top of page
Original.png

ఉగాది పచ్చడి ప్రహసనం



“పండుగలలో రుచులు మాత్రమే కాదు… వాటి వెనుక ఉన్న అర్థం కూడా తెలుసుకోవాలి!”
“పండుగలలో రుచులు మాత్రమే కాదు… వాటి వెనుక ఉన్న అర్థం కూడా తెలుసుకోవాలి!”

Thiruppavai Dhanurmasam Visishtatha - New Telugu Story Written By Sudhavishwam Akondi Published in manatelugukathalu.com on 19/03/2026

ఉగాది పచ్చడి ప్రహసనం - తెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి

పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 💐💐💐

ఈ పర్వదినాన ఆనందంగా ఉగాది పచ్చడి ఆస్వాదిస్తూ ఈ చిన్న హాస్య కథ చదివి, మనసు ఆహ్లాదం చేసుకోండి. సంవత్సరం అంతా నవ్వుతూ ఉండండి.


 "హలో ఆంటీ! ఏమైంది? వస్తానన్నావు రాలేదు. షూటింగ్ కి అంతా రెడీ చేసుకున్నా కదా! రేపే మన యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తున్నాం కదా! ఉగాది రోజు ఉగాది పచ్చడి పోస్ట్ తో మొదలుపెడదామని అనుకున్నాం. ఇప్పుడెలా హ్యాండ్ ఇచ్చావు" టెన్షన్ గా ఫోన్ లో మాట్లాడుతోంది శ్రావణి


 శ్రావణి, సంధ్య ఇద్దరూ చిన్నప్పటి ఫ్రెండ్స్. పెళ్లిళ్లు అయ్యాయి ఇద్దరికీ. జాబ్స్ చేసే కన్నా ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టాలని వాళ్ళు అనుకున్నారు. 


 రకరకాల వంటలు పరిచయం చేస్తూ వీడియో పోస్ట్ చేయాలనుకున్నారు. కానీ ట్విస్ట్ ఏమంటే ఇద్దరికీ వంటలు రావు. 


 పుట్టింట్లో వంటలు చేయాల్సిన అవసరం లేదు. వంటకు, ఇంటి పనులకు మనుషులు వున్నారు. అసలు వంట రూమ్ వైపే వెళ్లకుండా పెరిగారు. 


 పుట్టింట్లో వంటావిడతో చాలా చనువు శ్రావణికి. తనతో వంటలు ఎలా చేయాలో అడిగి, రాసుకుని వీడియో చేద్దాం అనుకున్నారు. తీరా ఆవిడ రాలేకపోయింది. 


 ఇంతలో సంధ్య వచ్చింది. 

విషయం విని.. 


 "మనమే ప్రయత్నిద్దాం! ఓ సారి మా ఇంట్లో ఆంటీ ఏదో పచ్చడి చేయడం చూశాను. అలాగే చేసేద్దాం!" అంది సంధ్య


చివరికి ఇద్దరూ ఒకే ఆలోచనకు వచ్చారు. 


 "ముందు ఓ సారి వేరే వాళ్ళ ఛానెల్స్ లో చూసి డిసైడ్ చేద్దాం!" అని అనుకున్నారు. 


 చాలా వీడియోలు చూసారు. ఉగాది పచ్చడి గురించిన రెసిపీలు అన్నీ ఒక్కలా లేవు. ఒకదానికి ఒకటి భిన్నంగా ఉన్నాయి. చాలామంది ఆరు రుచులు మాత్రమే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ కలిపారు. దాంతో ఒక నిర్ణయానికి వచ్చారు. 


 "అన్నీ పదార్థాలు కలుపుతున్నారు వీళ్ళు. కానీ పోపు పెట్టడం లేదు. పచ్చడికి పోపు పెడతారని విన్నట్టు గుర్తు! షడ్రుచులు అని ఉంది కనుక మనం ఆ ఆరు మాత్రమే కలిపి, పచ్చడి చేసేద్దాం" అంది సంధ్య


 "ఓకే! డన్! ఓసారి అమ్మను అడుగుదాం" అని వాళ్ళమ్మకు కాల్ చేసింది. 


 "అమ్మా! త్వరగా చెప్పు పచ్చడికి పోపు పెట్టాలి కదా! అయితేనే బావుంటుంది కదా!"


"అవును!" అందావిడ ఏదో పచ్చడి అనుకుని


 "ఓకే మళ్లీ చేస్తాను" అని కట్ చేసింది


 "చూశావా! మనం చూసిన ఛానెళ్లలో ఎవరూ పోపు పెట్టలేదు. మనం పోపు పెట్టి చెబుదాం. సూపర్ హిట్ అవుతుంది ఛానెల్"


 "అవును. పచ్చడిలో ఆంటీ పోపు పెట్టగా చూసినట్టే గుర్తు" అని బలపరిచింది


 వీడియో రెడీ చేసుకున్నారు. 


శ్రావణి యాంకరింగ్ చేస్తోంది. 


