top of page
Original.png

తోకల రాజేశం పది తెలుగు కవితలు – సమాజం, సాహిత్యం, దేశభక్తి

28 minutes ago
6 min read

తోకల రాజేశం పది తెలుగు కవితల సంకలనం – తెలంగాణ, దేశభక్తి, గ్రంథాలయం, అంబేద్కర్ రాజ్యాంగ విలువలు, సామాజిక చైతన్యం.

Thokala Rajesham - Telugu Emotional Poetry | Thokala Rajesham

తోకల రాజేశం పది తెలుగు కవితలు | తోకల రాజేశం

Published in manatelugukathalu.com on 08/11/2026 

 

కవి తోకల రాజేశం రచించిన ఈ పది తెలుగు కవితలు జీవన సంఘర్షణ, దేశభక్తి, తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలు, సాహిత్య చైతన్యాన్ని ప్రతిబింబిస్తాయి. సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూ, అక్షరాల శక్తిని చాటిచెప్పే ఆలోచనాత్మక కవితా సంకలనం ఇది.


తోకల రాజేశం పది తెలుగు కవితలు


ఆట సాగుతూనే ఉంటది

గ్రంథాలయం

మేరా భారత్ మహాన్

నా తల్లీ!తెలంగాణా!!

కళ

అబద్ధం

మేము భారతీయులం

అందుకే అది అక్షరం

నిన్ను చూస్తే జాలేస్తున్నది

రాజ్యాంగ దీపధారి

ఆట సాగుతూనే ఉంటది

గెలుపెవరిదో,ఓటమెవరిదో  స్పష్టం కాదు కానీ

ఆట మాత్రం సాగుతూనే ఉంటది


సముద్రపు తీరంతో నిరంతరం

అలలు చేసే యుద్ధం లాంటి ఆట కొనసాగుతూనే ఉంటది


అలలు వెనక్కి తగ్గటం ఓటమేనా?

తీరానిది తీరని గెలుపు దాహం


లోపటి లోకంలో ఎన్ని కల్లోలాలో!


ఎప్పుడు నిప్పులుచిమ్ముతూ

బద్దలవుతుందో తెలియని అగ్ని పర్వతం అంతరంగం

స్రవించే  దుఃఖపు లావాకు మాత్రం విరామముంటుందా?

కల్లోల సముద్రం వొడిలో ఎన్ని అగ్గికొండలో?


నిరాశ రాత్రిచెట్టుమీది గుడ్లగూబలా భయపెడుతుంది

ఉషోదయపు వెలుగు రేఖలు జీవితం మీద

ఆశల పందిళ్లను పరుస్తాయి


ఎప్పుడూ ఆట ఆటగానే సాగదు

అకస్మాత్తుగా యుద్ధమై కాలు దువ్వుతుంది

ఏదో ఒక శిబిరంలో దూకి 

నెత్తురో కన్నీల్లో పారించక తప్పదు


ఆటగానో యుద్ధంగానో బతుకును

జోడెద్దుల బండిలా అదిలించక తప్పదు

నేను రెండు శిబిరాలుగా చీలినా సరే

ఆట మాత్రం సాగుతూనే ఉంటది


గ్రంథాలయం

అక్కడ పుస్తకాలు నిద్రపోతున్నట్టే కనిపిస్తాయి

కానీ మన కోసం వేల కలల్ని కంటాయి

పేజీ పేజీలో మనకోసం వెన్నెల నదుల్ని పరుస్తాయి

చిటికెన వేలును పట్టుకొని

ప్రపంచాన్ని చుట్టించికొని వస్తాయి


పుస్తకాలకు రెక్కలుంటాయి

చదువుతుంటే మనకూ మొలుస్తాయి


అత్తరు పరిమళం

పూల పరిమళం కాదు

పుస్తకాలలో ఒదిగిన అక్షరాల నుంచి

వీచే పరిమళం

ఎన్నికోట్లు పోస్తే దొరుకుతుంది?

