top of page
Original.png

ఏది నిజం ఏది అబద్ధం

#EdiNijamEdiAbaddham, #ఏదినిజంఏదిఅబద్ధం, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

ree

Edi Nijam Edi Abaddham - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao Published In manatelugukathalu.com On 27/11/2025

ఏది నిజం ఏది అబద్ధం - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత


 

పెళ్ళి అయిన ఆరు సంవత్సరాలకు రమేష్ భార్య వినత  ఆడపిల్లని కని ఎంతో సంతోషంగా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది. 21 వ రోజు బారసాల పెట్టుకుని చుట్టాలందరిని పిలుచుకున్నారు.


రమేష్ భార్య వినత కి దైవభక్తి ఎక్కువ. పూజలతో ఎక్కువ కాలం గడుపుతుంది. యిహ బారసాల అంటే మాములుగా చెయ్యదుగా. పదిమంది వేదపండితులచేత వేదం చదివించాలి అని ఏర్పాటు చేసింది. రమేష్ తల్లి మనవరాలికి మెడలో వెయ్యటానికి ఆంజనేయ స్వామి లాకెట్ వున్న గొలుసు చేయించి తీసుకుని వచ్చింది. మేము ఏమితక్కువ అన్నట్టుగా వినత తల్లిదండ్రులు మనవరాలు చేతికి కడియాలు చేయించి తీసుకొని వచ్చారు.


బారసాల రోజు రానే వచ్చింది, చుట్టాలతో యిల్లు హడావుడిగా వుంది.


పూజ అయిన తరువాత పాప పేరు బియ్యం లో వ్రాయాలి అన్నారు శాస్త్రి గారు. అప్పటికే అనుకుని వున్న పేరు ‘సంతోషి’ అని రాసాడు రమేష్. శాస్త్రి గార్లకు దక్షిణ యిస్తున్న సమయంలో అందరికంటే వయసులో పెద్ద పురోహితుడు రమేష్ దంపతులతో ‘పాప కుజదోషం తో పుట్టింది, కొద్దిగా వయసు వచ్చిన తరువాత శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతు పూజ చేయించండి. వీలున్నపుడల్లా ఈ పూజ చేయిస్తే మంచిది’ అన్నాడు.


ఆ మాటలకి అప్పటి దాకా సంతోషంతో వున్న రమేష్ దంపతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  “తమరు కొద్దిసేపు కూర్చొని ఉండాలి, వెళ్లిపోవద్దు, మీరు చెప్పిన విషయం మీద మాకు పూర్తిగా వివరాలు చెప్పండి” అని అడిగారు.


భోజనాలు అయ్యి అందరూ వెళ్ళే వరకు కూడా మనసు మనసులో లేదు రమేష్ కి. అసలే ఆడపిల్ల, ఈ జాతకంలో దోషం ఏమిటో కర్మ అనుకున్నాడు.  శాస్త్రి గారు, “ఎక్కువగా బయపడకండి. కుజదోషం వున్న అబ్బాయి తోనే పెళ్లి చెయ్యాలి, అలా కాకుండా చేస్తే ఇద్దరిలో ఎవ్వరికో ఒకరికి ప్రమాదం” అని చెప్పారు.


 “ఎవ్వరికీ? మా ఇద్దరిలోనా” అన్నాడు రమేష్.  


“మీకు కాదండి బాబు, పెళ్ళికొడుకు పెళ్లికూతురు లో ఒకరికి” అంటూ శాస్త్రి గారు వెళ్లిపోయారు.


“సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుంటే మనం మంచి నక్షత్రం చూసి ఆపరేషన్ చేయించుకునే దానిని. డాక్టర్ గారు నార్మల్ డెలివరీ అని చెప్పి కొంప ముంచింది” అంది కళ్ళలో నీళ్లతో వినత. 


“వినతా! రోజూ నువ్వు పూజలు చేసి తెలుసుకుంది యింతేనా, చావు పుట్టుకలు దేముడి చేతిలో ఉన్నాయి. ఆయన మన పాప ఈ నక్షత్రం లో పుట్టాలి అని నిర్ణయం చెయ్యడం వల్లనే యిలా జరిగింది తప్ప ఇందులో డాక్టర్ తప్పు లేదు, పుట్టించిన ఆ దేముడే మన పాపకి మేలు చేస్తాడు అనే నమ్మకం తో సంతోషం గా వుందాం. శాస్త్రి గారు చెప్పినట్టు మానవప్రయత్నం గా శ్రీకాళహస్తి వెళ్దాం, పూజలు చేద్దాం.

