top of page
Original.png

గన్నారపు సదానందం కవితలు – మానవత్వం, సమాజం, జీవన చైతన్యం

1 hour ago
4 min read

గన్నారపు సదానందం రచించిన ఆరు తెలుగు కవితల సంకలనం – మానవత్వం, సామాజిక చైతన్యం, రైతు జీవితం.

Gannarapu Sadanandam Kavithalu - Manavathvam,Samajam, Jeevana Chaithanyam

గన్నారపు సదానందం కవితలు – మానవత్వం, సమాజం, జీవన చైతన్యం

Published in manatelugukathalu.com on 08/11/2026


మనిషి జీవితంలోని విభిన్న పార్శ్వాలను, సమాజంలోని అసమానతలను, మానవ సంబంధాలను, ప్రజాస్వామ్య విలువలను, ప్రకృతి పట్ల మన బాధ్యతను తన కవితల ద్వారా ఆవిష్కరించారు కవి గన్నారపు సదానందం.


ఆకలితో అలమటించే యాచకురాలి దుస్థితిని ప్రశ్నించే ‘యాచకురాలు’, వ్యక్తి సామర్థ్యాన్ని గుర్తుచేసే ‘సమయం లేదు’, సామాజిక హింసపై ఆవేదన వ్యక్తం చేసే ‘నా స్వగతం’, ఓటరును చైతన్యపరిచే ‘ఓటరన్న’, మనిషి ఆలోచనలకు అద్దం పట్టే ‘కథలో కాకి... మా కాకి’, రైతు చెమట విలువను తెలియజేసే ‘అడుగు అడుగు’ — ఈ ఆరు కవితలు విభిన్నమైన ఆలోచనలను పాఠకుల ముందుంచుతున్నాయి.


ఈ కవితలను ఒకే సంకలనంగా మనతెలుగుకథలు.కామ్ పాఠకులకు అందిస్తున్నాము.

— సంపాదక వర్గం, మనతెలుగుకథలు.కామ్


ఈ సంకలనంలోని కవితలు


యాచకురాలు

సమయం లేదు

నా స్వగతం

ఓటరన్న

కథలో కాకి... మా కాకి

అడుగు అడుగు

యాచకురాలు

ముడుతలు పట్టిన తోలు

పిండిదారల్ల  వేలాడుచున్న  మెరిసే జుట్టు

వంకతాడు గూని , వణికే చేతులు

వణికే చేతులలో దెబ్బలు గెలిచిన సొట్ట పళ్ళెం

సొట్ట పళ్ళెంలో చిల్లర పైసలు.


బక్కచిక్కిన డొక్కా, మసకబారిన చూపు

డొక్కలొ ఆకలి కళ్లలో కనిపించిన

కనికరం చూపని  వారాల భక్తులు.

గుడి పైమెట్లు ఎక్కలేక కింది మెట్టునుండే

నిత్యం దర్శనం పొందుతున్న పరమ భక్తురాలు.


దేవుడి పై భారం వేసి

బ్రతుకు బండిలాగే భక్తులు

గుడి  మెట్లు దిగుతుంటే

ఊపిరి దీపం నిలుపుకోవడానికి

కళ్లలో వత్తిని గుండెలో  వెలిగించి

ఆకలితో అల్లాడి అలమటించి

అలసి ఓడిన దీనయోధురాలు


దేవుడి శాపమో 

వ్యవస్థ లోపమో

యాచక పాపమో

ఆశపడిన కన్నులు అలసిపోయినై

ఎదురు చూసిన చూపులు ఓడిపోయినై


ఊపిరి దీపం ఆరిపోయింది.

యాచకురాలి జోలె జారిపోయింది.

కనిపించని దేవుడి తత్వం గెలిచింది

కనిపించే మనిషి తత్వం తెలిసింది. 

సమయం లేదు

సమయం లేదు, సమయం లేదు .

సమయం లేదు వెర్రి ఆలోచనలు,

వృథా పనులు చేయడానికి .

కానీ సత్యమైన జీవితాన్ని ఆస్వాదించడానికి ,

నాకు కావలసినంత సమయం ఉంది.


డబ్బు లేదు, డబ్బు లేదు 

నా దగ్గర డబ్బు లేదు.

వజ్రాన్ని కొనడానికి,

కారును కొనడానికి 

మేడలు నిర్మించడానికి, 

సంపన్నమైన జీవితం గడపడానికి.

కానీ అద్భుతాలను సృష్టించగల అద్భుతమైన మేధస్సు నాకుంది.


హక్కు లేదు, హక్కు లేదు 

హక్కు లేదు  నాకు.

నీ తప్పులను వెతకడానికి,

నీ కీర్తిని మసక బార్చడానికి ,

నీ కలలను చెరిపి వేయడానికి, 

నీ స్వేచ్ఛను హరించడానికి .