అది అడుగడుగునా

మన జీవితాల్లో గుబాలిస్తూనే ఉంటుంది


ఎందరి రక్తమాంసాలో కదా పుస్తకాలు

ఎందరి నిద్రలేని రాత్రులో కదా అక్షరాలు

అందుకే వాటినిండా మనిషి వాసన


పుస్తకాలే లేకపోతే

మానవసమాజం  ఏనాడో మాయమయ్యేది


ఒక్కొక్క పుస్తకం

ఒక్కొక్క కొత్త ప్రపంచం

అంతులేని ఈ విశాల విశ్వం లాగే

అంతులేని జ్ఞానానికి ఊటబావి గ్రంథాలయం


ఏమీ కాని విత్తనాన్ని

పెంచి పెద్దవృక్షంగా మార్చి ఆకాశానికి సవాలు విసిరే

మట్టితల్లిలాంటిది గ్రంథాలయం


నాకైతే ఏ ఆలయాలూ అవసరం లేదు

ఒక్క గ్రంథాలయం తప్ప.


మేరా భారత్ మహాన్

వేలయేళ్ల కిందటే ఈ మట్టి మీద

శాంతి దీపాలను వెలిగించిన వాడు

సమానత్వ సూత్రాలతో జనాలను కట్టపడేసిన వాడు శాస్త్రీయతా పునాదుల మీద ఆలోచనలను అంటుకట్టిన వాడు

బుద్ధునంతటి వాని పాదాలను మోసినందుకు

ఈ నేల నిజంగా మహోన్నతమైనదంటాను నేను

 

రాజ్యాల కోసం రక్తాలు పారుతున్న కాలంలో

ప్రజాస్వామ్య రాజ్యాన్ని గిజిగానిలా నిర్మించిన వాడు బలాన్ని, బలగాన్నీ ధర్మ యాగంలో సమిధలుగా మార్చిన వాడు

దేశానికి తొవ్వను చూపి తన ధర్మచక్రాన్ని బహూకరించిన వాడు

పాలకుల పాలిటి నిఘంటువు అశోక చక్రవర్తి ఏలిన

నా భరతదేశం నిజంగా నాకు గర్వకారణమంటాను


నా దేశం మీద తెల్ల గ్రహణం కమ్ముకున్నప్పుడు

ముసిరిన చీకట్లను ప్రాణత్యాగ దీపాలతో పారదోలిన వాళ్ళు

ఒంట్లోని రక్తాన్ని దారపోసి దేశపు మట్టికి సింధూర తిలకం దిద్దిన వాళ్ళు

అన్నీ వదిలేసి దేశం కోసం విగ్రహాలై నిలుచున్న వాళ్ళు

స్వాతంత్ర్య వీరుల రక్త సిక్త దేహాలను ముద్దాడిన

ఈ నేలమ్మను నీళ్లు నిండిన కళ్ళతో ముద్దాడుతూనే ఉంటాను


వేల కులాలతో కుళ్ళిపోయిన సమాజాన్ని

తన మేధో జలంతో కడిగి శుభ్రపరిచినవాడు

తన జాతి ప్రజల మేలుకొలుపు కోసం కడుపు పంటను నిలువునా కాల్చేసుకున్న వాడు

రాజ్యాంగంతో దేశానికి వెన్నెముకనిచ్చిన వాడు

నేల మీద నడిచిన గ్రంధాలయం అంబేద్కర్ ను

కన్నందుకు నేనెప్పుడూ నా దేశానికి ఋణపడే ఉంటాను.


నా తల్లీ!తెలంగాణా!!

ఎన్ని దశాబ్దాల ఒంటరి వలపోత తల్లీ నీది!

చరిత్ర పొడవునా నువ్వు సాగిన దారివెంట

అయితే కన్నీటి వర్షాలు లేకపోతే రక్త జలపాతాలు

నేటికీ నీ చంకకు వేలాడుతున్న జోలెలో

నిజంగా శాంతి కురిసిందా తల్లీ!


ఎన్నివేల వివక్షలు దాటి

ఎన్ని తోవల ముళ్ల కంపలు కాల్చి

ఎన్నెన్ని సంకుచితపు కాంక్రీటు గోడలు కూల్చి

నీ బిడ్డలతో ఉద్యమం బాట పరిచావో కదా!

నిజమైన ఉద్యమానికి విరామముంటుందా తల్లీ!


అందరి కడుపులకు సమానంగా బువ్వ అందాలని

చదివిన చదువులతో ఉద్యోగాలను వెలిగించుకోవాలని

మన వనరులన్ని మన బతకులనే పండించాలని

అర్ధ శతాబ్దిగా దిగులు సముద్రంలో ఈదులాడితివి కదమ్మా!

నీ ఆశయం జలాశయమై పరవళ్లు తొక్కిందా తల్లీ!


