top of page

శిఖరం

#KiranJammalamadaka, #జమ్మలమడకకిరణ్, #Sikharam, #శిఖరం, #మానసికసంఘర్షణ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Sikharam - New Telugu Story Written By Dr. Kiran Jammalamadaka

Published In manatelugukathalu.com On 28/07/2025

శిఖరం - తెలుగు కథ

రచన: డా: కిరణ్ జమ్మలమడక 

కథా పఠనం: పద్మావతి కొమరగిరి

"నేనే! నా పై హత్యాయత్నం చేశా..  కానీ విఫలమయ్యా!" అన్న 55 సంవత్సరాల ప్రజాపతి మాటలు వినగానే డాక్టర్ సంపత్ ఒక్క క్షణం ఖంగుతిని ప్రజాపతి వైపు చూసాడు. 


ప్రజాపతి తన గుండెలోని బాధని నియంత్రించుకుంటూ, తన గురించి చెప్పటం మొదలుపెట్టాడు. 


"ధనవంతుడు కావాలనుకున్నాను. వ్యాపారాలు, బంగ్లాలు, కార్లు, ఇవన్నీ నా లక్ష్యాలు. బంధాలు, బంధనాలు అని వాటి జోలికి పోలేదు, నా ధ్యాస అంతా నా లక్ష్యాల వైపే. 

నన్ను ఎవరూ అవమానించలేదు, నేనూ ఎవరికి నిరూపించుకోవాలనుకోలేదు. నేనే నాకు ప్రేరణ.  నాకు ఎవరు లేరని దిగులు ఎప్పుడూ లేదు. నాకు నేనే మంచి తోడు. సెల్ఫ్ మేడ్ బిలియనీర్‌గాను, యువతకు ఆదర్శంగా గానూ పేరొచ్చింది. అది నాకు గర్వకారణమే."


సంపత్ వినడం తప్ప ఇంకేం చేయలేని స్థితిలో ఉన్నాడు. 


ప్రజాపతి మళ్లీ ఊపిరి పీల్చుకుని 

“కానీ..” అంటూ మళ్లీ తన కథను కొనసాగించాడు. 


"ప్రతి ఉదయం ఒక ఉత్సాహం, ఒక ఛాలెంజ్, ఒక ప్రయోజనం ఉండేది. కానీ ఈ మధ్య ఏదో లోటు, ఏదో వెలితి బాధిస్తోంది. కోట్ల వ్యాపారాలు, విలాసవంతమైన జీవితం ఉన్నా ఏదో వెలితి, ఏదో తెలియని సూన్యం నన్ను ఆవహిస్తోంది. ఆ భావనను భరించలేక, ఈ పనికి తెగబడ్డాను"


ప్రజాపతి కళ్ళలో ఆ కన్నీటి బిందువును సంపత్ గమనించాడు. 

"స్ట్రెస్ అంతే, తగ్గిపోతుంది ప్రజాపతి గారు " అని సర్దిచెప్పాడు డాక్టర్. 


సంపత్ లెక్కప్రకారం, ఇలాంటి కష్టాలు డబ్బున్న వారికి వొచ్చే పిచ్చి కష్టాలు, అవేమీ పెద్ద సమస్యల్లా అనిపించ లేదు. తనకి మాత్రం ప్రతి నెల EMI లు కట్టటం, కార్లు కొనుక్కోవటం, దేశాలు చూడటం వంటి డబ్బుతో ముడిపడిన సమస్యలే పరిచయం. ఇంకా ఇంట్లో భార్య తో గొడవలు, పిల్లల భవిష్యత్తు పై కసరత్తులు లాంటివే సమస్యలని సంపత్ ఉద్దేశం.  