నువ్వు ఇహ నీ మనసులో నుంచి ఈ విషయం తీసివేసి సంతోషంగా వుండు. పాప పెళ్ళి యింకా ఇరవై అయిదు ఏళ్ళ తరువాత, అప్పుడు పరిస్థితులు ఎలా వుంటాయో చెప్పలేము” అన్నాడు రమేష్.


“కాలం అన్నిటికి మందు అన్నట్టుగా కూతురికి వున్న కుజదోషం గురించి మరిచిపోయారు.  సంతోషి కూడా చదువుల తల్లి అయ్యింది. ప్రతి క్లాస్ లోను తానే మొదటి స్థానంలో ఉండేది. కూతురు పుట్టిన అదృష్టం.. రమేష్ కి వ్యాపారం లో బాగా కలిసివచ్చి, అన్ని దిక్కుల కూతురి పేరున స్థలాలు కొన్నాడు, తను మంచి  బిల్డింగ్ కట్టుకుని అందులో వుంటున్నారు.కాలు కదిపితే కారు అన్నటుగా వుంది వ్యహారం.

కూతురు ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ రావడం మెడిసిన్ లో సీట్ రావడం రమేష్ దంపతులకి ఆనందం తో తన దగ్గర పని చేస్తున్న ఉద్యోగులకి మంచి బోనస్, బట్టలు యిచ్చాడు. ఏ పని చేసినా కూతురు పేరుమీద చేసేవాడు.  యింత హడావుడి లో కూడా దంపతులు శ్రీకాళహస్తి వెళ్లి పూజలు చెయ్యటం మానలేదు. డబ్బులు రాగానే దేముడిని మర్చిపోయే రోజులివి.


“అమ్మాయికి చదువు అయ్యింది, పై చదువులకి అమెరికా వెళ్తాను అంటోంది, మీరు ఏమి మాట్లాడరే” అంది వినత భర్త రమేష్ తో. 

 

“నన్ను ఎలాగైనా ఒప్పించేస్తుంది. అది ఏదో నువ్వే మాట్లాడి ‘హైదరాబాద్ లో లేని చదువులు లేవు, నువ్వు సంపాదించాలిసిన అవసరం కూడా లేదు, అందుకే కావాలి అంటే హైదరాబాద్ లో పీజీ చెయ్యి’ అని చెప్పి ఒప్పించుకో నీ కూతురిని” అన్నాడు రమేష్.


ఒకరోజు కూతురు సంతోషి తో తల్లి మాట్లాడి “నువ్వు చదువు కోసం అమెరికా వెళ్ళిపోతే మేము బెంగతో చచ్చిపోతాము, నువ్వు మా కళ్ల ముందే ఉండాలి. హైదరాబాద్ లోనే పీజీ చెయ్యి, తరువాత నాన్నగారు హాస్పిటల్ కట్టిస్తారు. నువ్వే దానికి యజమానివి, ఎవ్వరి దగ్గరో పనిచెయ్యడం ఎందుకు” అని ఒప్పించింది.


కూతురు పీజీ అవుతోవుండగానే రమేష్, కూతురు పేరు మీద హాస్పిటల్ నిర్మాణం మొదలుపెట్టాడు.  “ఏమండీ, అది అసలే తిక్కది, హాస్పిటల్ హడావిడి లో పడి పెళ్ళి వద్దు అన్నా అంటుంది, మీరు సంబంధాలు చూడటం మొదలుపెట్టండి” అంది వినత.   


“అలాగే కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో. జన్మలో పొరపాటున కూడా అమ్మాయి జాతకం లో దోషం వుంది అని దానికి నీ ద్వారా లేకపోతే నా ద్వారా తెలియకూడదు, నేను కుజదోషం వున్న అబ్బాయి కోసమే ప్రయత్నం చేస్తాను” అన్నాడు రమేష్.


సంతోషి చదువు అయిపొయింది, తన స్వంత హాస్పిటల్ లో కొంతమంది డాక్టర్స్ తో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టింది.  సంబంధాలు రమేష్ వెనుక వున్న ఆస్తి చూసి రావడం జాతకం చూపించుకుని వెళ్లిపోవడం జరుగుతోంది. కుజదోషం వున్న మగపిల్లలు దొరికిన చదువు తక్కువ, లేకపోతే బాగుండకపోవడం జరుగుతోంది.


రోజులు గడిచే కొద్దీ రమేష్ దంపతులకు ఆందోళన మొదలయింది. ఒకరోజు సంతోషికి మంచి సంబంధం వచ్చింది. పిల్లాడు కూడా గుండె జబ్బుల ఆపరేషన్ చెయ్యడంలో మంచి పేరు వుంది, అన్నివిధాలా సంతోషికి తగ్గ సంబంధం. అయితే జాతకం చూసిన శాస్త్రి గారు “ఈ అబ్బాయికి, మీ అమ్మాయికి జాతకం కుదరలేదు, అతనికి కూడా కుజదోషం వుంటే బాగుండేది” అన్నాడు. 