నీ వాకిట్లో మొలిచిన తెలుగుపదాలకు

నీ మట్టిలో పుట్టిన ఘనచరిత్రలకు

నీ ఇంటి చూరుకు వేలాడిన సకలకళలకు

తల్లికొంగు పరిచి మరో వెయ్యళ్లకు సరిపడా దీవించావా తల్లీ!


యేళ్లుగా నీ కళ్ళలో సుడులు తిరిగిన నీళ్లు తప్ప

నీ బిడ్డల పొలాల్లో గంగాజలాలు సరాగాలందుకున్నాయా తల్లీ!

నీ బిడ్డల చెమట నుంచి పండిన రూపాయి బిల్లలు

ఈ నేలను స్వర్గధామంగా మలుస్తూ

నీ గుమ్మిలోనే బంగారుగుడ్లను పొదుగుతున్నాయా అమ్మా!

పాత కాలంలో కోల్పోయిన ఉద్యోగాలు

జామచెట్టు మీద వాలిన చిలుకల్లా

కళకళలాడుతూ నీ గుమ్మం ముందు ప్రత్యక్షమయ్యాయా తల్లీ!


మా ఎదుగుదలను ఎదలో తలచుకుంటూ

ఎన్ని కలలు కన్నావో కదా!

కమ్మని మా భవిష్యత్తు కోసం

ఎన్ని రంపపు కోతలు చవిచూశావో కదా!


నువ్వు కోరుకున్న ఇల్లు కట్టుకున్నావు కానీ

కోరుకున్న స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు 

నీ గుండెసడిలో వినిపిస్తున్నాయా తల్లీ?


 కళ

ఎత్తయిన కొండ సొరగుల్లోంచి

సెలయేటి జాడ పుట్టినట్లు

ఆదిమానవుని వేటలోనుంచి

కళ కన్నులు తెరిచింది


క్రమంగా సెలయేరు నదిలా విస్తరించినట్టు

మూలవాసుల చెమటచుక్కలతో తడిసి

అరవై నాలుగు కొమ్మలతో కళకళలాడింది


వేట నుంచి పాట దాకా

కళ ఎన్ని రూపాల్లో ఒదిగిపోయిందో?


మెత్తని పూవులాంటి గుండెనిండా

మకరందంలాంటి ఆనందం నింపటమేనా?

చైతన్యాన్ని నూరిపోయటమూ కళ నేర్చుకున్న పాఠమే


మనిషికి కళ అంటే ప్రాణం

కళకు మనిషంటే కూడా!

మనిషీ కళా ఈ ప్రపంచానికి

సూర్య చంద్రుల్లాంటివి


ఈ చిక్కుచీకటి ప్రపంచానికి

రవిబింబం దివిటీ పట్టినట్టు

కళ మనిషితో నడవకపోయి వుంటే

లోకమెంత గుడ్డిదయ్యేదో కదా!


బహుశా!

జంతువుల్లోనుంచి వేరుపడిన మనిషిని

నిజంగా మనిషిగా అవతరింపజేసింది

కళ మాత్రమేనేమో!!


అబద్ధం

నిజం నీళ్ల మీద నడుస్తుంటే

అబద్ధం గాలిరెక్కల మీద ఉరేగుతోంది


పుచ్చిపోయిన వస్తువును రంగలద్ది అమ్మినట్టు

కళ్ళకు కనిపించే వాస్తవాన్ని హత్య చేసి

అబద్ధాన్ని శవాన్ని అలంకరించినట్టు మెరిపిస్తారు


అప్పుడప్పుడు గతాన్ని

నిర్దాక్షిణ్యంగా జుట్టుపట్టుకొని ఈడ్చుకొచ్చి

అచ్చం ద్రౌపదిని అవమానించినట్టే

నిండు సభలో నగ్నంగా నిలబెడతారు


చరిత్రను చెరబట్టటం

మహోన్నతుల కథలపై ఆసిడ్ దాడులు చేయటం

లేనివాటిని ఉన్నవాటిగా

ఉన్నవాటిని లేనివాటిగా వింత వింత ఉచ్చులు నేయటం

వారి నిరంతర పవిత్ర కార్యక్రమం


కుట్రల  నిచ్చెనమెట్లతో ఎదిగి

ప్రత్యర్థుల మీద అబద్ధాలతో అల్లిన వల విసరడం

న్యాయస్థానాల సాక్షిగా

ధర్మాన్ని ఖైదు చేయటం

గాలి వీచినంత సహజంగా 

ఉచ్చులో చిక్కిన ప్రజల చేత జేజేలు కొట్టించుకుంటుంది


మురికి కాళ్ల ఈగ 

ముట్టని పదార్థం లేనట్టే

అబద్ధం దూరని సందులూ గొందులూ ఏవీ లేవు

మెదళ్ళ మీద ముసుగుకప్పిన అబద్ధం 

దేశానికి అందమైన నాటకాన్ని విందు చేస్తుంది


అబద్ధాల కడుపుల్ని చీల్చి

లోపటి పురుగుల్ని కనుక్కోవడం

ఆకలి కోరల్లో చిక్కి శల్యమవుతున్న పేదలకు

ఎన్నడు సాధ్యమవుతుంది?


