top of page
Original.png

బాల గేయాలు  - సంకల్పంతో అన్నీ సాధ్యము

14 hours ago
2 min read

సంకల్పం, నీతి, స్నేహం, గురుభక్తి, కుటుంబ విలువలను తెలిపే గద్వాల సోమన్న తెలుగు బాల గేయాలు

Bala Geyalu - Samkalpamtho Annee Sadhyamu| Gadwala Somanna 

బాల గేయాలు  - సంకల్పంతో అన్నీ సాధ్యము | గద్వాల సోమన్న

Published in manatelugukathalu.com on 28/09/2026


పిల్లల మనసుల్లో మంచి విలువలు నాటేందుకు బాల గేయాలు చక్కని సాధనం. గద్వాల సోమన్న రచించిన ఈ పది బాల గేయాలు సంకల్పం, శ్రమ, స్నేహం, కుటుంబం, గురుభక్తి, క్షమాగుణం, పర్యావరణ పరిరక్షణ వంటి జీవిత విలువలను సరళమైన పదాల్లో తెలియజేస్తాయి. పిల్లలకు వినోదంతో పాటు నీతి, సంస్కారం, మంచి నడవడికను పరిచయం చేసే సందేశాత్మక గేయాల సమాహారం ఇది.


సంకల్పంతో అన్నీ సాధ్యము 

-----------------------------

సంకల్ప బలముంటే 

ఏదైనా సాధ్యమే 

విజయాలు నీ వెంటే 

నీడలా వెన్నంటే 


మట్టిలోని విత్తులా 

భూమి పొరలు చీల్చుకుని

బండలను ఛేధించుకుని 

వచ్చేటి మొక్కలా 


ఉండాలి నిరంతరము 

అది చాలా అవసరము 

విజేతల లక్షణము 

ఉంటేనే గౌరవము 


తరమాలి బద్ధకము 

చాటాలి చురుకుదనము 

అవరోధాలు దాటితే 

ఫలిస్తుంది ఆశయము 


పంతులయ్య పసిడి పలుకులు 

-----------------------------

ఘన స్థాయికి చేరు వరకు 

నీ చెవులను మూసుకో!

గౌరవమే పెరుగుటకు 

నీ నోటిని కాసుకో!


నెమ్మదిగా ఉండుటకు 

మనసు అదుపు చేసుకో!

మైత్రిబంధం నిలుచుటకు 

నమ్మకాన్ని పెంచుకో!


మనసు మనసు కలుసుటకు 

ప్రేమ తత్వం పంచుకో!

శత్రుత్వం తరుముటకు 

క్షమాగుణం చాటుకో!