కానీ  ప్రతి తప్పును ఎత్తి  చూపే

హక్కు నాకుంది.


అవకాశం లేదు,

అవకాశం లేదు .

అవకాశం లేదు నాకు

ఆకాశాన్ని తాకడానికి, 

చంద్రుడిని  బంతిల పట్టుకోవడానికి,

భూమిని ఎత్తడానికి, 

సూర్యుడిని తూర్పు- పడమరల కదిలించడానికి .

కానీ  నా జీవితాన్ని

మెరుగు  పరుచుకునే  

 ప్రతి అవకాశము  నా చేతిలో ఉంది.

నా స్వగతం

నా స్వగతం - నా వ్యక్తిగతం

నా వ్యధలు   - నా మనోగతం



గోద్రా అసురనాదం

చుండూరు హింసావాదం

గ్రాహం, ఇక్లాకు ల నరమేదం

మణిపూర్  మత మారణహోమం

రాజకీయ పార్టీల రంగుల నిర్వేదం.

నా స్వగతం - నిర్మల గీతం


తంగేడు పూలు ఎర్రబారెను

చల్లటి  చెలిమల నెత్తురు నిండెను

కోకిల కమ్మటి గొంతులు తెగేను

పున్నమి వెన్నెల గ్రహణం పట్టెను

శాంతి పావురం నెత్తుటి ముద్దయి తల్లడిల్లుతూపాడే నేడు

నెత్తుటి  బతుకమ్మ పాట.

నా స్వగతం - విరబూసిన అరణ్య వికాస గీతం


నియంతృత్వం - నిరంకుశత్వం

కలిసి కానుపులీనినదే  నేటి నెత్తుటి రాజ్యం,

ఆటోక్రసి,   ప్లూటోక్రసీ

అడుగు జాడలే  ప్రస్తుత బ్యూరోక్రసి.

నా స్వగతం  - నా సొంతం


ఓటరన్న..

ఓటరన్న,

నీవు మహా గ్రేటురన్న

మందు చుక్క, మటన్ ముక్క

పెగ్గు వేస్తూ, ముక్క తింటూ

రాజకీయ రంగులు మార్చే

ఓటరన్న, జర ఊసరవెల్లి కాకురన్న.


ఓట్ల పండుగ వచ్చినపుడే

నీ విలువ తెలిసెరన్న

ఓట్ల పండగెల్లిపోతే

నీ బ్రతుకంతా  బానిసన్న.

ఓట్లనాడు పైసలిచ్చి, ఓట్లెల్లితే  దొస్తరన్న !

ఓటరన్న, జర కళ్ళు తెరచి చూడరన్న!


నిన్నుగానని నీ లీడర్

నీ గల్లీలో నిను చేరితే

నా అన్న , నా సర్వస్వం

నా అన్నకే నా ఓటని

సొంతన్నతో విభేదించే

ఓటరన్న, జర భద్రమన్న.


జెండా మోసి, పోస్టరేసి

జెండా గుడ్డను నడుమున చుట్టి

ప్రచారానికి పరుగులు దీసి

నోటుకు ఓటు తాకట్టు పెట్టె

ఓటరన్న, జర జాగోరన్న.


కథలో కాకి...మా కాకి


వేసవి కాలం ఎండలు

ఆరిపోతున్న గొంతులు

ఎండి పోతున్న కుంటలు

రాలిపోతున్న పక్షులు.


కథలో కాకి

కడవలో నీటిని

అందుకోవడానికి

గులకరాళ్లను

ఒక్కొక్కటిగా వేసి

దాహం తీర్చుకుందనీ

విన్న నేను,


నా ఇంటి ముందుకు

కడవలో నీటిని

త్రాగడానికి వచ్చిన కాకికి

గులకరాళ్లు దొరుకుతాయో లేవోనని

కొన్ని గులకరాళ్లను ,

అందులో కొన్ని నల్లవి,

మరికొన్ని తెల్లవి ఉంచాను.


ఏమో! మా ఇంటికి వచ్చిన

నల్ల కాకికి

ఆ నల్ల రంగు ఇష్టంమో, కాదో!

తనకి ఇష్టం లేకుంటే ?

నీరు త్రాగే ప్రయత్నం మానుకుంటే? భయమేసి,

బరువెక్కిన మనసుతో,

ఇంకా కొన్ని

చిన్న, పెద్ద

గులక గులక రాళ్ళ ని

కడవకు చేరువలో ఉంచి,

మనసు మార్చుకొని,

కడవకు  చుట్టూ ఎగజల్లి,

కడవకి అడుగున,

నీళ్లు పోసి,

మా కాకికి

ఎక్కువ కష్టం వద్దనుకొని,

కడవకు సగానికి పైగా,

నీళ్లు పోసి,

వేప చెట్టు క్రింద నేను,

చెట్టు ఆసరాలో కడవ నిరీక్షిస్తున్నాం.