రెండు రోజుల్లో, హాస్పిటల్ నుండి ప్రజాపతిగారు డిశ్చార్జ్ అయ్యారు.  డాక్టర్ల సలహామేరకు, సంగీతం వినటం, యోగా చెయ్యటం, తోటపని చెయ్యటం, లాంటి అలవాట్లు కొత్తగా పరిచయం చేసుకున్నాడు. ఒక మానసిక కౌన్సెలర్ తో మాట్లాడటం వంటి కార్యక్రమాలుకు కొంత కొన్ని సమయాలు కేటాయించాడు.  మళ్ళీ తన దైనందిన జీవితాన్ని చిన్న చిన్న మార్పులతో మొదలు పెట్టాడు. కొన్ని రోజులు, కొంత మేర ఉపశమనమిచ్చింది. 


***


ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే, ఆఫీస్ కి వొచ్చేసాడు ప్రజాపతి.  ఏదో కాస్త పని చేసాక ఏదో సూన్యత మళ్ళీ ఆవహించింది, విరక్తి తో, తన కుర్చీలో అలానే వెనక్కి వాలి కళ్ళుమూసుకున్నాడు.

 

ముందు లీలగా తరువాత గట్టిగా ఒక కూనిరాగం వినపడింది. చూస్తే తన పనివాడు రాజు, తన్మయత్వం లో పాడుకుంటూ వొస్తున్నాడు.  తననే ఆశ్చర్యంతో చూస్తున్న ప్రజాపతి ని చూడగానే తీసిన ఆలాపన ఆర్థోక్తి లోనే ఆపేసాడు, చేతిలో వున్న బకెట్ కిందపడేశాడు. నమస్కారం పెట్టి, మౌనంగా ఉండి పోయాడు. 


ఆ భయాన్ని గమనించిన ప్రజాపతి, నవ్వు ఆపుకుంటూ, పని కానివ్వమని సైగ చెయ్యటంతో రాజు గదిని శుభ్రం చేసే పనిలోపడ్డాడు.  డాక్టర్ నలుగురితో మాట్లాడమని చెప్పిన సలహా గుర్తుకువొచ్చి, మాట కలిపే ప్రయత్నం చేసాడు ప్రజాపతి. "నీ పేరేంటి ?"


ఊహించని ఆ శబ్దానికి రాజు తత్తరపడి "ర్రర్.. రాజు అండి” అన్నాడు.  


"పాటలు బాగా పాడతావా?"


"ఏదో కూని రాగాలు తీస్తూంటాను సార్ "


"ఎప్పుడూ ఇలా హుషారుగా, ఆనందంగా వుంటావా ?"


"వీలైనంతవరకూ వుంటాను సార్, పొద్దున్నే చద్దికూడు తింటాను ..  పనికి వొస్తాను ..  ఊడుస్తాను ..  ఎల్లిపోతాను .. "


"ఖాళీ టైం లో ఏంచేస్తావు?"


"సినిమాలు బాగా చూస్తా.."


"నీ లైఫ్ అంతా ఇలానే అనుకుంటున్నావా నీకు జీవితం లో లక్ష్యాలు, ఆశయాలు కోరికలు లేవా? ఇంకా కావాలి అని అనిపించలేదా "


ఒక్క క్షణం ఆగి "లేదు సార్, చిన్న జీవితం నాది, తినడానికి కూడు ఉండడానికి గూడు వున్నాయి.  అవి చాలు సార్ ..  చిన్న ఉద్ద్యోగం, కాస్త ఆదాయం..  చాలు సార్ నచ్చింది తినటం, సినిమాలు చూడటం అంతే సార్..  ఎక్కువ లేకపోవచ్చు ..  వున్నది నాకు సరిపోతుంది .. "


ఆ మాటలు ప్రజాపతిని రక రకాల ఆలోచనల్లోకి నెట్టేశాయి.  డబ్బే అశాంతికి మూలమా? ఇంకా సాధించాలి అనుకొవటం తప్పా? తను తప్పుచేసాడా? తను ఇంతకాలం చేసిందేమిటి? అని ఆలోచిస్తూ అలానే తన గదిలో వుండిపోయాడు. సాయంత్రం దాకా వుండి, ఇంటికి బయలుదేరాడు తన కారులో.  అకస్మాత్తుగా ఆగిన కార్ కుదుపుకు ఈ లోకంలోకి వొచ్చి అప్పుడే కార్ దిగి బయటకు వెడుతున్న డ్రైవర్ ని "ఎక్కడికి, కార్ మధ్యలో ఆపి అన్నాడు విసుగ్గా .. "


"సార్ అది.. మన కార్ వల్ల ఒక పెద్దాయన మీద నీళ్లు పడ్డాయి, నా గొడుగు ఇచ్చి సారీ చెపుదామని .. " అని ఆగాడు.

