top of page
Original.png

విజయానికి దారేది

#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #VijayanikiDaredi, #విజయానికిదారేది, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Vijayaniki Daredi - New Telugu Story Written By - Palla Venkata Ramarao

Published In manatelugukathalu.com On 27/11/2025

విజయానికి దారేది - తెలుగు కథ

రచన: పల్లా వెంకట రామారావు



 

ఆ రోజు కలెక్టర్ ఆఫీసు సందడిగా వుంది. కొత్త కలెక్టర్ జాయినవ్వడానికి వస్తున్నాడు. ఏదో పనిమీద కలెక్టరేట్ కు వచ్చిన రాఘవులు దీన్నంతా ఆసక్తిగా గమనిస్తూ కూర్చున్నాడు. అతడు మండలపరిషత్ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆ ఉద్యోగం కూడా అతని తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద వచ్చింది.

 

కాసేపటికి కలెక్టరు వచ్చాడు. అంతా పోటీలుపడి శుభాకాంక్షలు చెబుతున్నారు. పూల దండలు వేస్తున్నారు. జనం మధ్యనుంచి ఎలాగో సందు చేసుకుని కలెక్టర్ ఎదురుగా వెళ్ళి శుభాకాంక్షలు చెప్పాడు రాఘవ. తరువాత కలెక్టరు తన గదిలోకి వెళ్ళిపోయాడు. 


రాఘవ అక్కడ ఏర్పాటుచేసిన అల్పాహారం తీసుకుని, టీ తాగుతూ అక్కడే కాసేపు కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత బంట్రోతు వచ్చి "ఇక్కడ రాఘవ అంటే ఎవరు సార్?" అంటూ అడిగాడు. 


"నేనే" అంటూ బదులిచ్చాడు రాఘవ. 


"కలెక్టరు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు" అని చెప్పాడు అటెండర్. 

“నన్నా!” ఆశ్చర్యపోయాడు రాఘవ. 'ఇప్పుడేగా అయన రావడం అప్పుడే నాగురించి ఎలా తెలుసు?' అని మనసులో అనుకున్నాడు. 


గదిలోకి వెళ్ళి కలెక్టరుకు నమస్కరించాడు రాఘవ. 


“ఏం రాఘవా! బాగున్నావా?” పలకరించాడు కలెక్టరు. 


“ఆ బాగున్నా సార్!” అయోమయంగా బదులిచ్చాడు రాఘవ.


“ఇంకా నన్ను గుర్తు పట్టినట్టు లేవు" అన్నాడాయన నవ్వుతూ. 


“ఆ సార్ అది.. ” నసిగాడు రాఘవ. 


“హైస్కూల్లో పండుగాడు గుర్తున్నాడా?”


పండు అనగానే రాఘవ మొహంపై చిరునవ్వు వెలిసింది. తన క్లాసులో భరత్అని ఒక స్నేహితుడుండేవాడు. లావుగా వున్నాడని పండు అని పిలిచేవారు. అసలు పేరు ఎవరికీ గుర్తులేదు. పదోతరగతిలో ఎవరూ ఊహించని విధంగా స్కూలు ఫస్టు వచ్చాడు. ఆ తర్వాత వారి కుటుంబం వేరే ఊరికి వెళ్ళిపోవడం వల్ల ఎవరికీ గుర్తులేడు. 


“అంటే మీరు.. పండు.. " అని రాఘవ నసుగుతుండగా “నేనే ఆ పండును" అన్నాడాయన నవ్వుతూ. 

రాఘవకి అతన్ని గుర్తుపట్టలేకపోయినందుకు కాస్త సిగ్గేసింది. అప్పట్లో తాము ఎంతో స్నేహంగా ఉండేవారు. దాదాపు ఇరవైయ్యేళ్ళయింది. 


కాసేపు కుశలప్రశ్నలు వేసుకుని, తర్వాత పాత సంగతులన్నీ గుర్తుచేసుకున్నారు. 


“ఇప్పుడేం చేస్తున్నావ్ రాఘవా?” అడిగాడు కలెక్టర్. 


“మా నాన్న విధినిర్వహణలో చనిపోవడంతో ప్రభుత్వం నాకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చింది" బదులిచ్చాడు రాఘవ. 


కలెక్టర్ ముఖంలో ఏదోభావం కదలాడింది. 


“ఇంతకీ నువ్వెంతవరకు చదివావు?" అడిగాడు కలెక్టర్. 


“డిగ్రీ వరకు”


“ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. నేను ఇన్నిరోజులూ నువ్వెంతో ఉన్నతస్థానంలో వుంటావని తలచేవాడిని. మన తరగతిలో ఎప్పుడూ నువ్వు మొదటిస్థానంలో వుండేవాడివి. నువ్వెప్పుడూ పోటీపరీక్షలు రాయలేదా? ఇంతకంటే ఉన్నతస్థాయికి వెళ్ళాలని ప్రయత్నించలేదా?" అడిగాడు కలెక్టర్. 