ఎవరికీ పట్టింపులేని ఇంట్లో

పట్టపగలే దొంగలు వృత్తిధర్మాన్ని నెరవేర్చినట్టు

ఎవరి బతుకుగుర్రం మీద వారు 

నిశ్చింతగా స్వారీ చేస్తున్నంత కాలం

అబద్ధమే అందమైన చరిత్రలు రాస్తుంది

అందులో నేనైనా నువ్వయినా ఎప్పుడూ బానిసలమే.


మేము భారతీయులం

ఎవరో ఒకరు తెగించి

అన్యాయమన్యాయమంటూ హోరెత్తి

నాలుగు రోడ్ల కూడలి మీద ప్రాణాన్ని

దీపం చేసి వెలిగించుకుంటే తప్ప

మా నాడుల్లోని నెత్తురుకు వేడి పుట్టదు


ఎవరో ఒకరు అన్నీ త్యజించి

ప్రకృతిని వికృతిగా మారుస్తున్న వారిపై పోరాడుతూ

అడవిని అరచేతుల్లో పెట్టుకొని సంరక్షిస్తూ

తూటాలను గుండెల్లో దాచుకుంటే తప్ప

మా నోటి నుంచి మాటలు ఊడిపడవు


ఎవరో ఒకరు గట్టిగా ఆలోచించి

చెమట చిందిన మట్టి పరిమళాల మీదుగా

మోదుగుపూలలాంటి పాటల్ని మోగించి

రాజ్యం కంట్లో కారమై మండిపోతే తప్ప

మాకూ గొంతుండి సచ్చిందన్న సంగతి గుర్తే రాదు


ఎవరో ఒకరు గొంతు చించుకొని

దేశం తలరాతను మార్చిన రాజ్యాంగం సాక్షిగా

పులులకు ఆహారమైపోతున్న మేకపిల్లల్లాంటి

హక్కుల మీద హక్కుపత్రాల కోసం కొట్లాడితే తప్ప

మాకూ హక్కులుంటాయన్న సంగతే తలకెక్కదు


ఎవరో ఒకరు పరీక్షనాలిక తెచ్చి

దేశభక్తితో తయారు చేసిన బంగారు కత్తితో పొడిచి

మా రక్తంలో అనునిత్యం రెపరెపలాడుతున్న

జాతీయ పతాకాన్ని  టెస్ట్ చేస్తే గానీ

మేము భారతీయులమని ఎవరూ నమ్మరు


అందుకే అది అక్షరం

నువ్వు దాని పెడరెక్కలు విరిచి

గొంతుకోసి చంపాలనుకుంటావు

చావటానికది పిట్టో చెట్టో కాదు

అది అక్షరం


మొన్నటికి మొన్న

హరిత గీతాలు ప్రవహించే అడవి మధ్య భాగంలో

ఎర్రెర్రని గీతాలై పల్లవించినప్పుడు

అక్షరం మీదికి ఇనుప తుపాకులను ఉసిగొల్పావు

అక్షరం మరింత ఎర్రబడిందే కానీ

సచ్చి పుచ్చిపోతుందనుకున్న నీ ఆశ తీరనే లేదు


నిన్నటికి నిన్న

గాయపడిన ఉద్యమాల మీద

మెత్తని నల్లాలం ఆకు లేపనమై

పచ్చి పచ్చి జీవితాలను గానం చేసిన

నిన్ను నడిపిన అక్షరం మీదికి

తాయిలాల పగ్గాలు విసిరి

నీ యింటి ముందు కట్టేసుకోవాలనుకున్నావు

అజేయమైన దాని ప్రజాబలం ముందు

నీ అధికారం చిన్నదైపోయి నల్లమొకమేసుకున్నావు


ఈరోజు మాటల కళ్ళకు గంతలు కడతానంటావు

పాటల గొంతుకు ఉరి బిగిస్తానంటావు

ఆటల నిండా నీ సింగరామే కనిపించాలంటావు

ప్రశ్నను జైల్లో వేసి చిత్రహింసలు పెట్టాలనుకుంటావు


చివరికి ఒంటరిగదిలో 

అక్షరాన్ని తలచుకొని గజగజా వణికిపోతావు

ఇప్పటికైనా

అధికారం మత్తు కమ్మిన కళ్లను శుభ్రంగా కడుక్కో

వింటున్నావా?

