top of page
Original.png

బాల గేయాలు - వ్యక్తిత్వం శ్రేష్టము

3 hours ago
2 min read

పచ్చని ప్రకృతి మధ్య పిల్లలకు నీతి గేయాలు చదివి వినిపిస్తున్న ఉపాధ్యాయుడు, క్రమశిక్షణతో చీమలు – గద్వాల సోమన్న తెలుగు బాల గేయాల సమాహారం

Bala Geyalu - Vyakthithvam Sreshtam | Telugu Inspirational Poems | Gadwala Somanna 

బాల గేయాలు - వ్యక్తిత్వం శ్రేష్టము | గద్వాల సోమన్న

Published in manatelugukathalu.com on 21/10/2026


పిల్లలకు వ్యక్తిత్వ వికాసం, నీతి విలువలు, స్నేహం, సమానత్వం, క్రమశిక్షణ, ప్రకృతి ప్రేమను సరళమైన పదాలతో బోధించే పది బాల గేయాల సమాహారం ఇది. కవి గద్వాల సోమన్న రచించిన ఈ గేయాలు చిన్నారుల్లో మంచి ఆలోచనలను పెంపొందిస్తాయి.


బాల గేయాలు - వ్యక్తిత్వం శ్రేష్టము 



వ్యక్తిత్వం శ్రేష్టము

----------------------------- 

విలువైనది వ్యక్తిత్వము 

నిలుపుకున్న గొప్పతనము  

అదే గనుక కోల్పోతే 

బ్రతుకులగును దారుణము 


శ్రేష్టమైన వ్యక్తిత్వము 

తెస్తుందోయ్! గౌరవము 

అందుంది మంచితనము 

అమితమైన ప్రేమగుణము 


తావి లేని పూల సమము 

ప్రాణం లేని శరీరము 

అవుతుంది ఖచ్చితంగా 

వీడితే వ్యక్తిత్వము 


వ్యక్తిత్వము నిలుపుకో 

మర్యాదలు అందుకో 

ఈ సభ్య సమాజంలో 

ఉండాలి జీవితంలో 


చిట్టి చీమ ఆదర్శము 

----------------------------- 

చీమల చెంత చేరుకో 

పొదుపు విలువ తెలుస్తుంది 

క్రమశిక్షణ నేర్చుకో 

బ్రతుకు బాగు పడుతుంది 


సంఘజీవి చీమ కదా!

సమైక్యత చాటుతుంది 

పరిశీలిస్తే సదా!