 

"వెళ్ళు. తొందరగా రా.. " అని ప్రజాపతి తలా ఊపి తన విసుగును తెలియజేశాడు. 


ప్రజాపతి, ఇంటికి చేరుకోవటం, ఏమి చెయ్యాలో తోచక నిరాసక్తతతో గడపటం మామూలైపోయింది. జైలు లో ఖైదీ లాగ వుంది ప్రజాపతి జీవితం. 

***

ఆ మర్నాడు ..  ఆదివారం, ఆఫీస్ కూడా లేదు. కావాలనుకుంటే వెళ్లొచ్చు కానీ అది బోర్ అని తోటపని చేద్దామని ఇంటి ముందు వున్న తోటలో ఏంచెయ్యాలో తెలియక అటూ ఇటూ తిరుగుతూ వుంటే గేట్ చప్పుడయింది. ఒక పెద్దాయన గొడుగు తీసుకొని లోపలి రావటం గమనించాడు. ఆదివారం కావటంతో పనివాళ్ళు ఎవరూ పెద్దగా లేరు. ఎవరో చూద్దామని ప్రజాపతి ఆ పెద్దాయన దగ్గరకు వెళ్ళాడు. అయన హుందాగా వున్నాడు.  దగ్గరకు వెళ్లేకొద్దీ ఆ మొహాన్ని తను గుర్తించాడు.

 

"మీరు ..  " అని ఏదో అనే లోపు 

"నిన్న మీ కార్ డ్రైవర్ అనుకుంట, నా మీద నీళ్లు పడ్డాయని ఈ గొడుగు ఇచ్చాడు.  నేను బలవంతం పెడితే ఈ అడ్రస్ చెప్పి వెళ్ళిపోయాడు, తిరిగిద్దామని వొచ్చా " అని క్లుప్తంగా తాను వొచ్చిన పని చెప్పాడు.  


"మాస్టారూ.. మీరు కృష్ణారావు మాస్టారు ? " అడిగాడు ప్రజాపతి.  


కృష్ణారావు వయసు 80 పైనే ఉంటుంది, కానీ ఇంకా ఆరోగ్యంగా హుషారుగా వున్నారు. 


ఇదే ప్రశ్న కృష్ణారావు గారికి సర్వసాధారణం. ఒక్క క్షణం ఆలోచించి "ప్రజాపతి ?" అన్నారు. 

 

ప్రజాపతి మోహంలో ఆ చిరునవ్వు చూసి 

"ఒరేయి ప్రజాపతి ఎలా వున్నవురా? " అన్నారు భుజంమీద చెయ్యవేసి.

 

కాలేజీలో ప్రజాపతి కి మార్కులు పెద్దగా వొచ్చేవి కాదు, కానీ ఒక్క కృష్ణారావు గారికి మాత్రం ప్రజాపతి ఏదో సాధిస్తాడని నమ్మకం ఉండేది.  ఆ విషయం ప్రజాపతికి ఇప్పటికీ గుర్తువుంది. 


"రండి మాస్టారు, ఇక్కడ కూర్చోండి " అని తన గార్డెన్ లో అందంగా అమర్చిన ఖరీదైన సీటింగ్ ఏరియాలో వున్న సోఫా లో కోర్చోపెట్టాడు ప్రజాపతి.  


"బావుందిరా ప్రజాపతి, చాలా కాలమయింది నిను చూసి.. " అని ఆప్యాయంగా పలకరించారు కృష్ణారావు గారు. 


సైగ చేసిన క్షణాల్లో కాఫీ, బిస్కేట్స్ వారి ముందు వున్నాయి. 

"చెప్పండి మాస్టారు ఎలా వున్నారు ఈ ఊరిలో సెటిల్ అయ్యారా?"


