బాల గేయాలు - త్యాగమూర్తి తల్లి
- Gadwala Somanna

- May 13
- 12 min read

Bala Geyalu - Tyagamurthi Talli | Gadwala Somanna
బాల గేయాలు - త్యాగమూర్తి తల్లి | గద్వాల సోమన్న
Published in manatelugukathalu.com on 13/05/2026
త్యాగమూర్తి తల్లి
-------------------------------
అమ్మ ఒడిలో హాయిగా
మల్లెపూల పాన్పుగా
ఉంటుంది ఖచ్చితంగా
అందరికి విదితమేగా
అమ్మ మనసు చల్లగా
మంచులాగ తెల్లగా
ఉంటుంది పుత్తడిలా
వజ్రంలా గొప్పగా
అమ్మ ఇంట దీపంలా
ప్రేమకు ప్రతిరూపంలా
ఉంటుంది స్వర్గంగా
దేదీప్యామానంగా
అమ్మ అనురాగ దేవత
మరచిపోదు తన బాధ్యత
నిశ్చలమైన మనసుతో
గౌరవించు అంచేత

పూల ఆదర్శము
-------------------------------
పూలలోని సుగంధము
దానిలోని మకరందము
ఎంత దాచినా దాగవు
ఏవీ సమానం కావు
పిల్లల్లా చక్కదనము
పూలకుంది గొప్పదనము
అందరికీ ఉపయోగము
వాటి సేవ అసమానము
పూలలోని త్యాగగుణము
ఎందరికో ఆదర్శము
అన్నింటా తొలి స్థానము
కడు అభినందనీయము
పువ్వుల్లా వికసిస్తూ
చిరునవ్వులు చిందిస్తూ
గొప్పగా జీవించాలి
స్ఫూర్తినే కల్గించాలి

చక్కని చిక్కని మాటలు
-------------------------------
కోపాన్ని చల్లార్చును
స్నేహాన్ని హెచ్చించును
ప్రేమలొలుకు పలుకులు
క్షమించే హృదయాలు
జ్ఞానాన్ని కలుగజేయును
సన్మార్గం చూపించును
గురుదేవుల బోధనలు
జీవితాన్నే మార్చును
గౌరవాన్ని పెంచుతుంది
మోదాన్ని పంచుతుంది
విలువైన క్రమశిక్షణ
జీవితాల్లో రక్షణ
అలంకరణే వినయము
ఉదయించే రవి కిరణము
అహంకారం నాశనము
అదుపు చేస్తే క్షేమము

బడి గంట మా నేస్తం!
-------------------------------
అందమైన మా బడికి
అక్షరాల అమ్మ ఒడికి
పలుకుతుంది ఆహ్వానము
బడి గంట మధుర స్వరము
మాకెంతో ప్రియము ప్రియము
వీనులకు పర్వదినము
బడి గంట తీయని పిలువు
బ్రతుకుల్లో మేలుకొలుపు
బడి గంట మా నేస్తము
త్యాగానికి అది చిహ్నము
గంట గంటకు మ్రోగుతూ
ప్రేమగా పలుకుతుంది
కాలం విలువ తెలుపును
క్రమశిక్షణ ఇల నేర్పును
విద్యార్థులకు ఉపకారము
అందించును సహకారము

శ్రేష్టమైన పలుకులు
-------------------------------
మేలు చేసిన వారికి
కీడు చేయకూడదు
నోరు లేని వాటిని
హింసపెట్టకూడదు
తెలివి కల్గినవాడు
ఏలుబడే చేయును
అదే లేని నాడు
బానిసగా బ్రతుకును
దైవాన్ని వీడితే
దయ్యాన్ని చేరితే
మోక్షానికి దూరము
బ్రతుకులగును ఘోరము
ఆత్మీయ బంధమే
అనురాగ గంధమే
ముగ్ధమనోహరమే
మెడలోన హారమే

నిప్పులాంటి నిజాలు
-------------------------------
పేదలను వెక్కిరిస్తే
దైవాజ్ఞ దిక్కరిస్తే
భగవంతునికి కోపము
తట్టుకొనుట బహు కష్టము
మేకపోతు గాంభీర్యము
గర్వాంధుల లక్షణము
మహనీయుల ఆభరణము
ఖచ్చితంగా వినయము
బహుమతి పిత్రార్జితము
దీవెన కష్టార్జితము
రెండు కూడా శ్రేష్ఠమే
పొందినచో క్షేమమే
భగవంతుని ఆశీస్సులు
అవసరమే బ్రతుకులో
అడుగడుగునా శుభములు
వెంబడించు జగతిలో

వీరితో జాగ్రత్త!!
-------------------------------
అర్ధం చేసుకోలేని
లోపాలు వెదకు వారిని
స్నేహించుట అనవసరము
హానికరమైన వాటిని
బంధం విలువ తెలియని
నైతిక విలువలు లేని
మానవత్వమే లేని
వారితో కడు జాగ్రత్త
కఠినమైన మనసులతో
ప్రేమలేని మనుషులతో
సరికాదు సహవాసము
మిగులునోయి! వనవాసము
ఉపయోగమే ఉండాలి
మంచితనమే పండాలి
లేకపోతే జీవితము
ఎండమావుల సమానము

మనిషిలో ఎక్కడ?
------------------------------
కోకిలమ్మ గానంతో
నెమలమ్మ నాట్యంతో
అలరించును హృదయాలు
చిలుకమ్మ పలుకులతో
కొలనేమో కలువలతో
గగనమేమో తారలతో
అలరించును హృదయాలు
తోటేమో పూవులతో
దివ్వెలేమో వెలుగులతో
మువ్వలేమో రవళులతో
అలరించును హృదయాలు
పువ్వులేమో తావులతో
అన్ని కూడా సృష్టిలో
పరోపకారం చాటును
జీవమున్న మనిషిలో
ఎండమావులే అగును

అక్షర సత్యాల సరాలు
-------------------------------
మోసం చేసే గుణము
హానికరమైన తత్వము
ఎప్పటికైనా ప్రమాదము
వీడితే ప్రయోజనము
నీతి లేని జీవితాలు
నూనె లేని దీపాలు
పరికింప విడ్డూరము
అక్షరాలది సత్యము
అమూల్యమైన బాల్యము
ముత్యంలా బహు శ్రేష్టము
మనిషి వివిధ దశల్లో
అత్యంత కీలకమే
జీవితాల్లో భాగ్యము
స్నేహానికి మించినది
సృష్టిలోనే కానరాదు
గౌరవానికి మూలము
వెన్నుపోటు పొడవరాదు
==============================

