కవితలు - నవంబర్ 2026

Collection of Telugu Poems from Different Writers for November 2026
మనతెలుగుకథలు.కామ్ పాఠకులకు స్వాగతం!
నవంబర్ 2026 నెలలో వివిధ రచయితలు పంపించిన తెలుగు కవితలను ఈ ప్రత్యేక సంకలనం 'కవితలు - నవంబర్ 2026' లో అందిస్తున్నాము.
ప్రేమ, అనుబంధాలు, మానవత్వం, ప్రకృతి, సామాజిక చైతన్యం, జీవితానుభవాలు వంటి విభిన్న అంశాలను ప్రతిబింబించే కవితలు ఇందులో చోటుచేసుకుంటాయి.
ప్రతి కవితతో పాటు కవి లేదా కవయిత్రి పేరు, ప్రచురణ తేదీ పొందుపరుస్తున్నాము. కొత్త కవితలు అందినప్పుడు ఇదే పేజీలో జోడించడం జరుగుతుంది.
ఈ కవితలను చదివి మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో తెలియజేసి రచయితలను ప్రోత్సహించండి.
S. No. 5 | శీర్షిక: ఆనందమే నీవు | రచన: C. V. S. మహాలక్ష్మి | 06/11/2026 |
తల్లితలపులోని ఆనందమే నీవు తండ్రి మనసులోని ప్రేమ నీవు అక్కచెల్లెళ్ళ మోమున చిరునవ్వు నీవు గురువు కోపంలోన అభిమానమే నీవు తమ్ముళ్ల ఆటలో పోట్లాట నీవు నీ పల్లెసీమకే సిరిమల్లె నీవు. ఆమని అందాలు నీలోన నిండిన అందాల అపరంజి బొమ్మ నీవు మాఇంటి మందార పువ్వు నీవు |
S. No. 4 | శీర్షిక: పగలు ౼ రాత్రి | రచన: వెంపరాల దుర్గాప్రసాద్ | 06/11/2026 |
బడికి వెళ్లే వయసులో మాస్టారి పాఠం విసుగును కలిగిస్తుంది పదవి వదిలే వయసులో జీవితం నేర్పే పాఠాలు భయాన్ని కలిగిస్తాయి. యవ్వనం లో ఎదురయ్యే సవాళ్లు ధైర్యాన్ని పెంచుతాయి చివరి దశలో సవాళ్లు నిస్తేజాన్ని నింపుతాయి. తెలిసీ తెలియని వయసులో మిత్రులతో అమాయకపు ముచ్చట్లు మురిపిస్తాయి బాధ్యతలు భారంగా ఉన్నపుడు అదే మిత్రుల మాటలవహేళనగా వినిపిస్తాయి. బాల్యం లో ఉన్న కొడుకు ముద్దు మాటలు నవ్విస్తాయి, వాడు పెరిగే కొద్దీ వాడి ఉన్నతి కోసం పడే పాట్లు భయపెడ తాయి. మధ్య వయస్సులో ఉన్నత పదవులు వ్యామోహం కలిగిస్తాయి ముదిమి చేరువయినపుడు పదవులు అవరోధాలనిపిస్తాయి. రోజులో పగలు రాత్రులు తేడా..జీవితంలో యవ్వన వార్ధక్యాలు..అర్ధం చేసుకుంటే అదే జీవితం. |
S. No. 3 | శీర్షిక: కాదేదీ అనర్హం | రచన: డా. పి. మాలతీలత గారు | 06/11/2026 |
నేను కవిత్వాన్ని..స్రవిస్తున్న కంటి ప్రవాహ దారులలో నేనొక విరిసిన కమలాన్ని ... నేను కవిత్వాన్ని ..అనుభూతి ఇస్తున్న వెన్నెలరేయి లో నేనొక అనుభవైకవేద్యాన్ని నేను కవిత్వాన్ని..బానిసత్వపు భారపు బతుకు గమనములో నేనొక చలిత చరితను... నేను కవిత్వాన్ని... ఉద్యమాల పోరాట గడ్డపై వెచ్చటి గాలిని ఊదే ఉచ్వాస నిశ్వాసల కదలికను.. నేను కవిత్వాన్ని...కాలపు మెరుపులను గాయపు మరకలను గానంచేసే గంధర్వ రాగాన్ని... నేను కవిత్వాన్ని...