"అవునురా ప్రజాపతి, రిటైర్ అయ్యాక ఇక్కడే సెటిల్ అయ్యాను, నీ సంగతి ఏంటి ? ఎలా వున్నావు?"


"పర్లేదు మాస్టారు, బానే సంపాదించా ..”  అని చెప్పబోతుంటే 


"నీకు ప్రశ్నని అర్థం చేసుకోవటం ఇంకా అలవడినట్టు లేదురా ప్రజాపతి, ఎలా వున్నావు అంటే ఆనందంగా ఉన్నావా ? సంతృప్తిగా వుందా నీకు అని ..  బాగా సంపాదించవా అని కాదు " అని చిన్నగా నవ్వారు. 


"అవును మాష్టారు, అంతా బానే వుంది, బానే వున్నాను.  " 


ఒక్క క్షణం తటపటాయించాడు ప్రజాపతి తన బాధ చెపుదామాని ? కానీ అక్కడ హాస్పిటల్ లో తన బాధ విన్న డాక్టరుకే తన బాధ సరిగా అర్థం అవ్వలేదు ఇంకా మాస్టారికి అని ఆలోచిస్తూవుండగా


"బావుందిరా ప్రజాపతి, మరి నేను వెడతాను ఇంక " అని లేవబోతుండగా 


ప్రజాపతికి ఒక విధమైన బెరుకు వొచ్చింది, "ఆదివారమే కదా మాస్టారు కూర్చోండి, కాసేపు" అన్నాడు.

 

ఒక్క క్షణం ఆగి "కొంచెం మాట్లాడాలి మాస్టారు " అన్నాడు చిన్న స్కూల్ పిల్లాడిలాగా. 


సరే అని, కుర్చీలోనుంచి లేచిన కృష్ణారావు గారు, మరల కుర్చీలో కూర్చొని చెప్పు అన్నారు.


"యెంత సక్సెసఫుల్ అయినా హ్యాపీనెస్ లేదు మాస్టారు, ఏదో తెలియని వెలితి ఇంత సాధించినా తృప్తిలేదు ఈ మధ్యన మాస్టారు " అని తన బాధని తాను కలిసిన మనుషులను గురించి వివరంగా చెప్పాడు.  


చివరిగా "రాజు లాగా నేను ఏమి సంపాదించకుండా వుండాలిసింది ..  కోరికే అన్నిటికి కారణం అని అనిపిస్తోంది మాస్టారు" 


అంతా ఓపికగా విన్న కృష్ణారావు గారు, ఊపిరి తీసుకొని 


"ప్రజాపతి, ఇక్కడ నువ్వు రెండు అంశాలు మాటాడుతున్నావు. ఒకటి సాఫల్యత అదే సక్సెస్, రెండు ఆనందం అదే హ్యాపీనెస్, ముందు ఈ రెంటికి మధ్య వున్న సంబంధాన్ని అర్థంచేసుకో. సంతోషానికి సాఫల్యత కీలకం కాదు.  సంతోషమే సాఫల్యతకి కీలకం. నీకు అప్పట్లో డిగ్రీ పాస్ అవ్వటమే మొదటి విజయం, పాస్ అయ్యాక విజయం సాధించేసానని ఊరుకున్నావా ? "


"లేదు, ఉద్యోగం " అన్నాడు ప్రజాపతి మాస్టారు ఏమి చెపుతున్నారో అర్థం కాక.

 

"ఉద్యోగం, బిజినెస్, ఇంకా పెద్ద బిజినెస్ ..  ఇంకా కార్లు, మేడలు ఇలా అన్ని సంపాదించావు.  అలానే ప్రతి మనిషికి విజయం అనేది తాము వుండే కాల మాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది.  అది అందరికి ఒకేలాగా ఉండదు."


"తృప్తి లేకుండా నేను అలా కోరికల వెంబడి పరిగెత్తూనే వున్నాను, కోరికలే వుండకూడదు. అందుకే ఈ తృప్తిలేని తనం " అన్నాడు ప్రజాపతి.