Bala Geyalu - Chaduvukunna Balika | Gadwala Somanna
బాల గేయాలు - చదువుకున్న బాలిక | గద్వాల సోమన్న
Published in manatelugukathalu.com on 07/05/2026
ఆడపిల్ల చదువుకుంటే ఒక కుటుంబమే కాదు, సమాజమంతా వెలుగొందుతుంది అనే సందేశాన్ని హృద్యంగా తెలియజేసే అందమైన బాలగేయం ఇది. గద్వాల సోమన్న గారి “చదువుకున్న బాలిక” కవితలో బాలిక గొప్పతనం, విద్య ప్రాముఖ్యత, సమానత్వ అవసరం ఎంతో సరళంగా, మధురంగా వ్యక్తమయ్యాయి.
చదువుకున్న బాలిక
-------------------------------
అందమైన మాలిక
అవనిలోన బాలిక
ఇంటిలోన దీపిక
మింటిలోన తారక
ఆడపిల్ల భాగ్యము
సదనంలో క్షేమము
ఆమె ఉన్న గృహమున
చిందును అనురాగము
చదువుకున్న బాలిక
అవుతుందోయ్! ఏలిక
సాధించును విజయము
బాగుపడును కుటుంబము
వివక్షత మానాలి
సమన్యాయం చేయాలి
ఆడపిల్ల ఉన్నతికి
ముందడుగు వేయాలి

అనురాగ దేవత అమ్మ
-------------------------------
ఉంటే బద్ధకంగా
అంతులేని నష్టమే
ఉంటేనే చురుకుగా
ఎంతైనా లాభమే
అమ్మ మహా కావ్యమే
అసమానము త్యాగమే
అవనిలోన చూడగా
ఆదర్శము ఆమెగా
నిలువెల్లా అనురాగము
అమ్మ ఇంట ఆనందము
మనసారగ సేవిస్తే
దీవెనలే పుష్కలము
అమ్మలాగ సృష్టిలో
వెదికినా కానరారు
భగవంతుని దృష్టిలో
ఆమెకెవరు సాటిరారు

సుభాషిత రత్నాలు
-------------------------------
పేదలపై కనికరము
చూపాలి చూపాలి
మనసులోన కలవరము
తరమాలి తరమాలి
మాటలోని మాధుర్యము
పంచాలి పంచాలి
నలుగురికి ఆదర్శము
చూపాలి చూపాలి
దేవునిపై నమ్మకము
పెట్టాలి పెట్టాలి
పవిత్రమైన నామము
స్మరించాలి స్మరించాలి
శ్రమించాలి నిరంతరము
గడపాలి సుఖజీవనము
మారాలి ఉన్నతంగా
అమూల్యమైన జీవితము

స్ఫూర్తిగా నిలవాలి
-------------------------------
ఉన్నప్పుడు ఆకలిగా
పెట్టాలి ఆహారము
పదిమందికి మాదిరిగా
ఉంటేనే జీవితము
ఉండాలి నిజాయితీగా
జీవితంలో గొప్పగా
మాటల్లో నిలకడగా
లోకంలో సాక్షిగా
బంధాలను పదిలంగా
ఇల నిలబెట్టుకోవాలి
మహనీయులను స్ఫూర్తిగా
తప్పక తీసుకోవాలి
అన్నింటిలో మితంగా
బ్రతుకులో గౌరవంగా
ఉండి నిరూపణ చేయాలి
వెండి వెన్నెల కావాలి

పెద్దయ్య సూక్తులు
-------------------------------
ఉదార స్వభావంతో
తరిమికొట్టు లోభత్వము
గొప్ప క్షమాగుణంతో
జయించాలి శత్రుత్వము
పెద్దదైతే ఆశయము
అడుగడుగునా అడ్డంకులు
ఎదుర్కొంటే విజయము
దక్కుతుంది గౌరవము
శాంతగుణంతో కోపము
అధిగమిస్తే లాభము
పెట్టుకోకు విరోధము
కోల్పోకు సంతోషము
పెంచుకో ఆశావాదము
తరిమికొట్టు పిరికితనము
రేపటి తరం కోసము
ఇవ్వాలి వర్తమానము

చిన్నోడు సూక్తులు
-------------------------------
మనసులోని మంచితనము
మాటలోని గొప్పదనము
ఇల ఉపయోగమవ్వాలి
ఉపాధ్యాయుల జ్ఞానము
ఉన్నోళ్లకు కష్టాల్లో
పీకల లోతు నష్టాల్లో
సహకారమందించాలి
ఉపకారమే చేయాలి
ఇరుగుపొరుగు వారితో
ఉండాలి సఖ్యతతో
వివేకం కల్గియుండి
వీలైతే సభ్యతతో
ఆడవద్దు బంధాలతో
ఏమాత్రం యే ఆటలు
సంకుచిత మనసులతో
పాడు చేసుకోకు బ్రతుకులు

పరహితం కోరేవి
-------------------------------
పూలలోని తావులు
పాలలోని సొగసులు
మురిపించును మనసులు
కొలనులోని కలువలు
కన్నవారి ప్రేమలు
గురుదేవుల బోధలు
మరిపించును బాధలు
బాగు చేయు బ్రతుకులు
నీటిలోని చేపలు
సదనంలో పిల్లలు
ఉంటేనే కళకళ
తారల్లా మిలమిల
చెట్టులోని ఫలములు
అల్లుకున్న తీగలు
చాలా ఉపయోగము
కోరునోయ్! పరహితము

అమ్మమ్మ సూక్తులు
-------------------------------
దేవుని కటాక్షము
ఉన్నవాడు ధన్యుడు
అట్టి వారి జీవితము
అందరికాదర్శము
వినయమే కిరీటము
బ్రతుకులో ఉన్నతము
కల్గియుంటే గనుక
వారికదే కానుక
పసి పిల్లల తలపులు
మేలి పసిడి కాంతులు
వారి నోటి పలుకులు
జాలువారు తేనెలు
నిజమాడే పెదవులు
ప్రేమలొలుకు మనసులు
భగవంతునికిష్టము
మేలు చేయు మనుషులు
================================

Bala Geyalu - Nashtame kadu nashtame | Gadwala Somanna
బాల గేయాలు - నష్టమే కడు కష్టమే | గద్వాల సోమన్న
Published in manatelugukathalu.com on 02/05/2026
పిల్లల మనసుల్లో మంచి విలువలను నాటే శక్తి బాల గేయాల్లో ఉంటుంది. ఈ గేయం స్నేహం, కృతజ్ఞత, జాగ్రత్త, విచక్షణ వంటి ముఖ్యమైన జీవిత పాఠాలను సులభంగా అర్థమయ్యేలా చెబుతుంది.
నష్టమే కడు కష్టమే
-------------------------------
కష్టాల్లో తోడుగా
నష్టాల్లో సాయంగా
ఉన్నోళ్లను మరచిపోకు
కృతఘ్నడుగా ఉండిపోకు
ఎప్పుడూ స్నేహితులను
విద్య నేర్పిన గురువులను
నిర్లక్ష్యం చేయబోకు
ప్రేమించే వ్యక్తులను
గుణం లేని వారితో
నష్టపరచే వాటితో
ఉండాలి జాగ్రత్తగా
విచక్షణ జ్ఞానంతో
కడు రాగద్వేషాలతో
ఇల కోపతాపాలతో
చాలా చాలా నష్టమే
అడుగడుగునా కష్టమే