అవగతమే అవుతుంది 


శ్రమజీవి చిట్టి చీమ 

దానికుంది కడు ధీమా  

జీవుల్లో అల్ప ప్రాణి 

సృష్టిలోన మహాజ్ఞాని


బద్ధకమనిన అసహ్యము 

దానికి చీమ దూరము 

కలసిమెలసి ఉండడంలో 

అందరికీ ఆదర్శము 


చూపొద్దు వ్యత్యాసం 

----------------------------- 

ఈ విశాల సృష్టిలో 

భగవంతుని దృష్టిలో 

అందరూ సమానమే 

తిలకింపగ మనుషులే 


చూపరాదు వ్యత్యాసము 

అది అత్యంత దారుణము

బ్రతకాలి మనుషులుగా 

భువిలో ఆదర్శంగా 


పంచభూతాలకు లేదు 

ప్రకృతిలో కానరాదు 

ఎందుకుందో జ్ఞానమున్న 

మనిషిలో ఈ జాడ్యము 


మానితేనే వివక్షత

గౌరవానికిల అర్హత 

లేకుండా ఏ మాత్రము 

ఉండదోయి గౌరవము 


ఉండాలి జాగ్రత్తగా 

----------------------------- 

బావి లోతు,వ్యక్తి గుణము 

ఏమాత్రం గ్రహించక 

నీటిలోకి దిగకూడదు 

గుట్టు రట్టు చేయరాదు 


జాగ్రత్త మూర్ఖులతో 

మోసకారి మనుషులతో 

పరిచయం పెట్టుకుంటే 

కడు నష్టము వారితో 


వ్యర్థమైన తలపులతో 

పనికిమాలిన పనులతో 

ఉండాలి జాగ్రత్తగా 

చెరుపు చేయు గుణములతో


మనసు లేని వ్యక్తులతో 

అసాంఘిక శక్తులతో 

ప్రమాదమే విస్తారము 

అక్షరాల వాస్తవము 


నిలవాలి స్ఫూర్తిగా 

----------------------------- 

అవినీతి పరులతో 

అక్రమకారులతో 

సాంగత్యమే వద్దు 

ఓర్వలేని వారితో 


స్థిరత లేని మనసుతో 

నీచమైన గుణంతో 

అనిశం ప్రమాదమే 

ఉండాలి దూరమే 


బ్రతకాలి పద్దతిగా 

నిలవాలి స్ఫూర్తిగా 

స్వయం కృషి నమ్ముకుని 

ఎదగాలి గొప్పగా 


ఉండాలి ఓర్పుగా 

పనిలోన నేర్పుగా 

మసలాలి జగతిలో 

అందరితో ప్రేమగా 


ఉన్న వారు గొప్పవారు

----------------------------- 

కళ్ళలో ఆనందము 

బ్రతుకులో ఆదర్శము 

ఉన్న వారు గొప్పవారు 

ముఖంలో దరహాసము 


మాటల్లో మృదుత్వము 

మనసుల్లో ప్రేమగుణము 

ఉన్న వారు గొప్పవారు

కాసింత మంచితనము 


చేతల్లో  త్యాగగుణము 

చేతుల్లో దాతృత్వము

ఉన్న వారు గొప్పవారు

గుండెల్లో తొలి స్థానము 


పవిత్రత తలపుల్లో 

నమ్మకమే స్నేహంలో 

ఉన్న వారు గొప్పవారు

దైవ నామ ధ్యానంలో 


భగవంతుని సన్నిధిలో 

ఆధ్యాత్మిక చింతనలో 

ఉన్న వారు గొప్పవారు

స్ఫూర్తినిచ్చే మార్గంలో 


మహనీయుల బోధలో 

గురుదేవుల జ్ఞానంలో 

ఉన్న వారు గొప్పవారు

తల్లిదండ్రుల సేవలో 


స్నేహమే శ్రేష్టము 

----------------------------- 

ఒంటరితనంలో 

ఓదార్పు స్నేహమే 

అద్భుత జీవితంలో 

అమూల్యమైన వరమే 


వెన్నుపోటు పొడవడము 

ద్రోహమే చేయడము 

కాదు కాదు స్నేహము 

నమ్మకానికి దూరము 


స్నేహమంటే త్యాగము 

సృష్టిలో అసమానము 

అత్యంత శ్రేష్టమే 

దేవుని బహుమానము 


ఉంటుంది అండగా 

బ్రతుకులో కొండగా 

గొప్పది స్నేహబంధము 

వస్తుంది తోడుగా 


షరతుల సరాలు 

----------------------------- 

కదలిలో బ్రతకాలంటే 

తప్పక ఈత రావాలోయ్! 

జీవితంలో ఎదగాలంటే

శ్రమతత్వమే ఉండాలోయ్! 


గుర్తింపే రావాలంటే 

ప్రతిభను వెలికి తీయాలోయ్!

గౌరవమే పొందాలంటే 

సుగుణ గంధం పోయాలోయ్!


నలుగురి మదిలో నిలవాలంటే 

మంచి పనులు చేపట్టాలోయ్!

చరిత్ర సృష్టించాలంటే 

సాహస కార్యాలు చేయాలోయ్! 


ఆరోగ్యమే కావాలంటే 

ఆనందమే కురియాలంటే 

సత్సంబంధాలుండాలోయ్!

మైత్రి బంధం విరియాలోయ్! 


జీవిత సత్యాల ముత్యాలు 

----------------------------- 

వ్యాధి సోకితే అందము 

వికటిస్తే సంబంధము 

దెబ్బతినును ఘోరంగా 

క్రమం లేని జీవితము 


విరిగిపోతే హృదయము 

కదిలిపోతే కాలము 

అతుకుకొనుట బహు కష్టము 

తిరిగి వచ్చుట దుర్లభము 


బహు గొప్పది త్యాగగుణము 

భువిలో విద్యాదానము 

ఎంత పంచినా తరగనిది 

అత్యంత అమూల్యమైనది 


కాసింత మంచితనము 

బ్రతుకులోన సేవాగుణము 

కల్గియుంటే శ్రేష్టము 

జీవితంలో ముఖ్యము 


చిరుగాలితో చెలిమి 

----------------------------- 

చిరుగాలి వీచింది 

మేనునే తాకింది 

మనసెంతో హాయిగా 

ఉయ్యాల ఊగింది 


పొలంలోని పైరులు 

తరువుకున్న ఆకులు 

తలలూప మెల్లగా

కన్పించెను గొప్పగా 


తల కురులు ఊగగా 

అగుపించెను సొగసుగా 

మధురమైన అనుభూతి 

కనువిందు చేయగా 


చిరుగాలి తాకగా 

జీవకోటికి మోదము 

మురియును ప్రాణాలు 

దక్కును ఆహ్లాదము 


చిరుగాలి సున్నితము 

వెన్నలా మెత్తదనము 

ముక్కుతో జతకట్టి 

ప్రాణమే నిలుపుతుంది 


లేకుంటే గాలులే

మనిషి ఉనికికి చెరుపు 

వాటితో మేలులే 

జీవితాల్లో మలుపు 


Gadwala Somanna

-గద్వాల సోమన్న



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page