"అవునా ?, మరి కోరిక వుండకూడదు అని కోరుకోవడం కూడా కొరికే కదా?, చూడు! నువ్వు ఇందాక చెప్పావే అతను మీ డాక్టర్ సంపత్ ..  మరికొన్ని సంవత్సరాల్లో నీ దారిలోకి వొస్తాడు, రాజుకు తనకు తెలియని ఇంకా పెద్ద ప్రపంచం ఉందని కూడా తెలియదు. చేయక పోవడానికి, చెయ్యలేకపోవడానికి తేడా తెలీదు అతనికి.  నిజంగా రాజు సంతోషంగా వున్నాడని అనుకుంటున్నావా? 


ఈ క్షణంలో ఆనందంగా ఉండొచ్చు, కానీ ఆ ఆనందం శాశ్వతంగా ఉండాలి.  రాజుకి మరి కొంత వయసు వొచ్చాకో, లేక అవసరాలు తగ్గట్టు ఆదాయం పెరగకపోతేనో అప్పుడు అతనికి తను వున్న పరిస్థితి అర్థం అవుతుంది, ఉన్నంతలో ఆనందంగా ఉండటం తప్పుకాదు, తరువాత స్థానానికి వెళ్లాలన్న ఆశ, కోరికా లేకపోవటం తప్పు, మనిషిని అభివృద్ధివైపు నడిపించేదే ‘కోరిక'. అది వద్దు అంటే ఎలా "


"కాదు మాస్టారు ఎంతకాలం ఇలా ఐహిక సుఖాల వెంట పరిగెడుతాను, అంతమనేదిలేదా?"


"ఇది మంచి ప్రశ్న ఇప్పుడు ఆనందం గురించి మాట్లాడదాము, ప్రతి మనిషికి జీవితంలో కోరికలు ఉంటాయి, ఉండాలి.  మన అవసరాలను, కోరికలను ఒక క్రమపద్ధతిలో ఒక ఒక్కదానిపైన ఒకటి పేర్చుకోవాలి, ముందుగా కావలిసింది తిండి గుడ్డ, ఉండటానికి ఒక చోటు ఆతరువాత బంధాలు, స్నేహితులు వగైరా .. వగైరా.. ఆ తరువాత కీర్తి ప్రతిష్టలూ, ఆర్ధిక స్వేచ్ఛ, ఆత్మాభిమానం .. వగైరా మెట్టుమెట్టుకూ మధ్యలో గోడలు ఉంటాయి ప్రతి మెట్టు అధిరోహించాక, ఆ గోడ బద్దలుకొట్టుకొని పైకి వెళ్ళాలి. 


నీ కథ లో రాజు ఇంకా మొదటి మెట్టు దగ్గరే వున్నాడు ..  సంపత్ కీర్తి ప్రతిష్టలు, ఖరీదైన జీవితం దగ్గరే వున్నాడు, కానీ అతనికి తెలుసు ఇంకా తనపైన మెట్లువున్నాయని..  నువ్వు ఆ మెట్టుపైన ఉన్నావని, కాకపొతే నీవు నీ పైనున్న మెట్టుని చూడలేకపోతున్నావు "


అలా వింటూ వుండిపోయాడు ప్రజాపతి . కొన్ని క్షణాల తరవాత 

"మాష్టారు, ఇంకేమి సాదించాలి, అన్ని వున్నాయి కదా నాకు తృప్తి తప్ప. అది ఎక్కడ దొరుకుతుంది. "


"ఆ ..  అదే ఆ చివరిమెట్టే ' ఆత్మసాక్షాత్కారం' - 'సెల్ఫ్ యాక్టులైజేషన్', దీని గురించి మాస్లౌ చాలా వివరంగా చెప్పాడు "

"మెట్లు అన్ని ఎక్కేవరకు ఆనందం తృప్తి ఉండదా ..  అయితే జీవితకాలంలో ఎవరూ ఆనందంగా ఉండలేరు మాష్టారు, అదీ నా ఈ వయసులో "


"నువ్వే వయసు అయిపోయిందంటే, నా పరిస్థి ఏంటి ? " అని నవ్వారు.