“డిగ్రీ అయిపోయిన తర్వాత కొంతకాలం ఖాళీగా వున్నాను. అంతలో మానాన్న చనిపోవడంతో ఉద్యోగం వచ్చింది. ఆతర్వాత పెళ్ళి, పిల్లలు.. అలా కాలం గడిచిపోయింది. 


అయినా నాలో నువ్వు ఏం చూసి అలాంటి అభిప్రాయంలో ఉన్నావో నాకర్థం కావడంలేదు" అన్నాడు రాఘవ నవ్వుతూ. 


“అదేంటి రాఘవా అలా అంటున్నావ్? అసలు నేనీ స్థానానికి రావడానికి ప్రేరణ నీమాటలే తెలుసా?" అన్నాడు కలెక్టర్. 


రాఘవ అర్థం కానట్టు చూశాడు. 


"అవును రాఘవా! పదోతరగతిలో ఉన్నప్పుడు ఒకరోజు నువ్వన్నమాటలే నాకు ఎంతోప్రేరణను, ఉత్సాహాన్నిచ్చాయి. నేనీరోజువరకూ ఆసూత్రం ఆధారంగానే పనిచేస్తున్నా తెలుసా?” చెప్పుకుపోతున్నాడు కలెక్టర్.

 

రాఘవకు మాత్రం అయోమయంగా వుంది. 


“ఆ రోజుల్లో నువ్వెప్పుడూ తరగతిలో మొదటిస్థానంలో ఉండేవాడివి. ఒకసారి పరీక్షలు సమీపిస్తుండగా సందేహాల నివృత్తికోసం నీవద్దకొచ్చాను. నేను ప్రతిసారీ పరీక్షల్లో గట్టెక్కుతానా లేదా అని భయపడేవాడిని. అదేమాట నిన్నడిగాను. 


అప్పుడు నువ్వన్నావు.. 'నేను పాసవుతానా లేదా అని కాదు మళ్ళీ తరగతిలో మొదటిస్థానం వస్తుందా రాదా అనే ఆలోచిస్తున్నా' అని. ఆమాటలు నేను జీవితంలో మర్చిపోలేదు. అప్పటిదాకా నేను చేస్తున్న తప్పేంటో నాకు అర్థమయింది. శిఖరం చేరాలని ప్రయత్నిస్తే సగం కొండ అయినా ఎక్కగలుగుతాం, కొండ ఎక్కగలమా లేదా అని ఆలోచిస్తూ కూర్చుంటే కొండ పాదం దగ్గరే ఆగిపోతాం.


అంటే మన లక్ష్యమెప్పుడూ ఉన్నతంగా ఉండాలన్నమాట. ఈ సూత్రాన్ని పాటించి పదవతరగతి సంవత్సరపరీక్షల్లో మండలంలో మొదటిస్థానం సంపాదించాను. అలాగే కొనసాగించి పోటీపరీక్షల్లో నెగ్గి కలెక్టర్నయ్యాను. నువ్వన్న మాటలు గుర్తుంచుకుని నేను ఈ స్థానంలో వుంటే నువ్వింకా ఎంతో ఉన్నతస్థానంలో ఉంటావేమోనని ఇన్నాళ్ళూ ఊహిస్తూ వచ్చాను” అన్నాడు కలెక్టర్. 


రాఘవకు ఇదంతా ఏదో కలలా ఉంది. తానామాటలు ఎప్పుడన్నాడో గుర్తులేదు. ఒకవేళ అన్నా తానేదో అప్రయత్నంగా అన్న మాటలు ఒకరి జీవితాన్ని ఉన్నతస్థానంలో నిలిపాయంటే నమ్మబుద్ది కావడం లేదు. 


ఆ మాటే కలెక్టర్ తో అంటూ “ఆరోజు బుద్ధిపూర్వకంగా అనలేదు. ఏదో సహజంగా అని ఉంటాను. వాటిని ప్రేరణగా స్వీకరించడంలో నీ గొప్పతనం ఉంది. నువ్వు పాటించిన ఈ విజయసూత్రాన్ని ఇకముందు నేను కూడా నా జీవితంలో ఆచరిస్తాను" మనస్ఫూర్తిగా అన్నాడు రాఘవ. 


***************


పల్లా వెంకట రామారావు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు

Profile Link:


జన్మస్థలం:     ప్రొద్దుటూరు, కడప జిల్లా. 

జననం:         1974 

తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ

చదువు:        ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)

ఉద్యోగం:       స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) 

అభిరుచి:      సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్)  travel India telugu     

                    (యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)

రచనలు:  'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,

                   వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,

                   బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల

                   ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల

                   బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

 సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం

                    మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ      

                    కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా 

                    రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ 

                    వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page