విజ్ఞాన జ్యోతులు పుస్తకాలు
-------------------------------
చదివితే పుస్తకాలు
వెలుగుతాయి మస్తకాలు
విజ్ఞానం ఆర్జిస్తే
ఎదుగుతాయి జీవితాలు
పుస్తకాల తోటలో
విజ్ఞానపు కోటలో
బాగుపడును జీవితాలు
సాక్ష్యమే అక్షరాలు
పరికింపగ పుస్తకాలు
జీవితాన భూషణాలు
చీకట్లు తరిమికోట్టే
కాంతులీను కాగడాలు
పుస్తకాల పరిచయమే
మార్చు జీవన విధానము
అక్షరాల సత్యమే
ఎక్కించును అందలము

అక్షరాల సందేశం
-------------------------------
క్షమాగుణంతో వైరము
ఘన శాంతంతో కోపము
చిత్తు చిత్తు చేయొచ్చు
పొందవచ్చును విజయము
నవనీతమే హృదయము
చేయకూడదు గాయము
విలువైనదే కాలము
వాడకపోతే నష్టము
అమూల్యమైనది స్నేహము
ఎప్పుడు చేయకు ద్రోహము
మన వారైనా న్యాయము
తప్పకూడదు నేస్తము
తల్లిదండ్రుల ఋణమును
తీర్చుకోవాలి తప్పక
గురుదేవులను ఆజ్ఞను
పాటించాలి మానక

పంతులమ్మ సందేశం
-------------------------------
చాటాలి మంచితనము
బ్రతుకులో గొప్పతనము
అందరితో నవ్వుతూ
పొందాలి సంతోషము
పోవాలి అల్పగుణము
రావాలి శ్రేష్టగుణము
కలసిమెలసి జీవిస్తూ
వేయాలి ప్రగతి పథము
వీడాలి అలసత్వము
తరమాలి సోమరితనము
చురుకుదనము చూపుతూ
మెలుకువలు పాటిస్తూ
మానాలి దానవత్వము
నింపాలి మానవత్వము
మనుషులంతా ఒక్కటని
చేయాలి సమన్యాయము

అక్షరాల హితవు
-------------------------------
కష్టాలకు క్రుంగిపోవద్దు
భయాలకు బెదరిపోవద్దు
సడలని ఆత్మవిశ్వాసంతో
బ్రతకాలి మందహాసంతో
చేసిన మేలులు మరువవద్దు
పెద్దల మాటలు మీరవద్దు
గురువులు చూపే మార్గంలో
బాగుపడాలి జీవితంలో
పిరికితనమే చూపవద్దు
అల్పగుణంతో మారవద్దు
సూర్య కిరణమై ప్రసరిస్తూ
ఉండాలి స్ఫూర్తిని పంచుతూ
తృణీకారమే చేయవద్దు
చెప్పుడు మాటలు వినవద్దు
జీవించాలి విచక్షణతో
సాగాలి హుందాదనంతో

పెద్దయ్య హితోక్తులు
-------------------------------
పిల్లకు చదువుతో పాటు
నేర్పాలి సంస్కారము
ఇక ఉండదు తడబాటు
వెలుగుమయమే జీవితము
బాలలకు మనోధైర్యము
నింపాలి గుండెల్లో
ఏమాత్రం పిరికితనము
ఉండరాదు బ్రతుకుల్లో
భరతమాత గొప్పతనము
తెలుగుభాష చక్కదనము
అడుగడుగునా తెలపాలి
భువిలో చాటి చెప్పాలి
తల్లిదండ్రుల విలువను
పెద్దల యెడల గౌరవమును
ఆణువణువూ ఉండాలి
పిల్లలకు స్ఫూర్తినివ్వాలి

చిన్నారులు చిరుదివ్వెలు
-------------------------------
మధురమైన గీతాలు
అందమైన కుసుమాలు
కదిలించును హృదయాలు
గంభీరమైన భావాలు
చిన్నారుల నయనాలు
సున్నితమైన పాదాలు
ముగ్ధమనోహరం కదా
ఇది గమనార్హం సదా
పసి పిల్లలు ముత్యాలు
వారి నోట సత్యాలు
కనువిందు చేయునోయి!
ముద్దులొలుకు వదనాలు
చిన్నారుల యోచనలు
సిరిమల్లెల సువాసనలు
అతి పవిత్రం మనసులు
తేనెలాంటివి పలుకులు
చిన్నారులు చిరుదివ్వెలు
మ్రోగేటి సిరిమువ్వలు
విహరించే విహంగాలు
ప్రగతికి పట్టుకొమ్మలు

అమ్మ సందేశం
-------------------------------
ఉన్నతంగా చదివితే
విజ్ఞానం ఆర్జిస్తే
బ్రతుకు బాగుంటుంది
భవిత బంగారమవుతుంది
జీవితంలో ఎదిగితే
వినయంతో ఒదిగితే
ఎక్కవచ్చు అందలము
పొందవచ్చు గౌరవము
కష్టించే తత్వమే
ఎదిగేందుకు మార్గమే
తెలుసుకో ఈ సత్యము
శ్రమించాలి అనునిత్యము
జన క్షేమం కాంక్షిస్తే
వారి సేవ చేసేస్తే
జన్మ సార్ధకమవుతుంది
ఇల ఆదర్శమవుతుంది

సహజమే లోటుపాట్లు
-------------------------------
మనుషుల్లో తప్పోప్పులు
అదే పనిగా వెదకొద్దు
వారిలోని సుగుణాలు
తీసుకొనుట మరువొద్దు
అందమైన గులాబీకి
ఒళ్ళంతా ముల్లులే
ఆ ఎర్రని గురివిందకు
తన కింద నల్ల మచ్చే
సహజమే లోటుపాట్లు
జీవితాన ఆటుపోట్లు
తట్టుకుంటే మాత్రమే
అడుగడుగునా విజయమే
దిద్దుకుంటే పొరపాట్లు
అవుతారు మహనీయులు
తప్పుతాయి ఆగచాట్లు
బాగుండును కుటుంబాలు

అవ్వాతాతల సూక్తులు
-------------------------------
చిన్న చిన్న తప్పులు
చివరికవే నిప్పులు
అధికమైతే గనుక
తగలబెట్టు బ్రతుకులు
పొరపాట్లు సహజమే
దిద్దుకున్న గౌరవమే
అవుతారు పుణ్య పురుషులు
భువిలో ఆదర్శమూర్తులు
వహిస్తే నిర్లక్ష్యము
అడుగడుగునా కష్టము
దైనందిన జీవితాన
పూడ్చలేని నష్టము
చిన్నవే అనుకుంటే
అతిపెద్ద పొరపాటే
ఆదిలోనే త్రుంచితే
ఎంతైనా మంచిదే!