"నువ్వు నీ లక్ష్యం నిర్దేశించుకోవాలి, దాన్ని చేరుకునే ప్రయాణం లో నీకు ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఆనందాలు, ఆక్రోశాలు, ఇవన్నీ అనుభవించాక అప్పుడు లక్ష్యం చేరుకుంటావు ఆ తరువాత ? మరొక లక్ష్యం ..  ఇలా పోతూనే ఉంటావు. అందుకే ఆ ప్రయాణాన్ని ఆనందించాలి కానీ మైలు రాయిని కాదు. అంచేత నీ ఆనందం తృప్తి నీ చేతుల్లో ఉంటాయి.  "


"అంటే మాస్టారు.. ఆత్మసాక్షాత్కారం, సంపద లేదా హోదాను సంపాదించడం మాత్రమే కాదు. జీవితం అర్థాన్ని కనుగొనడం అని అర్థం అయ్యింది. కానీ ఎలా ఎప్పుడు ఈ స్థితికి వొచ్చామూ తెలుసుకోవటం ఎలా?"


"ఏ క్షణంలో నువ్వు డబ్బుతో కొనలేనివి ఉన్నాయని గుర్తిస్తావో అప్పుడు నువ్వు ఈ స్థితికి వొచ్చినట్టు .  అది ఎవరూ చెప్పరు నీకే తెలుస్తుంది "


"మరి ఎలా దానిని సాధిచడం "


"ఆత్మసాక్షాత్కారం అనేది నువ్వే అన్వేషించాలి, ఎప్పుడో వదిలేసిన, నీ అభిరుచులు, నువ్వు చెయ్యాలనుకున్నవి ఆలోచించు, ఏ పని నీకు మళ్ళీ మళ్ళీ చెయ్యాలనిపిస్తుందో, ఎప్పటికీ విసుగురాదో ఆ పని చెయ్యి. కొంతమందికి, చక్కని కవిత వింటేనో, రాస్తేనే, వొస్తుంది. కొంతమందికి సంగీతం, కొంతమందికి రచనలు రాయటంలోనూ, చదవటంలోనూ .. మరికొంతమందికి మరోవిధంగా ..  ఇలా ఒకొక్కరికి ఒక్కోవిధమైన పని ద్వారా వారి మనసుని ఈ స్థితికి చేర్చుతారు. 


ప్రజాపతి ఆలోచనలో ఉండిపోయాడు.. 

కృష్ణారావు మాస్టారు, చెప్పటం కొనసాగించారు లెక్చరర్ అవటం వలన అలా అలుపులేకుండా మాట్లాడగలుగుతున్నారు . 


"ఓప్రా విన్‌ఫ్రే, తెలుసా, టీవీ లో చూసే ఉంటావు. ఆమె ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి, తన మీడియా కెరీర్ ద్వారా అపారమైన సంపద, కీర్తిని సాధించింది.  ఆ తరువాత, ఇతరులను ప్రేరేపించడానికి, ఉద్ధరించడానికి 'ఓప్రా విన్‌ఫ్రే నెట్‌వర్క్‌ను' సృష్టించడం ద్వారా ఆత్మసాక్షాత్కారంను సాధించింది.  


అలానే బిల్ గేట్స్, వారెన్ బఫెట్, ఇంకా మన ధీరుభాయి, అజీమ్ ప్రేమ్‌జీ ఇలా ఎంతోమంది, ముందు భౌతిక అవసరాలు దగ్గర మొదలుపెట్టి సంపదను సాధించి, ఆ తరువాత ఆత్మసాక్షాత్కారంను సాధించారు.  చూడు నువ్వు నీకోసం ఏమి చెయ్యగలవొ?"


దేశానికి నీలాంటి వారు ఇంకా ఇంకా కావాలి, నీ ప్రయాణాన్ని ఆనందించు, నీ విజయాన్నికాదు. ఎందుకంటె ఆ క్షణం కొంతసేపే. ఎప్పుడైతే నువ్వు నీ ప్రయాణాన్ని ఆనందిస్తావో ప్రతి ప్రయాణం ఆనందంగానే ఉంటుంది . " అని బుజం మీద తట్టి కృష్ణారావు గారు వెళ్లిపోయారు.  