జీవితాన ఎదుగుటకు 

శ్రమతత్వం ఎంచుకో 

మర్యాద పొందేందుకు 

సంస్కారం ధరించుకో 


జీవిత పాఠాలు 

-----------------------------

బ్రతుకులోన బహుమానము

 ఎంతైనా గొప్పతనము

మాట మీద ఉండడము 

గౌరవానికి కొలమానము 


గతమంతా ఓ పాఠము 

వర్తమానం అవకాశము 

సదా గుర్తుపెట్టుకో 

భవిష్యత్తు ఇక విజయము 


ఎదుటివారి అవసరంతో 

ఎప్పుడూ ఆడుకోకు 

మితిలేని స్వార్ధంతో 

అందరినీ వాడుకోకు 


కష్టాల్లో తోడుగా 

నాన్నలాగ  బాధ్యతగా 

ఉండువారు గొప్పవారు 

కుటుంబాన దివ్వె వారు 


అక్షర సత్యాల ముత్యాలు 

-----------------------------

నిజమైన స్నేహంలో 

విరిస్తుంది ఆనందము 

స్వచ్ఛమైన ప్రేమలో 

ఉదయిస్తుంది త్యాగము 


నిర్మలమైన మనసులో 

ఉంటుంది శాంతగుణము 

ప్రేమగల కుటుంబంలో 

తాండవిచ్చు స్వర్గసుఖము 


మహనీయుల తలపుల్లో 

వారు చేసే పనుల్లో 

ఉంటుంది పరమార్ధము 

ప్రేమలొలుకు మాటల్లో 


దూరంగా కలహాలకు 

అవాంఛనీయ ఘటనలకు 

ఉంటేనే క్షేమకరము 

లేదంటే ప్రమాదము 


నాన్న ప్రబోధ గీతిక 

-----------------------------

ధనవంతుని కంటే 

గుణవంతుడు శ్రేష్టుడు 

బలవంతుని కంటే 

ఘనుడు జ్ఞానవంతుడు  


ఉంటే ఆత్మీయులు 

వారే ధనవంతులు 

సదనంలో పిల్లలు 

తరిగిపోని సంపదలు 


ఇంటిలోని ఇంతులు 

మింటిలోని చుక్కలు 

చిరునవ్వుల బాలలు 

ఉదయించే భానులు 


వయసులోన పెద్దలు 

అనుభవాల సిద్దులు 

అభివృద్ధికి బాటలు 

పరిమళాల తోటలు 


తాతయ్య చెప్పిన సూక్తులు

-----------------------------

చెవులతో విననివి 

కళ్ళతో చూడనివి 

ఎప్పుడు నమ్మరాదు 

ఊహించి చెప్పినవి 


చెప్పుడు మాటలతో 

చెడిపోవును స్నేహాలు 

అసూయ ద్వేషాలతో 

నాశనం బంధాలు 


సహనం కోల్పోతే 

వాయిదా వేసేస్తే 

జరుగుతుంది నష్టము 

అభివృద్ధికి విఘాతము 


కలుపును క్షమాగుణము 

తరుమును శత్రుత్వము 

ప్రేమలను పూయించి 

పంచును సంతోషము 


అందరూ బాగుండాలి!! 

-----------------------------

పెరిగితే పచ్చదనము 

చూడగా చక్కదనము 

మనసులకు ఆహ్లాదము 

మితిలేని ఆనందము 


తరిగితే వృక్షజాలము 

ఏమాత్రం మనలేము

నాట్యమాడు రోగాలు 

కకావికలము బ్రతుకులు 


నాటాలోయి  మొక్కలు 

పెంచాలోయి తరువులు 

ఆయుష్షు పెరుగుతుంది 

ఆరోగ్యం దొరుకుతుంది


మేలుకో ఓ నేస్తము 

కోరుకో జన క్షేమము 

అందరూ బాగుండాలి 

అందులో మనముండాలి 


తల్లి నోట మేటి మాటలు 

-----------------------------

నోటిలోని మాటలు 

మేలి పసిడి మూటలు 

వాడాలి పొదుపుగా 

అవసరాన గొప్పగా 


శ్రేష్టమైన చేతలు 

తెచ్చిపెట్టు ఘనతలు 

నలుగురికి మంచి చేసి 

బాగు చేయు బ్రతుకులు 


మురిపించును మనసులు 

పసి పిల్లల నగవులు 

వారి బుడి బుడి నడకలు 

సంగీత నాదములు 


పదిమందికి మేలులు 

చేస్తేనే దీవెనలు

జరుగుతుందోయ్! మంచి 

చెపితేనే శుభములు 


గురుదేవులు వేల్పులు 

-----------------------------

కన్పించే దైవాలు 

ఇలలోన గురుదేవులు 

చూపిస్తారు మార్గము 

సరిదిద్దుతారు బ్రతుకులు 


ప్రసాదిస్తారు జ్ఞానము 

మార్చుతారు యోధలా 

చేకూరు వరకు విజయము 

ఉంటారు కనుపాపలా 


ఎంచుకున్న వృత్తిలోన 

వెలుగొందే రవిచంధ్రులు 

ఉపాధ్యాయులు భువిలోన 

అందరికి స్ఫూర్తిదాతలు 


చేతులెత్తి మ్రోక్కాలి

నిరంతరం గురువులకు 

ఉన్నతంగా ఎదగాలి 

మనసులను మురిపించాలి 


శ్రేష్టమైన స్నేహం ఘనం 

-----------------------------

చల్లనిది వెన్నెల్లా 

మెత్తనిది పువ్వుల్లా 

జీవితాన స్నేహము 

తేనెలాగ మధురము 


తెల్లనిది మల్లెల్లా 

చక్కనిది పల్లెల్లా 

సాటిలేని స్నేహము 

చూపించును త్యాగము 


విలువైనది ముత్యంలా 

మేలైనది జ్ఞానంలా 

శ్రేష్టమైన స్నేహము 

బ్రతుకుల్లో దీపము 


ఉపయోగం తరువుల్లా 

మహోన్నతం గురువుల్లా 

సృష్టిలోన స్నేహము 

ఇల ఆశ్రయ దుర్గము 




Gadwala Somanna

-గద్వాల సోమన్న



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page