అవయవాలతో పోరాటం
-------------------------------
మసున ఆశ తీరదు
మనిషి ఆకలి చావదు
వీటికై ఆరాటము
నిత్యమూ పోరాటము
కంటికి తృప్తే లేదు
ఎన్నెన్నో చూసినా
కడుపుకు అలుపే రాదు
ఎంతెంత భుజించినా
అవయవాల్లో సమరము
కడలి ఘోష రీతిలో
సంగ్రామమే సతతము
మనసుల్లో జగతిలో
విజేతలే కావాలి
ఇంద్రియాల పోరులో
సంతృప్తే రావాలి
చిన్న పాటి బ్రతుకులో

చూడంగా తప్పు! తప్పు!
-------------------------------
మాయమాటలు చెప్పడము
పరుల సొమ్మ ఆశించడము
చూడంగా తప్పు! తప్పు!
చేస్తే నమ్మక ద్రోహము
వివక్షతయే చూపడము
ఎగతాళే చేయడము
చూడంగా తప్పు! తప్పు!
మానవత్వం మానడము
పరనిందలు వేయడము
బద్ధకంగా ఉండడము
చూడంగా తప్పు! తప్పు!
కలహాలకు పోవడము
చెడు స్నేహం కోరడము
అగౌరవం తేవడము
చూడంగా తప్పు! తప్పు!
మిత్రులను కోల్పోవడము
===================================

Bala Geyalu - Amma Mata Pasidi Muta | Gadwala Somanna
బాల గేయాలు - అమ్మ మాట - పసిడి మూట | గద్వాల సోమన్న
Published in manatelugukathalu.com on 30/04/2026
అమ్మ మాట… ప్రేమతో నిండిన మార్గదర్శకం.
పిల్లల జీవితాన్ని మలిచే పసిడి బాట.
ఈ గేయం తల్లి గొప్పతనాన్ని సున్నితంగా తెలియజేస్తుంది.
అమ్మ మాట - పసిడి మూట
-------------------------------
అమ్మ మాట కమనీయము
అందమైన పూలవనము
అవనిలోన చూడగా
అత్యంత ఆహ్లాదము
అమ్మ మాట చల్లదనము
మదికెంతో ఆనందము
ఆమెలోని గొప్పతనము
అందరికీ ఆదర్శము
ఎదిగేందుకు అమ్మ మాట
అవుతుంది పసిడి బాట
ఆమె ఇంట కంచుకోట
తరిగిపోని ప్రేమ మూట
అనురాగ దేవత అమ్మ
అభివృద్ధికి పట్టుకొమ్మ
త్యాగానికి మారుపేరు
మన క్షేమము కోరు కోరు

తప్పదు మరి!!
-------------------------------
మెరవాలంటే వజ్రంలా
ఒత్తిడినే ఓడించాలి
మారాలంటే పుత్తడిలా
నిప్పుల కొలిమిలో కాలాలి
కావాలంటే ముత్యంలా
పిల్లల నోట సత్యంలా
సదా శ్రమించాలి చీమలా
తీపి పంచు తేనెటీగలా
వెలగాలంటే దీపంలా
కరగాలంటే క్రొవ్వొత్తిలా
త్యాగగుణమే విరియాలి
మంచితనమే కురియాలి
అవ్వాలంటే జాబిలిలా
మిలమిల మెరిసే తారకలా
రైతన్నలా కష్టించాలి
భగీరథునిలా ఉండాలి

అన్నీ సత్యాలే!!
-------------------------------
అలవాట్లు మారితే
జీవితం మారుతుంది
సమైక్యత కోరితే
అనుబంధం పెరుగుతుంది
పొరపాట్లు దిద్దితే
మహనీయులు అవుతారు
క్షమాగుణం చూపితే
మిత్రులుగా మారుతారు
నిర్లక్ష్యం వీడితే
అభివృద్ధి జరుగుతుంది
చురుకుదనం చాటితే
పని పరిపూర్తి అవుతుంది
ఒత్తిడినే జయిస్తే
ప్రశాంతత దొరుకుతుంది
పట్టుదల సొంతమైతే
విజయం చేకూరుతుంది

చిరునవ్వులు అందము
-------------------------------
చిరునవ్వులు వదనంలో
తారకలు గగనంలో
పువ్వుల్లా వెదజల్లును
అందాలే మనిషిలో
చిందిస్తే చిరునవ్వులు
జీవితంలో వెలుగులు
పలకరిస్తే ప్రేమగా
బలపడునోయ్! బంధాలు
చిరునవ్వు గొప్పతనము
ముఖంలో చక్కదనము
ఎంతైనా లాభకరము
సమకూరును ఆరోగ్యము
ఖర్చులేని దరహాసము
బ్రతుకుల్లో మధుమాసము
వ్యాధి బాధలు దూరము
తగ్గించు గుండె భారము

స్ఫూర్తినే ఇవ్వాలి
-------------------------------
బాధలను తట్టుకుని
జీవితాన్ని నెట్టుకుని
గెలవాలి గెలవాలి
ధైర్యం పెట్టుకుని
బంధాలు పెంచుకుని
బాధ్యతలు పంచుకుని
సమైక్యత రావాలి
అభివృద్ధి జరగాలి
కష్టాలు ఎదుర్కొని
కన్నీళ్లు మ్రింగుకుని
విజేతలే కావాలి
విజయ గీతి పాడాలి
గొప్పగా చదువుకుని
విజ్ఞానం పొందుకుని
ఉన్నతంగా ఎదగాలి
స్ఫూర్తినే ఇవ్వాలి

అక్షరాల సత్యం
-------------------------------
ధర్మమే అడుగులకు
వెలుగులు పంచుతుంది
నీతి, నిజాయితీలే
బలంగా నిలుస్తుంది
నిరంతర పరిశ్రమ
లక్ష్యాన్ని చేర్చుతుంది
జీవితంలో భ్రమ
వాస్తవాన్ని తరుముతుంది
నిశ్చలమైన భక్తి
మోక్షాన్ని ఇస్తుంది
అంతరంరాన శక్తి
అన్నీ సాధిస్తుంది
నీలోని మంచితనము
ఘనమైన దైవగుణము
సదా కాపాడుతుంది
అక్షరాల సత్యమిది