కొంచెం దూరం వెళ్లిన కృష్ణారావు మాస్టారు మళ్ళీ వెనక్కు వొచ్చి ప్రజాపతి భుజం మీద చెయ్యవేసి ఒక్క మాట చెప్పారు. 

***

మళ్ళీ తెల్లారింది, ఈ సారి రెట్టించిన ఉత్సహం తో నిద్రలేచాడు ప్రజాపతి, స్పష్టమైన లక్ష్యం వున్నప్పుడు కలిగే ఉత్సహం అది, ఆ పనిని నెరవేర్చేపనిలో నిమగ్నమవడానికి సంసిద్దుడై బయలుదేరాడు ప్రజాపతి. 


మరికొద్దికాలంలోనే ప్రజాపతి 'కృష్ణ' ఫౌండేషన్‌ను స్థాపించాడు, ఇది దేశంలో విద్య నాణ్యతను మెరుగుపరచడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, విద్యా వనరులను అభివృద్ధి చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను ఏర్పాటు చేయాలనే లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. 


ప్రజాపతి, తన కంపెనీ వ్యవహారాలతోపాటు వీటి పర్యవేక్షణలో మరింత బిజీగా అయిపోయాడు, కానీ ఇన్నాళ్లు లేని తృప్తి ఇప్పుడువుంది ప్రజాపతికి, రాజు ని ఒప్పించి, తన ఫౌండేషన్ ద్వారా యూనివర్సిటీలో చేర్పించాడు.  కృష్ణ ఫౌండేషన్ ద్వారా బాగుపడిన ప్రతివ్యక్తి ప్రజాపతికి ఒక ఎనలేని తృప్తిని అందజేయసాగాడు . 

ఆ రోజు కృష్ణారావు గారు వెళ్ళిపోతూ అన్న మాట ప్రజాపతి జీవితాన్ని తృప్తిగా మార్చేసింది. 


"ఆత్మసాక్షాత్కారం అనేది జీవన యాత్రలో శిఖరాన్ని అధిరోహించటం, అది జీవిత చరమాంకం కాదు. అది ఒక నూతన అధ్యాయం. అది మలి వయసు కాదు, ఒక చైతన్యదాయకమైన దశ ఆ శిఖరాగ్రాన్ని చేరే ప్రయత్నం చెయ్ " 

***

కిరణ్ జమ్మలమడక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



ree

రచయిత పరిచయం: Dr: కిరణ్ జమ్మలమడక

 డా. కిరణ్ జమ్మలమడక , కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పట్టా పొందారు.ప్రస్తుతం GE  హైదరాబాద్ లో  సీనియర్ సాఫ్ట్వేర్ మేనేజర్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. "స్ప్రింగ్" అనే సంస్థ ను స్థాపించి, తద్వారా విద్యార్థులకు మోటివేషనల్, లైఫ్ కోచింగ్ తరగతులను  నిర్వహిస్తూవుంటారు. పిల్లలు , పెద్దలు  ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం తో ముందుకు సాగాలనే ఉద్దేశం తో  కథలు రాయటం కూడా మొదలుపెట్టారు.  "చినుకు","ఆంధ్రభూమి", "తెలుగు వెలుగు ", "తానా","ఖమ్మం ఈస్థటిక్స్" మొదలైన ప్రముఖ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో ఈయన కథలు బహుమతి సాధించాయి. ఆ కథల్లో మిరప మొక్క , మోహపు మరకలు,ఆమె అతడిని జయించెను,  యాత్ర (పిల్లల బొమ్మల పుస్తకం ) మరియు  అతీతం, అస్తిత్వం అనే సైన్స్ ఫిక్షన్ (నవలలు) ప్రేక్షకాదరణ పొందాయి. మరికొన్ని కథలు అంతర్జాలం మాధ్యమం లో కూడా ప్రచురితమయ్యాయి.


Comments


bottom of page