విచ్చుకుంటున్న విరిబాలలను, విచ్చుకత్తులను నాలోనే పొదుముకున్న ద్వైధీభావాన్ని.. నేను కవిత్వాన్నీ... నిరాశకు ప్రాణం పోసే ఆశల పల్లవాలను అందించే అక్షర అమృతాన్ని... నేను కవిత్వాన్ని ...బాధాతప్త హృదయ గాధలను, బరువెక్కిన గుండెగోసలను కంటినిండా మోస్తున్న కన్నీరునీ.. నేను కవిత్వాన్ని.. రణరంగాన ఎద పొంగే ఆవేశాలను హారతి ఇచ్చిన యుద్ధతిలక కలాన్ని... నేను కవిత్వాన్నీ..నాఅంతరంగం ఓ మైదానం ఓ సముద్రం.... నా సృజన జ్వలిత జీవన గమన నాదం... నా తపన ప్రాణచైతన్య మానవ అనురాగం... నా లక్షణాలు మనసువేణువు పై తీయటి గానపు గాలి రంధ్రాలు... నా అక్షరాలు గుండె కోనలపై భావ సమీర చలనాలు... నా ఆశలు తేనెల వానలో తడిసే వెన్నెల పూబాలల కంటి సొబగులు.. నా ఆశయాలు మాతృభూమికి పదాల దుందుభితో మ్రోగిస్తున్న కర్తవ్య రణ నినాదాలు... నేను కవిత్వాన్ని.. కాదేదీ నాకనర్హం కలమే నా ఆయుధం..కావ్యమే నా జీవితం.. |
S. No. 2 | శీర్షిక: స్త్రీ | రచన: సూర్య మండా(MS) గారు | 06/11/2026 |
పుట్టుక నుండి పాడే వరకు జన్మ మాత్రమే ఆమెది జీవితం కుటుంబానిది కాపాడుకుంటున్నాం అంటూ ఆమె కలలను తొక్కేస్తున్నా మానవరే కదా అని మౌనంగా భరిస్తుంది బలహీనురాలు అని ముద్ర వేసినా సంసార బరువును మోయడంలో ఆమెకు సాటి ఏది లేదు ఆమె త్యాగాన్ని చరిత్ర గుర్తుపెట్టుకోలేదు సమాజం గుర్తించనులేదు బాంధవ్యాల మధ్య బందీగా ఉన్నా బాధ్యతగా తీసుకుందే తప్ప బరువుగా భావించలేదు అణకువగా ఉందని అణిచేస్తున్నా విజయాలను సాధించిందే తప్ప నా వల్ల కాదని ఊరుకోలేదు జీతం లేని కొలువులో జీవితం మొత్తాన్ని అర్పిస్తున్నా సరే ఎందుకో ఆమె అంటే చిన్నచూపు గతించిపోయిన గతంలో అయినా నడుస్తున్న వర్తమానంలో అయినా రాబోతున్న రేపటిలో అయినా కదులుతున్న కలాలన్నిటిలోనూ ఆమె ఎప్పటికీ గొప్పదే ఆమె రాక మన ధరిత్రికి వరం |
S. No. 1 | శీర్షిక: బతుకు బరువు | రచన: సూర్య మండా(MS) గారు | 06/11/2026 |
గతాన్ని నెమరువేసుకుంటూ రేపటి గురించి ఆలోచిస్తూ సగం నిండిన కడుపులు మది నిండా మానని గాయాలు నలుగురిలో నడ ఆడలేని నాలుగు రుచులు తినలేని చెమటతో తడిసిన బట్టలు అప్పుల్లో మునిగిన బతుకులు కడుపునిండా తిని ఎన్నాళ్లయిందో కన్నులారా పడుకొని ఎన్నాళ్లయిందో పరిస్థితులకు లొంగిన బతుకులు పదవీ విరమణ లేని కొలువులు విరామం అంటూ ఎరుగని మనుషులు సమాజం విలువ ఇవ్వని బతుకులు మారేదెప్పుడో మార్చేదెవ్వరో? రెక్కలు ముక్కలు చేసుకుంటూ కష్టాన్నే నమ్మే కల్మషం ఎరుగని వీరులు కన్న వారిని పెంచలేక తాము కన్న వారిని పోషించలేక చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక ఆత్మగౌరవం వదులుకొని అందరి చేత మాటలు పడుతూ గుండెల్లో పేలే పర్వతానికి తను పేదవాడిని అని గుర్తుచేస్తూ సర్దుకు మణిగే సామాన్య మానవుని కష్టాలు తీరేదెప్పుడో? |




Comments