అనతిలోనే  కాలంలో

దాహం వేసిన మా కాకి

కావు కావు మని అరుస్తూ,

రెక్కలు హుషారుగా ఊపుతూ,

చెంగు, చెంగు మని,

అటూ ఇటూ ఎగురుతూ,

కడవపై వాలుతూ,

కావు కావు మనసాగెను.


కాసేపటికి

కావు కావు ఆపి,

కంటితో కడవలో

నీటిని చూసింది.

కథలో కాకి మల్లే

తెలివిగా నల్ల

గులకరాళ్లవైపు చూసింది.

నచ్చలేదో ఏమో?

దిశను మార్చి

తెల్ల గులకరాళ్లవైపు చూసింది.

మనసు రానట్టు ఉంది.


కళ్లను అటూ ఇటూ తిప్పుతూ,

తలను అటూ ఇటూ ఆడిస్తూ,

తల, తోక దిశలను కడవపై మారుస్తూ

కావు కావు అంటూ ...

ఇంకా ఇంకా.... గొంతు ఆరేలా,

అరుస్తూ, అరుస్తూ..

అటూ, ఇటూ చూస్తూ, చూస్తూ ...

తల, తోక దిశలను మారుస్తూ, మారుస్తూ ..


అందవికారమైన ముక్కు నుండి,

ఎర్రటి నాలుకను చూపిస్తూ,

తల తోక దిశలను మారుస్తూ,

కడవపై కొంత,

కడవ నీటిలో

కొంతరెట్ట వేసి,

ఆరిన గొంతుతో

ఎగిరి పోయింది.


నాకు అర్థం కాలేదు ,

మా కాకికి ఏమి తక్కువ చేశాను?

కడవలో నీటినుంచా,

కడవ చుట్టూ గులకరాళ్లను ఉంచా.


అయినా మా కాకి

గులకరాయి ముట్టలే,

నీటి చుక్క తాగలే.

మా కాకికి,

మా కడవ నీరు నచ్చలేదో?

కథలో కాకి మల్లే

తెలివితో రాళ్లను తెచ్చి,

కష్టపడి వేయాలనుకోలేదు మా కాకీ.

అన్ని సమకూర్చిన

నన్ను నమ్మలేదు.

పాపం ! ఆరిన గొంతుతో

ఏడా తిరుగుచుందో?

అలసిన కాకి,

ఎగురుచున్నదో లేదో?

అయినా, ఇన్ని చేసిన నేను

కడవలో నీటిని

నిండుగ నింపితే,

మా కాకి గొంతు తడిసేది.


అయినా, మా కాకి

కథలో కాకి కాదుగా!

మనసులో ఎన్నో భావాలు, బంధాలు. భావం చావదు, బంధం తీరదు.

ఎన్ని ఇచ్చిన,

దాహం తీరని రోజులివి.

       

అడుగు అడుగు

ఎద్దు నడుగు, ఒడ్డు నడుగు 

బురద నంటిన ఒంటి నడుగు

చెమట తుడిచిన తుండు నడుగు

పురుడు గొన్న పైరు నడుగు.

    

ఉక్కు కండల చెమట చుక్కలు

మట్టి గుండెలో ఎట్ల సొచ్చెనో?

బురద మట్టికి పచ్చరంగు

ఎంత రక్తం  కలిపి పూసేనో?


అడుగు అడుగు

ఎద్దుగిట్టల నడుగు,

కలుపు పిడిచలనడుగు.

వడ్ల గింజల నడుగు

ఎండిన డొక్కల నడుగు

మండిన కడుపుల నడుగు.

               

గన్నారపు సదానందం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 








📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.




గన్నారపు సగన్నారపు సదానందందానందం

రచయిత పరిచయం:

నేను, గన్నారపు సదానందం, లక్నేపల్లిలోని బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను.


పాఠశాల విద్యార్థుల కోసం ఆంగ్లం–తెలుగు వ్యాకరణ పుస్తకాన్ని అమెజాన్ ఆన్‌లైన్ వేదిక ద్వారా ప్రచురించాను. అలాగే, పిల్లల కోసం ఆంగ్లంలో కవితలు, స్ఫూర్తిదాయకమైన గేయాలు రచించి, 'ప్రోగ్రెసివ్ పోయెట్స్ కార్నర్' ఆన్‌లైన్ పత్రికకు అందించేవాడిని.


కవితలు, కథలు రాయడం నా ప్రవృత్తి మాత్రమే కాదు, నా అభిరుచి కూడా. ఇప్పుడు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను చేరువయ్యేలా తెలుగు కవితలు, కథలు రాయాలని ఆకాంక్షిస్తున్నాను.


నా రచనలు ప్రజలకు స్ఫూర్తినివ్వడమే కాకుండా, వారిలో అభ్యసనాసక్తిని, చైతన్యాన్ని పెంపొందిస్తాయని ఆశిస్తున్నాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page