అవ్వాతాతల హిత వచనాలు
-------------------------------
అగ్నిలాంటి అవమానము
హృదయాలను దహిస్తుంది
పెనుభూతం అనుమానము
అనుక్షణం వేధిస్తుంది
అమూల్యమైనది స్నేహము
జీవితాన బహుమానము
భగవంతుని దివ్య వరము
తలపెట్టకు ఇల ద్రోహము
అల్పగుణము వెటకారము
చేయొద్దు తృణీకారము
చేతనైతే ఉపకారము
అందించుము సహకారము
ఉన్నతమే క్షమాగుణము
ఉంటేనే క్షేమకరము
తరిమికొట్టును వైరము
సృష్టించును ప్రేమవనము

బ్రతుకున క్షేమం ఉండదు
-------------------------------
ఒకరి మనసు నొప్పిస్తే
మాటలతో వేధిస్తే
బ్రతుకున క్షేమం ఉండదు
దయ్యంలా పీడిస్తే
పరుల సొమ్మ ఆశిస్తే
దొమ్మిగా దోచేస్తే
బ్రతుకున క్షేమం ఉండదు
వెన్నుపోటు పొడిస్తే
హీనంగా యోచిస్తే
న్యాయాన్ని తొక్కేస్తే
బ్రతుకున క్షేమం ఉండదు
పేదోళ్లను హింసిస్తే
అధర్మం వెంబడిస్తే
దైవాన్ని మరచిపోతే
బ్రతుకున క్షేమం ఉండదు
కన్నోళ్లను సాధిస్తే

పరిగణలోకి తీసుకోవాలి!
-------------------------------
జీవితాన సమస్యలకు
ఉంటుంది పరిష్కారము
మితిమీరిన కలతలకు
మనశ్శాంతి బహు దూరము
పనికిమాలిన పనులకు
తిలోదకాలివ్వాలి
మంచి మంచి తలపులకు
స్వాగతమే పలకాలి
వయసులోన పెద్దలకు
గౌరవమే ఇవ్వాలి
ఇలలో తల్లిదండ్రులకు
తొలి స్థానమే ఉండాలి
మహనీయుల మాటలను
గురుదేవుల బోధలను
శ్రద్ధగా ఆలకించాలి
ఆచరణలో పెట్టాలి

అక్షరాల ఆకాంక్ష
-------------------------------
జీవితాన ధైర్యము
శిఖరమంత సహనము
కల్గియుంటే గనుక
దాసోహం విజయము
రానప్పుడు సమయము
మంచిదేగా మౌనము
ఎదుగుటకు బ్రతుకులో
వెలుగుటకు జగతిలో
సృష్టిలోన దైవము
వెలుగుతున్న దీపము
బలిష్టమైన దుర్గము
మోక్షానికి మార్గము
నవ్వులొలుకు వదనము
చూడ చంద్రబింబము
వెదజల్లును అందము
పంచిపెట్టు మోదము
=======================================

Bala Geyalu - Avva Cheppina Animuthyalu | Gadwala Somanna
బాల గేయాలు - అవ్వ చెప్పిన ఆణిముత్యాలు | గద్వాల సోమన్న
Published in manatelugukathalu.com on 23/04/2026
అవ్వ చెప్పిన మాటలు జీవితానికి మార్గదర్శకం.
చిన్న విలువలే గొప్ప విజయానికి పునాది.
అవ్వ చెప్పిన ఆణిముత్యాలు
--------------------------
లోపాలను దిద్దితే
దీపాలే అవుతారు
కోపాన్ని వదిలేస్తే
ఆరోగ్యంగా ఉంటారు
శత్రుత్వము వీడితే
స్నేహితులే అవుతారు
జన క్షేమం కోరితే
జగతి ప్రగతి తెస్తారు
విజ్ఞానం పొందితే
ఘనంగా ఎదుగుతారు
పుస్తకాలు చదివితే
వినోదం పొందుతారు
పెద్దలను గౌరవిస్తే
పేదలను ఆదరిస్తే
వృద్ధిలోకి వస్తారు
కష్టపడి పని చేస్తే

పసి పిల్లలు పరమాత్ములు
--------------------------
పసి పిల్లల చిరునవ్వులు
విరబూసిన మరుమల్లెలు
పరిమళాలు వెదజల్లే
అందమైన కుసుమాలు
చిన్నారుల హృదయాలు
లేలేత గులాబీలు
వారి చిన్ని నయనాలు
ముద్దులొలుకే కలువలు
పసి పిల్లల పలుకులే
జంటితేనె ధారలే
మనసులను కదిలించే
కవీంద్రుల కవనాలు
బాలల ఆలోచనలే
సృజనాత్మకతకు గురుతులు
చిన్ని చిన్ని నడకలే
హంసమ్మ పోలికలే

దైవమే సర్వము
--------------------------
లేకుంటే దైవమే
సృష్టి ఎలా నడుస్తుంది
చీకటి అగును లోకమే
అవుతుంది నాశనమే
సర్వానికి ఆధారము
సకల లోక రక్షకుడు
విశ్వ మానవ ప్రేమికుడు
దరి చేరితే స్నేహితుడు
కొలవాలి హృదయంతో
నిర్మలమైన భక్తితో
అవుతాడు సన్నిహితుడు
బ్రతుకులోన భగవంతుడు
నమ్మదగిన దేవుడు
చూడగా తేజోమయుడు
హృదయాలే మందిరము
చేయును అందు నివాసము

పిల్లలం -మల్లెలం
--------------------------
కాంతులీను దివ్వెలం
విహరించే గువ్వలం
చిన్ని చిన్ని పిల్లలం
గంతులేయు లేగలం
మ్రోగేటి మువ్వలం
వికసించే పువ్వులం
చిన్ని చిన్ని పిల్లలం
దేశానికి ఎల్లలం
పారేటి సెలయేరులం
పాడేటి కోయిలలం
తీపి పలుకు చిలుకలం
నాట్యమాడు నెమలులం
కన్నవారి శ్వాసలం
వారి కంటి వెలుగులం
ఇంటిలో కొలువైన
చిన్నారి దేవతలం

అక్షరాభిలాష
-------------------------------
ఉదయించే రవి కిరణంలా
పరిమళించే పూతావిలా
మనలోని ప్రతిభాపాటవాలు
వెలుగొందును దీపకాంతిలా
ప్రవహించే సెలయేరులా
ప్రకాశించే ధ్రువతారలా
పదిమందికి ఉపకరించాలి
జీవితం సార్ధకమవ్వాలి
పరోపకారి వృక్షంలా
కడుపునింపు అన్నదాతలా
ఆకాశమే సరిహద్దుగా
నిలవాలోయ్! ఆదర్శంగా
చేతల్లో మార్తాండునిలా
రాతల్లో కవీంద్రునిలా
చరిత్రలో స్థానముండాలి
గుండెల్లో నిలిచిపోవాలి
======================================