ప్రశ్నకు లాగే 

అక్షరానికీ మరణం లేదు


నిన్ను చూస్తే జాలేస్తున్నది

అయ్యో మిత్రమా!

నీ నాలుక మీది అక్షరానికి 'రాచ'పుండు పుట్టి

సలుపుతున్న నీ బాధను చూస్తుంటే జాలేస్తున్నది


నీ చుట్టూ నువ్వే

పదిలంగా అల్లుకున్న ఇనుప పంజారాన్ని చూస్తే

బాధగొంతులోనుంచి పెకిలే నవ్వొస్తున్నది


సాహిత్యమంటే 

రోగం చేసిన సమాజానికి చికిత్స చేసేదని

అక్షరమంటే

ఎల్లలు లేని ఆకాశంలో పక్షి చేసే స్వేచ్ఛాగానమని

గుర్తుపట్టలేని నీ అవిటితనానికి

నా మది దిగులు బండకింద నలుగుతున్నది


'ప్రభువెక్కిన పల్లకి కాదోయ్

అది మోసిన బోయీలెవ్వరు?' అనే ప్రశ్నాస్త్రాలను

సాధించే వెలుతురు దారులగుండా

తప్పిపోయిన గొర్రెవైనందుకు

పానమంతా తల్లడం మల్లడమయితంది


చివరికి సింహాసనం విసిరే

చిల్లర పైసలకోసం

ప్రభువుల పాటలు పాడే

చిలుక పలుకుల గుంపులో తేలినందుకు

విపరీతంగా రోత పుడుతున్నది


సాహిత్యమంటే

నిండా చీకటి కమ్మిన ప్రజల దారిలో

చల్లని చందమామలు తెచ్చి నాటటమేనని

అక్షరమంటే

ఆధిపత్యం మీదికి ప్రశ్నల రాళ్లను ఒడిసిపట్టి

గురిచూసి విసిరే ఒడిశెలేనని

ఒప్పుకోనందుకు కోపమైతంది


నువ్వు అంగీకరించవు కానీ

సాహిత్యమంటే

నీ మెడలో వాలిన దండలు కావు

నువ్వు తెచ్చుకున్న బిరుదులు కావు

నిన్ను ముంచెత్తిన శాలువాలసలే కావు

అక్షరాలంటే

నువ్వు పెట్టుకున్న కిరీటం మీది

రంగురాళ్లు కానేకావు 


కేవలం కీర్తి కోసమే

అక్షరం వెంట పడిన నిన్ను చూస్తుంటే

నిజంగా సిగ్గేస్తున్నది



రాజ్యాంగ దీపధారి

పుట్టిన నాటి నుంచీ

పుట్టిన గడ్డకోసమే 

రక్త బిందువులన్నీ అక్షరాలుగా మార్చిన

నిజమైన దేశభక్తుడు


దేశమంటే

ఒక్క కులమే కాదని

కులాల పుట్టుకను స్కానింగ్ చేసి చూపించిన

సామాజిక శాస్త్రవేత్త


చీకట్లో ఎటువైపు నడవాలో

తెలియని స్వతంత్ర దేశానికి 

రాజ్యాంగ దీపాన్ని వెలిగించి

చేతిలో పెట్టిన మార్గదర్శి


ఈ దేశంలో పుట్టిన

ప్రతి మనిషికి సమానంగా

హక్కులను పంచి పెట్టిన

నికార్సైన మహాత్ముడు


ఆయన లేకపోతే

ఈ దేశాన్ని ఏ రాహువు మింగేసేదో?

కింది జాతుల జీవితాలు

ఎంతగా 'తలకిందు'లయ్యేవో??


ఏ నాటికైనా

నా దేశాన్ని దేశంగా నిలబెట్టేది

ఆయన చూపుడు వేలే!



తోకల రాజేశం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: నా పేరు తోకల రాజేశం.

 తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024),ఆట సాగుతూనే ఉంటది(వచన కవిత్వం-2026)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page