.


“మన దగ్గర టైమ్ లేదు. అంతా చదవలేము. కాబట్టి పాత ఎగ్జామ్ పేపర్లను చూద్దాం. రాత్రంతా అవే సాల్వ్ చేద్దాం” అని అభి చెప్పాడు.



అదృష్టం నావైపు లేకపోయినా అభిలాంటి మంచి మిత్రుడు నాకుండడం మాత్రం అదృష్టం కాదా అనుకున్నాను. వాడు పాపం, నా కోసం తను కూడా రాత్రంతా కూర్చున్నాడు. నేను కనక ఈ ఎగ్జామ్ పాసయితే అభిగాడికి జీవితాంతం ఋణ పడి ఉంటాను. ఈ టెన్షన్ సెంటిమెంటుని నమ్మడం కూడా మానేస్తాను.


పొద్దున్న ఏడింటికి సంతోష్ ఫోన్ చేసాడు. వాడు నాకు తగ్గ మిత్రుడు. నేను వ్రాయాల్సిన ప్రతి బాక్‍లాగుకీ తోడుండేవాడు. నాకు పది బాక్‍లాగ్సయితే వాడికి పదహారు. ప్రతి సప్లిమెంటరీ ఎగ్జాంకీ ఇద్దరం కలిసే వెడతాము.


“ఏమైనా చదివావురా?” అని అడిగాడు సంతోష్.

“రాత్రే కొద్దిగా చదివానురా. నువ్వు?” అడిగాను.


“మళ్లీ రాయాల్సి ఉంటుందేమోరా” అన్నాడు. వీణ్ణి నమ్మొచ్చా అనుకుంటుండగా, “సరే గానీ తొందరగా బయలుదేరదాం. గుర్తుందిగా - మనం సెంటర్ దగ్గరే హాల్ టికెట్ తీసుకుందాం అనుకున్నాం?” అన్నాడు.


అరే, ఈ విషయాన్ని నేనెలా మరచిపోయాను? ఎప్పుడూ హాల్ టికెట్ మా కాలేజిలో తీసుకోవాలి. అక్కడ తీసుకోకపోతే ఎగ్జామ్ సెంటరులో తీసుకోవచ్చు. తీసుకున్న హాల్ టికెట్ పోగొట్టుకుంటే వంద ఫైన్ కట్టి అక్కడే డూప్లికేట్ తీసుకోవాలి. నేనూ సంతోష్ కూడా, “కాలేజికి ఎవడు వెళ్తాడులే, సెంటరు దగ్గర హాల్ టికెట్ తీసుకోవచ్చులే, అని ఆగాము. నేనీ విషయం మరచిపోయి అనవసరంగా ఎన్నో తంటాలు పడ్డాను కదా.

ఆ తర్వాత మేము ఎగ్జామ్ సెంటర్లో హాల్ టికెట్ తీసుకున్నాము. ఎగ్జామ్ బాగా రాసి పాస్ కూడా అయ్యాము.


నేను ప్యాసయింది - రాత్రంతా అభిగాడి పర్యవేక్షణలో చదవడం వల్లనా – లేక పరీక్షలముందు చివరి క్షణం దాకా హాల్ టికెట్ గురించి టెన్షన్ పడినందుకా?

ఏది ఏమైనా – మన దేశంలో చాలామందికి లాగే నేనింకా నా సెంటిమెంటుకే కట్టుబడి ఉన్న మాట నిజం!

---0---

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

రచయిత పరిచయం: కాలనోస్

పరిచయ వాక్యాలు- నేను Children's Hospital of Philadelphia లొ Data Analyst గా పని చేస్తున్నాను. నేను తెలుగు మరియూ ఇంగ్లీష్ లో కథలు వ్రాయడం ఇష్టపడతాను. నేను వ్రాసిన మొదటి తెలుగు కథ 'డ్రైవింగ్ స్కూల్' సెప్టెంబర్ 2019 లో ఆంధ్రజ్యోతి లొ ప్రచురింపబడింది. సెంటిమెంట్ నా రెండవ కథ.


335 views3 comments
bottom of page