Jeevithalu Sathyalu - Bala Geyalu | Gadwala Somanna
జీవితాలు సత్యాలు - బాల గేయాలు | గద్వాల సోమన్న
Published in manatelugukathalu.com on 18/04/2026
పిల్లలకు చిన్నప్పుడే మంచి విలువలు నేర్పడం చాలా ముఖ్యమైనది.ఈ గేయం ద్వారా👉 మంచితనం👉 ఐకమత్యం👉 కుటుంబ ప్రేమ
అత్యంత సులభంగా, మధురంగా చెప్పబడింది.
జీవితాలు సత్యాలు
--------------------------
దుష్ క్రియలే మానితే
సత్క్రియలే పూనితే
ఎంతైనా మంచిదే
సంస్కారం పెరిగితే
విశ్వశాంతి కోరితే
విభేదాలు వీడితే
జగతి ప్రగతి ఖాయము
ఐకమత్యము చూపితే
మంచితనం చాటితే
మనిషిగా ఇల బ్రతికితే
గౌరవం పెరుగుతుంది
తెలుస్తుంది గొప్పదనము
కన్నోళ్లను ప్రేమిస్తే
కడదాకా కలుసుంటే
స్వర్గమగును కుటుంబము
స్వర్ణమయం జీవితము
👉ఈ గేయాన్ని పిల్లలతో చదివించండి 🙏👉 మంచి విలువలు పంచండి

ఉండువారు
--------------------------
కష్టాల్లో తోడుగా
బ్రతుకంతా నీడగా
ఉండువారు మనవారు
వారికెవరు సాటిరారు
దారి చూపు గురువుగా
మేలు చేయు తరువుగా
ఉండువారు మంచి వారు
ఘనతకర్హులు వారేగా
విశ్వశాంతి దూతగా
హృదయమున్న దాతగా
ఉండువారు గొప్పవారు
నడిపించే నేతగా
ఆదరించు అమ్మగా
ప్రగతి పట్టుకొమ్మగా
ఉండువారు శ్రేష్టులే!
సత్యానికి సాక్షిగా

ఆది, అంత్య ప్రాసల గేయం
-------------------------------
భుక్తి కొరకు పోరాటము
భక్తి అనిన ఆరాటము
యుక్తి ఉంటే విజయము
శక్తి ఉంటే అద్భుతము
ముద్దులొలుకు చిన్నారులు
ముద్దబంతి కుసుమాలు
శుద్ధ హృదయముంటేనే
వృద్ధియగును జీవితాలు
వెన్నెల్లాంటి పసి పిల్లలు
వెన్న రీతిలో మనసులు
మిన్న వారు సదనంలో
కన్నవారి తలపుల్లో
మల్లెపూల సువాసనలు
పల్లెసీమ అందాలు
ఎల్లరికి కడు ఇష్టులు
అల్లరి చేసే బాలలు

అమ్మమ్మ సూక్తులు
--------------------------
దైవ కృప అమూల్యము
అది రక్షణ కవచము
పొందాలి బ్రతుకులో
వెలగాలి జగతిలో
దేవునిలో ఎదగాలి
వినయంతో ఒదగాలి
దైవ కృప పొందుకుని
హాయిగా బ్రతకాలి
భక్తిగా ఉండాలి
యుక్తినే చాటాలి
శక్తితో దేవునిలో
గొప్పగా సాగాలి
మంచినే చేయాలి
ముందడుగు వేయాలి
క్రమంగా జీవిస్తూ
కనికరం చూపాలి
పూవులా విరియాలి
ప్రమిదలా వెలగాలి
నలుగురికి సాయపడి
సాక్షిగా నిలవాలి
నవ్వులే కురియాలి
నవ్విస్తూ నడవాలి
ఈ చిన్ని బ్రతుకులో
సార్ధకత నొందాలి

గేయాక్షర మాలిక
--------------------------
జీవితాన ఎక్కువ
ఉంటేనే సత్తువ
ఏదైనా సాధ్యము
తెలుసుకొమ్ము సత్యము
భాష మీద మక్కువ
పెంచుకుంటే లాభము
అల్పగుణాలు తక్కువ
చేసుకుంటే క్షేమము
మితిమీరిన హేళన
అత్యంత ప్రమాదము
మదిలో ఆందోళన
చివరికదే వేదన
పెట్టుకోకు వాదన
మానుకోకు సాధన
పెంచుకో అవగాహన
పంచుకో ఆలోచన
===================================

Prapancha Medhavi Ambedkar Garu - Bala Geyalu | Gadwala Somanna
ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు - బాల గేయాలు | గద్వాల సోమన్న
Published in manatelugukathalu.com on 14/04/2026
సమానత్వం కోసం పోరాడిన మహానుభావుడు…జ్ఞానం, ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతీక…
B. R. Ambedkar గారి మహోన్నత వ్యక్తిత్వాన్నిఈ కవిత సున్నితంగా ప్రతిబింబిస్తుంది.
ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు
-------------------------------
ప్రపంచ మేటి మేధావి
అతడే బడుగులకు భావి
ఘన రాజ్యాంగ నిర్మాత
అంబేద్కర్ మహా నేత
అపారమైన జ్ఞానము
అంబేద్కర్ గారి సొంతము
"భారతరత్న" గ్రహీత
ఇది జగమెరిగిన సత్యము
ఆత్మాభిమానమెక్కువ
బడుగులంటే మక్కువ
అంబేద్కర్ మహాశయుడు
జ్ఞానంలో అసమానుడు
బలహీన వర్గాలకు
ఆపద్భాంధవుడతడు
వారి జీవితాల్లోను
దీపమే అంబేద్కరుడు
జన్మదిన శుభాకాంక్షలు
అభినందన మాలికలు
డా.అంబేద్కర్ గారికి
అపార జ్ఞాన మూర్తికి

నోటి మాటలు
-------------------------------
తేనె కన్నా తీయనిది
కత్తి కంటే పదునైనది
జాగ్రత్త నోటి మాట
మదిని గాయం చేయునది
బంధాలను కలుపునది
హృదయాలను దోచునది
నియంత్రణ చేసుకుంటే
సంతోషం నీ వెంటే
నోటి మాటలు ముత్యాలు
పలకాలోయ్! సత్యాలు
సమయోచిత మాటలతో
దిద్దాలోయ్! కుటుంబాలు
పనికిమాలిన మాటలు
ప్రగతికవి అవరోధాలు
భగవంతునికి ఇష్టము
పవిత్రమైన యోచనలు