 "హలో ఫ్రెండ్స్! ఉగాది పచ్చడి రెసిపీతో మా ఛానెల్ మొదలుపెడుతున్నాం

ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేయండి. మా వెరైటీ రెసిపీ ఎలా వుందో కామెంట్స్ లో తెలియజేయండి" అని ఓ సెకండ్ ఆగి.. 


 "ముందుగా ఒక మామిడికాయలు, చింతపండు, వేపపువ్వు, కారం, ఉప్పు, బెల్లం అన్నీ పావుకిలో తీసుకుని పక్కన పెట్టుకోండి. మామిడికాయలు ముక్కలు చేసి, బాణలిలో ఆయిల్ వేసి వేయించండి. దాంట్లోనే వేపపువ్వు, కారం కోసం పచ్చిమిర్చి, చింతపండు వేసి వేపి, పక్కన పెట్టుకోండి. చల్లారాక అన్నీ కలిపి మిక్సీ చేయండి. ఒక బౌల్ లోకి తీసుకుని పెట్టుకోండి. పోపుదినుసులు ఆయిల్ లో వేయించుకుని ఆ పచ్చడిలో వేయండి. 


 ఈ పచ్చడి చాలా సూపర్ గా ఉంటుంది. ఎప్పుడూ ఒకే స్టయిల్ లో ఎందుకు? ఇలా చేసుకోండి ఒకసారి. చాలా బాగుంటుంది. ఇడ్లి, దోశ ఏ టిఫిన్ లోకి అయినా బాగుంటుంది. అన్నంలోకి కూడా అదిరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్! మరో వెరైటీ రెసిపీతో మళ్లీ కలుద్దాం!"


 "అబ్బా! సూపర్ డూపర్ గా వచ్చిందే వీడియో" అంది సంధ్య


 *****


 మరునాడు ఉగాది. తలస్నానం చేసి, మొన్నే షాపింగ్ చేసి, తెచ్చుకున్న డ్రెస్ వేసుకుంది సంధ్య


పెళ్లయ్యాక తొలి పండుగ. పూజ అయ్యాక అత్తగారు అందరినీ పిలిచింది. 


 "చేయి పట్టండి అందరూ!" అని ఉగాది పచ్చడి చేతిలో వేసింది


అది తిన్న సంధ్య "చాలా బాగుందే!" అనుకుంది. 


 "అత్తయ్యా! ఈ పచ్చడి చాలా బాగుంది. మా ఇంట్లో అమ్మ చేసేది అస్సలు బాగుండేది కాదు. అందుకని మేము తినడం మానేశాం. అమ్మ కూడా చేయడం ఆపేసింది. ఇది మిక్సీ చేయలేదా? పోపు పెట్టలేదు? ఊరికినే తింటారా? టిఫిన్ లో కదా" అంది


 ఆ అత్తగారు ముందుగా హతాశురాలయ్యారు. ఆ తర్వాత తేరుకుని.. 


 "అమ్మాయ్! ఆరు రుచుల సమ్మేళనం తో ఈ పచ్చడి తయారు చేసి, నైవేద్యం పెట్టి ఆరగిస్తారు. కొత్త మామిడిపిందెలు, కొత్త బెల్లం, చింతపండు, వేపపువ్వు, మిరియాల పొడి, ఉప్పు అన్నీ కొద్దిగా తగిన పాళ్లలో వేసి తయారు చేస్తారు. ఇది ఆరగించడంలో పరమార్థం ఏంటంటే.. 

మనిషి జీవితం ఆరు రుచుల సమ్మిళితంగా ఉండాలని. కష్ట, నష్టాలు వస్తే కుంగిపోకూడదు. తీపి జ్ఞాపకాలను మరువకుండా మనసులో పాజిటివిటీ పెంచుకోవాలి. అన్నీ సమపాళ్లలో అనుభవిస్తూ సాగిపోవాలి' అని వివరించారావిడ


 అది విని "అయ్యో! ముందు మిమ్మల్ని అడిగి ఉండాల్సింది. మా ఛానెల్ లో పెట్టేదాన్ని. ఇప్పుడు శ్రావణి పోస్ట్ చేసేసిందేమో!" అని గాభరా పడుతూ అంతా చెప్పింది


 శ్రావణికి కాల్ చేసింది. 

 "వీడియో పోస్ట్ చేసావా!"


 "లేదింకా! ఏమైంది?"

 "పోస్ట్ చెయ్యకు! నేను వస్తున్నా! అప్పుడు చెబుతా!" అని కాల్ కట్ చేసి పరుగు తీసింది శ్రావణి ఇంటికి


 సంధ్య అత్తగారు 'ఇదెక్కడి చోద్యం' అనుకున్నారు. 


ఇదండీ ఉగాది పచ్చడి తయారీ ప్రహసనం.. 


హాయిగా నవ్వుకోండి.

Stay Happy always..


సుధావిశ్వం


అందరికీ పరాభవ నామ సంవత్సర (ఉగాది) శుభాకాంక్షలు 💐💐💐

  


-సుధావిశ్వం




#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #UgadiPachhadiPrahasanam, #ఉగాదిపచ్చడిప్రహసనం



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page