“పాపం మీ అమ్మాయి ఒక్క గంట ముందు పుట్టి వుంటే జాతకంలో ఏ దోషం ఉండేది కాదు, కాని విధి ప్రకారం జరుగుతుంది” అన్నాడు.


ఇంటికి వచ్చిన రమేష్ కి నిద్ర సరిగ్గా పట్టలేదు. రెండవ రోజున సంతోషి పుట్టిన సమయం మార్చి జాతకం తయారు చేయించాడు. మనసులో భయంగా వున్నా దేముడి మీద భారం వేసి ఎలా జరగాలి అని దేముడు అనుకుంటాడో అలాగే జరుగుతుంది అనుకుని కూతురుకి ఆ డాక్టర్ సంబంధం కుదిరిచ్చి వివాహం ఆడంబరంగా చేసాడు. తను జాతకం మార్చిన విషయం భార్యకి చెప్పకుండా “అల్లుడికి కూడా మన అమ్మాయిలా జాతకం లో దోషం ఉండటం తో ఇహ బయపడక్కరలేదు” అని చెప్పాడు.

“నాన్నా!  చూడు మీ మనవరాలు బైపీసీ  తీసుకోమంటే లేదు ఇంజనీరింగ్ చదువుతాను అంటోంది” అని సంతోషి తండ్రికి ఫోన్ చేసింది. 


డెబ్భై ఏళ్ళ రమేష్ “ముసలి తాత చెప్పితే వింటుందా నీ కూతురు, పోనీ దానికి ఏది యిష్టం అయితే అదే చదువుకోని, మీరిద్దరూ డాక్టర్స్ అది ఇంజనీర్ అయితే బాగుంటుంది” అన్నాడు రమేష్.


“యింత హాస్పిటల్ పెట్టుకుని అది ఇంజనీర్ అయితే మా తరువాత ఈ హాస్పిటల్ చూసే దిక్కు ఉండాలి కదా నాన్నా, మీ మాట అంటే దానికి యిష్టం, ఒక్కసారి మీ మనవరాలికి చెప్పండి” అంది.


మనవరాలు శ్రీలక్ష్మికి ఫోన్ చేసి “హలో డాక్టర్ ఎలా వున్నావు?” అన్నాడు రమేష్.  


“నేను డాక్టర్ చదవను తాతయ్య, ఇంజనీర్ అవుతాను” అంది శ్రీలక్ష్మి.


“నువ్వు డాక్టర్ అయితే నాకు మీ అమ్మమ్మ కి వైద్యం చేసి మమ్మల్ని నీ పెళ్ళి వరకు బతికిస్తావు అనుకుంటున్నాను, సరే నీ యిష్టం. నువ్వు ఇంజనీర్ అయ్యేదాకా ఎలాగో మేము ఉండము, మాకెందుకు నువ్వు ఏమి చదివినా” అన్నాడు.


“నీ కూతురు డాక్టర్ కదా. మళ్ళీ నేను డాక్టర్ అయ్యి మీకు వైద్యం చెయ్యాలా తాతయ్యా” అంది శ్రీలక్ష్మి. 


“అవును చిట్టి తల్లి.  నువ్వే మమ్మల్ని ఆరోగ్యం గా ఉంచగలవు, ఏమైనా నీ యిష్టం” అన్నాడు.


***

“శ్రీలక్ష్మి ఇంటర్మీడియట్ లో బైపీసీ తీసుకుంది నాన్నా, మీ మాట అంటే దానికి వేదం” అంది తండ్రితో వినత.


వాలు కుర్చీలో కూర్చుని గోడ మీద వున్న వెంకటేశ్వర స్వామి ఫోటో చూసి “నువ్వు ఏమనుకుని ఎవ్వరిని ఏ టైమ్ లో ఈ భూమి మీదకు తెస్తావో, దానిని తప్పించడం మేము వ్రాసుకున్న జాతకం  వల్ల అవుతుందా స్వామి, జాతకం ఎలా వున్నా నీ పాదాలు వదలకుండా ఉండటమే మా పని” అనుకున్నాడు.


మనుషులు రాసిన జాతకం గురించి బయపడకుండా ఆ దేముడి మీద నమ్మకంతో  ఉంటే అంతా ఆయన చూసుకుంటాడు మంచి అయినా చెడు అయినా.

                           

 శుభం 


 జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.







30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page