ఉండాలి! ఉండాలి!
-------------------------------
పనులలో నైపుణ్యము
సమస్యల పరిష్కారము
కష్టాలను ఎదురించే
గుండె ధైర్యముండాలి
పవిత్రమైన హృదయము
అనుదినము ఆనందము
జీవితాల్లో ఉండాలి
భగవంతుని కనికరము
వృత్తిలోన అంకితము
అడుగడుగునా త్యాగము
ఉండాలి మంచితనము
అదే కదా గొప్పదనము
మాటల్లో మాధుర్యము
చేతల్లో ఆదర్శము
ఉండాలి ఖచ్చితంగా
మనసుల్లో ప్రేమగుణము

బంధం బాగుండాలి!
-------------------------------
ఇంటిలోన పిల్లలతో
వయసులోన పెద్దలతో
ఉండాలోయ్! ప్రేమతో
నడవాలోయ్! గౌరవంతో
జన్మనిచ్చిన వారితో
దేవుడిచ్చిన వాటితో
కృతజ్ఞతలు తెలపాలి
సంతృప్తిగా ఉండాలి
చదువులోన శ్రద్ధతో
శ్రేష్టమైన బుద్ధితో
సమాజంలో బ్రతకాలి
ఆదర్శం చాటాలి
విద్య నేర్పు గురువులతో
మేలు చేయు తరువులతో
బంధం బాగుండాలి
సాటిలేని మిత్రులతో

ఓ అద్భుతం నాన్న
--------------------------
నాన్న గుండె బాటపై
నడక నేర్చుకున్నాను
వారి ప్రేమ కోటపై
త్యాగం తెలుసుకున్నాను
తండ్రి నోటి మాటపై
విలువ పెంచుకున్నాను
వారి నగవు మోముపై
సొగసులే ఏరుకున్నాను
నాన్న భజం పీటపై
ఒదిగి ఎదిగి కూర్చున్నాను
వారి చేతి వీణపై
రాగాలే విన్నాను
నాన్న వంటి త్యాగమూర్తి
వారు పంచు ఘన స్ఫూర్తి
ఎక్కడైనా దొరుకునా!
సదనానికి తెచ్చు కీర్తి
===============================

Kavali Kavali - Bala Geyalu | Gadwala Somanna
కావాలి! కావాలి! - బాల గేయాలు | గద్వాల సోమన్న
Published in manatelugukathalu.com on 12/04/2026
కావాలి! కావాలి!
-----------------------
వెలిగే దీపంలా
ఎదిగే వృక్షంలా
మహిలో ఉపయోగము
కావాలి జీవితము
వీచే వాయువులా
ప్రాకే పూతీగలా
నలుగురికి ఆదర్శము
కావాలి యువతరము
పారే సెలయేరులా
మెరిసే తారకలా
అందరికి సహకారము
కావాలి ఉత్తేజము
విరిసే సిరిమల్లెలా
కురిసే చిరు చినుకులా
అందరూ కావాలి
సమైక్యత రావాలి

అమ్మ మహా కావ్యము
-------------------------------
అమ్మలాంటి త్యాగమూర్తి
ఎక్కడైనా ఉండునా!
కుటుంబానికి ఘన కీర్తి
ఆమె లేక వచ్చునా!
ఇంటిలో వెలుగు దీపము
చూడగా ప్రేమ రూపము
మాతృమూర్తి జగతిలో
ముందడుగే ప్రగతిలో
అమ్మ కోయిల రాగము
గృహమున అరుణోదయము
పిల్లలకు కల్పవృక్షము
ఉన్న చోట దేవాలయము
అమ్మ ఋణం తీరనిది
ఆమె సేవలు మరువనివి
మనసేమో నవనీతము
మధురమైన సంగీతము
తల్లి లేని సదనంలో
ఎండమావి ఆనందము
చూస్తే కుటుంబంలో
అమావాస్య ఆగమనము
అమ్మే మహా కావ్యము
సృష్టిలోనే అదృష్టము
ఎన్నో జన్మల బంధము
ఉంటేనే ఆ పుణ్యము

ఆణిముత్యాలు -అక్షర సత్యాలు
-------------------------------
అడుగు ముందుకేస్తుంటే
తగ్గుతుంది దూరమే
బాధలు పంచుకుంటే
తరుగుతుంది భారమే
చిరునవ్వులు చిందిస్తే
పెరుగుతుంది అందమే
చేయి చేయి కలిపితే
వర్ధిల్లును స్నేహమే
నమ్మకమే లోపిస్తే
బలహీనమగు బంధమే
బద్ధకం ఆవహిస్తే
అభివృద్ధిక శూన్యమే
ప్రతీకారం పెరిగితే
జరుగుతుంది నష్టమే
క్షమాగుణం వీడితే
అడుగడుగునా వైరమే

పెద్దయ్య ప్రబోధ గీతం
-------------------------------
ప్రేమపూలు వికసిస్తే
క్షమాగుణం చూపిస్తే
పదిలమగును బంధాలు
వర్ధిల్లును కుటుంబాలు
అసూయ దూరమైతే
అనుబంధం దగ్గరైతే
ఆనందం హృదయంలో
కోలాహలం సదనంలో
కోపాగ్ని చల్లారితే
శాంత గుణం అలవడితే
పుష్కలం ఆరోగ్యము
సుఖమయమే జీవితము
సంస్కారం పెరిగితే
సహకారమందిస్తే
దక్కుతుంది గౌరవము
హెచ్చును హుందాదనము

త్యాగమూర్తి తండ్రి
-------------------------------
త్యాగానికి మరోపేరు
నాన్న గారు జగతిలో
మహోన్నతం వారి తీరు
గౌరవించు మనసులో
తలపించును స్వర్గమే
నాన్న ఉన్న ఇంటిలో
కుటుంబానికి దుర్గమే
ధ్రువతార మింటిలో
నడిపించే నాయకుడు
కాంతులీను మార్తాండుడు
బాధ్యతగల సైనికుడు
కుటుంబ సంరక్షకుడు
నిరంతర శ్రామికుడే
చూడంగా భగవంతుడు
స్వచ్ఛమైన ప్రేమికుడే
నాన్న కడు పూజనీయుడు
=====================================

Sahasame Ayudham - Bala Geyalu | Gadwala Somanna
సాహసమే ఆయుధం - బాల గేయాలు | గద్వాల సోమన్న
Published in manatelugukathalu.com on 09/04/2026
సాహసమే ఆయుధం
-------------------------------
వేధిస్తున్నారని ఇలా
రోదిస్తు కూర్చుంటే ఎలా
ఇక ఎదిరిస్తేనే కదా
విజయం వరించేది సదా
నిరంతర సాధనతోనే
ఆత్మవిశ్వాసంతోనే
ఏదైనా సాధ్యం బ్రతుకున
మనం ముందడుగు వేస్తేనే
పనికిమాలిన కార్యాలతో
చెరుపు చేసే తలపులతో
గౌరవమర్యాదలు శూన్యము
పేరుప్రతిష్టలు అసంభవము
నవ్వులు మధుమాసమైతే
సమభావమే మనదైతే
జగమంతా కుటుంబం మనది
అన్నింటి కన్నా మిన్నది

అక్షరాభిలాష
-------------------------------
ఉదయించే రవి కిరణంలా
పరిమళించే పూతావిలా
మనలోని ప్రతిభాపాటవాలు
వెలుగొందును దీపకాంతిలా
ప్రవహించే సెలయేరులా
ప్రకాశించే ధ్రువతారలా
పదిమందికి ఉపకరించాలి
జీవితం సార్ధకమవ్వాలి
పరోపకారి వృక్షంలా
కడుపునింపు అన్నదాతలా
ఆకాశమే సరిహద్దుగా
నిలవాలోయ్! ఆదర్శంగా
చేతల్లో మార్తాండునిలా
రాతల్లో కవీంద్రునిలా
చరిత్రలో స్థానముండాలి
గుండెల్లో నిలిచిపోవాలి

శక్తిగలవి అక్షరాలు
-------------------------------
నేర్చుకో అక్షరాలు
మార్చుకో జీవితాలు
అజ్ఞానము తొలగితే
బాగుపడును కుటుంబాలు
విలువైనవి అక్షరాలు
నింగిలో నక్షత్రాలు
నింపుతాయి తేజస్సు
జీవితాల్లో ఉషస్సు
అక్షరాల వనంలో
విజ్ఞానపు వెలుగులో
మితిలేని ఆనందము
సిద్ధించును ఆశయము
నమ్మకానికి ప్రతీక
అనురాగాల మాలిక
ఘనమైన అక్షరాలు
అమూల్యమైన కానుక

హితవు మంచికి హేతువు
-------------------------------
సంస్కారము నేర్పలేని
సంతోషము ఇవ్వలేని
చదువు, సంపద చూడగా
బ్రతుకులో వ్యర్థమేగా
పెద్దల పట్ల గౌరవము
చూపాలి జీవితాన
పేదోళ్లకు సమ న్యాయము
చూడాలి సమాజాన
కన్నోళ్లను శ్రద్ధగా
గుండెల్లో భక్తిగా
కొలవాలోయ్! దినదినము
వీడాలోయ్! నిర్లక్ష్యము
దేవుని పవిత్ర నామము
నమ్మిన వారికి దుర్గము
ఆపదలో ఆశ్రయము
పరమ పుణ్య ధామము

శ్రేష్టమైనది స్నేహము
-------------------------------
విలువైనది స్నేహము
తలపెట్టకు ద్రోహము
సృష్టిలో అమూల్యము
జీవితాన భాగ్యము
ఉంటుంది తోడుగా
సతతంబు నీడగా
వెలకట్టలేనిదోయ్!
అత్యంత శ్రేష్ఠమోయ్!
స్నేహమనే వనమున
ఆహ్లాదం మనసున
భరోసా మెండుగా
లోక విదితమేగా
లేకుంటే మిత్రులు
తెల్లారును బ్రతుకులు
ఎవరు వింటారు మన
గుండెలోని బాధలు
===================================

Mastaru Meti Matalu - Telugu Poems | Gadwala Somanna
మాస్టారు మేటి మాటలు - తెలుగు కవితలు | గద్వాల సోమన్న
Published in manatelugukathalu.com on 31/03/2026
మాస్టారు మేటి మాటలు
-------------------------
కుళ్ళిపోయిన ఫలములు
చెదలు పట్టిన వస్తువులు
కొరగానివి చూడగా
విలువలు లేని బ్రతుకులు
పగిలిపోయిన కుండలు
ముక్కలైన అద్దాలు
క్రమం లేని జీవితాలు
శిధిలమైన భవనాలు
వాడిపోయిన సుమములు
ఎండిపోయిన చెరువులు
నిలకడ లేని మనసులు
నిజం చెప్పని మనుషులు
దారి తప్పిన వ్యక్తులు
మానవ రూప మృగాలు
అక్షరాల వాస్తవం
సంఘాన చీడ పురుగులు

అక్షర హితోక్తులు
-------------------------------
పరిధులు గీసుకోకు
ప్రగతిని చెరుపుకోకు
ప్రేమలు తరిగిపోయి
ఎండమావి కాబోకు
విలువలను కోల్పోకు
బంధాలు తెంచుకోకు
కలహాలు పెట్టుకుని
అశాంతికి గురికాకు
వృధాగా ఉండబోకు
బద్ధకాన్ని చూపకు
వ్యర్థమైన పనులతో
నీచంగా బ్రతుకకు
పెద్దలను ఎదురించకు
బాధలకు గురిచేయకు
సహనానికి దూరమై
ప్రగతికి దూరమవ్వకు

అమ్మ ప్రేమ శిఖరం
-------------------------------
ఇంటిలోన దీపము
అమ్మ ఉన్న కుటుంబము
ఆమె మహా కావ్యము
అసమానం త్యాగము
అమ్మ రక్షణ కవచము
ఘనమే అనురాగము
కుటుంబంలో జనని
చూడ కల్పవృక్షము
అమ్మ ఉండే స్థలము
తలపించును స్వర్గము
లేకపోతే జగతి
అవుతుందోయ్! నరకము
అమ్మ ప్రేమ శిఖరము
దేవత ప్రతిరూపము
ఆమె ఉన్న సౌధము
మానస సరోవరము

టీచర్ చెప్పిన సూక్తులు
-------------------------------
విలువైనది ఓరిమి
చూపించుము మాలిమి
అప్పడే బ్రతుకులో
అగును అగ్రగామి
మానితే కలహాలు
శాంతమే హృదయాలు
తావులు వెదజల్లే
అగును కదా సుమాలు
పగ ఉన్న జీవితాలు
ఘోషించు సాగరాలు
చివరికివే అవుతాయి
అశాంతికి స్థావరాలు
ఖరీదైన స్నేహము
ముత్యాల హారమే
మార్తాండుని తేజము
అక్షరాల సత్యమే

ప్రబోధం
-------------------------------
అందని వాటి కొరకు
ఆరాటమెందులకు
ఆయాసమే తుదకు
అతిగా ఆశించకు
బద్ద శత్రువైనా
నాశనాన్ని కోరకు
ఎవరికి కలనైనా
ప్రమాదం తలపెట్టకు
నీచమైన పనులకు
ఎప్పుడు పురిగొల్పకు
వ్యర్థమైన వాటితో
ఆందోళన చెందకు
ఘనమైన కార్యాలకు
వెంటనే పూనుకో!
హానికర తలపులకు
అడ్డుకట్ట వేసుకో!

-గద్వాల సోమన్న




Comments